గ్రీసు దేశపు పురాణం గాథలలో మూడు తరాల శాల్తీలు కనిపిస్తారు: మొదటి తరం సృష్ట్యాదిలో ఉండే అస్తవ్యస్తత (chaos) నుండి పుట్టినవారు. వీరిని దేవుడు, దేవత, అని అభివర్ణించడానికి బదులు వీటిని మూర్తిత్వం లేని అభిజ్ఞానాలుగా (amorphous symbols) కానీ, అపరావతారాలుగా (personified concepts) కానీ భావించవచ్చు. రెండవ తరం వారు టైటనులు (Titans). సాంప్రదాయికంగా వీరిని దేవగణాలలో ఉంచుతారు కానీ ఒక విధంగా చూస్తే వీరిలో కొందరు మన రాక్షసులని పోలిన శాల్తీలలా అనిపిస్తారు. మూడవ తరం వారు ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకున్న ఒలింపియనులు. ఈ మూడవ తరం వారు మనకి పరిచయమైన దేవగణాల (దేవుళ్ళు, దేవతలు) కోవలోకి వస్తారు.
ఇక్కడ gods అనే ఇంగ్లీషు మాటని దేవుళ్ళు, దేవతలు అని అనువదించడం జరిగింది కానీ, నిదానం మీద ఆలోచిస్తే gods అన్న మాటని సురులు, అసురులు అని తెలిగించి సురులని దేవతలుగా పరిగణించి, అసురులులో మంచివాళ్ళని దేవతల కోవలో పడేసి, చెడ్డవాళ్ళని రాక్షసులుగా లెక్కలోకి తీసుకోవచ్చు. కానీ ఈ సూక్ష్మ భేదాలని విస్మరించి లింగ భేదం లేకుండా అందరినీ దేవుళ్ళు అనే అనడం జరిగింది.
గ్రీసు దేవుళ్ళు హిందూ దేవుళ్ళలాంటి వాళ్ళు కాదు; వీళ్ళల్లో ఈర్హ్య, అసూయ, పగ, జుగుప్స వంటి లక్షణాలు మానవులలో కంటె ఎక్కువ మోతాదులో ఉన్నట్లు అనిపిస్తుంది. వీరు మానవులని సృష్టించి వారిని చదరంగంలో పావులని నడిపినట్లు నడిపి ఆడుకుంటారు. ఉదాహరణకి అందంలో ఎవరు గొప్ప అని పోటీ పడి ముగ్గురు దేవతలు ట్రోయ్ నగరంలో మహా సంగ్రామానికి కారకులు అవుతారు.
మొదటి తరం దేవతలు
సృష్టి మొదట్లో అంతా అస్తవ్యస్తం. ఆ అస్తవ్యస్తం (chaos) నుండి గాయా (Gaia) లేదా భూదేవి, మరి కొన్ని ఇతర ప్రాథమిక శక్తులు (లేదా అపరావతారాలు, లేదా దైవాంశాలు) పుట్టుకొచ్చేయి. ఎబిస్ (Abyss) పుట్టింది; ఇక్కడే పాతాళ లోకానికి అధిపతి అయిన టార్టరస్ (Tartarus) ఉంటాడు. అతని పేరనే ఒక బందిఖానా ఉన్నది. ఎరోస్ (Eros) అనే కామాధిపతి; ఎరెబస్ (Erebus)అనే చీకటికి అధిపతి; నిక్స్ (Nyx) అనే ఈమె రాత్రికి అధిపత్ని, మొదలైనవి.
టార్టరస్
టార్టరస్ (పాతాళలోకం పేరు కూడా ఇదే) నుండి రకరకాల రాక్షసాకారాలు పుట్టుకొచ్చేయి. వాటిల్లో ముఖ్యమైనవి: 1. సెర్బెరస్ (Cerberus): ఒక మూడు తలకాయల కుక్క. ఇది నరకపు ద్వారాల దగ్గర కాపలా కాస్తూ ఉంటుంది. 2. డ్రాగన్ (Dragon): ఇక్కడ నుండే జేసన్, ఆర్గోనాట్లు, బంగారు ఉన్ని కథ మొదలవుతుంది. 3. స్ఫింక్స్ (Sphinx): మనిషి ముఖం, సింహం శరీరం, పక్షి రెక్కలు కల ఒక వింత జంతువు. 4. హార్పీలు (Harpies): సగం మనిషి సగం పక్షి ఆకారాలు. 5. సైరన్లు (Sirens): ఇవి సముద్రచరాలు. తమ తీయటిగొంతుతో పాటలు పాడి సముద్రయాత్రికులను వశం చేసుకొని తినేస్తాయి. 6. గోర్గన్లు (Gorgons): వీళ్ళగురించి రకరకాల వర్ణనలు ఉన్నాయి కాని ప్రముఖంగా చెప్పుకొనేది వారి జుట్టు గురించి. వెంట్రుకల బదులు విషసర్పాలు ఉండే వికృతాకాకారులు వీళ్ళు. వారిని చూసినవారు శిలలైపోతారు. ఎకిడ్నా, టైఫన్ అనేవారికి పుట్టిన ముగ్గురు అక్కచెళ్ళెల్లలో పేరెన్నిక గన్నది మెడూసా (Medusa).
ఎరెబస్‌కీ నిక్స్‌కీ పుట్టిన ఖెరాన్ (Charon) పాతాళలోకంలో ఉన్న నరకానికి వెళ్ళే దారిలో వచ్చే స్టిక్స్ (Styx) వంటి నదులని దాటడానికి పడవ నడుపుతూ ఉంటాడు. చనిపోయినవారు ఈ నదులని దాటుకుని అటు వెళ్ళాలి. మన వైతరణికి ఇక్కడ స్టిక్స్‌కి పోలిక చూడండి.
రెండవ తరం టైటనులు
హెకటాంకీర్‌లు
పురుషుని సహాయం లేకుండా గాయా, ఆకాశానికి అధిపతి అయిన యూరెనస్‌కి (Uranus) జన్మనిచ్చింది, అప్పుడు అతను ఆమెని ఫలవంతురాలిని చేశాడు. వారి కలయిక నుండి మొదట టైటనులు (కాసింత రాక్షస అంశ ఉన్నవారులా అనిపిస్తారు కానీ వీరిని ‘టైటన్ దేవగణాలు’ అనే అంటారు) జన్మించారు. తరువాత ఒంటికన్నుతో ఉండే సైక్లాపులు (Cyclops) ముగ్గురు పుట్టేరు. తరువాత అందవికారంగా, ఏభయ్ తలలు, వందేసి చేతులతో, హెకటాంకీర్‌లు (Hecatonchieres) అనే శతబాహులు ముగ్గురు పుట్టేరు. వారి పేర్లు ప్రస్తుతానికి అనవసరం.
అందవికారంగా ఒంటికన్నుతో ఉన్న సైక్లాపులని, వందేసి చేతులు ఉన్న హెకటాంకీర్‌లని చూసి యూరెనస్ అసహ్యించుకుని వారిని తిరిగి తల్లి గాయా (అనగా భూదేవి) గర్భకుహరం లోకి (అనగా పాతాళం లోకి) తోసేసేడు. ఈ అమానుషచర్యకి కడు దుఃఖపడి ప్రతీకారం కోసం గాయా ఒక కొడవలిని తయారు చేసి, అదను కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సైక్లాపులు, హెకటాంకీర్‌లు జన్మించిన తరువాత ఇంక రాక్షస ఆకారాలు ఉన్న పిల్లలు పుట్టకుండా గాయా-యూరెనస్‌లు విడిపోయారు.
యూరెనస్-గాయాల కలయిక వల్ల పుట్టిన పన్నెండుమంది టైటనులలో ఆరుగురు మగ, ఆరుగురు ఆడ.
మగవారు: 1. ఓషనస్ (Oceanus-సముద్రాలకి అధిపతి), 2. హైపిరియన్ (Hyperion-కాంతికి అధిపతి), 3. కీయస్ లేదా కోయస్ (Coeus-బుద్ధి, దూరదృష్టికి అధిపతి), 4. క్రియస్ (Creus-గగన వీధిలోని నక్షత్ర రాసులకి అధిపతి), 5. క్రోనస్ (Cronus-కాలానికి అధిపతి), 6. ఇయపిటస్ (Iapitus-నీతికి అధిపతి).
ఆడవారు: 1. టెథిస్ (Tethys-మంచినీటికి అధిపత్ని), 2. థియా (Theia-దృష్టికి అధిపత్ని), 3. నెమోసీన్ (Mnemosyne-జ్ఞాపక శక్తికి అధిపత్ని), 4. ఫీబీ (Phoebe-వర్చస్సుకి అధిపత్ని), 5. రెయా (Rhea-మాతృత్వానికి అధిపత్ని), 6. థెమిస్ (Themis-ధర్మదేవత లేదా చట్టబద్ధతకి అధిపత్ని).
ఈ టైటన్ దేవతల గురించి తరువాత సావధానంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కొన్ని ఆసక్తికరమైన చిల్లర విషయాలని చూద్దాం. (ఇక్కడ ఏకోదరుల మధ్య వివాహాలు గమనించండి.)
-సముద్రపు జంట అయిన ఓషనస్‌కీ టెథిస్‌కీ అనేకమంది జలదేవతలు పుట్టేరు.
-ఆకాశపు జంట అయిన హైపిరియన్‌కీ థియాకీ పుట్టిన పిల్లలలో హీలియోస్ (Helios-సూర్యుడు), సెలీన్ (Celine-చంద్రుడు) ముఖ్యులు.
-భూ జంట అయిన క్రోనస్‌కీ రేయాకీ పుట్టిన పిల్లలే టైటనులు.
-ఇయపిటస్‌కి పుట్టిన పిల్లలలో చాలా మందిని మనం గుర్తించగలం: 1. ఏట్లస్ (Atlas) నిరంతరం భూమిని భుజాల మీద మోసే శాల్తీ; 2. ప్రొమిథియస్ (Prometheus) మనుష్యుల పుట్టుకకి కారకుడు; 3. ఎపిమిథియస్ (Epimetheus) మొట్టమొదటి మానవ స్త్రీ పెండోరాని (Pandora) జూస్ (Zeus) ఆజ్ఞానుసారం తయారు చేసేడు.
క్రోనస్ పతనం
మొదటి తరం టైటనులలో క్రోనస్ కడసారం. క్రోనస్ కుతంత్ర బుద్ది కలవాడు, అత్యంత భయంకరమైనవాడు. తల్లి గాయాకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోగల సమర్ధుడు. క్రోనస్ ఒక రాత్రి యూరెనస్ మీదకి లంఘించి అతని జననాంగాలని తల్లి ఇచ్చిన కొడవలితో నరికేసి వాటిని సముద్రంలో విసిరేస్తాడు. ఆ జననాంగాల నుండి స్రవించిన స్రావములతో ఒక రకం రాక్షసులు, జలకన్యలు, తదితరులు పుట్టుకొస్తారు. అలా పుట్టుకొచ్చిన వారిలో ఏఫ్రడిటి (Aphrodite) ఒకామె. ఈ సౌందర్యవతి లైంగిక ప్రేమకి చిహ్నం.
క్రోనస్
అంగవిహీనుడైన యూరెనస్ భూమిని వదలిపోతూ తనకి చేసిన అవమానానికి క్రోనస్ ప్రతిఫలం అనుభవిస్తాడనిన్నీ, తనకి జరిగినట్లే క్రోనస్‌కి అతని పిల్లల చేతిలోనే ప్రతీకారం జరుగుతుందనిన్నీ శపిస్తాడు. తండ్రిని పదవీభ్రష్టుడిని చేసి రాజ్యం నుండి బహిష్కరించిన తరువాత క్రోనస్ సైక్లాపులని, హెకటాంకీర్‌లని టార్టరస్‌లో బంధిస్తాడు. క్రోనస్ తన తండ్రిని తరిమేసిన తరువాత తన యొక్క సోదరి అయిన రియాని జీవిత భాగస్వామినిగా స్వీకరిస్తాడు. క్రోనస్-రియాలకి పుట్టిన సంతానంలో ముగ్గురు మగ, ముగ్గురు ఆడ.
మగ వారు: హేడెస్ (Haydes), పొసైడన్ (Poseidon), జూస్ (Zeus).
ఆడ వారు: హెస్టియా (Hestia), డిమిటర్ (Demeter), హేరా (Hera).
హేడెస్ పాతాళానికి, పొసైడన్ సముద్రాలకి, జూస్ ఆకాశానికి అధిపతులు అవుతారు. జూస్ దేవలోకానికి అంతటికి పాలకుడుగా చెలామణి అవుతాడు. ఇతర టైటనులు అతని సభికులుగా అవుతారు. తండ్రి యూరెనస్ ఇచ్చిన శాపం పదేపదే గుర్తుకి రాగా, రియాకి పుట్టిన పిల్లల్ని పుట్టిన వెంటనే క్రోనస్ కబళించడం మొదలు పెడతాడు. అప్పుడు రియా తన కడసారపు కొడుకు జూస్‌ని ఒక పన్నాగం పన్ని రక్షిస్తుంది.
చాలమంది స్త్రీలతో సంపర్కం ఉండడం వల్ల క్రోనస్‌కి చాలమంది పిల్లలు ఉన్నారు. ఉదాహరణకి క్రోనస్‌కి సముద్రపు జలకన్య ఫిలిరాకి పుట్టిన కుమారుడు ఖైరన్ (Chiron). బొమ్మలలో ఖైరన్‌ని నరాశ్వంగా (centaur) చిత్రిస్తారు; అనగా ముందు భాగం మనిషి ఆకారంలోను, పృష్ఠ భాగం గుర్రం ఆకారంలోనూ ఉండే నాలుగు కాళ్ళ శాల్తీ.
(సశేషం)