గ్రీకు పురాణ గాథలు 11

పంకజ ప్రాదుర్భావం

The basic theme of mythology is that the visible world is supported and sustained by an invisible world.

Joseph Campbell

ఎన్నో గ్రీకు పురాణ గాథలలో కొన్నింటిని మాత్రమే ఇంతవరకు మచ్చు చూసేం. ఇక్కడ ప్రస్తావించకుండా దాటేసిన కథలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ కథలు అన్నిటిలోను ఉమ్మడిగా కనిపించే అంశాలు: సృష్టి జరిగిన విధానం, ఆ సృష్టిలో మూడు తరాల అమరులు అధికారం కోసం ఒకరితో మరొకరు పోటీ పడడం. ఈ పోటీలో కేవలం ఒక ఆటవస్తువుగా మానవుడి స్థానం.

అమరులలో మొదటితరంవారు ప్రకృతి శక్తులకు అమూర్త్యప్రతీకలుగా (amorphous symbols) కానీ అపరావతారాలుగా (personified concepts) కానీ మాత్రమే కనిపిస్తారు. ఇవే భూమి, ఆకాశం, వాటి కలయిక వల్ల పుట్టిన సముద్రాలు, కొండలు, వింతప్రాణులు, వగైరా. క్రమేపి మూడవ తరానికి వచ్చేసరికి ఒలింపస్ పర్వతం మీద స్థిరనివాసం ఏర్పరచుకున్న అమరులకు అతీంద్రియ శక్తులతోపాటు మానవ ఆకారాలు, మానవ బలహీనతలు వస్తాయి.

ఇలా పురాణ గాథల మీద ఆధారపడ్డ తత్త్వజ్ఞానంతో మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇలానే ఎందుకు ఉందో చెప్పడానికి ప్రయత్నం చేసింది అలనాటి ఆ సమాజం. అంటే, ఎదురుగా జరుగుతున్న కార్యానికి వెనకనున్న కారణం ఏమిటో విశదీకరించడానికి ప్రయత్నం చేసింది. ఈ కారణం మానవాతీత శక్తుల ప్రభావం కూడా అయి ఉండవచ్చనే గట్టి నమ్మకం ఒకటి వారిలో ఉండేది. అనగా ప్రతి కర్మ వెనక కర్త ఒకటి ఉంటుందనిన్నీ, ఆ కర్త మానవుడైనా కావచ్చు, అమరలోకంలోఉన్న దేవుడైనా కావచ్చనిన్నీ.

ఉదాహరణకి సముద్రాలకి అధిదేవత అయిన పొసైడన్ (Poseidon) సంగతి చూద్దాం. పెద్ద సముద్రతీరం ఉన్న ప్రాంతం కనుక గ్రీకులకి సముద్రదేవుడు చాల ముఖ్యుడు. ఈ ప్రాముఖ్యత చూపడానికి పొసైడన్ ఆయుధం త్రిశూలం. పొసైడన్‌కి కోపం వచ్చినప్పుడు ఆ త్రిశూలం పట్టుకుని నేలని గట్టిగా గుద్దుతాడు. ఆ తాకిడికి భూమి కంపిస్తుంది. అదే భూకంపం. గ్రీకుల కార్య-కారణ చయనికలో దేవుళ్ళ పాత్ర ఇలా ప్రవేశిస్తుంది. కనుక గ్రీకుల దృక్పథంలో పొసైడన్ సముద్రదేవుడు అవడమే కాకుండా భూకంపాలకి కారకుడు కూడా! ఈ కోణంలో చూస్తే ప్రాచీన కాలపు గ్రీసు దేశస్థులకి ఎదుట కనిపిస్తున్న దృగ్విషయం వెనుక ఏదో కారణం ఉండాలనే నమ్మకం ఉండబట్టే ఆ కారణం ఏదో తెలియక కంటికి కనపడని దేవుడిని ఆశ్రయించారు.

ఈ సందర్భంలో హోమర్ తత్త్వజ్ఞానం గురించి మరికొంచెం తెలుసుకుందాం. హోమర్ రచించిన ఇలియడ్, ఆడెసి గ్రంథాలు ప్రాచీన గ్రీకు సంస్కృతికి అద్దం పడతాయి కనుక ఈ రెండింటిని అధ్యయనం చేయడం గ్రీకుల ఆలోచనావిధానాన్ని అర్థంచేసుకోవడానికి కీలకం; ఆ మాటకి వస్తే పాశ్చాత్య నాగరికతని, సృష్టిలో మానవుని స్థానం గురించి వారి ఆలోచనా విధానాన్ని అర్థంచేసుకోవడానికి కూడా కీలకం. భారతీయ విలువలకి, సంస్కృతికి రామాయణ మహాభారతాలు ఎలాంటివో పాశ్చాత్య విలువలకి, సంస్కృతికి ఇలియడ్, ఆడెసిలు అలాంటివి అంటే అతిశయోక్తి కాదు.

ఇలియడ్ లోని ఒకటి, రెండు ముఖ్యమైన అంశాలని తీసుకుని ఆ రోజులలో సృష్టి యొక్క నిజ స్వరూపం వారికి ఎలా అర్థం అయిందో చూద్దాం.

ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ట్రోయ్ యోధుడు హెక్టర్ ఎందుకు చచ్చిపోయాడు? ఏఖిలిస్ చంపేడు కనుక హెక్టర్ చచ్చిపోయాడు!

ఏఖిలిస్ ఎందుకు చంపేడు? స్థూలంగా చెప్పుకోవాలంటే గ్రీసు దేశానికీ ట్రోయ్ దేశానికి మధ్య యుద్ధం జరిగింది కనుక. ప్రత్యేకించి కారణం కావాలంటే పట్రోక్లస్ మరణానికి ప్రతీకారంగా ఏఖిలిస్ హెక్టర్ని చంపేడు.

ఇలా వెతుకుతూ పోతే ప్రతి సంఘటనకి, ప్రతి కార్యానికి వెనక ఒక కారణం కనిపిస్తుంది. లేదా, ఒక కార్య-కారణ చయనిక కనిపిస్తుంది. మరొక మెట్టు పైకి వెళ్ళి చూద్దాం.

గ్రీసు దేశం, ట్రోయ్ దేశం ఎందుకు యుద్ధం చెయ్యవలసి వచ్చింది? పేరిస్, హెలెన్ ప్రేమలో పడ్డారు కనుక. తన భార్య మరొకని యెడల అనురాగం చూపుతున్నదని ప్రతీకార జ్వాలలతో మెనలౌస్ మండిపడుతున్న కారణంగా. ఆగమెమ్నాన్ అధికారదాహం ఎక్కువ అయిన కారణంగా. ఏఖిలిస్‌కి కీర్తి కాంక్ష ఎక్కువయి.

ఇలా ఈ జాబితాని పొడిగించుకుంటూ పోవచ్చు. హోమర్ దృక్‌క్షేత్రంలో మానవుడు చేసే కృత్యాలకి ప్రేరణ కారణాలు అనేకం: ప్రేమ, ప్రతీకారం, అధికారదాహం, కీర్తి.

పైన ఉదహరించిన కార్య-కారణ చయనిక మానవ ప్రపంచంలో సహజం అని మనం సంతృప్తి పడవచ్చు. ఒక సంక్లిష్టమైన అంతర్నాటకంలో మానవుల కోరికలు, వాటి ప్రేరేపణలు, తద్వారా జరిగే చర్యలు, ప్రతిచర్యలు కారణంగానే ట్రోయ్ యుద్ధం లాంటి సమరాలు, హెక్టర్ మరణం లాంటి సందర్భాలు ఎదురవుతాయి. కానీ హోమర్ చెప్పిన కథ ఇంత సజావుగా సాగదు; ఎందుకంటే ఆ కథ అల్లికలో దేవుళ్ళకి కూడా ప్రముఖమైన పాత్ర ఉంది. హెక్టర్‌కి ఏఖిలిస్‌కి మధ్య భీకరపోరాటం జరగబోయే ముందు హోమర్ కథాగమనాన్ని దేవుళ్ళ వైపు తిప్పుతాడు. వారంతా జరుగుతున్న కార్యక్రమాన్ని స్వర్గంలో కూర్చుని చూస్తూ ఉంటారు, ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న చదరంగపు పోటీని బయట నుండి ప్రేక్షకులు చూస్తున్నట్లు. కానీ తటస్థంగా ఉండరు; ఇరు పక్షాలని సమర్థిస్తూ, వాళ్ళకి సలహాలు ఇస్తూ, వారి ఆటలలో కలుగజేసుకుంటూ ఉంటారు. హెక్టర్‌ని తరుముతున్న ఏఖిలిస్‌ని చూసి జూస్ ఒక పక్క ఏఖిలిస్ ధైర్య సాహసాలని మెచ్చుకుంటూ, మరొక పక్క ప్రేమానుబంధంతో హెక్టర్‌ని సమర్థిస్తూ ఉంటాడు. తాను ఎవరి పక్షం కాయాలి? తన్యతని భరించలేక ఇతరులని సలహా ఇమ్మని కోరతాడు.

“Come you immortals, think this through. Decide.
Either we pluck the man from death and save his life
or strike him down at last, here at Achilles’ hands.”
(22:206-209)

ఎథేనా సలహా మేరకు హెక్టర్ చావుకే సమ్మతిస్తాడు, జూస్.

“Go. Do as your own impulse bids you. Hold back no more.”
So he launched Athena already poised for action —
down the goddess swept from Olympus’ craggy peaks.
(22: 200-223)

ఇలా గ్రీకు దేవతలు మానవులని చదరంగంలోని పావులలా వాడుకుని ఆటలు ఆడుకున్నారు. వారికి శక్తియుక్తులు ఉన్నాయేమో కాని శీలసంపద ఉన్నట్లు కనిపించదు. అటువంటి దేవతలకి సహజాతీతమైన, ఆధిదైవిక (supernatural) శక్తులు ఉన్నాయని నమ్మి, వారిని ఆరాధించిన గ్రీకు ప్రజానీకానికి మంత్రమహిమల మీద, దేవుళ్ళు ఇచ్చే వరాల మీద, శాపాల మీదా నమ్మకం ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ కాలపు ఆధునిక వైజ్ఞానిక, హేతువాద దృక్పథంతో చూస్తే వారిది చాల వెనకబడ్డ సమాజంలా అనిపిస్తుంది. ఇటువంటి ‘వెనకబడ్డ’ సమాజం అకస్మాత్తుగా సా. శ. పూ. 5వ శతాబ్దం వచ్చేసరికి ఒక్కసారి ఉలిక్కిపడి మేలుకున్నదా అనిపిస్తుంది. ఎందుకంటే నేడు ప్రపంచం నలుమూలల ప్రజ్వరిల్లుతున్న ఆధునిక, శాస్త్రీయ, తార్కిక దృక్పథానికి పునాదులు గ్రీసు దేశంలోనే పడ్డాయి. పంకిలమైన బురద భూమిలో ఈ పద్మం ఎలా పుట్టుకొచ్చింది? ఈ మార్పు ఏ పరిస్థితులలో జరిగిందో ఇటుపైన విచారిద్దాం.

గ్రీకు తత్త్వవేత్తల ప్రాదుర్భావం

బురద లోంచి తామర పువ్వు పుట్టుకొచ్చినట్లు పురాణగాథలలో ములిగి తేలుతున్న గ్రీసు సమాజంలో అకస్మాత్తుగా విప్లవ వీచికలు తెరలు తెరలుగా తలెత్తడం మొదలయింది. ముందస్తుగా గ్రీసు చరిత్రలో కాలరేఖని ఒకసారి సమీక్షిద్దాం. గ్రీకు దేవతలు అస్తవ్యస్తత నుండి ఎప్పుడు పుట్టుకొచ్చేరో, ఒలింపస్ పర్వతం మీద ఎప్పుడు స్థిరపడ్డారో మనకి తెలియదు. కానీ ట్రోయ్ యుద్ధం జరిగేనాటికి (ఉరామరికగా సా. శ. పూ.1100) ఆ సమాజంలో ఆ దేవతల కథలు, ఆ నమ్మకాలూ స్థిరపడిపోయాయి. ఆ నమ్మకాలని ఆధారంగా చేసుకుని హోమర్ తన ఇలియడ్, ఆడెసి గ్రంథాలని మౌఖిక ధోరణిలో (ఉ. సా. శ. పూ. 800లో) రచించి ఉంటాడు. ఈ మౌఖిక సాహిత్యం గ్రంథరూపం దాల్చేసరికి మరికొంత కాలం పట్టి ఉండొచ్చు.

వీటన్నిటిని ఆధారంగా చేసుకుని హెసియోడ్ తన చరిత్రని (ఉ. సా. శ. పూ. 700లో) రాసి ఉంటాడు. డెల్ఫైలో ఉన్న ఒరాకిల్ మీద నమ్మకాలు అలెగ్జాండర్ కాలం వరకు ఉన్నట్లు దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఈ కథలు, ఈ నమ్మకాలు అలెగ్జాండర్ (ఉ. సా. శ. పూ. 350) కాలం వరకు ప్రచారంలో ఉన్నాయని మనం తీర్మానించవచ్చు.

ఇలాంటి వాతావరణపు నేపథ్యంలో మేఘాలు లేని ఆకాశం నుండి మెరుపులు మెరిసినట్లు, పిడుగులు పడ్డట్లు గ్రీకు సమాజంలో పెనుమార్పు చోటుచేసుకోవడం మొదలయింది. వీటిని అర్థం చేసుకోవాలంటే గ్రీసు దేశపు చరిత్రని కొన్ని యుగాలుగా విభజించి అధ్యయనం చెయ్యడం సంప్రదాయకంగా వస్తున్న ఆచారం. ఈ యుగాలని ఈ దిగువ పట్టికలో చూపెడుతున్నాను. ఇక్కడ BCE అంటే Before the Common Era లేదా లేదా క్రీస్తు శకానికి పూర్వం (క్రీ. శ. పూ.) అని అర్థం. (చూపిన సంవత్సరం పెద్దది అయినకొద్దీ కాలరేఖ మీద వెనక్కి వెళుతున్నామని గుర్తు పెట్టుకోవాలి.)

  1. నవశిలా యుగం (Neolithic Period, 6000-2900 BCE)
  2. కాంస్య యుగం (Early Bronze Age, 2900-2000 BCE)
  3. మినోవా యుగం (Minoan Age, 2000-1400 BCE)
  4. మైసీనియా యుగం (Mycenaean Age, 1100-600 BCE)
  5. అంధకార యుగం (The Dark Ages, 1100-750 BCE)
  6. ప్రాచీన యుగం (Archaic Period, 750-500 BCE)
  7. సంప్రదాయక యుగం (Classical Period, 500-336 BCE)
  8. యూనాని యుగం (Hellenistic Period, 336-146 BCE)

సా. శ. పూ. 323లో అలెగ్జాండర్ మృతి తరువాత నుండి సా. శ. పూ. 31లో రోమన్ సామ్రాజ్యం ఏర్పడేవరకు గల కాలాన్ని చరిత్రలో యూనాని యుగం (Hellenistic Period) అంటారు. కొద్ది దశాబ్దాలు ఇటు అటుగా ఇవన్నీ ఉరామరీ లెక్కలే! పాఠకులు అర్థంచేసుకోడానికి వీలుగా మనకి పరిచయం ఉన్న కొన్ని సంఘటనలు, కొందరు వ్యక్తుల జీవిత కాలాలు ఈ కాలరేఖ మీద ఉంచుదాం.

  1. కలియుగం మొదలు (3300 BCE)
  2. సింధు నాగరికత (3300–1300 BCE)
  3. హోమర్ (800–700 BCE)
  4. థేల్స్ (624–548 BCE)
  5. అనాక్సిమేండర్ (610–546 BCE)
  6. పైథాగరస్ (570–495 BCE)
  7. కన్ఫూషియస్ (551–479 BCE)
  8. గౌతమ బుద్ధుడు (500–400 BCE)
  9. ఎంపిడాక్లీస్ (490-430 BCE)
  10. సోక్రటిస్ (470–399 BCE)
  11. ప్లేటో (428-348 BCE)
  12. అరిస్టాటిల్ (384–322 BCE)
  13. అలెగ్జాండర్ (336–323 BCE)
  14. మౌర్య సామ్రాజ్యం (321–185 BCE)
  15. ఆర్కిమెడిస్ (287–212 BCE)

సింధు నాగరికత అవసాన దశలో ఉన్న రోజులలో మైసీనియా యుగం మొదలయింది. మైసీనియా యుగం తొలి రోజులలో ట్రోయ్ మహా సంగ్రామం జరిగిందనడానికి ఆధారాలు దొరుకుతున్నాయి. తరువాత గ్రీసు దేశం దరిదాపు నాలుగున్నర శతాబ్దాలపాటు అంధకార యుగంలో–పురాణ కథల ప్రభావంలో పడి–మగ్గిన తరువాత హోమర్ అప్పటికే ప్రచారంలో ఉన్న కొన్ని కథలని గ్రంథస్థం చేసి ప్రాచీన యుగానికి వైతాళికుడయ్యాడు. తరువాత వచ్చిన సంప్రదాయక యుగంలో పెద్దపెట్టున శాస్త్రీయ దృక్పథం పెరిగింది. తరతరాలుగా ప్రజలలో పాతుకుపోయిన ఆచార వ్యవహారాలను కొంతమంది ప్రశ్నించడం మొదలుపెట్టేరు. అయినా సరే యునాని యుగంలో అలెగ్జాండర్ భారతదేశపు సరిహద్దులకి వచ్చేవరకు గ్రీసు దేశపు ప్రజల మీద పురాణ గాథల పట్టు సడలలేదు.


చరిత్రలో చాలాకాలంపాటు ప్రపంచం నలుమూలల సత్యాన్వేషణ, భగవదాన్వేషణ అన్నవి పర్యాయపదాలుగా వాడడం జరిగింది. భగవంతుని ప్రస్తావన తీసుకుని రాకుండా కేవలం ప్రకృతి సత్యాలని గురించి తెలుసుకోవాలనే కుతూహలం పుట్టేసరికి కొంతకాలం పట్టింది.

అది గౌతమ బుద్ధుని కాలం. ఎందువల్లనో ప్రపంచంలో పలుచోట్ల తార్కికమైన చింత బాగా పెరిగింది. దేవుడనే భావం మీద ఆధారపడకుండా కంటికి ఎదురుగా ఉన్న సృష్టి విచిత్రాన్ని అవగాహన చేసుకుందుకి మానవుడు ప్రయత్నించేడు. భారతదేశంలో గౌతమ బుద్ధుడు, చైనాలో కన్ఫూషియస్, గ్రీసు దేశంలో థేల్స్, అనాక్సిమేండర్ మొదలైనవారు సమకాలికులవడం గమనార్హం!

భారతదేశంలో బౌద్ధధర్మం కార్య-కారణ వాదానికి విత్తులు నాటడం మొదలుపెట్టింది. ‘ఇది కీలకమైన సంఘటన. ప్రకృతికి అతీతమైన దానిని తిరస్కరిస్తూ బుద్ధుడు మూడు విధానాలు చెప్పాడు. మానవుడిని హేతువాద దృక్పథం వైపు నడిపించడం మొదటిది. మానవుడిని సత్యాన్వేషణ వైపు స్వేచ్ఛగా పయనింప చేయడం రెండవది. మూఢనమ్మకాలను అనుసరించడం ద్వారా మానవుడు అన్వేషణా శక్తిని కోల్పోతాడు అని చెప్పడం మూడవది. దీనినే కర్మ లేదా కార్యకారణ సిద్ధాంతం అంటారు. బౌద్ధ ధర్మంలో కార్యకారణ సిద్దాంతం అత్యంత కీలకమైంది. బౌద్ధధర్మం హేతువాదబద్ధం కానట్లయితే అది బౌద్ధమే కాదు. అందుచేత ప్రకృతికి అతీతమైన వాటిని నమ్మడం ధమ్మం కాదు.’ (బుద్ధుడు మరియు అతని ధమ్మం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, (సం.) పేర్వారం జగన్నాథం, తెలుగు విశ్వవిద్యాలయం, 1994, సంపుటం 11, పుట 222).

ఇదే సమయంలో చైనాలో కన్ఫూషియస్ (Confusius) మరొక దారి చూపేడు. పెద్దల యెడల, కుటుంబ సభ్యుల యెడల, దేశం యెడల గౌరవ ప్రపత్తులతో మెలగాలి అన్నది మొదటి సూత్రం. నేటికీ పెద్దల యెడల, అధికారుల యెడల చైనావారు చూపే గౌరవ మర్యాదలు శ్లాఘనీయం. కుటుంబాభిమానం వారిలో ఎక్కువ. కలిసికట్టుగా సంఘశ్రేయస్సు కోసం పాటుపడడం అనేది కన్ఫూషియస్ ఆలోచనకి మూలస్తంభం. కుటుంబం కోసం, సంఘం కోసం, దేశం కోసం సమష్టిగా పనిచెయ్యాలి. వ్యష్టిగా ఎవరి మోక్షం కోసం వారు విద్యార్జన, ధనార్జన చేస్తే సరిపోదు; సంఘశ్రేయస్సు కోసం సమష్టిగా కూడా పని చెయ్యాలి.

ఈ రకం ధర్మ సూక్ష్మాలు హిందువులకి తెలియనివి కావు. ఉదాహరణకి

ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము దనమనంబున కగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పదములకెల్లన్
(భారతం, శాంతి, 5-220)

హిందూ దృక్పథంలో ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న సూక్తి కేవలం ప్రచారం కోసం బేనర్ మీద రాసుకుందుకే! ‘మనం ఉండే సంఘం బలంగా ఉంటే అదే మన బలం’ అనే ఆలోచన మనలో తక్కువ. ‘ఎవరి కర్మ వారిది’ అనే వేదాంత ధోరణిలో ఉన్నవారికి సంఘంతో పనేమిటి? మన నుదుటి రాత బాగులేకపోతే ఆ రాసినవాడి దగ్గరకే వెళ్ళి వాడికే కాసింత లంచం ఇస్తే సరిపోలేదూ? రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ సంపర్కం ఉన్నప్పటికీ అది సంఘానికీ వ్యక్తికీ మధ్య ఉన్న పరస్పరాధారబంధంపై మన దృక్పథాన్ని మార్చలేకపోయింది.

కానీ ఇదే దేశంలో తరతరాలబట్టి స్థిర నివాసం ఏర్పరచుకున్న పార్శీలు వితరణ శీలానికి, సంఘాభ్యుదయనికీ మధ్య ఉండే లంకె బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు. అభివృద్ధి అనేది వ్యష్టిగా కాక సమష్టిగా జరగవలసిన కార్యక్రమం అని వారు గుర్తించేరు. ఈ అభ్యుదయ దృక్పథంతో వారు మన దేశపు పునర్నిర్మాణానికి అవసరమైన సంస్థలు ఎన్నో స్థాపించేరు.

ఈ తర్జనభర్జనలని పక్కకి పెట్టి, బుద్ధుడి కాలానికి తిరిగి వెళదాం. ఆ కాలంలో ఆధునిక వైజ్ఞానిక దృక్పథానికి ఆద్యుడు అనదగ్గ గ్రీకు తత్త్వవేత్త థేల్స్ (Thales) ‘ఈ ప్రపంచం దేనితో తయారయింది?’ అని ఒకసారి ప్రశ్నించేడు. మేఘాలు, మృగాలు, వృక్షాలు, ఇలా వివిధ రూపాలలో కనిపిస్తూన్న ఈ స్థూలప్రపంచం అంతా సూక్ష్మరూపంలో ఒక్కటేనా? మనకి దృగ్గోచరమయే బహుళత్వంలో ఏకత్వం ఉందా? సృష్టి అంతా మన మేధకి అందనంత క్లిష్టమైనదా లేక విశ్లేషించి అధ్యయనం చేస్తే అర్థం అవుతుందా? ఇటువంటి ప్రశ్నలతో ఆయన చాలకాలం కుస్తీపట్టేడు. మట్టితో ఇటుకలు చేసి, ఆ ఇటుకలని మూలపదార్థంగా వాడి రకరకాల ఆకారాలలో గోడలు, ఇళ్ళు, గుడులు, గోపురాలు కట్టినట్లే సృష్టిలో మనకి కనిపించేవన్నీ – అంటే, మేఘాలు, మృగాలు, వృక్షాలు, వగైరాలు – ఒక మూలపదార్థంతో తయారయి ఉండాలని ఆయన వాదించేవాడు. ఆ మూలపదార్థం ఏమయి ఉంటుంది? ఆయన సముద్రపు ఒడ్డున నివసించేవాడు. రోజూ ఎదురుగా ఉన్న మహాసాగరాన్ని చూసి, చూసి సృష్టికి మూలం నీరు అన్నాడు. అంటే, ప్రపంచంలోని పదార్థాలన్నీ నీటితో తయారు చెయ్యబడ్డాయని ఆయన ఆలోచన. సృష్టికి మూలం జలం. సర్వవ్యాప్తమయిన జలం నుండే సృష్టి మొదలయి ఉండాలి. ఇదీ ఆయన ప్రవచనం. ఈ కొత్త దృక్కోణంలో భగవంతుని ప్రస్తావన లేదు, మానవాతీత శక్తులకు స్థానం లేదు.

థేల్స్ ప్రవచనం అందరికీ ఆమోదయోగ్యం కాలేదు. అందరి వరకు ఎందుకు? ఆయన దగ్గర శిష్యరికం చేస్తూన్న అనాక్సిమేండర్ (Anaximander) గురువుగారితో ఏకీభవించలేదు. ఇసుకలో నీళ్ళు లేవు. నీటి కంటె సర్వవ్యాప్తమైనది భూమి. కనుక సృష్టికి మూలం భూమి అన్నాడు అనాక్సిమేండర్. నీటి కంటె, భూమి కంటె సర్వవ్యాప్తమైనది గాలి కనుక, సృష్టికి మూలం గాలి అవాలి అని అనాక్సిమెనెస్ (Anaximenes) వాదించేడు. సర్వవ్యాప్తం అయినంత మాత్రాన సరిపోదు, శక్తిమంతమై ఉండాలి కనుక సృష్టికి మూలం అగ్ని అయితే బాగుంటుందని హెరాక్లిటస్ (Heraclitus) ముచ్చటపడ్డాడు. ఇంతకీ ఈ నాలుగింటిలో దేనికి అగ్రస్థానం ఇవ్వాలి? ఈ తగువు తీర్చడానికి ఎంపెడాక్లెస్ (Empedocles) అనే తత్త్వజ్ఞుడు మధ్యవర్తిత్వం వహించేడు. అన్ని పక్షాలవారి వాదనలని పూర్వపక్షం చేస్తూ, ‘సృష్టికి మూలం నీరు, నిప్పు, గాలి, మట్టి’ అంటూ తుని తగవులా తీర్పు చెప్పేడీయన.

సృష్టికి మూలం నీరు, మట్టి, గాలి, నిప్పు అనగానే సరిపోతుందా? వీటిల్లో దేనికి పెద్దరికం ఇవ్వాలన్న సమస్య ఎదురయింది. ఈ సమస్యని అరిస్టాటిల్ (Aristotle) అనే తత్త్వవేత్త పరిష్కరించేడు. విశ్వానికి మధ్యలో భూమి ఉందన్నాడు ఆయన. ఈ భూగోళం చుట్టూ ఆవరించుకుని జలగోళం ఉందన్నాడు. భూమి మీద మనకి కనిపించే చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాలే ఈ జలగోళం అంటే. ఈ జలగోళం చుట్టూ వాయుగోళం ఉందన్నాడు. భూమిని ఆవరించుకుని ఉన్న వాతావరణమే ఈ వాయుగోళం. ఈ వాయుగోళం చుట్టూ అగ్ని గోళం ఉందన్నాడు. అప్పుడప్పుడు వాయుగోళానికి చిల్లుపడితే, ఆవల ఉన్న అగ్ని గోళమే మనకి మెరుపుల రూపంలో కనిపిస్తుందని అరిస్టాటిల్ వాదించేడు. అగ్ని గోళానికి బయట ఏమి ఉంది? ఏమీలేదు. ఏమీ లేకపోవడమేమిటి? శూన్యం ఉంది కదా! ఆ ఏమీ లేని ఖాళీ ప్రదేశాన్నే – సున్నాతో పరిచయం ఉన్న మనవాళ్ళు – ఆకాశం అన్నారని నా అభిప్రాయం.

ఇలా గ్రీసు దేశంలో థేల్స్, సోక్రటీస్, అరిస్టాటిల్, ఆర్కిమెడిస్ ప్రభృతులు తరతరాలుగా ప్రజలలో పాతుకుపోయిన మూఢనమ్మకాలని, ఆచార వ్యవహారాలని ప్రశ్నించడం మొదలుపెట్టేరు. అయితే, ఈ వాదనలన్నిటిని పూర్వపక్షం చేసింది ఆధునిక భౌతికశాస్త్రం అన్నది వేరే విషయం. థేల్స్ సాధించినది అప్పటివరకు కరడుకట్టుకుపోయిన సహజాతీతమైన, ఆధిదైవిక శక్తుల మీద నమ్మకాన్ని తోసిపుచ్చడం!

(సమాప్తం)