పాముకాటుకి చెంపదెబ్బ?

నాకు అప్పుడు పదేళ్ళ వయస్సు. మా ఇంటి ఎదురుగా ఉండే పాకలో ఎర్రన్న, గంగమ్మ, వాళ్ళ కూతురు నాగమ్మ ఉండేవారు. ఎర్రన్న రాత్రి పదింటికి బండి తోలుకుంటూ ఇంటికి వస్తున్నాడు. మా వీధి మొగదలలో ఉన్న దయ్యాల తోట దగ్గరకి వచ్చేసరికి ఎద్దు కదలడానికి మొరాయిస్తే దానిని అదలించడానికి ఎర్రన్న బండి దిగేడు. ఠక్కున పాదం మీద పాము కాటేసింది. ఎర్రన్న ఇంటికి చేరేసరికి కాలు తిమ్మిరెక్కిపోయింది. పాము మంత్రం తెలిసిన ఆసామీ ఇంటికి పరుగున వెళ్ళి వార్త చెప్పిన వ్యక్తి చెంప మీద ఛెళ్ళున కొట్టి, “విషం దిగిపోతుంది, వెళ్ళు!” అన్నాడు మాంత్రికుడు. విషం దిగలేదు సరికదా, పరిస్థితి విషమించింది. పాముల నరసయ్యకి టెలిఫోను చెయ్యమన్నారు. అర్ధరాత్రి ఆ పని చెయ్యడం ఎలాగో ఎవ్వరికీ తెలియలేదు. ఊళ్ళో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ని కలవమన్నారు. ఆయన పత్తా లేడు. ఏదైనా మందు ఇవ్వమని నాన్నగారిని బ్రతిమాలేరు. ఆయన తన హోమియోపతీ మందుల పెట్టి తెరచి లేఖసిస్ మాత్రలు ఎర్రన్న నోట్లో వేసేరు. పని చేసినట్లు లేదు. తెల్లారేసరికి ఎర్రన్నకి మగత కమ్మేస్తూంది. నోటినుండి నురగ వస్తోంది. పరిస్థితి చెయ్యి జారిపోతూంది. ‘ఈ పరిస్థితిలో ఉచ్చ తాగించాలి’ అన్నారు ఎవరో. పెద్దలెవ్వరూ ముందుకు రాలేదు. ఎర్రన్న భార్య గంగమ్మ గిన్నె పట్టుకుని ఎదురింటి అరుగు మీద నిలబడ్డ నా దగ్గరకి వచ్చింది. నేను గిన్నె నింపేను. చెంచాతో ఎర్రన్న నోట్లో పోసేరు. ఒక్క చుక్క కూడా గొంతుక దిగినట్లు లేదు. ఎర్రన్న ప్రాణాలు అప్పటికే పైకి ఎగిరిపోయాయి!

ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ (WHO) గణాంకాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా, ప్రతి ఏటా 50 లక్షల పాము కాట్లకి ప్రజలు గురి అవుతున్నారు. వీటిలో 27 లక్షలు విషసర్పాలు వేసే కాట్లు. వీటి వల్ల దరిదాపు లక్షమంది మరణిస్తున్నారు. అమెరికాలో ఏటా 8,000 విషసర్పాల కాట్లు తింటున్నవారిలో మరణించేది కేవలం ఐదు మందే! కానీ భారతదేశంలో పాము కాట్ల వల్ల ఏటా 58,000 చచ్చిపోతున్నారు. ఇది ప్రపంచ దేశాలలో ప్రథమ స్థానం! పాములలో అన్నీ విషసర్పాలు కావు. వీటిలో ఎక్కువ జాతులవల్ల మనిషికి ఎలాంటి ప్రమాదం లేదు.

సాధారణంగా పాము కాట్లకి గురి అయి చనిపోయేవారు బీద దేశాలలో బ్రతికే, పరపతి తక్కువగా ఉన్న పల్లెటూరి ప్రజలు. ఉదాహరణకి ఆస్ట్రేలియాలోని పాములలో విషసర్పాల శాతం అధికం అయినప్పటికీ, అక్కడ ఆధునిక వైద్య సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండడం వల్ల పాము కాట్ల వల్ల మరణాలు అత్యల్పం. బీద దేశాలలోని పల్లెలలో ప్రజలు చెప్పులు లేకుండా నడవడం, పొలాల్లో పని చెయ్యడం, నేల మీద పడుకోవడం వంటి అలవాట్ల వల్ల, వారిని పాములు కరిచే అవకాశాలు ఎక్కువ. పాము కరిచిన తరువాత నాటు వైద్యం అనిన్నీ, మంత్రాలు అనిన్నీ ఆలస్యం చేస్తారు. అనేక సందర్భాలలో ఆధునిక వైద్యం అందుబాటులో ఉండదు. బొక్కబెరడు (hump-nosed pit viper – Hypnale hypnale) వంటి పాముల కాట్లు సాధారణంగా ప్రాణాంతకాలు కావు కానీ ఆ విషాన్ని విరగ్గొట్టడానికి సరి అయిన మందు లేదు. చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్నట్లు ప్రాణం నిలచినా కరిచిన చోట విపరీతమైన నొప్పి, వాపుతోపాటు అప్పుడప్పుడు మూత్రకోశాలు (kidneys) దెబ్బ తినడం, కణజాలం (tissue) చచ్చిపోవడం లాంటి పర్యవసానాలవల్ల ఏ కాలో, చెయ్యో తీసివెయ్యవలసిన పరిస్థితి ఎదురవుతుంది!

ఉపరితలంగా పరిశీలించి చూస్తే పాము కాట్ల వల్ల కలిగే ప్రాణనష్టాన్ని తగ్గించడం అసాధ్యం కాదనిపిస్తోంది. లోతుగా పరిశీలించి చూస్తే ఇది అంత తేలికగా పరిష్కారానికి లొంగే సమస్య కాదని కూడా తెలుస్తుంది. అన్ని పాముల విషాలు మన మీద ఒకే విధంగా ప్రభావం చూపవు. ఏ ఎండకా గొడుగు పట్టాలన్న సూత్రం ప్రకారం ఒకొక్క రకం పాము కాటుకి ఒకొక్క రకం విషపువిరుగుడు (antivenom) వాడవలసి ఉంటుంది. కనుక ప్రతి దేశంలోనూ ఆ దేశపు పాముల విషాలని విరగ్గొట్టే సమర్థత గల విరుగుడు మందులు తయారు చేసుకోవాలి. ఇలా ఎవరికి వారు విరుగుడు మందులు తయారు చేసుకోవాలంటే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ఎక్కడో పల్లెప్రాంతాలలో ఉన్న ప్రజలకి ఈ మందులు వేళకి అందుతాయన్న భరోసా లేదు. బీద దేశాల ప్రజలకి ఈ మందులు అందని ద్రాక్షపండ్లే!

పాము విషానికి విరుగుడు మందు ఎలా తయారు చేస్తారు? ప్రస్తుతం వాడుకలో ఉన్న పద్ధతి ఎప్పుడో 120 ఏళ్ళ క్రితం ప్రవేశపెట్టిన పద్ధతి! సాంకేతిక నిపుణులు పాము విషాన్ని సేకరించి, దానిని అత్యంత స్వల్ప మోతాదులలో గుర్రాలకో, గొర్రెలకో సూది ద్వారా, కొన్ని వారాలపాటు ఎక్కిస్తారు. ఈ సూక్ష్మ మోతాదుకు ఆ జంతువులు చచ్చిపోవు. కానీ ఆ జంతువుల వ్యాధినిరోధక వ్యవస్థ తమ రక్షణ కోసం ఈ పరాయి కణజాలంతో (విషం) పోరాడి ఒక రక్షక కవచాన్ని తయారు చేసుకుంటుంది. ఈ సందర్భంలో గుర్రం శరీరం లోనికి ప్రవేశించిన అంశాన్ని రోగకారకం (antigen) అనిన్నీ, గుర్రం తన రక్షణ కోసం తయారు చేసుకున్న కవచాన్ని రక్షకాంశం (antibody) అనిన్నీ అంటారు. ఇలా కొన్ని నెలలు పోయిన తరువాత ఆ గుర్రం రక్తనాళాల్లో ప్రహిస్తూన్న రక్తాన్ని కొంత బయటకు తీస్తారు. ఇలా సేకరించిన రక్తంలో మనకి కావలసిన (అనగా, పాము విషాన్ని ఎదుర్కోగలిగే శక్తి ఉన్న) రక్షకాంశాల (antibodies) తోపాటు ఆ గుర్రం జీవితంలో అంతవరకు ఎదుర్కున్న అనేక రోగకారకుల (antigens) నుండి రక్షించడానికి తయారయిన రక్షకాంశాలు (antibodies) కూడా ఉంటాయి.

ఇప్పుడు పాము కాటుకి గురైన వ్యక్తికి ఈ రక్షకాంశాలతో (antibodies) నిండిన ద్రవాన్ని సూదిమందులా ఇస్తారు. గుర్రానికి ఏ జాతి పాము విషం ఎక్కించేమో అదే జాతి పాము విషం మీద ఈ వైద్యం రామబాణంలా పని చేస్తుంది. కుట్టిన పాము వేరే జాతిదైతే ఈ మందు గుడ్డిగుర్రపు తాపులా పని చేసెయ్యవచ్చు, లేదా అస్సలు పని చెయ్యకపోనూ వచ్చు. ఇక్కడ ‘పని చెయ్యడం’ అంటే ఇటుపైన నష్టం కలగకుండా చూడడం; అప్పటికే కలిగిన నష్టాన్ని పూడ్చలేం కనుక ఈ వైద్యం ఎంత త్వరగా అందించగలిగితే అంత మంచిది. ఆలస్యం అమృతం విషం అన్న నానుడి ఇక్కడ అక్షరాలా వర్తిస్తుంది. అనగా పాము కాటుకి గురి అయిన అమ్మిని, ఆసామీని సత్వరంగా ఆసుపత్రికి చేరవెయ్యాలి. ఆసుపత్రిలో ఆ పాము కాటుకి నప్పే విరుగుడు మందు నిల్వలో ఉండాలి. వేళకి తరిఫీదు పొందిన వైద్యుడు అందుబాటులో ఉండాలి. ఈ గొంతెమ్మ కోరికలన్నీ తీరేవి కావు కనుక మన ఉపతాపి (patient) ప్రాణం ఆ పరాత్పరుడి చేతిలో ఉంటుంది.

ప్రపంచంలో విషపువిరుగుడు తయారీలో భారతదేశానిది అగ్రస్థానం. భారతదేశంలో కనబడే 300 జాతుల పాములలో విషపూరితమైనవి 50 జాతులు. ఈ పాములలో కొన్ని మాత్రమే మనిషి ప్రాణాన్ని తీయగలవు. వీటిలో అగ్రస్థానంలో ఉన్నవి:

  1. కట్ల పాము = asp; krait; Bungarus caeruleus
  2. తాచు పాము = నాగు పాము = cobra; Naja naja
  3. రక్త పింజర = కాటుక రేకుల పొడ = Russell’s Viper; Vipera russelli
  4. చిన్న పింజర = Indian Saw-scaled Viper; Echis carinatus.

అందుకని విషపువిరుగుడు తయారీలో భారతదేశం ఈ నాలుగు జాతుల పాముల మీద దృష్టి కేంద్రీకరించింది.

ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే ఈ నాలుగు జాతుల పాముల విషాలు అన్ని భౌగోళిక ప్రదేశాలలోను ఒకేలా ఉండవు. ఉదాహరణకి భారతదేశపు రక్త పింజర విషం మీద పనిచేసే మందు శ్రీలంకలో కనబడే రక్త పింజర విషం మీద అంత ప్రతిభావంతంగా పని చెయ్యదు. ఈ సమస్యకి శ్రేష్ఠమైన పరిష్కారం ఏమిటంటే ఏ ప్రదేశానికా ప్రదేశం, వారివారి ప్రాంతీయ అవసరాలకి అనుగుణంగా విషపువిరుగుడులు (antivenoms) తయారు చేసుకోవడం. ఇలా ఎవరికివారే యమునాతీరే అనే దృక్పథం కుటీర పరిశ్రమలా కొనసాగగలదేమో కానీ వ్యాపారకోణంలో లాభసాటి వ్యవహారం కాదు. అన్ని పాముల విషాలకి విరుగుడుగా ఒకే మందు పెద్ద ఎత్తున చేసిననాడు దాని ధర అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ దిశలో పరిశోధనలు జరుగుతున్నాయి; ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

సరసమైన ధరకి మందు అందుబాటులోకి వచ్చినా సమస్య పరిపూర్ణంగా పరిష్కారం కాదు. ఎందుకంటే సూదిమందులో పాము విషానికి విరుగుడుతో పాటు గుర్రం శరీరంలో సహజసిద్ధంగా నిల్వ చేయబడుతూన్న ఇతర రక్షకాంశాలు (antibodies) ఉంటాయి కదా. అవి పడకపోతే శరీరం విపరీతంగా స్పందిస్తుంది. అటువంటి స్పందనని సద్యఃక్రియాకారకావస్థ (anaphylactic shock: a severe allergic reaction) అంటారు. ఇటువంటి తీవ్రస్పందనకు ప్రాణం పోవచ్చు. (‘వైద్యం పని చేసింది కానీ రోగి చచ్చిపోయేడు’ అన్న నుడికారం ఇటువంటి సందర్భంలోనే పుట్టి ఉంటుంది.) ఇటువంటి సందర్భాలలో వైద్యుడు అప్రమత్తతతో వ్యవహరించి ఉపవృక్కి (epinephrine or adrenaline) అనే ఉత్తేజితాన్ని (hormone) ప్రయోగించి ప్రాణం కాపాడవలసి ఉంటుంది. ఆసుపత్రిలో ఈ రకం అవస్థాపన సౌకర్యాలతో కూడిన దన్ను లేకపోతే పాము కాటుకంటే ముందే విరుగుడు మందు పడకపోవడం వల్ల ప్రాణం పోతుంది. అప్పుడు ఆసుపత్రి వైద్యం మీద ప్రజలకి నమ్మకం పోయి వారు తరతరాలుగా వాడుతూన్న మంత్రాల మీద, పసరు వైద్యాల మీద, మూత్ర వైద్యాల మీదా ఆధారపడతారు. ఈ విషమ సమస్యలన్నీ పాముకాటు వైద్యానికి ప్రతిబంధకాలే!

పాము కాటువైద్యం ఎక్కువగా అశ్రద్ధ చేయబడ్డ రంగం. పాము కరిచిందని తెలియగానే అది విషపు పురుగో కాదో తెలియదు కనుక, ప్రథమ చికిత్సగా నోటి ద్వారా వేసుకునే మందులు కనిపెట్టాలి. అతి చవకగా దొరికే ఇటువంటి మాత్రలు – తలనొప్పి బిళ్ళల్లా – అందరి ఇళ్ళల్లో ఉండాలి. హోమియోపతీలో వాడే లెడం, లేఖసిస్ వంటి మందులు ఈ పాత్ర పోషించవచ్చు. పాము కాటుతో బాధితుడు ఆసుపత్రికి రాగానే వెంటనే రక్తపరీక్ష చేసి ఏ జాతి పాము కుట్టిందో తెలుసుకోగలగడం రెండవ తక్షణ కర్తవ్యం. ఈ పని చెయ్యడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం మనకి ఉంది. పరిజ్ఞానంతోబాటు సంకల్పబలం, ఆర్థిక పెట్టుబడి కూడా అవసరం.

విషాలకి విరుగుళ్ళు చేసే పద్ధతులు కూడా మారాలి. గుర్రాల వంటి జంతువుల రక్తం మీద ఆధారపడడంలో ఉన్న ఇబ్బందులు చూసేం. ఆధునిక జన్యు యంత్రసామగ్రితో కొత్త పుంతలు తొక్కొచ్చు. పాము విషాలని విశ్లేషించి చూస్తే అవి కేవలం రకరకాల ప్రాణ్యపు గొలుసులు (protein chains), జీర్ణమాలలు (peptide chains) అని అవగతం అవుతుంది. ఆగంతకులైన ఈ లాతి జాతి గొలుసులని చూసి మన గుర్రపు శరీరం ప్రతిస్పందనగా రక్షకాంశాలని (antibodies) తయారు చేసుకుంటుంది. ఇలా గుర్రం మధ్యవర్తిత్వం లేకుండా ఏకరూప రక్షకాంశాలను (monoclonal antibodies) మనం ప్రయోగశాలలో మానవ జీవకణాల పర్యవేక్షణలో తయారు చెయ్యవచ్చు. నెలల తరబడి పట్టే ‘గుర్రపు పద్ధతి’తో పోల్చితే ఈ కొత్త పద్ధతి వారం రోజులలో తెమిలిపోతుంది. పైగా శరీరానికి పడకపోవడం (allergy) అనే ప్రశ్న ఎదురవదు. ఇది ఇంకా పరిశోధన స్థాయిలో ఉన్న ఊహ కనుక ఫలితం పొందడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది.

చిట్టచివరగా అన్ని రకాల పాముల విషాలకీ ఒకే మందు పని చేసే పద్ధతి వెతకాలి. అనగా, పాము కాటుకి సార్వత్రిక చికిత్స కావాలి. ఇది సాధ్యమా? పాము విషం రకరకాల బణువుల కలగూరగంప కనుక వీటిలో దేని మీద మన మందు అనే బాణం ప్రయోగించడం అనే సమస్య కొరకరాని కొయ్యగా తయారయింది కదా! ఈ కలగూరగంప లోని విషాలన్నిటిలోనూ ఉమ్మడిగా ఏదయినా రసాయన పదార్థం ఉందేమో వెతకాలి. అలా వెతకగా ఫాస్ఫోలిపేజ్ (secretory phospolipase A2: sPLA2) అనే ఒక ఫేనకప్రాణ్యం (enzyme) 95% పాము విషాలలో ఉన్నట్లు తేలింది. కాలిఫోర్నియాలో ఉన్న ఓఫిరెక్స్ (Ophirex) అనే కంపెనీ ఈ కోణంలో ఆలోచించి కేవలం ప్రథమ చికిత్సకి పనికొచ్చే మందు ఒకటి తయారు చేసిందని తాజా వార్త! ఈ కొత్తకొత్త అన్వేషణ మార్గాలు ఫలించి, ప్రజలకి అందుబాటులోకి రాడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంత వరకు ప్రస్తుతం వాడుకలో ఉన్న మందులని, పద్ధతులని ప్రజలందరికీ త్వరితగతిని అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం.

చికిత్సకన్నా ముందుజాగ్రత్త గొప్పది. పాము కాట్లు తగ్గాలంటే పాములకు, మనుష్యులకు మధ్య సంఘర్షణ తగ్గాలి. పాములు మనని కావాలని వెంటాడి కరవవు. మన ఉనికి వాటికి ముందుగానే తెలియబరుస్తే అవి మన జోలికి రావు. అందుకనే ఎర్రన్న బండి తోలిన వీధిలో రాత్రి ఎప్పుడు నడిచినా జోళ్ళు వేసుకుని, ఒక చేతిలో హరికేన్ లాంతరు, మరొక చేతిలో చేతికర్ర పట్టుకుని, టక టక చప్పుడు చేస్తూ నడిచేవాళ్ళం! ఆడవాళ్ళు చెంబు పుచ్చుకుని చీకటిలో బయటకు వెళ్ళవలసిన అవసరం లేకుండా సురక్షితమైన మరుగుదొడ్లు ఉండాలి. పొలాల్లో చేతులతో పని చేసే ఆడ, మగ, పాదాల రక్షణకి ఏమి చెయ్యాలో నా అనుభవ పరిధికి మించిన సమస్య! చేతులతో పని మానేసి యంత్రాలు ఉపయోగించాలో ఏమో మరి! అథవా పాము కరిచిందే అనుకుందాం. ప్రతి పల్లె పట్టులోనూ పాము కాటుకి ప్రథమ చికిత్సకి కనీస సదుపాయాలు కల్పించాలి. మంత్రాలకి, మణులకి, తావీజులకి, అల్పాచమానాలకీ పాము విషం దిగదని ప్రజలలో నమ్మకం పుట్టించాలి.


సంప్రదించిన మూలాలు:

  1. Cassandra Willyard, A Fanged Crisis, Scientific American, pp S18-S25, October 2023.
  2. An Inside Look at the Effort to Curb Deadly Snakebites in India. Smithsonian Magazine, November 2023.
  3. Trends in snakebite deaths in India from 2000 to 2019 in a nationally representative mortality study. National Institute of Health, India, 2020.
  4. Irula Snake Catcher’s Industrial Co-operative Society, Tamil Nadu, India, has produced snake venom for 45 years to make antivenom for India’s four most common venomous snakes.
  5. Haffkine Institute, located in Mumbai, has been developing Indian poly-specific antivenom since 1899, including polyvalent antivenom for the king cobra.
  6. Indian Institute of Science (IISc), Bengaluru, is producing non-commercial antivenom to evaluate the effectiveness of regional antivenoms in neutralizing toxins from specific snake bites.