తెలుగు అధికార భాష కావాలంటే

తెలుగు అధికార భాష కావాలంటే …
రచయిత/సంపాదకుడు: నూర్‌బాషా రహంతుల్లా
ప్రాప్తి స్థానం: తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్‌స్, సందేశ భవనం, లక్కడ్‌కోట్‌, హైదరాబాదు – 500 002
మొదటి విడత, రెండవ ముద్రణ: ఫిబ్రవరి, 2006. పుటలు: 140; వెల: 40 రూపాయలు

నలభై రూపాయలకి నూటనలభై పుటల పుస్తకం! దీనిని ముద్రించటానికయే ఖర్చు మరెవరో భరించకపోతే ఇది సాధ్యం కాదు. రెండవ ముద్రణలో 2000 ప్రతులు అచ్చొత్తించారంటే దీనికి ఆదరణ బాగానే ఉండుండాలి. రచయితకి తెలుగు భాషపై ఉన్న అభిమానం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రచయిత డిప్యూటీ కలెక్టర్‌ గా ఉద్యోగం చేసినట్లు చెప్పుకున్నారు కనుక అధికార రంగంలో మాతృభాషని వాడవలసిన అవసరాన్ని సాధికారంగా చెప్పేరు. పుస్తకంలో వాడిన భాష శైలి సాగరాంధ్రలో వినిపించే శిష్ట వ్యవహారికానికి దగ్గరగా ఉండి చదవటానికి తేలికగా ఉంది. అచ్చుతప్పులు, వర్ణక్రమ దోషాలూ కనిపించలేదు. నేను కాగడా పెట్టి వెతకలేదు; వెతికుంటే కనిపించి ఉండేవేమో. కనుక ముద్రాపకుల జాగ్రత్తని మెచ్చుకు తీరాలి.

పుస్తకంలో మొదటి 30 పుటలూ ప్రముఖుల అభిప్రాయాలు. చివర ఆరు పుటల ప్రాప్తికి తెలుగు అకాడమీ డైరక్టర్లు, తెలుగు దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల కులపతుల పేర్లు, తెలుగు విభాగాల అధిపతుల పేర్ల జాబితాలు ఉన్నాయి. వీటి ఉపయోగం ఏమిటో అర్ధం కాలేదు. ఆఖరి రెండు పుటలలోనూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన విశిష్ట వ్యక్తుల ఛాయాచిత్రాలు ఉన్నాయి. టూకీగా ఇదీ ఈ పుస్తకం స్వరూపం. ఇవన్నీ మినహాయించగా మిగిలిన వంద పేజీలలోనూ 26 వ్యాసాలు. ఇవన్నీ 1987-91 ఆంధ్రపత్రిక లోనూ, 1996-2004 గీటురాయి లోనూ ప్రచురితం. ఈ వ్యాసాలలో ఒకదాని పేరే పుస్తకానికి మకుటంగా పెట్టేరు తప్ప పుస్తకం అంతా మకుటానికి సంబంధించినది కాదు.

ప్రస్తుతం తెలుగు భాష గురించి జరిగే చర్చలని అనేక కోణాలనుండి పరిశీలించ వచ్చు. తెలుగుని – సంస్కృతం, తమిళాల లా – ప్రాచీన భాష హోదా ఇచ్చి గుర్తించాలా? అలా గుర్తించటం వల్ల మనకి ఒదిగే లాభనష్టాలు ఏమిటి? మనం వాడే భాష గ్రాంధికంగా ఉండాలా? శిష్టవ్యవహారికంగా ఉండాలా? తెలుగుని అధికార భాషగా గుర్తిస్తే ఆ భాషకి ప్రమాణంగా ఏ మాండలికాన్ని తీసుకోవాలి? అసలు తెలుగంటే అచ్చ తెలుగా? సంస్కృతాంధ్రమా? తెంగ్లీషా? ఉర్దూతో కలిసిన తెలుగా? ఇతర భాషలలోని పదజాలాన్ని ఎంతవరకు ఎరవు తెచ్చుకోవచ్చు? పూజలు, పునస్కారాలూ, కర్మ కాండలు తెలుగులో ఎందుకు జరుపుకోకూడదు? తెలుగులో అన్ని అక్షరాలు, గుణింతాలు అవసరమా? తెలుగు భాషని, లిపిని సూక్ష్మీకరించ గలమా? అలా సూక్ష్మీకరించ వలసిన అవసరం ఉందా? తెలుగు దేశపు సరిహద్దులో ఉన్న ప్రాంతాలలో ఎన్నవ తరగతి వరకు తెలుగుని నిర్భందంగా బోధించాలి? తెలుగులో మాట్లాడటానికి తెలుగు వారు ఎందుకు కించపడతారు? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వేసుకోవచ్చు. తెలుగుని అధికార భాషగా గుర్తించటానికీ, ఈ విస్తృతమైన ప్రశ్నలకీ మధ్య బాదరాయణ సంబంధం ఉంటే ఉండొచ్చు గాక; కాని, దగ్గర బంధుత్వం లేదు. ఈ కోణం నుండి చూస్తే రహంతుల్లా గారి పుస్తకం కొంత ఆశా భంగమే కలిగించింది. ఈ పుస్తకం లో సగానికి సగం వ్యాసాలు మకుటానికి సంబంధించినవి కావు. రచయిత తన సరదాకి రాసుకున్న వ్యాసాలన్నిటిని గుత్త గుచ్చి ఒక పుస్తకం ప్రచురించుకోవటంలో తప్పు లేదు. ఆయనకి తోచిన మకుటాన్ని ఎన్నుకోవటం లోనూ తప్పు లేదు. కాని ఈ చిల్లర మల్లర వ్యాసాల వల్ల అసలు విషయం మీద గురి నిలవలేదు. కాక పోతే, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో ఉన్న హిందీ పదాల ప్రసక్తి ఎందుకు ఈ పుస్తకంలో? ప్రముఖుల అభిప్రాయాలతో 21 పుటలు నింపవలసిన అవసరం ఏమిటి? దరిదాపు రెండు దశాబ్దాల వ్యవధిలో రాసిన వ్యాసాలని మరొక సారి పరీక్షించి, సందర్భ శుద్ధి లేని వాటిని తొలగించి, పోకడలో బిగిని పెంచి తిరగ రాసి ఉంటే పుస్తకం బాగా రాణించి ఉండేది.

నేను పుస్తకాన్ని ఇలా విమర్శించినప్పటికీ, రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలలో చాల వాటితో నేను ఏకిభవిస్తాను. ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు తమ తమ మాతృ భాషలలో కాకుండా క్రమానుగతంగా అరబ్బీ, లేటిన్‌, సంస్కృతాలలో ప్రార్ధనలు చెయ్యటం ఎందుకు? దేవుడికి ఆ మూడు భాషలలోనే అర్ధం అవుతుందా? అని ధ్వనిస్తూ ప్రశ్నించేరు రచయిత. నిజమే! కాదనను. కాని అదేమిటో, “ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతి చరామి” అంటేనే పెళ్ళినాటి ప్రమాణం లా ధ్వనిస్తుంది! ఇది నా బలహీనత అనుకొండి.

మొత్తానికి పుస్తకం బాగానే ఉందని ఒప్పుకు తీరాలి. పాత తరవాణినే కొత్త కుండలో పోస్తే పోసేరు కాని, డబ్బిచ్చి పుస్తకాలు కొని చదవటం అలవాటు లేని తెలుగు వాడు అతి సరసమయిన ధరకి దొరుకుతూన్న ఈ పుస్తకం కొని చదవచ్చు.


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...