ప్లూటో గ్రహచారం

అక్టోబర్ 2, 2014.

తెల్లారి లేచి పత్రిక విప్పి చూద్దును కదా! పాతిపెట్టేసిన ప్లూటో ప్రాణం పుంజుకుని పైకి లేవడానికి ప్రయత్నిస్తోంది. అదీ వార్త! మొన్న కాక మొన్న, అనగా 2006లో ప్లూటోని, నీ గ్రహచారం బాగోలేదు, నువ్వు గ్రహానివి కావు, ఫో! అని కసిరికొట్టి పొమ్మన్నారు అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సమితి (IAU) వారు. పిల్లల పుస్తకాలలోంచి ప్లూటోని పీకి పారేసేరు. ఇంక ప్లూటో గురించి ఎవరు చదువుతారులే అని నేను ఆరేళ్ళ క్రితం రాసిన ఈ దిగువ వ్యాసాన్ని చుట్ట చుట్టి, కట్ట కట్టి అటక మీద పారేసేను (తెలుగులో చెప్పాలంటే కంప్రెస్ చేసి ఆర్కయివ్స్‌లో పడేసేను.)

పట్టుమని పదేళ్ళు తిరగకుండా, నువ్వు పీలగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నువ్వు గ్రహానివి కాదనడానికి వారెవరు? అని హార్వర్డ్ స్మిత్‌సోనియన్ సెంటర్ తిరిగి ప్లూటోని, గ్రహాల జాబితాలో వేస్తాం, రా! అని పిలుస్తున్నారుట. ఇది వార్త కాదూ మరి? కట్ట కట్టిన చుట్టని విప్పి, దుమ్ము దులిపేను.

ఈ గొడవ అంతా ఎలా మొదలయిందంటే…


ప్లూటో అంటే పడి చస్తాను. సూర్యుడి చుట్టూ తిరిగే రకరకాల శాల్తీల పేర్లలో నాకు ప్లూటో అన్న పేరు ఎంతో ఇష్టం. ప్లూటో పేరు వినగానే సపోటాపండు గుర్తుకొస్తుంది నాకు. కార్టూను సినిమాలలో వచ్చే కుక్క ప్లూటో అన్నా నాకు ఇష్టమే.

ప్లూటో గ్రహచారం బాగు లేదు. దాని జాతకంలో ఏలినాటి శని ఉందో, కుజదోషం ఉందో, భూదోషం ఉందో తెలియదు కాని కష్టాలు పడ్డాది. రాజపూజ్యాలు రెండు, అవమానాలు ఆరు. ప్లూటో కష్టాలు నేను ఆర్చేవాడినీ కాదు, తీర్చే వాడినీ కాదు. ప్రపంచం అంతా కట్టకట్టుకుని ఎదురు తిరిగితే ఏటికి ఎదురీదకలనా?

ఎవ్వరి కంటా పడకుండా, ఎక్కడో వినువీధులలో తన మానాన తను తిరుగాడుతూ ఉంటే ఉచ్చు వేసి పట్టుకున్నారు. పట్టుకుని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టం కట్టేరు. పెట్టి, కట్టి, ఇప్పుడు కుక్కని కొట్టినట్లు కొట్టి సింహాసనం నుండి దింపి, ‘కార్టూను బొమ్మలలో కుక్క బతుకులాంటి బతుకు చాలు,’ అన్నారు. ఆకాశం నుండి, శంభుని శిరస్సు నుండి, శీతాద్రిశుశ్లోకంబైన హిమాద్రి నుండి పవనాంధోలోకముం జేరె అన్నట్లు ఉంది నా ప్లూటో పతనం!

అయ్యా, ప్లూటో పతనానికి కారణం ఇప్పటిది కాదు; పుట్టినప్పుడే దానికి అలా రాసి పెట్టి ఉంది. సా. శ. 1781లో శని గ్రహానికి అవతల మరో గ్రహం ఉందని హెర్‌షెల్ (William Herschel) కనుక్కున్నప్పుడు వార్తాపత్రికలలో అదొక పతాక శీర్షిక అయిపోయింది. అంతవరకు ఖగోళశాస్త్రవేత్తలకి తెలిసిన గ్రహాలు ఆరు మాత్రమే: బుధ, శుక్ర, భూ, కుజ, గురు, శని గ్రహాలు.

జాతకాలు రాసే జ్యోతిష శాస్త్రజ్ఞులు తొమ్మిది గ్రహాలు లెక్క పెడతారు. అవేమో బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని మాత్రమే కాకుండా సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు కూడ గ్రహాలే. ఈ లెక్కలో భూమి గ్రహం కాదు. ఏ అస్తిత్వం లేని రాహు కేతువులు గ్రహాలు. వీరి లెక్కలో సూర్యుడు (రవి) కూడా ఒక గ్రహమే! మన ఉపగ్రహమైన చంద్రుడూ ఒక గ్రహమే. మనం ఇక్కడ విచారించేది ఖగోళశాస్త్రం దృష్టితో కనుక ఇటుపైన జ్యోతిష శాస్త్ర ప్రస్తావన తీసుకురావలసిన అవసరం లేదు.

హెర్‌షెల్ కొత్తగా కనుక్కున్న గ్రహానికి యూరెనస్ (యురేనస్ కాదు, దీర్ఘం యు మీద, ర మీద కాదు అని కార్ల్ సేగన్ (సగాన్ కాదు) పదే పదే చెప్పేవాడు) అని పేరు పెట్టేరు. దీనికి మనవాళ్ళు వరుణుడు అని పేరు పెట్టేరు. ఈ వరుణుడి గ్రహపాటు బాగులేక కాబోలు ఈయనకి జాతక చక్రంలో చోటు దొరకలేదు.

యూరెనస్ ఉనికి మనకి తెలియని రోజులలో, భూమి మీద ఉన్న మనకి మన ఆకాశంలో కదలాడుతూ కనబడే నభోమూర్తులు ఎనిమిది. అవి పైన చెప్పిన ఆరు గ్రహాలతో పాటు సూర్యుడు (రవి), చంద్రుడు, వెరసి మొత్తం ఎనిమిది.


ఇంగ్లీషు లోను, తెలుగు లోను కూడా మన వారాల పేర్లు ఈ గ్రహాల పేర్లని అనుసరించే ఉంటాయి. రవివారం (సన్-డే, Sun-day), సోమవారం (మూన్-డే, Moon-day), బుధవారం, గురు వారం, శనివారం (శాటర్-డే, Satur-day), అన్న పేర్లలో ఈ పోలిక కొట్టొచ్చినట్లు కనబడుతుంది.

తెలుగులో కుజవారం లేదు. ఇంగ్లీషులో టూజ్‌డే (Tuesday) అన్నది కుజుడి పేరే. రోమనుల దేవగణాలలో మార్స్ (Mars) లేదా కుజుడికి ఉన్న స్థానమే జెర్మనీ వారి దేవగణాలలో టివ్ (Tiw) ఆక్రమిస్తాడు కనుక టివ్‌స్‌డే (Tiw’s day) లేదా టూస్‌డే (Tuesday) అన్న పేరు కుజుడి పేరే. మరి మన మంగళవారం ఏ గ్రహం నుండి ఎలా వచ్చిందో నాకు తెలియదు. తెలుగులోని శుక్రవారం ఇంగ్లీషులో ఉన్న ఫ్రైడేకి (Friday) సరిసమానం. శుక్ర గ్రహం అన్నా వీనస్ (Venus) గ్రహం అన్నా ఒకటే. (కాని, శుక్రుడు అన్నా వీనస్ అన్నా ఒకే దేవత కాదు!) పాశ్చాత్య దేశాలలో వీనస్ (Venus) ప్రేమకి చిహ్నం. నార్వే వంటి దేశాలలో ప్రేమ దేవుడి పేరు ఫ్రిగ్గా (Frigga); ఇందులోంచే ఫ్రైడే (Friday) వచ్చింది.

ఈ గొడవంతా ఎందుకు కాని, పూర్వం, ఖగోళశాస్త్రం పరిధిలో గ్రహాలు ఎన్ని? అని ఎవ్వరిని అడిగినా ఆరు అని ఠకీమని సమాధానం వచ్చేది. ఎందుకంటే హెర్‌షెల్ కాలం వరకు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఆరే ఆరు గ్రహాలు కంటికి కనిపించేవి. మన దృష్టికి ఆననంత దూరంలో మరో గ్రహం ఉందని చెప్పేసరికి అదొక నమ్మశక్యం కాని నిజం అయి కూర్చుంది.

ఆరుకి ఏమీ ప్రత్యేకత, పవిత్రత లేదని తెలిసిన తరువాత ఏడుకి మాత్రం ఎందుకు? అందుకని యూరెనస్ అవతల మరో గ్రహం ఉండొచ్చేమో అని అనుమానం వచ్చింది. ఆకాశంలో దుర్భిణితో వెతుకుతూ ఉంటే, సా. శ. 1801 జనవరి ఒకటో తేదీన, మరొక నభోమూర్తి కనిపించింది – కుజ గ్రహానికి, గురు గ్రహానికి మధ్య ఉన్న జాగాలో! దానికి సీరీస్ (Ceres) అని పేరు పెట్టేరు. మరి కొద్ది సంవత్సరాలలో సీరీస్ పేరు పాఠ్య పుస్తకాలలో నమోదు అయిపోయింది. అంతే కాదు. మరో రెండేళ్ళల్లో ఒక కొత్త రసాయన మూలకం ఉనికి కనుక్కున్నప్పుడు, తర్జనభర్జనలు లేకుండా ఆ మూలకానికి, సీరీస్ గౌరవార్థం సీరియం (Cerium) అని పేరు పెట్టేసేరు. రాజయోగం అంటే అలా ఉంటుంది.

సీరీస్‌ని కనుక్కున్న తరువాత సంవత్సరంలో మరొక ‘గ్రహం’ కనబడింది. ఈ తొమ్మిదో గ్రహానికి పాలస్ (Pallas) అని పేరు పెట్టేరు. సా. శ. 1803 లో మరొక కొత్త రసాయన మూలకం కనుగొన్నప్పుడు దానికి – ఇంకా ఆలోచన ఎందుకు – పేలస్ గౌరవార్థం పెలేడియం (Palladium) అని పేరు పెట్టేసేరు.

ఈ పాలస్ వెలిసిన వేళా విశేషం ఏమిటో కాని, ‘మారకం’తో పుట్టినట్లుంది. పైపెచ్చు దీని ‘గ్రహచార దోషం’ వల్ల సీరీస్‌కి కూడా మారకం తీసుకొచ్చింది. ఇదెలాగో చెబుతాను.

ఇంతవరకు గ్రహాలు, వాటి లక్షణాలు ఒక బాణీ ప్రకారం ఉంటూ వచ్చేయి కాని ఈ సీరీస్, పాలస్ వరస కొంచెం భిన్నంగా కనిపించింది. ఉదాహరణకి, గ్రహాలని దుర్భిణిలో చూసినప్పుడు గుండ్రంగా చిన్ని పళ్ళెం ఆకారంలో కనిపిస్తాయి (చంద్రుడు మన కంటికి కనిపించినట్టు). కాని ఈ సీరీస్, పాలస్ మినుకు మినుకు మంటూ నక్షత్రాల వలె చుక్కలుగా కనిపించేయి కాని, గ్రహాల మాదిరి పళ్ళేలలా కాదు. పోనీ ఇవి ఎంతో దూరంలో ఉండబట్టిన్నీ, మన దుర్భిణిలు మరీ శక్తిమంతం కానట్టివీను అవటం వల్ల చిన్నగా కనిపిస్తున్నాయనుకోటానికి వీలు లేదు. ఈ రెండూ కూడా భూమికి అతి సమీపంలో, కుజుడికీ గురుడుకీ మధ్య ఉన్నాయి. అంతే కాదు. ఇంతవరకు మన జాబితాలో ఉన్న గ్రహాల మధ్య దూరాలతో పోల్చి చూస్తే ఈ రెండు దరిదాపు ఒకే కక్ష్యలో ఉన్నంత దగ్గరగా ఉన్నాయి. ఈ వికారాలన్నిటిని చూసి పెద్దలు ఇవి గ్రహాలు కావు అని తీర్మానించేరు. (అప్పటికే అచ్చయిపోయిన పుస్తకాలు మళ్ళా అచ్చు కొట్టవలసి వచ్చిందేమో!) వీటికి ఇంగ్లీషులో ఆస్టరాయిడ్స్ (asteroids) అని పేరు పెట్టి, గ్రహాల జాబితాలోంచి తీసేసేరు. వాటి పేరు మీద ఉన్న రసాయన మూలకాల పేర్లు మాత్రం మారలేదు. బెజవాడ పేరు విజయవాడ అయినా బెజవాడ గోపాలరెడ్డి పేరు మారనట్లుగా అనుకొండి.

ఇక్కడ ఆస్టర్ (aster) అంటే గ్రీకు భాషలో నక్షత్రం, ఓయిడ్ (oid) అంటే లాంటిది అని అర్థం. కనుక ఆస్టరాయిడ్ అంటే నక్షత్రం లాంటిది అని అర్థం. కాని ఈ రెండు నక్షత్రాల లాంటివి కానే కావు; రాళ్ళ లాంటివి అంటే సరిపోయేది. కాని ఆస్టరాయిడ్ అన్న పేరు అతుక్కుపోయింది. కొంతమంది నాలాంటి చాదస్తులు అప్పుడూ ఉండేవారన్న మాట, వీటికి గ్రహశకలాలు (planetoids) అని పేరు పెట్టేరు. నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ కొత్త పేరు పెట్టి పిలుస్తున్నారు; ఇష్టం లేని వాళ్ళు తప్పు అయినా పాత పేరు పెట్టే పిలుస్తున్నారు. ఈ భాషాభిమానులూ, వీరాభిమానులూ, పరమ ఛాందసులూ ఉన్నారు చూశారూ, వాళ్ళు మేకపోతు మెడ కింద ఉన్న చన్నులు పట్టుకుని అలా చప్పరిస్తూనే ఉంటారు.


సా. శ. 1851 నాటికి మహాసాగరం లాంటి ఆకాశపు లోతుల్లోకి దుర్భిణి అనే గేలాన్ని వేసి వెతకగా, వెతకగా దరిదాపు ఇరవై పిల్లచేపల లాంటి గ్రహశకలాలు, పెద్ద సొర చేప లాంటి మరొక గ్రహం కనబడ్డాయి. ఈ సొర చేప పేరే నెప్టూన్ (Neptune). దుర్భిణి సహాయంతో ఆకాశం గాలిస్తే యూరెనస్ కక్ష్యకి అవతల నెప్టూన్ కనిపించింది. రోమను పురాణాలలో నెప్టూన్ సముద్రాలకి అధిపతి. అందుకని మనవాళ్ళు సగరుడు అని పేరు పెట్టేరు. ఈ నెప్టూన్ గౌరవార్థం మరొక రసాయన మూలకానికి నెప్టూనియం (Neptunium) అని పేరు పెట్టేరు. కావలిస్తే ఈ మూలకానికి మనం తెలుగులో సగరము (తగరముతో ప్రాస కుదిరింది కదా!) అని పేరు పెట్టుకోవచ్చు!

హమ్మయ్య. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యూరెనస్, నెప్టూన్ – మొత్తం ఎనిమిది గ్రహాలు అని అంతా ఊపిరి పీల్చుకుని, పిల్లల పాఠ్య పుస్తకాలలో ఈ ఎనిమిది గ్రహాల పేర్లూ వారాల పేర్లతో పాటూ, నెలల పేర్లతో పాటూ అచ్చు కొట్టించి పిల్లలచేత వల్లె వేయించేవారు. ఈ గ్రహాలు ఏ వరుస క్రమంలో ఉన్నాయో పిల్లలు గుర్తు పెట్టుకోవటానికి బాగుంటుందని ‘మార్తా విజిట్స్ ఎవిరీ మన్‌డే అండ్ జస్ట్ స్టేస్ అంటిల్ నూన్’ (Martha Visits Every Monday and Just Stays Until Noon) అనే ఇంగ్లీషు వాక్యాన్ని తయారు చేసి, దీనిని స్ఫోరకంగా (mnemonic) వాడుకోమన్నారు. అంటే, ఈ వాక్యంలో వచ్చే ప్రతి మాట మొదటి అక్షరం వరుసక్రమంలో ఉన్న గ్రహాల పేర్లకి గుర్తుగా వాడుకోమని అర్థం. ఇలాంటి స్పోరక వాక్యం తెలుగులో కూడ ఒకటుంటే బాగుంటుంది కానీ…

పుస్తకాల విక్రేతల గ్రహచారం బాగానే ఉంది కాని రోజుకో జాబితా బట్టీయం వెయ్యవలసి వచ్చేసరికి పిల్లల జాతకాలు బాగులేవేమో అని అనిపిస్తుంది. పిల్లల గ్రహపాటు ఇలా ఉండగా, ఫిబ్రవరి 18, 1930 నాడు ఆకాశపు లోతుల నుండి మరో గ్రహం ఊడి పిల్లల పుస్తకాల్లో పడింది. (బొమ్మ చూడండి.) గ్రహశకలాలలా కాకుండా ఈ కొత్త గ్రహం నెప్టూన్‌కి అవతల, ఇంకా చాలా దూరంలో, మినుకు మినుకు అంటూ దుర్భిణిలో కనబడింది. మిగిలిన ఎనిమిది గ్రహాలు సూర్యుడి చుట్టూ దరిదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటే ఈ కొత్త గ్రహం దీర్ఘవృత్తాకారంలో తిరుగుతోందని నిర్ధారణ చేసేరు. పైపెచ్చు ఈ కొత్త గ్రహం పరిభ్రమించే తలం, మిగిలిన గ్రహాలు అన్నీ పరిభ్రమిస్తూన్న తలంలో కాకుండా వాటన్నికి ఏటవాలుగా మరొక తలంలో ఉంది.


సౌర కుటుంబం (నాసా వెబ్‌సైట్ నుంచి.) (వివరం కోసం బొమ్మపై నొక్కండి.)

‘చుక్కలా కనిపిస్తూన్న ఇది గ్రహం కాదు, ఇది కూడా గ్రహశకలమే’ అన్నారు, కొందరు. కాని అప్పటికే గ్రహశకలం అన్న పేరు కుజ-గురు గ్రహాల మధ్య ఉండేవాటికే కేటాయించటం అయిపోయింది. కనుక దీనికి కొత్త పేరు పెట్టాలి, లేదా గ్రహశకలం అన్న పాత మాట నిర్వచనం మార్చాలి. ‘అది తోక చుక్కేమో’ అన్నారు కొందరు. ‘తోకచుక్కలో చుక్క అలుక్కుపోయినట్లు ఉంటుంది. ఈ చుక్క ఖణిగా ఉంది. పైపెచ్చు దీనికి తోక లేదు. కనుక తోక చుక్క అనటానికి వీలు లేదు’ అన్నారు మరికొందరు. ఇలా తుని తగవులా ఎటూ తేలకుండా ఉండిపోయింది దీని పరిస్థితి. ఏదో తేలే వరకు, అందాకా, దీనిని గ్రహం అనే నిర్ణయించి, ప్లూటో (Pluto) అని పిలవటం మొదలు పెట్టేరు. దీని గౌరవార్థం ఒక రసాయన మూలకానికి ప్లుటోనియం (Plutonium) అని పేరు కూడ పెట్టేసేరు. దూరదృష్టి కల తెలుగు వాళ్ళు దీనికి ఏ పేరూ పెట్టలేదు. సీరీస్‌కీ పేలస్‌కీ పట్టిన గతి దీనికి కూడా పట్టలేదని పిల్లలు సంతోషించేరు. మళ్ళా పాత పుస్తకాలు పారేసి కొత్త పుస్తకాలు అచ్చు కొట్టేరు. గ్రహాల పేర్లు జ్ఞాపకం పెట్టుకోటానికి వీలుగా, మై వెరీ ఎక్సలెంట్ మదర్ జస్ట్ సెర్వ్‌డ్ అజ్ నైన్ పీజాస్ (My Very Excellent Mother Just Served Us Nine Pizzas) అని కొత్త స్ఫోరక వాక్యం తయారు చేసేరు. కార్టూన్ బొమ్మలలో ఒక కుక్కకి కూడా ప్లూటో అని పేరు పెట్టుకున్నారు.


ఆధునిక విజ్ఞానశాస్త్రం అంటే – ఒక విధంగా – పేర్లు పెట్టటం; భావాలకి పేర్లు పెట్టటం. ఒకదానిని ఒక పేరు పెట్టి పిలుస్తున్నామంటే ఆ పేరు వెనక ఖచ్చితమైన భావం ఒకటి ఉంటుంది. కనుక మనం ‘గ్రహం’ అన్న పేరు వాడినప్పుడల్లా నాకు, మీకు, ప్రపంచం అంతటికీ ఒకే ఒక భావం స్పురించాలి; లేకపోతే నేను అనేది ఒకటి మీకు అర్థం అయేది మరొకటి. గ్రహం అన్న మాటనే తీసుకుందాం. తెలుగులో గ్రహం అనగానే నాకు రెండు అర్థాలు స్పురిస్తాయి. ఒకటి, సూర్యుడి చుట్టూ తిరిగే బుధ, శుక్రాదుల వంటి నభోగోళం. రెండవది భూత, ప్రేతాదుల వంటి అదృశ్య శాల్తీ. ఈ రెండవ అర్థం నా చిన్నతనంలో విన్నంతగా ఈ రోజుల్లో వినటం లేదు.

సూర్యుడి చుట్టూ తిరిగేవన్నీ గ్రహాలు కాదు. సీరీస్, పేలస్ వంటి గ్రహశకలాలకి గ్రహాల స్థాయి, అంతస్తు ఇవ్వలేము. అవి సూర్యుడి చుట్టూ తిరిగే నభోమూర్తులైనా అవి గ్రహాలు కావని తీర్మానించేరు. అవి కేవలం పెద్ద రాళ్ళు అన్నారు. గ్రహం అన్న మాటకి నిర్వచనం చెప్పటానికి బదులు గ్రహాలు ఏమిటో ఒక జాబితా చెప్పవచ్చు. అప్పుడు — బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, యూరెనస్, నెప్టూన్, ప్లూటో. ఈ తొమ్మిది గ్రహములనబడును — అని వ్యాకరణంలో సూత్రంలా చెప్పెయ్యవచ్చు.

ఈ రకం నిర్వచనాలతో ఒక చిక్కు ఉంది. ‘అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ – ఈ అయిదు దేశాలే అణుబాంబులు పేల్చవచ్చు, అణ్వస్త్రాలని తమతమ ఆయుధాగారాలలో నిల్వ చేసుకోవచ్చు.’ అని తీర్మానించి ఇవే అగ్ర దేశాలు, మిగిలినవి అన్నీ బడుగు దేశాలు అంటే మనం ఊరుకుంటున్నామా? నిర్వచనానికి అర్థం ఉండాలి, దాని వెనక తర్కం ఉండాలి.

ఉదాహరణకి ప్లూటో వంటి నభోమూర్తి మరొకటి ఉంటే దానిని కూడా గ్రహాల జాబితాలో చేర్చుకోమని అడగమా?

ఎక్కడో ఆకాశంలో ఉన్న గ్రహాల వరకు ఎందుకు? గుట్ట అని ఎప్పుడనాలి? కొండ అని ఎప్పుడనాలి? పర్వతం అని ఎప్పుడనాలి? సెలయేరు, ఏరు, నది – వీటి నిర్వచనాలు ఏమిటి? ఆస్ట్రేలియా దేశమా? ఖండమా? ఇవన్నీ నిర్వచనాలు లేకుండా సంప్రదాయానుసారంగా వాడుకునే మాటలే. కాని సంప్రదాయం అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉరుకోలేము కదా. ఉడుకు నెత్తురు ఉన్న తెలుగువాళ్ళు అస్సలు ఊరుకోలేరు.

కనుక అందరూ ఏది ఒప్పుకుంటే అదే గ్రహం. కాని అందరూ ఏదీ ఒప్పుకోరు కదా!

మరో కోణంతో చూద్దాం. గ్రహాలని వదిలేసి నక్షత్రాల సంగతి చూద్దాం. ఒరాయన్ (మృగవ్యాధుడు, Orion) రాశిలో ఉన్న ఆర్ద్రా నక్షత్రాన్ని ఇంగ్లీషులో బీటిల్‌జూస్ అంటారు. అంటే అరబ్బీలో ‘భారీ వ్యక్తి చంక’ అని అర్ధం. ఒరాయన్ అంటే వేటగాడు. ఈ నక్షత్రం ఆ వేటగాడి చంక దగ్గర ఉంది. దీనిని HD39801 అని కూడ పిలుస్తారు. అంటే హెన్రీ డ్రేపర్ (Henry Draper) అనే ఆసామీ రాసుకున్న జాబితాలో 39801వ నక్షత్రం. మరొకరి జాబితాలో దీని పేరు 2MASS J05551028+0724255. ఒకే నక్షత్రానికి ఇన్ని పేర్లు ఉన్నప్పుడు నభోమూర్తులని ఎవరికి తోచిన విధంగా వారు వర్గీకరించి, పేర్లు పెట్టి పిలిస్తే వచ్చిన నష్టం ఏమిటి?

వచ్చిన తంటా అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సమితి (IAU) వారితో వచ్చింది. ‘నక్షత్రాల ప్రసక్తి ఇప్పుడు అప్రస్తుతం కాని, ఏ గ్రహానికి ఏ పేరు పెట్టాలో, ఉపగ్రహాల పేర్లు ఎలా ఉండాలో, అసలు ఏవి గ్రహాలో, ఏవి కావో నిర్ణయించే బాధ్యత మాది,’ అన్నారు వీరు. అనటం అన్నారు కాని వీరికి ఎవ్వరూ పట్టం కట్టి ఆ హక్కు ఇవ్వలేదు; వారంతట వారే నియామకం చేసేసుకున్నారు. నిజానికి ఇప్పడు వాడుకలో ఉన్న గ్రహాలు వేటికీ వీరు పేరు పెట్టలేదు. కాని పెత్తనం అంకించుకున్నారు కనుక వేటికో కొన్నింటికి పేర్లు పెట్టాలి కదా. అందుకని బుధ గ్రహం మీద ఉన్న గోతులకి కవుల పేర్లు, కళాకారుల పేర్లు మాత్రమే పెట్టాలని వీరు తీర్మానించేరు. రంగారావుకి ఒక గొయ్యి, రామారావుకి ఒక గొయ్యి, సావిత్రికి మరొక గొయ్యి, శ్రీశ్రీకి ఇంకొక గొయ్యి – ఇలా కేటాయిస్తారు మనం దరఖాస్తు పడేసుకుంటే.

ఇంత గురుతర బాధ్యత తమ భుజస్కందాల మీద ఉన్నా ఆకాశంలో ఉన్న నభోమూర్తులలో వేటిని గ్రహాలు అనాలి, వేటికి ఆ మర్యాద దక్కకూడదు అన్న విషయాన్ని వీరెవరూ కూలంకషంగా ఆలోచించినట్లు లేదు. ప్లూటో ప్రసక్తి వచ్చే వరకు! అంతవరకు సందిగ్ధానికి అవకాశం రాలేదు.

ప్లూటో ప్రస్తావన వచ్చేసరికి, ఇది మరీ నాసిగా ఉంది, దీనిని గ్రహం అనటానికి వీల్లేదు, అని కమిటీలో ఒకరు అభ్యంతరం చెబితే, ఇది మరీ తోకచుక్కల మండలంలో ఉంది, దీనిని పోతరించిన తోకచుక్క అనాలి, అని మరొకరు. మిగిలిన ఎనిమిది గ్రహాలు ఒకే సమతలంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే ఇదొక్కటీ అదే తలంలో ఉండకుండా, ఏకాకిలా, మరొక తలంలో తిరుగుతున్నాది కనుక ఇది సూర్య మండలానికి చెందినది కానే కాదు, అని ఇంకొకరు. ఇలా అభ్యంతరాలు చెప్పటం మొదలు పెట్టేరు. ఈ చిన్న చిన్న విషయాలని విస్మరించి ప్లూటోని గ్రహం కింద లెక్క వేసుకుందామా అనుకుంటే, ప్లూటో కంటె వెంట్రుక వాసి చిన్నగా ఉన్న మరి కొన్ని నభోమూర్తులు ఉన్నాయి, వాటి మాటేమిటి? అన్నారు కొందరు సమతావాదులు.

భద్రతా సంఘంలో ఇండియాకి శాశ్వత సభ్యత్వం కావాలని మనం పోరాడుతూ ఉంటే, మిమ్మల్ని ఒక్కళ్ళనీ చేర్చుకుంటే సరిపోతుందా? బ్రెజిలు, జపాను, జెర్మనీ లని చేర్చుకోపోతే ఎలా? అనటం లేదూ. ఆఫ్రికాలో ఎవ్వరికీ సభ్యత్వం లేకపోతే ఎలా? ఇజ్రయెల్ దగ్గర బాంబు ఉంది కనుక వారిని కూడ చేర్చుకోవాలి కదా. ముస్లిం రాజ్యాలకి సభ్యత్వం లేకపోతే ఎలా? ఇదే విధంగా గ్రహాల జాబితాలో ప్లూటో సభ్యత్వానికి ఎన్నో సవాళ్ళు ఎదురయాయి. హోరాహోరీగా ప్రసంగాలు జరిగేయి.

వెధవది, ఎవ్వరికీ కనిపించని, ఒక రాతి గుట్ట గ్రహమా, కాదా అని ఇంతలా కొట్టుకోవటం ఎందుకని ఈ అంతర్జాతీయ సంస్థ 2006లో ఒక రోజు అర్ధరాత్రి ‘ప్లూటో గ్రహం కాదు, ఈ తీర్మానంతో ఏకీభవించలేని వెర్రివెధవాయిలంతా కట్టకట్టుని గోదావరిలో దూకండి,’ అని ఒక కాగితం ముక్క మీద ప్రకటన రాసేసి, మరో పదేళ్ళవరకు ఈ కమిటీ కలుసుకోదు అని చెప్పి చీకట్లోకి చల్లగా జారుకున్నారు.


రాజకీయాలని పక్కకి పెట్టి ప్లూటో గ్రహమా కాదా అని తేల్చాలంటే ముందస్తుగా గ్రహం అనే మాట అర్థం ఏమిటో మనందరికీ ఒక ఒప్పందం కుదరాలి.

ఎందుకైనా మంచిదని సూర్యరాయాంధ్ర నిఘంటువుని సంప్రదించి చూసేను. అక్కడ ఉన్న అనేకమైన అర్థాలలో ప్రస్తుతానికి పనికొచ్చేవి ఇవి: (1) సూర్యాది; (2) రాహువు; (3) రాహువు సూర్యచంద్రులను పట్టుట. అంటే ఈ నిఘంటువు ప్రకారం సూర్యుడు కూడ ఒక గ్రహం అనేది మొదటి అర్థం. ఇక్కడ మనం అవలంబిస్తూన్న శాస్త్రీయ పద్ధతి ప్రకారం సూర్యుడు గ్రహం కాదు. రెండవ అర్థం ప్రకారం రాహువు ఒక గ్రహం. కాని ఈ రాహువు ఆకాశవీధులలో దుర్భిణి వేసి వెతికినా కనబడడు. మూడవ అర్థం ప్రకారం గ్రహం అన్నా గ్రహణం పట్టటం అన్నా ఒకటే! ఆధునిక శాస్త్రం ప్రకారం ఇవేవీ ప్లానెట్ అనే భావాన్ని సూచించటమే లేదు కనుక సూర్యరాయాంధ్ర నిఘంటువు ఇప్పుడు, ఇక్కడ మన అవసరాలకి పనికిరాదని తేలిపోయింది.

దాశరథి నిఘంటువు చూసేను. అందులో గ్రహం అంటే, ఎ ప్లానెట్ లైక్ ద సన్, మార్స్, ఎట్‌సెటరా అని ఉంది. సూర్యుడిని ప్లానెట్ అంటే నవ్విపోవటమే కాదు నన్ను తన్నినా తంతారు. బ్రౌన్ నిఘంటువులో గ్రహం అంటే ప్లానెట్స్, సన్, అండ్ మూన్ అని ఉంది. ఈయన గ్రహాలని, ఉపగ్రహాలని, సూర్యుడిని, గుత్త గుచ్చి ఒకే మూసలో పోసేసేడు. గ్విన్ నిఘంటువులో మాత్రం గ్రహం అంటే ప్లానెట్ (planet) అని ఉంది. ఇదొక్కటే నాకు నచ్చిన అర్థం.

అంటే ఏమిటన్నమాట? పూర్వ కాలం నుండీ తెలుగులో గ్రహం అన్న మాటకి ఇతమిద్ధమైన అర్థం లేదు. సూర్యుడు, చంద్రుడు, రాహువు, బుధ, శుక్ర, కుజ, గురు, శని గ్రహాలు, భూత ప్రేతాదులు, … ఇవి గ్రహం అన్న మాటకి చలామణీలో ఉన్న అర్థాలు.

ఆధునిక ఖగోళశాస్త్రం దృష్ట్యా ఈ రకం నిర్లక్ష్యం పనికి రాదు; ఈ జాబితాలో ఉన్నవన్నీ గ్రహాలు అంటే శాస్త్రవేత్తలు ఒప్పుకోరు, నేను ఒప్పుకోను, ఎవ్వరూ ఒప్పుకోరు.

మనం వాడే ప్రతి మాటకి ఒక నిర్దిష్టమైన అర్థం ఉండటం అనేది ఆధునిక శాస్త్రం ఆయువుపట్టు. పేర్లు పెట్టటం ఎంత ముఖ్యమో, ఆ పేర్లు సూచించే శాల్తీలని వర్గాలుగా విడగొట్టటం కూడ అంతే ముఖ్యం. ఉదాహరణకి ప్రాణికోటిని జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం అని రెండు వర్గాలుగా విడగొట్టేరు. జంతువులని గాలిలో ఎగిరేవి, నేల మీద నడిచేవి, నీటిలో ఈదేవి, అంటూ విడగొట్టేరు. విడగొట్టినప్పుడల్లా ఆ జాతికి ఒక పేరు పెట్టాలి కదా. అందుకని వాయుచరాలు, భూచరాలు, జలచరాలు అని పేర్లు పెట్టేరు. ఒక కొత్త జంతువు తారసపడినప్పుడు అది ఏ జాతిలో ఇముడుతుందో చూస్తారు. ఎక్కడా ఇమడకపోతే కొత్తపేరు, కొత్త జాతి. ఉదాహరణకి గాలిలో ఎగిరేదీ, నీటిలో ఈదేదీ అయి, నేలని తాకకుండా ఉండే జంతువు ఉందనుకుందాం. దానికి ఏ పేరు పెట్టాలి? ఉభయచరం అన్న పేరు అప్పుడే మరొక రకం ప్రాణికి వాడుతున్నాం కనుక మరొక కొత్తపేరు పెట్టాలి. కదా?

ఇదే విధంగా సూర్య కుటుంబంలోని శాల్తీలని అధ్యయనం చేసినప్పుడు మొట్టమొదట ఆకాశంలో నగ్న నయనాలకి గురుడు, శని, శుక్రుడు, బుధుడు కనబడ్డారు. వాటిని పాశ్చాత్యులు ప్లానెట్ అని పేరు పెట్టి పిలచేరు, మనం గ్రహం అని పేరు పెట్టి పిలచేం. ఇంగ్లీషులో ప్లానెట్ అంటే సంచారి అని అర్ధం.

సూర్య చంద్రుల ప్రసక్తి వచ్చే సరికి మనవాళ్ళు అవి కూడ కూడ గ్రహాలే అన్నారు. వీరిద్దరు ఆకాశంలో సంచరిస్తూ కనపిస్తారు కనుక వీటిని కూడ ప్లానెట్ అన్న మాటతో పిలిస్తే తప్పేమిటి?

అలా కాదు. సూర్యుడు గ్రహరాజు. ఈ గ్రహరాజు చుట్టూ తిరిగేవే గ్రహాలు అని అనుకుందాం. ఈ లెక్కన భూమి చుట్టూ తిరిగే చంద్రుడు గ్రహం కాకూడదు.

కనుక ప్లానెట్ లేదా గ్రహం అన్న మాట సూర్యుడు చుట్టూ తిరిగే నభోమూర్తులకే వాడదాం అని ఒక ఒప్పందానికి వద్దాం.

ఇప్పుడు సీరీస్, పాలస్ అనే నభోమూర్తులు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి కనుక వాటిని గ్రహాలు అనొచ్చు. కాని కేవలం పెద్ద పెద్ద రాళ్ళ మాదిరి ఉన్న ఈ శాల్తీలని గ్రహాలు అంటే గురుడు, శని వంటి పెద్ద పెద్ద గ్రహాలని అవమానించినట్లే కదా? అంతే కాదు. ఈ రెండు నభోమూర్తుల కక్ష్యలూ దరిదాపు ఒక్కటే. ‘ఒకే కక్ష్యలో రెండు గ్రహాలు’ అన్న విపరీతం కని, విని ఎరగం. ఇందుమూలంగా సీరీస్, పాలస్‌లని గ్రహాల జాబితాలో వేస్తామంటే నవ్వి పోతారు.

గురుడితో పోల్చి చూస్తే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు చిన్న గోళీకాయలలా కనిపిస్తారు. అటువంటప్పుడు వీటిని మాత్రం గ్రహాల జాబితాలో ఎందుకు వెయ్యాలి? ఈ తర్కం ఉపయోగిస్తే గురుడు, శని, యూరెనస్, నెప్టూన్ పోతరించిన భారీ గ్రహాలు. అప్పుడు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు గిడసబారిన చిన్న గ్రహాలు. పెద్ద గ్రహాలు, చిన్న గ్రహాలు, అని రెండు వర్గాలు ఉన్నప్పుడు ప్లూటోని బుల్లి గ్రహం అనిన్నీ, సీరీస్‌నీ, పాలస్‌ని చిట్టి గ్రహం అనిన్నీ అనొచ్చు కదా.

ఈ దారిని వెళితే సీరీస్, పాలస్ లాంటివి వేల కొలదీ ఉన్నాయి. ఈ రాళ్ళని, చిళ్ళపెంకులని కూడా గ్రహాలననేస్తే ఎలా?

ప్లూటోని పోలిన మధ్య తరగతి బంతులు మరో పాతిక వరకు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకుంటే మన మంత్రివర్గంలా తయారవుతుంది: నలుగురు ముఖ్యమంత్రులు, నలుగురు ఉప ముఖ్యమంత్రులు, ఇరవై ఉపోప ముఖ్యమంత్రులు, మరో రెండు వందల చిల్లపెంకు ముఖ్యమంత్రులూను!


ఈ ప్రమాదాన్ని గుర్తించి గ్రహం అనబడటానికి రెండో లక్షణం ఉండాలన్నారు. సూర్యుడి చుట్టూ తిరిగినంత మాత్రాన అది గ్రహం అవదు, అది గుండ్రంగా కూడా ఉండాలన్నారు. ఈ రెండో నిబంధనతో రాళ్ళు, రప్పలు, చిల్లపెంకులు ఎన్ని సూర్య ప్రదక్షిణాలు చేసినా గ్రహాలు కాలేవు.

సూర్యుడి చుట్టూ తిరిగే రాళ్ళు ఎప్పుడు గుండ్రంగా ఉంటాయి? సీరీస్, పాలస్ కొండల్లాంటి పెద్ద రాళ్ళు. అవి గ్రహాలు కావు. ఇలాంటి కొండలు పదో, వందో కలిసి కొండల గుంపులా ఉందనుకుందాం. అవి గుంపుగా సూర్యుడి చుట్టూ తిరుగుతాయి తప్ప పెద్ద విశేషం ఏమీ ఉండదు. కాని ఈ గుంపులో వేల కొద్దీ కొండలు ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి పనిచెయ్యటం మొదలు పెట్టి ఈ కొండలని గట్టిగా దగ్గరకి లాగుతుంది. గురుత్వాకర్షణ బలానికి అవి చూర్ణం అయిపోయి లడ్డుండలా తయారవుతాయి. ఇప్పుడు ఆ చుట్టుపట్ల ఉన్న చిన్న చిన్న రాళ్ళు ఈ లడ్డుండకి వచ్చి అతుక్కుంటాయి. ఇలా కాలక్రమేణా లడ్డుండ గుండ్రటి ఆకారం పొందినప్పుడు ఆ నభోమూర్తిని గ్రహం అనొచ్చు. అంటే ఏమిటన్నమాట? గుండ్రంగా ఉండటం, భారీగా ఉండటం కవల లక్షణాలు.

‘అలా అయితే ప్లూటో గుండ్రంగానే ఉంటుంది. గత డెబ్భై ఏళ్ళ బట్టి ఇది గ్రహాల జాబితాలో ఏ ఆక్షేపణా లేకుండా ఉంది. ఇప్పుడు దానిని ఎందుకు గ్రహాల జాబితాలోంచి తీసేయ్యాలి?’ అంటూ ప్లూటో తరఫున వకాల్తా పుచ్చుకుని కొందరు వాదించేరు.

వచ్చిన గొడవ ఏమిటంటే — చెబుతాను, చదవండి. ఇటీవలి కాలం వరకు ప్లూటో సూర్య మండలానికి సరిహద్దు అనుకున్నారు. అంటే అటుపైన ఏమీ లేదు – నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరం వెళితే అక్కడ మరొక నక్షత్రం తగులుతుంది. కనుక ప్లూటో ప్రవర్తన కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ, ‘ఏదో పోనీలే, కడసారం’ అని ఊరుకున్నారు. ఇటీవల శక్తిమంతమైన దుర్భిణిలు వచ్చిన తరువాత ప్లూటోని పోలిన ‘గ్రహాలు’ ఒకదాని తరువాత మరొకటి చొప్పున కనిపించటం మొదలుపెట్టేయి. వీటిల్లో కొన్ని, ప్లూటో కంటె రవంత చిన్నవి, కొన్ని రవంత పెద్దవి. ఇంత దూరం నుండి చూసినప్పుడు ‘రవంత’ తేడా ఉన్నప్పుడు ఏది పెద్దదో, ఏది చిన్నదో నిశ్చయించటం కూడ కష్టం. ప్లూటోని పోలిన ఇలాంటి గ్రహాలు పాతిక వరకు కనబడ్డాయి. వీటిని కనుక్కున్న వ్యక్తులకి చీము, నెత్తురు ఉన్నాయి కదా. వాళ్ళకి కూడ సన్మానాలు చేయించుకోవటం అంటే ఉబలాటంగానే ఉంటుంది కదా. శ్రీశ్రీశ్రీ ఫలానా ఫలానా వ్యక్తి ఫలానా గ్రహాన్ని కనుక్కున్నాడు. ఆయన్ని కూడ మెచ్చుకుని మేకతోలు కప్పండి! అని అనిపించుకోవాలని ఎవ్వరికి ఉండదు?

ఈ సన్మానాల తొక్కిసలాటలో గ్రహాలు ఏ పాతికో, ముప్ఫయ్యో అయిపోతే – మళ్ళా పుస్తకాలు అచ్చు కొట్టాలి, పిల్లల చేత ఆ పేర్లన్నీ కంఠస్థం చేయించాలి. చాల తతంగం ఉంది. మొత్తం గ్రహాలు తొమ్మిది ఉంటే బాగుంటుంది. తొమ్మిదుంటే అప్పుడు మనం నవగ్రహాలు అన్నమాటని మార్చక్కరలేదు. అల్లుడు దశమగ్రహం అని ఉన్న చోటల్లా పుస్తకాలని తిరిగి ముద్రించనక్కర లేదు. అంటూ తెలుగువాళ్ళు – ఎప్పుడూ లేనిది – ముక్తకంఠంతో విన్నవించుకున్నారని ఒక గాలి వార్త విన్నాను కాని నేను నమ్మను.

అందుకనో, మరెందుకనో గ్రహాలు తలారి రాముడి సంతానంలా పెరిగిపోతే బాగులేదని ఒక లక్ష్మణరేఖ గియ్యాలన్నారు. ఎక్కడ? ప్లూటో తరువాత గీస్తే మిగిలిన పాతిక మంది ఒప్పం కాక ఒప్పం అన్నారు. ప్లూటో ముందు గీస్తే ఏడ్చుకునేది ఒక్కడే – ప్లూటోని కనుక్కున్న వ్యక్తి. వాడెప్పుడో చచ్చిపోయాడు. అందుకని కాబోలు, ప్లూటో తోకచుక్కల మండలం లోంచి వచ్చింది. అది తోక ఊడిపోయిన, బలిసిపోయిన, గుండ్రంగా ఉన్న తోకచుక్క తల! అంటూ మొండిగా వాదించి, ప్లూటో ముందు లక్ష్మణ రేఖ గీసి, ఇటుపైన ప్లూటో గ్రహం కాదు అని తీర్మానించేరు సా. శ. 2006 లో, అర్ధరాత్రి వేళ.

ఇప్పటికే పాఠ్య పుస్తకాలలో, విజ్ఞాన సర్వస్వాలలో, పిల్లల పరిహాస చిత్రాలలో, అంతర్జాలంలో, అన్ని చోట్లా ప్లూటో ఒక గ్రహం అనే భావన పాతుకు పోయింది. అర్ధరాత్రి వేళ అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సమితి ఎలా తీర్మానిస్తే నాకేమి? ప్లూటో ప్లూటోనే!

జై ప్లూటో!

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...