మన పేర్లు, ఇంటి పేర్లు

ప్రపంచం అంతా “ఎడ్డెం” అంటే “తెడ్డెం” అనే మనస్తత్వం ఈ అమెరికా వాళ్ళది. అలా అనుకుని ఊరుకున్నా పరవాలేదు; వాళ్ళ తెడ్డెమే ఒప్పు మిగిలిన ప్రపంచం అంతా తప్పు అని వాదించ గలిగే తత్వమూ, ఆర్థిక స్థోమతా ఉన్న మొండి ఘటాలు వీళ్ళు. “సిరి గల వానికి చెల్లును” అని ఉత్తనే అన్నాడా కవిసార్వభౌముడు? శ్రీనాథుడి ఇంటి పేరు ఏమిటి చెప్మా?

అమెరికా వాళ్ళ ఉప్పు తింటూ వాళ్ళ మీద ఇలాంటి విసురు విసర వలసి వచ్చినందుకు కించిత్తు చింతిస్తూ, కథావస్తువు ప్రారంభిస్తాను. అమెరికా విశ్వవిద్యాలయాలలో ప్రవేశార్హత కొరకు దరఖాస్తు పెట్టే సమయంలో మొట్టమొదటి సారి మన పేర్లలోనూ, ఇంటిపేర్లలోనూ ఉన్న ధర్మసూక్ష్మాల అంతు ఏమిటో తేల్చుకోవాలని నా తలకాయలోని బుర్రగుజ్జులో ఒక బుద్ధి పుట్టింది. ఎందుకేనా మంచిదని తెప్పించిన రెండు పుంజీల దరఖాస్తు పత్రాలని ముందేసుకుని, ఈశాన్య దిశవైపు తిరిగి (తూర్పు కంటె ఈశాన్యం మంచిదని మా నాన్నగారు చెప్పేరు లెండి) మొదటి దరఖాస్తు పత్రం విప్పి చూద్దును కదా, వాడు ” ఫస్ట్‌ నేమ్‌” ఏమిటి? “మిడిల్‌ నేమ్‌” ఏమిటి? “లాస్ట్‌ నేమ్‌” ఏమిటి? అని పుంఖానుపుంఖంగా ముత్యం మూడు ప్రశ్నలు అడిగేడు. ఆదిలోనే హంసపాదు. అడిగిన ప్రశ్న లోని భాష అర్థం అయింది కానీ ఆ మాటలలోని భావం పరిపూర్ణంగా వెల్లడి కాలేదు. అంటే, చిన్న అనుమానం వచ్చింది.

నేను బందరు హిందూ కాలేజిలో ఉన్నప్పుడు నా పేరుని వి. వి. రావు అని రాసుకునే వాడిని. అంటే వేమూరి “ఫస్ట్‌ నేము,” వేంకటేశ్వర “మిడిల్‌ నేము”, రావు “లాస్ట్‌ నేము” అని అన్వయం చెప్పుకోవాలేమో. ఈ సంగతి అలా ఉంచుదాం.

ఆ రోజుల్లోనే ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ప్రచురణ ప్రప్రధమంగా మొదలవడం, అందులో మాలతీ చందూర్‌ ప్రమదావనానికి విత్తు నాటి, నీళ్ళు పొయ్యడం జరిగింది. మాలతీ చందూర్‌ని అనుకరిస్తూ బందరులోనే నా పేరుని అమాంతం మార్చేస్తే కుర్రకుంకలు కమ్మలు కట్టేస్తారేమోనని జంకి, నేను కాకినాడ ఇంజనీరింగు కాలేజీలో చేరగానే, నా పేరుని వి. ఆర్‌. వేమూర్‌ అని రాయడానికి ధైర్యం చాలక, సాదాగా వి. ఆర్‌. వేమూరి అని మార్చేసుకుని రాసుకునేవాడిని. ఏమండి? ఇటువంటి పరిస్థితులలో ఈ  అమెరికా వాడు అమాంతం వచ్చి నీ మొదటి పేరేమిటి? నీ ఆఖరి పేరేమిటి? అని చొప్పదంటు ప్రశ్నలు వేసేసరికి నాకు ఒళ్ళు మండి, కళ్ళు తిరిగినంత పనయింది. అలాగని ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగ్గా సమాధానం రాయకపోతే సీటు ఇవ్వడేమోనని భయం.

ఈ చిక్కుని విప్పలేక, బిక్క మొహంతో ఆ దరఖాస్తు కాగితాన్ని పక్కకు పెట్టి, మరొక యూనివర్సిటీ వారు పంపిన కాగితాల కట్టని విప్పేను. వీడు కొంచెం నయం. వీడికి “గివెన్‌ నేమ్‌” కావాలిట. “గివెన్‌ నేమ్‌” అంటే పెట్టిన పేరు అని అర్థం కనుక మనకి బారసాల నాడు పెట్టిన పేరే ఈ “గివెన్‌ నేమ్‌” అని నేను తార్కికంగా ఆలోచించి తీర్మానించే లోగా, నాలాంటి వాళ్ళకి ఇలాంటి అనుమానాలొచ్చే ఆస్కారం ఉందని ఆ యూనివర్సిటీ వాడు ఊహించి ఉంటాడనుకుంటాను, ఆ పక్కని కుండలీకరణాలు వేసి, వాటి మధ్య “ఇక్కడ నీ క్రిష్టియన్‌ పేరు రాయునది” అని ఒక చిన్న సూచన చేసేడండీ. మనం క్రిష్టియన్స్‌ కాదాయిరి. ఇదేదో ఇప్పుడిప్పుడే తెమిలే విషయంలా లేదని, రెండో వరసలో ఏముందోనని చూసేను. ఇక్కడ “ఫేమిలీ నేమ్‌” ఏమిటి అని అడిగేడు. “ఫేమిలీ నేమ్‌” అంటే కుటుంబ నామం. అప్పుడు చూసుకున్నా. “ఇక్కడ నీ సర్‌నేమ్‌ రాయునది” అని వాడిచ్చిన సలహా. “సర్‌నేమ్‌” అంటే ఇంటిపేరు అని ఇంగ్లీషు వాడు చెప్పగా మనందరికీ తెలిసింది కదా! మనలో మన మాట. “సర్‌నేమ్‌”  అనే మాట ఎలా వచ్చిందో తెలుసా? లేటిన్‌ భాషలో “సర్‌” అంటే “ఊర్వ్ధ” అని కాని “కొసరు” అని కాని అర్థం చెప్పుకోవచ్చు. “సర్‌ప్లస్‌” అన్న మాటలో ఈ కొసరు అనే అర్థమే స్ఫురిస్తుంది. కనుక “సర్‌నేమ్‌” అన్న మాటకి “కొసరుపేరు” అన్నది సరి అయిన తెలుగుసేత.

ఇప్పటికి కొంత అర్థం అయింది. “గివెన్‌నేమ్‌” అన్నా, “క్రిష్టియన్‌నేమ్‌” అన్నా, బారసాల నాడు పెట్టిన పేరనిన్నీ, “ఫేమిలీ నేమ్‌” అంటే ఇంటిపేరనిన్నీ. కాని “ఫస్ట్‌ నేమ్‌” కీ “లాస్ట్‌ నేమ్‌”కీ మధ్యనున్న తేడా ఏమిటో తెలియలేదు. “ఫస్ట్‌నేమ్‌” అంటే మొదట రాసుకునే పేరు. “లాస్ట్‌ నేమ్‌” అంటే ఆఖరున రాసుకునే పేరు. మధ్యలో వచ్చేవన్ని “మిడిల్‌” నామాలు. అంటే మనం పేరు రాసుకునే వరసని బట్టి ఈ మూడు పేర్లు ఏవేమిటో నిర్ణయించ బడతాయి.

అసలు తెలుగు వారికి ఈ మూడు నామాలతో పాటు మరొక నామం కూడా ఉందని చాలా మందికి తెలియదు. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, త్రిపురనేని రామస్వామి చౌదరి మొదలయిన పేర్లలో పంతులు, రెడ్డి, చౌదరి అనేవి పట్టపు పేర్లు. ఇక్కడ గమనించవలసినది పంతులు అన్నది ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరులో లేదు; అది ప్రజలు గౌరవ సూచకంగా తగిలించేరు. మూడొంతులు చౌదరి కూడ ఈ కోవకి చెందినదే అయుంటుందని నా అనుమానం. ఒకానొకప్పుడు రెడ్డి అనే పట్టపు పేరుని కూడ ఇలాగే పెద్ద కాపులకి వాడేవారు. దరిమిలా ఒకరు పట్టం కట్టే వరకు ఆగడం ఎందుకని అందరూ పేరులో ఒక భాగంగా పెట్టేసుకుంటున్నారని నా సిద్ధాంతం.

ఇప్పటికి ఇంటి పేరు, మధ్య పేరు, పెట్టిన పేరు, పట్టపు పేరు అయేయి కనుక ఇంకేమి పేర్లుంటాయని అనుకునేరు. ఈ పేర్లన్నిటితో పాటు వేడుకపేర్లు అంటే “నిక్‌ నేమ్స్‌”, ముద్దుపేర్లు అంటే “పెట్‌ నేమ్స్‌” వగయిరా చాలా ఉన్నాయి. వీటికి మేష్టర్లని ఉడికించడానికి పెట్టే పేర్లు, ఆడ పిల్లలని ఉడికించడానికి మగపిల్లలు పెట్టే పేర్లు మొదలైనవన్నీ చెప్పడం లంకించుకున్నా నంటే ఇదొక ఉద్గ్రంధం అయిపోతుంది. కనక, ఆ విషయాలు మరొక చోట మరొక సారి ముచ్చటిద్దాం.

మన తెలుగు దేశపు సంప్రదాయం ప్రకారం ఇంటి పేరు పూర్వభాగం లోనూ, వ్యక్తివాచకం, అంటే పెట్టినపేరు, ఉత్తరభాగంలోనూ రాసుకోవడం సర్వసాధారణం. మిగిలిన భారతదేశపు ఆచారం తెలుగు దేశపు ఆచారానికి వ్యతిరేకం. చాలామంది పేరు ముందు, ఇంటిపేరు తర్వాత రాసుకుంటారు. ఇందిరా గాంధి, ఆవిడ కొడుకు రాజీవ్‌ గాంధి ఉదాహరణలు. ఇక్కడ ఇందిర, రాజీవ్‌ మొదలయిన మొదటి పేర్లు వ్యక్తి నామాలు. ఇంటిపేరయిన గాంధి ఆఖరిపేరు. కాని తెలుగుదేశంలో శ్రీరంగం సత్యనారాయణ మూర్తి అన్నప్పుడు ఇంటి పేరయిన శ్రీరంగం మొదటి పేరు అయింది. సత్యనారాయణమూర్తి అన్న పేరంతా ఒకే మాటలా రాసి, దానిని ఆఖరి పేరని తీర్మానించవచ్చు. లేదా, సత్యనారాయణ అన్న మాటని విడిగా రాసి, దానిని మధ్య నామంగా భావించి, మూర్తి అన్న మాటని ఆఖరి పేరుగా వాడుకోవచ్చు. ఈ విషయం ఇక్కడ ఎందుకు లేవనెత్తేనంటే, తెలుగులో సత్యనారాయణమూర్తి అన్న అక్షరాలని ఒకే ఒక మాటగా రాసే శాల్తీలే అదే పేరుని ఇంగ్లీషులో రాసినప్పుడు సత్యనారాయణ అన్న అక్షరాలని ఒక మాట గానూ, మూర్తి అన్న అక్షరాలని మరొక మాట గానూ విడి విడిగా రాసి, పైపెచ్చు మూర్తి అన్న మాటని పెద్ద బడిలోని అక్షరంతో మొదలు పెడతారు. అప్పుడు ఈ అమెరికా వాళ్ళ లెక్క ప్రకారం సత్యనారాయణ మధ్య పేరు, మూర్తి ఆఖరి పేరు అవుతాయి. ఈ సందర్భంలో ఈ శ్రీరంగం సత్యనారాయణమూర్తి అమెరికా వచ్చి ఉంటే శ్రీరంగం ఎస్‌. మూర్తి అవుతాడు.

ఇలా ఇంటిపేరు ముందు, తర్వాత పెద్దవాళ్ళు పెట్టిన పేరు రాసుకునే అలవాటు ఒక్క తెలుగు వాళ్ళకే ఉండి ఉంటే “ఇదో తెగులు” అని సరిపెట్టుకోవచ్చు. కాని తమాషా ఏమిటంటే ఇదే అలవాటు జపాన్‌లోను, చైనా లోనూ కూడా ఉంది. అసలు జపాను వాళ్ళు మనలాగే ముందు ఇంటి పేరు, తర్వాత పెట్టిన పేరు, తర్వాత “గారు”కి బదులు “సాన్‌” అని గౌరవ వాచకం తగిలించి వాడతారు. చైనాలో పద్ధతి దరిదాపు ఇదే. చైనా చరిత్ర చదివిన వారికి “సన్‌ యట్‌ సెన్‌” అన్న పేరు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఇందులో “సన్‌” అన్నది ఇంటిపేరు. “మావ్‌ జేడుంగ్‌”లో “మావ్‌” ఇంటిపేరు. “జో ఎన్‌లై”లో “జో” ఇంటిపేరు.

కాని పాశ్చాత్య సంప్రదాయపు సుడిగాలికి వీళ్ళు కూడ ఒంగి, లొంగిపోయి, పాశ్చాత్య పద్ధతి ప్రకారం పెట్టిన పేరు మొదట, ఇంటిపేరు చివర రాయడం ఈ మధ్యే మొదలు పెట్టేరు. కాని కల్చరు పేరు మీద కొట్టుకుచచ్చే మన తెలుగు వాళ్ళు అంత సులభంగా లొంగుతారా? హరి మీద గిరి పడ్డా, గిరి మీద హరి పడ్డా మనం మాత్రం వి. వి. రావ్‌, పీ. కే. మూర్తి, యన్‌. టీ. రామారావు అనే రాస్తాం తప్ప, మిగిలిన ప్రపంచపు అడుగుజాడల్లో నడవడానికి ఇష్టపడం. అసలు యన్‌. టీ. రామారావుని “యన్టీయార్‌” అన్నప్పుడున్న మజా తల్లకిందులుగా రామారావ్‌ టీ. నందమూరి అంటే వస్తుందా? తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు.

ఒకసారి ఒక మహానుభావుణ్ణి పేరడిగితే యస్‌. వీ. వర్లు అన్నాడు. “మహానుభావా, ఈ వెధవ జీవితమే ఒక ఎబ్రీవియేషన్‌ లా ఉందీ, ఆ యస్‌. వీ. అంటే ఏమిటో కొంచెం విశదీకరించి చెప్పవయ్యా” అని అడిగీసేను. ఆయన “వి అంటే వెంకటేస్‌ అండీ” అని కొంచెం కోపం గానే, కొట్టినట్లు రుసరుసలాడుతూ అన్నాడు. ఈయన గారు వెంకటేశ్వర్లు ని కత్తిరించేడు. పైపెచ్చు నన్ను తిట్టినంత పని చేసేడు. ఇలాంటి వారి చేత చివాట్లు తిని తిని ఈ నా చర్మం తోలులా అయిపోయిందేమో, “ఈ దూషణ భూషణంబులు శరీరమునకే కాని ఆత్మకు చెందనేరవు” అని మరొకసారి మననం చేసేసుకుని, తెగించి “మరి ఆ మొదటి యస్‌ అంటే ఏమిటండీ?” అని అడిగేను.

“నాకు మా ఇంటిపేరు చెప్పడం ఇష్టం ఉండదండీ” అన్నాడు ఆ ఆసామీ.

నా సామి రంగా! ఇంటిపేరుని ఇంత గోప్యంగా దాచవలసిన రాచ రహస్యం ఏమిటో? కొంతమంది తమ తమ ఇంటి పేర్లు శ్రవణరంజకంగా లేవనిన్నీ, అశ్లీలార్థకాలనిన్నీ, నైచ్యార్థకాలనిన్నీ భ్రమపడో, భయపడో చెప్పడానికి ఇష్టపడరు. బొక్కా, ముష్టి, ముట్లూరు, సూద్నగుంట మొదలైనవి ఈ జాతివి. అలాగని ఎన్నాళ్ళు ఇంటిపేరు చెప్పకుండా ఉండగలరు? అందుకని కొందరు ఇంటిపేరుని సాధుసభా సమ్మతంగా ఉండేటట్లు మార్చేసుకుంటారు. ఈ ధోరణిలోనే ముట్లూరు కాస్తా ముట్నూరు గా మారి ఉండవచ్చు. బొక్కా వారు భారతం వారుగా పరిణమించేరనుకుంటాను.

కనుక యస్‌. అన్న పొడి అక్షరం నాకు తెలియని ఏ ఇంటి పేరుని సూచిస్తుందా అన్న కుతూహలం నాలో పెరిగింది. నా కుతూహలాన్ని ఆపుకోలేక మెల్లిగా బుజ్జగించి అడిగేను. “లేదండీ, చెప్పను. ఇంటిపేరు చెబితే మా కేస్టు తెలిసిపోతుందండీ. అందుకని నాకు ఇష్టం ఉండదు”.

పేరుని బట్టీ, ఇంటి పేరుని బట్టీ కులం ఏమిటో, ఒకే కులంలో శాఖ ఏమిటో, గోత్రం ఏమిటో కూపీ లాగడం అంత తేలికయిన పని కాదు. పేర్లకి అయ్య, మూర్తి, రావు, స్వామి మొదలైన ప్రత్యయాలని (వీటినే పట్టపు పేర్లని అంటారని చెప్పేనుగా) చేర్చినప్పుడు పేరుని బట్టి ఏ కులమో చెప్పడం కష్టం. శాస్త్రి, శర్మ, రెడ్డి, చౌదరి, నాయుడు మొదలయిన ప్రత్యయాలని బట్టి కులం తెలుసుకోవచ్చు. కాని ఈ చిటకా అన్ని సందర్భాలలోనూ పని చెయ్యదు. రెడ్డిశాస్త్రి ఎవరు? పి. యల్‌. సంజీవరెడ్డి ఐ.ఎ.ఎస్‌. గారు రెడ్లు కాదు; కమ్మవారు. అలాగే కర్రా అన్న ఇంటి పేరు బ్రాహ్మణులలో ఉంది, మాల కులంలో ఉంది. కడియాల అనే ఇంటిపేరు కమ్మవారిలో ఉంది, బ్రాహ్మణులలో ఉంది. వేమూరి అనే ఇంటిపేరు బ్రాహ్మణులలో, కమ్మ వారిలో, హరిజనులలో ఉంది. గొర్తివారు కాపులలో ఉన్నారు, బ్రాహ్మణులలో ఉన్నారు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

ఇటువంటి నాలెడ్జి ఉండి కూడ ఏ రకం రికగ్నిషను లేకుండా రాటవుతున్న నేను, ఒక శాల్తీ ఇంటిపేరు చెప్పను గాక చెప్పనని మొరాయిస్తే, ఎలా ఊరుకోగలను? నాలోని సైంటిస్టు కుతూహలంతో కుతకుతలాడడు? లాడేడు.

దరిమిలా దర్యాప్తు చెయ్యగా యస్‌. అంటే సూరపనేని అని తెలిసింది. సూరపనేని, రామినేని, అక్కినేని, త్రిపురనేని మొదలైన “నేని” శబ్దంతో అంతమయే వన్నీ సర్వసాధారణంగా కమ్మవారి ఇంటిపేర్లు. అసలు ఈ “నేని” అన్న మాట “నాయుడు” అన్న మాటకి రూపాంతరం. ఈ “నాయుడు” అనేది “నాయకుడు” కి క్లుప్తరూపం. కనుక రామినేని అచ్యుతరావు అంటే రామినాయుడు అచ్యుతరావు అన్నమాటే కదా. అంటే, రామినాయుడు కొడుకు అచ్యుతరావా? ఇదే నిజమయితే తండ్రి పేరుని ఇంటిపేరుగా రాసుకునే తమిళ సంప్రదాయం మన తెలుగువారికి ఎలా సంక్రమించిందో? (ఇంటిపేరు ఉండవలసిన చోట తండ్రి పేరుని నిలపడం తమిళదేశంలో సర్వత్ర కాకపోయినా, విస్తారంగా ఉన్న సంప్రదాయం.)

ఇలా తండ్రిపేరుని వ్యక్తి వాచకాలకు తగిలించే పద్ధతిలో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఊళ్ళో ఊళ్ళో అయితే శ్రీనివాసన్‌ కొడుకు జయరామన్‌ అంటే పనిచేస్తుంది కాని, పొరుగూరు వెళితే ఆ శ్రీనివాసన్‌ ఎవరో అందరికీ తెలియక పోవచ్చు కనుక అంతగా ఉపయోగించదు. అప్పుడు పేరుతో పాటు స్వగ్రామం పేరు జోడించి లాల్‌గుడి జయరామన్‌ అని చెప్పడం ప్రచారంలోకి వచ్చి ఉంటుంది. తెనాలి రామకృష్ణ మరో ఉదాహరణ.

తమిళుల పద్ధతిలో ఇంకా చాల చిక్కులు ఉన్నాయి. తాత, తండ్రి, కొడుకు, మనుమడు లకు వివిధమైన ఇంటిపేర్లు ఉండడంతో ఇంటిపేర్ల ప్రయోజనానికే ముప్పు. అందుకని కొందరు తమిళులు తరాల మార్పుతో ఇంటిపేర్లని మార్చకుండా స్థిరపరచి వాడుతున్నారు. అంటే రామానుజన్‌ సంతతి వారంతా ఇటుపైన రామానుజన్‌లే. తండ్రి పేరుని పెట్టిన పేరుకి తగిలించి ఇంటిపేరుగా వాడడంలో మరొక ఇబ్బంది. శ్రీనివాసన్‌ రామానుజన్‌ అన్న పేరు విన్నప్పుడు అందులో ఇంటిపేరేదో, పెట్టిన పేరేదో చెప్పుకోవడం కష్టం.

ఈ తమిళ సంప్రదాయం మన పూర్వీకుల పేర్లలో కొంత కనిపిస్తుంది. నాచన సోమన, కాచన బసవన, కొమ్మయమంత్రి తిక్కడు మొదలయిన పేర్లలో ఇంటిపేరు చూస్తే వ్యక్తి నామంలా స్ఫురిస్తుంది. ఇలా ఇంటిపేరు ఉండవలసిన చోట ఇంటిపేరుతో పాటు తండ్రిపేరుని కూడా నిలపడం మరాఠీ సంప్రదాయం. ఈ ముద్ర తెలుగుదేశంలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఉదాహరణకి ఇందాకా చెప్పిన డాక్టర్‌ పి. యల్‌. సంజీవరెడ్డి పూర్తిపేరు పైడి లక్ష్మయ్య సంజీవరెడ్డి. ఇక్కడ పైడి ఇంటిపేరు, లక్ష్మయ్య తండ్రి పేరు.

ఇక తమిళ సోదరీమణుల పేర్లు పరికిద్దాం. మాలతీ రామచంద్రన్‌ అంటే రామచంద్రన్‌ కుమార్తె మాలతి అనేనా అనుకోవాలి, భార్య మాలతి అనేనా అనుకోవాలి. ఈవిడ డాక్టర్‌ అనుకోండి. అప్పుడు డాక్టర్‌ రామచంద్రన్‌ అంటే డాక్టరో, డాక్టరమ్మో గభీమని అర్థం కాదు. రామచంద్రన్‌ అన్న పేరు మగ పేరు కనుక డాక్టర్‌ రామచంద్రన్‌ అనగానే మగ వైద్యుడనే మనస్సుకి స్ఫురిస్తుంది.

ఇంటిపేరు, పెట్టినపేరు ఏ వరుసలో రాస్తే వచ్చే నష్టం ఏమిటోనని విచారిస్తూ కొంచెం దారి తప్పేం. నష్టమో, కష్టమో సోదాహరణంగా మనవి చేసుకుంటాను. చిత్తగించండి. ఆ మధ్య పనిమీద పొరుగూరు వెళ్ళేను. ఆ ఊళ్ళో నా చిరకాల మిత్రుడు పిల్లలమర్రి శివరామకృష్ణ ఉన్నాడు. ఉన్నాడన్న విషయం ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. టెలిఫోను నంబరు కావాలి. డైరక్టరీలో ఎక్కడని వెతకను? పిల్లలమర్రి లో  లేదు. శివరామకృష్ణ లో లేదు. రామకృష్ణ లో లేదు. మహానుభావుడు పేరుని కత్తిరించేడుట. శివ ఆర్‌. పీ. కృష్ణ అని వేయించేట్ట పుస్తకంలో. తర్వాత తెలిసింది. మొదటి నామధేయం శివ ట, కడపటి పేరు కృష్ణ ట. కూతురు పేరు రేఖ కృష్ణ ట. కొడుకు పేరు ప్రవీణ్‌ కృష్ణ ట. ఈ కత్తిరింపులు, సవరింపులలో పిల్లలమర్రి అన్న చిలక లాంటి ఇంటిపేరు, పంచాంగంలో తిథిలా, ఏష్యం అయి పోయింది.

పాశ్చాత్య సంప్రదాయంలో మిస్టర్‌, డాక్టర్‌, ప్రొఫెసర్‌ మొదలయిన బిరుదులు ఇంటిపేరుకి తగిలించి వాడతారు. నన్ను మిస్టర్‌ వేమూరి, డాక్టర్‌ వేమూరి, లేదా ప్రొఫెసర్‌ వేమూరి అనాలి కాని మిస్టర్‌ రావ్‌, లేదా ప్రొఫెసర్‌ రావ్‌ అని అనకూడదు. చనువుగా ఉన్న వాళ్ళయితే రావ్‌ అని కానీ, వేంకటేశ్వరరావు అని కానీ పిలుస్తారు. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయినప్పుడు ఆయనని న్యాయంగా ప్రెసిడెంట్‌ నీలం అనాలి. కాని ఎవ్వరూ అలా అనలేదు. అందరూ సంజీవరెడ్డి అనో, క్లుప్తంగా రెడ్డి అనో అనేసి ఊరుకున్నారు.

తెలుగు సంప్రదాయం ప్రకారం నేను నా పేరుని వేమూరి వేంకటేశ్వరరావు అని మనసులో అనుకొని, దానిని ఇంగ్లీషులోకి తర్జుమా చేసి, కుదించి, వీ. వీ. రావు అని రాసే సరికి హిందుస్థానీ వాళ్ళు కాని, పాశ్చాత్యులు కాని చూసి, రావు ఇంటిపేరని అనుకోవడం సహజం. అప్పుడు ఈ రావు భార్య ఉమా రావు, కొడుకు సునీల్‌ రావు అవుతారు. ఇలా తిరకాసు పడ్డ పేర్లే రాధా శర్మ, రేఖా రావు, మొదలైనవి. రాధా శర్మ అంటే రాధాకృష్ణ శర్మ పేరుని కత్తిరించేడని అనుకోవాలా? శర్మ గారి భార్య రాధ అనుకోవాలా?

తమాషా ఏమిటంటే ఇంగ్లండులో ప్రభుత్వం “సర్‌” అన్న బిరుదు ఇచ్చినప్పుడు ఆ “సర్‌” ని పెట్టిన పేరుకి తగిలిస్తారు కానీ ఇంటి పేరుకి తగిలించరు. ఉదాహరణకి “సర్‌ సీ. వీ.” అనాలి కాని, “సర్‌ రామన్‌” అనరు. “సర్‌ విన్‌స్టన్‌” అంటారు కానీ, “సర్‌ చర్చిల్‌” అనరు. ఇక్కడ రాసిన “సర్‌” కీ, “సర్‌ నేమ్‌”లో “సర్‌” కీ మధ్య బాదరాయణ సంబంధం మాత్రమే ఉంది; ఉచ్ఛారణలో పోలిక ఉన్నా, వర్ణక్రమంలో తేడా ఉంది.

మన పోకడ సంప్రదాయ విరుద్ధం అయేసరికి భాషాంతరీకరణ చేసేటప్పుడు చిక్కులు తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి, ఊరి పేరు ఇంటి పేరుగా మారడం బహుళ ప్రచారంలో ఉన్న ఆనవాయితీ అని మనందరికీ తెలుసు. మహమ్మద్‌ ఘజనీ, మహమ్మద్‌ ఘోరీ, జార్జి వాషింగ్‌టన్‌ మొదలయిన పేర్లలో మహమ్మద్‌, జార్జి మొదలైనవన్నీ పెట్టిన పేర్లు. ఘజనీ, ఘోరి, మొదలయినవి ఇంటిపేర్లుగా మారిన ఊళ్ళ పేర్లు. కాని మన తెలుగు వాళ్ళు ఈ పేర్లని తెలుగులో రాయవలసి వచ్చినప్పుడు ఘజనీ మహమ్మద్‌, ఘోరీ మహమ్మద్‌ అని తెలుగు సంప్రదాయంలో రాస్తారు. కాని అదే తెలుగు వాళ్ళు ఇంగ్లీషు పేర్ల దగ్గరికి వచ్చేసరికల్లా ప్లేటు ఫిరాయించి జార్జి వాషింగ్టన్‌, జాన్‌ కెన్నెడీ అన్ని అస్తవ్యస్తంగా రాస్తారు. వాషింగ్టన్‌ జార్జి అని రాయడం కనీ వినీ ఎరుగుదుమా?

పూర్వ కాలంలో ప్రజలకి పేర్లే ఉండేవి; ఇంటి పేర్లు ఉండేవి కావు. వ్యాసుల వారు, కృష్ణుడు, అర్జునుడు, అశోకుడు, శంకరాచార్యులవారు, మొదలయిన వారు ఈ కోవకి చెందుతారు. వేదాలని నాలుగు భాగాలుగా విడగొట్టి, వాటిని ఏ విధంగా పఠించాలో సూచించేరు కనుక వ్యాసుల వారిని వేదవ్యాసులు అన్నాం. శంకరాచార్యులు స్థాపించిన పీఠాధిపతులందరినీ శంకరాచార్యులు అనే పిలవడం మొదలు పెట్టేము కనుక మొట్టమొదటి శంకరాచార్యులవారిని ఆదిశంకరాచార్యులు అన్నాం. ఆ రోజులలో ఈ “వేద”, “ఆది” అన్న మాటలు గౌరవార్థకాలయిన విశేషణాలే కాని ఇంటిపేర్లుగా చెలామణీ అవలేదు.

క్రమేపీ పేరు ఒక్కటే వాడితే ఎవరు ఎవరో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయాయి. ఈ పరిస్థితి మన దేశానికేమీ ప్రత్యేకం కాదు. ఉదాహరణకి, నార్మనులు క్రీ. శ. 1066 లో దండెత్తి ఇంగ్లండుని ఆక్రమించిన తర్వాత అక్కడ ఇంటి పేర్ల వాడకం వ్యాప్తి లోకి వచ్చింది. ఉదాహరణకి, ఎలైజా అనే పేరింటిగత్తెలు ఎంతో మంది ఉండొచ్చు. ఫలానా ఎలైజాని గురించి ఎలా వాకబు చెయ్యడం? బద్ధకిష్టి ఎలైజా అనో, తినమరిగిన ఎలైజా అనో, పనిదొంగ ఎలైజా అనో చెప్పాలి కదా. కనుక ఇంగ్లీషులో “ఎలైజా డు లిటిల్‌” అని అని ఉంటారు. అదే క్రమేపీ ఎలైజా డులిటిల్‌గా మారింది.

ఇలాగే విలియమ్‌ అనే ఆసామి కొడుకు జాన్‌ ఉన్నాడనుకుందాం. వాడు మన ఎలైజాలా బద్ధకిష్టి బడుద్ధాయి కాడు. అటువంటప్పుడు వాడిని “విలియమ్‌ కొడుకు జాన్‌” అని పిలవచ్చు. ఇంగ్లీషు భాషా సంప్రదాయం ప్రకారం, ఈ విషయాన్ని “జాన్‌, విలియమ్స్‌ సన్‌” అని అనొచ్చు. అదే “జాన్‌ విలియమ్‌సన్‌” గానూ, తర్వాత “జాన్‌ విలియమ్స్‌” గానూ మారి ఉంటుంది.

వృత్తి పేరుని ఇంటిపేరుగా వాడే అలవాటు చాల దేశాలలో ఉంది. చాకలి సోమయ్య, మంగలి వెంకన్న మొదలయిన మాటలు వాడుకలో ఉన్నా తెలుగుదేశంలో ఈ పద్ధతి అంత ఎక్కువగా లేదు. ఉత్తర భారతదేశం లోనూ, పాశ్చాత్య దేశాలలోనూ ఇది విరివిగా వాడే పద్ధతే. ఇంగ్లీషులో స్మిత్‌, బ్లేక్‌స్మిత్‌, గోల్డ్‌స్మిత్‌, టేలర్‌, రైట్‌ మొదలయినవి ఇటువంటి పేర్లే. బ్లేక్‌స్మిత్‌ అంటే కమ్మరి. గోల్డ్‌స్మిత్‌ అంటే కంసాలి. టేలర్‌ అంటే దర్జీ. రైట్‌ అంటే యంత్రాలతో పనిచేసే మనిషి; లేదా మెకానిక్‌. మన పార్సీలలో ఈ రకం పేర్లు ఇంజనీర్‌, కంట్రాక్టర్‌ మొదలయినవి విరివిగా కనిపిస్తాయి. మహారాష్ట్రులలో కూడ ఈ రకం పేర్లు ఎక్కువే. కర్మర్కర్‌, కరండికర్‌, మొదలయినవి.

నివసించే స్థలాన్ని ఇంటిపేరుగా వాడడం చాల చోట్ల ఉంది. ఈ స్థలం ఊరు పేరేనా కావచ్చు. మరొకటేదయినా కావచ్చు. ఇంగ్లీషులో పుంత పక్కని ఉన్న ఇంట్లో ఉన్నవాడిని “ఉడ్‌” అనీ మైదానానికి ఎదురుగా ఉన్న వాడిని “గ్రీన్‌” అనీ అనుంటారు. మన జవాహర్‌లాల్‌ నెహ్రూ అసలు ఇంటి పేరు కౌల్‌. కాశ్మీర్‌లో కాలవ పక్క ఇంట్లో ఉండి ఉంటారు. అందుకని కౌల్‌ కాస్తా “నహర్‌” గాను, అదే “నెహ్రూ” గానూ మారేయి.

అయ్యా, ఇలా కాశీ మజిలీ కథలా చెప్పుకుంటూ పోగలను కానీ సంపాదకుడు, “పోవయ్యా, చెప్పేవాడికి ఓపిక ఉన్నా చదివే వాడికి ఓపిక ఉండొద్దూ” అని చెప్పు దెబ్బలు కొట్టేలోగా తెర చాటుకి జారుకోవడం విజ్ఞుల లక్షణం అని ఎంచి….


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...