గ్రీకు పురాణ గాథలు 7

కసాండ్రా (Cassandra) కథ

కసాండ్రా గ్రీసు దేశపు పురాణ గాథలలో వచ్చే శాపగ్రస్తురాలైన ఒక వ్యక్తి. భవిష్యత్తులో ఏమి జరగబోతోందో చెప్పగలిగే శక్తి ఉన్న వ్యక్తి ఈమె, ఈ శక్తిని ఈమె అపాలో (Apollo) దగ్గర నేర్చుకుంది. కానీ అపాలో ఇచ్చిన శాపం వల్ల ఈమె మాటని ఎవ్వరూ నమ్మరు. అదెంత ప్రమాదానికి దారితీసిందో ఈ కథలో చూద్దాం.

కసాండ్రా గ్రీసు దేశపు పురాణ గాథలలో వచ్చే ట్రాయ్ నగరపు రాకుమారి. ఈ ఉదంతం ట్రాయ్ సంగ్రామం జరగడానికి ముందు జరిగిన కథ. కసాండ్రా ట్రాయ్ నగరాన్ని పాలిస్తున్న రాజు ప్రియమ్‍కీ (Priam) రాణి హెకూబాకీ (Hecuba) పుట్టిన కవల పిల్లలలో ఆడపిల్ల; ఈమె కవల అన్నదమ్ముడు హెలెనస్ (Helenus). నల్లటి కురులు, కలువ రేకుల లాంటి కళ్ళతో ఎంతో అందంగా ఉండేదని పేరు! అందమైన అమ్మాయిల కోసం అదేపనిగా వేటలో ఉన్న (దరిదాపు ఒలింపియా కొండ మీద ఉన్న దేవతలంతా చేసేపని ఈ రకం వేటే!) అపాలో దృష్టి కసాండ్రా మీద పడింది. ప్రేమలో పడ్డాడు. వెంటపడ్డాడు. ప్రేమలో పడ్డ దేవతలని నిరాకరించే మనుష్యులు ఉంటారా? కానీ అదేమి విడ్డూరమో అపాలో అవస్థని చూసి కసాండ్రా నవ్వుకుంది; అతని ప్రేమని నిరాకరించింది.

కసాండ్రా మనస్సుని ఎలాగో ఒకలాగ గెలవాలనే తపనతో ఆమెకి అపూర్వమైన కానుకని ఇవ్వడానికి ప్రయత్నించేడు అపాలో. అన్నీ ఉన్న రాకుమారికి తను కొత్తగా ఏమి ఇవ్వగలడు? ఆమెకి అందం ఉంది. ఐశ్వర్యం ఉంది. కాని ఆమెకి లేనిది, తన దగ్గర ఉన్నది ఒకటి ఉంది. అది దివ్యదృష్టి. భవిష్యత్తులోకి చూడగలిగే శక్తి. ఇంత ఆసక్తికరమైన ప్రేమబహుమానం ఎదురైనప్పుడు కసాండ్రా కాదనలేకపోయింది. ప్రతిఫలం మీద ఆశతో అపాలోతో ‘వీపు గోకుడు బేరానికి’ కస్సాండ్రా ఒప్పుకుంది. తన వంతుగా అపాలో దివ్యదృష్టి ఇచ్చే మంత్రాన్ని కసాండ్రాకి ఉపదేశించేడు. మంత్రం నేర్చుకున్న తరువాత అపాలోకి ముట్టవలసిన ‘పారితోషికం’ ఇవ్వకుండా ఎగ్గొట్టింది; అపాలో ఎగబడుతూ చేస్తూన్న పురోగమనాలని కసాండ్రా నిరాకరించింది.

ఆత్మాభిమానం దెబ్బతిన్న అపాలో ఉగ్రుడయాడు. తను కసాండ్రాకి నేర్పిన మంత్రాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేడు! తను చెయ్యగలిగిందల్లా ఆ మంత్రం వల్ల కసాండ్రాకి లాభం లేకుండా చెయ్యడం. అందుకని ‘నువ్వు దివ్యదృష్టితో చూసి చెప్పగలిగే జోస్యాన్ని ఎవ్వరూ నమ్మరు’ అని శపించేడు. చెయ్యగలిగేది ఏమీ లేక కసాండ్రా తను నేర్చుకున్న దివ్యదృష్టి మంత్రాన్ని తన కవల అన్నదమ్ముడు హెలెనస్‌కి ఉపదేశించింది. (కచ-దేవయాని కథ ఇలాగే నడుస్తుంది!)

కసాండ్రా చాలా సందర్భాలలో జోస్యం చెప్పింది; కాని ఎవ్వరూ నమ్మలేదు. అదే విషయాన్ని హెలెనస్ చెబితే నమ్మేవారు! ఒకసారి కసాండ్రా తన దివ్యదృష్టితో చూసి పేరిస్ ‘తప్పిపోయిన’ తన అన్నదమ్ముడే అని గుర్తించింది. పేరిస్ స్పార్టా రాణీ హెలెన్‌ని దొంగిలించి వివాహం చేసుకుని ట్రాయ్ తీసుకు వస్తాడనిన్నీ, ఆ సంఘటన ట్రాయ్ నగరపు విధ్వంసానికి కారణభూతం అవుతుందనిన్నీ, కనుక పేరిస్‌ని స్పార్టా వెళ్ళవద్దని బ్రతిమాలుతుంది. ఎవ్వరూ వినిపించుకోరు. ట్రాయ్ నగరం మీదకి దండెత్తి వచ్చే గ్రీసు దేశపు సేనాధిపతి అగమెమ్నాన్ యుద్ధంలో చనిపోతాడని జోస్యం చెబుతుంది. ఎవ్వరూ పట్టించుకోరు. తను కూడా ఆ యుద్ధంలో చచ్చిపోతానని చెబుతుంది. అంతా ‘పిచ్చి వాగుడు’ అని పెడచెవిని పెడతారు. చిట్టచివరికి గ్రీకులు రణరంగంలో వదలిపెట్టి వెళ్ళిన కర్రగుర్రం ప్రమాదానికి దారి తీస్తుంది, దానిని లోపలికి తీసుకురావద్దని కసాండ్రా హెచ్చరిస్తే ఎవ్వరూ వినరు.

ఈ రోజుల్లో అయితే కసాండ్రా లాంటి వ్యక్తిని ‘శకున పక్షి’ అని గేలిచేసి ఉండేవారు. మనకి అవగాహనలో లేని ఏదైనా శక్తివంతమైన ప్రభావం వల్ల మనకి ఏదో కీడు కలగబోతోందని జోస్యం చెప్పేమనుకోండి. ఉదాహరణకి ‘పర్యావరణం వెచ్చబడడం వల్ల పల్లపు ప్రాంతాలు ముంపుకి గురవుతాయి’ అని ఒక శాస్త్రవేత్త జోస్యం చెప్పేడనుకోండి. మనకి వెంటనే నమ్మబుద్ది కాదు. రాబోయే ప్రమాదం నుండి తప్పించుకుందికి కానీ, ఆ ప్రమాదం వల్ల కలిగే హానిని తగ్గించడానికి కానీ వ్యయ ప్రయాసలు, కాలయాపన కావచ్చు. మన రాజకీయ నాయకులకి రాబోయే ఎన్నికల మీద ఉన్న దృష్టి ఎప్పుడో పాతిక సంవత్సరాల తరువాత రాబోయే ముంపు మీద ఉండదు. ఇటువంటి సందర్భాలలో శాస్త్రవేత్తలు చెప్పే జోస్యానికి కసాండ్రా చెప్పిన జోస్యానికి పట్టిన గతే పడుతుంది.*

క్రీసస్ ఉదంతం

ద్వాదశ ఒలింపియను దేవతలలో అపాలో ఒకడు. అతనికి వచ్చిన అనేక విద్యలలో దివ్యదృష్టి ఒకటి; అతను భవిష్యత్తులోకి చూసి ఏమి జరగబోతోందో చెప్పగల సమర్థుడు. ఒలింపియను దేవతలలో చాలమందికి ఈ రకం దివ్యదృష్టి ఉంది కానీ ఒక్క అపాలో మాత్రమే ఈ విద్యని మానవులతో పంచుకోడానికి సుముఖత చూపేవాడు. ఇందుకని అపాలో అనేక మందిరాలు స్థాపించి, ప్రతి మందిరంలోనూ ఒరాకిల్ (Oracle) అనే ఒక దివ్యవాణిని ప్రతిష్ఠ చేసేడు. ఒరాకిల్ అంటే సర్వజ్ఞుడు, ద్రష్ట, ప్రవక్త అనే అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ ఒరాకిల్ అనేది ఒకరి ఒంటి మీదికి ఆవహించి వారి నోట పలికే భవిష్యవాణి. మన దేశంలోనూ గణాచారుల ఒంటి మీదికి అమ్మవారు రావడం (పూనకం రావడం), ఏదైనా చెప్పడం ఉన్నాయి. ఇప్పటికీ సమ్మక్క జాతరలో ఇలా అమ్మవారు ఒంటి మీదకు వచ్చి ప్రజలకు సందేశం ఇవ్వడం జరుగుతూనే ఉంది. అపాలో స్థాపించిన ఇటువంటి మందిరాలలో డెల్ఫైలో (Delphi) ఉన్న మందిరం ప్రసిద్ధి చెందినది. ఈ డెల్ఫై మందిరంలో ఉన్న గణాచారిణి పేరు పైథియా (Pythea). పెద్దలు, పిన్నలు, రాజులు, పేదలు, ఇలా అనేక మంది డెల్ఫైకి వచ్చి వాళ్ళకి భవిష్యత్తులో ఏమి ‘రాసిపెట్టి ఉందో’ చెప్పమని దివ్యవాణిని అర్థించడం, దివ్యవాణి వారి కోరికని పిథియా వాక్కు ద్వారా మన్నించడం జరుగుతూనే ఉంటుంది.

ఇలా డెల్ఫైలో ఉన్న ఒరాకిల్‍ని సంప్రదించడానికి వచ్చిన వారిలో సాక్షాత్తూ లిడియా దేశపు రాజు క్రీసస్ (Croesus) ఒకడు. హిరాడటస్ (Herodotus) రాసిన చరిత్ర ప్రకారం లిడియా రాజ్యాన్ని క్రీసస్ 14 సంవత్సరాలు పరిపాలించేడు (సుమారు సా. శ. పూ. 595 నుండి 546 వరకు). అనగా క్రీసస్ నిజంగా చరిత్రలో ఒక మానవుడు. క్రీసస్ అత్యంత ధనవంతుడు. అతను ఎంత ధనవంతుడంటే ఇప్పటికీ ‘వాడు క్రీసస్ అంత ధనవంతుడు’ అనే నానుడి పాశ్చాత్య భాషలలో ఉంది.

క్రీసస్ అంత ధనవంతుడు అవడానికి రెండు కారణాలు ఉండే సావకాశం ఉంది. లిడియా రాజ్యానికి ముఖ్యపట్టణం అయిన సార్డిస్ గుండా పాక్టోలస్ (Pactolus) అనే నది ప్రవహిస్తోంది. ఆ నదీ గర్భంలో ఉన్న ఒండ్రుమట్టిలో వెండి, బంగారం కలిసిన మిశ్రమ లోహం దొరుకుతుంది. రాజు మైడస్ (Midas) ఈ పాక్టోలస్‌లో స్నానంచేసి తాను పట్టిందల్లా బంగారంగా మారుతున్న ‘వరం’ నుండి విముక్తి పొందేడు అనే ఒక కథ ఉంది. అదే ఈ బంగారానికి కారణం అంటారు. నిజానికి క్రీసస్ అంత ధనవంతుడు అవడానికి అతని సామంతులు కట్టే కప్పాలు కూడా కారణం కావచ్చు.

క్రీసస్ తనకున్న ఐశ్వర్యంతో తృప్తి పొందలేదు. ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో కానీ పశ్చిమ ఆసియాలో ఏకఛత్రాధిపత్యంతో అలరారుతున్న పారశీక సామ్రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని తన వశం చేసుకోవాలనే బుద్ధి అతని పుర్రెలో పుట్టింది. ఈ రోజుల్లో అమెరికా ఎలాంటిదో ఆ రోజుల్లో సైరస్ (Cyrus, the Great) చక్రవర్తి పరిపాలనలో ఉన్న పారశీక సామ్రాజ్యం అంత శక్తిమంతమైన దేశం!

బుద్ధి పుట్టడం పుట్టింది కానీ క్రీసస్ మనస్సు పీకుతోంది. యుద్ధం ముగిసే వరకు పర్యవసానం ఎలా ఉంటుందో తెలియదు కదా. అందుకని డెల్ఫైలో ఉన్న ఒరాకిల్‍ని అడిగి తెలుసుకురమ్మని కానుకలు ఇచ్చి ప్రత్యేక ప్రతినిధిని పంపేడు. క్రీసస్ డెల్ఫైలో ఉన్న ఒరాకిల్‍కి ఇచ్చిన కానుకలు ఆ ఆలయంలో హెరాడొటస్ కాలం వరకు ఉన్నాయిట! క్రీసస్ తరఫున రాయబారులు డెల్ఫైలో ఉన్న ఒరాకిల్‍ని అడిగిన ప్రశ్న: పారశీక దేశం మీదకి క్రీసస్ దండయాత్ర జరిపితే పర్యవసానం ఎలా ఉంటుంది?

ఈ ప్రశ్నకి సమాధానంగా పిథియా ద్వారా ఒరాకిల్ ఇచ్చిన సమాధానం: క్రీసస్ ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాడు.

‘దేవుడు మన పక్షం. దండయాత్రకు సంసిద్ధం అవండి!’ అని క్రీసస్ ఆజ్ఞ జారీ చేసేడు. క్రీసస్ సేనావాహిని గట్లు తెంచుకుని పెల్లుబికి ప్రవహించిన నదిలా ఒక్కుమ్మడిగా పారశీక సామ్రాజ్యం మీద విరుచుకుపడింది. పారశీక చక్రవర్తి సైరస్ సైన్యం క్రీసస్‌ని చిత్తుచిత్తుగా ఓడించి క్రీసస్‌ని బందీగా తీసుకుపోయింది. చిట్టచివరికి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన సైరస్ కొలువులో క్రీసస్ చిన్న గుమస్తా ఉద్యోగం చేస్తూ శేష జీవితం గడిపేడు.

తనని ఈ విధంగా ఓరకిల్ పచ్చి మోసం చేస్తుందని క్రీసస్ కలలో కూడా అనుకోలేదు. ఓరకిల్‌ని ఊరకనే సలహా ఇమ్మని అడగలేదు. బిళ్ళకుడుములులా పారితోషికం (లంచం) సమర్పించుకున్నాడు కదా! పట్టపగలు బహిరంగంగా ఇంత పచ్చి మోసమా? మునుపటిలా ఇప్పుడు ఆస్తులు, అంతస్తులు లేవు. అయినా ఉన్న దాంట్లో కాసింత గోకి గోకి చిన్న పారితోషికంతో తోటి గుమస్తాని పంపేడు – జరిగిన అన్యాయానికి కారణం ఏమిటో తెలుసుకు రమ్మని.

తాను రాసిన హిస్టరీ అనే గ్రంథంలో హిరాడొటస్ జరిగిన అన్యాయానికి కారణం ఈ విధంగా చెబుతాడు: డెల్ఫైలో ఉన్న ఒరాకిల్ చెప్పిన జోస్యం ప్రకారం క్రీసస్ పారశీక దేశం మీద దండయాత్ర చేస్తే ఒక మహా సామ్రాజ్యం సర్వనాశనం అయిపోవాలి. ఆ నాశనం అయిపోబోయే సామ్రాజ్యం ఎవరిది? తనదా? శత్రువుదా? అని అడగవలసిన కనీసపు బాధ్యత క్రీసస్‌ది. అధికారంలో ఉన్న పాలకులకి సలహాదారులు సలహాలు ఇచ్చినప్పుడు, ఆ సలహా అమలుపరచితే పర్యవసానం ఎలా ఉంటుంది? అని అడగకుండా ‘లేడికి లేచిందే పయనం’ అన్న రీతిలో రాజ్యం ఏలితే ఇలానే ఉంటుంది. ఇది స్వయంకృతాపరాధం.

క్రీసస్ పరాజయం గ్రీసు దేశపు చరిత్రలో విస్మరించడానికి వీలులేని మైలురాయి.

ప్రచ్ఛన్న అర్థ సందిగ్ధతలతో మాట్లాడడం ఈ నాటి జ్యోతిష్కుల ఆయుధం ఎలాగయిందో అలాగే అలనాటి ఒరాకిల్‌లకి కూడా ఆయుధం అయి ఉండాలి. ఎంత సర్వజ్ఞుడిని అయినా సరే మనం అడిగే ప్రశ్నలు అర్థవంతంగా ఉండాలి, నిర్ద్వంద్వంగా ఉండాలి. సరి అయిన గురి పెట్టి అడగాలి. అదే విధంగా నిష్ణాతులు ఇచ్చే సలహాలని విధివిధానాలుగా మార్చి అవలంబించే ముందు ఆ సలహాల పర్యవసానాన్ని సరిగ్గా అర్థంచేసుకోవడం నేర్చుకోవాలి.

ఈనాటి ప్రభుత్వాలకి ఒరాకిల్‌లు ఎవరు? శాస్త్రవేత్తలు, స్మరణ తటాకాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్నత ఆసనాలు అధిష్టించిన ఆచార్యులు, వగైరాలు. ఈ పిదప కాలపు ఒరాకిల్‌లను ప్రభుత్వాలు అప్పుడప్పుడు, అయిష్టంగానే, సంప్రదిస్తాయి. కొండకచో కొన్ని ఒరాకిల్‌లు అడిగినా, అడగకపోయినా వారి విలువైన అభిప్రాయాలని ఉచితంగా జారీచేస్తూ ఉంటారు: ఆకాశంలో ఓజోన్ పొరలో చిల్లుపడడం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. పర్యావరణం వేడెక్కిపోవడం వల్ల ధ్రువప్రాంతాలలో మంచు కరిగిపోయి దాని వల్ల తీర ప్రాంతాలు ముంపుకి గురి అవుతాయి, వగైరా. ఈ అభిప్రాయాలైనా సరళమైన, నలుగురికీ అర్థం అయే భాషలో ఉంటాయా? ఉండవు. శాస్త్రీయ పరిభాషలో, సంభావ్యతలు, శాతాలు, గంట ఆకారంలో ఉన్న చిత్రపటాల రూపంలో ఉంటాయి. రాజనీతి తంత్రజ్ఞులు విధివిధానాలని జారీచేసే ముందు ఈ పరిభాషని అర్థం చేసుకుని అప్రమత్తతతో మెలగాలి. ఆ అప్రమత్తతకి శాస్త్రీయ పరిజ్ఞానం, అవగాహన అత్యవసరం. మనం ఎన్నుకున్న ప్రతినిధులలో ఎంతమందికి ఈ రకం శాస్త్రీయ అవగాహన ఉంటోంది?*

ఆర్టెమిస్, ఒరాయన్‌ల ప్రేమగాథ

గ్రీకు పురాణాలలో ఆర్టెమిస్ (Artemis), ఒరాయన్‌ల (Orion) ప్రేమ గాథ రకరకాల మూలాలలో రకరకాలుగా, చిన్నచిన్న తేడాలతో కనిపిస్తుంది. అపాలో యొక్క కవల సహోదరి ఆర్టెమిస్. ఈమె మృగయావినోదాలకి అధిపత్ని. పసితనం నుండి ఈమెకి వేటాడం మీద అభిమానం మెండుగా ఉండేది. అందుకని ఆర్కేడియాలో ఉన్న కొండలలోను, కోనలలోను వేటాడుతూ, క్రొంగొత్త అనుభవాలని అన్వేషిస్తూ తిరుగాడడానికి ఇష్టపడుతూ ఉండేది. తండ్రి జూస్ అమె అభిలాషలని ప్రోత్సహించేవాడు. ఆమె రక్షణ కోసం ఆమెకి ఏడుగురు వనదేవతలని(nymphs) చెలికత్తెలుగా నియమించేడు. ఈమెకి పేన్ (Pan) రెండు వేట కుక్కలని కానుకగా ఇచ్చేడు. [ఈ పేన్ నడుం దిగువ భాగం గొర్రె ఆకారంలోనూ, ఎగువ భాగం మనిషి ఆకారంలోనూ ఉండే ఒక వనదేవుడు; అడవులలోను గడ్డి మైదానాలలోను గొర్రెలని కాసుకుంటూ, పిల్లనగ్రోవి ఊదుకుంటూ తిరుగాడుతూ ఉంటాడు. ఇతను మధ్యాహ్నం వేళ కునుకు తీస్తున్న సమయంలో ఎవరైనా అకస్మాత్తుగా లేపితే పెడబొబ్బ పెడతాడు. ఆ శబ్దానికి భయపడి అతని గొర్రెలు చిందరవందరగా చెల్లాచెదరు అయిపోతాయి. ఈ సంఘటనని పురస్కరించుకుని అకస్మాత్తుగా భయపడే సందర్భాన్ని వర్ణించడానికి ఇంగ్లీషులో ‘పేనిక్’ (panic) అన్న మాట పుట్టింది.] ఒంటి కన్ను సైక్లాప్స్ ఈమెకి వెండితో చేసిన విల్లమ్ములని బహూకరించేడు. వీటితో నిత్యసాధన చేసిన ఆర్టెమిస్ ప్రతిభ అతి త్వరలోనే అపాలోతో సరితూగడం మొదలయింది.

ఆర్టెమిస్ అహోరాత్రాలు వేటలో మెళుకువలు నేర్చుకుంటూ, నేర్చిన వాటికి పదనుపెడుతూ, ఏకాంతంగా రోజులతరబడి గడిపేసేది. ఆమె ఏకాంతానికి భంగం కలిగితే ఆమెకి ఎక్కడ కోపం వస్తుందో అని మానవులు ఆమెకి దూరంగా ఉండేవారు. అడవులలో ఏకాంతంగా ఆమె వేటాడుతూ ఉంటే వనదేవతలైన ఆమె చెలికత్తెలు కేరింతలుకొడుతూ ఆడుకునేవారు!

ఒకనాడు ఆర్టెమిస్ ఒక జలాశయంలో జలకాలాడుతూ ఉన్న సమయంలో ఆక్టియన్ (Actaeon) అనే మానవుడు అటువైపు వెళ్ళడం తటస్థించింది. అతను ఇదివరలో ఆర్టెమిస్ అందచందాల గురించి వినివున్నాడు కానీ, ఆమె ఇంత అందంగా ఉంటుందని కలలోనైనా ఊహించలేదు. ఆమెని చూస్తూ, నిర్విణ్ణుడై స్థాణువులా ఉండిపోయేడు.

కొలనులో జలకాలాడుతూన్న ఆర్టెమిస్ తనవైపే రెప్ప వాల్చకుండా చూస్తూన్న ఆక్టియన్‍ని చూసి ఉగ్రురాలయింది. చేతితో నీళ్ళు తీసుకుని అతని వైపు వెదజల్లింది. ఆ నీటి బిందువులు అతని శరీరాన్ని తాకేసరికి అతను ఒక దుప్పిగా మారిపోయేడు. అప్పుడు ఆర్టెమిస్ బిగ్గరగా ఒక ఊళ వేసేసరికి ఆమె వేట కుక్కలు రెండూ పరుగు పరుగున వచ్చి, ఆ దుప్పిని చీల్చిచెండాడి చంపేసేయి.

దయనీయ పరిస్థితులలో ఆక్టియన్ ఎదుర్కున్న దారుణ మరణ వార్త ఆ అడవిలో దావానలంలా వ్యాపించింది. అందరూ ఆర్టెమిస్‌ని కన్నెత్తి చూడడానికే భయపడేవారు; ఒక్క ఒరాయన్ (Orion) తప్ప. ఒరాయన్ తండ్రి పోసైడన్ (Poseidon), తల్లి యురియెల్ (Euryale) అనే మానవ స్త్రీ. ఒరాయన్ భూలోక సుందరుడు అని పేరు పొందేడు; ఒకరికి భయపడే రకం కాదు. ఒరాయన్‌కి ఆ అడవిలో వేటాడుతూ తిరగడం అంటే బహు ప్రీతి. అంతే కాదు; ఒరాయన్ వనకన్య మెరోపీని (Merope) ప్రేమించేడు. ఆమె ఎక్కడ ఉంటే అతను అక్కడే తిరుగాడేవాడు. అయినా భయంవల్లో, భక్తివల్లో, మర్యాద కొరకో ఎల్లప్పుడూ ఆర్టెమిస్‌కి దూరంగానే ఉండేవాడు.

ఒకనాడు బృహత్ లుబ్ధకం (Canis Major), లఘు లుబ్ధకం (Canis Minor) అనే పేర్లు గల తన కుక్కలని వెంటేసుకుని ఒరాయన్ వేటాడుతున్నాడు. అకస్మాత్తుగా ఎదురుగా ఉన్న తుప్పలలో తెల్లగా ఉన్నది ఏదో కదిలింది. అది ఏదో అపురూపమైన పక్షి మూక అయి ఉంటుందని ఊహించి చాటుమాటున పొంచి మెదలడం మొదలుపెట్టేడు ఒరాయన్. అతను సమీపించేసరికి ఆ తెల్లగా ఉన్నది మెరుపులా పరుగుతీసింది. సావధానంగా చూసేసరికి అవి పక్షులు కావు, ఆ కదిలేవి తెల్లటి ఉడుపులతో ఉన్న ఏడుగురు వనకన్యలు అని తేలింది.

ఒరాయన్ వారిని వెంబడించేడు. వనకన్యల గుంపు వాయువేగంతో ముందుకు పొతోంది. ఒరాయన్ వేగంలో వారిని ఏమాత్రం తీసిపోలేదు. పైగా ఒరాయన్ బలశాలి. పరుగున వచ్చి ఒరాయన్ మెరోపీ కొంగు పట్టుకున్నాడో లేదో ఆమె కెవ్వున కేక వేసింది. ఆ కేక ఆర్టెమిస్ విన్నది. విన్న వెంటనే ఆర్టెమిస్ ఆ ఏడుగురు వనకన్యలని ఏడు తెల్లటి పావురాలుగా మార్చేసింది. అవి రివ్వున ఆకాశపు లోతుల్లోకి ఎగిరిపోయాయి. అలా ఆ పావురాలు వినువీధి లోకి ఎగిరిపోతూ ఉంటే ఆర్టెమిస్ తన తండ్రి జూస్‌ని పిలచి ఆ వనకన్యలకి ఏ హాని జరగకుండా చూడమని ప్రార్థించింది. అప్పుడు జూస్ ఆ ఏడుగురు వనకన్యలని ఏడు నక్షత్రాలుగా మార్చేసి ఆకాశంలో శాశ్వతంగా ఉండిపొమ్మని చెప్పేడు. ఆ ఏడు నక్షత్రాలనే ప్లయేడిస్ (Pleiades లేదా Seven Sisters) అని అంటారు. (ఇవే వృషభరాశిలో కృత్తికలు అన్న పేరుతో కనిపించే నక్షత్రాలు.)

ఈ అలజడికి కారణం ఏమిటా అని ఆర్టెమిస్ ఇటూ, అటూ చూసేసరికి ఎదురుగా ఒరాయన్ కనిపించేడు. అతని అందం, అతని వర్ఛస్సు, అతని వేగం ఆర్టెమిస్‌ని అపరిమితంగా ఆకర్షించేయి. అప్రయత్నంగానే ఇద్దరూ కలసి వేటాడడం మొదలుపెట్టేరు. ఒకరితో మరొకరు పోటీలుపడుతూ వేటాడేవారు. చీకటిపడ్డ తరువాత నెగడు దగ్గర చలి కాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వారి నవ్వుల సవ్వడితో ఆ అడవి ప్రతిధ్వనించేది.

శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతూన్న వీరి స్నేహం అపాలోకి నచ్చలేదు. ‘కేవలం ఒక మానవమాత్రుడిని ఎలా ప్రేమించగలుగుతున్నావ్?’ అని నిలదీశాడు.

‘మానవుడైతేనేం? ఒరాయన్ బలశాలి, ధైర్యవంతుడు.’ ఆర్టెమిస్ ఎదురుతిరిగి సమాధానం ఇచ్చేసరికి అపాలో అహం దెబ్బతింది. తన సోదరి సమీకరణం నుండి ఒరాయన్‌ని ఎలాగైనా తప్పించాలని అపాలో ఒక నిశ్చయానికి వచ్చేడు.

ఒక రోజు ఒక మండ్రగబ్బ ఒరాయన్ మీదకి వస్తోంది. ఒరాయన్ దానిని ఎదుర్కుని చంపడానికి శతథా ప్రయత్నం చేస్తున్నాడు. అయినా అతని కృషి సఫలం కావటంలేదు. ఒరాయన్ అంతటి ధీరుడు కేవలం ఒక నల్ల తేలుని ఎదుర్కుని చంపలేకపోతున్నాడు. ఒరాయన్‌కి ముచ్చెమటలు పోస్తున్నాయి. తేలు మీదమీదకి వచ్చి అతని వక్షస్థలం మీద కాటు వెయ్యడానికి కొండిని పైకి ఎత్తింది. ఒరాయన్ ఒక్క పెడబొబ్బ పెట్టేడు. అతని ఒళ్ళంతా స్వేదావృతం అయిపోయింది. మెలకువ వచ్చింది. అదంతా నిద్రలో వచ్చిన ఒక పీడకల అని గ్రహించి స్థిమితపడ్డాడు. నిద్రలోంచి తేరుకుందామని, బయటికి చల్లగాలిలోకి వచ్చాడు. ఎదురుగా నల్లటి మండ్రగబ్బ! కలలో కనిపించినదే! ఒరాయన్ ఆ తేలుతో హోరాహోరీ పోరాడేడు. చిట్టచివరికి ఆ తేలు వేసిన కాటుకి ఒరాయన్ మరణించేడు.

ఒరాయన్ మరణం ఆర్టెమిస్‌ని కృంగదీసింది. ఒరాయన్ ప్రాణాలు తీసిన తేలు ఇంకా అక్కడే ఉంది. ఆర్టెమిస్ కోపంతో ఆ తేలుని పట్టుకుని రివ్వున ఆకాశంలోకి విసిరేసింది. అదే ఇప్పుడు మనకి ఆకాశంలో కనిపించే వృశ్చిక రాశి. ఈ తేలు గుండెకి సమీపంలో కనిపించే నక్షత్రమే జ్యేష్ఠ (Antares). అటు తరువాత రాశి చక్రంలో, వృశ్చిక రాశికి బహుదూరంలో ఉండేలా, అతిశయించిన ప్రేమతో ఒరాయన్ పార్థివ దేహాన్ని, అతని వేట కుక్కలని ఆర్టెమిస్ నక్షత్రాల రూపంలో అమర్చింది. అందుకనే ఒరాయన్ నక్షత్ర కూటమి తూర్పున ఉదయించే వేళకి వృశ్చిక రాశి పడమట అస్తమిస్తుంది.

ఇప్పటికీ తలెత్తి చూస్తే ఆకాశంలో తేలికగా పోల్చుకోగలిగే నక్షత్ర రాశి ఒరాయన్! దీనినే మనం మృగవ్యాధుడు అని భారతీయ భాషలలో అంటాం. చీకటి రాత్రి పశ్చిమ ఆకాశం వైపు చూస్తే కొట్టొచ్చినట్లు దగ్గరదగ్గరగా మూడు చుక్కలు వరసగా కనిపిస్తాయి. వీటిని వేటగాడి నడుం చుట్టూ ఉన్న పటకాలా ఊహించుకుంటే ఆ పటకా నుండి కిందకి కాని, కుడి పక్కకి కాని మరి రెండు చుక్కలు కనిపిస్తాయి; అవి మృగవ్యాధుడి కాళ్ళు. ఎడమ మోకాలి దగ్గర ఉన్న నక్షత్రం పేరు రైజెల్ (Rigel, వృత్రపాద నక్షత్రం). పటకా నుండి పైకి చూస్తే రెండు బాహుమూలాలు, వాటి మీద తలకాయ ఉండవలసిన చోట మరొక తార కనబడతాయి. కుడి చంక దగ్గర ఎర్రగా కనిపించే నక్షత్రం పేరు బీటిల్‌జూస్ (Betelguese, ఆర్ద్రా నక్షత్రం). బాగా ముందుకి చాపిన ఎడమ చేతిలో విల్లు, పైకి ఎత్తిన కుడి చేతిలో రెండు బాణాలు (లేదా, ఒక దుడ్డు కర్ర) కూడ చూడవచ్చు.

మృగవ్యాధుడు పాదాల దిగువన, కాసింత వెనకగా Canis Major (పెద్ద కుక్క) లేదా బృహత్ లుబ్ధకం ఉంటుంది. ఇది ఉత్తరాకాశంలో మరొక నక్షత్ర రాశి; మృగవ్యాధుడుకి ఆగ్నేయంగా ఉన్న ఈ రాశిలోనే మన ఆకాశంలో కనిపించే అత్యంత ప్రకాశమానమైన సిరియస్ (Sirius, మృగశిర) నక్షత్రం ఉంది.

అమెరికా 1960 దశకంలో చంద్రుడి మీద కాలు మోపడానికి చేసిన ప్రయత్నానికి అపాలో అని పేరు పెట్టేరన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇప్పుడు మళ్ళా రాబోయే దశకంలో చంద్రుడి మీద రెండోసారి కాలు మోపడానికి చేస్తూన్న ప్రయత్నానికి ఆర్టెమిస్ అన్న పేరు, ఈ ప్రయత్నంలో వాడబోయే నభోనౌక పేరు ఒరాయన్ అని గమనిస్తే గ్రీకు సంస్కృతి సైన్సుని ఎంతగా ప్రభావితం చేస్తూందో అవగతం అవుతుంది!

* (ఆధారం: Carl Sagan, Croesus and Cassandra, Chapter 9 in Billions & Billions, Random House, New York, NY 1997.)


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...