నాయుడు – రాయుడు

కొందరు వాగుడుకాయలు. వాళ్ళకి మాట్లాడకపోతే తోచదు.

రాయుడు ఉత్త వాగుడుకాయ. బుర్రలో పుట్టే ఆలోచనల ప్రవాహం కంటె ఎక్కువ జోరుగా మాట్లాడడంలో అతనికి అతనే సాటి. అప్పుడప్పుడొక మోతాదు అశ్లీలాలు దొర్లిస్తూ మాట్లాడే తత్త్వమేమో, ‘కంట్రీ క్లబ్బు’లో అతను ఎక్కడ ఉంటే అక్కడ పదిమంది తేనె చుట్టూ చేరే ఈగల్లా చేరి కేరింతాలు కొడుతూ ఉంటారు.

నాయుడికి రాయుడంటే చిరాకు. రాయుడు ఉత్త వాగుడుకాయ అంటాడు. గట్టిగా గొంతెత్తి మాట్లాడతాడని ఈసడించుకుంటాడు. ముభావంగా ముడుచుకు కూర్చునే నాయుడు చుట్టూ వందిమాగధులు ఎవ్వరూ చేరరు. అందుకని రాయుడంటే అసూయ పడుతున్నాడో ఏమో! మనకి తెలియదు.

“ఏయ్ రాయుడూ! ఏంటా గోల? నీకెన్నిసార్లు చెప్పాలేంటి? కాసింత కుదురుగా కూసోని కబుర్లాడుకోరాదూ? ఒకటే గోల! సేపల బజారా, ఏంటి ఇది? ఇది కంతిరీ క్లబ్బు!”

“నాయుడూ. ఇల్రాయేస్! మా బొబ్బిల్లో తాటి ముంజిలు అమ్మడానికొచ్చిన రెల్లిదాని కథ చెబుతా! రా!”

నాయుడు ఆ బూతు కథ చాల సార్లు విన్నాడు. చిర్రెత్తుకొచ్చింది. లేచి నిలుచున్నాడు. పంచె ఎగకట్టేడు. ధగధగలాడుతూ వేలికో ఉంగరం ఉన్న చేతివేళ్ళ మధ్య ఉన్న సిగరెట్టుని నోట్లో పెట్టుకుని గట్టిగా మరొక్క దమ్ము లాగి, నేల మీద గిరాటేసి, చెప్పు కాలితో నులిమి, పక్క గదిలో కేరింతాలు కొడుతూన్న రాయుడి దగ్గరకి వచ్చేడు.

“రాయుడూ! నాలుగు నిమిషాలపాటు నోర్మూసుకుని ఉండలేవూ? ఎదవ గోలా నువ్వూను!” అంటూ గర్జించేడు.

రాయుడు కూడా లేచి నిలబడ్డాడు. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అని కొంతసేపు ఘర్షణ పడ్డారు. చివరికి నాయుడే అన్నాడు: “రాయుడూ! నువ్వు నెల రోజుల పాటు నోరు మెదపకుండా ఉంటావా లేకపోతే తోప రేగ్గొట్టమంటావా?”

“ఉంటే ఏటిస్తావేటి?”

“ఉంటే రోజుకి లక్ష రూపాయలు చొప్పున ముప్ఫయి లక్షలు ఇస్తాను. ఏమంటావు?” ముందూ వెనకా ఆలోచించకుండా నాయుడు దర్పం చూపెట్టేడు.

“ఏవీ ముప్ఫయి లక్షలు? ముందు రొక్కం బల్ల మీద పెట్టు. అప్పుడు మాట్లాడదాం.”

“మాటంటే మాటే! నా మాట మీద నేను నిలబడతాను. మూతి మీద మీసం ఉన్న మగాడివైతే నెల్లాళ్ళబాటు నోరు మూసుకుని మెదలకుండా మూలని కూకునుండు. అప్పుడు నీ డబ్బు నీకిచ్చేస్తా. నోరు మెదిపేవో నువ్వు ఊళ్ళోంచి పోవాలి. ఒప్పందమేనా?” అన్నాడు నాయుడు ఉద్వేగంతో చేతులాడిస్తూ. ఆ గదిలోని విద్యుత్ దీపాల కాంతిలో నాయుడి చేతి వేళ్ళ మీద ఉంగరాలు జిగేల్ మంటూ మెరిసేయి.

“నేను గెలిస్తే నువ్వు నాకు ముప్ఫయి లక్షలు ఇస్తావు. ఓడిపోతే నేను ఊళ్ళోంచి పోవాలి! అంతేనా?” మెరుస్తూన్న ఉంగరాలని చూస్తూ అన్నాడు రాయుడు.

“అంతే!”

పేరుమోసిన ‘కంట్రీ క్లబ్బు’ సభ్యుల ఎదుట నాయుడు మాట ఇచ్చేసేడు! ముప్ఫయి లక్షలు అంటే మాటలా! రాయుడు సరే అనేసేడు. నాయుడు చేతికున్న ఉంగరాలే చేస్తాయి ఏభై లక్షలు అని అంచనా వేసేడు రాయుడు.

అందరి ఎదటా నాయుడు ఒప్పందాన్ని వివరించి చెప్పేడు:

“ముప్ఫయి రోజులపాటు రాయుడు గాజద్దాల కిటికీలు ఉన్న గదిలో ఉండాలి. గదిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. తినడానికి తిండి. చదువుకోడానికి పుస్తకాలు, వగైరా. పొరపాటున కూడ రాయుడి నోటి వెంట ఏ శబ్దమూ రాకూడదు: మాట కానీ, పాట కానీ, కనీసం కూనిరాగం కూడా రాకూడదు – తుమ్ములు, దగ్గులు, ఆవలింతలు మినహా! మరొకరితో మాట్లాడకూడదు, సరే! తనలో తాను కూడ మాట్లాడుకోకూడదు. రాయుడిని చూడడానికి బంధుమిత్రులు రావచ్చు. కాని వారితో రాయుడు మాట్లాడకూడదు. కాగితం మీద రాసి సంభాషించవచ్చు. చెవిటివారితో మాట్లాడినట్లు చేతితో సంజ్ఞలు చెయ్యవచ్చు. నోటి నుండి శబ్దం రాకూడదు. గదిలో నాలుగు మూలలా మేలురకం శబ్దగ్రాహకాలు ఉంటాయి. రాయుడు నోటినుండి ఏ శబ్దం వచ్చినా అవి నమోదు చేసేస్తాయి.”

రాయుడు ఒప్పుకున్నాడు. అక్కడ ఉన్న సభ్య బృందం దీనికి సాక్షులు.

ఎవరి పనులు వారు చక్కబెట్టుకుందుకని రెండు పక్షాలవారూ నెల్లాళ్ళు గడువు తీసుకున్నారు.


నెల తిరిగింది. ఏర్పాట్లు అన్నీ పకడ్‌బందీగా జరిగిపోయాయి. రాయుడు గాజద్దాల గదిలో ప్రవేశించి రెండు రోజులు అయింది. అప్పటి వరకు రాయుడు ఏ ఇబ్బందీ పడలేదు. నాయుడు పరివారంతో పరిస్థితిని చూడ్డానికి వచ్చేడు.

“రాయుడూ! ఎందుకొచ్చిన ఇబ్బంది. ఇప్పటికి అయిన రెండు రోజులకీ, రోజు ఒక్కంటికి వెయ్యి చొప్పున, రెండు వేలు ఇచ్చెస్తాను. పందెం మానుకో.”

రాయుడు తల అడ్డుగా ఆడించేడు.

వారం రోజులు గడచిపోయాయి.

“నాయుడూ! నీ దగ్గర నిజంగా ముప్ఫయి లక్షలు ఉన్నాయా? ఆ రాయుడి ఉసురు నీకెందుకు. ఆడికో పదివేలు పారేసి పందెం మానుకో! మేము రాయుడికి మా మాటగా నచ్చచెబుతాం.” అంటూ శ్రేయోభిలాషులు నాయుడికి బోధ చేసేరు. నాయుడు సరే అన్నాడు.

“రాయుడూ! ఎందుకొచ్చిన పట్టుదల చెప్పు. పెళ్ళాం, పిల్లలు ఉన్నవాడివి. నాయుడికి నచ్చజెప్పి నీకో పాతిక వేలు ఇప్పిస్తాం. పందెం ఆపు చెయ్యి,” అంటూ అదే మధ్యవర్తులు రాయుడికి బోధ చేసి చూసేరు. రాయుడు ఒప్పుకోలేదు.

రెండు వారాలు గడచిపోయేయి. రాయుడి చేత ఎలాగైనా ఒప్పించి పందెం ఆపు చేయించాలని ఈ తడవ నాయుడే స్వయంగా ప్రయత్నం చేసేడు. ఫలించలేదు. నాయుడికి కంగారు పుట్టింది. రాయుడు పందెం గెలిచేసేడంటే ముప్ఫయ్ లక్షలకి ఎసరు. తను మాత్రం అంత రొక్కం ఎక్కడనుండి తెస్తాడు? పైకి తేలిపోకుండా, ఎవ్వరూ వెనకనుండి తొయ్యకపోయినా సరే, నాయుడే శతవిధాల ప్రయత్నం చేసేడు, రాయుడి చేత పందెం ఆపు చేయించాలని.

రాయుడు వినలేదు. అయినా ఈ పరిస్థితులలో ఎందుకు వినాలి?

నెల రోజులు అయిపోయాయి. రాయుడి ‘మౌనవ్రతం’ అయిపోయింది. ముప్ఫయి లక్షలు నాయుడు ఎక్కడనుండి తెచ్చి ఇస్తాడో ఎవ్వరికీ బోధ పడలేదు.

నాయుడికి నోటి వెంట మాట రావడమే కష్టం అయింది. “ఇది ఉంచు రాయుడూ! ఏదో నోటి దురుసుతనంతో తొందరపడి పందెం కాసేసేను కాని, ముప్ఫయ్ లక్షలు నేను మాత్రం ఎక్కడ నుండి తేగలను?” అంటూ ముప్పయ్ వేలు రాయుడి చేతిలో పెట్టేడు.

“నీ చేతికున్న వజ్రపు ఉంగరాలు ఇచ్చెయ్.” కాగితం మీద రాసి చూపించేడు, రాయుడు.

“ఇవి అసలు వజ్రాలు కాదు; నకిలీవి! మూడు వేలు కాడా చెయ్యవు!” అన్నాడు నాయుడు.

“రాయుడూ! పందెం అయిపోయిందిగా! ఇంకా కాగితం మీద ఆ రాతలు ఎందుకూ? ఆ దొంగనాయాలని కసితీరా తిట్టు. నోరు నొప్పి పెట్టే వరకు తిట్టు. అంత కంటె ఏమి చెయ్యగలవ్?” అని స్నేహితులు రాయుడిని రెచ్చగొట్టేరు.

రాయుడుకి కళ్ళ వెంట నీళ్ళు కారడం మొదలయింది. అన్ని ప్రగల్భాలు పలికే రాయుడు ఇలా దిగజారిపోవడం చూసి చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యపోయేరు. రాయుడు ఇంకా కాగితం మీద రాసే ధోరణి లోనే ఉన్నాడు. సమాధానం కాగితం మీద రాసి చూపించేడు.

“పందెం గెలవడం కోసం నా గొంతుకలో ఉన్న స్వరతంత్రులని కత్తిరింపించుకున్నాను!”


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...