భారత కథలో పునరావృతమయే బాణీలు

భారతాన్ని కథ అంటున్నాను. ‘ఇది కథ కాదు, ఇతిహాసం’ అని వాదించేవారితో నాకు పేచీ లేదు. ఎందుకంటే మహాభారతం ఇతిహాసానికి ఒక ఉదాహరణ; చరిత్రను కథగా చెప్పే ఒక ప్రక్రియ. అలాగే అనుకున్నా నేను చెప్పబోయే విషయానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక కథ చెప్పేటప్పుడు చరిత్రని యథాతథంగా చెప్పక్కరలేదు; చిన్న చిన్న మార్పులు, ప్రక్షిప్తాలూ దొర్లుతాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని ఒక క్రమ పద్ధతిలో విశ్లేషిస్తాను.

1. వంశవృక్షం

ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కనుక శుక్రాచార్యులవారితో మొదలు పెడదాం.

శుక్రాచార్యుడి ముద్దుల పట్టి దేవయాని. ఈమె యయాతి అనే రాజుని ఇరకాటంలో పెట్టి పెళ్ళి చేసుకుంది. శర్మిష్ఠ, దేవయానితో తగాదా వల్ల యయాతి వద్దకు చేరింది, తరువాత అతని రెండవ భార్య అయ్యింది. యయాతికి పుట్టిన కొడుకులలో మనకి కావలసిన వాళ్ళు ఇద్దరు: యదు, పురు.

యదు దేవయాని పెద్ద కొడుకు. (తుర్వసుడు రెండో వాడు.) పురు శర్మిష్ఠ చిన్న కొడుకు. (పెద్ద కొడుకు ద్రుహ్యుడు, రెండోవాడు అనువు, మూడోవాడు పురు.)

ముందు యదువంశం సంగతి చూద్దాం. యదువంశంలో కొన్ని తరాలు పోయిన తరువాత పుట్టిన పిల్లలలో మనకి కావలసిన వాళ్ళు ఇద్దరు: వసుదేవుడు, కుంతి. వసుదేవుడి సంతతిలో మనకి కావలసిన వాళ్ళు ఇద్దరు: కృష్ణుడు, సుభద్ర.

ఇప్పుడు యయాతికి శర్మిష్ఠ ద్వారా పుట్టిన పిల్లలలో చివరి వాడైన పురు గురించి ఒక మాట. లైంగిక వాంఛలు తీరని తండ్రిని మెప్పించడానికి ఇతను తన యవ్వనాన్ని ధారపోస్తాడు. కొన్ని తరాలు పోయిన తరువాత, ఈ ‘పురు’వంశంలో దుష్యంతుడికి శకుంతల వల్ల భరతుడు పుట్టేడు. ఈ భరత వంశపు కథ భారతం అయింది.

ఈ భరతుడి సంతతి – కొన్ని తరాలు పోయిన తరువాత – రెండు పాయలుగా చీలింది. ఒక పాయలో – కొన్ని తరాలు పోయిన తరువాత – ద్రుపదుడు పుట్టేడు. ఈ ద్రుపదుని కూతురే ద్రౌపది. రెండవ పాయలో ‘కురు’ అనే రాజు పుట్టేడు. అందుకే కురువంశం అన్న పేరు వచ్చినది.

2. కురు వంశం

ఈ కురు వంశంలో కొన్నాళ్ళకి ప్రతీపుడు రాజయ్యాడు. ప్రతీప మహారాజుకు ముగ్గురు కొడుకులు: దేవాపి, బాహ్లికుడు, శంతనుడు. మహారాజు తదనంతరం పెద్దవాడు పాలకుడు కావడం పూర్వాచారం. కనుక ప్రతీపుడు దేవాపిని రాజు చేయదలచాడు. అప్పుడు పెద్దలు, శ్రేయోభిలాషులు సందేహం వ్యక్తం చేశారు: “దేవాపి సర్వసమర్థుడే అయినా అతనికి శ్విత్రదోషం (బొల్లి) ఉంది. రాజపదవి విష్ణుస్థానం. అందులో ఈ శారీరక దోషం ఉన్నవాడు ఉండడం దేవతల ఆగ్రహానికి కారణమౌతుంది.”

‘పెద్దవాడికి రాజ్యం ఇవ్వడం’ అనే సంప్రదాయం తప్పుతున్నానే — అని మనసులో బాధపడ్డాడు ప్రతీపుడు. రెండవవాడు బాహ్లికుడు – తండ్రి దగ్గర తన అవసరం పెద్దగా లేదనుకొని – చిరకాలం తన మేనమామల ఇంట్లో ఉంటూ ఉండేవాడు (రామాయణంలో భరత శత్రుఘ్నుల మాదిరిగా). ‘పెద్దవాడు దేవాపి అన్నిటికీ సమర్థుడు ఉన్నాడులే’ అని సమాధానపడుతూ వచ్చాడు. తండ్రి దగ్గర రాజకీయ నిత్య వ్యవహారాలతో తనకు పరిచయం లేదు గాబట్టి ‘ఆ పదవి వద్దు’ అని తనకి తానుగానే ఐచ్ఛికంగా తప్పుకొన్నాడు.

అప్పుడు చిన్నవాడైన శంతనుడికి పట్టం కట్టారు.

బాహ్లికుణ్ణి తప్పించడం వల్ల ‘ధర్మశాస్త్ర ఉల్లంఘన అయింది’ అని దేవతలు ఆగ్రహించి అనావృష్టి కలిగించారు.

లౌకికంగా చూచినపుడు బాహ్లికుడు అయిష్టతతోనే ఉన్నాడు. సామంత రాజ్యాలతో ఉన్న ఆనాటి సంబంధాలు, కష్టనష్టాలూ అవగాహన చేసికొని, రాజుగా తగిన నిర్ణయాలు చేయవలసిన పరిస్థితి. అది స్వల్ప అంశం కాదని బాహ్లికుడు తలపోసి పక్కకి తప్పుకున్నాడు. అయినా ధర్మ విరుద్ధానికి ప్రక్షాళనగా బాహ్లికుణ్ణి రాజుగా చేసి, ఒక రోజు పోయిన తరువాత, అతనిచేత వేదనింద చేయించి, అనర్హత వేటు వేసి, పదవీ భ్రష్ఠుణ్ణి చేసి, అనుకొన్న ప్రకారం మళ్ళీ శంతనుణ్ణి రాజు చేశారు. శాస్త్రం పాటించినట్లయింది. సహేతుక చర్యకు దేవతలు అనుగ్రహించారు. దేశం సస్య శ్యామలం అయింది.

ఇదీ జరిగిన అసలు కథ. ఈ విషయాలు అన్నీ మహాభారతంలో కనబడకపోవచ్చు. కొన్ని విష్ణు పురాణంలో ఉన్నాయిట. (వ్యాసప్రోక్తమైన భారతకథలో నిజంగా జరిగిన సంఘటనలన్నీ తు.చ. తప్పకుండా ఉండాలని లేదు కదా!)

పైన చెప్పిన కారణం చేతనే బాహ్లికుడి కొడుకు సోమదత్తుడు, అతని వంశమూ కౌరవ సామ్రాజ్య సింహాసనం అధిష్ఠించలేదు. కేవలం రాజపురుషులుగానే ఉండిపోయారు. కౌరవ పక్షంలో యుద్ధం చేశారు కూడా! ఏతావాతా యువరాజు దేవాపి అడవులకి వెళతాడు; చిన్నవాడైన శంతనుడు గద్దె ఎక్కుతాడు.

శంతనుడికి మొదటి భార్య గంగ వల్ల పుట్టిన కొడుకు దేవవ్రతుడు. ఇతను పెద్ద కొడుకు, రాజ్యానికి వారసుడు. శంతనుడి రెండవ భార్య సత్యవతి వల్ల పుట్టిన పిల్లలు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. ఈ ముగ్గురికి సంతానం లేకపోవడం వల్ల జన్యుపరంగా ఈ శాఖ ఇంతటితో అంతం అయిపోయింది!

3. వ్యాసుడు

సంఘంలో పేరుకుపోయిన నైతిక నియమాలని కూకటి వేళ్ళతో పెళ్ళగించి వాటికి సరికొత్త భాష్యం చెప్పగలిగినవారిని ‘యుగపురుషులు’ అంటాం. ప్రతీ సాంఘిక వ్యవస్థలోనూ యుగపురుషులు పుడుతూనే ఉంటారు. మూడువేల అయిదువందల సంవత్సరాలకి పూర్వం, చరిత్రకి అందని పురాతన కాలంలో, ఒక యుగపురుషుడు భారత దేశంలో పుట్టేడు. ఆయన పెట్టిన ఒరవడి నేటికీ చెరగకుండా ఉంది. అయన స్పృశించని అంశం లేదు. ఆయన వశిష్ఠ మహర్షి మునిమనవడు. పరాశర మహర్షికి మత్స్యకారుని కూతురైన సత్యవతి వల్ల కలిగిన కొడుకు. నది మధ్యన దీవిలో పుట్టిన నల్లని బాలుడు కనుక అతనిని కృష్ణద్వైపాయనుడు అని పిలిచేవారు.

కృష్ణద్వైపాయనుడు వేదాలని నాలుగు భాగాలుగా విభజించి, సంస్కరించేడు కనుక వేదవ్యాసుడు అనే బిరుదుని పొందేడు. ఈ వేద పరిజ్ఞానం భావి తరాలకి అందుబాటులో ఉండేలా నైమిశారణ్యంలో ఒక విశ్వవిద్యాలయం స్థాపించేడు. ఈనాటి వేద పాఠశాలలకి ఒరవడి అదే. ఈ విశ్వవిద్యాలయం నుండి కేవలం వ్యాస ప్రణీతాలు: నాలుగు వేదాలు, బ్రహ్మసూత్రాలు, అష్టాదశ పురాణాలు, భారత, భాగవత గ్రంథాలు!

4. టూకీగా భారత కథ

ఇప్పుడు భారత కథ – అందులోని బాణీలు – టూకీగా చెబుతా: భరతుడి నుండి దిగివచ్చిన కురువంశంలో శంతనుడు గద్దెకి ఎక్కేవరకు రాజ్యం అనువంశికంగా ఎవరికి వెళ్ళాలి అనే సందిగ్ధత రాలేదు. శంతనుడికి గంగాదేవి వల్ల కలిగిన దేవవ్రతుడు పెద్దవాడు; రాజ్యానికి వారసుడు. పూర్వం యయాతి కోరిక తీర్చడానికి అతని కొడుకు పురు తన యవ్వనాన్ని ధారపోసినట్లే ఈ తరంలో తండ్రి శంతనుడికి సత్యవతిపై ఏర్పడిన కోరిక తీర్చడానికి దేవవ్రతుడు రాజ్యాధికారాన్ని వదలుకోవడమే కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోతానని ప్రతిన పూని భీష్ముడు అవుతాడు.

శంతనుడి పెద్దకొడుకు దేవవ్రతుడుకి రావలసిన రాజ్యం రాలేదు! దాశరాజు కోరిక మేరకి సత్యవతి పెద్ద కొడుకు చిత్రాంగదుడికీ రాజ్యం రాలేదు. చిన్న కొడుకు విచిత్రవీర్యుడు రాజయ్యాడు. అనగా, శంతనుడి మూడవ కొడుకు సింహాసనం ఎక్కేడు. ఇతని వీర్యం ఎంత విచిత్రమైనది అంటే ఇద్దరు భార్యలు ఉన్నా సంతానం లేకపోయింది. దీనితో జన్యుపరంగా కురువంశం అంతరించిపోయింది.

విచిత్రవీర్యుడి భార్యలకు (వ్యాసుని వల్ల) పుట్టిన బిడ్డలలో కురువంశపు జన్యువులు లేవు; సత్యవతి ద్వారా దాశరాజువి, పరాశరుడువి, తద్వారా వ్యాసుడివి ఉన్నాయి. పాండవులు, కౌరవులు వ్యాసుని జన్యు మనవలు; భీష్ముడు పేరుకే తాత!

విచిత్రవీర్యుని పెద్ద కొడుకైన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి కావడం వల్ల రాజు అయే అర్హత పోగొట్టుకున్నాడు. చిన్నవాడైన పాండురాజు గద్దెకెక్కేడు. కానీ పాండురాజుకి పాండురోగం వచ్చింది. పాండురోగం అంటే ఒక విధంగా బొల్లి అనే నా అభిప్రాయం. అందువల్ల నిజానికి పాండురాజు కూడా సింహాసనం అధిష్టించడానికి అర్హుడు కాదు. దాసీపుత్రుడైన విదురుడూ అర్హుడు కాదు. రాజ్యాధికారం ఎవరిదీ అనే సమస్య ఇక్కడే మొదలయింది! పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి పుట్టిన దుర్యోధనుడు చిన్నవాడైన పాండురాజుకి పుట్టిన యుధిష్టురుడికంటే చిన్నవాడు. కనుక దుర్యోధనుడు యువరాజు అయే హక్కు పోగొట్టుకున్నాడు. కానీ సింహాసనం మీద ఉన్నది నామకః ధృతరాష్ట్రుడు కనుక తానే యువరాజని దుర్యోధనుడు గట్టిగా నమ్మేడు. ఈ కోణంలోచూస్తే ఇరు పక్షాలూ వారసత్వానికి అర్హులు కారు. రాజ్యాన్ని చెరి సగం తీసుకోవడం మధ్యంతర మార్గం. అలానూ జరగలేదు.

ఈ కథలో కనిపించే బాణీలు

శంతనుడికి ఒక అన్నగారు ఉన్నారన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. ఈ అన్నగారైన దేవాపి – బొల్లి (రోగం) వల్ల రాజ్యార్హతని పోగొట్టుకుని అడవులలో తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోబట్టే చిన్నవాడైన శంతనుడికి రాజ్యం దక్కింది. తరువాత తరంలో దేవవ్రతుడికి దక్కవలసిన రాజ్యం మరొక విధంగా చెయ్యి జారిపోయింది. పోనీ శంతనుడికి సత్యవతి వల్ల కలిగిన ప్రథమ సంతానమైన చిత్రాంగదుడికి రాజ్యం దక్కిందా? అదీ లేదు. చిత్రాంగదుడిని – విచిత్రంగా – అడవిలో పులి తినేసింది! విచిత్రవీర్యుడు రాజయ్యాడు. కానీ ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నా పిల్లలు కలగలేదు! అప్పుడు – వ్యాసమహర్షి కృప వల్ల – విచిత్రవీర్యుడికి కలిగిన ఇద్దరు పిల్లలలో పెద్ద కొడుకైన ధృతరాష్ట్రుడికీ రాజ్యం దక్కలేదు; రెండవ కొడుకైన పాండురాజుకి దక్కింది. కానీ ఆ రెండవ కొడుకు కారణాంతరాల వల్ల రాజ్యం ఏలలేకపోయేడు.

తండ్రి శంతనుడి కామవాంఛ తీర్చడానికి ఈ తరంలో భీష్ముడు త్యాగం చేస్తే తండ్రి యయాతి కామ వాంఛ తీర్చడానికి పూర్వపు తరంలో పురు త్యాగం చేస్తాడు.

మరొక కోణం నుండి చూద్దాం. పాండురాజు పట్టమహిషి అయిన కుంతి పెద్ద కొడుకు కర్ణుడు! రెండవ వాడైన యుధిష్టురుడికి రాజ్యం వచ్చింది. పోనీ ధర్మరాజు పిల్లవాడు యువరాజు అయాడా? లేదు. ఆమాటకొస్తే పాండవుల ప్రథమ భార్య ద్రౌపది వల్ల పుట్టిన పిల్లలు ఎవ్వరికీ రాజ్యం దక్కలేదు. చిన్నవాడైన అర్జునుడి చిన్న భార్య అయిన సుభద్ర (కృష్ణుడి చెల్లెలు) వల్ల పుట్టిన ఒకే ఒక కొడుకు అభిమన్యుడు. ఆ కొడుకు కూడా రాజ్యం ఏలకుండానే చచ్చిపోయాడు. అతని కొడుకు – పరీక్షిత్తు – సింహాసనం ఎక్కుతాడు. పరీక్షిత్తులో ఉన్నది యాదవ రక్తం! అర్జునుడిలో – ఆ మాటకొస్తే, పాండవులలో – కురువంశపు జన్యువులు లేవు; కుంతి జన్యువులు ఉన్నాయి. కుంతి వసుదేవుడి చెల్లెలు. మాయాబజార్ సినిమాలో శకుని ‘యాదవులు!’ అని ఈసడించుకున్నాడు కానీ యాదవులు కౌరవుల జ్ఞాతులే!

సుభద్ర ఎవ్వరు? కృష్ణుడి చెల్లెలు. కృష్ణుడు పాండవ పక్షపాతే కాకుండా రక్త పక్షపాతి కూడా! అభిమన్యుడికి కుంతి ద్వారా ఒక మోతాదు మైటోకాండ్రియల్ డీఎన్ఏ వస్తే సుభద్ర ద్వారా మరొక మోతాదు మైటోకాండ్రియల్ డీఎన్ఏ వచ్చింది!

యాదవులు ఎవ్వరు? యయాతికి యవ్వనం ప్రసాదించడానికి నిరాకరించిన యదు సంతతి వారు! అనగా, దేవయాని సంతతి. అనగా, శుక్రాచార్యులవారి సంతతి!

అంతా బీరకాయ పీచే!

మరొక కోణం నుండి చూద్దాం.

శంతనుడికి – సత్యవతితో వివాహం కాకపూర్వం – గంగతో ఉన్న ‘పూర్వవివాహ సంపర్కం’ (pre-marital affair) వల్ల దేవవ్రతుడు పుడతాడు. అదే విధంగా సత్యవతికి వివాహం కాకపూర్వం పరాశరుడితో ఉన్న ‘పూర్వవివాహ సంపర్కం’ వల్ల కృష్ణద్వైపాయనుడు పుడతాడు. వీరిరువురు భారత కథకి రెండు మూల స్తంభాలు. అంతే కాదు; వీరిరువురుకి వారి బిరుదులైన భీష్ముడు, వ్యాసుడు అన్నవే సార్థకనామాలు అయేయి!

మరుసటి తరంలో కుంతికి వివాహం కాకపూర్వం సూర్యుడితో ఉన్న ‘పూర్వవివాహ సంపర్కం’ వల్ల కర్ణుడు పుడతాడు.

ఇలా వెతికితే బాణీలు ఇంకా దొరకొచ్చు!


ఉపయుక్త గ్రంథాలు

  1. Buitenen, J. A. B., The Mahabharata, 1978, University of Chicago Press, 1978.
  2. Vemuri, V. The Wonder that was Mahabharata, Souvenir of 5th TANA conf., pp 123-125, 1985.
  3. మాచవోలు శివరామప్రసాద్, తెలుగు కోరా ద్వారా జరిగిన ఉత్తరప్రత్యుత్తరములు.

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...