గ్రీకు పురాణ గాథలు 9

ప్రథమ స్త్రీ పాన్డోరా కథ

క్రైస్తవ పురాణ గాథల ప్రకారం ఈవ్ (Eve) మొట్టమొదటి స్త్రీ అయితే గ్రీసు సంప్రదాయంలో పాన్డోరాకి (Pandora) ఆ గౌరవం దక్కింది. సా. శ. పూ. 8వ శతాబ్దంలో హేసియాడ్ రాసిన థియాగనీ (Theogony) అనే గ్రంథంలో మొట్టమొదట ఈ పాన్డోరా దర్శనం ఇస్తుంది. ఈ కావ్యం ప్రకారం పాన్డోరా ప్రస్తావన టైటనులకి ఒలింపియనులకి మధ్య జరిగిన మొదటి మహా సంగ్రామం తరువాత కనిపిస్తుంది. తమాషా ఏమిటంటే మనందరికీ చిరపరిచితమైన పాన్డోరా పేటిక (Pandora’s Box) అనే పదబంధం 16వ శతాబ్దంలో థియాగనీని అనువదించిన ఇరాస్మస్ (Erasmus) ప్రవేశపెట్టే వరకు వాడుకలోకి రానేలేదు.

గ్రీకు దేవుళ్ళంతా సమావేశం అయిన ఒక సందర్భంలో ఈ కథ మొదలవుతుంది. ఆ సమావేశానికి టైటనులు, ఒలింపియనులు హాజరవుతారు. ధర్మరాజులవారు రాజసూయయాగం చేసినప్పుడు ప్రథమ తాంబూలం అందుకోడానికి ఎవ్వరు అర్హులు అని తర్జనభర్జనలు పడ్డట్లే ఈ దేవుళ్ళంతా వారు చేస్తున్న ‘యాగం’లో ఒక ఎనుబోతుని బలి ఇచ్చిన తరువాత ప్రథమ ప్రసాద భక్షణకి ఎవ్వరు అర్హులు అని తర్జనభర్జనలు పడతారు. అప్పుడు ప్రొమీథియస్ (Prometheus)–ఇతనే దేవగణాల నుండి అగ్నిని దొంగిలించి మానవులకి ఇచ్చినవాడు–యుక్తియుక్తంగా ప్రసాదాన్ని రెండు అసమాన భాగాలుగా చేసి, ఒక భాగం ఎంచుకుని ప్రప్రథమంగా స్వీకరించమని దేవతల రాజైన జూస్ ముందు ఉంచేడు. జూస్ స్వర్గలోకానికి అధిపతి, దేవతల రాజే కాకుండా మోతాదుకి మించిన ‘అహం’ కలవాడు కనుక సహజంగా సింహభాగం తీసుకుంటాడు. నిజానికి ఆ పెద్దభాగం పైపైకి చూడ్డానికి పెద్దగా, అందంగా అలంకరించబడి ఉన్నా అడుగున అంతా బొమికలవంటి శాకాంబరీదేవీ ప్రసాదాలే! ‘అసలు వంటకాలు’ అన్నీ చిన్నభాగం లోనే ఉన్నాయి.

జూస్‌కి ఒళ్ళు మండిందంటే మండదూ మరి? రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదువా? దేవతల కళలకి కంసాలి అయిన హఫేస్టస్‌ని (Hephaestus) పిలిపించి ఒక అత్యద్భుతమైన అందగత్తెని సృష్టించమని జూస్ ఆదేశిస్తాడు. దేవతలైనా సరే, మానవులైనా సరే ఆమె అందానికి దాసులు అయిపోవాలని కోరతాడు జూస్. ఈ పని చెయ్యడానికి ఏఫ్రొడైటి (Aphrodite) నమూనాగా నిలబడడానికి ఒప్పుకుంటుంది.

హఫేస్టస్ మట్టిని, నీటిని కలిపి జీవకళ ఉట్టిపడేలా ఒక ప్రతిమని తయారుచేసి, నాలుగు దిక్కుల నుండి వాయువులని సమీకరించి ఆ ప్రతిమకి ప్రాణం పోస్తాడు. అప్పుడు ఒలింపియను దేవతలంతా అప్పుడే ప్రాణం పోసుకున్న ఆ బొమ్మకి తలొక బహుమానం ఇస్తారు. ఏఫ్రొడైటి ఆమెకి అసమానమైన అందాన్ని, ఆకర్షణని ఇస్తుంది. కలహభోజనుడు, వార్తావాహకుడు అయిన హెర్మెస్ కపటత్వం, టక్కులు, తంత్రజ్ఞానం, జిత్తులు, ఆమెకి ఆభరణాలుగా ఇస్తాడు. ఎథీనా ఆమెకి అందమైన దుస్తులు ఇచ్చి హస్తలాఘవత్వం నేర్పుతుంది. నీళ్ళల్లో ములిగిపోకుండా రక్షణకని పొసైడన్ ఒక ముత్యాల హారాన్ని ఇస్తాడు. తంబురా మీటుతూ పాట పాడడం అపాలో నేర్పుతాడు. జూస్ ఆమెకి తుంటరితనం, పెంకితనం, అల్లరి చేసే స్వభావం వరాలుగా ఇస్తాడు. చిట్టచివరికి హేరా కుతూహలం అనే లక్షణాన్ని వరంగా ఇస్తుంది.

ఈ విధంగా మొట్టమొదటి మానవ స్త్రీ స్వర్గంలోని హఫేస్టస్ కార్ఖానాలో మలచబడుతుంది. ఆమె దివి నుండి భువికి దిగి రాగానే ఆమెకి పాన్డోరా–అనగా ప్రసాదం అని అర్థం–అని పేరు పెట్టి ఆమె చేతికి నగిషీలు చెక్కిన అందమైన పెట్టెని బహుకరిస్తాడు హెర్మెస్: ‘ఈ పేటికని జూస్ నీకు ప్రత్యేక బహుమానంగా పంపేడు. ఎటువంటి పరిస్థితులలోను ఈ పెట్టె మూతని మాత్రం తెరవకూడదు సుమా!’ అని మరీమరీ హెచ్చరించి ప్రొమీథియస్ సవతి అన్నదమ్ముడైన ఎపిథీమియస్‌కి పాన్డోరాని బహుమానంగా ఇచ్చి హెర్మెస్ వెళ్ళిపోతాడు.

జూస్ టక్కరి బుద్ధులు బాగా ఎరిగిన ప్రొమీథియస్ జూస్ ఎటువంటి బహుమానం పంపినా అంగీకరించకుండా తిప్పికొట్టమని ముందుగానే తన సవతి అన్నదమ్ముడైన ఎపిథీమియస్‌ని హెచ్చరించేడు. కానీ ఏమి లాభం? పాన్డోరా అందచందాలు, ఆకర్షణ చూసి, ముగ్ధుడై మరొక భావం మనస్సులో చోటు చేసుకునే లోపున ఎపిథీమియస్ ఆమెని పెండ్లి చేసేసుకున్నాడు.

ఎపిథీమియస్-పాన్డోరాల వైవాహిక జీవితం సజావుగా సాగిపోతూ రోజులు నిమిషాలలా దొర్లిపోతున్నాయి కానీ పాన్డోరా అంతరాంతరాలలో ఒక కుతూహలం కుమ్మరి పురుగులా దొలిచేస్తోంది. జూస్ బహుమానంగా పంపిన పెట్టెలో ఏముంది? బంగారు నగలా? నాణేలా? పట్టు బట్టలా? చూడడానికి పెట్టె ఎంతో విలువైనదిగా కనిపిస్తోంది. లోపల ఇంకా విలువైనది ఏదో ఉండి ఉంటుంది. ఎన్నిసార్లో ఆ పెట్టె తెరవడానికి వెళ్ళడం, మూత చేత్తో పట్టుకోవడం, వెనకాడడం. పెట్టె ఎన్నడూ తెరవద్దని హెర్మెస్ పదేపదే హెచ్చరించేడు. తెరవకూడని పెట్టెని బహుమానంగా ఇవ్వడంలో అంతరార్థం? కానీ హేరా ఇచ్చిన కుతూహలం అనే వరం హెర్మెస్ హెచ్చరిక కంటే బలవత్తరమైనది. లోపల ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం చివరికి నెగ్గింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేని సమయంలో పాన్డోరా పెట్టెని సమీపించింది. ఇటు, అటు ఎవ్వరూ చూడడం లేదని రూఢి పరచుకుని, పెట్టె మూతని లేశమాత్రం, ఒక్క క్షణం పాటు, తెరచింది. అంతే! పెట్టేలోంచి బుస్సుమని శబ్దం వచ్చింది. ఆ శబ్దంతోపాటు ముక్కుపుటాలు అదిరిపోయేటంత దుర్వాసనతో ఆ గది అంతా నిండిపోయింది. పాన్డోరా పెట్టె మూతని గభీమని మూసేసింది. కానీ అప్పటికే జరగవలసిన హాని జరిగిపోయింది. ఇహ ఏమి చేసినా అది గతజలసేతుబంధనమే!

జూస్ ఆ పెట్టెలో దాచిపెట్టినవి ఏమిటిట? మానవలోకానికి కీడు కలుగజేసేవి: అరిషడ్వర్గాలు అయిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతోపాటు కొంటెతనం, కుత్సితపు నడవడి, దుర్మార్గం, ద్రోహభావం, ద్వేషం, ఘర్షణ, జుగుప్స, ఈర్ష్య, కరవు, కాటకం, అనారోగ్యం, వగైరాలు ఆ పెట్టెలో ఉన్నవి. కానీ అంతా చెడు కాదు; ఉద్దేశపూర్వకంగానో, కాకతాళీయంగానో ఆశావహం అయిన నమ్మకాన్ని కూడా జూస్ ఆ పెట్టెలో పెట్టేడు. జూస్ భార్య హేరా కుతూహలం అనే వరాన్ని అప్పటికే ఇచ్చి ఉంది కదా. ఆశావహం అయిన నమ్మకాన్ని కుతూహలంతో జోడించేసరికి అది మానవజాతికి ఎనలేని విలువ గల వరంగా పరిణమించింది. రేపు నేటి కంటే మెరుగ్గా ఉంటుందన్న నమ్మకమే మానవుడి ప్రగతికి ప్రథమ సోపానం. దానికి కుతూహలం జోడించేసరికి అది సత్యాన్వేషణకి మూలస్తంభం అయింది.

ఈ కథలో ప్రముఖంగా కనిపించే అంశం ఏమిటంటే గ్రీసు దేవతలు మానవుల వలెనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకి అతీతులు కాకపోవడమే కాకుండా కుత్సిత బుద్ధితో మానవుల జీవితాలలో కలుగజేసుకుని వాటితో చెలగాటాలు ఆడడం. ప్రొమీథియస్ మీద పగతో జూస్ చేసిన పని ఇది. ఈ కథ చదివిన తరువాత పాన్డోరా ద్వారా ఆ పగ ఎలా తీరిందో అర్థంకాదు. తర్కబద్ధంగా లేని ఈ పాన్డోరా కథ అంతా కల్పితం!

ఈ కథని ఆధారంగా చేసుకుని రకరకాల వ్యక్తులు అనేక వ్యాఖ్యానాలు చేసేరు. పాన్డోరా ఆ పెట్టె తెరవకపోతే ఈ ప్రపంచం అంతా, సుభిక్షంగా, శాంతియుతంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండేదేమో అన్న భావం ఈ కథలో అంతర్లీనంగా కనిపించింది కొందరికి. కానీ పాన్డోరా పెట్టె తెరచింది. కనుక ఈ నాడు మనం ఈ ప్రపంచంలో ఎదుర్కుంటున్న ఈతి బాధలన్నిటికి పాన్డోరాయే కారణం అని వీరి వాదం. ఈ కోణంలో ఆలోచించి మన పూర్వులది పురుషాధిక్య భావంతో స్త్రీలని ద్వేషించే సమాజం అని తీర్మానించడం తొందరపాటే అవుతుంది.

ఈ కథలో పనికొచ్చే నీతి ఏదైనా ఉందా అంటే ఉంది. పెట్టెలో ఏముందో చూద్దామనే కుతూహలం, ఆ ఉన్నదేదో మనకి ఏదో ఒక విధంగా పనికొస్తుందేమో అనే ఆశాజనక దృక్పథం లేకపోతే ఆధునిక విజ్ఞానశాస్త్రం ఇంతగా పురోభివృద్ధి చెందేది కాదు. ప్రయోగం చేసి చూడాలి. చేసిన ప్రయోగం విజయవంతం అవాలని లేదు. పెట్టె తెరచి చూడాలి. పర్యవసానాన్ని ఎదుర్కోవాలి. ఈ కోణంలో చూస్తే పాన్డోరా మన మొట్టమొదటి ‘సైంటిస్టు!’

కేసియోపియా కథ

పూర్వం ఎథియోపియాని (నేటి ఇథియోపియా) సెఫియస్ (Cepheus) అనే రాజు పాలించేవాడు. అతని రాణి కేసియోపియా (Cassiopeia) తనంత అందగత్తె ఈ భూలోకంలోనే కాదు, స్వర్గలోకంలో కూడా లేదని విర్రవీగుతూ ఉండేది. ఒకనాడు సముద్రపుటొడ్డున కెరటాలతో జలకాలాడుతున్న ఒక జలకన్యని (nymph) చూసి, ‘అందంలో ఈమె నా కాలి గోటికి కూడా సరిరాదు’ అంటూ ఈసడించుకుంది. ఈ మాటలు సముద్రాలకి అధిదేవత అయిన పొసైడన్ (Poseidon) చెవిని పడ్డాయి. అయన ఉగ్రుడై సీటస్ (Cetus) అనే ఒక జలరక్కసిని సృష్టించి ఇథియోపియా మీదకి వదిలేడు. తిమింగిలాన్ని పోలిన ఆ రాక్షసి ఆ రాజ్యాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రజలు భయంతో తమ రాజు దగ్గర మొర పెట్టుకున్నారు.

కర్తవ్యం బోధపడక రాజు ఒరాకిల్‌ని సంప్రదించేడు. పొసైడన్ కోపం చల్లారాలంటే రాజు తన అందాల కూతురైన ఆండ్రోమిడాని (Andromeda) ఆ జలరక్కసికి బలి ఇవ్వాలసిందే అని చెబుతారు. తన కూతురుని ఇలా బలి ఇవ్వడం రాజుకి ఇష్టం లేకపోయినా మరొక మార్గం కనిపించక రాజు సీటస్‌కి ఆహారంగా తన కూతురుని ఒక బండరాతికి గొలుసులతో కట్టేసి సముద్రపు ఒడ్డున వదిలేసేడు.

ఇది ఇలా ఉండగా మెడూసాని (Medusa) చంపి ఆమె తలకాయని ఎథీనాకి (Athena) అప్పగించే పని మీద పెర్సియస్ (Perseus) అనే వీరుడు బయలుదేరేడు. (ఈ పెర్సియస్ తండ్రి జూస్, తల్లి ఒక మానవ వనిత.) మెడూసా కూడా కేసియోపియా చేసిన తప్పులాంటి తప్పే చేసి శాపగ్రస్తురాలయింది. ‘నా బంగారు జుత్తు కూడా ఎథీనా జుత్తులా అందంగా మెరుస్తూ ఉంటుంది!’ అని మెడూసా అన్నదని ఎథీనాకి కోపం వచ్చి మెడూసాని ఒక అసహ్యకరమైన శాల్తీగా మార్చేసింది. ఈ శాల్తీ జుత్తులో వెంట్రుకలకి బదులు పాములు ఉంటాయి. ఈ శాల్తీని ఎవరు చూస్తే వారు రాయిగా మారిపోతారు. మెడూసా ఉంటున్న గుహ చుట్టూ శిలలుగా మారిపోయిన వీరుల విగ్రహాలెన్నో పడివున్నాయి!

మెడూసా తల నరకడానికి బయలుదేరిన పెర్సియస్‌కి కూడా అదే గతి పట్టి ఉండేదే కానీ అతనికి దైవ సహాయం లభించింది: ఎథీనా అద్దం లాంటి కవచాన్ని ఇచ్చింది . పెగసస్ (Pegasus) అనే రెక్కలగుర్రాన్ని హెర్మీస్ ఇచ్చేడు. ఎవరి తల మీద పెట్టుకుంటే వారు అదృశ్యం అయిపోయే మహిమ కల కిరీటాన్ని హేడీస్ ఇచ్చేడు. అద్దం లాంటి కవచంలో ప్రతిబింబాన్ని చూస్తూ ఒకే ఒక కత్తి వేటుతో మెడూసా తల నరికేడు పెర్సియస్. ఆ తల పట్టుకుని రెక్కలగుర్రం మీద సవారి చేస్తూ సముద్రం మీదుగా వెళుతూ దారిలో ఇథియోపియా సముద్రతీరంలో గొలుసులతో రాయికి కట్టేసి పడి ఉన్న ఆండ్రోమెడాని చూసేడు. ఆమె ఉదంతం ఆమె చెప్పగా విన్నాడు. ఇంతలోనే సీటస్ రాక్షసి ఆకలితో ఈదుకుంటూ వచ్చింది. పెర్సియస్ తన ఖడ్గంతో ఆ జలరాక్షసిని చంపేసి ఆండ్రోమెడాని పెళ్ళి చేసుకున్నాడు. మెడూసా తలని ఎథీనాకి ఇచ్చేడు. (ఈ ఉదంతంతో క్లాష్ ఆఫ్ ది టైటన్స్ అని 1981లో ఒక సినీమా కూడా వచ్చింది.)

ఈ కథలోని ప్రధాన పాత్రలన్నీ నక్షత్రాలుగా మారి ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి. కేసియోపియాని ఆకాశంలో గుర్తించడం చాల సులభం. ఉత్తరకాశంలో, సప్తర్షి మండలానికి ఎదురుగా, ధ్రువ నక్షత్రం నుండి సమాన దూరంలో, కాసింత సొట్టగా ఉన్న ఇంగ్లీషు అక్షరం W ఆకారంలో ప్రకాశవంతమైన అయిదు చుక్కలతో ఏర్పడ్డ రాశియే కేసియోపియా.

కేసియోపియా అని గ్రీసు దేశస్తులు పిలిచిన నక్షత్ర మండలాన్ని వివిధ సంస్కృతులలో ప్రజలు వివిధమైన పేర్లతో పిలిచేరు. ఈ గుంపులో ఉన్న నక్షత్రాల గురించి అరబ్బులకి తెలుసు, చైనీయులకి తెలుసు, వేదకాలపు భారతీయులకి తెలుసు. వారివారి పురాణ గాథలలో ఇటువంటి కథలు వారికీ ఉన్నాయి. కనుక గ్రీసు పురాణాలలో ఉన్న కథలు అన్నీ గ్రీసు కథకుల స్వకపోలకల్పితాలు కాకపోవచ్చు.

వేదకాలపు భారతీయులు కేసియోపియా నక్షత్ర మండలాన్ని అప్సరసలు అనిన్నీ, కాశ్యపీయులు అనిన్ని అన్నారు. దీనికి ఆధారం ఏమిటి? కశ్యప ప్రజాపతికి ప్రధాదేవి వలన అప్సరసలు పుట్టేరని సంస్కృత భారతం, ఆదిపర్వం (35, 50, 51) చెబుతోంది. కశ్యప ప్రజాపతికి సురభి వల్ల మేనకాది ఆప్సరసలు పుట్టేరని కూడా చెబుతోంది. కనుక కేసియోపియా అనే మాట కశ్యప పదోద్భవమేమో అని మహీధర నళినీమోహన్ అభిప్రాయపడ్డారు.

ఇంతటితో అవలేదు. ఆకాశంలో కేసియోపియా నక్షత్ర మండలానికి పశ్చిమముగాను ఉత్తరంగాను సెఫియస్ (Cepheus) మండలము; దక్షిణంగాను, పశ్చిమముగాను ఆండ్రోమెడా (Andromeda) మండలము, నైరుతి దిశలో పర్సియస్ (Perseus) మండలము కనిపిస్తాయి. ఇవన్నీ పాశ్చాత్యులు ఈ నక్షత్ర మండలాలకు పెట్టిన పేర్లు. అరబ్బులు పెట్టుకున్న పేర్లు వేరు, భారతీయులు పెట్టుకున్న పేర్లు వేరు. వారి వారి కథలు వేర్వేరు.

పర్సియస్ మండలములో పెర్సియస్ వీపు మీద నక్షత్రాల వరస వంపు తిరిగినట్లు ఉంటుంది. అందుకని వాటిని పర్సియస్ చాపం (Perseus Arrow) అంటారు. అతడి నడుము పటకా నుండి వేళ్ళాడుతూ మెడూసా శిరస్సు కనిపిస్తుంది. ఆ శిరస్సు నుదిటి మీద ఒక విచిత్రమైన నక్షత్రం కనిపిస్తుంది. దాని కాంతి పెరుగుతూ, తరుగుతూ కనిపిస్తుంది. అందుకని దానిని అరబ్బులు అల్‍గోల్ (Algol) అని పిలిచేవారు. అరబ్బీలో అల్‍గోల్ అంటే దయ్యపు నక్షత్రం. దరిమిలా ఈ వింత ప్రవర్తనకి కారణం తెలిసింది. ఇది ఒక జంట నక్షత్రం అవడం, అందులో ఒకటి నల్లటి నక్షత్రం అవడం. ఈ రెండూ అమ్మాయిలు ఒప్పులగుప్ప ఆడినట్లు ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయనిన్నీ, మన దృక్పథంలో నల్లటి తార అడ్డు వచ్చినప్పుడల్లా వాటి కాంతి తగ్గుతుందనిన్నీ 1782లో హాలండ్ దేశపు (చెవిటి, మూగ అయిన) 18 ఏళ్ళ గుడ్రిక్ అనే కుర్రాడు కనిపెట్టేడు!

ఇప్పుడు హిందూ పురాణ గాథలలో ఆండ్రోమెడా కథ ఎలా ఉందో చూద్దాం. అల్‍గోల్ నక్షత్రాన్ని హిందువులు పులోమ రాక్షసుడు అన్నారు. భృగు మహర్షి (Perseus) భార్య పేరు పులోమ. ఆమె నిండు చూలాలు. భృగుడు స్నానం చెయ్యడానికి నదికి వెళ్ళిన తరుణంలో పులోముడు అనే వింత రాక్షసుడు ఇంట ప్రవేశించి, ‘నేను పులోముడను. నువ్వు పులోమవు. నువ్వు నా భార్యవి’ అని పులోమని అపహరించేడు. ఆమె గర్భస్థ శిశువు తల్లి కన్నీరు చూడలేక గర్భచ్యుతుడు అవుతాడు. అతడే చ్యవనుడు (Triangulum).

చ్యవనుడు బహుకాలం తపస్సు చేయగా అతని శరీరం పుట్టలు పట్టిపోయింది. కళ్ళు మాత్రం మిణుగురు పురుగుల్లా మెరవసాగేయి. అప్పుడు శర్యాతి అనే రాజు కూతురు సుకన్య ఆ ప్రాంతంలో ఆటలాడుతూ, మిణుగురు పురుగులని భ్రమపడి పుల్లతో చ్యవనుని కళ్ళు పొడిచింది. ఆ కళ్ళ నుండి వచ్చిన రక్తాన్ని చూసి సుకన్య భయపడింది. తెలియక చేసిన తప్పు కనుక క్షమించమని శర్యాతి వేడుకున్నాడు. సుకన్యని తనకిచ్చి పెళ్ళిచేస్తే క్షమిస్తానని చ్యవనుడు అన్నాడు. సుకన్య ఒప్పుకుంది. అశ్వినులు చ్యవనునికి కళ్ళని వరంగా ప్రసాదించేరు. అంతవరకు హవిర్భాగాలకి (యజ్ఞఫలాలకి) నోచుకోని అశ్వినులకి చ్యవనుడు హవిర్భాగాలని ప్రసాదించేడు. అందుకు కోపించి చ్యవనుని మీదకి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించేడు. చ్యవనుడు అగ్నిహోత్రుడు నుండి మద అనే రాక్షసుడిని పుట్టించి ఇంద్రుడి మీదకి వదిలేడు. ఇంద్రుడి మదం అణిగింది. అశ్వినులకి హవిర్భాగం ఇవ్వడానికి అంగీకరించేడు. ఇంద్రుని మదము అణచి వేయడానికి కారణభూతురాలైన చ్యవనుని తల్లిని (అనగా భృగుపత్నిని) ఇంద్రమద అన్నారు. అదే పాశ్చాత్యుల ఆండ్రోమెడా అని మహీధర నళినీమోహన్ వ్యాఖ్యానించేరు (మహీధర నళినీమోహన్, నక్షత్ర వీధులలో భారతీయుల పాత్ర, 1997. అవంతీ పబ్లికేషన్స్, 2-2-185/56/10 సోమసుందర్ నగర్, హైద్రాబాదు – 500013).

పులోమ రాక్షసుడు చావు తప్పి కన్ను లొట్టపోయి చ్యవన నక్షత్రరాశికి ఎదురుగా పులుకు పులుకూ గుడ్లు మిటకరిస్తూ భృగుపరశు గుంపులో రెండవ చుక్కగా (Beta Perseus) మనకి కనబడుతున్నాడు. దీనినే అల్‍గోల్ ది బ్లింకింగ్ డీమన్ అంటారు.


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...