పంచేంద్రియాలు: 2. చూపు

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం
షణ్ణాం రసానాం లవణం ప్రధానం
భవేత్ నదీనాం ఉదకం ప్రధానం

చాణక్యనీతి శ్లోకాలలో ఉందిట ఈ శ్లోకం. అనగా, ఇంద్రియాలన్నిటిలోనూ కన్ను ముఖ్యం, శరీరం అంతటిలోనూ తల ముఖ్యం, షడ్రుచులలో ఉప్పు ముఖ్యం, వాపీ కూప తటాకాది జలాల కంటే నదుల జలం ప్రశస్తం అని శ్లోక భావార్థం. భవేత్ అనే క్రియాపదం అన్ని అంశాలకూ అన్వయం ఔతుంది.

‘దృష్టి లోపించిన వ్యక్తి క్రిమికీటకాలతో సమానం’ అన్నాడుట ఆయుర్వేద శాస్త్రానికి ఆద్యులనదగ్గ త్రిమూర్తులలో ఒకడైనవాడు, అష్టాంగసంగ్రహ అనే గ్రంథాన్ని రచించిన వాడు అయిన వాగ్భటాచార్యుడు. ఎప్పుడో అన్నాడు కనుక సరిపోయింది కానీ ఈ రోజులలో అని ఉంటే వికలాంగుల సంస్థలు యూట్యూబ్ మీద స్మితా సబర్వాల్‍ని ఏకినట్లు నెటిజనులు ఏకి పారేసి ఉండేవారేమో!

‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అనే వాక్యం యథాతథంగా కనిపించకపోయినా ఆ భావం మన సనాతన గ్రంథాలలో ఎన్నో చోట్ల కనిపిస్తుంది. భగవద్గీత మూడవ అధ్యాయంలో బాహ్య ప్రపంచాన్ని అవగాహన చేసుకునే ప్రక్రియలో ఇంద్రియాల పాత్ర గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఉపనిషత్తులలో పెక్కు చోట్ల ఆత్మ, పరమాత్మలని అవగాహన చేసికోవడంలో ఇంద్రియాల పాత్ర, ప్రత్యేకించి నయనేంద్రియం పాత్ర, కనిపిస్తుంది. ‘దేనిని కండ్లు చూడలేవో, దేనివల్ల కండ్లు చూడగలుగుతున్నాయో అదే పరమాత్మ’ అంటుంది కేనోపనిషత్తు. ఇలా ఒకటేమిటి, పతంజలి యోగసూత్రాలలో, చరక సంహితంలో నయనేంద్రియం యొక్క ప్రాశస్త్యం గురించి ప్రస్తావన అనేక కోణాలలో కనిపిస్తుంది.

విగ్రహాన్ని సర్వసన్నద్ధం చేసేటప్పుడు కన్నులు చెక్కడం చివరలో పూర్తి చేస్తాడట శిల్పి. ప్రతిష్ఠలోనూ నేత్ర ఉన్మీలనం చివరన చేసే కార్యం. దృష్టికి ఉన్న శక్తి అనంతం. సంభాషణలో ఒకరి కంటిచూపు పైననే ఎదుటివారి దృష్టి ఉంటుంది. భగవంతుడి దయావీక్షణం మనపై ప్రసరించాలని కోరుకొంటాం.

ఆధునిక కాలంలో వైజ్ఞానికులు ఏమంటున్నారో చూద్దాం. ‘జ్ఞానేంద్రియాలలో ఏది ముఖ్యమైనది?’ అని ఇటీవల (2019లో) యునైటెడ్ కింగ్‍డమ్‍లో జనాభిప్రాయం సేకరించేరు. ఈ అధ్యయనంలో దృష్టి అత్యంత ముఖ్యమైనది అనిన్నీ, ఆ తరువాత వినికిడి అనిన్నీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ‘కాకి అయి కలకాలం బ్రతికే కంటే హంస అయి ఆరు నెలలు బ్రతకడం మేలు’ అన్న ధోరణిలో ‘చూపు పూర్తిగా పోగొట్టుకుని పదేళ్ళు బ్రతికేకన్నా చూపుతో నాలుగున్నర ఏళ్ళు మాత్రమే బ్రతకడం మెరుగు’ అని వారు వెల్లడించారు. ‘చూపు, వినికిడి తరువాత ఏది ముఖ్యం?’ అని అడిగితే తుల్యత (balance) అనిన్నీ, ఆ తరువాతే స్పర్శజ్ఞానం, రుచి, వాసన అనిన్నీ వెల్లడించారు. ముదిమి వయస్సులో, మరొకరిమీద ఆధారపడకుండా, దైనందిన కార్యకలాపాలు నిర్వర్తించుకోడానికి నడక ప్రధానం, ఆ నడకకి తుల్యత ప్రధానం అని వారు అలా అనుకుని ఉంటారు. ఈ రకం ప్రజాభిప్రాయంతో సేకరించే ఫలితాలలో చాలా లోపాలు, లొసుగులు ఉంటాయి కనుక వాటిని మనం తులం సంశయంతో స్వీకరించాలి.

భోక్త-భోజ్యాల కళ్ళు

అద్దం ఎదుట నిలబడి ఒకసారి చూసుకొండి! ఏమిటి కనిపించింది? రెండు కళ్ళతో సూటిగా ఎదుటికి చూస్తూన్న ఒక భోక్త (predator) యొక్క విగ్రహం! దరిదాపుగా భోక్తలన్నిటికి రెండు కళ్ళు, ముఖానికి మధ్యస్థంగా ఉండి, ఎట్టఎదుటకు సూటిగా చూస్తూ ఉంటాయి; తద్వారా వాటికి ప్రాప్తించిన ద్విచక్షు దృష్టిని (binocular vision) ఉపయోగించి అవి భోజ్యాన్ని (prey) వేటాడి, పట్టుకుని తినగలవు! కాంతిని సేకరించి, సమీకరించడానికీ, ఎదురుగా ఉన్న దృశ్యంలోని నేపథ్యం నుండి భోజ్యాన్ని గుర్తుపట్టి ఎంపిక చేయడంలోను, అలా ఎంచిన భోజ్యం మీద దృష్టిని కేంద్రీకరించడంలోను, ఆ కదిలే భోజ్యం నుండి తన దృష్టి చెదరకుండా నిలపడంలోనూ ఈ నయనద్వయం వెలిబుచ్చే త్రిమితీయ దృష్టిని (stereoscopic vision) అతిక్రమించే ఆధునిక సాంకేతిక పరికరం ఈనాటికీ తయారు కాలేదనేదన్నది విస్మరించరాని నిజం!

భోక్త శరీర నిర్మాణం బొమ్మ అయితే భోజ్యం శరీర నిర్మాణం బొరుసు. భోక్తది అభిముఖ దృష్టి, భోజ్యానిది పరిధీయ దృష్టి (peripheral vision). వేటాడే సింహం యొక్క కళ్ళు ముఖానికి మధ్యస్థంగా, ఎదురు చూపుతో ఉండడం వల్ల గంభీర గోచరత్వంతో (depth perception) ఎంతో దూరం చూడగలదు. దాని భోజ్యమైన లేడి కళ్ళు చెంపకి చేరడేసి చొప్పున ఇటూ అటూ ఉండడం వల్ల సంక్రమించిన పరిధీయ దృష్టితో ఏ పక్కనో నక్కి ఉన్న సింహం ఆచూకీ పసికట్టడానికి ఉపయోగపడతాయి. ఇలా భోక్త-భోజ్యం మధ్య పోటీ సమతూకంలో ఉన్నంతకాలం రెండింటి మనుగడకి భరోసా ఉంటుంది.

భోక్త-భోజ్యాల మధ్య జరిగే నిరంతర పోటీలో మరొక ఆయుధం ఛద్మరూపం (camouflage). గంగానది సాగరసంగమం చేసే ప్రదేశంలో ఉన్న సుందర్బన్ మడ అడవులలో వేటాడే పులి మన కంటికి పచ్చటి శరీరం మీద నల్లటి చారలతో స్ఫుటంగానే కనిపిస్తుంది కానీ దాని ఆహారమైన లేడి కళ్ళకి ఆ రంగులు కనబడవు; కేవలం తెలుపు-నలుపు చారలతో ఉన్న ఆ పులి నేపథ్యంలోని వెలుగు-నీడలలో కలిసిపోతుంది!

మన మనుగడకి వేటాడవలసిన అవసరం తగ్గిపోయినప్పటికీ మనం మన నయనేంద్రియాల మీద ఆధారపడినంతగా మరే ఇంద్రియం మీదా ఆధారపడం. శత్రువుని (భోజ్యాన్ని) తాకాలన్నా, రుచి చూడాలన్నా భోక్త ఇబ్బందికరమైనంత దగ్గరగా వెళ్ళాలి. కేవలం శత్రువు వాసనని పసికట్టాలన్నా, ఉనికిని వినాలన్నా కాసింత దూరం నుండి ఆ పని చెయ్యవచ్చు. కానీ దృష్టితో కోట దాటి, పేట దాటి, బాట లేని అడవి దాటి, ఆమడల దూరంలో ఉన్న పర్వతశ్రేణులని దాటి, నక్షత్ర వీధులని దాటి, క్షీర సాగరాల పర్యంతం చూడవచ్చు. మానవుల చెవుల శబ్దగ్రాహక శక్తికి అందని జోరుతో ప్రకంపించే శబ్ద తరంగాలని వినగలిగే జంతువులు – గబ్బిలాలు, గండుమీనులు (dolphins) – తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమ చెవులతో స్పృజించి ‘చూడ’ గలుగుతున్నాయి! కానీ మనం మాత్రం మన పరిసరాలని ఆకళింపు చేసుకోడానికి కళ్ళ మీద ఆధారపడినంతగా మరే ఇతర జ్ఞానేంద్రియం మీదా ఆధారపడటం లేదు. అందుకనే కాబోలు మానవుని మెదడులో సింహభాగం దృగ్గోచరత్వానికి కేటాయించబడింది!

కన్ను యొక్క నిర్మాణశిల్పం

మన మెదడుకి చేరే సమాచారంలో 90శాతం దృశ్యరూపం లోనే ఉంటుందని ఒక అంచనా ఉంది. అదే విధంగా మన మెదడు ఉపరిభాగంలో ధూసర వర్ణంతో ఉన్న వల్కలంలో (cerebral cortex or grey matter) 50శాతం దృశ్యరూపంలో వచ్చే సమాచారాన్ని పరీక్షించి అర్థం చేసుకుందికే కేటాయించబడిందిట. నయనం ప్రధానం అని ఊరకనే అనలేదు!


1. కన్ను, ఎదుటనుండి చూసినప్పుడు.

ఇప్పుడు మానవుడి కన్ను ఎలా పని చేస్తుందో చూద్దాం. ఎదిగిన మానవుడి కన్ను దరిదాపు గోళాకారంలో – ఒక అంగుళం వ్యాసం కలిగి – ఉంటుంది. ఈ కంటిగుడ్డు ఎదుట భాగాన్ని తెలుగులో కాచబింబము లేదా శుక్లపటలము అనిన్నీ, ఇంగ్లిష్‍లో కార్నియా (cornea) అని అంటారు. పారదర్శకంగా ఉండే ఈ పైపొర కంటికి రక్షణ ఇవ్వడమే కాకుండా బయట నుండి లోపలికి వెళ్ళే కాంతిని కొద్దిగా ఒంచుతుంది. అప్పుడు కాంతి చిన్న బెజ్జం గుండా కంటి లోపలికి ప్రవేశిస్తుంది. ఈ బెజ్జాన్ని కంటిపాప (pupil) అంటారు. (లేటిన్ భాషలో pupilla అంటే చిన్న పాప. మనం మరొకరి కంట్లోకి చూసినప్పుడు మన ప్రతిబింబం చిన్న పాపలా ఈ బెజ్జంలో కనిపిస్తుంది.) ఈ బెజ్జం పరిమాణాన్ని పెంచి, తగ్గించి, లోపలికి ఎంత వెలుగు వెళుతున్నాదో నియంత్రించడానికి ఒక కంకణాకారపు కండరం ఉంటుంది. ఈ కండరాన్ని కనీనిక లేదా తారకం (iris) అంటారు. ఈ కండరం ఏ రంగులో ఉంటే కన్ను ఆ రంగులో కనిపిస్తుంది. గ్రీకు భాషలో ఐరిస్ అంటే ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సులో రంగులలానే మనుష్యుల కనీనికలు కూడా అనేక రంగులలో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో చాలామంది కళ్ళు నల్లగా ఉంటాయి, ఉత్తరానికి వెళుతూన్నకొద్దీ నలుపు తగ్గి కపిలవర్ణం, కశ్మీర్ వరకు వెళితే నీలి కళ్ళు, ఆప్ఘనిస్థాన్‍లో లేత తేనె రంగులో (hazel) ఉన్న కళ్ళు కనిపిస్తాయి. పైపైకి కేవలం రంగులలో మాత్రమే తేడాలు కనిపించినా వివరాలు సూక్ష్మంగా పరిశీలిస్తే కనీనికలలోని ‘కంటి ముద్రలు’ వేలి ముద్రలలా అద్వితీయం, నిర్దిష్టం. అందుకనే మనుష్యులని నిర్ద్వందంగా గుర్తు పట్టడానికి కంటి ముద్రలని (iris recognition) ఈ రోజులలో విరివిగా వాడుతున్నారు.

పూర్వకాలపు కెమెరాలలో ఒక లక్ష్యం యొక్క ప్రతిబింబాన్ని కేంద్రీకరించడానికి (ఫోకస్ చెయ్యడానికి) అభిముఖ కటకాన్ని (object lens) లక్ష్యానికి దగ్గరగానో, దూరంగానో జరిపేవాళ్ళం కదా. ఈ పని చెయ్యడానికి కంటిలో చిక్కుడుగింజ ఆకారంలో రబ్బరులా సాగే స్పటికం వంటి పారదర్శకమైన కటకం (lens) ఉంటుంది. ఇది కండరాల సహాయంతో సాగడం, ముకుళించుకోవడం వల్ల లక్ష్యం యొక్క ప్రతిబింబం కంటి వెనుక భాగంలో ఉన్న అక్షిపటలం (retina) అనే తెర వంటి పొర మీద (తలకిందులుగా) పడుతుంది.

పాత కాలపు కెమెరాలలో ప్రతిబింబాన్ని నమోదు చెయ్యడానికి ఫిల్మ్ (లేదా, పటలం) ఉండేది. కనుగుడ్డు లోపల, వెనుక గోడ మీద, అస్తరు (lining) లాంటి పూతపూసిన పొర ఉంటుంది. అదే అక్షిపటలం లేదా రెటీనా అంటే. ఈ అక్షిపటలం మీద రెండు రకాల కాంతిగ్రాహక (photosensitive) కణాలు ఉంటాయి: శలాకములు (rods), శంకులు (cones). ఇక్కడ రెండు రకాల కణాలు అవసరం. ఎందుకంటారా? మన ప్రపంచం వెలుగు-చీకట్ల సంఘాతం. నూట ఇరవైయైదు మిలియనుల తిన్నని, సన్నని శలాకములు మన దృక్పథంలో ఎంత వెలుగు ఉందో నిర్ణయిస్తాయి. వీటి సహాయంతో మనం అత్యల్పమైన వెలుగు ఉన్న చీకటిలో కూడా చూడగలం! బొద్దుగా ఉన్న ఏడు మిలియను శంకులు ‘అనేక రంగుల’లో ఉన్న ప్రపంచాన్ని వీక్షిస్తాయి. మూడు ప్రాథమిక రంగులని (ఎరుపు, నీలం, ఆకుపచ్చ) గుర్తించడానికి మూడు రకాల శంకులు ఉంటాయి. ఈ శంకులు బాగా వెలుగు ఉన్నప్పుడే పని చేస్తాయి. అందుకనే మనకి చీకట్లో రంగులు కనబడవు. వివిధ మతాల విశ్వాసాల మీద వ్యాఖ్యానిస్తూ సర్ ఫ్రేన్సిస్ బేకన్ అంటారు: ‘చీకట్లో రంగులన్నీ ఒకేలా కనిపిస్తాయి.’

శలాకములు, శంకులు ఉమ్మడిగా పని చేస్తూ అక్షిపటలం మీద పడ్డ ప్రతిబింబాన్ని నేత్రనాడి (optic nerve) ద్వారా మెదడుకి చేరవేస్తాయి. నేత్రనాడి ఎక్కడనుండి బయలుదేరుతుందో అక్కడ అక్షిపటలం మీద శలాకములు, శంకులు ఉండవు. కనుక ఆ ప్రాంతం మీద పడ్డ ప్రతిబింబం నమోదు అవదు. అందుకని దానిని అంధస్థలం లేదా గుడ్డిబొట్టు (blind spot) అంటారు.


2. కన్ను నిర్మాణం, పక్కనుండి చూసినప్పుడు.

అక్షిపటలానికి మధ్యస్థంగా ఉన్న ఒక లొత్త వంటి భాగాన్ని లేటిన్ భాషలో ఫోవియా (fovea) అంటారు; ఈ లొత్తలో కేవలం శంకులు మాత్రమే దట్టంగా ఉంటాయి. సూది బెజ్జంలో దారం ఎక్కించడం వంటి సున్నితమైన పనులు చేసే సమయంలో దృష్టిని తీక్షణంగా కేంద్రీకరించడానికి ఈ లొత్త ఉపయోగపడుతుంది. ఈ లొత్తలో ఉన్న శంకుల నుండి – ఒకొక్క శంకు నుండి వ్యష్టిగా ఒకొక్క నాడీతంతువు చొప్పున – నేరుగా మెదడుకి సమాచారం మోసుకువెళ్ళడానికి వెసులుబాటు ఉంటుంది.

ఒక విధంగా చూస్తే ఈ అక్షిపటలం మెదడులో ఒక భాగమే! వైద్యుడు అక్షిపటలాన్ని చూస్తూన్నప్పుడు జీవంతో తొణికిసలాడుతూన్న మెదడుని చూస్తున్నాడు(ది). సజీవమైన మెదడులో ఈ భాగం ఒక్కటే మనకి పైనుండి కనిపించేది!

గుడ్డులో సొన ఉన్నట్లే కంటిగుడ్డులో కూడా సొన వంటి పారదర్శకమైన ద్రవపదార్థం ఉంటుంది. ఇది కంటి ఆకారాన్ని సరిగ్గా (అంటే, గుండ్రంగా) ఉంచడానికి, కాంతి కిరణాలు అడ్డులేకుండా ప్రసారం అవడానికి సహాయపడుతుంది. కంటిగుడ్డులో నిజానికి రెండు అరలు ఉన్నాయి. ముందు అరలో (శుక్లపటలానికీ కటకానికీ మధ్యలో) జలాకార రసం (aqueous humor) అనే నీటివంటి పలచనైన ద్రవం ఉంటుంది. వెనుక అరలో (కటకానికీ అక్షిపటలానికీ మధ్యలో) స్పటికాకార రసం (vitreous humor) అనే చిక్కని ద్రవం ఉంటుంది.

అక్షిపటలం మీద పడ్డ కాంతి ఏ రంగుదో ఎలా నిర్ణయించబడుతుంది? ఉదాహరణకి ఆకుపచ్చ కాంతిలో మోలు ఒక్కంటికి 240,000 జూలులు (240000Joules/mole or J/mol) శక్తి ఉంటుంది. ఈ శక్తికి మన కంటి అక్షిపటలంలో ఉండే రసాయన బంధాలు తెగవు కాని, చలించి ఒంగుతాయి. ఇలా ఒంగినప్పుడు అక్షిపటలం విద్యుత్ వాకేతాలని (signals) ఉత్పత్తి చేసి మెదడుకి పంపుతుంది. అదే మనకి ఆకుపచ్చ అనే భ్రాంతిని కలుగజేస్తుంది. కానీ గామా కిరణాలు, ఎక్స్-కిరణాలు, అతి నీలలోహిత కిరణాలలో శక్తి, మోలు ఒక్కంటికి 480,000 జూలులు దాటి ఉంటుంది కనుక వీటి తాకిడి ధాటికి తట్టుకోలేక పైన చెప్పిన రసాయన బంధాలు తెగిపోతాయి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది కాదు! తెగేదాకా లాగకూడదు!

ఇంత హడావిడి జరిగినా దృగ్గోచరత్వము (visual perception) – అనగా ‘చూడడం’ అనే ప్రక్రియ – కంటిలో జరగదు. అక్షిపటలం మీద పడ్డ ప్రతిబింబాన్ని విద్యుత్ వాకేతాలుగా (signals) మార్చి నేత్రనాడి మెదడు వెనుక భాగంలో ఉన్న కపాలాస్థిక తమ్మె (occipital lobe) లోని దృశ్య వల్కలము (visual cortex) అనే భాగానికి – అనేక అంచెలలో – Cornea → aqueous humor → pupil —> lens → vitreous humor → retina → optic nerve → optic chiasm → optic tract → lateral geniculate body → optic radiations → visual cortex – చేరవేస్తుంది.

ఇలా ప్రయాణం చేసిన బాటలో ముఖ్యమైన అంశాల ఎంపిక, అనవసరమైన అంశాల గలనం జరిగిన తరువాత మనం చూస్తూన్నది ఏమిటో మన దృశ్యవల్కలము మనకి చెబుతుంది. అనగా, మన మెదడు మనకి ఏది చెబుతున్నాదో అదే మనకి కనిపిస్తుంది కానీ కన్ను చూస్తూన్నదంతా మనకి కనిపించదు. అనగా, మన మెదడు ‘నిజాన్ని కప్పి పెట్టి’ మనకి ఒక మాయా ప్రపంచాన్ని చూపిస్తున్నాదన్నమాట. మన జ్ఞానేంద్రియాలు సృజించే ‘నిజాన్ని’ (Reality) చూడాలంటే ఈ మెదడు కల్పించే మాయని తొలగించి చూడగలగాలి! మనం చూసేదంతా ఒక మిథ్య! అందుకనే ‘జగమే మాయ’ అన్నారేమో!

కంటికి వచ్చే ఆరోగ్య సమస్యలు

ఇంత క్లిష్టతతో కూడిన వ్యవహారం కనుక వైద్యపరంగా కంటికి వచ్చే సమస్యలు అనేకం. వీటిలో ముఖ్యమైనవి, మనందరికీ పరిచయమైనవి కొన్నింటిని సమీక్షిద్దాం.

  1. హ్రస్వదృష్టి (nearsightedness or myopia) అనే లోపం ఉన్న వారిలో దగ్గరగా ఉన్న వస్తువులు బాగానే కనిపిస్తాయి కాని, దూరపు వస్తువుల నుండి వచ్చే కాంతికిరణాల కూడలి (focus) అక్షిపటలం చేరకుండా కాసింత ముందు పడుతుంది. ఈ సమస్యకి శుక్లపటలంలో ఎక్కువ ఒంపు ఒక కారణం అయితే, కంటిగుడ్డు కొంచెం ఎక్కువ కోలగా ఉండడం వేరొక కారణం కావచ్చు. దీనికి కళ్ళజోడు ఒక పరిష్కారం అయితే, లేసర్ ఉపయోగించి శస్త్ర చికిత్స ఉపయోగించి శుక్లపటలంలో ఒంపుని సరిదిద్దటం వేరొక మార్గం.
  2. దూరదృష్టి (farsightedness or hyperopia) అనే లోపం ఉన్న వారిలో దూరంగా ఉన్న వస్తువులు బాగానే కనిపిస్తాయి కాని, దగ్గర వస్తువుల నుండి వచ్చే కాంతి కిరణాల కూడలి (focus) అక్షిపటలం దాటి కాసింత అవతల పడుతుంది. ఈ సమస్యకి శుక్లపటలంలో సరిపడినంత ఒంపు లేకపోవడం ఒక కారణం అయితే, కంటిగుడ్డు చప్పిడిగా ఉండడం వేరొక కారణం కావచ్చు. దీనికి కళ్ళజోడు ఒక పరిష్కారం అయితే, లేసర్ ఉపయోగించి శస్త్ర చికిత్స వేరొక మార్గం.
  3. చత్వారం (presbyopia) అనేది వయస్సు మళ్ళిన వారిలో వస్తుంది. ఈ లోపం ఉన్నవారు దగ్గర వస్తువుల మీద దృష్టిని నిలపలేరు. వయసు మళ్ళిన వారి కళ్ళల్లోని కటకాలు మృదుత్వాన్ని, మైశీలత్వాన్ని (plasticity) కోల్పోయి అవసరం వెంబడి సాగడం, ముకుళించుకోవడం చెయ్యలేవు. సూది బెజ్జంలోకి దారం ఎక్కించలేకపోవడం, చిన్న అక్షరాలని చదవలేకపోవడం వంటి లక్షణాలు 40-50 సంవత్సరాల వయస్సులో పొడచూపుతాయి. కళ్ళద్దాలు పెట్టుకోవడం తప్ప వీరికి శస్త్రచికిత్స పెద్దగా ఉపయోగపడదు.
  4. శుక్లాలు (cataracts) అంటే పారదర్శకంగా ఉండే కటకం మసకబారిపోవడం. సర్వసాధారణంగా ఇది వయస్సుతో ఎదురయ్యే సమస్య. మధుమేహం, పొగ తాగడం, అతినీలలోహిత కిరణాల ప్రభావం కూడా కారణాలు కావచ్చు. ఈ మసకబారడం వల్ల ఉపతాపికి (patient) ఇబ్బంది లేకపోయినా కంటిని పరీక్ష చేసే వైద్యుడికి కంటి లోపలి భాగాలు కనిపించక ఇబ్బంది కలిగించవచ్చు. శస్త్ర వైద్యంతో ఇలా మసకబారిన కటకాలని తీసేసి సరికొత్త కటకాలతో సమస్యకి పరిష్కారం తేలిక. ఎండలో తిరిగేవాళ్ళు మంచి రకం (కొంచెం ఖరీదు ఎక్కువైనా) చలవ కళ్ళజోళ్ళు ధరించడం ఒక ఉపశమన మార్గం!
  5. గ్లాకోమా (glaucoma) అనే కళ్ళజబ్బుకి బహిర్గతంగా కనిపించే లక్షణాలు ఏవీ ఉండవు. చాప కింద నీరులా మీదకి వచ్చే దీనిని సకాలంలో పట్టుకుని వైద్యం చేయించుకోకపోతే దృష్టి శాశ్వతంగా పోయి గుడ్డివారయిపోతారు. భారతదేశంలో దరిదాపు 12 మిలియను ప్రజలలో ఈ వ్యాధి కనిపిస్తున్నది. అందుచేత అందరూ అప్పుడప్పుడు – కంటద్దాలు వాడేవారు తరచుగా – కళ్ళని తనిఖీ చేయించుకుంటూ ఉండాలి. గ్లాకోమా అంటే నేత్రనాడి దెబ్బ తిని పాడవడం. దీనికి ప్రధాన కారణం కంటిలోపల ఉండే జలాకారరసపు (aqueous humor) పీడనం అవధులు దాటి పెరగడం. దీనికి కారణం? సతతం తయారవుతూ ఉండే జలాకారరసం కొంత మోరీ (drain) నుండి బయటకి పోతూ ఉండాలి. కంటిలోపల ఉండే ఈ మోరీ మూసుకుపోవడం వల్ల లోపల పెరుగుతోన్న ద్రవాలు సజావుగా బయటకి కారవు. అప్పుడు లోపల పీడనం పెరిగి అక్షిపటలాన్నీ నేత్రనాడిని పాడు చేస్తుంది. అప్పుడు పరిధీయ దృష్టి క్రమేపీ నశించడంతో మొదలవుతుంది. ఈ విషయం వైద్య పరికరాలతో కొలిచి చూస్తేకాని తెలియదు. అందుకని రోగులు ఉపేక్షిస్తారు.

ఈ జబ్బు వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక తల్లిదండ్రులలో ఎవ్వరికి గ్లాకోమా ఉన్నా పిల్లలు అప్రమత్తంగా ఉండాలి. దీనికి ఆయుర్వేదం, హోమియోపతీ, యోగా, విటమినులు, వగైరాలతోపాటు అనేక చిట్కావైద్యాలు చెబుతారు కానీ వాటిని నమ్ముకుని అశ్రద్ధ చేస్తే మొదటికే మోసం వస్తుంది. పాశ్చాత్య వైద్యంలో నిష్ణాతుడైన కంటి వైద్యుడి పర్యవేక్షణలో ఈ జబ్బు ముదిరిపోకుండా (మందు చుక్కలు వేసి కాని, శస్త్రవైద్యం చేసి కానీ) ఆపు చేసి ఉన్న దృష్టిని కాపాడుకోవచ్చు. ఇక్కడ పిసినారితనం చూపించినా, ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు వాడినా అంధత్వం తథ్యం! బహుపరాక్!

కంటికి వచ్చే జబ్బులు ఇంకా అనేకం ఉన్నాయి. వాటన్నిటిని సమీక్షించడానికి ఇది వైద్యపరమైన వ్యాసం కాదు. కానీ మధుమేహం ఉన్నవాళ్ళు, వంశంలో ఎక్కడయినా గ్లాకోమా ఉన్నప్పుడూ తప్పనిసరిగా, ప్రతి ఏటా కళ్ళని పరీక్ష చేయించుకోవాలి.

కళ్ళ ఆరోగ్యంపై ఆధునిక సాంకేతికాల ప్రభావం

‘ఈ ఎలట్రీ దీపాలు వచ్చిన తరువాత పిల్లల కళ్ళు పాడయి కళ్ళజోళ్ళ వాడకం ఎక్కువయింది. మా చిన్నతనంలో ఆముదపు దీపాల దగ్గర చదువుకునేవాళ్ళం. మా కళ్ళు నిక్షేపంగా ఉండేవి!’ అని మా పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు. నేను నా ఉన్నత పాఠశాల చదువంతా కిరసనాయిలు బుడ్డి దీపాల దగ్గరే చదువుకున్నాను. రాత్రి ఎనిమిదయేసరికి మూడో జాము నిద్రలో ఉండేవాళ్ళం కనుక ఆ బుడ్డి దీపాల గుడ్డి వెలుగులో చదివింది మహా అయితే రోజుకో గంట సేపు! ‘కన్ను కేమెరా లాంటిది. కంటి ఆరోగ్యానికీ దీపంలో వాడే నూనెకీ, దీపపు కాంతికీ సంబంధం ఏమిటి?’ అని అప్పట్లో వాదించేవాళ్ళం.

ఇప్పుడు మనందరికీ మంచి వెలుగునిచ్చే, పొగ లేని, విద్యుద్దీపాలు అందుబాటులోకి వచ్చేయి కదా. కళ్ళజోళ్ళు వాడకం తగ్గిన సూచనలు ఎక్కడా కనబడడం లేదే! ఆ మాటకొస్తే అయిదేళ్ళ పిల్లలకి కూడా కళ్ళజోళ్ళు తొడిగేస్తున్నారే! దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటే మా అమ్మాయి వచ్చి, ‘డేడీ! రోహాన్‍కి ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూపించవద్దని ఐ డాక్టర్ చెప్పింది’ అంటూ నా ఒళ్ళో కూర్చుని వీడియో చూస్తూన్న మనవడిని వెనక్కి లాక్కుంది. వాడు మొర్రోమన్నాడు! నేను ఆలోచనలో పడ్డాను. అంతర్జాలంలో వైద్య సమాచారం కొరకు వెతికేను.

పుట్టిన కొత్తలో చిన్న గోళంలా ఉన్న కనుగుడ్లు దరిదాపు పన్నెండు ఏళ్ళ వయస్సు వరకూ పెరిగి, అటు తరువాత పెరగడం ఆగిపోతాయి. ఎదుగుతూన్న పిల్లలు ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూడడం, అతిగా చరవాణికి (cell phone) అతుక్కుపోవడం వంటి పనుల ప్రభావం గుడ్డు ఎదుగుదల మీద పడడం వల్ల పిల్లలలో హ్రస్వదృష్టి పెరుగుతోందిట! అనగా దగ్గరగా ఉన్న వస్తువులని చూడ్డానికి అలవాటు పడిపోయిన లేత కళ్ళు దూరం వస్తువులని స్ఫుటంగా చూడలేకపోతున్నాయిట! దీనికి కారణం ఏమై ఉంటుందో? పిన్న వయస్సులో కనుగుడ్లు – మిగిలిన శరీరంతోపాటు – ఇంకా ఎదుగుతూనే ఉంటాయిట. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు గుడ్డు గోళాకారంలో ఉండడం వల్ల కంటిమీద పడే కాంతిపుంజపు నాభి కంటి వెనక అక్షిపటలం మీద సరిగ్గా పడుతుందని చెప్పుకున్నాము కదా. ఇలా పడ్డప్పుడు అక్షిపటలం మెదడుకి కొన్ని రసాయన వాకేతాలు (chemical signals) పంపుతుందిట. ఆ వాకేతాలకి ప్రతిస్పందనగా కంటిగుడ్డు ఆకారం ఇహ పెరగకుండా శరీరం జాగ్రత్త పడుతుంది. పిల్లల కళ్ళు పసితనంలో ప్రకాశవంతమైన బయటి కాంతికి అలవాటు పడకపోతే (అనగా, వెలుతురు తక్కువగా ఉన్న గదులలో ఎక్కువ కాలం గడిపితే) అక్షిపటలం మీద పడే కాంతి బలంగా ఉండదుట. ఆ బలం ఒక గ్రాహకస్థాయిని దాటకపోతే పైన నుడివిన రసాయన వాకేతాలు పుట్టవు. కనుక కనుగుడ్లు పెరగడం ఆగకుండా దీర్ఘగోళాలుగా పెరిగినప్పుడు హ్రస్వదృష్టికి కారకులవుతాయిట! కళ్ళు పరీక్ష చేయించడానికి తీసికెళ్ళినప్పుడు డాక్టరమ్మ ఈ ఉదంతం చెప్పి, పిల్లవాడిని ప్రతిరోజూ, కనీసం రెండు గంటలైనా ఆరు బయట బాగా వెలుగు ఉన్న చోట (ఎండలో) తిప్పమనిన్నీ, ఉరోపరి (laptop) వంటి సాధనాల మీద యూట్యూబ్ కార్యక్రమాలు చూడడం, చరవాణుల మీద ఉన్న బుల్లి తెరలమీద అక్షరాలని చదవడం వంటి పనులు తగ్గించమనిన్నీ సలహా ఇచ్చింది. అంతర్జాలంలో ఈ సలహాకు మద్దతు కనిపించింది. ఈ వైద్య సలహాలో సిసలైన శాస్త్రీయత ఎంత ఉందో, ఇటీవల పిల్లలలో హ్రస్వదృష్టి పెరగడానికి అసలైన కారణం ఏమిటో నిర్ధారించవలసిన అవసరం ఉంది.

వెలుగు

కన్నుకీ వెలుగుకీ అవినాభావ సంబంధం ఉంది. చూడడానికి వెలుతురు కావాలి. వెలుగు లేని బ్రతుకుని ఊహించడం కష్టం. చిట్టచీకటి భయంకరమైనది. పుట్టు గుడ్డివారు కూడా వెలుగు నీడలకి ప్రభావితులవుతారు. వెలుగు మన జీవితాల మీద అనేక విధాలుగా ప్రభావం చూపెడుతుంది: మానసికావస్థ మీద, వినాళ గ్రంథుల స్రావకాలైన ఉత్తేజితాల (hormones) మీద, అహోరాత్ర లయల (diurnal cycles) మీద. ఎల్లప్పుడూ మేఘావృతమైన ప్రదేశాలలో నివసించే ప్రజలలో మానసిక స్తబ్దత, మనో వ్యాకులత కాసింత ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశోధకుల అంచనా. అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయం ఉన్న ఇథకా అనే ఊళ్ళో ఏడాది పొడుగునా మబ్బో, వానో, మంచో ఉంటుంది! అక్కడ ఎండ అపురూపం. గణాంకాల సంగతి నాకు తెలియదు కానీ – నేను ఆ భౌగోళిక ప్రాంతంలో ఉద్యోగం చేసిన రోజులలో – ఆ ఊళ్ళో విద్యార్థుల ఆత్మహత్యలు సగటు కంటే ఎక్కువగానే వినేవాడిని. అస్థిమార్దవరోగము (Rickets) వంటి కొన్ని పిల్లల జబ్బులు సూర్యకాంతి శరీరం మీద తక్కువ పడడం వల్ల కలిగిన విటమిన్ డి లోపం వల్ల వస్తాయి. వాత నియంత్రణ ఉన్న గదులలో కంప్యూటర్ల ఎదుట కూర్చుని పని చెయ్యడం మరిగిన పెద్దలకి కూడా తగినంత సూర్యకాంతి తగలక, విటమిన్ డి లోపించి, ఇబ్బందులు కలుగజేస్తాయి. ధ్రువ ప్రాంతాలలో – ఆరేసి నెలలపాటు చీకటి ఉన్న సమయాలలో – ఆత్మహత్యలు ఎక్కువ అవుతూ ఉంటాయన్నది గణాంకాల ద్వారా నిర్ధారించిన విషయం. ఉత్తర అక్షాంశాలలో, శీతాకాలంలో, సూర్యకాంతి చాలినంత లేకపోవడం వల్ల కొందరు ఎల్లప్పుడూ విచారగ్రస్తులై ఉంటారు. ఈ అస్వస్థతని ఇంగ్లీషులో శాడ్ (SAD – Seasonal Affective Disorder) అంటారు. ఇటువంటివారికి కృత్రిమంగా సూర్యకాంతిని పోలిన కాంతిని వెదజల్లే దీపాల వెలుగులో గంటలకొద్దీ కూర్చోబెట్టి వారి వ్యాధిని నయం చేస్తారు. ఈ రకం ‘దీపపు వైద్యం’ బొల్లి, విచ్చరిక (psoriasis) వంటి చర్మరోగాలని కుదర్చడానికి, మనోవిదళనం (schizophrenia) వంటి మానసిక వ్యాధులకు, ఆఖరికి కేన్సరు వంటి గడ్డు రోగాలని కుదర్చడానికి కూడా వాడుతున్నారు.

కంటిని ఉత్తేజపరచడానికి నలుసంత వెలుగు చాలు; పది మైళ్ళ దూరంలో వెలుగుతూన్న కొవ్వొత్తి మనకి కనబడుతుంది. ఉపగ్రహాలలో భూమి చుట్టూ తిరుగుతూన్న అపోలో వ్యోమగాములకి సముద్రం మీద ప్రయాణిస్తూన్న పెద్ద పెద్ద నావల వెనక అబ్లోసులు (wakes) చీకటిలో తెల్లగా కనబడ్డాయిట! దీనికి కారణం కాంతికిరణాలు ‘చెదరడం’ (dispersion) అనే భౌతిక ప్రక్రియకి లోనుకావడం. రాత్రి చీకటిగా ఉన్నప్పటికీ తడిగా ఉన్న నున్నని తారు రోడ్డు మిలమిల మెరుస్తూ కనబడుతుంది. కానీ, పక్కనే గరుగ్గా ఉన్న రాతిగోడ కనబడదు. ఎందుకంటే తడిగా ఉన్న నున్నటి రోడ్డు అద్దంలా ఉండడం వల్ల దాని మీద పడ్డ కాంతికిరణాలన్నీ పరావర్తనం చెంది మన కంటిని చేరుతాయి. కానీ గరుగ్గా ఉన్న రాతిగోడ మీద పడ్డ కాంతి నాలుగు పక్కలకీ చెదిరిపోయి మన కంటికి చేరేది అత్యల్పం అయిపోవడం వల్ల గోడ ఖణిగా కనబడదు.

మనం చూడగలిగింది పరారుణ (infrared), అతినీలలోహిత (ultraviolet) కాంతులకి మధ్యనుండే వానవెల్లి రంగులను మాత్రమే. ఈ విషయంలో మనకన్నా చీకట్లో చూడగలిగే పిల్లులూ కుక్కలే నయం. ఇలా జరగడానికి కారణం నయనేంద్రియాలు మొదటగా జలచరాల్లో ఆవిర్భవించడమే. నీరు ‘వడపొయ్యగా’ కళ్ళకు తగిలే కాంతి తరంగాల నిడివి కొంతవరకే పరిమితమై ఉంటుంది. అందుకే మనం ఊదా, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నారింజ, ఎరుపు రంగు కాంతిని మాత్రమే చూడగలం. తక్కినవి నీటిలోకి అంతగా చొచ్చుకురాలేవు. తరవాతి కాలంలో కొన్ని జలచరాలు ఉభయ చరాలుగానూ, భూచరాలుగానూ మారినప్పటికీ చక్షువుల స్వరూపం అప్పటికే దాదాపుగా నిర్ణయమైపోయింది.

‘మన కళ్ళు చూడగలిగిన కాంతే మొక్కలలో కిరణజన్యసంయోగ క్రియకు కూడా ఉపకరిస్తుంది. వాటి ఆకుల్లోని పత్రహరితం (chlotophyll) కూడా మనం చూడగలిగే కాంతికే స్పందిస్తుంది; మొక్కలు మనకన్నా ఎక్కువేమీ చూడలేవు. మనకూ, మొక్కలకూ కూడా ఆదిమ యుగంలో జన్మనిచ్చిన జీవరాసి నీటిలోనే పుట్టి పెరిగిందనడానికి ఇది సాక్ష్యం. కొన్ని కీటకాలు, ఇతర ప్రాణులూ తమ అవసరాలకని అతినీలలోహిత కాంతిని గుర్తించే శక్తిని సంపాదించుకున్నాయి’ అంటారు కొడవటిగంటి రోహిణీప్రసాదు.

చీకటిలో చూడగలిగే కళ్ళజోళ్ళు

సైనికులు, పోలీసులు వాడే ఒక ప్రత్యేకమైన కళ్ళజోళ్ళు (night vision goggles) పెట్టుకుని చూస్తే చీకటిలో కూడా కనిపిస్తుంది. కానీ చిట్టచీకటిలో ఇవి పని చేయవు; ఎంతో కొంత ‘వెలుగు’ ఉంటే దానిని ‘పెంచి’ చూపుతాయి. ఇక్కడ ‘వెలుగు’ అంటే వికిరణం (radiation) అని భాష్యం చెప్పుకోవాలి. అలాగే ‘పెంచి’ అన్నప్పుడు ఆ ఉన్న వికిరణాన్ని మన కంటికి కనబడే దృశ్యకాంతి (visible light) పరిధి లోకి మార్చడం, అలా మార్చబడ్డ దృశ్యకాంతి యొక్క పటిమని పెంచడం అని కూడా భాష్యం చెప్పుకోవాలి.

భౌతికశాస్త్రంలో ‘వికిరణం’ అన్నప్పుడు అది కంటికి కనబడే కాంతి (దృశ్యకాంతి) అయినా కావచ్చు, కంటికి కనబడని అదృశ్యకాంతి అయినా కావచ్చు. ఉదాహరణకి వేడి కంటికి కనబడని ఒక వికిరణం. దీనినే పరారుణ తరంగాలు అంటారు; ఇవి దృశ్యకాంతి తరంగాల కంటే పొడుగ్గా (longer wavelength) ఉంటాయి.

ఒక శాల్తీ ఎంత చల్లగా ఉంటే దాని నుండి వెలువడే వికిరణ తరంగాలు అంత పొడుగ్గా ఉంటాయి. ఒక ఘనపు మీటరు ఆవరణలో కేవలం నాలుగో, ఐదో ఉదజని అణువులు (Hydrogen atoms) ఉంటే చాలు, ఆ ప్రదేశం నుండి అతి పొడుగ్గా ఉండే వికిరణం ప్రసారమవుతూ ఉంటుంది. అంటే, ఆ ప్రదేశం అతి చల్లగా ఉంటుందన్నమాట. కనుక సైద్ధాంతికంగా ఈ విశ్వంలో ఏ మూల వెదికి చూసినా అక్కడ ఎంతో కొంత వెచ్చదనం ఉంటుంది. ఆ వెచ్చదనాన్ని ప్రవర్ధమానం (amplify) చేస్తే (అనగా, వెచ్చదనాన్ని పెంచితే, అనగా అక్కడ నుండి వెలువడే వేడి కెరటాల పొడుగుని తగ్గిస్తే) మనం దృశ్యకాంతి పరిధిలోకి చేరుకోవచ్చు. అనగా చిట్టచీకటిలో కూడా మనం చూడగలిగే అవకాశం ఉంది; కానీ ప్రాయోగికంగా ఈ కార్యక్రమం యొక్క దక్షత ఆచరణయోగ్యం కాకపోవచ్చు. అంత కఠినమైన పని చెయ్యవలసిన అవసరం కూడా ఉండకపోవచ్చు.

మనకి కావలసినది పరారుణ (infrared) పరిధిలో ఉన్న తరంగాలని దృశ్యకాంతిగా మార్చగలిగితే చాలు. ఈ రకం కళ్ళజోళ్ళని వాడినప్పుడు చీకటిలో శత్రువులు, దొంగలు ఎక్కడ దాక్కున్నారో తెలియాలి. ఆ శత్రుగణం ఒంటికి నల్లరంగు పూసుకుంటే కనిపించరు కదా! కానీ వాళ్ళ గొంతుకలో ప్రాణం ఉన్నంతసేపూ వాళ్ళ ఒళ్ళు వెచ్చగా ఉంటుంది కదా. ఆ వెచ్చదనాన్ని ఆసరా చేసుకుని మన కళ్ళజోడు వాళ్ళ శరీరాకృతిని, వాళ్ళ కదలికని మనకి కనబడేటట్లు చేస్తుంది.

ఈ రకం కళ్ళజోళ్ళతో వచ్చే ఇబ్బంది ఒకటి ఉంది. వీటిని వాడినప్పుడు పార్శ్వపు దృష్టి (peripheral vision) ఎక్కువగా ఉండదు. అలాగే గంభీర గోచరత్వం (depth perception) కూడా లోపిస్తుంది.

రంగులు

అందరికి రంగులు కనిపిస్తాయా? అందరికి అన్ని రంగులూ కనిపిస్తాయా? అందరికి రంగులు ఒకేలా కనిపిస్తాయా? మనుష్యులకి కనబడే రంగుల ప్రపంచమే పశుపక్ష్యాదులకి కూడా కనిపిస్తుందా? ‘ఒక వస్తువు ఫలానా రంగులో ఉంది’ అంటే దాని అర్థం ఏమిటి? చూడ్డానికి మానవుడు లేకపోతే ‘దొండపండు ఎర్రగా ఉంది’ అన్న వాక్యానికి అర్థం ఉందా? ‘కారు ఎర్రగా ఉంది’ అంటే అర్థం ఏమిటి? ‘తలుపు నీలంగా ఉంది’ అంటే అర్థం ఏమిటి?

సూర్యకిరణాలలో అన్ని రంగులు ఉన్నాయని చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ సూర్యరశ్మి ఎర్ర కారు మీద పడ్డప్పుడు ఆ కారు – తన మీద ఉన్న ఎరుపు రంగుని మినహా – మిగిలిన రంగులన్నిటిని దిగమింగి, ఒక్క ఎరుపు రంగుని మాత్రం ‘నాకు అక్కరలేదు’ అని తిరగ్గొడుతుంది. అదే మన కంటిని చేరి ‘కారు ఎర్రగా ఉంది’ అనే భ్రాంతిని కలుగజేస్తుంది. అనగా, మనకి కారు ఏ రంగులో కనబడుతోందో ‘ఆ రంగు నాది కాదు, నాకు అక్కరలేదు’ అని కారు చెబుతున్నాదన్నమాట! అనగా, కారు ఏ రంగు కాదో ఆ రంగుని మనం కారుకి ఆపాదిస్తున్నాం! ప్రకృతి మన మెదడుని మోసం చేస్తోందా?

భౌతికశాస్త్రం ఏ మాత్రం చదువుకున్న వ్యక్తి అయినా రంగు అంటే కాంతికిరణం యొక్క తరంగ దైర్ఘ్యము (wavelength) అని చెబుతారు. కానీ మన కళ్ళు (మెదడు) తరంగ దైర్ఘ్యాన్ని కొలిచి రంగుని నిర్ధారించవు. మనం చూచే వేళని బట్టి, పరిసరాల్ని బట్టి, మన జ్ఞాపకాలని బట్టి రంగుని నిర్ధారిస్తాయి. రంగు బట్టలు దుకాణంలోని దీపాల వెలుగులో ఒకలా కనిపిస్తాయి, బయట ఎండలో వేరొకలా కనిపిస్తాయి, ఇంటికొచ్చిన తరువాత సంధ్య వెలుగులో మరొకలా కనిపిస్తాయి అన్నది అనుభవం నేర్పిన పాఠం!

చాలా మంది 150 నుండి 200 వరకు రంగులలో తేడాలని గుర్తించగలరు. కానీ మనందరికీ రంగులు ఒకేలా కనబడవు. దీనికి పాక్షిక వర్ణాంధత్వం (partial color blindness) కానీ పరిపూర్ణ వర్ణాంధత్వం కానీ కారణం కావచ్చు. స్త్రీలలో కంటే పురుషులలో వర్ణాంధత్వం ఎక్కువ కనుక మగవాళ్ళు వారి భార్యల బట్టల ఎంపికలో వేలు పెట్టకూడదు! మగవారికి బాగా నప్పే రంగు ఏదో అతని భార్యకు బాగా తెలుస్తుంది; అందుకే అతని బట్టల్లో డెబ్భయి శాతం అదే రంగులో ఉంటాయి!

అన్ని ప్రపంచ భాషలలోనూ, అన్ని రంగులకీ విడివిడిగా పేర్లు లేవు. జపాన్ భాషలో ఇటీవలి వరకు నీలం అనడానికి ప్రత్యేకం మాట లేదు: ‘ఓయ్’ అంటే ఆకుపచ్చ, నీలం, ఊదా రంగులలో ఏదయినా కావచ్చు! కొన్ని భాషలలో తెలుపు, నలుపు తప్ప మరొక ‘రంగు మాట’ లేదుట! తెలుగులో పచ్చ అంటే పసుపు పచ్చ కావచ్చు, ఆకు పచ్చ కావచ్చు. తెలుగులో బచ్చలిపండు రంగు, వంగపండు రంగు, పాలపిట్ట రంగు, కెంపు రంగు వంటి ఉపమానపు రంగులు వాడుకలో ఉన్నాయి. ఇంగ్లీషులో నీలానికి ఆకుపచ్చకి మధ్యలో ఉన్న రంగుల రకాలు వర్ణించడానికి అజూర్, ఆక్వా, టీల్ – azure, aqua, teal, navy, indigo, emerald – అనే మాటలు వాడతారు.

ప్రపంచీకరణ, కంప్యూటర్ సంస్కృతి ప్రపంచవ్యాప్తం అయిన తరువాత తెర మీద ఏ రంగు కనబడాలో చెప్పడానికి నిర్దిష్టమైన భాష అవసరం వెల్లడి అయింది. ఉదాహరణకి ఆరు అక్షరాంకాల షోడశాంశ సంక్షిప్తం (Hexadeciaml code with six alphanumerics) వాడినప్పుడు తెలుపు = #FFFFFF, వెండి రంగు = #C0C0C0, కపిల వర్ణం = #808080, నలుపు = #000000, ఎరుపు = #FF0000, పగడం = #F08080, వగైరా. ఈ పద్ధతి ఉపయోగించి 16, 777, 216 నిర్దిష్టమైన రంగులని వర్ణించవచ్చు! వీటిలో కేవలం 147 రంగులకి మాత్రం ఇంగ్లీషు పేర్లు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైన 16 రంగుల పేర్లు: black (నలుపు), white (తెలుపు), gray (బూడిద, ధూసర), silver (వెండి), maroon (జేగురు), red (ఎరుపు), purple (ఊదా లేదా ధూమ్ర), fushsia (ధూమ్రపాటలం), green (ఆకుపచ్చ), lime (నిమ్మ), olive (జిత), yellow (పసుపు), navy (నావిక నీలం), blue (లేత నీలం), teal (నీలి-ఆకుపచ్చ), and aqua (లేత నీలి-ఆకుపచ్చ).

రంగులు మన మనసుపై ఎంతో ప్రభావం చూపుతాయి. రంగుల శాస్త్రం (Color Psychology) అనేది మన మానసిక స్థితి, ప్రవర్తన మరియు భావోద్వేగాలపై రంగులు ఎలా ప్రభావం చూపుతాయో అధ్యయనం చేసే ఒక అంశం. రంగులు ఒక రకమైన భావోద్వేగాన్ని, మానసిక స్థితిని, తద్వారా మన ప్రవర్తనని ప్రేరేపిస్తాయి. కాబట్టి, జీవితంలో సానుకూల ప్రభావం కోసం రంగులను తెలివిగా ఎంచుకోవడం ముఖ్యం. మీ ఇంటి రంగులు, దుస్తుల రంగులు మీ మనస్థితిని ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి.

భోజన, ఫలహారశాలలలో ఆకలిని పెంచే రంగులను ఎంచుకుంటారు. కార్యాలయాలలో ఉత్పాదకతను పెంచే రంగులను వాడతారు. పడకగదులలో లేత రంగులు నిద్రను ప్రేరేపిస్తాయి. ఎరుపు రంగు ఉద్రిక్తత, తీవ్రోత్సాహం, ఆవేశం, ఆకలి వంటి లక్షణాలని పెంచుతుంది. అందుకని వ్యాపార ప్రకటనలలో ఎరుపు రంగు తరచు కనిపిస్తూ ఉంటుంది. ఆసుపత్రుల్లో ప్రశాంతమైన రంగులను వాడతారు. వైద్యుల ‘వ్యాపార చిహ్నం’ తెలుపు అయినా శస్త్ర చికిత్స చేసే వైద్య బృందం నీలి రంగు దుస్తులు ధరిస్తారు. ఎందుకంటే అక్కడ బట్టలమీద రక్తం చిందే అవకాశం ఎక్కువ కనుక రక్తం యొక్క ఎరుపుకి నీలం వ్యతిరేకమైన రంగు కనుక మరకలు స్ఫుటంగా కనిపిస్తాయి. అదేలా, సినిమాలలోను, నాటకాలలోనూ నటీనటులకు అలంకరణ చేసే గదులని ‘గ్రీన్ రూమ్స్’ అనడానికి అనేక కారణాలు చలామణీలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి, ఆ గదుల గోడలకి సర్వసాధారణంగా ఆకుపచ్చ రంగు వేస్తారు. ఎందుకుట? ఆకుపచ్చ ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రశాంతతని కలిగిస్తుంది, సహజత్వానికి దోహదం చేస్తుంది. రంగం మీదకి వెళ్ళేముందు నటీనటులకు కావలసిందదే కదా.

జంతువుల కళ్ళు

పిల్లి కళ్ళని ఎప్పుడైనా చూసేరా? పిల్లి కళ్ళల్లో ఉన్న కనీనికలు గుండ్రంగా ఉండవు; అవి నిట్టనిలువు కంతలుగా (vertical slits) ఉంటాయి. పిల్లి కళ్ళే కాదు; చాలా భోక్తల కళ్ళు (predator’s eyes) అలానే నిలువు కంతలతోటే ఉంటాయి. అప్పుడే అవి దూరంగా ఉన్న భోజ్యాన్ని చూడగలగడం (distance perception) అది ఎంత దూరంలో ఉందో అంచనా వేయగలగడం (depth perception) చేయగలవు. దీనికి జవాబుగా ఆవులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటి భోజ్యాల కళ్ళల్లోని కనీనికలు అడ్డు కంతలులా (horizontal slits) ఉండడం వల్ల వాటి పరిధీయ దృష్టి బలంగా ఉంటుంది. గుర్రాలకి పరిధీయ దృష్టి ఎక్కువ. అందుకనే వాటి కళ్ళకి తరచుగా గంతలు కడతారు. అప్పుడే అవి ఎదురు చూపు మీద దృష్టి నిలపగలవు. కొన్ని జంతువుల పరిధీయ దృష్టి 360 డిగ్రీలు ఉంటుంది; అనగా అవి బుర్రని తిప్పకుండా చుట్టూ చూడగలవు!

జ్యోతుల్లా వెలుగుతూన్న కళ్ళతో పిల్లి వేటాడినప్పుడు పిల్లి మనకంటే చీకటిలో బాగా చూడగలదు అనే అభిప్రాయానికి రావడంలో పొరపాటు ఉందని అనిపించదు. ఒక్క పిల్లులవే కాదు; నిశాచరులైన చాలా భోక్తల కళ్ళు జ్యోతుల్లా వెలుగుతూ కనబడతాయి. దానికి కారణం వాటి కళ్ళల్లోని అక్షిపటలానికి వెనక బహువర్ణదీప్తితో ప్రకాశమానమైన (iridescent) పొర ఉంటుంది. దాని మీద పడ్డ కాంతి పరావర్తనం చెంది అక్షిపటలం మీద పడి నీరసంగా ఉన్న వెలుగుని ప్రవర్ధమానపరచి చూడడానికి దోహదపడుతుంది. సైనికులు చీకటిలో చూడడానికి వీలు పడే సులోచనాల తయారీలో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందేమో చూడవచ్చు!

జంతువుల కళ్ళల్లోని కటకాలు కుంభాకారంగా – పలచగానూ, మధ్యలో ఉబ్బెత్తుగానూ – ఉంటాయి కానీ చేపల కళ్ళల్లోని కటకాలు గుండ్రంగా బంతుల్లా ఉండి కనీనిక నుండి బయటకి పొడుచుకు వచ్చినట్లు ఉండడం వల్ల వాటికి పరిధీయ దృష్టి ఎక్కువ. ఈ కటకం ఎక్కువ సాంద్రత కలిగి (వక్రీభవన గుణకం, refractive index = 1.67) ఉండడం అనేది కీకస జంతుజాలంలో (vertebral animals) ఎక్కువ. చేప కన్ను కట్టడిలో ఉన్న ఈ రెండు లక్షణాల వల్ల చేపలు నీటిలో మన కంటే బాగా చూడగలగడమే కాకుండా వాటికి పరిధీయ దృష్టి కూడా ఎక్కువ. ఈ లక్షణాలు మనలోలేవు కనుక మనం ఈత కొడుతూన్నప్పుడు నీళ్ళల్లో ఎక్కువ దూరం చూడలేము. చేపలా మనం కూడా నీళ్ళల్లో ఎక్కువ దూరం చూడాలంటే మనం ‘గాగుల్స్’ ధరించాలి.

పశుపక్ష్యాదులకి కనబడే రంగులు

గుడ్లగూబ రాత్రిపూటే వేటాడుతుంది, చీకటిలో రంగులు కనబడవు కనుక గుడ్లగూబకి రంగులు కనబడవలసిన అవసరం లేదు. కనుక గుడ్లగూబల కళ్ళల్లోని అక్షిపటలంలో శలాకములు మాత్రమే ఉంటాయి; శంకులు ఉండవు. అనగా గుడ్లగూబకి రంగులు కనబడవు.

పశుపక్ష్యాదులకి రంగులు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. శత్రువులకు కనబడకుండా ఉండడానికి, మభ్యపెట్టడానికి కొన్ని జీవులు ప్రాణరక్షణార్థం తమ శరీరపు రంగులు మార్చుతూ ఉంటాయి. ఊసరవెల్లి రంగులు మార్చడం మనందరికి తెలిసిన ఉదాహరణ. కొన్ని జాతుల మిడతలు ఎండు ఆకుల రూపంలోనో, ఎండిన పుల్లల రూపంలోనో కనబడుతూ ఉంటాయి. ఆకుపచ్చగా ఉన్న గొల్లభామలు (mantis) ఆకుల మధ్యలో కనిపించవు. సముద్రగర్భంలో ఉన్న ఆక్టోపుస్ అనే జంతువు ఆపద ఎదురైనప్పుడల్లా సందర్భోచితంగా రంగు మార్చుకుని తన నేపథ్యంలో ఉన్న రంగులో కలిసిపోతుంది.

సింహాలకి బూడిదరంగు, బెబ్బులికి చారలు, చిరుతలకి మచ్చలు, ఉండడం వల్ల అవి వేటాడేటప్పుడు వాటి ఉనికి భోజ్యాలకి తెలియదు; ఎందుకంటే – గతంలో చెప్పినట్లు – లేడి వంటి జంతువులకి ఆ రంగులు స్ఫుటంగా కనబడకపోవడం వల్ల అవి వాటి నేపథ్యపు రంగులలో కలిసిపోతాయి.

కొన్ని జంతువులకి వాటి శరీరం ఒక అద్దంలా పని చేస్తుంది. ఉత్తర ధ్రువ ప్రాంతాలలో తిరుగాడే తెల్లటి ఎలుగుబంట్లకి ఆ తెలుపు ఎక్కడనుండి వచ్చిందనుకుంటున్నారు? నిజానికి ఎలుగు శరీరం నల్లగా ఉంటుంది. దాని రోమాలు బోలుగా, గాజు గొట్టాల మాదిరి ఉంటాయి. ఇలా పారదర్శకంగా ఉన్న రోమాల మీద పడ్డ సూర్యరశ్మి అంతా పరావర్తనం చెంది మన కళ్ళకి చేరడం వల్ల ఎలుగు తెల్లగా కనబడుతుందిట. అనగా, ఎలుగు శరీరం మీద తెలుపు రంగు రంజనద్రవ్యం (white dye) లేదు. ఇదే సూర్యరశ్మి సముద్రం మీద పడ్డప్పుడు కాంతి చెదరడం వల్ల కాంతిలోని నీలి భాగం మాత్రం మన కంటికి చేరి సముద్రం మనకి నీలంగా కనబడుతుంది. అంతే కానీ సముద్రంలో రంజనద్రవ్యం ఉండడం వల్ల కాదు.

పోలిక కోసం – ఆకులు ఆకుపచ్చగా కనిపించడానికి కారణం పైన చెప్పిన ప్రక్రియకి విరుద్ధం! ఆకులలో పత్రహరితం అనే రంజనద్రవ్యం ఉండడం వల్ల అవి పచ్చగా కనబడతాయి. ఆకురాలు కాలంలో ఈ ఆకులు పండిపోయినప్పుడు, అనేక రంగులలో కనిపించడానికి కారణం పత్రహరితం ప్రభావం తగ్గిపోయి, ఆకు అసలు రంగు బయటపడడం వల్ల. కనుక ఒకే మంత్రం అన్ని సందర్భాలలోనూ పని చెయ్యదు.

అందం

అందం అంటే ఏమిటి? చూడగానే కనిపించేది ముఖం, ఆ ముఖంలో కనుముక్కు తీరు.

అనగా అందం అనేది చూసేవాడి కళ్ళల్లో ఉంది. అయినప్పటికీ మనుష్యుల ముఖసౌందర్యాన్ని వస్తుగతంగా నిర్ణయించవలసి వచ్చినప్పుడు ఆ ముఖం మరీ పొడుగ్గా – గజం బద్దలా – కాకుండా, మరీ గుండ్రంగా – చలివిడి ముద్దలా కాకుండా – మధ్యస్తంగా ఉండాలని చిత్రకారులు అంటారు. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ముఖం పొడుగు, వెడల్పూ సువర్ణ నిష్పత్తిలో (golden ratio = 1.618) ఉండాలిట. అనగా బొమ్మలో ముఖం 1 అంగుళం వెడల్పు ఉంటే పొడుగు 1.618 అంగుళాలు ఉండాలి. ఆ తరువాత అమ్మాయి అయితే ముఖంలో సౌష్టతతోపాటు పెద్ద కళ్ళు ఉండాలి, సంపెంగ మొగ్గ వంటి ముక్కు ఉండాలి (నానా సూన వితాన వాసనల… అనే తిమ్మన పద్యం ప్రకారం), దానిమ్మ గింజలలాంటి పలు వరుస, దొండ పండు లాంటి పెదవులు… చాలు, ఇక కిందకి వెళ్ళను!

ఒక వైజ్ఞానిక అధ్యయనంలో మగవారికి అమ్మాయిల ఫోటోలు చూపించి అందమైన అమ్మాయిలని ఎంపిక చెయ్యమంటే వారిలో అత్యధిక భాగం పెద్దకళ్ళు, ఆ కళ్ళల్లో బాగా వికసించిన పెద్ద కనీనికలు (dilated pupils) ఉన్న అమ్మాయిలని ఎంచుకున్నారుట. అలాంటి కనీనికలని చూసినప్పుడు ఆ మగవారి కనీనికలు 30 శాతం వికసించేయిట! ఈ దృగ్విషయం మనకి కొత్తగా అనిపించవచ్చు కానీ విక్టోరియా రాణి కాలంలోని ఇంగ్లండు లోను, నవజాగృతి యుగంలోని ఇటలీ లోనూ ఈ చిట్కా ఆడవారికి పరిచయమైన జానపద వైద్యమే! వారు వారి మగ స్నేహితులని కలుసుకునే ముందు తమ కనీనికలని వికసింపజెయ్యడానికి కళ్ళల్లో ఒక చుక్క ఉమ్మెత్త (belladonna) రసం వేసుకుని వెళ్ళేవారుట. (ఇటాలియన్-లేటిన్ భాషలలో బెల్లడోనా అంటే అందమైన అమ్మాయి! కాని, ఉమ్మెత్తలో ప్రమాదకరమైన విషపదార్థాలు ఉన్నాయి అని గమనించమని ప్రార్థన!) మనం ఉత్తేజపడ్డప్పుడు మన కనీనికలు అసంకల్పంగా వికసిస్తాయి. కనుక ఒక అమ్మాయి కనీనికలు వికసించేయి అంటే ఆ అమ్మాయి ఉత్తేజపడిందన్నమాట! అనగా, ఆ అమ్మాయికి ఆ మగవాడు నచ్చేడన్నమాట. అనగా ముఖకవళికలు ఒక మౌనమైన భాష! మన దేశంలో ఒళ్ళు చేసిన స్త్రీలు ఐశ్వర్యానికి ఎలా ప్రతీకలో, అలాగే దరిదాపు అన్ని సంఘాలలోను పెద్దకళ్ళు అందానికి ప్రతీకలు.

‘అందాన్ని కొరుక్కుతింటామా? అందం అంటే పైపై మెరుగులే కదా!’ అని మనలో కొంతమంది అనుకోవచ్చు. ‘అందానికి మించిన సిఫారసు ఉత్తరం లేదు’ అన్నాడు ప్రాచీన కాలపు తత్త్వవేత్త, అరిస్టాటిల్! ఇందులో కొంత నిజం లేకపోలేదు. అందంగా ఉన్న పిల్లలపట్ల బడిలో గురువులు ఎక్కువ శ్రద్ధ చూపెడతారు, తక్కువ శిక్షిస్తారు. అందంగా ఉన్న వ్యక్తులు ఉద్యోగంలో ఎక్కువ జోరుగా ఉన్నత పదవులని అధిష్టిస్తారు. (పటేల్‍ని కాదని నెహ్రూని గాంధీ ఎంపిక చెయ్యడానికి కారణం ఇదే అని నా చిన్నతనంలో విన్నాను!) అందంగా ఉన్న పిల్లలకి సినిమాలలో అవకాశాలు దొరుకుతాయి. త్వరగా మంచి పెళ్ళి సంబంధాలు కుదురుతాయి. అందంగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళనిన్నీ, దేవతలనిన్నీ, అందవికారంగా ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళనిన్నీ, రాక్షసులనిన్నీ మనం పిల్లలకి కథల రూపంలో చెప్పి, నూరి పోస్తూ ఉంటాం. అందాన్ని కొరుక్కు తింటామా? అని ఎంతమంది, ఎన్ని సార్లు చెప్పినా అందంగా ఉన్న ఆడదాని ముఖం బేంకులో (మేషస్వరం) దాచిన డబ్బు లాంటిది. దానితో ఆమె కావలసిన మొగుణ్ణి, కావలసిన అంతస్తుని, కావలసిన పరపతిని కొనుక్కోవచ్చు. ఒక గణాంక అధ్యయనంలో స్త్రీ-పురుషుల జంటలు ఉన్న ఫోటోలు కొన్నింటిని ప్రజలకి చూపించి, ఆ ఫోటోలలో ఉన్న మగవాడిని మాత్రం అంచనా చెయ్యమని అడిగేరు. ఏ మగవాడి పక్కని ఎక్కువ అందమైన అమ్మాయి ఉందో అతను ఎక్కువ తెలివైనవాడనిన్నీ, జీవితంలో ఎక్కువ విజయాలు సాధించిన వాడనిన్నీ మార్కులు పడ్డాయిట!

అందాన్ని ఎలా కొలుస్తాం? అందం యొక్క నిర్వచనం దేశ, కాల, పరిస్థితులని బట్టి మారవచ్చు. మన దేశంలో అందం అంటే ‘తొక్క తెలుపు’ అనే భావం విస్తారంగా ఉంది. కానీ మనం ఆరాధించే వారిలో వ్యాసుడు నలుపు, శ్రీకృష్ణుడు నలుపు, అర్జునుడు నలుపు, ద్రౌపది నలుపు. వ్యాసుడిని సినిమాలలో అందగాడిలా చూపించరు కానీ, నల్లనివాడు, పద్మనయనంబులవాడు అయిన శ్రీకృష్ణుడు అందగాడే కదా! ద్రౌపది కూడా అందగత్తెగానే పరిగణనలోకి వస్తుంది.

సాహిత్యంలో కళ్ళు

బాల సాహిత్యంలో ‘ఏడవకు ఏడవకు చిట్టి నా తండ్రీ/ ఏడిస్తే నీ కళ్ళు నీలాలు గారూ/ నీలాలుగారితే నే జూడలేను/ పాలైన కారవే బంగారు కళ్ళూ…’ అంటూ ఏడుస్తూన్న పిల్లలను సముదాయిస్తూ తల్లి పాడే పాట ఉంది. ఇక్కడ నీలాలు అంటే కన్నీళ్ళు అని నిఘంటువు చెప్పింది. కానీ మాచవోలు శివరామప్రసాద్ చెప్పిన వ్యాఖ్య ఇంతకంటే బాగుంది. ‘కంటిపాపలు నీలంగా ఉంటాయి గదా! కనుక వాటిని నీలాలు అని కూడా అంటారు. కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటే ఆ నీలాలు కారుతూ ఉన్నట్టు తల్లి ఆవేదన. అయ్యో కళ్ళే కరిగి పోతున్నాయే అని.’

సంస్కృతాంధ్ర సాహిత్యంలోని కవుల వర్ణనలలో అందమైన నాయికల కంఠానికి దిగువ భాగాలకి ఉన్న ప్రముఖత ఎగువ భాగాలకి ఉన్నట్లు లేదు. పారిజాతాపహరణంలో ‘నానా సూన వితాన వాసనల…’ అనే పద్యంతో నంది తిమ్మన ముక్కుని ఆకాశానికి ఎత్తేసేవరకూ కళ్ళు మాత్రమే అందానికి ప్రతీకలుగా నిలచేయి. అందాన్ని వర్ణించడానికి పద్మాక్షుడు, పద్మనయనమ్ములవాడు, కమలాక్షి, మీనాక్షి, కామాక్షి, సరసిజాక్షి, హరిణాక్షి, తోయజాక్షి, వనజదళాయతాక్షి, కురంగనయన, జలజనేత్ర, తోయజలోచన, సులోచన, వగైరా ప్రయోగాలు కనిపిస్తాయి. ఇక్కడ మీనాక్షి అంటే ‘చేప కండ్ల వంటి కన్నులు కలది’ అని ఒకరు, ‘చేపల వంటి కన్నులు కలది’ అని మరొకరు వ్యుత్పత్తి చెప్పేరు. మీనాక్షి అంటే చేప కండ్ల వంటి కన్నులు కలది అన్న వ్యుత్పత్తి బాగా నప్పదు; చేపల వంటి కన్నులు కలది అని అంటేనే నప్పుతుంది. హరిణాక్షి అంటే ‘లేడి కండ్ల వంటి కన్నులు కలది’ అన్నదే నప్పుతుంది; ‘లేడి వంటి కన్నులు’ అంటే అస్సలు నప్పుదు. మనోస్థితిని వర్ణించడానికి ఉగ్రనేత్రుడు, బాష్పనేత్రుడు, వగైరా ప్రయోగాలు ఉన్నాయి.

చిత్రకారుల కంటికి ఏమి కనిపిస్తాయి?

అత్యాధునిక అనుభూతివాదానికి (post-impressionist) ఆద్యుడనదగ్గ పాల్ సెజాన్ (Paul Cezanne, 1839-1906) అనే ఫ్రాన్స్ దేశపు చిత్రకారుడికి ఒకనాడు సంప్రదాయ విరుద్ధమైన తన ప్రతిభ గురించి ఉద్వేగభరితమైన అనుమానం వచ్చిందిట! తాను రచించే చిత్రాలలోని విశిష్టత తన దృష్టి వైపరీత్యం వల్లనా? తన చిత్రపటాలలోని వైచిత్రికి అసలు కారణం తన కళ్ళల్లోని దృష్టి దోషం వల్ల తనకి కనబడే ప్రపంచం వికారంగా ఉండడం వల్లనేనా? అది తన ప్రతిభ కాదా? ఆయన వాడిన ఆకారాలని, రంగులని బట్టి ఆయనకి ఉన్న తీవ్రమైన హ్రస్వదృష్టి (myopia) వల్ల, ఆయన కళ్ళద్దాలు వాడకాన్ని నిరాకరించడం వల్ల, ఆయనకి ఉన్న మధుమేహం కారణంగా మూడొంతులు ఆయన అక్షిపటలం దెబ్బ తినడం వల్ల, ఆయన కళ్ళల్లో శుక్లాలు ఉన్న కారణంగా ఆయనకీ ప్రపంచం మసకగా కనిపించడం వల్ల…

ప్రఖ్యాత శిల్పి ఆల్బెర్టో జ్యాకొమేత్తి (Alberto Giacometti, 1901-1966) చెక్కిన శిల్పాలన్నీ పొడుగ్గా సాగదీసినట్లు ఉంటాయి. ఆయన అంటాడు: విమర్శకులు, విశ్లేషకులు నా శిల్పాలలో ఉన్న ఆధిభౌతిక తత్త్వాన్ని, కవిత్వ ఛాయల్ని చూసి మెచ్చుకుంటారు కానీ నామట్టుకు నాకు ప్రపంచం ఎలా కనిపిస్తుందో అలా శిల్పాలని మలిచేను కానీ ఏదో తత్త్వబోధ చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు.

నెదర్లండ్ దేశీయుడు విన్సెన్ట్ వాన్‍ గో (Vincent Van Gogh, 1853-1890) మరొక ప్రఖ్యాత చిత్రకారుడు. అదృష్టవశాత్తు ఈయన వాడిన కళ్ళద్దాలు మనకి లభ్యం అయ్యాయి కనుక ఈయన కంటికి ప్రపంచం ఎలా కనిపించి ఉంటుందో మనం ఊహించగలం! ఈయన రచించిన ఐరిస్ పువ్వులు (Irises) అనే తైలవర్ణ చిత్రపటం 1988లో జరిగిన వేలంపాటలో 49,000,000 డాలర్లకి అమ్ముడుపోయింది కానీ ఈయన బ్రతికి బట్ట కట్టినకాలంలో ఒకే ఒక్క చిత్రపటం అమ్ముడుపోయింది. ఈయన ఒకసారి తన చెవి కోసేసుకున్నాడు, తనని తానే దుడ్డుకర్రతో కొట్టుకున్నాడు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు, అక్కడే బెంచీ మీద పడుక్కునేవాడు, మతావేశచిత్తవృత్తి ప్రేరితమైన భ్రాంతితో (hallucination) ఉండేవాడు. ఒకసారి కిరసనాయిలు తాగేసేడు, తాను వాడుతూన్న పెయింట్ తినేసేడు! ఆధునిక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం వాన్ గో చిత్రాలలో కనబడే శైలీ చమత్కారాలు (stylistic quirks) – ఉదాహరణకి, వీధి దీపాల చుట్టూ చిత్రించిన కాంతివలయాలు (coronas) – ఉద్దేశపూర్వకంగా చిత్రించినవి కాకపోవచ్చుననిన్నీ, అవి అతని శరీరంలో పేరుకున్న విషపదార్థాల ప్రభావానికి అతని కళ్ళని తీవ్రంగా గాయపరచి ఉంటాయనిన్నీ, ఆ కళ్ళతో చూసినవే అతను గీసిన బొమ్మలలో ఉన్నాయనిన్నీ తీర్మానించేరు.

మనోనేత్రానికి ఏమి కనబడతాయి?

మనోనేత్రం అంటే ఏమిటి? పడక కుర్చీలో కూర్చుని, కళ్ళు మూసుకుని, ఆదివారం సంతలో ఒక పళ్ళదుకాణం ముందు నిలబడినట్లు ఊహించుకొండి. అక్కడ ఒక పండుని చేతిలోకి తీసుకున్నట్లు, దానిని సంచిలో వేసుకున్నట్లు ఊహించుకొండి. ఈ సంఘటనని ఎంత స్పష్టంగా వీలయితే అంత మేరకి మానసికంగా చిత్రించుకోండి.

ఇప్పుడు మీ మానసిక చిత్రంలో (mental image) వివరాలు ఎంత స్ఫుటంగా నమోదు అయ్యాయో పరీక్షిద్దాం. మీరు ఏం పండుని తీసేరు? ఏ చేత్తో తీసేరు? వాసన చూసేరా? మీరు ఎంపిక చేసిన పండుకి ముచ్చిక ఉందా? ఆ పళ్ళదుకాణంలో మీ పక్కన ఇంకెవరయినా ఉన్నారా? వారు ఆడా? మగా? వారి వయస్సు ఏ మాత్రం ఉంటుంది? వారు ఏ రంగు దుస్తులు ధరించేరు? ఈ రకం ప్రశ్నలు కొన్నింటికి సమాధానం చెప్పగలరు. కొన్నింటికి చెప్పలేరు. ఇలా చెప్పలేని (మనోనేత్రానికి అందని) అంశాలని ‘ఈడేరని అంశాలు’ (non-committed items) అంటారు, మానసిక శాస్త్రవేత్తలు.

ఇలా పగటి కలలో కనబడేవే కాకుండా, మన నిద్రలో, స్వప్నాలలో కనబడేవి కూడా, మన మనోనేత్రానికి కనబడే దృశ్యాలే. కలలో కనబడిన దృశ్యాలలో ఎన్ని, ఎంతమట్టుకి జ్ఞాపకం ఉంటాయి? మనం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు కనబడే దృగ్గోచర దృశ్యాలకి (visual images) మనోనేత్రానికి కనబడే దృశ్యాలకి (mental images) మధ్య తేడా ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేముందు ‘కంటి ముందు దృశ్యాన్ని మెదడు ఎలా అర్థం చేసుకుంటుంది?’ అనే ప్రశ్నకి సమాధానం వెతకాలి. ఇక్కడ రెండు విభిన్నమైన వాదాలు ప్రచారంలో ఉన్నాయి: దృశ్యంలోని సమాచారాన్ని మాటలుగాను, వాక్యాలుగానూ మార్చి, వాటిని దాచుకుని, అవసరం వెంబడి బయటకి తీసి మెదడు వాడుకుంటుంది అనేది ఒక వాదం (prepositional theory). కాదు, దృశ్యంలోని సమాచారాన్ని బొమ్మల (pictures) రూపంలో దాచుకుని, వాడుకుంటుంది అనేది రెండవ వాదం (pictorial theory). ఈ రెండవ వాదం కొత్తదేమీ కాదు. ఈ ప్రశ్నని 17వ శతాబ్దంలోనే ఫ్రాన్స్‌ దేశపు తాత్త్వికుడు రెనె డెకార్ట్ (Rene Descartes) లేవదీశాడు. ఆయన వాదం ప్రకారం మనోనేత్రానికి కనబడే ‘మానస చిత్రాల’లో కొన్ని భాగాలు నిష్పాక్షికం, అసంపూర్ణం అయితే మరికొన్ని భాగాలు పూర్తిగా ఉపేక్షించబడతాయి. ఇప్పుడు ఊపు అందుకొంటున్న వాదం ‘మానవుల మెదడులలో బయటనుండి వచ్చే సమాచారం బొమ్మల రూపంలోనూ, మాటల రూపంలోనూ కూడా నిక్షిప్తం చేయబడుతోంది’ అంటూ ‘తుని తగవు’ తీర్చింది.

అవీ ఇవీ

ఒకానొకప్పుడు ‘అన్నగారు’ అనుకుంటాను విజన్ 2020 అన్నప్పుడు సా. శ. 2020లో ఆంధ్ర ప్రదేశ్ ఎలా ఉండాలో వర్ణించిన శ్వేతపత్రం అనుకునేవాడిని. కాదుట! విజన్ 2020 అంటే దృష్టిదోషం లేకుండా (2020 సంవత్సరంలో అని కాదు) ఆంధ్ర ప్రదేశ్ ఎలా ఉండాలో భావికంగా రచించిన ప్రణాళిక అని అర్థం! అనగా, ఇక్కడ 2020 అన్నది సంవత్సరం కాదు; కంటి వైద్యులు వాడే 20/20కి మరొక రూపం. కానీ ఇటీవల ‘అల్లుడుగారు’ దావోస్‌లో విజన్ 2047 అనడం మొదలుపెట్టేరు. అనగా, మన మంత్రివర్గానికి విజన్ 2020 అనే పదబంధం అసలు అర్థం తెలియలేదనే అనుకోవాలా? లేక వీరి దృష్టి 20/47కి దిగజారిందనుకోవాలా?

కంటి వైద్యులు 20/20 దృష్టి అంటే ‘ఏ రకమైన దృష్టిదోషం లేని ఒక సగటు వ్యక్తికి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులు కనిపించే రీతి’ అని చెబుతుంది. ఇక్కడ లవంలో ఉన్న 20 కంటికీ అక్షరాలకీ మధ్య ఉన్న దూరం, అడుగులలో! హారంలో ఉన్న 20 ఎంత స్ఫుటంగా అక్షరాలు కనిపిస్తున్నాయో చెబుతుంది. ఈ పద్ధతిలో 20/15 అంటే సగటు వ్యక్తి కంటే బాగు అనిన్నీ, 20/200 అంటే చట్టం దృష్టిలో గుడ్డి వ్యక్తి అనిన్నీ అర్థం! మరి మెట్రిక్ పద్ధతి ఉన్న దేశాలలో? అక్కడ 6/6 vision అంటే చూపులో దోషం లేని వ్యక్తి! మన దేశంలో మెట్రిక్ పద్ధతి అమలులో ఉంది కనుక ‘అల్లుడుగారి’ ‘కొడుకుగారు’ వంశపారంపర్యంగా ముఖ్యమంత్రి అయి, విజన్ 66 అని తన శ్వేతపత్రానికి పేరు పెట్టాలి!

ఇంగ్లీషులో ఐ విట్‍నెస్ అన్నా తెలుగులో సాక్షి అన్నా ఒకటే అర్థం. స + అక్షి = సాక్షి కనుక సాక్షి అంటే కంటితో చూసిన వ్యక్తి, సాక్ష్యం అంటే కంటితో చూసినది.


సంప్రదించిన మూలాలు

  1. Diane Ackerman, A Natural History of the Senses, Vintage Books, Random House, New York, NY 1991.
  2. V. Vemuri, “Color”, Science Reporter, A CSIR Publication, Sep. 1995, New Delhi, India.
  3. Jamie Enoch, Leanne McDonald, Lee Jones, Pete R Jones, David P Crabb, “Evaluating Whether Sight Is the Most Valued Sense” JAMA Ophthalmol. 2019 Oct 3;137(11):1317–1320.
  4. Fabian Hutmacher, “What is Our Most Important Sense?” July 28, 2021.
  5. Dana Foundation, The Sense of Vision, Sep 20, 2023.
  6. Suzanne Wakim, Mandeep Grewal, “Human Senses” LibreTexts: Biology.
  7. Must-Know Facts About Intraocular Pressure.
  8. Cody Cottier, “Idle Imaginations,” Discover: Science that Matters, pp 50, 52, 53, May/June 2024.
  9. Joel Pearson and Stephen M. Kosslyn, “The heterogeneity of Mental Representation: Ending the Imagery Debate” National Academy of Sciences, 112 (33) 10089-10092, July 14, 2015.
  10. Dim Light Exposure and Myopia in Children – PMC
  11. Light and myopia: from epidemiological studies to neurobiological mechanisms – PMC
  12. (తెలుగు విడియో) Working Of Human Eye: How Human Eye Works Explained.
  13. కొడవటిగంటి రోహిణీప్రసాద్ తెలుగులో రాసిన, దృష్టికి సంబంధించిన, ఆసక్తికరమైన, చిరు వ్యాసాలు ఈ లంకె దగ్గర (సైన్సు వ్యాసాలు-పుస్తకాలు) అంశంలో దొరుకుతాయి.

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...