తాడు తెగిన గాలిపటం

(వేమూరి వేంకటేశ్వరరావు గారి ‘శాస్త్రీయకల్పనా కథలు ‘ ( Science fiction ) చిరపరిచితాలు. ఐతే వారి రచనల్లోని తెలుగు భాషా ప్రయోగ మార్దవం కూడ చాలా అరుదైనది. అందుకు ఈ కథ కూడ ఒక ఉదాహరణే.)
1

ఆడదాని ప్రాపు లేని మగాడి జీవితం తాడు తెగిన గాలిపటం లాంటిదని నేనంటే ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా రంగబాబు జీవితాన్ని తన కళ్ళతో చూసిన రామేశం గారు ఒప్పుకుంటారు. అందుకనే రంగబాబుని ఆసుపత్రిలో చేర్పించారని డ్రైవరు మోసుకొచ్చిన వార్త విన్నప్పుడు రామేశం గారి మనోవీధిలో కాలచక్రం ఒక్కసారి వెనక్కి తిరిగినట్లయింది.

సరిహద్దు గాంధి అని పేరు తెచ్చుకున్న ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌లా ఆరు అడుగుల చిల్లర పొడుగుతో పక్కా పఠాన్‌లా ఉక్కు కడ్డీలా ఉంటాడు చూడ్డానికి, రంగబాబు. ఎనభయ్యో పడి దగ్గర పడుతున్నా నడ్డి ఒంగలేదు, పన్ను కదలలేదు, మనిషి కంగలేదు. ఎప్పుడూ జిర్రున చీదెరగడు. అటువంటి వాడు ఆసుపత్రిలో చేరేడంటే నమ్మబుద్ధి కాలేదు రామేశం గారికి.

రంగబాబుని తెలియని వాళ్ళు ఎవరైనా ఆ ఊళ్ళో ఉన్నారంటే కచ్చితంగా వాళ్ళు ఆ ఊరికే కాదు, ఆ ప్రాంతాలకే కొత్త అయుండాలి. రంగబాబు జీవితం ఒక తెరచి పెట్టిన పుస్తకం. అదే ఊళ్ళో పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే స్థిరపడిపోయిన వ్యక్తి రంగబాబు. నోటిమంచితనంతో ఊరుని మంచి చేసుకుని తలలో నాలుకలా బతక నేర్చిన మనిషి రంగబాబు. అటువంటి వాడు ఆసుపత్రిలో చేరేడంటే ఎవరికైనా ఎలా ఉంటుంది?

సాయంకాలం అయేసరికి ఆరడుగుల మనిషీ మరో ఆరడుగుల పొడుగున్న చేతికర్ర ఒకటి పుచ్చుకుని ఊళ్ళో తిరగడానికి వెళ్ళేవాడు. చీకటి పడేవరకూ తిరిగి, పిల్లా జెల్లా అందరినీ పలకరించేవాడు. పండితులూ, పామరులూ, పెద్దలూ, పిన్నలూ అంతా ఏకవచనంతో “రంగబాబూ” అనే పిలుస్తారు. అందరికీ అంత చనువు ఇచ్చే వాడు. అటువంటి రంగబాబుకి ఇప్పుడు ఏమిటి వచ్చిందో?

“సివంచలం! రంగబాబుని ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా నేను వచ్చి చూడవలసిన అవసరం ఏమిటి వచ్చింది?”
“నాకేటి తెలుద్ది బాబూ. వారం రోజులకి ముందే బాబూ, నేను సిన్నయ్యని తోలుకుని కిలినిక్కాడికొచ్చేసరికి, అప్పటికే ఈ రంగబాబు బాబండి, అక్కడ బల్ల మీద కూకునున్నాడండి. అయ్యా! అప్పట్నుండి సిన్నయ్య తవఁరు ఊర్నుండి ఎప్పుడొత్తారా అని ఒకటే ఎదురుసూత్తన్నారండి, బాబయ్య.”
“నువ్వు ఒక అరగంట సేపు కూర్చో. నేను త్వరలోనే తెమిలి వస్తాను.”
“ఆయ్‌.”

రంగబాబు! ఏనాటి రంగబాబు! ఎప్పటి రంగబాబు!! రామేశం గారి మనోవీధిలో పాతరోజులు ఒక పరుగు తీసేయి.

రంగబాబు గాంధీగారి వల్ల బాగా ప్రభావితుడైన వ్యక్తి. కాంగ్రెసు వాళ్ళు గాంధీ టోపీలంటే పెట్టుకుంటున్నారు కాని నూలు వడికే రాట్నాలని ఆ గాంధీగారి చితి మీదే పడేసి కాల్చేసినట్లున్నారు. రంగబాబు మాత్రం క్రమం తప్పకుండా రోజూ రాట్నం ఒడుకుతాడు. ఖద్దరు బట్టలే కడతాడు. మద్యం, మాంసం ఎల్లప్పుడూ ముట్టడు. జంతువుల చర్మంతో చేసిన చెప్పులు వేసుకుందికి కూడా వెనకాడతాడు. గాంధీగారి లాగే మేకపాలు తాగేవాడు, చాలారోజులు. తర్వాత ఆ పాలు కూడ తాగడం మానేసాడు. ఎందుకలా చేసేవని అడిగితే మేకపాలు మేక పిల్లలకే అనేవాడు.

సర్కారు వారి నౌకరీ నుండి పింఛను పుచ్చుకున్న తర్వాత ఆరోగ్యానికి మంచిదని ఒంటిపూట మొదలు పెట్టేడు. మధ్యాహ్నం మాత్రమే అన్నం తిని రాత్రి రెండే రెండు గోధుమ రొట్టెలతో పాటు ఒక అరటిపండు తిని కాసిని నీళ్ళు తాగి ఊరంతా తిరిగింది చాలనట్లు వాకిట్లో ఒక అరగంట సేపైనా పచారు చేసి అప్పుడు నడ్డి వాల్చేవాడు. మునిమనవలో, పక్కింటిపిల్లలో, పొరుగింటి పెద్దలో పోరు పెడితే కాదనలేక “శివదీక్షాపరురాలనురా” అన్న పాట పాడి అప్పుడు నిద్రపోయేవాడు. ఇదీ రంగబాబు దైనందిన జీవితపు నేపథ్యం టూకీగా చెప్పుకుంటే. అసలు కథ ఇంకా పెద్దదే ఉంది.

రంగబాబుకి ఉన్న ఆస్తి అంతా అతని భార్య, ఆమె ఒంటి మీద ఉన్న నగలు. ఆవిడ ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందటే మెళ్ళో ఉన్న పసుపుతాడుతో కన్ను మూసే వేళకి ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం అంతా మగపిల్లల చదువులకి ఆడపిల్లల పెళ్ళిళ్ళకి హారతికర్పూరంలా హరించుకుపోయింది. “నాకేమి నలుగురు మగపిల్లలు. వాళ్ళు ఉద్యోగాలు చేసేరంటే రాసులు గణించి నిలువెత్తునపోస్తారు” అని కొండంత ధైర్యంతో ఒళ్ళు ఒలిచి చదువులు చెప్పించి అదృష్టవంతురాలు కనుక ఆ రాసుల కోసం ఎదురు చూడకుండానే కన్ను మూసింది.

చదువులు ఐన తర్వాత నలుగురు మగపిల్లలూ ఎవరి పొట్టలు వారు పట్టుకుని ఒకరు అమెరికా అనీ, మరొకరు ఆస్ట్రేలియా అనీ నాలుగు దిక్కులకీ చెదిరిపోయారు. అక్కడ వాళ్ళు నాలుగు రాళ్ళేమి ఖర్మ బాగానే గణించుకుని వాళ్ళ వాళ్ళ పెళ్ళాలతో కాపురాలు చేస్తున్నారు. అమెరికా జీవితాలకీ, జీతాలకీ అలవాటు పడిపోయిన పిల్లలకి వయస్సు మళ్ళిన తండ్రి మంచిచెడ్డలు చూసుకునేందుకని దేశం వచ్చేసి స్థిరపడడంలో ఉన్న తర్కం బోధపడలేదు. తిరిగొస్తే మంచి ఉద్యోగాలు దొరుకుతాయన్న భరోసా ఏమీ లేదు. ఉద్యోగాలు దొరికినా అమెరికా వదిలి భారతదేశం తిరిగి వెళ్ళడానికి వాళ్ళ వాళ్ళ పెళ్ళాలు ఒప్పుకుంటారన్న భరోసా అంతకంటె లేదు. వాళ్ళ దృష్టిలో ఇండియా వెళితే గొర్రెతోకలా చాలీ చాలని జీతాలు, అంబరచుంబితాలలా ఆకాశాన్నంటే ఖర్చులు, పిలవని పేరంటంలా వచ్చిపోయే బంధువులు. అత్తమామలు, ఆడబొడుచుల బెడద సంగతి సరేసరి. అమెరికాలో స్థిరపడిపోతే ఈ బెడదలు ఉండవు. నెలకో వందో రెండు వందలో ఇంటికి పంపినా అక్కడ రంగబాబు వ్యష్టిగా గడిపే జీవితానికి అది ఎక్కీతొక్కి.

స్వతంత్రంగా ఆలోచించుకోగలగడం, తమ ఆలోచనా సరళిలో తప్పేమీ లేదన్న ధైర్యం సంపాదించడం ఈ రెండూ పాశ్చాత్య దేశాలు వెళ్ళిన తర్వాత భారతీయులలో వచ్చే పెద్ద మార్పులు. మంచో చెడ్డో, మనస్సుకి తట్టిన ఊహలో తర్కాభాసం ఏమీ కనిపించలేదు రంగబాబు కొడుకులకి, కోడళ్ళకి. ఏమాటకామాట చెప్పుకోవాలి. అభిమానాలు లేకపోలేదు. ఎంత కాదన్నా కన్న తండ్రి కదా. తరచుగా వస్తూ ఉంటారు. ఖర్చులకని ఇంత డబ్బు ఆయన చేతిలో పెట్టి పోతూ ఉంటారు. కూతుళ్ళంతా దగ్గరలోనే ఉంటారు కాబట్టి వ్యావహారికమైన సాధకబాధకాలనీ, మంచి చెడ్డలనీ చూసి పోయే బాధ్యత గుజస్తుగా వారి మీద పడింది.

పాఠశాలలో ఎన్నో పరీక్షాపత్రాలని అవలీలగా పరిష్కరిస్తూ వచ్చిన రంగబాబు పిల్లల జీవితాలలో కొరుకుడుపడని గడ్డు ప్రశ్న ఒకటి మిగిలిపొయింది. అదేమిటయ్యా అంటే వయసు మీరుతూన్న తండ్రి, అతగాడి జీవితం. రంగబాబు శేషజీవితాన్ని ఎక్కడ ఎవ్వరి దగ్గర గడపాలీ అన్న అంశం మీద ఆ ఇంట్లో తర్జనభర్జనలు జరగని రోజు లేదు. కాని తరుణోపాయం ఎవ్వరికీ తట్టలేదు.

వయస్సు మీరుతూన్న తండ్రిని చూసుకోవలసిన నైతిక బాధ్యత మగపిల్లలదేనని ఆడపిల్లలు అభిప్రాయపడ్డారు. ఒక వేళ తండ్రి దగ్గర ఆస్తి ఉండుంటే అది మగపిల్లలకే సంక్రమించి ఉండేది కదా, కనుక తండ్రి బాధ్యత కూడ వారిదే అని వారి వాదం.

భారతదేశంలో బాధ్యత అంటే ముందు గుర్తుకు వచ్చేది డబ్బు! కనుక, అవసరమైన ఖర్చులన్నీ భరిస్తాము కానీ, తండ్రిని దగ్గర ఉండి చూసుకుందుకని ఉద్యోగాలు ఒదిలేసి రాలేమని మగ పిల్లల మొరాయింపు. ఒకవేళ తెగించి వచ్చేస్తే ఇండియాలో దొరికే చాలీ చాలని జీతాలతో తండ్రిని ఏమి పోషించగలరు? ఆడపిల్లలైతే నేమిటి? తండ్రి అందరికీ తండ్రే కదా. కనుక రంగబాబు కూతుళ్ళ దగ్గర ఉండడమే మంచిదని విదేశాలలో ఉన్న మగ పిల్లలు ఉద్దేశపడ్డారు.

తండ్రిని తమతో తీసుకెళితే లోకం హర్షించదనీ, ఒకవేళ లోకంతో నాకేం పని అని తెగించినా తమ అత్తవారు అనుమతించరనీ ఆడపిల్లలు నచ్చజెప్పు మాటలు చెప్పేవారు. మగపిల్లలు అమెరికా నుండి తిరిగి వచ్చేసి తండ్రి మంచి చెడ్డలు చూసుకోటానికి వీలు కాని పక్షంలో ఆయనని అమెరికా తీసికెళ్ళిపోమని సలహా కూడ ఇచ్చేరు. ఇలా రంగబాబు భవిష్యత్తు గురించి ఆ ఇంట్లో తర్జనభర్జనలు, వాగ్వివాదాలు జరగని రోజు లేదు.

ఈ వయస్సులో ఆయన అమెరికా వెళితే అక్కడ కాలక్షేపం కాక నిష్కారణంగా చచ్చిపోతాడని ఊళ్ళో కొందరు ఆరాటపడ్డారు. ఒకవేళ తమతో అమెరికావో ఆస్ట్రేలియావో ఆయనని తీసుకెళ్ళిపోతే ఆడపిల్లలకి మళ్ళా మళ్ళా తండ్రిని చూసే అవకాశం ఉండదనీ, కనుక తొందరపడడం మంచిది కాదనీ చెప్పి చూసేరు, మగపిల్లలు.

తండ్రిని నిజంగా తమతో తీసుకెళ్ళదలుచుకున్నప్పుడు అదొక పెద్ద అభ్యంతరం కాదన్నారు అమ్మాయిలు ఏక కంఠంతో. “ఆయన చచ్చిపోతే ఏమిటి చేసి ఉండేవాళ్ళమి? ఒకసారి భోరుమని ఏడిచి తర్వాత కాలక్రమేణ మరచిపోయి ఉండే వాళ్ళమి కదా?” అని ఎదురు ప్రశ్న వేసేరు.

ఈ వాగ్వివాదాలలో వేడి పుడుతోంది కాని వెలుతురు పూజ్యం.  చెప్పొచ్చేదేమిటంటే, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఎవ్వరికీ దొరకలేదు.

రంగబాబుకి దేశాలు దాటి మగపిల్లల దగ్గరకి వెళ్ళి ఉండవలసిన అవసరం కనిపించలేదు. కోడళ్ళ చేత మాట పడవలసిన అవకాశం కల్పించడం ఆయనకి ఇష్టం లేదు. కాని ఊరంతా కోడై కూస్తుందేమోనన్న భయమూ, కూతుళ్ళ ముందు కొడుకులు ఎక్కడ లోకువై పోతారో నన్న అనుమానంతో రంగబాబు తెగించి కొడుకుల దగ్గరకి వెళ్ళి ఉందామని అమెరికా వెళ్ళడం వెళ్ళేడు. నాలుగు నెలలు ఉండి ఎలా ఉంటుందో చూద్దామని వీసా తీసుకున్న మనిషి నాలుగు వారాలు తిరక్కుండా ఏదో వ్యవహారం ఉందని తిరిగివచ్చేసేడు. “ఒకొక్కళ్ళ దగర ఒకొక్క నెల ఉన్నానంటే నాకు యుగాలు రోజులుగా గడిచిపోతాయి” అని చెప్పిన పెద్దమనిషి చివరికి ఎవరిదగ్గరా ఉండడానికి ఇష్టపడక సొంత ఇంట్లోనే ఒంటరిగా కాలక్షేపం చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు.

రంగబాబుకి ఊరినిండా స్నేహితులే. వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. పలకరించే వాళ్ళకీ, కాలక్షేపానికీ కొదువ లేదు. అమెరికా నుండి తిరిగొచ్చేసేడు కనుక బతికిపోయేడు కానీ అక్కడే ఉండుంటే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడు ఒంటరితనం భరించలేక.

కాఫీ కూడ కాచుకోవడం చేతకాని శాల్తీ చెయ్యెక్కడ కాల్చుకుంటాడని అనుకుంటూ ఆయన బంధువర్గంలో ఉన్న వయసు మళ్ళిన వెధవావిడ ఒకావిడ ఆయనకి నాలుగు చారు మెతుకులు వండిపడేసి తనో నాలుగు మెతుకులు కతికి తలదాచుకోవచ్చు కదా అని ఆయన పంచన చేరింది. ఏదో అంధపంగన్యాయం, కుంటివాడికి గుడ్డిది తోడులా, అనుకుని రంగబాబు కానిమ్మన్నట్టు ఊరుకున్నాడు.

అన్ని రోజులూ సజావుగా వెళ్ళిపోతే చెప్పుకునేందుకు ఏమి ఉంటుంది? కర్మ వశాత్తూ ఒక రోజున ముసలావిడ స్నానం చేస్తూ నూతి చపటా మీద కాలు జారి పడింది. వయసు మళ్ళిన ఆడది కావడంతో ఎముకలు పెళుసుదేరి ఉన్నాయేమో కిందపడగానే ఆవిడ తుంటి ఎముక విరిగింది. మంచం పట్టేసింది. ఇక మనకి దక్కదని తెలిసి కూడ రంగబాబు చేతనైన వైద్యం చేయించేడు. కాని ముసలావిడ తీసుకుని తీసుకుని ఏడాది తిరక్కుండా ప్రాణం ఒదిలేసి, రంగబాబుని ఒంటరిగా ఒదిలేసి వెళ్ళిపోయింది.

ముసలావిడకి యధావిధిగా కర్మకండలు చేయించేడు రంగబాబు. పదకొండో రోజు కర్మకాండ జరిగిన తర్వాత, వచ్చిన వాళ్ళు ఎవరిళ్ళకి వారు వెళిపోయిన తర్వాత రంగం నుంచి నిష్క్రమించినట్టు అమాంతం మటుమాయం అయిపోయేడు రంగబాబు. నెల రోజుల పాటు కనబడని మనిషి ఒక రోజున అకస్మాత్తుగా క్లినిక్‌ దగ్గర తేలేడన్నమాట.

“దిగండి బాబు గారూ కిలినిక్కొచ్చేసేం” అని సివంచలం హెచ్చరించేసరికి రామేశం గారు ఆలోచనా తరంగాలని దాటుకుని ఈవలి గట్టుకి వచ్చేరు. సివంచలం కారు తలుపు తీసి పట్టుకుంటే రామేశం గారు చేతికర్రతో సహా నెమ్మదిగా దిగుతూ ఉంటే డాక్టర్‌ పరాంకుశం క్లినిక్‌లోంచి బయటకు వచ్చి ఆయనకి ఎదురేగి ఆయన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకు వెళ్ళేడు.

“ఏమిటి జరిగిందోయ్‌ పరాంకుశం? అంత అర్జంటుగా కారు పంపేవు?” అని కుర్చీలో కూర్చుంటూ అడిగేరు రామేశం గారు.
“రంగబాబుని మీరొకసారి చూడాలి” అంటూ రామేశం గారిని రంగబాబు దగ్గరకి తీసుకెళ్ళాడు పరాంకుశం.

రంగబాబుని చూసి రామేశం ముక్కు మీద వేలేసుకున్నారు. రెండు మూడేళ్ళ క్రితం చూసిన రంగబాబు ఎంతలా మారిపోయేడూ! ఉక్కు ముక్కలా ఉండే రంగబాబు ఊదేస్తే పడిపోయేలా ఉన్నాడు. నోట్లోంచి చొంగ కారుతోంది. కళ్ళలో కళ లేదు. అవి అలా శూన్యం లోకి చూస్తున్నాయి. ఉక్కుపిడుగులా ఊరంతా తిరిగే మనిషి నర్సు చెయ్యి పట్టుకుని కాని నిలబడలేకపోతున్నాడు!
“రైలు స్టేషన్‌లో ఓ రోజు రాత్రంతా బల్ల మీద కూర్చున్నాడుట. తెల్లారి ఎవరో ఈయనని గుర్తు పట్టి తీసుకొచ్చి క్లినిక్‌లో దిగబెట్టి పోయారు. నేను చొరవ చేసి క్లినిక్‌లో ఎడ్మిట్‌ చేసి దగ్గరలో ఉన్న ఆయన కూతుళ్ళకీ, మనవలకీ కబురు పెట్టేను. వాళ్ళు వచ్చి చూసి వెళుతున్నారు.”
“…..”
“వారం రోజుల బట్టి పరీక్షలు చేసి చూస్తున్నాను. మూత్రాన్ని అదుపు చెయ్యలేక జారవిడిచి బట్టలు తడిపేసుకుంటున్నాడు. తిండి తినడు. రాత్రుళ్ళు మనిషి కాపలా లేకపోతే బయటికి పోతున్నాడు. ఒంటిమీద బట్ట ఉందో లేదో కూడ చూసుకోవడం లేదు.”
” ….. ”
“ముసలావిడ పోవడంతో తాడు తెగిన గాలి పటంలా తయారయిన జీవితాన్ని తలుచుకుని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడని అనుకున్నాను. నాలుగురోజులలో ఆ శ్మశానవైరాగ్యం సర్దుకుంటుందనుకున్నాను.”
” …. ”
“ముసలావిడకి హిప్‌ ఫ్రేక్చర్‌ అయిందంటూ రంగబాబు మొదటిసారిగా నన్ను కన్సల్ట్‌ చెయ్యడానికి వచ్చినప్పటికే ఒంటి మీద వయస్సు కనిపిస్తోంది కాని, మనిషి బాగానే ఉన్నట్లు కనిపించేడు. ముసలావిడ ఇంక ఎంతో కాలం బతకదని చెబితే చెట్టంత మనిషీ భోరుమని ఏడిచేసి విరిగిన మానులా కూలబడిపోయేడు.”
” ….. ”
“అప్పుడు అమెరికాలో ఉన్న పిల్లలు ఫోను చేసి చెప్పేరు. డబ్బు ఖర్చు పెడతామన్నారు. వైద్యం చేయించమన్నారు. అందుకని కేట్‌స్కేన్‌ తీయించేను. ఆల్‌జైమర్స్‌ రోగం అనుకుందామంటే మెదడు ఏమీ కృశించినట్లు కనిపించలేదు. పోనీ మస్తిగాతం (స్ట్రోక్‌) సూచనలు కానీ, మెదడులో కంతి (ట్యూమర్‌) ఉన్న సూచనలు కానీ ఉన్నాయేమోనని చూసేను. ఏమీ కనపడలేదు. స్పయినల్‌ టేప్‌ తీసి వెన్నుజలం చూసేం. అది కూడ ఉందవలసిన లక్షణాలతో మడ్డిగా కాకుండా తేట (క్లియర్‌) గా ఉంది. రక్తం పరీక్ష చేసి చూసేం. ఎర్ర కణాల కైవారం ఉండవలసిన దానికంటే ఒక్క రవ ఎక్కువగా ఉన్నట్లు అనిపించేయి తప్ప అక్కడా దోషం పెద్దగా ఏమీ కనిపించలేదు.”
“ఆంగికమైన రోగలక్షణాలు ఏమీ లేవంటావు.” మొదటిసారిగా రామేశం గారు ఒక చిన్న ప్రశ్న వేసేరు.
“అలాగే అనిపిస్తోందండి. ఎందుకేనా మంచిదని న్యూరాలజిస్టు ఒకావిడని సంప్రదించేమండి. ఆవిడది నాడీ మండలానికి సంబంధించిన జబ్బులలో ప్రావీణ్యత కనుక పరీక్షలలో పట్టుబడని లక్షణాలని పట్టుకోగలదని నమ్మకంతో ఆవిడ ఉద్దేశం అడిగేమండి.”
“ఆవిడ ఏమంది?”
“పెద్దాపురం చాంతాడంత సంస్కృత సమాసం లాంటి వైద్యపదజాలంతో ఒక రోగనిర్ణయం చేసి అంతకంటె పెద్ద బిల్లు పంపిందండి.”
“నాకు అర్థం అయే భాషలోకి అనువదించి సారాంశం చెప్పు చాలు.”
“అత్యధికమైన వేగంతో పురోగమిస్తున్న డెమెంటియా అని ఆవిడ అభిప్రాయం. డెమెంటియా అన్నా సెనిలిటీ అన్నా దరిదాపు ఒకటే. పెరిగే వయస్సుతో పాటు వచ్చే బుద్ధిమాంద్యత, మానసిక బలహీనత.”
“ఈ ‘ముదిమి మాంద్యత ‘ వయస్సుతో సంక్రమించే రోగం అయినప్పుడు, తత్సంబంధమైన మార్పులు ఏమీ లేవని చెబుతున్నావు కదా! దానికి ఆవిడ సంజాయిషీ ఏమిటి?”
“ఆవిడకీ తెలియదంది. అందుకనే ఆవిడ దానిని ‘నిర్ధారించలేని కారణంతో అత్యధిక వేగంతో పురోగమిస్తున్న ముదిమి మాంద్యత ‘ అని రోగనిర్ణయం చేసిందండి.”
“అంతేనా? ఇంకేమైనా చెప్పిందా, ఆ డాక్టరమ్మ?”
“ఇంకా ఉందండి. అంతా చెప్పమంటారా?”
“చెప్పవోయ్‌!”
“తెలుగులోకి తర్జుమా చేసి చెబుతానండి. వినండి. ‘ నిర్ధారించలేని కారణంతో అత్యధిక వేగంతో పురోగమిస్తూన్న ముదిమి మాంద్యత ఇది. దీని కారణంగా రోగి కర్మేంద్రియాలలో సహకార నిరాకరణ కనిపిస్తున్నాది. రోగి తన పరిధిని మించిన ఉద్వేగానుభూతులకి లోనవుతున్నాడు. మెదడు లోని తార్కిక శక్తులని, జ్ఞాపకశక్తిని నియంత్రించే కేంద్రాలు లోపభూయిష్టంగా పనిచేస్తున్నాయి. ‘ ఇదండి రోగనిర్ణయం.”
“ఈ రోగనిర్ణయానికి ఏమాత్రం ఫీజు పుచ్చుకుందోయ్‌?”
“అమాంబాపతు కలుపుకుని అరలక్ష అయిందండి.”
“ఈ దెబ్బతో ఆ అమెరికాలో ఉన్న కొడుకులకి అరుంధతి నక్షత్రం కనిపించి ఉండాలి… అది సరేకానీ, మానసిక వైద్యుణ్ణి ఎవరినైనా సంప్రదించేవేమిటోయ్‌?”
“అదీ చేసేనండి. సైకాయాట్రిస్టు ఏమన్నాడంటే ఏదో విషపూరిత పదార్థం తినేసి ఉంటాడేమో తప్ప రోగిలో డిప్రెషన్‌ లక్షణాలేవీ లేవన్నాడు.”
“దీనికి ఎంతయిందోయ్‌?”
“దీనికో ముప్ఫై వేలండి.”
“గుడ్డిలో మెల్ల. డిప్రెషన్‌ లేదు. బాగానే ఉంది. కాని మనం కడితేరా గట్టెక్క లేదు. ఎందుకంటే డిమెంటియా ఉన్నట్లుంది. మూడొంతులు విషపదార్థం కారణం అయుండొచ్చు.”
“విషపదార్థం ఏదీ కాదని మేము రక్త పరీక్ష చేసి నిర్ధారించేమండి.”
“పరాంకుశం, ఇప్పటి వరకూ డబ్బు నీళ్ళలా ఖర్చయినట్లు ఉంది. రోగం ఇతమిద్ధంగా ఇదీ అని ఎవ్వరూ నిర్ధారించలేక పోతున్నారు. ఎంత డబ్బు కుమ్మరించి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితం కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకూ ఉక్కుపిడుగులా చెక్కుచెదరకుండా తిరిగిన మనిషి, మతిలేని వాడిలా రోజు రోజుకీ క్షీణించి పోతున్నాడని చెబుతున్నావు. ఆలశ్యం చేస్తే మనకి దక్కకుండా పోతాడేమోనని నాకు అనుమానంగా ఉంది.”
“ఆ ముసలావిడ కూడా లేదు. చూసి చేసే వాళ్ళు లేక పోయిన తర్వాత ఆయన ఇంకా బతికి ఏమి బాలసllకుంటాడండి? దిక్కూదివాణం లేకుండా ఏ ప్రేమసమాజం వాళ్ళ కొంపలోనో పడుండవలసి వస్తుందో ఏమిటో. ఏదో ఆయన్ని ఇలా వెళ్ళిపోనివ్వకూడదూ?” అంతవరకూ వ్యవహారం అంతా వింటున్న నర్సు కొంచెం కలగజేసుకుని తన మనస్సులో ఉన్న మాటని పైకి అనేసింది.

నర్సు చేసిన వ్యాఖ్యానంలో కొంత నిజం లేకపోలేదు అనిపించింది రామేశం గారికి. కాని ఆమాటలని అంతర్గతం చేసుకుని మధించి మధించి చూడగా రంగబాబు జీవితం తన జీవితానికి ఒక దర్పణ బింబంలా అగుపించింది. తనూ రంగబాబూ దరిదాపు సమవయస్కులు. తన పిల్లలూ అమెరికాలో ఉన్నారు. తనకీ ఆడపిల్లలు ఉన్నారు. పరాంకుశాన్ని తన పంచన చేర్చుకున్న తర్వాత అతనూ అతని భార్య తన వ్యష్టి జీవితంలో ఉన్న లోపాలని పూరించి కన్న బిడ్దల కంటె ఎక్కువగా చూసుకుంటున్నారు. ఒక విధంగా తను అదృష్టవంతుడు.
రంగబాబు అటువంటి అదృష్టానికి నోచుకోలేదు. అయినప్పటికీ గాలిలో దీపం పెట్టి ‘భగవంతుడా నీదే భారం ‘ అని ఒదిలేసినట్లు రంగబాబుని ఎందుకు ఒదిలెయ్యాలి? ‘చేతనైన వైద్యం చేసేం. ఇక మాకు చేతగాదు ‘ అని ఒదిలేస్తే ఇప్పుడు ఎక్కడకు పోతాడు? ఇన్నాళ్ళూ రాని కొడుకులు ఇప్పుడు అమెరికా నుండి వచ్చి ఆయన మంచిచెడ్డలు చూడగలరనుకోవడం ఒక వ్యర్ధమైన ప్రతిపాదన. చుట్టపుచూపుగా వచ్చి సర్వబాధ్యతలూ వహించి అనారోగ్యుడైన తండ్రిని తమతో తీసుకు వెళతారనుకోవడం అవివేకం. ఆస్తి పంపకాలలో భాగస్తులు కాజాలని ఆడపిల్లలని బాధ్యతలలో భాగస్తులు కమ్మని ఆహ్వానించడం అన్యాయం.
ఇలా ఆలోచిస్తూ ఉంటే రామేశం గారి మనస్సు పాడైంది. ఆ సమయంలో ఆపద్బాంధవుడిలా పరాంకుశం కొడుకు గదిలో ప్రవేశించి, “తాత గారూ, మన కొత్త కంప్యూటరుని ‘ఇంటర్‌నెట్‌’ కి ‘కనెక్ట్‌’ చేసేను. మీరు చూద్దురుగాని రండి” అంటూ చెయ్యి పట్టుకుని బిరబిరా ఈడ్చుకుపోయాడు.

2

కిరణ్‌ కంప్యూటర్‌ సహాయంతో అతి లాఘవంగా, అమితోత్సాహంతో అంతర్జాలపు (‘ఇంటర్‌నెట్‌’) ఫేన శిఖల పైన ఈతకొడుతున్నాడు. యాహూ, అక్కడనుండి ఆల్టావిస్టా మొదలైన రకరకాల కంపెనీల వారి పుట్టుపుట (‘హోమ్‌పేజ్‌’) లోకి వెళ్ళి అక్కడ లభ్యమయే దర్శనులు (‘డైరెక్టరీస్‌’), అన్వేషణ యంత్రాలు (‘సెర్చ్‌ ఇంజన్స్‌’) వాడి ప్రపంచపు నాలుగు మూలలకీ వెళ్ళి వింతలు, వార్తలు, విశేషాలు కంప్యూటరు యొక్క జరనిక (‘స్క్రీన’) మీద చూపిస్తున్నాడు. రామేశం గారు ఆసక్తితో అన్ని విషయాలూ అవగాహన చేసుకుంటూ, అర్థం కాని చోట ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు.
“మీరు ఎవరి పేరైనా చెప్పండి.” కిరణ్‌ అడిగేడు.
అమెరికాలో ఉన్న తన కొడుకు పేరు చెప్పేరు, రామేశం.
ఆ పేరుని కంప్యూటర్‌ తెర మీద కనిపించేలా టైపు చేసి మీట నొక్కేడు, కుర్రాడు. ఒక నిమిషంలో రామేశం గారి కొడుకు పేరుతో పాటు మరొక అరడజను పేర్లు జరనిక మీద కనిపించేయి. ఆ పేర్లలో రామేశం గారి కొడుకు పేరుని ఎంచుకుని మళ్ళా మీట నొక్కేడు.
అప్పుడు రామేశం గారి కొడుకు పుట్టుపుట అతని ఫోటోతో సహా, తెరమీద కనిపించింది. కొడుకు ఫోటో చూడగానే రామేశం గారి శరీరం పుత్రవాత్సల్యంతో పులకించింది. ఆ ఫోటో పక్కనే కోడలు, మనవలు ఉన్న మరొక ఫోటో, ఆ తర్వాత అతని ఉద్యోగం వివరాలు, ఇలా ఎన్నో వివరాలు కనిపించేయి. కంప్యూటరు విభాగం లోని అంతర్జాలం నిర్మాణానికి అతను అహరహం ఎంతో కృషి చేసేడు. కనుక పరిశోధనా దశలో ఉన్న ‘ఇంటర్‌నెట్‌’ గురించి కొడుకు చెప్పగా తను ఎన్నో సార్లు విన్నాడు. కాని స్వానుభవం ఇదే.
“బాబూ, ఇందులో మనుషుల పేర్లేనా, మరేదైనా కూడా వెదకొచ్చా?”
“తాత గారూ, మీరు ఏదో ఒక పేరు చెప్పండి వెదుకుదాం!”
“హోమియోపతీ అన్న మాట గురించి వెదుకు.”
మనవడు హోమియోపతి అన్న మాటని అన్వేషణ యంత్రంలో కీలక పదంగా ప్రవేశపెట్టి మీట నొక్కేడు. ఈ మాట ఉన్న పుట్టుపుటలు కనీసం ముప్ఫైయ్‌ దొరికేయి చాల మట్టుకు ఇంగ్లండు, కెనడాల నుండి. హోమియోపతిలో తెలుసుకోవలసిన విషయాలు వందలాది కనిపించేయి. కంప్యూటరు సహాయంతో అన్వేషణ యంత్రాలని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా విస్తరిల్లి ఉన్న అంతర్జాలాన్ని నిమిషాల మీద వెతక వచ్చనీ, ప్రపంచవ్యాప్తంగా దొరికే సమాచారనిధిని ఇల్లు దాటకుండా, కడుపులో చల్ల కదలకుండా హస్తగతం చేసుకుని, అవగతం చేసుకుని, జీర్ణించుకుని ఏదైనా సాధించవచ్చని కిరణ్‌ సహాయంతో అవగాహన చేసుకున్నారు, రామేశం గారు.

కొత్త అనుభవంతో ప్రభవించే నూతనోత్సాహం కొంచెం చల్లారగానే రామేశం గారికి రంగబాబు గుర్తుకు వచ్చేడు. కిరణ్‌ సహాయంతో, కంప్యూటరు సాన్నిధ్యంలో కూర్చుని రంగబాబు జబ్బు మీద పరిశోధన మొదలుపెట్టేరు, రామేశం గారు. జబ్బు లక్షణాలని కంప్యూటరుకి చెప్పి ఏయే కారణాల వల్ల ఆయా లక్షణాలు పొడచూపుతాయో కనుక్కోవాలని ఆయన ఆరాటం. ఒకొక్క లక్షణం యొక్క పేరుని కీలక పదంగా కంప్యూటరు లోకి ఎక్కించి ఆ పదం తాకిడితో ఉద్భవించే జాబితాలన్నిటిని కూడ గట్టడం. తర్వాత ఇంతవరకు చేసిన పరీక్షల వల్ల గణించిన పరిజ్ఞానం అనే జల్లెడలో ఈ జాబితాలని వేసి జల్లించడం. అలా కుదించగా వచ్చిన చిన్న జాబితాలోని వ్యాసాలని చదవడం. చదివి జీర్ణించుకోవడం. ఇలా కిరణ్‌ సహాయంతో రామేశం గారు కంప్యూటరుతో రెండు గంటలైనా కుస్తీ పట్టి ఉంటారు. ఆఖరికి ఒక బాణీ కనబడసాగింది. ఆ బాణీని చూడగా, చూడగా రంగబాబు తినే తిండిలో ఏదైనా పోషకపదార్థాల లోపం ఉందేమోనని ఆయనకి కొద్దిగా అనుమానం వచ్చింది. అప్పుడు ‘పోషకపదార్థాల లోపం ‘ అనే అర్థం స్ఫురించేలా మరొక కీలక సమాసాన్ని ఇంగ్లీషులో తయారుచేసి మళ్ళా ఆమాటని అన్వేషణ యంత్రంలో వాడి ఏమిటవుతుందో అని ఆత్రుతగా ఎదురు చూసేరు. ఈ వడపోతలలో ‘అయొడీను, విటమినులు ‘ లోపించడం వల్ల వచ్చే జబ్బేదో రంగబాబుకి వచ్చుండాలని తేలింది.

థైరాయిడ్‌ గ్రంధి బాగానే పని చేస్తున్నాదని ఉదయం పరాంకుశం చెప్పేడు. కనుక, ఇది విటమిన్‌ లోపమా? బి12 లోపించినప్పుడు రంగబాబు లక్షణాలు కనిపించడానికి మంచి అవకాశం ఉంది.

ఈ బి12 శరీరంలో అత్యంత సూక్ష్మమైన మోతాదులలో ఉంటే సరిపోతుంది. ఈ బి12 విటమిన్‌ జంతు సంబంధమైన ఆహారాలలో తప్ప వృక్ష సంబంధమైన ఆహారాలలో దొరకనే దొరకదు. మనం తినే మాంసం, పాలు, పెరుగు, మజ్జిగలలో ఈ బి12 ఉంటుంది కనుక సర్వసాధారణంగా ఈ లోపం ఎవ్వరికీ రాదు. లోపం వచ్చిందంటే దానికి రెండే రెండు కారణాలు. ఒకటి, తిన్న విటమిన్‌ బి12 ఒంటపట్టక పోవడం. దీనికి కారణం బి12 ఒంటపట్టడానికి సహాయపడే కారణాంశాలు శరీరంలో లేకపోవడం. దేవుడు వరం ఇచ్చేడు కానీ పూజారి వరం ఇవ్వలేదంటామే, అచ్చం అదే సారూప్యం ఇక్కడ. రెండవ కారణం ఏమిటంటే బి12 విటమిన్‌ మనం తినే ఆహారంలో సరిపడా లేకపోవడం.

ఈ ఆధునిక యుగంలో విటమిన్‌ బి12 లోపించడం అనేది పరిపూర్ణ, పరమఛాందస, శుద్ధ శాకాహారులలో తప్ప మరెక్కడా కనిపించదు. అటువంటి పరమఛాందసమైన శుద్ధ శాకాహారులు ఈ రోజులలో కంచుకాగడా వేసి వెతికినా కనిపించరు. కనుక ఈ లోపం వల్ల ప్రభవించే లక్షణాలని చూసే భాగ్యం కోటికో వైద్యుడికి దొరుకుతుంది. కనుక ఈ లోపం వల్ల కనిపించే లక్షణాలని చూసినప్పుడు రోగనిర్ణయం చాల మంది వైద్యులు తప్పుగా చేస్తూ ఉంటారు.

భార్య చచ్చిపోయిన తర్వాతే పాలు కూడ తాగడం మానేసి ఒంటిపూట భోజనం మొదలుపెట్టేడు, రంగబాబు. పాలు తాగని శాకాహారులు కూడ తమకి తెలియకుండానో, ప్రమాదవశాత్తూనో జంతుసంబంధమైన పదార్థాన్ని అప్పుడప్పుడు భక్షించడం జరుగుతూ ఉంటుంది. ముసలావిడ వండి పడేసినన్నాళ్ళూ ఇటువంటి ‘ప్రమాదాలు ‘ అడపాదడపా జరిగే ఉంటాయి. ఆవిడ పోవడం, దానితో వచ్చిన ‘డిప్రెషన్‌’, తర్వాత పోషణ లోపించడం ఇవన్ని పులి మీద పుట్రలా ముసలాడి భుజాల మీద పడే సరికి మానవుడు తట్టుకోలేక పోయుంటాడు.

ఇలా సిద్ధాంత సౌధాన్ని ఒక దాన్ని మనస్సులో నిర్మించుకుని రాత్రి భోజనాలయిన తర్వాత పరాంకుశంతో ముచ్చటించేరు, రామేశం గారు.
గోల్డ్‌మెడలిస్ట్‌ పరాంకుశానికి ఈ సిద్ధాంతంలో ఏమీ లోపం కనిపించ లేదు. రామేశం గారు చెప్పే కథనాన్ని విని, “మీరు చెప్పిన దానిని బట్టి రంగబాబుకి వచ్చినది ‘పెర్నిషన్‌ ఎనీమియా ‘ అని నాకు అనిపిస్తోంది. క్రీ.శ. 1821 లోనే ఈ జబ్బు లక్షణాలని వైద్యులు వర్ణించేరు. 1926 నాటికి ఈ జబ్బుని కుదర్చడానికి ఒక ‘గృహవైద్యం ‘ దొరికింది ఆవులు, మేకలు వంటి జంతువుల కాలేయం (‘లివర్‌’) తినడం. క్రీ.శ. 1948 నాటికి కాలేయం అంతా తినక్కర లేదనీ, అందులో ఉన్న కోబాలమీన్‌ అనే పదార్థం తింటే సరిపోతుందనీ నిర్ణయించేరు. ఈ కోబాలమీన్‌నే మనమంతా విటమిన్‌ బి12 అని పిలుస్తాం.”

అప్పుడప్పుడే సైన్సు పాఠాలు నేర్చుకుంటూన్న కిరణ్‌ ఈ కబుర్లన్నీ వింటున్నాడు. వచ్చిన అనుమానాన్ని ఆపుకోలేక అడిగేడు
“మరయితే, మరయితే, ఆవులు శాకాహారులే కదా! వాటి కాలేయాలలోకి ఈ బి12 ఎక్కడ నుండి వచ్చింది?”
ఈ ప్రశ్నలో ఉన్న సొగసుని రామేశం గారు పట్టలేదు కానీ పరాంకుశం పట్టేసేడు. పట్టేయడమే కాదు, తన కొడుకు ఇంత నిశితమైన ప్రశ్న అడిగినందుకు లోలోపల ఉప్పొంగిపోయాడు.
“కిరణ్‌! ఇది మంచి ప్రశ్నే! ఈ బి12 ఒక్క మనుష్యులకే కాదు చిన్న చిన్న మోతాదులలో జంతుకోటికి అంతటికీ కావాలి. కాని తమాషా ఏమిటంటే జంతువులు ఏవీ కూడ ఈ విటమిన్‌ ని తమ తమ శరీరాలలో తయారుచేసుకోలేవు. కనుక ఆవులూ, మేకలూ కూడ ఈ విటమిన్‌ ని తయారుచేసుకోలేవు.”
“మరయితే ఆవుల కాలేయాల లోకి ఈ విటమిన్‌ ఎలా వచ్చింది?”
“సృష్టిలో ఉన్న జీవకోటిలో ఒక రకం బేక్టీరియాకే ఈ విటమిన్‌ బి12 తయారుచెయ్యడం చేతనవుతుంది. ఈ రకం సూక్ష్మజీవులు నెమరువేసే జంతువుల కడుపుల లోనే బతక గలవు. మనుష్యుల పేగులలో ఉండే సూక్ష్మజీవులకి ఈ విటమిన్‌ తయారు చెయ్యడం చేతకాదు. కాని ఈ బి12 లేకపోతే మనుష్యులు చచ్చిపోతారు. కనుక పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే మనుష్యులు అప్పుడప్పుడు మాంసమో, పాలో, పెరుగో తింటూ ఉండాలి. ఆరోగ్యానికి కావలసిన మోతాదు అత్యల్పం.”
“పరాంకుశం! డార్విన్‌ సిద్ధాంతం ప్రకారం ఈ బి12 తయారు చేసుకోవడం చేతనైన మానవ వర్గాలే వృద్ధి చెంది మిగిలిన వర్గాలు ఈ జీవన సమరంలో దెబ్బతిని క్షీణించి ఉండవలసింది. మన మానవ జాతి ఈనాడు బతికి ఉన్నాది కనుక ఈ పరిస్థితిని మనం ఎదుర్కో వలసిన అవసరం మనకి రాలేదన్న మాటే కదా!” అని రామేశం చిన్న అనుమానాన్ని వ్యక్తపరిచేరు.
“నిజమేనండి. మీరు ఒక విషయం మరచిపోకూడదు. మొన్న మొన్నటి వరకు మానవుడు మాంసాహారి. మానవుడు భూమిని దున్ని సాగుచెయ్యడం నేర్చుకున్నది పది వేల ఏళ్ళ క్రితం. శాకాహారం అనే అలవాటు మహావీరుడు, బుద్ధుడు కాలంలో మొదలయింది. అంటే రెండు వేల క్రితం నుండే శాకాహారం వాడుకలోకి వచ్చింది. అందులోనూ చాల మంది శాకాహారులు పాలు, మజ్జిగ వగైరాలు తాగుతారు. కనుక బి12 లోపం సర్వసాధారణంగా రాకూడదు. వచ్చినా దానికి తిండి లోపం కాకుండా ఇందాకా చెప్పిన కారణాంశం లోపం కారణం అయి ఉండొచ్చు.
“విటమిన్‌ సరఫరా లోపాల వల్ల వచ్చిన జబ్బులని కుదర్చడం అతి తేలిక. లోపించిన విటమిన్‌ కొద్ది మోతాదులో తినిపించినంత మాత్రాన్న ఒరిగే నష్టం ఏమీ లేదు. అది పనిచెయ్యకపోతే ఆ సేతువుని అప్పుడే దాటవచ్చు.” అని పరాంకుశం తన వైద్య పరిజ్ఞానాన్ని వెల్లడి చేసేడు.

3

తెల్లారగానే పరాంకుశం క్లినిక్‌కి వెళ్ళి రంగబాబు రక్తం కొద్దిగా మచ్చుకి తీసి ‘లేబ్‌’ కి పంపేడు. బి12 రక్తంలో ఏమాత్రం ఉందో కొలిచి చెప్పమని అడిగేడు. ఆ పరీక్ష ఫలితాలు ఎప్పుడో సాయంకాలానికి కాని రావు. ఆలస్యం అమృతం విషం అన్నారు కనుక, పరీక్షా ఫలితాలతో నిమిత్తం లేకుండా వెంటనే 100 మైక్రోగ్రాములు బి12 విటమిన్‌ ఇంజెక్షన్‌ చేసేడు. సాయంకాలం రక్తపు పరీక్ష ఫలితాలు వచ్చే వేళకి రంగబాబు మంచం మీద కూర్చుని ‘శివదీక్షాపరురాలనురా!..’ అని కూని రాగాలు తియ్యడం మొదలుపెట్టేడు. రక్తంలో బి12 లేశమాత్రం కూడా లేదని పరీక్ష తేల్చి, రామేశం గారి ఊహ ఒప్పే అని తీర్మానించింది.

మర్నాడు రంగబాబు ఇటూ అటూ పచార్లు చెయ్యడం మొదలుపెట్టేడు. మూడో నాటికి మూత్రాశయం అదుపులోకి వచ్చింది. వారం తిరక్కుండా దరిదాపు మామూలు మనిషి అయిపోయేడు. ఆసుపత్రి నుండి విడుదల చేసే సమయం వచ్చింది.
ఆసుపత్రి నుండి రంగబాబు ఎక్కడికి వెళతాడు?
గండం గడిచే వేళకి అమెరికా నుండి కొడుకులు, చుట్టుపక్కల నుండి కూతుళ్ళూ వచ్చేరు చూడడానికి. పరిస్థితులు మారేయి కాని ఆ పిల్లలు ఎదుర్కొనే ప్రశ్నలు మారలేదు. అవి పరిష్కారానికి లొంగని ప్రశ్నలు. ఈ వయస్సులో దేశం కాని దేశం అయిన అమెరికా వెళ్ళి కోడళ్ళ దగ్గర ఉండలేడు, రంగబాబు. కూతుళ్ళు ఇప్పుడైనా తండ్రిని చేరదీస్తారా? చేరదీస్తే ఇన్నాళ్ళూ అంతంత దూరంగా ఉంచిన అత్తమామలు వాళ్ళూ పెద్దవాళ్ళవుతున్నారు కదా ఏమనుకుంటారు? అత్తమామల మాట దేముడెరుగు, లోకం ఏమనుకుంటుంది?

అందరూ రామేశం గారిని చూడడానికి వెళ్ళేరు.
“పంతులు గారూ! మా నాన్నని ఏ ‘నర్సింగ్‌ హోమ్‌’ లోనో పెట్టడం కాని, ఏ ప్రేమ సమాజం వారి గుడారం లోనో ఒదిలేయడం కాని, చూస్తూ చూస్తూ చెయ్యలేము. మా నాన్నకి ప్రాణం పోసి బతికించేరు. చైనా దేశంలో ఒక సామెత ఉందిట. ప్రాణాలు పోతూన్న మనిషిని ఎవరైతే రక్షిస్తారో వారే వారి మంచిచెడ్డలు చూసుకునే బాధ్యత వహించాలిట. కనుక మా సమస్యని మీరే పరిష్కరించాలి.” అని ఏక కంఠంతో వేడుకున్నారు.
ఆయన మాత్రం ఏమి చెయ్యగలడు? కొంతసేపు మౌనంగా ఉండి ఆఖరికి రంగబాబు కూతుళ్ళని ఉద్దేశించి ఇలా అన్నారు.
“అమ్మా! మన దేశపు ఆచారాలు మన ఆడబిడ్డలకి చాల అన్యాయం చేసేయి. చేస్తున్నాయి. తల్లిదండ్రులు చచ్చిపోతే కొడుకులు తలకి కొరివి పెడతారు తప్ప శవం మీద పడి భోరున ఏడిచేది ఆడపిల్లలే. ఒంటికి ఏదైనా వస్తే చూసేది ఆడపిల్లలే. నేను నా చిన్నతనంలో నా అక్కచెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళినంత స్వతంత్రంగా అన్నదమ్ముల ఇళ్ళకి వెళ్ళలేక పోయేవాడిని. అటువంటి ఆడపిల్లలకి ఆస్తి హక్కులు లేకుండా చాల కాలం అన్యాయం చేసింది మన సంఘం. నన్నడిగితే పితృస్వామ్యం కంటె మాతృస్వామ్యంలో సదుపాయాలు ఎక్కువ అంటాను. మన ఆచారాలు కట్టుబాట్లు మనని ఒక క్రమశిక్షణలో ఉంచడానికే తప్ప అవేవో అధిగమించడానికి వీలుకాని ధర్మసూత్రాలనుకుని వాటికి మనం బానిసలమై పోకూడదు. ఏ ఎండ కా గొడుగు పట్టాలమ్మా. అంతకంటె నేను మాత్రం ఏమిటి చెప్పగలను?”


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...