ఏవిఁటో! ఈ ప్రపంచం అర్ధం అయి చావటం లేదు నాకు!
పిదప కాలం పిల్లలు, పిదప కాలం బుద్ధులూనా? లేక వయస్సు మీరుతూన్న కొద్దీ నా విలువలకీ, నేటి ప్రపంచానికీ బొత్తిగా పొంతన లేకుండా పోతూందా?
ఏవిఁటో! మతి పోతోంది!
ఆ మధ్య మా అమ్మాయి సీత ఇంటికి వచ్చింది.
దాన్ని మెల్లిగా బ్రతిమాలి, బెల్లించి, నాతోపాటు ఉదయపు నడకకి తీసుకెళ్ళేను.
రోజూ పొద్దున్నే ఒక గంట సేపైనా నడవమని మా ఆవిడ ఇంట్లో పోరు. అందుకని వీలయినప్పుడల్లా ఒక గంట సేపు నడుస్తాను. ఆ వేళ మా అమ్మాయిని వెంటబెట్టుకుని వెళ్ళేను.
మీరు నమ్మండి, నమ్మకపొండి. నేను నడకకి వెళ్ళిన ప్రతి రోజూ – దరిదాపుగా ప్రతిరోజూ – దారిలో నేల మీద ఒక పెన్నీ (సెంటు లేదా పైస) కనిపించి తీరుతుంది. కరువు రోజుల్లో పుట్టి పెరిగిన శాల్తీనేమో, ఒంగుని పెన్నీని తీసి జేబులో వేసుకుంటాను. మా ఆవిడ మాట విన్నందుకు నాకు దక్కే పారితోషికం ఇది. బిందు సింధు న్యాయంలా ఈ బిందువులన్నీ ఓ రోజు ఓ సింధువు కాకపోతుందా అని ఒక ఆశ.
రోడ్డు మీద పెన్నీ కనిపించగానే, “సీతా! ఆ పెన్నీ అందుకో!” అన్నాను.
“నాకు ఓపిక లేదు డాడీ. ఒంగి తియ్యటానికి ఖర్చయే శ్రమకి సరిపడా విలువ లేదు ఆ పెన్నీలో!” అంది మా అమ్మాయి.
“పోనీ ఒక నికెలు (ఐదు పైసలు) కనబడితే ఒంగి తీస్తావా?” అన్నాను.
“తియ్యను”
“ఎంత కనబడితే ఒంగి తీస్తావేవిఁటి?”
“ఒక డాలరు కనబడితే ఒంగి తీస్తాను.”
దానికేం! అది పిల్ల జమీందారు. మా అమ్మ పేరింటిదేమో మా అమ్మ పోలిక వచ్చేసింది. డబ్బంటే ఖాతరు లేదు.
పెన్నీకి విలువ లేకుండా పోయింది కదా! ఇండియాలో రూపాయి కాసుకే విలువ లేకుండా పోయింది. పూర్వం ముష్టివాడి వైపు ఒక కానీ విసిరేవాడిని. ఆ అలవాటుప్రకారం మొన్నీమధ్య హైదరాబాదు వెళ్ళినప్పుడు ముష్టివాడి వైపు, అమెరికా వాడిని కదా అని, ఘరానాగా ఒక పావలా కాసు విసిరి కాలరు ఎగరేసేను. వాడు పరిగెత్తుకు వచ్చి “బాబూ ఓ ఐదు రూపాయలు ఇప్పించండి. ఈ పావలాకేవీఁ రావండి. తవఁరు ఇక్కొడోరు కాదా బాబూ?” అన్నాడు.
గతక్కు మన్నాను.
నాకు తెలియకుండానే, నా ఎట్ట ఎదుటే రోజులు మారిపోతున్నాయి!
పత్రికల్లో చూసే ఉంటారు. ఇప్పుడు బంగారం ధర $650 దాటుతోంది. పూర్వం, అంటే, 1960, 1970 దశకాలలో, వెండి వెల ఇలాగే వేలం వెర్రిగా పెరిగిపోయింది.
పాత రోజుల్లో అమెరికాలో వెండి క్వార్టర్లు ఉండేవి. క్వార్టర్ అంటే మన పావలా కాసులాంటి నాణెం. కైవారంలో అర్ధరూపాయంత ఉండేది. విలువలో డాలర్ లో నాలుగో వంతు.
అప్పట్లో వెండి ధర ఎంతలా పెరిగిపోయిందంటే క్వార్టర్లో ఉన్న వెండి విలువ క్వార్టర్ యొక్క బజారు విలువ కంటె ఎక్కువ ఉండేది. క్వార్టర్ ని కరిగించేసి అలా వచ్చిన వెండిని బజారులో అమ్మేసుకుంటే లాభసాటి వ్యాపారం అన్న మాట!
ఈ కిటుకు ప్రజలు పసికట్టేసేరన్న విషయం ప్రభుత్వం వారు కూడ పసికట్టేసి, క్వార్టర్‌లో ఉన్న వెండిని తీసేసి బజారు విలువ లేని మరొక మిశ్రమ లోహంతో కొత్త క్వార్టర్ నాణేలు పోత పొయ్యటం మొదలు పెట్టేరు. వెండి డాలర్లతోపాటు వెండి క్వార్టర్లు కూడా కాలగర్భంలో కలసి పోయాయి.
ఈ పురాణం అంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, రెండు తరాల క్రితం క్వార్టర్ కి పట్టిన గతే ఇప్పుడు పెన్నీ కి పడుతోంది. అమెరికాలో సెంటుని పెన్నీ అంటారని చెప్పేను కదా. సెంటు అంటే డాలర్లో నూరవ భాగం. అంటే మన రూపాయికి పైస ఎలాగో డాలరుకి పెన్నీ అలాగన్న మాట.
రాగినీ, యశదాన్నీ కలిపిన మిశ్రమ లోహంతో పెన్నీలు తయారు చేస్తారు. ఇటీవలి కాలంలో పెట్రోలుతో పాటు బంగారం, బంగారంతో పాటు రాగి, దానితో యశదం – ఇలా అన్నిటి ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయి కదా. కనుక క్వార్టరుకి పట్టిన గతే ఈ పెన్నీకి కూడా పట్టబోతూంది.
పెన్నీలని కరిగించి, ఆ ప్రక్రియలో వచ్చిన లోహాన్ని బజారులో పెట్టి ప్రజలు అమ్మేసుకునే లోగా పెన్నీ విలువ – అంటే పెన్నీ కాసులో ఉన్న లోహం విలువ – తగ్గించాలి.
పెన్నీకి ఏం విలువుందని దాంట్లో విలువని ఇంకా తగ్గించటానికి?
లేదా…..పెన్నీలని చెలామణీ లోంచి తీసెయ్యాలి!
మా ఇంట్లో మేడ మెట్లు ఎక్కగానే వచ్చే చిన్న వసారాలో ఒక తీనె, దాని మీద ఒక వరస బీరువాలు ఉన్నాయి. ఆ తీనె మీద వెడల్పాటి మూతి ఉన్న ఒక గాజు సీసా ఉంది. బిల్ ఫోల్డ్ అనండి, వాలెట్ అనండి, పర్సు అనండి – వాటిలో చిల్లర బరువు ఎక్కువ అయినప్పుడల్లా చిల్లరలో ఉన్న పెన్నీలన్నీ తీసి ఆ సీసాలో వేస్తూ ఉంటాం. ఈ రకం సీసా ప్రతీ ఇంట్లోను ఉంటుందని నేను ఘంటా బజాయించి చెప్పగలను.
ఇప్పుడు ఆ సీసా కదపలేనంత బరువుగా ఉంది. ఆ సీసాని ఒంచి, అందులోంచి నూట అరవై పెన్నీలు బయటకి తోడి, ఈ $1.60 విలువ చేసే డబ్బునీ మూసలో వేసి కరిగించగా వచ్చిన లోహాన్ని బజారులో అమ్మితే $1.36 వస్తుంది. (పెన్నీలో 97.5 శాతం యశదమూ, 2.5 శాతం రాగి ఉన్నాయని లెక్క కట్టేను.) అంటే ఏమిటన్న మాట? పెన్నీ నాణెం యొక్క బజారు విలువ పెన్నీ లోని లోహం విలువతో దరిదాపుగా సరితూగుతోంది. ఇంతటితో అయిపోయిందా? ఈ పెన్నీలని తయారు చెయ్యటానికి టంకశాలలు కావాలి. ఆ టంకశాలలని నడపటానికి మనుష్యులు కావాలి. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. కనుక ఒకొక్క పెన్నీని తయారు చేసి చెలామణీలోకి వదలటానికి మన అమెరికా ప్రభుత్వపు టంకశాలకి పెన్నీ కంటె ఎక్కువే ఖర్చు అవుతున్నాది. దక్షత ఎరిగిన పెద్దలు చెయ్యవలసిన వ్యాపార సరళి కాదు ఇది!
ఒక ఉపాయం ఏమిటంటే రెండవ ప్రపంచయుద్ధపు రోజులలోలా ఉక్కు పెన్నీలు తయారు చెయ్యటం. లేదా 1857 లో చేసినట్లు చెయ్యటం. మనకి పూర్వం ఇండియాలో దమ్మిడీలు, ఠోలీలు ఉన్నట్లు 1857 లో అమెరికాలో అర్ధ పెన్నీలు ఉండేవి. అర్ధ పెన్నీ ఆ రోజులలో చెలామణీలో ఉన్న అతి చిన్న నాణెం. దాన్ని వాడుక లోంచి తొలగించేరు. అలాగే పెన్నీని ఇప్పటి వాడుక లోంచి తీసేస్తే ఎలాగుంటుందంటారు?
నన్నడిగితే పెన్నీలు ఒక బెడదగా తయారయేయంటాను. ఈ ఏడు అమెరికా ప్రభుత్వపు టంకశాల తొమ్మిది బిలియన్లు (అంటే, తొమ్మిది వందల కోట్లు) పెన్నీలని తయారు చేసి విడుదల చేస్తుందిట. ప్రభుత్వం ముద్రించిన మిగిలిన నాణేలన్నిటిని కూడగట్టి లెక్క పెడితే వాటి కంటే ఈ పెన్నీలు రెండింతల పైనే ఉంటాయిట. ఇన్ని పెన్నీలు తయారు చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చిందిట? విలువ లేని నాణేలని ప్రభుత్వం ఎంత జోరుగా అచ్చొత్తుతున్నారో అంతా జోరుగానూ ఈ నాణేలు చలామణీలోంచి జారుకుంటున్నాయి; రోడ్ల మీద, ఇళ్ళల్లో సీసాల్లోనూ, సొరుగుల్లోనూ మూలుగుతున్నాయన్న మాట. వెధవది, రోడ్డు మీద ఖాళీ కోకాకోలా డబ్బా కనిపిస్తే పర్యావరణం కలుషితం అయిపోతోందని ఒంగి తీస్తున్నారు కానీ, పెన్నీలని ఎవ్వరూ – నా లాంటి పురాణ పురుషులు తప్ప – తియ్యటం లేదు.
పూర్వం, అంటే 1857 లో అర పెన్నీని నిషేధించిన రోజుల్లో, దాని విలువ ఇప్పటి డైం (పది పైసలు) తో సమానం. అంత విలువున్న నాణేన్నినిషేధించి నప్పుడు ప్రజలకి అపరిమితమైన ఇబ్బంది ఏమీ కలగ లేదుట. మనకి స్వతంత్రం వచ్చిన కొత్తలో కాణీలు, అణాలు, బేడలు తీసేసి నయా పైసలు ప్రవేశ పెట్టినప్పుడు వస్తువుల వెలలని కొత్త పద్ధతి లోకి మార్చాలి కదా. అప్పుడు అర పైస కోసం కక్కూర్తి పడి, ఆ ప్రాప్తికి ధరలు పెంచిన వ్యాపారస్తులు లేక పోలేదు కాని, మొత్తం మీద ఆ మార్పు సజావుగానే జరిగింది. అలాగే పెన్నీని ఎత్తేసినంత మాత్రాన మిన్ను విరిగి మీద పడిపోదు.
పెన్నీని వాడుక లోంచి తీసేస్తే ధరలన్నిటినీ నికెలు (ఐదు పెన్నీల నాణెం) పరిమాణంలో చెప్పాలా? అక్కర లేదు. ఇప్పటిలాగే లెక్కలన్నీ చేస్తాం. కాని డబ్బు చేతులు మారేటప్పుడు మాత్రం మొత్తాన్ని round up కాని round down కాని చేసి ఇచ్చి పుచ్చుకోవటాలు చేస్తాం. అంటే మనం ఇవ్వ వలసిన మొత్తం $4.32 అయితే దానిని $4.30 అనీ, $4.37 అయితే దానిని $4.40 అనీ అంటాం అన్న మాట.
ఈ పద్ధతిలో కొందరికి నష్టం రాదా అని మీలో కొందరు అనుకోవచ్చు. కాని ఈ పద్ధతి అప్పుడే – మనకి తెలియకుండానే – అమలులో ఉంది. రెండు ఉదాహరణలు చెబుతాను. కొన్ని రాష్ట్రాలలో అమ్మకపు పన్ను డాలరు మీద ఏడున్నర పైసలు అనుకుందాం. మనం డబ్బు జమ కట్ట వలసిన సమయంలో ఆ అర్ధ పైసని పైకి ఎగదోస్తారు (round up). అప్పుడు మనం కిమ్మనకుండా ఊరుకుంటున్నాం కదా. అలాగే మా ఊళ్ళో చాలా షాపులలో కేష్ రిజిస్టర్ పక్కన చిన్న పళ్ళెం లో కొన్ని పెన్నీలు పోసి ఉంటాయి. చిల్లర ఇచ్చిపుచ్చుకునే సమయంలో మన ద్గ్గర ఒక పెన్నీ లేక పోతే ఆ చిప్పలో పెన్నీ తీసి షాపువాడికి ఇవ్వొచ్చు. అలాగే షాపువాడు మనకి చిల్లర ఇచ్చినప్పుడు మనకి అక్కర లేని పెన్నీలు ఆ చిప్పలో వెయ్యొచ్చు. కనుక ఇది పెద్ద సమస్య కాదు.
నిజానికి 1990 లో నూజీలండ్ లో పెన్నీలు రద్దు చేసేసిన సందర్భంలో వారికి ఎటువంటి చిక్కులూ రాలేదు. ఆ రోజుల్లోనే నేను నూజీలండ్ వెళ్ళటం తటస్త పడింది కనుక నేను గమనించిందేమిటంటే, పెన్నీలు రద్దు చెయ్యటం వల్ల ధరలు పెరగ లేదు. ప్రజలకి ఇబ్బందులు కలగ లేదు. చాలా వ్యాపారులు వినియోగదారుల వైపే మొగ్గు చూపి ధరలని దిగదోపు (round down) చేసే వారు. నగదు రూపంలో కాక క్రెడిట్ కార్డు రూపంలో లావాదేవీలు జరిగినప్పుడు ఇబ్బందే లేదు. కాగితం మీద లెక్కలు ఎప్పుడూ సెంటు ప్రమాణంలోనే ఉంటాయి. నగదు రూపంలో చూసినప్పుడే – పెన్నీలు లేవు కనుక – ఈ rounding అవసరం వస్తూ ఉంటుంది.
ఉదాహరణకి మన వర్తకులు బొత్తిగా నీతినీ నిజాయతీని కాశీలో వదలి పెట్టేసి వారి ఖాతాదారులని మోసం చేసే ఉద్దేశంతో ఈ rounding ని ఎప్పుడూ తమకి అనుకూలంగానే చేస్తూ ప్రతి నికెలునీ రాబట్టుతున్నారనే అనుకుందాం. అంటే సగటున ఇచ్చిపుచ్చుకోలు జరిగినప్పుడల్లా వర్తకుడికి రెండు పెన్నీలు లాభం వస్తుంది, లేదా వినియోగదారుడికి రెండు పెన్నీలు నష్టం వస్తుంది. మనం ఇలాంటి ఇచ్చిపుచ్చుకోళ్ళు రోజుకి రెండు చేసాం అనుకుందాం. అప్పుడు మనకి ఏడాదికి వచ్చే నష్టం $14.60. ఈ నష్టం భరించరాని కష్టం కాదు. మన ఇళ్ళల్లోని గాజు సీసాల్లో మగ్గుతూన్న పెన్నీల విలువ ఇంత కంటె ఎక్కువే ఉంటుంది. లేదా ఒక పిట్జ్జా మీద ఖర్చు పెట్టినంత.
మనకి నష్టం రాకపోతే పోయింది, ఆ వర్తకుడికి ఏటికి, కస్టమర్ ఒక్కంటికి $14.60 చొప్పున లాభం వస్తున్నాది కదా అని మీరు వాపోవచ్చు. ఈ లాభాల మీద వాడు పన్నులు కట్టాలి కనుక వాడు మరీ అంత మెరిగి పోడు, పైపెచ్చు వాడు మన వల్ల మెరిగిపోతున్నాడని మనకి తెలిస్తే వాడి దగ్గర కొనటం మానేసి పక్క కొట్లో కొంటాం. కనుక వ్యాపారస్తులు కూడ అంత దురాశతో ప్రవర్తించరు. కనుక ఈ rounding పైకి జరిగినా కిందకి జరిగినా వ్యాపారస్తులు కాని, వినియోగదారులు కాని అమాంతం ధనవంతులూ అయిపోరు, కుదేలూ అయిపోరు.
ఈ పెన్నీ పరిస్థితి పరిశీలించినట్లే ఇండియాలో పైస ని కూడ ఒక సారి చూద్దాం. మన పవిత్ర భారత దేశంలో ఇప్పుడు ఉన్న చిల్లర బిళ్ళలని అన్నిటిని రద్దు చేసేసి, రూపాయి కాసు ని అతి చిన్న నాణెంగా పరిగణించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. వస్తువుల ధరలు రూపాయిలు, పైసలలో మునపటిలాగనే ఉండొచ్చు. ఖాతా ఆఖరుగా ఖరారు చేసుకునే సమయంలో మాత్రం మొత్తాన్ని దగ్గరగా ఉన్న విలువకి round చేస్తూ ఉంటాం.
సిటీ బస్సు ఎక్కినప్పుడు కండక్టరు చేస్తూన్న పని కంటె ఇది నయమే కదా! వాడు రూపాయి పుచ్చుకుంటాడు, చిల్లర ఇవ్వడు!