భయం!

నిశీధి! నిర్మానుష్యం! నిశ్శబ్దం?

అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఆ దుంగ ఇంటి బయట గోడని ఏదో గీకుతూన్నట్లు చప్పుడయింది. ఆ చప్పుడుకి ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది. హృదయ స్పందన లయ తప్పినట్లయింది. చలితో బయట నుండి, భయంతో లోపల నుండి ఒణుకు పుట్టుకొచ్చింది.

అప్పుడు నేను అలాస్కాలో, ఫెయిర్‌బేంక్స్‌కి ఉత్తరంగా – ఉత్తర ధృవ చక్రానికి ఒక్క రవ దక్షిణంగా – చుట్టుతా కనుచూపు మేర మంచుతో కప్పబడ్డ ప్రదేశంలో, ఒక దుంగ ఇంట్లో, ఒంటరిగా ఉంటున్నాను. ఆ కాలంలో రాత్రి శీతోగ్రత నీటి ఘనీభవ స్థానానికి 35 డిగ్రీలు దిగువ వరకు దిగేది. ఆ చలికి భూమ్యాకర్షణ కూడ గడ్డకట్టుకు పోయిందా అన్నట్లు మంచు కూడ కురవటం మానేసింది. అంత చలిలో కంఠంలో ప్రాణం ఉన్న ఏ జీవి కూడ సాహసించి బయటకి రాలేదు. కాని, బయట ఏదో ఉంది. లోపలకి రాడానికి ప్రయత్నిస్తూన్నట్లు ఉంది. కుటీరపు గోడలని గోకుతోంది!

చలిని మించి నిశ్శబ్దమో, నిశ్శబ్దాన్ని మించి చలో అర్ధం కాని ఆ వాతావరణంలో నిశ్శబ్దాన్ని చీల్చుతూ అప్పుడప్పుడు పొయ్యిలో కాలుతూన్న కట్టెలు చిటపటలు, ఫెళఫెళలు చేస్తూ చలిని చెండాడుతున్నాయ్. ఆ చీకటిలో, పైకి ఎగసే ఆ మంట వెలుగులో గోడ మీద పడ్డ నా నీడ నాట్యం చేస్తోంది. పోతే, నేను ధరించిన శీతాకాలపు దుస్తులు చేసే బరబర శబ్దం తప్ప బయట నుండి మరొక శబ్దం లేదు. ఇహ మిగిలింది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక నా మనస్సులో ఉన్న ఊహలకి మాటలు జోడించి నాలో నేను మాట్లాడుకునే మాటలు తప్పితే మరే శబ్దానికి ఆస్కారం లేదు ఆ ఇంట్లో. అట్టి పరిస్థితిలో కుటీరపు గోడని గోకుతోన్నట్లు శబ్దం వినిపించింది.

ఎక్కడా అనుమానానికి అవకాశం లేదు. బయట గోడని ఏదో గోకుతోంది. ఎవ్వరో కాదు. ఎవ్వరో అయితే తలుపు తడతారు. పాదాల చప్పుడు ఉంటుంది. ఈ చప్పుడు తీరే వేరు. ఇది కొమ్మ రాపిడి కూడ కాదు; అలాస్కాలో అంత ఉత్తరాన్న చెట్లేవీ? ఈ శబ్దం ఏదో గోళ్ళతో గోకుతూన్నట్లు ఉంది. లోపలికి రాటానికి ఏదో ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నాదా అన్నట్లు ఉంది తప్ప అది సాధారణమైన శబ్దం కాదు అని నా మనస్సులో నిర్ధారణ అవటమూ, శరీరమంతా భయావేశమవటమూ ఒక్క సారి జరిగిపోయేయి. అంత చలిలోనూ చిరు చెమటలు పోసేయి.

నేను అలాస్కాలో ఈ సాహస యాత్ర చెయ్యటానికి కారణం లేకపోలేదు. రెండేళ్ళ క్రితం ఏంబర్‌తో కలసి అమెజాన్ అడవుల్లో తిరగటానికి వెళ్ళి, దారి తప్పి, మహాసముద్రం లాంటి ఆ అడవిలో చుక్కానిలేని నావలా ఇద్దరం అయిదు రోజులు తిరిగి, చావు తప్పించుకుని, కన్ను లొట్టపోయినంత వరకూ వచ్చి, ఎలాగో బతికి బయట పడ్డాం. అనుకోకుండా అలాంటి అనుభవం జరిగిన తరువాత, ఏకాంతమైన ప్రదేశానికి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలన్న కోరిక బలవత్తరంగానే పుట్టింది. జనసంచారం లేని చోట, నా ఊపిరి తప్ప మరొక శబ్దం కూడా లేని ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుందో అనుభవించి చూడాలని కోరిక పుట్టింది. తిండి తినటానికి తప్ప నోరు విప్పవలసిన అవసరం రాకుండా ఉన్న ప్రదేశం కోసం వెతకటం మొదలు పెట్టేను.

దక్షిణ అమెరికా ఖండంలో పతగోనియా, హిమాలయాలలో మంచుతో కప్పబడ్డ గుహలు, ఉత్తర ధృవానికి సమీపంలో సతతం మంచుతో కప్పబడ్డ బంజరు భూములు నన్ను ఎన్నుకో అంటే నన్ను అంటూ అభ్యర్ధులుగా నా మనోఫలకం మీద నిలిచేయి. ఇంతలో అలాస్కా విశ్వవిద్యాలయం, ఫెయిర్‌బేంక్స్‌లో ఉన్న ఆర్కిటిక్ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తూన్న ఆచార్యుడొకాయనతో పరిచయం అయింది. విశ్వవిద్యాలయానికి చెంది, శిధిలావస్థలో ఉన్న లాగ్ కేబిన్ (log cabin) ఒకటి ఉత్తర ధృవ చక్రానికి రెండు, మూడు మైళ్ళ దిగువున ఉందనిన్నీ, కావలిస్తే దానిని వాడుకోటానికి అనుమతి ఇస్తాననిన్నీ వాగ్దానం చేసేరు. పోతే, అక్కడి నా అనుభవాలన్నిటిని ఒక దినచర్యలా రాసి, ఆ దినచర్యని ఆయనతో పంచుకోవాలని చిన్న మెలిక పెట్టేరు. ఆ షరతుకి నేను ఒప్పుకుంటే యూనివర్శిటీ వారి దన్ను నాకు ఉంటుందనిన్నీ, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎవ్వరో ఒకరు నన్ను రక్షించటానికి వస్తారనిన్నీ ఆయన ధైర్యం చెప్పేరు. నేనేదో సరదాగా వేసుకున్న పర్యాటక పథకం ఇలా ఒక విశ్వవిద్యాలయపు పరిశోధనా కార్యక్రమంలో ఒక భాగం అయ్యేసరికి నా ఉత్సాహం ఇనుమడించింది. విహారయాత్రగా తలపెట్టిన కార్యక్రమం పరిశోధనా పర్యటనగా మారేసరికి, యూనివర్సిటీ వారి సహాయంతో ఆ దుంగ ఇంట్లో నాకు కావలసిన హంగులన్నీ ఏర్పాటు చేసుకుందుకి ముందు వేసంగిలో ప్రయాణం కట్టేను.

నేను ఉండబోయే దుంగ ఇల్లు శిధిలావస్థలో లేదు కాని, వాసయోగ్యంగా కూడ లేదు. చిన్న చిన్న మరమ్మత్తులు చేసుకోవలసి వచ్చింది. ఇల్లంటే పెద్ద ఇల్లేమీ కాదు. ఒకే ఒక గది; దరిదాపు పన్నెండడుగుల చతురస్రం. ఒక్క తలుపు, ద్వారం తప్ప ఎక్కడా కిటికీలు లేవు. చుట్టూ దుంగ గోడలు, పైన దుంగ టొపారం. చలిమంట వేసుకోటానికి ఒక మట్టి పొయ్యి. విద్యుత్తు, నీటి సరఫరా లేవని చెప్పక్కర లేదు. కింద మట్టినేల గడ్డకట్టుకుపోయిన భూమట్టాన్ని తాకకుండా రాటల మీద లేపి కట్టేరు. సర్వకాల సర్వావస్థలలోనూ గడ్డకట్టుకుపోయి ఉండే ఈ రకం భూమిని ఇంగ్లీషులో permafrost అంటారు. ఈ మంచుబంజరులలో ఏవీ పెరగవు. ఈ భూమిలో ఒక బొరియని తవ్వి, అందులో చలికాలంలో నాకు కావలసిన ఆహారపదార్ధాలని ఒక జాబితా ప్రకారం భద్రపరచేను: దుంపలు, ఎండబెట్టి ఒరుగులుగా మార్చిన కాయగూరలు, డబ్బాలలోనూ, సంచులలోనూ భద్రపరచిన పోషక పదార్ధాలు, శరీరంలో వేడిని పుట్టించటానికి, రెండు-మూడు నెలలకి సరిపడా సారాలు, మాదక ద్రవ్యాలూ, మొదలయినవి.

నా అనుభవాలని రాయటానికి ఒక కాగితాల కట్ట, సిరాతో రాయటం అసంభవం కనుక, ఒక కట్ట పెనసళ్ళు, అక్కడ విద్యుత్తు ఉండదు కనుక ఒక పాత కాలపు టైపు యంత్రం. వేళ తెలుసుకోటానికి ఒక కేలండరు, ఒక అలారం గడియారం. ఉన్ని దుస్తులు. కొవ్వొత్తులు, కిరసనాయిలు దీపం, అగ్గిపెట్టెలు, కట్టెలు, ఇలా కావలసిన సరంజామా అంతా అక్కడ, ఆ కుటీరంలో ముందుగానే భద్రపరచేను.

ఆ దరిదాపుల్లోనే ఒక చిన్న సెలయేరు ఒకటి ఉంది. అది శీతాకాలంలో గడ్డకట్టుకు పోతుందిట. గడ్డకట్టిన మంచు మీద చిన్న గొయ్యి తవ్వితే అడుగున ఇంకా నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయిట. వంటకీ, వార్పుకీ నీళ్ళు కావలిస్తే ఆ నీరే జీవనాధారంట.

ఇహ ఉదయం కాలకృత్యాలకని బయలుకి వెళ్ళవలసినప్పుడు ఏమిటి చెయ్యాలన్న అనుమానం రానే వచ్చింది. నేను ఉండబోయే దుంగ ఇంటికి దిగువగా గడ్డ కట్టిన మంచులో లోతుగా ఒక గొయ్యి తవ్వి దాని మీద ఆసనంలో రంధ్రం ఉన్న ఒక కొయ్య కుర్చీ వేసుకుని కాలకృత్యం కానివ్వటం సాధకం చేసేను. పని అయిన తర్వాత, ఏ రోజుకారోజు, ఆ కొయ్య కుర్చీని వెచ్చగా ఉన్న దుంగ ఇంట్లోకి తీసుకు రాకపోతే, మళ్ళా వసంత కాలం వచ్చే వరకూ పిరుదులకి ఆ కుర్చీ అంటుకుని ఉండిపోయే ప్రమాదం ఉందని మా వాళ్ళు హెచ్చరించేరు.

వేసంగిలోనే ఈ ప్రయత్నాలన్నీ పూర్తి చేసేను. నిజానికి నేను అనుభవించబోయేది ఏకాంతవాసమే కాని నేను పూర్తిగా ఏకాకిని కాదు, నేల విడచి సాము చేసే అవివేకినీ కాదు. అత్యవసరం అయితే దక్షిణంగా, నీరు ప్రవహించే దిశలో, పుంతల వెంబడి మూడు రోజులు కాలినడకని ప్రయాణం చేస్తే ఫెయిర్‌బేంక్స్ వెళ్ళే రహదారి తగులుతుంది. అక్కడ నుండి ఏదో ఒక వాహనం పట్టుకుని నాగరికతని చేరుకోవచ్చు. ఇటువంటి ప్రయాణానికి అవసరం ఉంటుందని ఒక దిక్సూచిని కూడా నా జాబితాలో వేసుకున్నాను.

ఇటువంటి ఏకాంతంలో వారాల తరబడి ఉంటే అది మన శరీరం మీదా, మనస్సు మీద తీవ్రమైన ప్రభావం చూపించక మానదు. అసలే కోతి, కల్లు తాగింది, నిప్పు తొక్కింది అన్నట్లు కోతి లాంటి ఈ మనస్సుకి ఏకాంతంతో పాటు, బయటి ప్రపంచంతో బంధం లేకపోవటం, దాని మీద లయతప్పిన దినచక్రం, వెలుగు లేమి, నిశ్శబ్దం!

ఆ నిశ్శబ్ద సముద్రంలో ఒకే ఒక రకం చప్పుళ్ళు నాకు సతతం వినిపించేవి. అవి బయటనుండి వచ్చే శబ్దాలు కావు. ఆ శబ్దాలు నా బుర్రలోంచి వినబడే శబ్దాలు: నా చిన్నతనంలో నేను మాట్లాడిన మాటలు, విన్న పాటలు, సినిమాలలో విన్న సంభాషణలు. ఎవ్వరో చెవులో ఇల్లుకట్టుని పోరుతూన్నట్లు ఒకటే శబ్దాలు!

పూర్వం మన ఋషులు తపస్సు చేసుకుంటూ యోగనిష్టలో మౌనంగా ఉన్నప్పుడు చత్వారీ వాక్పధాలు వారి అధీనంలోకి వచ్చిన తరువాత, వారికీ ఇలాగే కొన్ని శబ్దాలు వినిపించి ఉంటాయి. అల్లకల్లోలమైన మనస్సు శాంతించిన తరువాత వినిపించిన అర్ధవంతమైన శబ్దాలనే కాబోలు శ్రుతులు అని ఉంటారు.

ఈ శబ్దాల సద్దు మణిగిన తర్వాత, మగ గొంతుకలు – రష్యన్ భాషలో. నా భిలాయి రోజులు జ్ఞాపకం వచ్చేయి. తర్వాత అమెరికన్ యాస. స్పేనిష్ యాసతో ఇంగ్లీషు. తమిళ యాసలో తెలుగు. నేను గతంలో ఉద్యోగాలు చేసిన సందర్భాలలో సంభాషణలు ఇవన్నీ! ఈ గోలతో ఒక వారం కాపురం చేసిన తరువాత మళ్ళా నిశ్శబ్దం ఆవరించింది.

మరొక రోజు. పైన విమానం ఎగురుతూన్నట్లు దూరం నుండి చప్పుడు వినిపించింది. కాని ఆ చప్పుడు క్రమేపీ పెరగటం కానీ, తరగటం కానీ జరగలేదు; ఒకే స్థాయిలో ఉంది. పక్కింటి వారి గడ్డిని కోసే యంత్రమేమో! ఈ మంచులో గడ్డేమిటి, నా మొహం కాకపోతే. ఫైపెచ్చు పక్కన ఇళ్ళేమీ లేవే! దూరంలో ఎవ్వరిదైనా ఇంట్లో ఎలక్ట్రికల్ జెనరేటర్ చేసే చప్పుడనుకున్నాను. కను చూపు మేర ఇళ్ళే లేవు. ఆ మెట్ట వాలుకి అటువైపు ఎవ్వరైనా ఉన్నారేమో! చలిలో శబ్దం చాలా దూరం ప్రయాణం చేస్తుందంటారు.

ఈ శబ్దం ఎక్కడనుండి వస్తోందో తేల్చుకోటానికి బందోబస్తుగా బట్టలు ధరించి, బూట్లు వేసుకుని బయటకి నడిచేను. ఆ శబ్దం వస్తూన్న దిశలో నడక మొదలు పెట్టేను. ఎంతదూరం నడిచినా జనావాసాలేవీ కనబడ లేదు. నా ఏకాంత వాసానికి భంగం కలగలేదని ఒక పక్క సంతోషం, ఆ శబ్దం ఎక్కడ నుండి వస్తోందో తెలియక ఒక రకమైన అనిర్వచనీయమైన భయం.

అలాస్కా అనుభవం అయిన ఒక ఏడాది పోయిన తర్వాత ఈ మోటారు శబ్దం ఎక్కడినుండి వచ్చుంటుందో స్టేన్‌ఫర్డ్ యూనివర్శిటీలో పనిచేసే ఒక మానసిక శాస్త్రవేత్త ఉహాగానం చేసి చెప్పేరు. మనుష్యులని, మరో మానవ సంపర్కం లేకుండా, ఏకాంతంగా ఉంచినప్పుడు వారి మనస్సులో కలిగే మార్పుల మీద ఆమె పరిశోధన చేసిందిట. మన మనస్సులో పుట్టే ఊహలు సరైనవో కావో అన్న అనుమానం మానవ సహజంట. మనం కన్నదీ, విన్నదీ, అనుభవించినదీ ఇతరులు కూడా అనుభవిస్తున్నారా లేదా అని సతతం బేరీజు వేసి చూసుకుంటాముట. ఈ “బేరీజు” లేక పోతే మనం కనేదీ, వినేదీ, అనుభవించేదీ నిజమో కాదో ఎలా తెలుస్తుంది? సముద్రంలో ఉన్న నావకి ఒడ్డున ఉన్న దీపస్థంబం ఎలాంటిదో ఈ బేరీజు మనకి అలాంటిది అన్నమాట. A Beautiful Mind సినిమాలో ప్రొఫెసర్ నేష్ పక్కనున్న విద్యార్ధిని అడుగుతాడు, “నా పక్క నిలబడి నాతో మాట్లాడుతూన్న వ్యక్తి అక్కడ నిజంగా ఉన్నాడా? లేదా?” అని. ఏకాంతంగా ఉన్నప్పుడు మనకి ఇలా సంప్రదించటానికి ఒక స్థిర బిందువు – ఇలాంటి దీపస్తంబం – అంటూ ఏదీ ఉండదు. అప్పుడు మన మానసిక తుల్యత గాడి తప్పుతుంది. అప్పుడే ఆత్రుత, బుద్ధిమాంద్యత, నిర్లిప్తత, చిత్తభ్రమణం మొదలైన మానసిక లక్షణాలు క్రమంగా పొడచూపుతాయిట.

రోజుల తరబడి బయట నుండి ఏ రకమైన ధ్వనులు కాని, మాటలు కాని చెవులని తాకనప్పుడు నా బుర్రలో ప్రవహించే రక్త ప్రవాహపు ధ్వనే నాకు మోటరు శబ్దంలా వినిపించి ఉంటుంది అని ఆమె సిద్ధాంతీకరించేరు. నేనూ, ఏంబరూ అమెజాన్ అడవుల్లో చిక్కడినప్పుడు నాకు ఇదే రకం మోటారు హోరు వినిపించింది. ఆమె అనేదేమిటంటే కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం పరిపూర్ణ నిశ్శబ్దం అంటూ ఎదీ లేదని. నిశ్శబ్దంగా ఉన్న గదిలో మనం పీల్చి వదిలే గాలే ఎంతో శబ్దం చేస్తూ వినిపిస్తుంది కదా!

బయట ఎంత సేపు చూసినా మరొక కొంపంటూ ఎదీ కనిపించలేదు. జెనరేటరు చప్పుడు మళ్ళా వినిపించనూ లేదు. ఇంటికి తిరిగొస్తూ ఉంటే ఆకాశం మెరిసినట్లు అనిపించింది. తలెత్తి చూసేను. ఆకాశం శోభాయమానంగా వెలిగిపోతోంది. దూరంగా, ఆకాశంలో రకరకాల ఆకారాలలో వెలుగులు నాట్యం చెయ్యటం మొదలు పెట్టేయి. వీటినే ఉత్తర జ్యోతులు (Northern Lights) అంటారు. హిమాలయా గుహలకి వెళ్ళకుండా ఇక్కడికి రాటానికి కారణం ఈ జ్యోతులని చూడాలనే కోరిక ఉండబట్టే. వర్ణనకి లొంగని ఈ జ్యోతులు రంగురంగులతో మెరిసే రిబ్బన్లులా ఒకసారి, నాటకరంగం మీదకి దింపిన రంగుల తెరలా మరొకసారి, జెండాలా గాలిలో రెపరెపలాడుతూన్నట్లు ఇంకొకసారి. గాలిలో రంగు కెరటాలు దొర్లుతూ దిక్చక్రం వరకూ పరిగెడుతూన్నట్లు ఇలా ఆ వెలుగులు నాట్యం చేస్తూ ఉంటే — ఇలా రోజుకో రంగు వెలుగుతో మైమరపించే దృశ్యాలు ఇవి.

ఇరవై ఒకటవ శతాబ్దంలో అడుగు పెడుతూన్న మనకి ఈ ఉత్తర జ్యోతులనే అరోరా బొరియాలిస్ (Aurora Borealis) అని కూడ అంటారనీ, సూర్య జ్వాలలో పుట్టిన కణజాలం భూమి యొక్క అయనోవరణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే భౌతిక ప్రక్రియల వల్ల ఆకాశం రంగు రంగులలో ప్రకాశిస్తుందనీ తెలుసు. కాని పురాతన మానవుడు, తన మేధకి అంతుపట్టని ప్రకృతి శక్తులకి దైవత్వం ఆపాదించి వాటిని వేదాలలో కీర్తించేడు. అందుకనే వేదాలలో పదే పదే ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు, మిత్రుడు, ఉషస్సు, సవితృడు మనకి ప్రత్యక్షమవుతారు. వీరిలో మిత్రుడు, ఉషస్సు, సవితృడు తప్ప మిగిలినవారు మనకి పరిచితులే. అరోరా బొరియాలిస్‌నే మన ఋషులు సవితృడు అన్నారని ఒక సిద్ధాంతం ఉంది. ఋగ్వేదంలోని కొన్ని ఋక్కులని ఈ దృష్టితో వ్యాఖ్యానిస్తే వాటి అర్ధం తేటతెల్లమౌతుందని వీరు ‘నిరూపించేరు.’

ఇదే నిజం అయితే వేదకాలం నాటి ఆర్యావర్తం హిమాలయాలకి దిగువన ఉన్న భూభాగం కాజాలదు. ఎందుకంటే అదే ఋగ్వేదంలో మరొక చోట సప్తర్షి మండలం (లేదా బృహదృక్షం, లేదా పెద్ద ఎలుగుబంటి, లేదా Ursa Major) ఆకాశంలో నడినెత్తి మీద కనిపిస్తోంది అని ఉంది. ఈ నక్షత్ర సమూహం ఒక్క ఉత్తర ధృవ ప్రాంతంలోనే నడినెత్తి మీద కనిపిస్తుంది. అంటే ఆర్యులు ఋగ్వేద కాలంలో ఉత్తర ధృవ ప్రాంతాలలో ఉండేవారా? ఈ సిద్ధాంతమే నిజం అయితే సూర్యుడు పగటి దేవుడు, సవిత్రుడు రాత్రి దేవుడూనా? ఆ వేదకాలం నాటి సవిత్రుడినే ఇప్పుడు ఉత్తర జ్యోతులని అంటున్నామా?

వేదకాలం నాటి ఆర్యులు ఈ ఉత్తర ధృవ ప్రాంతాలలో నివసించి ఉంటే, ఇక్కడ ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి సంగతి ఎక్కడైనా ప్రస్తావించేరా? ఆరు నెలల కాలం మేరు పర్వతం మీద ఉన్న దేవతలకి ఒక పగలుతో సమానమని, మరొక ఆరు నెలలు రాత్రితో సమానమనీ చెబుతారు కదా. అలాంటప్పుడు ఉత్తర ధృవ ప్రాంతాలలోని కొండలలో ఎక్కడో మేరు పర్వతం ఉందా?

ఇలా ఋగ్వేదపు కాలాన్ని తలుచుకుంటూ, ఆ ఉత్తర జ్యోతులని చూస్తూ ఎంతసేపు బయట ఉండిపోయానో నాకే తెలియదు. ఆలోచించినకొద్దీ మతి పోతోంది తప్ప ….ఆకలి వేస్తూంటే లోపలికి వచ్చేను. అగ్నిహోత్రుడి పక్కనే వెచ్చ వెచ్చగా ఉన్న పదార్ధాలని పళ్ళెంలో పెట్టుకుని తినటం మొదలు పెట్టేను.

అలాస్కాలో, నేనున్న అక్షాంశ రేఖ – 66 డిగ్రీలు ఉత్తరం – దగ్గర వెలుగున్న పగటి కాలాన్ని కొలవటానికి గంటలు అక్కర లేదు; నిమిషాలు చాలు. సూర్యరశ్మి తగలకుండా ఆకాశం మబ్బుగా ఉన్న రోజులలోనే మనకి సగం ఉత్సాహం చచ్చిపోతుంది. ఇంట్లో నిత్యం తిరుగాడే మనిషి ఊరికి వెళితేనే ఇల్లు చిన్నబోయినట్లు ఉంటుంది. అలాంటిది దరిదాపు ఇరవై నాలుగు గంటలూ చీకటిగా ఉండే ఈ శీతాకాలంలో ఏకాంతంగా ఉండటం అంటే మజాకా కాదు. ఎంత ధీమంతుడికైనా మతి భ్రమించే సావకాశం ఉంది. ఇందులో వెలుగులేమి ప్రభావం ఎంతో, ఏకాంతవాసపు ప్రభావం ఎంతో, లయతప్పిన దినచక్రం ప్రభావం ఎంతో అని నేను తిరిగొచ్చిన తరువాత విశ్వవిద్యాలయంలో ఆచార్య బృందం తీవ్రంగా తర్జనభర్జనలు చేసింది.

తిండి తిని, గ్లాసులో వైను పోసుకుని, దానిని చప్పరిస్తూ తూగు కుర్చీలో కూర్చుని, చిన్నప్పుడెప్పుడో విన్న రేడియో నాటకాన్ని ఊహా ప్రపంచంలో మననం చేసుకుంటూ, తాదాత్మ్యంతో మైమరచి, సుషుప్తావస్తలోకి జారుకుంటూ, వింటున్నాను. ఇంతలో ఏదో చప్పుడైంది. మొదట్లో ఆ నాటకంలో పాత్రలు చేసే చప్పుడనే అనుకున్నాను. ఆ చప్పుడు నా కుటీరపు గోడలమీదనే అని స్పురించేసరికి కుర్చీ లోతుల్లోకి కూరుకుపోయిన నా నడ్డి ఠక్కున నిటారుగా నిలబడింది.

ఏదో మెత్తటి సుత్తితో బాదుతూన్నట్లు ఉందా చప్పుడు. కుటీరం అంతా ఒక్కసారి కంపించినట్లనిపించింది. లోపల వెచ్చదనం కోసం గోడల మీద, మిద్దె మీద మెత్తిన మెత్తటి మట్టి పెళ్ళలు, గడ్డి, గాదర ఊడి కింద పడ్డాయి. ఊపిరి బిగపట్టి, చెవులు రిక్కించి కుర్చీలో కదలకుండా కూర్చున్నాను – భయంతో. బయట చప్పుడు ఆగింది. ‘ఆగంతకుడు’ తరువాత ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడా అని ఆ నిశ్శబ్దానికి భాష్యం చెప్పుకుని ఎదురు చూస్తూ మెదలకుండా కూర్చున్నాను. నేను కదిలితే బయటున్నదేదో నా మనో భావాన్ని గ్రహించి నా ఎత్తుకి పై ఎత్తు వేస్తే! అదీ ప్రమాదమే.

మళ్ళా మొదలైంది. మొదట్లో జంకుతోనూ, క్రమేపీ నిర్భయంగానూ చేసిన చప్పుడది. ముందు గోడల పైన గోళ్ళతో బక్కురుతూన్నట్లు చప్పుడు. క్రమేపీ ఆ బక్కురు గోడ దిగువకి వచ్చింది. పదే పదే అదే చోటు నుండి ఆ చప్పుడు వినిపించే సరికి అదేదో గోడలోంచి గదిలోకి వచ్చేసిందేమోనన్న భావన నా మనస్సులో నాటుకు పోయింది. రెపరెపలాడుతూన్న కిరసనాయిలు దీపపు గుడ్డి వెలుగులోంచి కళ్ళు పొడుచుకుని తీక్షణంగా చూడటం మొదలు పెట్టేను. పిచ్చి భయం ఒడలంతా ఆవహించింది. పరిగెత్తటానికి చోటు లేదు. దాక్కోడానికి చోటు లేదు. సత్వరం బయటనున్నది – అదేదైతేనేమి – లోపలికి వచ్చెస్తుంది.

అదేమై ఉంటుందో గభీ మని స్పురించింది. ధృవప్రాంతాలలో ఉండే ఎలుగ్గొడ్డు? బృహదృక్షం! Ursa Major!

ఎలుగ్గొడ్లు చలికాలం అంతా నిద్ర పోతాయి కదా! అని వెంటనే మరొక ఆలోచన.

నిద్ర మధ్యలో ఆకలేసిందేమో! నేను వండుకు తింటూన్న తిండి వాసనకి నిద్ర లేచి వచ్చి ఉంటుంది. ఉత్తర జ్యోతులు విరజిమ్మే వెలుగుకి తెల్లారిందనుకుని శీతనిద్ర (hybernation) వదిలేసి లేచి వచ్చిందేమో! లేక, ఈ పెద్ద భల్లూకాలు శీతనిద్ర పోవేమో!

కుటీరపు గోడల పైభాగాన్ని గోళ్ళతో బక్కిరింది కనుక ఈ ఎలుగ్గొడ్డు కనీసం నిలువెత్తు పైనే ఉంటుంది. అంత పెద్ద ఎలుగ్గొడ్డుకి బరువుతోపాటు రవంత తెలివి కూడా ఉండుంటే ఈ కుటీరాన్ని ఇసక మేడని తొక్కినట్లు తొక్కేసి ఉండేది.

ఈ ఆలోచన వచ్చేసరికి నా వెన్నులో చలి విద్యుత్తులా ప్రవహించింది. ఆ ఎలుగ్గొడ్డు గోడని గోకుతున్నాది కనుక సరిపోయింది కాని, ఆ పక్కనే ఉన్న తలుపుని గోకితే అది ఠపీమని తెరుచుకుంటుంది – చిన్న కర్ర గెడ ఎలుగ్గొడ్డుని ఆపగలదా? అప్పుడు అరవై కెజిల బరువు ఉన్న నేను ఒక పక్షం, ఆరువందల కెజిల బరువు ఉన్న భల్లూకం మరొక పక్షం! గెలుపు ఏ పక్షానిదో ఉహించటం కష్టం కాదు!

గోకుడు ఆగింది. మళ్ళా నిశ్శబ్దం – లబ్ డబ్ అని కొట్టుకుంటూన్న నా గుండె చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దమే!

గెడ వేసిన కుటీరపు తలుపు మీద దృష్టి కేంద్రీకరించి, కుర్చీ లోంచి లేవకుండా, నెమ్మదిగా గోడని ఆనించిన తుపాకీని చేతిలోకి తీసుకున్నాను. ట్రిగ్గర్ని కాక్ చేసి, తుపాకిని పైకెత్తి తలుపు వైపు గురిపెట్టి ఊపిరి బిగపట్టేను. భయంతో వణుకుతున్న చేతికి చల్లటి తుపాకీ తగిలేసరికి చేతి వేళ్ళు కొంకర్లు పోయాయి.

నిరీక్షణ మొదలు పెట్టేను. ఎలుగ్గొడ్డు గుర్రు పెట్టిన శబ్దం వినిపించినట్లయింది. నా మెడ మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మళ్ళా నిశ్శబ్దం. ఎలుగ్గొడ్డు బుస కొడుతున్నట్లు నాకు వినిపిస్తోందా? ఈ లోగా నా ముక్కు పుటాలలో ఎలుగ్గొడ్డు వాసన! పులి వాసన, ఒంటె వాసన లాగే ఎలుగ్గొడ్డు ఒక నిర్దిష్టమైన వాసన వేస్తుంది. ఆదొక రకం రొచ్చు వాసన! అయితే ఎలుగ్గొడ్డు తలుపు తెరుచుకుని లోపలికి వచ్చేసిందా?

పోతపోసిన విగ్రహంలా కదలకుండా అక్కడే అలా నిరీక్షిస్తూ కూర్చున్నాను. తుపాకీ ట్రిగ్గర్ మీద నా చూపుడు వేలు అతుక్కు పోయింది. ఆ తలుపు వైపే గురి పెట్టి చూస్తూన్న నా తీక్షణమైన చూపులకి ఆ తలుపుకి చిల్లులు పడిపోయి ఉండాలి.

ఒంటి మీదకి తెలివొచ్చేసరికి నా ఒళ్ళంతా చెమటలు పోసేసి ఉంది. ఛాతీ మీదకి వాలిపోయిన తలని పైకెత్తి చూసేను. చేతిలో తుపాకీ ఇంకా అలాగే ఉంది. తలుపు మూసే ఉంది. గెడ వేసే ఉంది. లోపలా, బయటా నిశ్శబ్దం ఒక్కటే వినిపిస్తోంది.

ధైర్యం చేసి తలుపు తెరుచుకుని బయటకి వెళ్ళటానికి రెండు రోజులు పట్టింది.


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...