వేక్సీన్ రాజకీయాలు

అవి 18 వ శతాబ్దం అంతం అవుతూన్న రోజులు. మశూచికం (smallpox) సోకినవారిలో 30శాతం మరణిస్తే బతికి బయట పడ్డవారి ముఖాలు స్పోటకం మచ్చలతో వికృతంగా తయారయేవి. ఆ రోజుల్లో మశూచికం బారిన పడకుండా తప్పించుకోడానికి ఒక “నాటు మార్గం” ఉండేది. దానిని ఇంగ్లీషులో “వేరియొలేషన్” (variolation) అనేవారు. మశూచికం సోకినవారి పుండ్ల మీద ఎండిన పక్కులని తీసి, గుండ చేసి ఆ గుండని నశ్యం పీల్చినట్లు పీల్చేవారు. లేదా, చర్మం మీద చిన్న గాటు పెట్టి, ఆ గాటులో ఆ చూర్ణాన్ని పెట్టి రుద్దేవారు. అలా చేసినప్పుడు ఆ వ్యక్తులలో చాలమందికి స్వల్ప తీవ్రతతో మశూచికం సోకి తగ్గిపోయేది. తరువాత వారికి జీవితాంతం మశూచికం నుండి రక్షణ ఉండేది. కాని, అప్పుడప్పుడు, కొందరు దురదృష్టవంతులకి మశూచికం తీవ్రంగా తగిలి ప్రాణాలు పోయేవి.

ఇంగ్లండ్‌లోని గ్లూస్టర్షర్ అనే చిన్న ఊళ్ళో పని చేస్తూన్న ఎడ్వర్డ్ జెన్నర్ అనే నాటు వైద్యుడి బుర్రలో, 1796లో, ఒక ఊహ మెరిసింది. ఆ వైద్యుడి ఊళ్ళో ఉన్న గొల్లభామల బుగ్గలు స్పోటకం మచ్చలు లేకుండా, నున్నగా, గులాబీ రంగులో నిగనిగలాడుతూ ఉండడం చూసి వీళ్ళకి గోశూచికం (cowpox) అనే ప్రమాదం లేని తిష్ఠ (infection) సోకడం వల్ల ప్రాణాంతకమైన మశూచికం అంటలేదేమో అని అనుమానపడ్డాడు. (“ఒక పల్లెటూరి వైద్యుడికి ఇంత సూక్ష్మాక్షిక (insight) ఎక్కడనుండి వస్తుంది?” అని అనుమానం పడ్డ పట్టణవాసపు వైద్యులు లేకపోలేదు. “మూడొంతులు ఈ ఊహ మరెవ్వరి దగ్గరనుండో తస్కరించి ఉంటాడు” అని అభిజ్ఞ వర్గాలలో ఒక నమ్మకం ఉండడం ఉంది, కాని ఆ కథ ఇప్పుడు మనకి అవసరం లేదు.) ఈయన చేసిన ప్రయోగం నైతికంగా సందేహాస్పదమైనది అయినప్పటికీ ఏదో గుడ్డి గుర్రపు తాపులా ఆ ప్రయోగం సత్ఫలితాలని ఇవ్వబట్టి ఆయన పేరు ఇన్నాళ్ళు పోయినా మనం తలుచుకుంటున్నాం. ఏం ప్రయోగం చేసేడు? జెన్నర్ తన పెరట్లో పనిచేసే తోటమాలి కొడుకుని చేతబట్టి, వాడి జబ్బ మీద కత్తితో గాటు పెట్టి, ఆ గాటులో వాడికి ఉద్దేశపూర్వకంగా గోశూచికపు రసిని ఎక్కించేడు. (ఇటువంటి పని ఇప్పుడు చేస్తే జైల్లో పడేస్తారు!) కొన్నాళ్ళు పోయిన తరువాత ఆ కుర్రాడికి మశూచికం అంటిద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటుకోలేదు!

ఏదో ఒక మందు కోసం ప్రజానీకం అలమటించిపోతూన్న వాతావరణంలో జెన్నర్ చేసిన ప్రయోగపు వార్త కార్చిచ్చులా వ్యాపించింది. ఈ పద్ధతిని vaccination అనడం మొదలుపెట్టేరు. లేటిన్ భాషలో vacca అంటే ఆవు (లేదా ఎద్దు). ఈ మాట సంస్కృతంలోని “వత్సా”కి జ్ఞాతి. దేవుడు ప్రత్యక్షమై “వత్సా! ఏమి నీ కోరిక?” అని అడిగినప్పుడు దేవుడు మనని “దూడా!” అని సంభోదిస్తున్నాడన్నమాట! ఈ దూడే ఎదిగి ఎద్దు అవుతుంది కనుక కృష్ణుడు “భరతర్షభా!” అని అర్జునుడిని సంబోధించడం సబబే! అదే విధంగా vaccinationని మనం “వత్సీకరణం” అనడం, vaccineని వత్సలం అనడం కూడా సబబే కదా!

ఈ ‘వేక్సీన్’ అన్న మాటనే తెలుగులో ‘టీకాల మందు’ అంటున్నారు. టీకాలు వెయ్యడం అనే ప్రక్రియని ఇంగ్లీషులో వేక్సినేషన్ (vaccination) అంటారు. డెబ్బయ్ ఏళ్ళు పైబడ్డ భారతీయులకి “మశూచికం టీకాలు” (smallpox vaccination)తో పరిచయం ఉండి తీరుతుంది. ఇటీవల కాలంలో “విషజ్వరపు టీకాలు వెయ్యడం” (influenza or flu vaccination) ఏటేటా జరిగే ఒక రివాజు కార్యక్రమంగా మారిపోయింది. నా చిన్నతనంలో ఒకసారి మశూచికం టీకాలు వేస్తే – జీవితాంతం కాకపోయినా – దశాబ్దాలపాటు రక్షణ ఉండేది. అలాగే చాలా జబ్బులనుండి రక్షణ పొందడానికి పొడిపించుకునే టీకాలు దశాబ్దాలపాటు రక్షణ ఇస్తున్నాయి. కానీ ఈ “ఫ్లూ టీకాలు” (flu vaccination) ఏటేటా పొడిపించుకోవలసిన అవసరం వస్తోంది! ఎందుకుట?

ఈ ప్రశ్నకి శాస్త్రవేత్తలు తరచుగా చెప్పే సమాధానం ఒకటి ఉంది. విషజ్వరాన్ని (flu) కలిగించే విషాణువులు (viruses) – ఒకటి కాదు – అనేక రకాలు ఉన్నాయనిన్నీ, ఒక్కో సంవత్సరం ఒకొక్క రకం విజృంభిస్తూందనిన్నీ, కనుక ఏటేటా కొత్త రకం మందు తయారు చెయ్యవలసిన అవసరం వస్తోందన్నది ఒక కారణం. ఈ ప్రక్రియని ఇంగ్లీషులో “antigenic drift” అంటారు. అనగా, విషజ్వరాన్ని కలిగించే విషాణువులలో ఉన్న జన్యు సమాచారం ప్రతివర్తితల (mutations) ప్రభావం వల్ల ఏటేటా మారిపోతూ ఉండడం. మరొక కారణం ఏమిటంటే ఒకే ఏట ఒకటి కంటే ఎక్కువ రకాల విషాణువులు విజృంభిస్తూ ఉంటాయి. ఏ ఏటికా ఏడు ఏయే రకాలు విజృంభించబోతున్నాయో ముందుగానే పసిగట్టి, ఆ సందర్భానికి సరిపోయే విధంగా సరికొత్త మందులు చెయ్యవలసి వస్తోంది కనుక ప్రతి ఏటా టీకా మందులు పొడిపించుకోక తప్పదు అనేది మరొక కారణం. ఈ వాదనలో శాస్త్రీయత ఎంత? అజ్ఞానం ఎంత? రాజకీయాలు ఎంత? వ్యాపార కోణం ఎంత?

నేను ప్రతి ఏటా, క్రమం తప్పకుండా, “విషాణు టీకాలు” పొడిపించుకుంటూనే ఉంటాను. అయినాసరే, నాకు – క్రమం తప్పకుండా – “విషాణు జ్వరం” వస్తూనే ఉంటుంది. రెండు, మూడు రోజులలో తేరుకుంటూనేవుంటాను. గత నాలుగైదు ఏళ్ళబట్టీ ప్రతి ఏటా, క్రమం తప్పకుండా, “కోవిడ్ టీకాలు” పొడిపించుకుంటూనే ఉన్నాను. ఒక్కోసారి “బూస్టర్లు” అంటూ మూడు సార్లు మళ్ళా పొడిచేరు. అనగా, మొదటిసారి వేసిన టీకాలు పని చెయ్యలేదని కదా తాత్పర్యం! అయినాసరే, నాకు – క్రమం తప్పకుండా – “కోవిడ్ జ్వరం” వస్తూనే ఉంది. రెండు, మూడు రోజులలో తేరుకుంటూనే వుంటాను. కానీ ఈ ఏడు “కోవిడ్ జ్వరం” కారణంగా నన్ను ఆరు రోజులపాటు “నలభయ్ రోజుల నిర్బంధం” (quarantine)లో పెట్టి ఇబ్బంది పెట్టేరు! ‘నువ్వు కోవిడ్ టీకాలు వేయించుకోకపోయి ఉంటే చచ్చిపోయి ఉండేవాడివేమో?’ అని సంజాయిషీ చెప్పేరు కొందరు పెద్దలు!

నా శ్రీమతి గత ఇరవై ఏళ్ళుగా ఫ్లూ టీకాలు ‘వేయించుకోనుగాక వేయించుకోను’ అని మొరాయిస్తూనే ఉంది. అయినా సరే ఆమెకి ఇన్నాళ్ళూ విషజ్వరం సోకనే లేదు. ఎందుకైనా మంచిదని (వయస్సు మళ్ళుతోంది కదా అని) ఈ ఏడు పిల్లలు బలవంతం చేసి తనకి ఫ్లూ టీకాలు పొడిపించేరు. తరువాత కోవిడ్ వచ్చిందో, ఫ్లూ వచ్చిందో తెలియదు కానీ వారం రోజుల పాటు అన్నపానాలు లేకుండా మంచం పట్టింది! ఈ టీకాలవల్లే తనకి జ్వరం వచ్చిందని ఆమె వాదం!

మా ఇద్దరి అనుభవాలతో శాస్త్రీయమైన తీర్మానాలు చేయలేము. ఒక కోయిల కూసినంత మాత్రాన వసంతం వచ్చేసినట్లు కాదు కదా! అందుకని అక్కడక్కడా సమావేశాలలో కలుసుకున్న అపరిచితులని అడిగి చూసేను. శాస్త్రవేత్తలు ప్రచురించిన గణాంకాలు చూసేను. ఈ సమాచార సేకరణ ఏమిటి చెబుతున్నాది? ప్రతి ఏటా “విషాణు టీకాలు” పొడిపించుకోవడం వల్ల ప్రయోజనం (efficacy) 5శాతం నుండి 60శాతం వరకు మాత్రమే! అనగా, కోవిడ్ టీకాల వల్ల – సుడి బాగులేకపోతే – నూరింట 5 పాళ్ళు మాత్రమే ప్రయోజనం ఉండొచ్చు (అనగా, ప్రయోజనం లేకపోవచ్చు). అదృష్టం బాగుంటే నూరింట 60 పాళ్ళు ప్రయోజనం ఉండొచ్చు! అందుకనే మొదటి విడతలో ఇచ్చిన మందు మీద పరిపూర్ణమైన నమ్మకం లేక “బూస్టర్లు” ఇచ్చి చూసేరు. అయినప్పటికీ – ఈ సందర్భంలో కోవిడ్ టీకామందుల ప్రయోజకత్వం ఇంత నాసిగా ఉన్నా సరే – టీకాలు వేయించుకోమని ఎందుకు వేధించుకు తింటున్నారు? గుడ్డి గుర్రపు తాపులా పని చేస్తే చేస్తుంది, లేకపోతే లేదనే కదా?

చారిత్రకంగా, టీకాలు వేయించుకుని మశూచికం నుండి శాశ్వతంగా రక్షణ పొందేము, పోలియో నుండి రక్షణ పొందేము. టీకా మందుల ప్రభావం వల్ల ఎన్నో బాలారిష్టాలని ఎదుర్కొని విజయం సాధించేము! కనుక సామాన్య జనబాహుళ్యంలో టీకా పద్ధతిపై విపరీతమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా గొర్రెల మందలా వెళ్ళి ఫ్లూ టీకాలు, కోవిడ్ టీకాలు పొడిపించుకుంటున్నాం. కానీ పూర్వకాలపు టీకాలలా ఈ పిదపకాలపు టీకాలు సమర్ధవంతంగా పని చేస్తూన్నట్లు కనిపించడం లేదు. ఎందువల్లో?

“మన మీదకి దండయాత్ర చేసే విషాణువులలో అనేక రకాలు ఉన్నాయి కనుక, ఏ ఏడు ఏ రకం విజృంభిస్తుందో ముందుగానే అంచనా వెయ్యడం కష్టం కనుక, టీకామందు పనితనం కుంటుపడుతోంది, కానీ ఎంతో కొంత ప్రయోజనం ఉంటున్నది కదా!” అంటున్నారు. ఇదే కారణం నిజం అయిన పక్షంలో అనేక రకాల విషాణువుల మీద ఉమ్మడిగా పనిచేసే టీకాలమందుని కనిపెట్టలేమా? ఇదే కోవకి చెందిన వేరొక ప్రశ్నని “పాము కాటుకి చెంప దెబ్బ” (ఈమాట, సెప్టెంబరు 2024) అనే వ్యాసంలో ముచ్చటించేను. అక్కడ “రకరకాల పాము విషాలకి ఒకే విరుగుడు మందు తయారుచేయలేమా?” అన్న ప్రశ్నని లేవదీశాను కనుక ఇప్పుడు, ఇక్కడ “రకరకాల విషాణువుల మీద పని చెయ్యడానికి ఒకే మందు తయారుచేయలేమా?” అని అడుగుతున్నాను.

ఈ దిశలో ఆలోచించి, సార్వత్రిక విషాణు వత్సలం (universal flu vaccine), సాంప్రదాయక పద్ధతిలో, నిరుత్తేజిత విషాణువులని (inactivated viruses) ఉపయోగించి తయారుచేద్దామన్న యోచనతో 2022లో ముందుకు వచ్చిన వ్యక్తులు లేకపోలేదు. కానీ వారి గోడు బధిరశంఖన్యాయంలా తయారయింది. ఎందుకిలా జరిగిందన్న ప్రశ్నకి “అంతర్గత రాజకీయాలు” కారణం కావచ్చు. అప్పటికే mRNA సాంకేతికం ఆధునికమూ, నాగరికమూ అయిపోయింది! కనుక పాత చింతకాయ పచ్చడిని ప్రోత్సహించడానికి మూటలు చేతులలో ఉన్న ప్రభువులకి ధైర్యం లేకపోయింది!

సార్వత్రిక విషాణు వత్సలంని సాంప్రదాయక పద్ధతిలోనే చెయ్యదలుచుకున్నప్పుడు ఇప్పటివరకు ఎందుకు ఆగవలసి వచ్చింది? ఎప్పుడో చేసి ఉండవలసింది కదా! ఇది అర్థం అవ్వాలంటే విషజ్వరాన్ని కలుగజేసే విషాణువుల కట్టడి అర్థం కావాలి. విషాణువుల కట్టడిలో ఒక ముఖ్య భాగం పేరు Hemagglutinin. గ్రీకు మాట haima అనగా రక్తం, లేటిన్ మాట gluten అంటే జిగురు. ఈ రెండింటిని దుష్టసంధి చెయ్యగా వచ్చిన హెమాగ్లూటినిన్ (Hemagglutinin) అనేది విషాణువుల నిర్మాణంలో కనబడే ఒక ప్రాణ్యము (protein). ఈ నోరుతిరగని మాటని H అనే అక్షరంతో సూచిద్దాం. ఈ ప్రాణ్యములలో 16 రకాలు ఉన్నాయిట! కనుక వీటిని H1, H2,… H16 అని సూచిద్దాం. మరొక భాగం పేరు నూరామినీడేజ్ (Neuraminidase). ఇది ఒక అజము (enzyme). ఈ అజములు 9 రకాలు ఉన్నాయిట. వీటిని N1, N2, …, N9, అనే అక్షరాలతో సూచిద్దాం. ఈ రెండింటిని కలిపితే HN అనే పేరు వచ్చింది కదా. ఇప్పుడు రకరకాల విషాణువులకి H1N1, H5N1, H3N2, అంటూ పేర్లు పెట్టేరు. పూర్వం వీటిని పంది ఫ్లూ, పక్షి ఫ్లూ, హాంగ్‌కాంగ్ ఫ్లూ, గుజరాతీ ఫ్లూ, వగైరా పేర్లతో పిలిచేస్తూ ఉంటే పందులకి, పక్షులకి, హాంగ్‌కాంగ్ ప్రజలకీ, గుజరాతీలకీ కోపం వచ్చి ఒక కొత్త రకం ఫ్లూ కి “అమెరికా ఫ్లూ” అని పేరు పెట్టబోయారు. అప్పుడు అమెరికావాళ్ళకి బుద్ధి వచ్చి కేశవనామాల్లా H1N1, H5N1,…. వరసలో పేర్లు పెట్టడం మొదలుపెట్టేరు.

పూర్వం విషాణువుల కట్టడిలో ముఖ్యమైనది H భాగమే అనుకునేవారు. కనుక ఏటేటా వత్సలంని తయారు చెయ్యడానికి విషాణువుల తల మీదనే – అనగా, H మీద – దృష్టి నిలిపేవారు. తరువాత్తరవాత తోక భాగం N తోకాడించడం మొదలుపెట్టింది! ఏతావాతా వత్సలం సమర్ధతని లెక్క కట్టడానికి తోక ఎక్కువ ముఖ్యం అని తేలింది! అంతే కాదు. సార్వత్రిక విషాణు వత్సలం సమర్ధవంతంగా పని చెయ్యాలంటే తల (H), తోక (N) లతో పాటు జీవకణాలలో ఉండే B, T కణాలు కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఈ దిశలో సార్వత్రిక విషాణు వత్సలాలని తయారుచేసి మొదటి దశ (Phase 1) ప్రయోగాలు మానవుల మీద విజయవంతంగా చేసేరు. రెండవ దశ (Phase 2) మానవ ప్రయోగాలకి ప్రభుత్వం మొగ్గు చూపటం లేదు. mRNA సాంకేతికం వచ్చిన తరువాత సాంప్రదాయక పద్ధతిని చూస్తే రాజుని చూసిన తరువాత మొగుణ్ణి చూసినట్లు ఉన్నట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తోంది! అలాగని mRNA సాంకేతికం ఉపయోగించి సార్వత్రిక విషాణు వత్సలాలని తయారుచేసేరా ఆంటే అదీ లేదు.

ఇదేనా అసలు కారణం? లేక వేరేదైనా రహస్యం ఉందా? సార్వత్రిక విషాణు వత్సలాలని తయారుచెయ్యడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఆయా మందులు తయారుచేసినా వాటి ధరలు ఆకాశాన్ని అంటేలా ఉంటాయి. కనుక ప్రభుత్వాల దన్ను లేకుండా సార్వత్రిక విషాణు వత్సలాలు వాడుకలోకి వస్తే నష్టపోయేది ఎవరు? టీకా మందులు తయారుచేసే కంపెనీలు. ప్రజలు ఏటేటా టీకాలు పొడిపించుకోవడం వల్ల లాభపడేది ఎవరు? టీకా మందులు తయారుచేసే కంపెనీలు. ఈ కోణంలో నిజానిజాల నిగ్గు తేల్చడానికి ఈ వ్యాసం పరిధి సరిపోదు. భారతదేశం వత్సలాలు తయారుచెయ్యడంలో అగ్ర స్థానంలో ఉంది కనుక ఈ సార్వత్రిక విషాణు వత్సలాలు (సాంప్రదాయక పద్ధతిలో) చెయ్యగలిగితే, చేసి ప్రపంచవ్యాప్తంగా సరసమైన ధరలకు సరఫరా చెయ్యగలిగితే “విశ్వ గురు” అన్న బిరుదు సార్థకం అవుతుంది.

సంప్రదించిన మూలాలు:

  1. Marty Makary, Blind Spots, Bloomsbury Publishing, New York, NY 2024
  2. National Institute of Allergy and Infectious Diseases, “Safety and immunogenicity of BPI-1357, A BPL-Inactivated, Whole-Virus, Universal Influenza Vaccine, https://classic.clinicaltrials.gov/ct2/show/NCT05027932
  3. J Park, et al, “An inactivated multivalent Influenza A virus vaccine is broadly protective in mice and ferrets,” Science Translational Medicine, 14, No. 653, July 13, 2022, doi.10.1126/scitranslmed.abo2167
  4. A breakthrough in the development of a universal flu vaccine, https://www.ox.ac.uk/research/research-impact/breakthrough-development-universal-flu-vaccine
  5. Gabriel Victora, “New clues about why a universal flu vaccine is so elusive,” December 19, 2019, https://www.rockefeller.edu/news/27090-universal-vaccine-bottleneck
    Influenza, a virus: https://www.youtube.com/watch?v=BD1T9yuTHik
  6. Here’s why it’s so hard to make a better flu vaccine, https://www.nbcnews.com/health/health-news/here-s-why-it-s-so-hard-make-better-flu-n848081