ఆవలి తీరం

“డేడ్! లేక్ టాహోలో ఇల్లు అద్దెకి తీసుకున్నాను. మీరు కూడా వస్తారా?”

“ఏమంటావ్?”

“ఏమంటాను? మీరూ వాడూ వెళ్ళండి. నేను మాత్రం రాను. నాకు ఇక్కడే బాగుంది. ఏవిటో! ప్రపంచం అంతా వెకేషన్ అంటూ ఇక్కడకి వస్తారు. మీరు ఎక్కడో, ఏదో ఉందని పరుగెడతారు.”

నాలుగు గంటలపాటు, సియరా నెవాడా కొండలలో ప్రయాణం. కొండ వాలులో లంకంత ఇంటి ముందు కారు ఆగింది. పెరటి వైపు ఇల్లంతా గాజు గోడలే! ఎదురుగా, దూరంగా లోయలో దట్టంగా పెరిగిన దేవదారువుల తలల మీంచి చూస్తే, టాహో సరస్సు! నీలమేఘపు ఛాయతో మెరుస్తూన్న స్వచ్ఛమైన మంచినీటి సరస్సు. ఇరవైరెండు మైళ్ళు పొడుగు, పన్నెండు మైళ్ళు వెడల్పు. ఇటుపక్క ఒడ్డున పిల్లలు, పెద్దలు, పడవలు. కోలాహలంగానే ఉంది. అవతలి తీరం కనబడడంలేదు కానీ సుదూరంలో, పొగమంచు చాటున, కొండలు మసకమసకగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఏదో ఉందని మా ఊరు నుండి ఇక్కడకు వచ్చేను. ఇప్పుడు ఈ ఒడ్డు చేరుకుని ఇంకా స్థిరపడనే లేదు, ఆ ఒడ్డున ఏముందో చూడాలని, అక్కడకి వెళ్ళాలని తహతహ! నిలకడ లేని మనస్సు!

కారులో సామానులు ఇంట్లో పెడుతున్న మా అబ్బాయితో అన్నాను.

“అటు పక్క బాగున్నట్లుందిరా, అబ్బాయీ! అక్కడికి కూడా వెళదామా?”

“ముందు ఇటు కానీ, నాన్నా!” వాడి సమాధానంలో చిరాకు ధ్వనించింది.

“సముద్రమట్టానికి మైలు కంటే ఎక్కువ ఎత్తులోనే ఉన్నాం. నీ వయస్సా ఎక్కువ. ఇక్కడ గాలిలో ఆక్సిజన్ తక్కువ. కనుక ఆ ప్రభావం మెదడు మీద పడి భ్రాంతిని కలుగజేసే అవకాశం ఉంది. కాసింత విశ్రాంతి తీసుకుని ఎత్తుకి అలవాటుపడ్డ తరువాత అటు సంగతి చూద్దాం.”

నాలుగు గంటలు కారు తోలుకు వచ్చేడేమో అలసిపోయి ఉంటాడు. చిరాకుగా ఉన్నట్లున్నాడు. వాణ్ణి ఇక విసిగించకుండా మౌనంగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని, అదే పనిగా సరస్సు వైపు చూస్తూ, ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, మాగన్నుగా అలా కూర్చున్నాను.

“అటు వెళ్ళాలని ఉందా?” ఎవ్వరో నా చెయ్యి పట్టుకున్నారు.

తుళ్ళిపడి చూసేను. ఏమిటీ ఆకారం? పొడుగాటి తెల్లటి గడ్డం. మెరుస్తూన్న కళ్ళు. బక్కచిక్కిన శరీరం. ఎముకలనుండి చర్మం వేలాడుతున్నట్లు కనిపించింది. కోలరిడ్జ్ సృష్టించిన ఏన్షియెంట్ మారినర్ తలపుకి వచ్చేడు.

అతని కరస్పర్శతో శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది. ఆ ఆకారాన్ని చూడగానే ముందు నోట మాట రాలేదు. గొంతుకలో తడి ఆరిపోయింది.

తేరుకుని ఎండిన నోటితో, “అవును, స్వామీ!” అని యాంత్రికంగా అనగలిగేను.

“అక్కడ ఏమి ఉందని అనుకుంటున్నావు? సంసారం అనే సాగరానికి ఈవలి ఒడ్డున ఉన్న ఈ జీవితం మనకి పరిచయమైనది. కానీ ఇది దుఃఖమయం, హింసాత్మకం, అశాశ్వతం. అజ్ఞానం వల్ల ఇదే నిజం అనే భ్రాంతిలో ఉంటాం. ఆవలి ఒడ్డున ఉన్నది ఈ భవబంధాల నుండి విముక్తిని ఇచ్చే దివ్యజ్ఞానం. అదే శాశ్వతమైన సార్వత్రిక సత్యం.”

నా నోట మాట రావడం లేదు.

“ఈ భవసాగరాన్ని దాటడానికి నమ్మకం అనేది ఒక నావ లాంటిది. అటువంటి నమ్మకం నీకు ఉంటే ఆ నావ మీద ప్రయాణం ఎలా ఉంటుందో, గమ్యం ఎలా ఉంటుందో చూపిస్తాను, రా!”

చూపు మేర దట్టంగా పేరుకున్న పొగమంచుని చీల్చుకుంటూ స్వామిజీ ఆ పర్వత సానువుల వెంట నడుస్తున్నారు. అయన అడుగులలో అడుగులు వేస్తూ నేను అనుసరించి వెళుతున్నాను.

“అదిగో అటు చూడు!” తర్జనిని సారించి చూపించేరు.

అది ఒక లోతైన లోయ. ఆ లోయలో పొగమంచు దట్టంగా పేరుకుని ఉంది. స్వామి చూపిన దిశలో పొగమంచు కరిగినట్లయింది. కరిగిన ఆ కాసింత మేరలో, ఎదురుగా, దూరంలో… ఆశ్చర్యం! ఒక దృశ్యం సాక్షాత్కరించడం మొదలుపెట్టింది. మొదట్లో మసకమసకగా ఉన్నా క్రమేపీ తేజోకేంద్రంలో ఆ దృశ్యం ఘనీభవించి తెర మీద కదలాడే బొమ్మలా రూపుదిద్దుకుంటోంది. అది ఒక నదీతీరమో సరోవరమో సముద్ర తీరమో? ఇదమిత్థంగా చెప్పడం కష్టం. జనసందోహం ఒడ్డుకు చేరుకుంటున్నారు. యాత్రికులు కాబోలు.

“… ఆ జలధి ఒక కాలవాహిని. దానిని దాటి ఆవల ఉన్న అవ్యక్తమైన వెలుగుని చేరుకోవాలి. అక్కడ అవిద్యకి, దుఃఖానికి తావే లేదనీ అద్దరిని జీవితం సమ్మోహనామృతమైన చిరునవ్వుల మల్లెలలా, శ్రుతి చేసిన వీణలా సుఖమయం, ఆనందభరితం అనీ ఆ యాత్రికుల నమ్మకం. ఇద్దరి వారి అనుభవం అంతా ఆశాభంగాలు, అనారోగ్యాలు, ఆక్రందనలు! అందుకని ఆవలి తీరం చేరాలని, అక్కడే ఉండిపోవాలని ఆ జనసందోహపు తాపత్రయం.”

ఆ యాత్రికుల మనోభావాల్ని చదివినట్లు స్వామి వివరించి చెబుతున్నారు.

ఎదుట రేవులో పెద్ద పడవ కనిపించింది. జనసందోహం రెండు పాయలుగా చీలింది. పెద్ద పాయ ఆ పెద్ద పడవ వైపు నడుస్తోంది. చిన్న పాయ చిన్న పడవలు ఉన్న రేవు వైపు నడుస్తోంది.

కనిపిస్తున్న దృశ్యం దూరంలో ఉన్నట్లు అనిపించినా, అదేమి చోద్యమో కానీ వారి సంభాషణలు స్పష్టంగా వినపడుతున్నాయి.

“నలుగురితో పాటు నారాయణ అన్నారు. అందరితో కలిసి వెళితే ప్రయాణం సుఖంగా ఉంటుంది. నలుగురితో అనుభవాలు పంచుకుంటూ, ప్రయాణం సరదాగా చేయవచ్చు” అనుకుంటున్నారు, పెద్ద పడవ వైపు నడుస్తున్న యాత్రికులు.

“లోకంతో మనకేం పని? నలుగురితో కలిస్తే మనకి తోచిన విధంగా చెయ్యడానికి స్వతంత్రం ఉండదు. అందరూ ఏదంటే అదే చెయ్యాలి. కనుక పెద్ద పడవ మనకి వద్దు. అదిగో! అల్లంత దూరంలో ఉన్న రేవులో చిన్న చిన్న తెప్పలు ఉన్నాయి. చిన్న తెప్పలలో తెడ్డు వేసుకుని ఎవరికి వారుగా వెళదాం,” అనుకుంటూ మరొక పాయలో కొద్దిమంది ఎవరికి దొరికిన దోనెలో వారు ఎక్కి, తెడ్డుతో తోసుకుంటూ ప్రయాణం మొదలుపెట్టేరు.

“అందరు యాత్రికుల గమ్యం ఒక్కటే. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ లేనిది ఏదో అక్కడ ఉంది. దానిని అందుకోవాలి. అక్కడకి చేరుకోవాలే కానీ… యానం ఏదైతేనేమిటి? పెద్ద పడవలో ప్రయాణం చేసేవారు మహాయానులు. చిన్న పడవలో ప్రయాణం చేసేవారు హీనయానులు. రెండు గుంపుల గమ్యం ఒక్కటే.”

పెద్ద పడవలో కోలాహలం మెండుగా ఉంది. అందరిలోనూ ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అందుకని అటువైపే చూస్తున్నాను.

“ఉన్నది ఈ తీరంలోనే అయినా వారి కళ్ళు మాత్రం ఆవలి గట్టున ఉన్నాయి. ఆవలి తీరం వారి కంటికి కనబడడం లేదు కానీ అది వారి ఊహలకి అందుబాటులోనే ఉంది.”

పెద్ద పడవ లంగరు ఎత్తి వయ్యారంగా ఊగుతూ ప్రయాణం మొదలుపెట్టింది.

“రా! మనం కూడా ఆ పడవలో వెళదాం.” స్వామిజీ నా చెయ్యి పట్టుకున్నారు.

మరు క్షణం స్వామిజీ నేనూ పెద్ద పడవలో ఉన్నాం. పడవలోని యాత్రికులనూ వారి మనోభావాలనూ దగ్గరనుండి గమనించే అవకాశం కలిగింది.

పడవ ఊగిసలాడుతూ నెమ్మదిగా ముందుకి కదులుతోంది. వదలిపెట్టిన ఒడ్డు దృష్టిపథం నుండి వెనక్కి కదులుతోంది. కానీ దిగవిడచిన నేలతో ప్రయాణికుల పౌరసత్వపు బంధం ఇంకా పూర్తిగా సడలిపోలేదు. తీరాన్న ఉన్న మిద్దెలు, మేడలు, మేలిమి దుకాణాలు, అంతంత ఉన్నవి ఇంతింతై, మరింత చిన్నవై, చీమలలా మరీ చిన్నవై, నేపథ్యంలోని పొగమంచులో కలిసిపోయి కరిగిపోతూ ఉంటే వాటి ఆకర్షక బలం కూడా క్రమేపీ సన్నగిల్లిపోతోంది. కానీ ఆవలి తీరం ఇంకా కంటికి ఆనటం లేదు.

కాలం కదులుతోంది. పడవ కదులుతోంది. పూర్వం ఉన్న ‘పాత ఒడ్డు’ అనే ఆలంబన కాస్తా పూర్తిగా ఉడిగిపోయింది. చేరబోయే గమ్యం ఇంకా దృష్టిపథానికి అందుబాటులోకి రాలేదు. సరికొత్త ఆసరా దొరకలేదు. నడి సముద్రంలో నావ దిశానిర్దేశం లేకుండా కొట్టుమిట్టాడుతూన్నట్లు ఉంది.

“ఈ క్షణంలో స్పర్శనీయమైన అనుభవ సత్యాల యొక్క నిజ స్వరూపాలు ఏవయ్యా అంటే- అవి ఉవ్వెత్తున పొంగి పడుతూన్న సాగర తరంగాలు, ఆ నీటి శిఖరాల మీద కాగితపు పడవలా ఊగిసలాడుతున్న ఈ పడవ- ఈ రెండే.”

“అంతా అయోమయంగా ఉంది. స్వర్గతుల్యమైన సరికొత్త ప్రపంచంలో అడుగు పెట్టాలన్న ఆతృతతో ఈ యాత్రికులు ఉన్న ఆసరాని కాస్తా ఊడగొట్టుకున్నారు. వీరికి ఇప్పుడు మిగిలినది ఈ సముద్రం, ఈ పడవ! వీరికి తరుణోపాయం లేదా?” స్వామీజీని అడగాలని మనస్సులో కోరిక మెదిలింది.

“లేకేమి? ఈ సమయంలో ఈ నడి సంద్రంలో, ఈ నావలో ఉన్న ఈ ప్రయాణీకులకి ఊరట కలిగించే అభయహస్తాలు మూడు ఉన్నాయి: ఒకటి, ఈ ప్రయాణం సుసాధ్యమేనని గతంలో ఈ దిశలో ప్రయాణించిన బుధజనుల జ్ఞానంతో సంక్రమించిన హామీ. ఈ రకం భావాన్నే బుద్ధం శరణం గచ్ఛామి అని సూత్రీకరించవచ్చు. రెండు, ఆవలి గట్టుకి తీసుకెళ్ళగలిగే సమర్ధత ఈ నావకి ఉందని నావికా స్థాపత్య శాస్త్రంలో నైపుణ్యం ఉన్నవారు ఇచ్చిన హామీ. దీనిని ధర్మం శరణం గచ్ఛామి అన్న సూత్రంతో పోల్చవచ్చు. మూడు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పడవని నడిపే కళాసీల సిబ్బంది ఆవలి గట్టుకి చేర్చగలదనే నమ్మకం. దీనినే సంఘం శరణం గచ్ఛామి అనొచ్చు. ఉన్న నేలని విడచి సాము చేస్తూన్న ఈ యాత్రికులు ఆవలి తీరం చేరుకునే వరకు ఈ మూడు హామీలని నమ్ముకోవడం తప్ప చెయ్యగలిగేది ఏమీ లేదు. వెలిగించిన దీపం గాలిలో పెట్టిన తరువాత, ‘భగవంతుడా! నీదే భారం!’ అనడం తప్ప ఎవ్వరు మాత్రం చెయ్యగలిగేది ఏమి ఉంటుంది?”

ఆ సమాధానాన్ని జీర్ణించుకుని, ఒంటపట్టించుకుందికి కొంత కాలం పట్టింది.

ఒడిదుడుకులన్నిటిని ఓపికగా ఓర్చుకుని పడవ చివరికి ఆవలి గట్టుకి చేరువవుతోంది. ఇంతవరకు ఊహా ప్రపంచాలలో, మంచుతెరల వెనుక దోబూచులాడుతూన్న ఊహలు సాకారం పొందడం మొదలుపెట్టేయి. పచ్చని కొండలు, అంబరచుంబితాలయిన భవనాలు, అందాలు చిందే అంబుస్ఫోటాలు, సోయగాలు ఒలకబోసే పంచరంగుల దీపాలు దృష్టిపథంలోకి వస్తున్నాయి. వెనక దిగవిడచిన దేశం- అదే సర్వం అని ఇంత కాలం నమ్ముతూ వచ్చిన దేశం- ఇప్పుడు ఆలంబనానికి కూడా అవకాశం లేకుండా స్మృతిపథంలో రేఖామాత్రంగా మిగిలి ఉంది.

పడవ దిగి ఎదురుగా ఉన్న స్వర్గతుల్యంలోకి అడుగు పెట్టేరు ప్రయాణీకులు.

“మహాసాగరాన్ని దాటించిన పడవ అన్నా, ఆ పడవని ఈ దరికి చేర్చిన కళాసీలు అన్నా యాత్రికులకి కృతజ్ఞత లేకపోలేదు. ఎంత కృతజ్ఞత ఉంటే మాత్రం ఆ పడవని భుజాల మీద వేసుకుని శేష జీవితం అంతా మోయలేరు కదా? ఆ పడవని ఆ సముద్రంలో వదలవలసిందే! అదే విధంగా ఆ కళాసీలు ఆ పడవతో ఉండవలసిందే! ముందుకి వెళ్ళాలనుకునేవాడు- విజ్ఞత ఉన్న వాడు- పడవని, కళాసీలని వెంటపెట్టుకుని వెళ్ళలేడు కదా! ముందుకి వెళ్ళేవాడు వెనక్కి తిరిగి ఎంత కాలం చూడగలడు? ‘ఓడ దాటేవరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య’ అన్న సామెతలో కాచి, వడపోసి, రంగరించిన జీవిత సత్యం లేకపోలేదు.”

“అంతేనంటారా?” అని వ్యాఖ్యానించాలనిపించింది.

“కాక? పడవ ఎక్కే ముందు యాత్రికుల అవసరాలు వేరు, దృక్పథం వేరు. గమ్యం చేరుకున్న తరువాత అవసరాలు వేరు, దృక్పథం వేరు. గమ్యం చేరుకున్న తరువాత ఒడ్డుని ఉండిపోరు కదా! లోపలికి వెళ్ళాలి. అన్వేషణ కొనసాగించాలి. ఈ అన్వేషణలో వెనక వదలిపెట్టిన పాత దేశానికి కాని, దాటొచ్చిన సముద్రానికి కాని, దాటించిన పడవకి కాని, కళాసీలకి కానీ పాత్ర ఏముంటుంది? నాటకంలో పాత్రలలా ఆయా పాత్రల పరిధి ముగిసింది.”

“అయితే వారు ఇప్పుడు ఏమవుతారు?” మనస్సులోనే ప్రశ్న మెదిలింది.

“వెనక్కి తిరిగి చూడు. ఏమి కనిపిస్తోంది?” స్వామి అడిగేరు.

సుదూరంలో, నింగి నేలని తాకే దూరంలో, దిక్చక్రం కనిపిస్తోంది. దానికి ఆవల విడచి వచ్చిన పాత దేశం కనిపించడంలేదు.

“ఇంకా? ఏమి కనిపిస్తోంది?” స్వామి మరొకసారి అడిగేరు.

వెనక్కి తిరిగి మళ్ళా చూసేను. ఇప్పుడు దాటొచ్చిన సముద్రమూ కనిపించలేదు, దాటించిన పడవా కనిపించలేదు. పడవని నడిపించిన కళాసీలూ కనిపించలేదు. సంభ్రమాశ్చర్యాలతో స్వామి వైపు చూసేను.

స్వామీ కనబడలేదు!

“డేడ్! బోటు అద్దెకి కుదిర్చేను. టాహో అవతలి ఒడ్డుకి పడవలో తీసుకువెళతాను, పద!”


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...