ఆగస్టు 4, 2001. ఆర్లేండో అంతర్జాతీయ విమానాశ్రయం
ఇమ్మిగ్రేషన్ హాలు వస్తూన్న ప్రయాణీకులతో కిటకిటలాడుతోంది. పౌరులు ఎడమ పక్క వరుసలలోకి, అతిథులు కుడిపక్క వరసలలోకి బారులు తీర్చి నిలబడి ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ ఇన్స్పెక్టర్లకి రోజూ తరగనిదంపులా చేసే పనే: ‘తరవాత వారు!’ అని పిలవటం, ‘పేస్‌పోర్టు!’ అని యాంత్రికంగా అడగటం. ఆ పేస్‌పోర్టు అందుకుని, దానిని చదివే యంత్రంలోని గాడిలో పెట్టి గీకుతూ, ‘ఏపని మీద వస్తున్నారు? ఎన్నాళ్ళు ఉంటారు?’ అని ముక్తసరిగా రెండు మూడు ప్రశ్నలు అడిగి, ‘అమెరికాకి స్వాగతం’ అంటూ పేస్‌పోర్టులో ముద్ర వేసి ప్రయాణీకులని బయటకి పంపుతున్నారు అధికారులు.
తమ తమ విధులని చకచకా నిర్వర్తించుకుంటూ పోతూన్న ఇమ్మిగ్రేషన్ తనిఖీదారులని ఒకసారి పరకాయించి చూసి, సంతృప్తిగా తల పంకించేడు హోజే పెరేజ్ – తన ఆఫీసు గది గుమ్మం దగ్గర నిలబడి మీసాలని సవరించుకుంటూ. వేలకొద్దీ ప్రయాణీకులు ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. అలాగని ఏమరుపాటు పనికి రాదు. ఒక్క వ్యక్తి దేశంలోకి అక్రమంగా ప్రవేశించినా, నిషిద్ధమైన వస్తువులని (మాదక ద్రవ్యాలు, మొక్కలు, విత్తనాలు, వగైరా) దొంగచాటుగా దేశంలోకి తీసుకువచ్చినా అది ఏ అనర్ధానికి దారి తీస్తుందో కదా. అందుకని అధికారులు అప్రమత్తతతో ఉండటం అత్యవసరం.
హోజే పెరేజ్ ఆఫీసులో బల్ల మీద టెలివిజన్ సి.ఎన్.ఎన్. ఛానెల్ మీద వచ్చే బొమ్మలని మాత్రం నిశ్శబ్దంగా చూపిస్తోంది. టేపు మీద నమోదు చేసిన వార్తలని తిరిగి తిరిగి ప్రసారం చేస్తూన్నట్లున్నారు. వచ్చిన వార్తలే పదే పదే పునరావృత్తం అవుతున్నాయి: ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ వాళ్ళు లండన్‌లో మరొక కారులో బాంబు పెట్టి పేల్చేరుట. యుగొస్లావియాలో ముస్లిం తిరుగుబాటుని ఎలా అదుపులో పెట్టటమా అన్నది కోసొవో సమావేశంలో ప్రెసిడెంట్ బుష్ ఎదుట ముఖ్యాంశం. ఈ వార్తలు చూడగా చూడగా మెదడు తిమ్మిరెక్కి పోయినట్లుంది హోజే పెరేజ్‌కి! బయటకి వచ్చి ప్రజావాహినిని చూస్తూ నిలబడ్డాడు.
హోజే పెరేజ్ పై అధికారి ఒక దస్త్రం పట్టుకుని వస్తూ, “హోజే! ఇది సౌదీ అరేబియా నుండి వస్తూన్న ఒక ప్రయాణీకుడి దస్త్రం. ఇంగ్లీషు రాదుట. ఇమ్మిగ్రేషన్ ఫారమూ, దిగుమతి సుంకాల ఫారమూ పూర్తిగా నింపలేదు. కొంచెం చూడండి.” ఆ దస్త్రం పుచ్చుకున్నాడు హోజే సరే అంటూ.
ఇమ్మిగ్రేషన్ ఫారమూ, కస్టమ్స్ డిక్లరేషనూ చాలమంది పూర్తిగా నింపలేరు. ఇలాంటి వ్యక్తులని దేశం లోపలికి రానిచ్చే ముందు ఎలా తనిఖీ చెయ్యాలో, ఆ నిబంధనలన్నీ, పుస్తకంలో రాసిపెట్టి ఉంటాయి: ప్రశ్నించు, తనిఖీ చెయ్యి, నిశ్చయించు. ప్రశ్నించాలంటే భాష రావాలి. అంటే, అరబ్బీ, ఇంగ్లీషు తెలిసిన దుబాసీ కావాలి. ఇమ్మిగ్రేషన్ వారికి ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండే దుబాసీలు ఉంటారు. వారిలో షఫీక్ ఫవూద్ అనే ఆసామీని ఎంపిక చేసి అతనిని ఫోనులో పిలచేడు. పరిస్థితిని వివరించి లైన్‌లో వేచి ఉండమని చెప్పేడు. భాష సమస్య తీరింది కనుక ఏయే ప్రశ్నలు అడగాలో తేల్చుకోడానికి దస్త్రం తెరచి, ముఖ్యాంశాలని పరిశీలించి చూసేడు.
మహమ్మద్ ఆల్ ఖతానీ దుబాయ్‌లో విమానం ఎక్కి, అక్కడ నుండి లండన్ చేరుకున్నాడు. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ వారి విమానంలో, ఒకే ఒక పెట్టెతో, అమెరికా చేరుకున్నాడు. ప్లారిడాలో డిస్నీవరల్డ్ చూడటానికి సౌదీ నుండి పర్యాటకులు తరచు వస్తూ ఉంటారు. ఈ ‘కేసు’ని పది నిమిషాలలో తేల్చెయ్యవచ్చని, ఇదే పరిస్థితిలో పడ్డ ప్రయాణీకులు వేచి ఉండే గదిలోకి వెళ్ళి, ఒక వ్యక్తిని ఎంపిక చేసి, అతని ఎదురుగా నిలబడి, “మహమ్మద్ ఆల్ ఖతానీ?” అని అడిగేడు. దస్త్రంలో ఉన్న ఫొటోకీ, ఎదురుగా కూర్చున్న వ్యక్తికీ మధ్య ఉన్న పోలికలకోసం పరికించి చూస్తూ.
కుర్చీలో కూర్చుని, మోచేతులనీ మోకాళ్ళ మీద ఆనించి, తదేకంగా నేలని పరిశీలిస్తూన్న ఖతానీ తల పైకెత్తి, లేచి నిలబడ్డాడు. హోజే ఆ ఆరడుగుల ఆసామీ కళ్ళల్లోకి సూటిగా చూసేడు.
మోకాళ్ళు దిగేంత వరకు పొడుగున్న నల్లటి కమీజు, నల్లటి కుర్తా, నల్లటి జోళ్ళు, గుబురుగా పెరిగి సంరక్షణ లేని నల్లటి గడ్డం – ఇదీ ఆ ప్రయాణీకుడి అవతారం. “దయచేసి నాతో రాండి,” అంటూ హోజే పెరేజ్ సౌదీని తనతో ఒక చిన్న గదిలోకి తీసుకెళ్ళి, గది తలుపు వెయ్యకుండా, బారుగా తెరిచే ఉంచాడు, ‘ఇదేదో బందిఖానా’ అనే భ్రమ కలిగి భయపడకుండా ఉండటానికా అన్నట్లు.
అది ఆర్భాటం లేని చిన్న గది. ఆ గదిలో ఒక చిన్న బల్ల, రెండు కుర్చీలు ఉన్నాయి. ఇద్దరూ చెరొక వైపూ ఎదురెదురుగా కూర్చున్నారు. బల్ల మీద ఉన్న త్రిభుజాకారపు పరికరం మీద ఉన్న మీటని నొక్కి, “డాక్టర్ షఫీక్ ఫవూద్! మీరు అక్కడ తయారుగా ఉన్నారా?” అంటూ వేచి ఉన్న దుబాసీని పలకరించి, ఖతానీ వైపు తిరిగి, “ఈ టెలిఫోనుకి అవతల పక్క అరబ్బీ మాట్లాడే వ్యక్తి ఉన్నారు. ఆయన సహాయంతో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరిచ్చే సమాధానాలని బట్టి అమెరికాలో ప్రవేశించటానికి మీకు అనుమతి ఇవ్వటమో, నిరాకరించటమో జరుగుతుంది.” అని ఇంగ్లీషులో చెప్పి, అనువాదం కోసం హోజే ఆగేడు. డాక్టర్ ఫవూద్ ఈ వాక్యాన్ని అనువదించి చెబుతూ ఉంటే ఖతానీ హోజేని మింగేస్తాడా అన్నట్లు కొరకొరా చూస్తున్నాడు. హోజే తను అడగవలసిన ప్రశ్నలని ఒకటీ ఒకటీ అడగటం మొదలుపెట్టేడు.
“తిరుగు ప్రయాణానికి మీ దగ్గర టికెట్టు ఎందుకు లేదు?”
“ఇక్కడ నుండి మరెక్కడికి వెళతానో నాకే తెలియదు. అటువంటప్పుడు తరువాత మజిలీకి టికెట్టు ఎలా కొనుక్కుంటాను?”
“ఇక్కడ నుండి ఊళ్ళోకి తీసుకువెళ్ళటానికి ఎయిర్‌పోర్టుకి ఎవ్వరైనా వచ్చేరా?”
“ఒకరు వస్తారు.”
“వారి పేరు?”
“నాకు తెలియదు.”
“ఈ ఊళ్ళో ఎక్కడ బస చేస్తున్నారు?”
“హొటేల్లో.”
“ఆ హొటేలు పేరు?”
“నాకు తెలియదు.”
“మీకు ఇంగ్లీషు వచ్చినట్లు లేదు. మిమ్మల్ని కలుసుకోటానికి ఎవ్వరు వస్తున్నారో మీకు తెలిసినట్లు లేదు. బయటకి వెళ్ళిన తరువాత చాల ఇబ్బంది పడిపోతారు.”
“నా కోసం బయట ఒక వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు.”
“ఆ వ్యక్తి పేరేమిటి? అతని టెలిఫోను నంబరు కాని ఉందా?”
“అవన్నీ వ్యక్తిగత విషయాలు. అవన్నీ మీకు చెప్పవలసిన అవసరం లేదు.“
హోజే పెరేజ్ ఖతానీని చుస్తూ ఆలోచనలో పడ్డాడు. సౌదీ అరేబియా నుండి యాత్రికులు చాల మంది వచ్చి ఫ్లారిడాలో బాగా డబ్బులు ఖర్చు పెట్టి వెళుతూ ఉంటారు. ఈ వ్యక్తి ఎవ్వరో తెలియదు. భయపడి సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోతున్నాడా? లేక ఇతని ప్రవర్తనకి మరేదైనా కారణం ఉందా? రెండు నిమిషాలు పోయిన తరువాత —
“మీ దగ్గర రెండు వేల నాలుగు వందల డాలర్లు ఉన్నాయని చెప్పేరు. మీ తిరుగు ప్రయాణానికి రెండు వేలు పోగా మిగిలిన నాలుగు వందలు హొటేలు ఖర్చులకి, తిండికి, తిరగటానికి సరిపోవు.”
“మా వాడొకడు డబ్బు పట్టుకొచ్చి ఇస్తాడు.”
“ఎవ్వరైనా ఎందుకు డబ్బు ఇస్తారు?”
“నాకు కావలసినవాడు కనుక.”
“ఈ వ్యక్తిని ఎన్నాళ్ళబట్టి తెలుసు?”
“కొద్ది రోజుల బట్టి.”
హోజే పెరేజ్ లేచి నిలబడి, “ఇప్పుడే వస్తాను,” అని చెప్పి గదిలోంచి బయటకి నడచి వచ్చి, తలుపు చేరవేసి పక్క గదిలోకి వెళ్ళి, రెండు నిమిషాలలో చేతిలో ఒక పుస్తకంతో తిరిగి వచ్చేడు.
“నేను అడిగే ప్రశ్నలకీ, మీరు చెప్పే సమాధానాలు సూటిగా లేవు. నిజమే చెబుతానని మీచేత ప్రమాణం చేయించి మళ్ళా అడుగుతాను. నేను అడిగిన ప్రశ్నలకి జాగ్రత్తగా ఆలోచించి సమాధాలు చెప్పండి. ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎదుట అబద్ధం చెబితే జైలు శిక్ష పడుతుంది.”
డాక్టర్ ఫవూద్ ఈ వాక్యాన్ని అనువదించి చెప్పే వరకు హోజే ఆగి, ఖతానీ ముఖ కళవళికలలో మార్పులని గమనించసాగేడు. ఖతానీ ముఖంలో కొద్దిగా ఆరాటం కనిపించింది కాని, తటపటాయించకుండా ప్రమాణం చెయ్యటానికి ఒప్పుకున్నాడు. ఫవూద్ సహాయంతో ప్రమాణ పత్రం చదివి, ప్రమాణం చేయించి, కాగితం మీద సంతకం పెట్టించి, మళ్ళా ప్రశ్నలు అడగటం మొదలుపెట్టేడు.
“మీ పేరు?”
“మహమ్మద్ అల్ ఖతానీ”
“మీరు బయటకి వెళ్ళిన తరువాత, మిమ్మల్ని కలుసుకోటానికి ఎవరు వస్తున్నారు?”
“నేను చెప్పను” అంటూ ఖతానీ లేచి నిలబడ్డాడు.
అంతవరకు వారిద్దరి మధ్య జరుగుతూన్న సంభాషణనే తర్జుమా చేస్తూన్న డాక్టర్ ఫవూద్ హోజేని ఉద్దేశిస్తూ ఇంగ్లీషులో, “ఇతని ధోరణి చూస్తే ఇతనేదో దాస్తున్నాడనిపిస్తోంది,” అని చెప్పేడు.