నేను పుట్టడం విశాఖపట్నం జిల్లా, వీరవల్లి తాలూకా, చోడవరంలో మా పెద్ద మామయ్య గారి ఇంట్లో పుట్టేను కానీ, నేను పుట్టినప్పటికి నాన్న గారు పిఠాపురంలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. నాకు రెండేళ్ళప్పుడు బదిలీ మీద తుని వచ్చేసేరు. కనుక నా జీవన యానంలో మొదటి మజిలీ పిఠాపురంలో రెండేళ్ళు. అందుకని ఈ ఊరు గురించి నేను చెప్పేవన్నీ చాలమట్టుకు వినికిడి కబుర్లే!
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదిట. ఈ విషయాన్ని శ్రీనాధుడు భీమేశ్వర పురాణంలో ఈ కింది విధంగా చెబుతాడు.
“హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
ఖేటము లోహదండము నొగిం ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్”
ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉందిట.
పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది. ఈ ఏలేరుని “జగతి నెక్కడివేలేటి సాటి
నదులు” అంటాడు శ్రీనాధుడు. అలా అనేసి ఊరుకోకుండా,
“ఏలేటి విరినీట నిరుగారునుంబండు
ప్రాసంగు వరిచేలు పసిడిచాయ”
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించడం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి. కాని, పక్కనే ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళిన దాఖలాలు నాకు కనిపించ లేదు. ఆ రోజులలో అన్నవరం కొండ అంత ప్రాచుర్యంలో లేదేమో.
అప్పటి వరకు ఎందుకు? ఇప్పట్లో ఉన్న ప్రాచుర్యం నా చిన్నతనంలోనే లేదు. భక్తులు పాపంపెరిగినట్లు పెరిగి పోతున్నారు ఇక్కడ అన్నవరం లోనూ, అక్కడ తిరుపతి లోనూ.
ఏలేరు సంగతి మాట్లాడుతూ దారి తప్పేం. ఈ ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది.
అన్నవరం దగ్గర ఉన్న పంపా నది కూడ సాగర సంగమం చెందే ముందు ఈ ఏలేటి నీటితో పొన్నాడ దగ్గర కలుస్తుందని చిలుకూరి పాపయ్య శాస్త్రి “శ్రీనాధ కృతి సమీక్ష” అనే పుస్తకంలో రాసేరు. ఒడ్డె రాజులతో వైరం పూనిన విజయనగరం గజపతులు ఈ నదుల సాగర సంగమ స్థానాన్ని పూరీ జగన్నాథంతో సమానమైన దివ్య క్షేత్రంగా రూపొందిద్దామని జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రా దేవి విగ్రహాలని ప్రతిష్ట చేసేరుట. ఈ జగన్నాథ స్వామి చేతులు ఇటీవల మొండి అగుటచే ఈ స్వామిని “మొండి జగ్గప్ప” అని ప్రాంతీయులు పిలుస్తారుట.
పిఠాపురం దగ్గర ఉన్న ఉప్పాడ మా ఇంట్లో పిల్లల ఆటపాటలలో ఎలా స్థిరపడి పోయిందో చెబుతాను. మా ఇంట్లో చంటి పిల్లల చేత “గుమ్మాడమ్మా గుమ్మాడు” అనే ఆట ఆడించేవారు. పెద్దవాళ్ళు మంచం మీద వెల్లకిల్లా పడుక్కుని, ముడిచిన కాళ్ళ మీద చంటి పిల్లడిని పడుక్కోబెట్టి, ఆ కాళ్ళని ముందుకీ వెనక్కీ నెమ్మదిగా ఆడిస్తూ ఈ కింది పాట పాడేవారు
“గుమ్మాడమ్మా గుమ్మాడు
పళ్ళు పండింది గుమ్మాడు
కాయల్లు కాసింది గుమ్మాడు…
సపోటా చెట్టుకి నీళ్ళు పోసేవా?”
ఈ సందర్భంలో పిల్లడు (పిల్ల) “పోసేను” అంటాడు, లేదా “ఔను” అన్నట్లు తల ఆడిస్తాడు.
“అయితే, సపోటా పళ్ళన్నీ నావి, పిక్కలన్నీ నీవి!
అరటి చెట్టుకి నీళ్ళు పోసేవా?”
మళ్ళా ఈ సందర్భంలో పిల్లడు (పిల్ల) “పోసేను” అన్నట్లు తల ఆడిస్తాడు.
“అయితే, అరటి పళ్ళన్నీ నావి, తొక్కలన్నీ నీవి!
కొబ్బరి చెట్టుకి నీళ్ళు పోసేవా?”
మళ్ళా పిల్లడు “పోసేను” అన్నట్లు తల ఆడిస్తాడు.
“కొబ్బరి కాయలు నావి, డిప్పలు నీవి!”
ఈ విధంగా ఓపిక ఉన్నంత సేపు పిల్లడిని ముందుకీ వెనక్కీ ఆడించి, ఆఖరున
“ఉప్పాడెళ్ళిందేనుగు, ఉప్పునీళ్ళు తాగిందేనుగు
మాఊరొచ్చిందేనుగు, మంచినీళ్ళుతాగిందేనుగు”
అని పాడి,
“ఉప్పాడెళ్ళేవా?”
“…”
“ఉప్పునీళ్ళు తాగేవా?”
“…”
“మావూరొచ్చేవా?”
“…”
“మంచినీళ్ళు తాగేవా?”
అన్న ప్రశ్నలు వేసేవాళ్ళం. ఈ ప్రశ్నలకి పిల్లాడు సమాధంగా తలాడించడమో, “వెళ్ళేను,
వెళ్ళలేదు” అని చెప్పడమో జరుగుతుంది.
అప్పుడు మోకాళ్ళు రెండూ పైకెత్తి, పిల్లడిని తలకిందులు చేసి, “ఏతాం కిర్రు” అనే వారు. పిల్లలకి ఈ “ఏతాం కిర్రు” భాగం బాగా నచ్చేది. మా అమ్మాయి సీత చంటితనంలో ఆట మొదట్లోనే “ఏతాం కిర్రు” కావాలని అల్లరి పెట్టేసేది! దరిమిలా ఈ పాట అర్ధమయే వయస్సు నాకు వచ్చిన తర్వాత “ఈ ఉప్పాడేమిటి? ఉప్పునీళ్ళేమిటి?” అనే చిన్న ధర్మ సందేహం వచ్చింది. అప్పుడు పెద్దక్క చెప్పింది. పిఠాపురంలో ఉన్నప్పుడు, సముద్రానికి దగ్గరగా ఉన్న ఊరు ఉప్పాడ అనిన్నీ, సముద్ర స్నానానికి అక్కడికి వెళ్ళేవారనిన్నీ చెప్పింది. మరైతే తుని వచ్చిన తర్వాత “ఉప్పాడెళ్ళేవా? ఉప్పునీళ్ళు తాగేవా?” అంటే ఏమి బాగుంటుంది? “ఆ భాగాన్ని పెంటకోట వెళ్ళేవా? ఉప్పు నీళ్ళు తాగేవా?” అని ఎంత
మార్చుదామన్నా ప్రాస కుదరక మార్చ లేక పోయాం” అని అన్నయ్యలు, అక్కలు చెప్పేవారు.
పిల్లలు మరీ మాటలు రాని పసివారైతే, పిల్లని బారజాపిన కాళ్ళమీద కూర్చోబెట్టి, తల వెనక చెయ్యి వేసి, వెనక్కీ ముందుకీ ఆడిస్తూ, ఈ దిగువ పాట పాడే వారు.
“గుమ్మాడమ్మా గుమ్మాడు
పళ్ళు పండింది గుమ్మాడు
కాయల్లు కాసింది గుమ్మాడు
అడ్డా దిడ్డా తోడు
తోడు పాయసం తోడు
తోడితే నీ చెయ్యి వేడి
వేడి వేడి పాయసం జుర్రు
జుర్రితే నీనోరు చుర్రు
ఏతాం కిర్రు”
ఈ పాటలలో “గుమ్మాడు” అన్న మాటకి అర్థం ఏమిటో ఇప్పటికీ నాకు తెలియదు. నిఘంటువులో “గుమ్మడు” అనే మాట ఉంది కానీ దాని అర్థం ఈ సందర్భంలో ఇమడలేదు.
పిఠాపురంలో మా అద్దె ఇంటికి దగ్గరలో కుంతీమాధవ స్వామి ఆలయం, మరి కొంచెం దూరంలో కుక్కుటేశ్వరుడి కోవెల ఉన్నాయి. వృత్తాసురుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకుందికి ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించేడుట. కాశీలో బిందు మాధవ స్వామి, ప్రయాగలో వేణు మాధవ స్వామి, పిఠాపురంలో కుంతి మాధవ స్వామి, తిరుచునాపల్లిలో సుందర మాధవ స్వామి, రామేశ్వరంలో సేతు మాధవ స్వామి. శైవులూ, వైష్ణవులూ పోటాపోటీలుగా ఒకరు కుక్కుటేశ్వరుడునీ, మరొకరు కుంతిమాధవ స్వామినీ సమర్ధిస్తూ స్థల పురాణాలు అల్లేరేమోనని నాకు అనిపిస్తుంది. మేము వీరశైవులం కాదు, స్మార్తులం మాత్రమే. కనుక ఇంటికి దగ్గరగా ఉన్న మాధవుడి గుడికి వెళ్ళడానికి ఎవ్వరికీ అభ్యంతరం ఉండేది కాదు. దేవుడి మీద అభిమానం మాట దేవుడెరుగు కానీ మాధవుడి గుడిలో ప్రసాదం పేరిట పెట్టే పులిహోర, దద్య్ధోదనం, చక్కెర పొంగలి మీద చిన్నన్నయ్యకీ, చిట్టెన్నయ్యకీ ఎక్కువ మక్కువ ఉండేది. ఏదో అంగుటికి అందనంత చేతులలో రాల్చడం కాదు; గుడిలో ఇచ్చిన ప్రసాదంతో వీళ్ళ పొట్టలు నిండి పోయేవిట. మేము తుని వచ్చిన తర్వాత చాల ఏళ్ళ పాటు ఆ ప్రసాదం ఎంత బాగుండేదో చెప్పుకుంటు లొట్టలు వేసేవారు అన్నయ్యలిద్దరూ.
మా ఇంటికి కుక్కుటేశ్వరుడి గుడి మరి కొంచెం దూరం అని చెప్పేను కదా. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేదిట. ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ఈనాడు కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషన్‌కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్తాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే బాగుంటుందేమో!
ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణం లోనే కాలభైరవుడి విగ్రహం “వ్రీడావిహీనజఘనమై” చూసేవారికి సిగ్గును కలిగించేదిగా ఉందిట. నేను చూడ లేదు. వ్రీడావిహీనజఘనంగా వీధులలో తిరిగే కుర్ర కుంకలు కొల్లలుగా ఉన్న మన దేశంలో సిగ్గు పడవలసిన అవసరం ఏముంది? కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని “పాదగయ” అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గంగా తీరమున ఉన్న గయ “గయా శీర్షం” అనీ, పిఠాపురంలో ఉన్నది “పాదగయ” అనీ ఒక సిద్ధాంతం.
అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. “గయ” అంటే జ్ఞాపకం వస్తోంది. మన అదృష్టం కొద్దీ పాదగయలో పిండాలు వదలమని ఎవ్వరూ చెప్పలేదు కనుక సరిపోయింది కానీ, లేకపోతే ఇది కూడా కాకినాడలో పిండాల చెరువులా తయారయి, కొసకి దీనికి కూడ పిండాల చెరువుకి పట్టిన గతే పట్టి ఉండేది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి.
గయుడి పాదాల ప్రస్తావన వచ్చింది కనుక అతగాడి బుర్ర సంగతి కూడ చెబుతాను. ఈ కథ ఏ పురాణంలో ఉందో తెలియదు. ఈ గయుడికీ గయోపాఖ్యానానికీ మధ్య ఏదైనా సంబంధం ఉందో లేదో కూడ తెలియదు. ఈ గయుడిని ఎవ్వరు చంపేరో అస్సలు తెలియదు. ఏది ఏమైతేనేమి, చచ్చిన శవం యొక్క బుర్ర సింహాచలం దగ్గర, పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయిట. అందుకని సింహాచలం నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు నాన్నగారు. పాపభూమి కాబట్టే ఈ మధ్య ప్రదేశంలో పుణ్య క్షేత్రాలు లేవుట. “అన్నవరం ఉందే” అని కొందరు అనవచ్చు. ఈ కథాకాలం నాటికి అన్నవరం లేదేమో; ఉండుంటే శ్రీనాథుడు ఎక్కడో ఒక చోట ప్రస్తావించి ఉండేవాడే! దరిమిలా మేము తునిలో స్థిరపడ్డ తర్వాత కూడా “ఇది పాపభూమేరా! కాకపోతే ఏమిటి, ఈ ఊళ్ళో జరిగే మోసాలకీ, అరాచకాలకీ అంతు లేకుండా పోతోంది,” అనేవారు నాన్నగారు. (తునిలో
ఇప్పుడు మా వాళ్ళు ఎవరూ లేకపోయినా, అక్కడ జరిగిన అరాచకాలూ, మోసాలూ కాగితం మీద పెట్టడానికి నాకు దమ్ములు చాలడం లేదు. అసలు తుని తాలూకాలో జరిగే ఖూనీలు ఆ చుట్టుపట్ల ఏ జిల్లాలోనూ జరిగుండవని తను వైజాగులో లా ప్రేక్తీసు చేస్తూన్న రోజులలో రామం బావ ఒక సారి నాతో అన్నాడు.)
మామ్మ వీలయినప్పుడల్లా ఉదయం పాదగయలో స్నానం చేసి, కుక్కుటేశ్వరుడి దర్శనం చేసుకు వచ్చేదిట. ఒక సారి మా చిన్నన్నయ్యని కూడా వెంట తీసుకెళ్ళిందిట. అప్పటికి చిన్నన్నయ్యకి పది, పన్నెండు ఏళ్ళకి మించి ఉండవు. అన్నయ్యని పాదగయ మెట్ల మీద కూర్చోబెట్టి, తను స్నానం చెయ్యడానికి నీళ్ళల్లోకి దిగిందిట. ఒక్క క్షణం కను మరుగయ్యే సరికల్లా చిన్నన్నయ్య కుదురుగా కూర్చోకుండా నీళ్ళల్లోకి దిగబోయి పాదగయలో పడి పోయాడుట. ఈ సంగతి నీళ్ళల్లో ఉన్న మామ్మకి తెలియదు గాని గట్టు మీద ఉన్న మరొక మామ్మ గారు చూసి వాడిని పట్టుకోబోయారుట. పావంచాలమీద కాలు జారి ఆవిడ కూడ నీళ్ళల్లో పడ్డారుట. ఇద్దరూ ఇలా నీటి పాలు అయేసరికి మిగిలినవాళ్ళంతా మొర్రో మొర్రో అని గోల పెట్టడం మొదలు పెట్టేరుట. అక్కడ గట్టుమీద ఉన్నవాళ్ళెవరికీ ఈత రాదు!
అదే సమయంలో అక్కడ మండ కృష్ణమూర్తి గారి తమ్ముడు మండ ప్రకాశం గారు అప్పుడే పాదగయలో స్నానం పూర్తి చేసుకుని దేవాలయంలోకి వెళ్ళబోతూ వెనకనుండి వచ్చిన కేకలు విని వెనక్కి పరుగెత్తుకు వచ్చి, ఒక్క ఉదుటున పాదగయలో దూకేరుట. దూకీ దూకగానే పిల్లాడి చెయ్యి తగిలిందిట. పిల్లాడిని బయటకి లాగి ములిగిపోతూన్న మామ్మ గారిని వెతకి ఆవిడనీ గట్టు మీద పడేసేరుట. తర్వాత వీళ్ళూ వాళ్ళూ అనుకుంటూ ఉంటే తెలిసింది. పంతులు గారు దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత హరి మీద గిరి పడ్డా, గిరి మీద హరి పడ్డా, దేవతార్చన పూర్తి అయేదాక మరి బయటకు రారుట. అది ఆయన నియమం. అదృష్టం కలసి రాబట్టి ఆయన అప్పటికి ఇంకా దేవాలయం లోపలికి వెళ్ళలేదు కనుక ప్రమాదం మా చిన్నక్క మాటల్లో చెప్పాలంటే చుక్కలో తప్పిపోయింది!
అదే సమయంలో నాన్నగారు వీధి అరుగు మీద కూర్చుని చిన్నన్నయ్య జాతకం చూస్తున్నారుట. చూసి, అమ్మని పిలచి, “ఓవిడా! చూడు, మన విశ్వేశం జాతకంలో జలగండం ఉంది. వాడిని నీళ్ళ దగ్గరకు వెళ్ళనీయకు సుమీ” అని చెప్పేరుట. మా నాన్నగారి జాతకాల మీద అమ్మకి పెద్ద గురి లేదు. అందుకని అమ్మ సమాధానంగా ఏమందో మనం తెలుసుకోడానికి ప్రయత్నించడం విజ్ఞత అనిపించుకోదు.
కొద్ది సేపటిలో మామ్మ పిల్లడిని చంకలో పెట్టుకుని ఇంటికి రానే వచ్చింది. “నాయనా నీ పిల్లడిని నిష్కారణంగా చంపేసినంత పని చేసేనురా” అని మొర్రోమందిట.
వరాహమిహురుడు రాజుకి జాతకం చెప్పి వరాహమిహురుడు అనే బిరుదుని ఎలా పొందేడో అలాగే అప్పటి నుండి నాన్నగారి జ్యోతిష ప్రకర్ష మీద క్రమేపీ అమ్మకి కూడ కొంచెం నమ్మకం కుదరడం మొదలైంది.
నాన్నగారి జ్యోతిష ప్రకర్షని గురించి చిన్నన్నయ్య మరొక ఉదంతం చెప్పేడు. పిఠాపురం రాజా వారు ఒక నాడు వారి ఆస్థాన జ్యోతిష్కుడిని పిలచి, కాలక్షేపానికి, రెండు ప్రశ్నలు వేసి సమాధానం చెప్పమని అడిగేరుట. ఒక ప్రశ్న భూతకాలానికి సంబంధించినది, రెండవది భవిష్యత్తులో జరగబోయేది. రాజుగారి భార్య వారి కుమార్తెని ఎక్కడ ప్రసవించిందో ఆ సూతికా గృహాన్ని వర్ణించమన్నది మొదటి ప్రశ్న. యుక్తవయస్సులోనికి ప్రవేశిస్తూన్న ఆ అమ్మాయి ఎవరిని వివాహమాడుతుందో అన్నది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్నకి సమాధానం రాజు గారి ఆంతరంగిక వర్గానికి తప్ప తదితరులకి తెలియదు. ఈ ప్రశ్నకి ఎవరైతే సరైన సమాధానం చెబుతారో వారే రెండవ ప్రశ్నకి కూడ సరైన సమాధానం చెప్పగలరని రాజు గారి నమ్మిక.
ఆస్థాన జ్యోతిష్కుడికి ఈ రెండు ప్రశ్నలు కొరకబడని కొయ్యలయాయి. అప్పుడు ఆయన నాన్న గారిని సంప్రదించడానికి వచ్చేడుట. ప్రశ్న అడిగిన సమయాన్ని బట్టీ, రాజు గారు ఇచ్చిన మిగిలిన దత్తాంశాలని బట్టీ నాన్నగారులెక్కలు కట్టి, “శిధిలమౌతూన్న ఆవరణలో, అంధకార బంధురమైన నిశీధిలో, ఏకాతంగా రాణీవారు ప్రసవించేరు” అని నాన్నగారు చెప్పేరుట. రాజు గారి కుమార్తె తల్లిదండ్రుల కోరికకి వ్యతిరిక్తంగా, మరొక కులం వాడిని వివాహమాడుతుందని రెండవ ప్రశ్నకి జోస్యం చెప్పేరుట.
ఆస్థాన జ్యోతిష్కుడు నాన్న గారు చెప్పిన విషయాన్నే తన మాటగా రాజు గారికి చెప్పేడుట. అప్పుడు రాజు గారి ఆశ్చర్యానికి అవధులు లేవుట. రాణీ వారు ఒక నాడు సాయంకాలం, సంధ్యా సమయంలో, తోటలో తిరగడానికి వెళ్ళేరుట. చీకటి పడ్డ తర్వాత, అకస్మాత్తుగా ఆమెకి నొప్పులు ప్రారంభం అయేయిట. అదే సమయంలో కాకతాళీయంగా విద్యుచ్చక్తి పోవడంతో తోటంతా చీకటి కమ్ముకుందిట. ఆ హడావుడిలో వైద్యుడి కొరకు కబురు పెట్టడానికి కాని, రాణి వారిని లోగిలి లోనికి తీసుకు వెళ్ళడానికి కాని సానుకూలపడక, తోడ ఉన్న పరిచారిక రాణి గారిని దగ్గరలో ఉన్న ఒక పాడు పడ్డ గుర్రాలసాలలో గడ్డి పరుపు వేసి, అక్కడ పడుకోబెట్టి వైద్య సహాయం కోసం పరుగెత్తిందిట. అప్పుడు రాణి వారు, ఆ చీకట్లో, ఆ శిధిలమైన గుర్రాల సాలలో, ఏకాంతంగా ఉన్న సమయంలో కుమార్తెని ప్రసవించేరుట. ఆ తర్వాత జరిగిన విషయాలని విపులంగా చెప్పడానికి చిన్నన్నయ్య ఇష్టపడలేదు.
నాన్నగారు పిఠాపురంలో కనీసం ఎనిమిదేళ్ళు ఉద్యోగం చేసి ఉంటారు. ఆ రోజులలో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (బాలవ్యాస, తర్క వ్యాకరణ సిద్ధాంతి బిరుదాంకితులు), లేళ్ళపల్లి సత్యనారాయణ గారు, ఓలేటి పార్వతీశం గారు (వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరు), నడకుదుటి వీర్రాజు గారు, ఉమర్ ఆలీషా గారు (తెలుగు పండితులు), మొదలైన వారు నాన్న గారి దగ్గర స్నేహితులలో కొందరు. పానుగంటి లక్ష్మీ నరసింహం (సాక్షి) గారు కూడ నాన్న గారి పరిచయస్తులే కాని వారిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో తెలియదన్నాడు చిన్నన్నయ్య. కాని పక్కింట్లో ఉన్న నేదునూరి కృష్ణ మూర్తి (సంగీత విద్వాంసులు) గారికి అప్పట్లో ఏ పది పన్నెండు ఏళ్ళో ఉండేవని, తరచు మా ఇంటికి వచ్చి అమ్మని చనువుగా “అక్కయ్యా” అని పిలచే వాడనీ చిన్నన్నయ్య చెప్పేడు.
వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గొప్ప పండితుడు. “కవి కాదు, పండితుడు” అంటూ చిట్టన్నయ్య ఒక సారి ఈ రెండు మాటల మధ్యనున్న తేడాని ప్రబోధించేడు. ఈ శాస్త్రి గారు “మహాభారత తత్వ కథనం” అనే ఎనిమిది సంపుటాల ఉద్గ్రంథం తెలుగులో రచించేరు. సొంత డబ్బులతో అచ్చు వేయించి ఆ సంపుటాల ప్రతిని ప్రత్యేకం తుని తీసుకు వచ్చి నాన్నగారికి బహూకరించేరు. అప్పటికి నేను చిన్నవాడినే అయినా శాస్తుర్లు గారి రాకే పెద్ద విశేషం కాబట్టి నాకు బాగా జ్ఞాపకం ఉంది. పుస్తకంలో కాగితాలు తిరగేసి చూసేను. అదంతా తెలుగు లిపే కాని సంస్కృత సమాసాల మయం. నాకు ఒక్క ముక్క కూడ అర్ధం కాలేదు.
కాని చిట్టన్నయ్యకి అర్ధం అయింది. అదే మా కొంప ముంచింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత “భూమి తిరుగుట లేదా?” అన్న పేరుతో చిట్టన్నయ్య భారతిలో ఒక వ్యాసం ప్రచురించేడు. ఆ వ్యాసంలో శాస్త్రి గారిని, ఆయన రాసిన “మహాభారత తత్వ కథనం” పుస్తకాన్ని, అందులో ఆయన సమర్ధించిన “భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు” అనే సనాతన దృక్పథాన్ని దుయ్యబట్టి ఒదిలిపెట్టేడు. ఎనిమిది సంపుటాల గ్రంధంలో ఎక్కడో ఒక చోట కనిపించిన ఒక వాక్యాన్ని పట్టుకుని వాడు అలా రాయడం నాన్నగారికి నచ్చ లేదు. శాస్త్రి గారి పాండిత్యం ఎక్కడ, స్కూలు ఫైనల్ పేసయిన కుర్ర కుంక ఎక్కడ?
నాన్నగారు పిఠాపురంలో ఉద్యోగం చేస్తూన్న రోజులలో ఏదో ఒక లాటరీకి రూపాయి పెట్టి టికెట్టు కొన్నారుట. అప్పుడు ఆయన స్నేహితుడు ఎవరో అడిగేరుట ” లాటరీ వస్తే నాకేమిటిస్తావు?” అని. “వచ్చిన దాంట్లో సగం ఇస్తానులే” అన్నారుట. ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో ఆయనకి లక్ష రూపాయలు లాటరీ రానే వచ్చిందిట. మాట వరసకి అన్న మాటని నిజంగా నిలబెట్టుకునేవారు ఉంటారా? ఉంటారో ఉండరో తెలియదు కాని, నాన్నగారు లక్షలో సగం ఇచ్చెయ్యడానికి సిద్దపడిపోయారుట. కాని ఈ ఇద్దరిలోనూ ఎవరి జాతకం వక్రించిందో కాని, ఆ నెలే ఆ లాటరీ కంపెనీ దివాలా తీసేసిందిట. లక్ష రూపాయిలు మా దగ్గర లేవు, రెండు వందలు మాత్రమే ఉన్నాయని నాన్నగారికి 200 రూపాయిలు పంపించేరుట ఆ కంపెనీ వాళ్ళు. అందులో ఒక వంద నాన్నగారు స్నేహితుడికి ఇచ్చేసేరుట! అమ్మ అనేది, “మన అదృష్టం కొద్దీ మనకి ఆ లాటరీలో లక్ష రాలేదు కనుక సరిపోయింది కానీ, వచ్చుంటే మీకెవరికీ చదువులు వచ్చి ఉండేవి కావు.”
మళ్ళా అలాంటి లాటరీ వస్తుందేమోనని నాన్నగారు తునిలో ఎన్నాళ్ళో వారానికి ఒక రూపాయి చొప్పున ఆర్. ఎమ్. డి. సి. క్రాస్‌వర్డ్ పజిల్ నింపి పంపేవారు. నాకు బాగా జ్ఞాపకం. ఈ పజిల్ లో ప్రశ్న, ఒకే ఒక అక్షరం మినహా సమాధానం ఇచ్చేసేవారు. మినహాయించిన గడి స్థానంలో రెండే రెండు అక్షరాలు నప్పుతాయి . ఆ రెండింటిలో ఏ అక్షరం నింపినా అది సరి అయిన సమాధానం లాగే స్ఫురిస్తుంది. పజిల్ నిర్వాహకులు ఆ రెండు అక్షరాలూ కూడ ఇచ్చేసేవారు! మనం చెయ్య వలసిందల్లా ఆ రెండింటిలో ఒక అక్షరాన్ని ఎన్నుకోవాలి. ఇలాంటివి ఇరవై నిలువు ఆధారాలు, ఇరవై అడ్డు ఆధారాలు ఉండేవి. నింపడానికి సరదాగానే ఉండేది. ఇంటిల్లిపాదిమీ సహాయం చేసేవాళ్ళం. కాని, దాని తస్సాగొయ్యా, ఆ లాటరీలో ఎప్పుడు నెగ్గ లేదు. కాలేజీలో సంభావ్య సిద్ధాంతం చదువుకున్న తర్వాత తెలిసింది. ఇరవై అడ్డు ఆధారాలు, ఇరవై నిలువు ఆధారాలు ఉన్న ఆర్. ఎమ్. డి. సి. క్రాస్‌వర్డ్ పజిల్ గెలవడానికి సంభావ్యత ఒకటింట “2 ని 40 సార్లు వేసి గుణించగా వచ్చిన సంఖ్య” అంత! ఇంతకంటె కేలిఫోర్నియా లాటో గెలవడానికి సావకాశాలు ఎక్కువేమో.
పిఠాపురం గురించి ఇన్ని కబుర్లూ చెప్పి పిఠాపురం రాజా గారి గురించి మరికొంచెం చెప్పక పోతే బాగుండదు. ఈ ఊరుని వెలమ రాజులు పాలించే వారు. వీరు సాహిత్యాన్ని బాగా పోషించేరు. వింజమూరి సోమేశ (రాఘవపాండవీయం), వక్కలంక వీరభద్ర కవి (వాసవదత్తా పరిణయం), కూచిమంచి జగ్గ కవి, కూచిమంచి గంగన్న, దేవులపల్లి బాపన్న, పిండిప్రోలు లక్ష్మన్న, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి, దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, రెండవ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి,ప్రభృతులు పిఠాపురం ఆస్థానంలోని వారే! కాకినాడ లోని పిఠాపురం రాజా వారి కళాశాల పూర్వపు రోజుల్లో పేరున్న కళాశాలే; దరిమిలా ఆ పేరు లోని జిగి తగ్గింది అనుకోండి. నాన్నగారు పిఠాపురంలో ఉద్యొగం చేసే రోజులలోనే “ట్రంకు మర్డర్ కేసు” దర్యాప్తూ, విచారణా జరిగేయి. ఆర్. కె. కరంజియా నడిపిన “బ్లిట్జ్” వారపత్రిక ఆ రోజులలో ఉండి ఉంటే నానావతీ, అహూజాల కేసుకి వచ్చినంత సంచలనం దీనికీ వచ్చి ఉండేది. ఈ కేసులో పిఠాపురం రాజా వారి తాలూకు వారు ఎవరో ఇరుక్కున్నారు. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. రాజా వారికి కోపం వస్తే ఎక్కడ ఏమి ముప్పు వస్తుందో అని బయటకి మాట్లాడడానికి భయం! ఆస్తుల తగాదాలోనో, త్రికోణ ప్రేమాయణంలోనో ఎవ్వరో ఎవరినో (బట్టలు కుట్టే దర్జీని అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, ట్రంకు పెట్టెలో పెట్టేసి ఆ పెట్టెని కురదారోడ్డు పేసెంజరు లోనో హౌరా మెయిల్ లోనో ఎక్కించేసేరు. (ఆ రోజులలో పిఠాపురంలో మెయిలు బండి ఆగేది.) దరిమిలా రైలు బరంపురం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం బరంపురంలో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది. ఆ కేసుకి సంబంధించిన ఆస్తుల పంపకాల రాతకోతల కాగితాలు నాన్నగారు పిఠాపురం సబ్ రిజిస్ట్రారు కచేరీ నుండి బరంపురం కోర్టుకి పట్టుకు వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పవలసి వచ్చింది. ఈయనకి ప్రభుత్వం వారు పోలీసు ఎస్కార్టు ఇచ్చి మరీ పంపేరు. ఈ కథనం నాన్నగారు చెబుతూ ఉంటే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళంతా వచ్చి వాకట్లో కూర్చుని వినేవారు. సమయం, సందర్భం చూసుకుని ఈ కథ వివరంగా చెబుతాను.