ఆదివారం. మధ్యాహ్నం. వేళ రెండున్నర. గదిలో టెలిఫోను మోగింది.
“మీ కోసం ఇద్దరు వచ్చేరు. పైకి పంపమంటారా?”
“పంపండి.”
వారం రోజులబట్టీ హొటేలు గదిలో ఉంటున్నాను. ఊళ్ళో ఉన్న కళాశాలలో అతిథి ఆచార్యుడిగా పాఠాలు చెప్పటానికి వచ్చేను. తరగతిలో విద్యార్థులు హొటేలు గదికి రాత్రి పది లోపు ఎప్పుడైనా, అభిసారం లేకపోయినా, వచ్చి కలుసుకుని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని ప్రోత్సాహ పరచేను. కాబట్టి గదిలో ఉన్నంత సేపు వచ్చే పోయే విద్యార్థులతో నాకు కాలం గడవకపోవటం, తోచకపోవటం అంటూ లేదు.
ఇద్దరు వ్యక్తులు తెరచి ఉంచిన తలుపు దగ్గర నిలబడి లోపలికి రావటానికి తటపటాయిస్తున్నారు. లోనికి రమ్మని ఆహ్వానించేను. వయస్సు లోనూ, వాలకం లోనూ నా తరగతిలో ఉన్న విద్యార్థులులా లేరు. ప్రశ్నార్థకంగా చూసేను.
“అయ్యా! ప్రొఫెసర్ దివాకర్గారి కోసం వచ్చేం.” అన్నాడు ఆగంతకులలో చిన్నవాడు.
“నేనే దివాకర్‌ని, లోపలికి రాండి.”
“నన్ను చంద్రం అంటారండి. నేను ఇక్కడ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగులో పిఎచ్. డి. పట్టా కోసం పరిశోధనా పత్రం రాస్తున్నాను – ‘మన మూఢనమ్మకాల వెనక ఉన్న శాస్త్రీయత’ అన్న అంశం మీద. దిశా నిర్దేశం చెయ్యటంలో మీ సహాయం కోరి వచ్చేను.”
“నేను ఆ రంగం వాడిని కాదే. మీకు నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను?”
“మీరు రాసే వైజ్ఞానిక కల్పనలంటే నాకు చాల ఇష్టం.” పక్కనున్న పెద్దాయన అందుకున్నారు. “నన్ను డాక్టర్ రవిచంద్ర అంటారు. చంద్రం వరసకి నాకు మేనల్లుడు అవుతాడు. ఇతని పరిశోధనకి మీరే మంచి దిశానిర్దేశకులన్న నమ్మకంతో – మీరు ఈ ఉళ్ళో ఉన్నారని తెలిసి – తీసుకువచ్చానండి.”
నేను రాసిన ఒక కథలో తిరుపతిని కేంద్ర బిందువుగా వాడుకున్నాను. ఆ కథని ఉదహరించి, ఆ కథ వైద్యపరంగా తనకి ఎందుకు నచ్చిందో టూకీగా వివరించి, నాకు చేతనయిన సహాయం చెయ్యమని అడిగేరు, డాక్టర్ రవిచంద్ర.
“నమ్మకం అనేది సాపేక్ష భావం. శాస్త్రీయమైన రుజువు దొరకనంతసేపూ అన్నీ మూఢనమ్మకాలే! అవునా?” అని సమాధానం కోసం ఆగకుండానే, “ఒక గంటలో మరొకరు వస్తున్నారు. వారొచ్చే లోగా నా చిన్ననాటి సంఘటన ఒకటి చెబుతాను. విన్న తరువాత ఆ కథనంలో మూఢం ఏదో, శాస్త్రం ఏదో ఆలోచించండి. ఏమంటారు?”
“చెప్పండి!” ఇద్దరూ ఏకకంఠంతో అన్నారు.
జీడిపప్పు పకోడీలు, కాఫీ పైకి పంపమని హొటేలు వారికి టెలిఫోనులో చెప్పి, “అయితే చెబుతాను, అలా కూర్చోండి. ఇది ఎప్పుడో 1950 దశకపు ఉత్తరార్ధంలో జరిగిన సంఘటన,” అని మొదలెట్టాను.
సూర్యం, గోపాలకృష్ణ, నాగముని గిండీ కాలేజీ హాస్టల్లో కలిసి ఉండేవారు. చదువు పూర్తి చేసి ఎవరి ఇళ్ళకి వారు వెళ్ళేరు. వాళ్ళు ఇళ్ళు చేరేరో లేదో వెనువెంటనే ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం వారి నుండి ఉత్తరాలు వచ్చేయి.
బళ్ళారి దగ్గర హొళగొంది అనే కుగ్రామం వచ్చి ఉద్యోగంలో చేరమని విశాఖ ప్రాంతాల్లో నివసించే సూర్యాన్ని అడిగేరు. తుంగభద్ర డ్యామ్‌కి కాలువలు తవ్వించవలసిన పని. ఇంట్లో ఉన్న అట్లాసు తీసి చూస్తే బళ్ళారి కనిపించింది కాని హొళగొంది కనపడలేదు. ప్రభుత్వం వారు ఉద్యోగం ఇస్తూ రాసిన ఉత్తరంలో ఆ హొళగొంది ఎక్కడ ఉందో చెప్పలేదు కాని బళ్ళారిలో రైలు దిగి, అక్కడ డివిజనల్ ఇంజనీరు ఆఫీసుకి వెళితే వారు దారి చెపుతారని మాత్రం ఉంది. ఇటువంటి దైవోపహతమైన ప్రదేశాలనే మనం తెలుగులో వెటకారానికి ‘శంకరగిరి మన్యాలు’ అంటాం. బొద్దింకలు, తేళ్ళు, మండ్రగబ్బలు వగైరాలు వీరవిహారం చేసే ప్రదేశం అది. గోపాలకృష్ణది కృష్ణా జిల్లా. అతని ఉద్యోగం డుడుమా జలపాతం దగ్గర కడుతూన్న జలవిద్యుత్ డ్యామ్ దగ్గర. విశాఖపట్నంలో రైలు దిగి, పాడేరు, చింతపల్లి మీదుగా మాచ్‌ఖండ్ చేరుకోమని అతనికి వచ్చిన ఉత్తర్వులో ఉంది.
పోతే నాగమునిది బళ్ళారి. అతనిని డెహరాడూన్లో భారతీయ వాయుదళాలలో ఇంజనీరుగా ఎంపిక చేసేరు. తునిలో రైలెక్కి మదరాసులో దిగటం వరకే తెలుసున్న సూర్యానికి బళ్ళారి నైసర్గిక స్వరూపం తెలియదు. కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగిన గోపాలకృష్ణ విశాఖ జిల్లా వైపు ఎప్పుడూ రాలేదు. నాగమునికి రాయలసీమ సంగతే పూర్తిగా తెలియదు. వీరు ముగ్గురూ ఉత్తరాల ద్వారా ఒకరినొకరు సంప్రదించుకున్నారు.
“ముందు మా ఇంటికి వచ్చి మకాం పెట్టేవంటే ఇక్కడ నుండి మన్యప్రాంతమైన మాచ్‌ఖండ్ వెళ్ళటంలోని సాధకబాధకాలు మావాళ్ళు నీకు చెబుతారు,” అంటూ గోపాలకృష్ణకి సూర్యం ధైర్యం చెప్పి, మూటా, ముల్లె సర్దుకుని బళ్ళారి ప్రయాణం అయేడు. నాగముని, విధవరాలైన తల్లిని బళ్ళారిలో ఒంటరిగా వదిలేసి, డెహరాడూన్ వెళ్ళిపోయేడు.
సూర్యం ఇలా వెళ్ళేడో లేదో, గోపాలకృష్ణ పెట్టె, పరుపుచుట్టతో హౌరా మెయిల్లో దిగి, బండి కట్టించుకుని ఇంటికి చక్కా వచ్చేడు. మంచి కలుపుగోలు మనిషేమో ఇంట్లో ఉన్న ఇంటిడు పిల్లలకి ఆప్తుడయిపోయేడు. రామయ్యగారికీ, సీతమ్మగారికీ బళ్ళారి వెళ్ళిపోయిన కొడుకు సూర్యం స్థానంలో గోపాలకృష్ణ కనిపించేడే తప్ప ఏమీ భారం అనిపించలేదు. సీతమ్మగారు పుట్టి, పెరిగిన ఊరు మాడుగుల అవటంతో ఆ మన్యపు ప్రాంతాల గురించి ఆమెకి బాగా తెలుసు.
“మరిగించకుండా నీళ్ళు తాగొద్దు. మన్యంలో దొరికే పళ్ళు – ఘుమఘుమలాడుతూ ఎంత ఆకర్షణీయంగా కనిపించినా సరే – తినొద్దు. దోమతెర వేసుకోకుండా పడుకోవద్దు,” అని తీసుకోవలసిన ఎన్నో జాగ్రత్తలు చెబుతూ, ఒక్కొక్క పొట్లంలో చిటికెడు పసుపు పొడి వేసి పొట్లాలు కట్టి, “ప్రతి రోజూ, వేడి అన్నం పట్టెడు తీసుకుని, పిడచకట్టి, అందులో పొట్లం పసుపు వేసి, దానిని తిన్న తరువాతే మిగతా భోజనం చెయ్యి నాయనా. మన్యపు జ్వరం నీ దరిదాపులకి రాదు,” అంటూ రెండు నెలలకి సరిపడా పసుపు పొట్లాలు, దినుసులు మూటలు కట్టి అతనిని సాగనంపింది.
“ఇప్పుడంటే పసుపు ఆరోగ్యానికి మంచిదనీ, కేన్సరు రాకుండా అడ్డుకుంటుందనీ అమెరికాలో ఒప్పుకుంటున్నారు కాని, అప్పుడూ, ఇప్పుడూ పసుపు తినటానికి, మలేరియాకి సంబంధం ఏమిటో ఎవ్వరూ పరిశోధనలు చేసినట్లు లేదండి,” అన్నారు డాక్టర్ రవిచంద్ర.
సూర్యం స్పురద్రూపి. దబ్బపండు లాంటి శరీర ఛాయ. విశాలమయిన నుదురు. తీర్చి దిద్దినట్లున్న కనుముక్కు తీరు. గిండీ కాలేజి హాస్టల్ భోజనం బాగుండేదేమో, పిల్లాడు నిగనిగలాడుతూ, చూడముచ్చటగా ఉండేవాడు. ఇటువంటి ముక్కుపచ్చలారని కుర్రాడిని రాయలసీమ రాళ్ళ మధ్య, ఆ హొళగొందిలో, తిండీ తిప్పలు లేని అడవిలో, మండుటెండలో సర్వే చెయ్యమని పంపితే ఎలా తాళుకోగలడు?
ఉద్యోగం రాటుపోట్లకి అలవాటు పడ్డాడు కాని తిండి సదుపాయం లేక ఇబ్బంది పడేవాడు. తల్లి సంరక్షణలోనూ, అప్పచెల్లెళ్ళ చాటున పెరిగినవాడు కాబట్టి కనీసం కాఫీ కాచుకోవటం కూడ నేర్చుకోలేదు. హొళగొందిలో హొటేలు సదుపాయాలు కూడ లేవు. బళ్ళారి వచ్చినప్పుడు మాత్రం ఏ డాక్ బంగళాలోనో పడుక్కుంటే లాస్కర్ కేరేజీతో భోజనం పట్టుకొచ్చేవాడు. అందుకని ఆఫీసు పని కల్పించుకుని తరచు బళ్ళారి వచ్చేవాడు – భోజనం కోసం.