పంచేంద్రియాలు: 3 వినికిడి

కన్నా? చెవా? ఏది ముఖ్యం?

జ్ఞానేంద్రియాలలో ఏది ముఖ్యమైనది అన్న ప్రశ్న పుట్టినప్పుడు కన్ను (చక్షురింద్రియం) కంటె చెవి (శ్రవణేంద్రియం) ఎక్కువ ముఖ్యం అని వాదించేవాళ్ళు లేకపోలేదు! చెవి ఒక్క వినికిడినే (hearing) కాకుండా మన శరీరపు తౌల్యాన్ని (balance) నియంత్రించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది కనుక శ్రవణేంద్రియం ఎక్కువ “ముఖ్యం” అవునో కాదో నేను తేల్చి చెప్పలేను కానీ చూపు కంటే వినికిడి ఎక్కువ “శక్తివంతం” అని వాదించడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. శ్రవణేంద్రియంతో తౌల్యాన్ని సాధించడంతోపాటు చప్పుళ్ళు వినగలడం మూలంగా చీకటిలో కూడా ప్రమాదాలని గుర్తించగలం, మాటలు వినగలడం వల్ల చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోగలం, సంగీతం వినగలడమే కాకుండా, ఆ స్వరాలలో ఉన్న తేడాలు – సూక్ష్మ భేదాలతోపాటు – గుర్తించి ఆనందించగలం.

మన పరిసరాలని ఆకళింపు చేసుకోవడంలో కన్ను కంటే చెవి ఎక్కువ జోరుగా పని చేస్తుందంటే నమ్మగలరా? సూక్ష్మగ్రాహ్యతలో కూడా కన్ను కంటే చెవి మిన్న! చెవితో విన్న మాటలు బోధపడినంత జోరుగా కంటితో చూసిన వాక్యాలు, దృశ్యాలు అవగాహన కావు. అందుకే కాబోలు గురుముఖంగా విద్య నేర్వాలంటారు! ఒక దృశ్యాన్ని చూసి అర్థం చేసుకునే సమయంలో ఏడెనిమిది మాటలు విని అర్థం చేసుకోవచ్చు! మాటని విని అర్థంచేసుకోవడమే కాకుండా, ఆ మాటలోని తూగు ఆధారంగా ఆ మాటని ప్రేరేపించిన మానసికావస్థని కూడా ఆకళింపు చేసుకోగలం. మనం ప్రేమించేవారి గొంతుక విన్నప్పుడు, ఆహ్లాదకరమైన సంగీతం విన్నప్పుడు కలిగే రసోత్పాదన అనుభవైకవేద్యం.

మానవుడికి, మృగానికి మధ్య ఉన్న అతి ముఖ్యమైన తేడా మాట్లాడగలిగే శక్తి! మరొకరు మాట్లాడినప్పుడు అది వినగలిగే శక్తి, విన్నది అర్థం చేసుకుని స్పందించగలిగే శక్తి లేనప్పుడు మనిషికీ మృగానికి మధ్య అంతరం తగ్గినట్లే కదా! ఇంకా నమ్మకం కుదరలేదా? మన భాషలలో ప్రయోగం ఒకటి చూద్దాం. లేటిన్ భాషలో surdus అంటే “మూగ, చెవుడు” (“deaf and mute”) అని అర్థం. సంస్కృతాన్ని తెలుగులోకి మార్చినప్పుడు డు, ము, వు, లు తగిలించినట్లే ఈ లేటిన్ surdus అరబ్బీ భాష లోకి వెళ్లి “ab surd” అయి, అక్కడనుండి ఇంగ్లీషులోకి వచ్చి “absurd” అయింది. ఈ భాషా ప్రయాణం యొక్క అంతరార్థం ఏమిటంటే చెవిటివారు ఈ ప్రపంచం తీరు తెన్నులు అర్థం చేసుకోలేరు. ఇదే “ఉపనిషత్సారాన్ని” ఇంగ్లీషు కవి కీట్స్ “Heard melodies are sweet, but those unheard/ Are sweeter,” అంటాడు. “వినిపించని రాగాలే, కనిపించని అందాలే…” అంటాడు మన తెలుగు సినీ కవి.

మనవుల మాటలు, మానవుల పాటలు, పక్షుల కిలకిలారావాలు, సెలయేళ్ళ గలగలలు, ఝరీజలపాతాల రొదలు, సముద్రాల హోరు మనల్ని ముంచెత్తి పునీతం చేస్తూ ఉండకపోతే ఆ నిశ్శబ్దవాతావరణం భరించగలమా? రోదసి లోతుల్లో అంతా శూన్యమే కనుక అంతా నిశ్శబ్దమే, కానీ ఈ నేల మీద కదిలేవీ, కదిలించేవీ, అన్నీ చప్పుడు చేస్తాయి. జోలపాట పాడే తల్లి గొంతుక వింటూ పసిపాప హాయిగా నిద్రపోతుంది. గణతంత్ర దినోత్సవంలో రామచంద్ర రాసిన “ఆయే వతన్ కె లోగో…” అనే పాటని లత ఆలాపించి పాడుతూ ఉంటే విని, హ్రదయం ద్రవించి, కన్నీరు కార్చని భారతీయుడు ఉంటాడా? రోడ్లమీద కూలీలు పాడే “హైలేసా, హైలెస్సా …. “ వంటి పాటలలోను, నావికులు పడవలను నడుపునప్పుడు ఉత్సాహము కొరకు పాడే “జోర్ సెయ్ బార్ సెయ్/ కోరంగి రేవుకెయ్/ కోటిపల్లి రేవుకెయ్యి” వంటి పాటలలోను, దంపుడు పాటలలోనూ ఉన్న లయబద్ధత కష్టాన్ని మరపింపజేస్తాయి. ప్రయోగశాలలో నిశ్శబ్దంగా మండే “బన్ సెన్ బర్నర్” మంట కంటే చిటపటలాడుతూ, ఫెళఫెళమంటూ మండే భోగి మంట బాగుండదూ? అయినప్పటికీ చూపుకి, వినికిడికి మధ్య ఏదో ఒక్కటే ఎంచుకోవలసిన దుస్థితి ఎదురైతే ఎక్కువమంది వినికిడిని పోగొట్టుకోడానికే మొగ్గు చూపుతారు.

ఈ సృష్టి జంగమాత్మకం. సృష్టిలో కదలిక సర్వవ్యాప్తం. కదలిక శబ్దానికి జన్మస్థానం. మన శబ్దగ్రహణ యంత్రాంగం మనకీ జంగమాత్మకమైన కదలికకీ మధ్య ఒక వంతెన! ఒడలిని పులకరించే ఒక పలకరింపు, ఒక హితోపదేశం, చల్లగాలిలో రెపరెపలాడే ఆకుల గలగలలు, అకస్మాతుగా మరకట్టు పడడం వల్ల కీచుమని శబ్దం చేస్తూ కారు ఆగిన చప్పుడు, …., ఇవన్నీ కదిలే ప్రపంచంతో మనకి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తాయి.

వినడం అనే క్రియ జరుగుతూన్నప్పుడు “శబ్ద ప్రక్రియాపన” (sound processing) కార్యక్రమంలో అవసరమైన వాకేతాలని (signals) పనికిమాలిన వాకేతాల నుండి వడగట్టడం ఒక ముఖ్యమైన అంశం. దీనిని వరణాత్మక సంవేదనం (selective perception) అంటారు. ఉదాహరణకి రద్దీగా, రొదతో నిండిన రైలు స్టేషన్ లో మనకి కావలసిన బండి గురించి చేసే ప్రకటన మనకి వినిపిస్తుంది! ఇది పనికొచ్చే శబ్దం. చెవికి చేరే పనికిరాని శబ్దాలన్నీ మెదడులో నమోదు అయితే మనకి పిచ్చెక్కిపోతుంది!

ఒకప్పుడు వినికిడి శక్తి మనల్ని క్రూరజంతువుల బారి పడకుండా రక్షించింది. ఇప్పుడు కారు ప్రమాదాలనుండి రక్షిస్తోంది. ఆసన్నమవుతూన్న ప్రమాదాల గురించి హెచ్చరికలు చేసే శబ్దాలు మనకి నిద్దట్లో కూడా వినిపిస్తాయి! అందుకనే ఆసన్నమవుతూన్న ప్రమాదాల గురించి ప్రజలని హెచ్చరించే సందర్భాలలో శబ్ద సంకేతాలనే ఎక్కువగా వాడతారు.

చెవి పని చేసే తీరు

శ్రవణ సంవేదనం (auditory sense) అంటే చప్పుడు ఉందని గుర్తించగలడం, దానికి అర్థాన్ని ఆపాదించగలడం. ఈ పని చెయ్యడానికి శ్రవణ వ్యవస్థ (auditory system) అవసరం. మానవుడికి ఉన్న ఇటువంటి శ్రవణ వ్యవస్థలో మూడు భాగాలు ఉన్నాయి: బయటిచెవి, మధ్యచెవి, లోపలిచెవి. శబ్దం పుట్టినప్పుడు దాని జనక స్థానం చుట్టూ ఉన్న గాలిలో పీడనం మారుతూ ఉంటుంది. ఈ మార్పు తరంగాల రూపంలో గాలిలో ప్రసరిస్తుంది. ఇలా గాలిలో ప్రయాణం చేస్తూన్న కెరటాలు బయటిచెవిలో (auricle) ప్రవేశించి, మూడున్నర సెంటీమీటర్లు పొడుగున్న శ్రవణ నాళం (ear canal, or auditory canal) గుండా ప్రయాణించి, ఆ చివర అడ్డుగా ఉన్న కర్ణభేరిని (eardrum, గూబ) తాకి, దానిని ప్రకంపనలకి గురి చేస్తుంది.

చప్పుడు ఏ దిశ నుండి వస్తున్నాదో పసిగట్టడానికి బయటిచెవి ఆకారం కొంతవరకు, రెండు చెవులు ఉండడం కొంతవరకు, దోహదపడతాయి. చప్పుడు ఎటునుండి వస్తున్నాదో ఎలా తెలుస్తుంది? గాలిలో శబ్ద తరంగాలు ప్రయాణించే వేగం సెకండుకి 343 మీటర్లు. ఉదాహరణకి ఎడం పక్క నుండి వచ్చే శబ్దం ఎడమ చెవిని ముందు తాకుతుంది. ఎంత ముందు? పది మైక్రోసెకండ్లు ముందు! ఈ తేడా చాలు శబ్దం ఎటునుండి వస్తున్నాదో నిశ్చయించడానికి. పైపెచ్చు ఆ శబ్దం ఎడమ చెవిలో ఎక్కువ బిగ్గరగా వినిపించడం కూడా ఈ నిశ్చయానికి సహాయపడుతుంది.

శబ్దం ఏ ప్రదేశం నుండి వస్తున్నాదో నిర్దేశించడానికి – అనగా పై నుండా, కిందనుండా, ఎడమ నుండా, కుడి నుండా – బయటచెవి ఆకారం కీలకం. ధ్వని తరంగాలు దొర్లుకుంటూ వచ్చి చెవిని తాకినప్పుడు సముద్రపు కెరటాలు ఒడ్డున ఉన్న రాళ్ళని కొట్టుకున్నట్లు ఉంటుందని ఊహించుకోవచ్చు. కనుక ధ్వని కెరటాలు ఏ కోణంలో చెవిని తాకుతున్నాయో దానిని బట్టి అవి చెవి ముందు విరిగి చెల్లాచెదరు అయిన తరువాతే అవి శ్రవణ నాళంలో ప్రవేశిస్తాయి. ఇక్కడ ఒక స్ఫురణ ప్రయోగం (thought experiment) చేసి చూడవచ్చు. మచ్చుకి ముఖానికి ఎదుట, కనుబొమల మట్టానికి 45 డిగ్రీలకి ఎగువన ఒక చిటిక వేసి ఆ చప్పుడు శ్రవణ నాళంలో ఎలా వినిపిస్తోందో అని ఒక బుల్లి మైక్రోఫోన్ సహాయంతో కొలిచి చూసేమనుకొండి. మనం వేసిన చిటికలో సుద్ద స్వరం (pure note) ఉండదు; అనేక స్వరాలు మిళితమై ఉంటాయి. కానీ ఈ స్వరాలు అన్నీ ఒకేలా వినబడవు; కొన్ని బిగ్గరగా వినిపిస్తాయి, కొన్ని నీరసంగా వినిపిస్తాయి. ఇప్పుడు మన చిటికని మరొక స్థానంలో వేసేమనుకొండి. ఇప్పుడు వేరొక స్వరం బిగ్గరగా వినిపిస్తోంది. ఈ తేడాని ఆధారంగా చేసుకుని శబ్దం యొక్క జనకస్థానాన్ని చెవి గుర్తు పడుతుంది.

గూబకు అవతల పక్కనే మధ్యచెవిలో ఉన్న కర్ణభేరీ కుహరంలో (tympanic cavity) మూడు సూక్ష్మాస్థులు (ossicles) ద్వారా బయటనుండి వచ్చిన ఈ ప్రకంపనలు కాసింత వృద్ధి చెంది, లోపలిచెవిలో నత్తగుల్ల ఆకారంలో ఉన్న కర్ణావృత్తము (cochlea) అనే అస్థివ్యవస్థని తాకినప్పుడు ఆ కదలికలో ఉన్న యాంత్రిక శక్తి (mechanical energy), దరిదాపు 30,000 శబ్దగ్రాహక కేశ కణాల సహాయంతో నాడీ-విద్యుత్ వాకేతాల (neuro-electrical signals) రూపం సంతరించుకుని కంబునాడి (cochlear nerve, auditory nerve, or acoustic nerve) ద్వారా మెదడుని చేరుకుంటాయి. అలా చేరుకున్న సంవేదనాత్మక సమాచారానికి (sensory information) మెదడు భాష్యం చెబుతుంది. అనగా, బయట పుట్టిన చప్పుడు మనకి “వినపడి” దాని కథా, కమామీషూ అర్థం అవుతాయి.
మన కళ్ళల్లో ఉరమరగా 300 మిలియను కాంతికి స్పందించే కణాలు ఉంటే మన చెవులలో కేవలం 30,000 శబ్దానికి స్పందించే కేశ కణాలు ఉన్నాయి. గాయానికి కారం అద్దినట్లు మనం పుట్టినది లగాయతు ఈ శబ్దగ్రాహక కణాలని ఒకటీ ఒకటి చొప్పున పోగొట్టుకుంటూనే ఉంటాం!! అందుకనే వయస్సు మీరుతూన్న కొద్దీ వినికిడి శక్తి తగ్గిపోతుంది.

మధ్యచెవిలో ఉన్న ఖాళీ స్థలంలో మూడు సూక్ష్మాస్థులతో పాటు గాలి కూడా ఉంటుంది. ఆ ఖాళీ స్థలాన్ని గొంతుకతోటీ, ముక్కుతోటీ కలుపుతూ ఉండే గొట్టాన్ని కంఠకర్ణనాళం (Eustachian tube) అంటారు. విమానం గాలిలోకి ఎగిరినప్పడు బయట గాలి పీడనం తగ్గుతుంది కానీ మధ్యచెవిలో ఉన్న ఖాళీ స్థలంలో తగ్గదు. అందువల్ల కర్ణభేరి మీద ఒత్తిడి పెరిగి చెవిలో నొప్పి వస్తుంది. అప్పుడు ఏదైనా చప్పరించినా, నమిలినా, మింగినా కంఠకర్ణనాళం గుండా బయటి గాలి లోపలికి వెళ్లి పీడనంలో తుల్యతని సాధిస్తుంది. అప్పుడు నొప్పి తగ్గుతుంది. అందుకనే విమానం బయలుదేరేముందు చప్పరించడానికి పంచదార బిళ్ళలు పంచిపెడతారు.

ప్రకృతిలో పుట్టిన శబ్దాలన్నీ మానవుడి చెవులకి వినపడవు; ఒక అవధికి మించని పరిధిలో ఉన్న శబ్దాలే వినబడతాయి. శబ్దాలు గాలిలో తరంగాల మాదిరి ప్రవహిస్తాయి. ఈ తరంగాలని వర్ణించడానికి రెండు భౌతిక కొలమానాలు వాడతారు: డోలన పరిమితి (amplitude), తరచుదనం (frequency). ఉదాహరణకి సప్త స్వరాలలో “స” యొక్క శబ్ద తరంగం తరచుదనం 256 Hz దగ్గర ఉంటుంది. (ఇక్కడ 256 Hz అంటే ఒక సెకండు కాల వ్యవధిలో 256 సార్లు శబ్ద తరంగం పైకీ కిందకీ లేచి పడుతుంది అని అర్థం. అనగా, సెకండు కాల వ్యవధిలో ఇమిడే ఆవృత్తులు = 256.) మగవాడు మాట్లాడేటప్పుడు సాధారణంగా 100 Hz, ఆడవారు మాట్లాడేటప్పుడు 150 Hz, శబ్ద తరంగాలు పుడతాయి. మానవుల చెవులకి 20 Hz – 20,000 Hz మధ్యలో ఊగిసలాడే తరంగాల వల్ల పుట్టిన శబ్దాలే వినబడతాయి. శబ్ద తరంగాల తరచుదనం 20 Hz కంటే తక్కువ ఉంటే వాటిని అధోశబ్దాలు (infrasounds) అనిన్నీ, 20,000 Hz కంటే ఎక్కువ ఉంటే వాటిని ఊర్ధ్వశబ్దాలు (ultrasounds) అంటారు. అదృష్టవశాత్తు అధోశబ్దాలు (తక్కువ తరచుదనం ఉన్న శబ్దాలు) మనకి వినబడవు. అవి వినబడేటట్లయితే మన శరీరం చేసే చప్పుళ్ళు (రక్త ప్రవాహం, గుండె కొట్టుకోవడం, వగైరా) వినేసరికి మనకి పిచ్చెక్కిపోతుంది. అదే విధంగా ఊర్ధ్వశబ్దాలు కూడా మనకి వినబడవు.

శబ్ద తరంగాల డోలన పరిమితి ఎంత ఎక్కువగా ఉంటే శబ్దం అంత బిగ్గరగా వినబడుతుంది. ఈ ధ్వని తీవ్రతని కొలవడానికి డెసిబెల్ (decibel) అనే కొలమానాన్ని వాడతారు. గుసగుసల ధ్వని తీవ్రత 30 డెసిబెల్ ఉంటుంది, మామూలుగా మాట్లాడుతూన్నప్పుడు 60, వంటగదిలో మిక్సీ తిరుగుతూన్నప్పుడు 80, పాశ్చాత్య దేశాలలో కొన్ని రకాల సంగీత కచేరీలు (hard rock concerts) లో 115 డెసిబెల్ (గూబలు బద్దలయేటంత బిగ్గరగా) ఉంటాయి. ఈ రకం శబ్ద దూషణకి గురయినప్పుడు చెవుల శబ్దగ్రహణ శక్తి పాడవుతుంది. దీనికి తోడు మనలో చాలామంది మన చెవులని ఎలా అక్రమంగా దుర్వినియోగం చేస్తామో చెబుతాను. చెవిలో చీపురుపుల్లలు, పెన్సిలు ములుకులు పెట్టి కెలకడం నేను చూసేను.

శబ్ద తరంగాలకి, కాంతి తరంగాలకి మధ్య కొన్ని విషయాలలో పోలికలు ఉన్నా వాటి మధ్య మౌలికంగా తేడాలు ఉన్నాయి. కాంతి తరంగాలు అన్నీ మానవుల కళ్ళకి కనబడవు. శబ్ద తరంగాలు అన్నీ మానవుల చెవులకి వినబడవు. కాంతి తరంగాలలో మన కంటికి కనబడని అత్యారుణ (infrared) తరంగాలు, అతినీలలోహిత (ultraviolet) తరంగాలు ఉన్నట్లే శబ్ద తరంగాలలో మన చెవులకి వినబడని అధోశబ్ద (infrasound) తరంగాలు, ఊర్ధ్వశబ్ద (ultrasound) తరంగాలు ఉన్నాయి. కాంతి తరంగాలలో వర్ణమాల (light spectrum) ఉన్నట్లే శబ్ద తరంగాలతో శబ్దమాల (sound spectrum) ఉంది.

వయస్సు పెరిగే కొద్దీ మనందరికీ ఎక్కువ తరచుదనం ఉన్న శబ్దాలు వినపడడం తగ్గిపోతుంది. మగవాడు మధ్య వయస్సు చేరుకునేసరికి అతని కేశ కణాలలో 40శాతం పని చెయ్యడం మానేస్తాయి. అందుకనే కాబోలు ఆడవారి గొంతుకలో ఎక్కువ తరచుదనం ఉన్న స్వరాలు సహజంగా ఎక్కువ కనుక మధ్యవయస్సు చేరుకునేసరికి భార్య చెవిలో ఇల్లుకట్టుకుని పోరినా భర్తకి వినిపించవు!

3. చెవులకి వచ్చే ఆరోగ్య సమస్యలు

3a వినికిడి లోపం, చెవుడు

మనం సాధారణంగా తెలుగులో “చెవుడు” అనే మాటని ఇంగ్లీషు మాట deafness కి సమానార్థకంగా, అజాగ్రత్తగా, వాడేస్తూ ఉంటాం కానీ చెవుడు (deaf) అంటే బొత్తిగా వినిపించకపోవడం! అనగా బ్రహ్మ చెవుడు. మనకి సర్వసాధారణంగా తారసపడే సమస్యని “వినికిడి లోపం” (hardness of hearing) అనాలి. వినికిడి లోపం ఉన్నవాళ్ళకి అన్ని సందర్భాలలోనూ, అన్ని మాటలూ సరిగా వినపడవు. ఈ రకం వినికిడి లోపాన్ని మందులతోటి కానీ, శస్త్ర చికిత్సతో కానీ సరిదిద్దవచ్చు. బ్రహ్మ చెవుడు ఉన్నవారు సైగ భాష (sign language) మీద ఆధారపడవలసిందే!

వినికిడి లోపానికి ముఖ్యంగా రెండు కారణాలు. (1) సంవేదనాత్మకనాడీ వినికిడి లోపం (Sensorineural Hearing Loss). ఇది లోపలిచెవిలో నత్తగుల్ల ఆకారంలో ఉన్న కర్ణావృత్తము (cochlea) అనే అస్థివ్యవస్థకి కానీ, అక్కడనుండి మెదడుకి వార్తలని మోసుకుపోయే కంబునాడికి (auditory nerve) కానీ సంబంధించిన సమస్య. ఇలా నష్టపోయిన శబ్దగ్రహణ శక్తిని సులభంగా పునరుద్ధరించడం కుదరదు. వారు వినికిడి జోళ్ళు (hearing aids) కానీ, కంబు నాటులు (cochlear implants) కానీ వాడాలి. ఈ రెండూ కాకుండా ఇతర కారణాలు ఉండొచ్చు. జన్యులోపం కారణం అయినా అవొచ్చు. (2) వాహక వినికిడి లోపం (Conductive Hearing Loss). బయట పుట్టిన శబ్దం బయటచెవి నుండి మధ్యచెవి లోకి, అక్కడనుండి లోపలిచెవి లోకి వెళ్లే మార్గంలో శబ్దప్రవాహానికి ఏదో అవరోధం ఏర్పడడం వల్ల వచ్చే సమస్య ఇది. చెవిలో గులిమి (earwax) అతిగా ఏర్పడడం వల్ల కాని, కర్ణభేరి చిరిగిపోవడం వల్ల కాని, మధ్యచెవిలో ఉన్న సుత్తి (malleus), దాగలి (incus), రికాబు (stapes) అనబడే మూడు బుల్లి ఎముకల కదలికలో లోపం కానీ ఈ సమస్యకి కారణం కావచ్చు. ఇలా నష్టపోయిన శబ్దగ్రహణ శక్తిని పునరుద్ధరించడానికి మందులు ఉన్నాయి, శస్త్రవైద్యం ఉంది.

3b మధ్యచెవి లోని ఎముకలలో కదలిక నశించి గట్టిపడిపోవడం (Otosclerosis)

లేటిన్ భాషలో oto అంటే చెవికి సంబంధించిన అనిన్నీ, sclerosis అంటే శరీరంలోని కణజాలం మృదుత్వం కోల్పోయి గట్టిపడడం అనిన్నీ అర్థం. మన మధ్యచెవిలో కదలాడే మూడు బుల్లి ఎముకలు ఉంటాయని చెప్పుకున్నాము కదా. ఈ మూడు ఎముకలు ఒకదానితో మరొకటి లంకె పడి, ఒక చయనిక (chain) లా పని చేస్తూ, శబ్దానికి స్పందించే కర్ణభేరి కదలికని లోపలి చెవిలో నత్తగుల్ల ఆకారంలో ఉన్న కర్ణావృత్తము అనే అవయవానికి చేరవేస్తాయి. పిల్లలు ఎదిగే సమయంలో ఈ బుల్లి ఎముకలు కూడా ఎదుగుతాయి. ఈ ఎదుగుడులో అవకతవకలు (జన్యులోపం వల్ల కావచ్చు) ఏర్పడి అప్పుడప్పుడు ఈ ఎముకలు ఎక్కువ జోరుగా ఎదుగుతాయి. అప్పుడు తుప్పు పట్టిన లంకెల గొలుసులో కదలిక నశించినట్లు ఈ మూడు ఎముకల మధ్య కదలిక నశిస్తే దానిని Otosclerosis అంటారు. ఈ కదలిక లేకపోవడం వల్ల బయట నుండి వచ్చే శబ్ద తరంగాలు లోపలి చెవిని చేరుకోలేవు. ఈ జబ్బు 1శాతం ప్రజలలో ఉందని ఒక అంచనా ఉంది.

శస్త్రవైద్యం చేసి, అతిగా పెరిగిన ఈ ఎముకలని “గోకి” కదలికని పునస్థాపించవచ్చు. ఈ పద్ధతిని mobilization of stapes అంటారు. లేదా stapes అనే బుల్లి ఎముకని (ఇది శరీరంలో అత్యంత చిన్నదైన ఎముక, బియ్యపుగింజ అంత ఉంటుంది.) తీసేసి, దాని స్థానంలో టెఫ్లాన్ తో చేసిన తీగని అమురుస్తారు. ఈ పద్ధతిని “స్టేపిడెక్టమీ” అంటారు.

3c చెవులలో తిష్ఠ (Ear infection or Otitis Media)

మధ్య చెవిలో సూక్ష్మజీవులు కానీ విషాణువులు (viruses) కానీ చిక్కుకుని తిష్ఠ వేసినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. ఇది సాధారణంగా చిన్నపిల్లలలో వస్తుంది. వచ్చినప్పుడు చెవి కాసింత ఎర్రబడడం, జ్వరం రావడంతో పాటు పిల్లలు చెవి పట్టుకుని ఏడుస్తారు. దీనికి తక్షణ పరిష్కారం “ఏంటీబయాటిక్స్” తో ఇంగ్లీషు వైద్యం చేయించడం. అశ్రద్ధ చేస్తే ఉత్తరోత్తర్యా వినికిడి లోపం కలిగే ప్రమాదం ఉంది! టైఫాయిడ్ వంటి జ్వరాల వల్ల కూడా వినికిడి శక్తి పోయే ప్రమాదం ఉంది.

3d కంఠకర్ణనాళం (Eustachian tube) సరిగ్గా పని చెయ్యకపోవడం.

మధ్యచెవిని గొంతుకని కలుపుతూ ఉండే గొట్టంలో రకరకాల చెత్త చేరి గాలి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడడం. దీని వల్ల చెవిపోటు రావచ్చు, చెవిలో దిబ్బడ వేసిన అనుభూతి కలగొచ్చు, శబ్దాలు ఖణిగా వినబడకపోవచ్చు, చెవిలో హోరు, టిక్ టిక్ మనే చప్పుళ్ళు మొదలైన లక్షణాలు (tiinitis) కనబడవచ్చు.

3e టిన్నిటిస్ (Tinnitis)

చెవిలో రకరకాల చప్పుళ్ళు – హోరు, టిక్ టిక్ మనే చప్పుడు, ఊళ వేసినట్లు చప్పుళ్ళు, బుడుక్, బుడుక్ మనే బుడగల శబ్దాలు – వినిపించడం ఈ వ్యాధి లక్షణం. ఈ చప్పుళ్ళు అవిరామంగా ఉండొచ్చు, వస్తూ పోతూ ఉండొచ్చు. ఈ శబ్దాలు రోగికి మాత్రమే వినిపిస్తాయి. చిరాకు పుట్టిస్తాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉండొచ్చు. అధికమైన రక్తపు పోటు కారణం కావచ్చు. చెవి దగ్గరగా ఉన్న రక్తనాళాలు సన్నబడడం (stenosis) కారణం కావచ్చు. శ్రవణనాళంలో గులిమి వల్లకాని, కంతి (tumor) వల్లకాని అడ్డంకి కారణం కావచ్చు. లోపలిచెవిలోని కర్ణావృత్తము దెబ్బతిని ఉండవచ్చు. చెవిలోని తిష్ఠని (infection) సత్వరం పరిష్కరించకపోతే ఆ తిష్ఠ చెవిలోని శ్రవణ సంవిధానానికి భంగం కలిగించవచ్చు. నాడీవ్యవస్థకి సంబంధించిన రోగాలు కారణం కావచ్చు. శరీరంలో అంతర్గతంగా ఉన్న రోగానికి చెవిలో చప్పుళ్ళు ఒక సూచన కావచ్చు. ఇటువంటి సందర్భాలలో పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలి కనుక చెవి సమస్యల మీద సాధికారత ఉన్న వైద్యుడుని సంప్రదించాలి.

3f. తలతిప్పు, తౌల్యత (Vertigo, Balance)

తలతిప్పు అంటే చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరుగుతూన్నట్లు అనిపించడం. తౌల్యత అంటే నిలకడగా నిలబడగలడం, నడుస్తూన్నప్పుడు పడిపోకుండా ఉండగలడం. ఈ పనులు సక్రమంగా, సమర్ధవంతంగా చెయ్యడానికి లోపలిచెవిలో, కర్ణావృత్తానికి ఆనుకుని మూడు అర్ధవృత్తాకారపు గొట్టాలు ఉంటాయి. ఈ మూడు ఒకదానికొకటి పరస్పరం లంబదిశలో అమర్చబడి ఉంటాయి. మనం బుర్రని పైకీ కిందకీ, కుడికీ ఎడమకీ, ఇటూ అటూ తిప్పినప్పుడల్లా ఈ గొట్టాలలో ఉన్న ద్రవం సర్దుకుని మనకి “తలతిప్పు” అనే భావం కలగకుండా చేస్తుంది. కానీ అప్పుడప్పుడు ఈ ద్రవంలో ఇసుకరేణువు ప్రమాణంలో ఖటికపు రేణువులు (Calcium carbonate crystals) ఏర్పడి ఆ గొట్టాలలో ఉన్న ద్రవం ఇటూ అటూ సర్దుకోకుండా అడ్డు పడతాయి. అప్పుడు తల తిరిగిన అనుభూతి కలుగుతుంది. కొన్ని వైద్యపరమైన వ్యాయామాలు చేస్తే ఈ అనారోగ్య స్థితిని చక్కబెట్టడానికి అవకాశం ఉంది.

వినికిడి లోపం ఉన్నంత మాత్రాన వారికి చెవులకి సంబంధించిన రోగాలు రావనుకోవడం అజ్ఞానమే అవుతుంది. “ సిరి అబ్బకపోయినా చిడుం అబ్బింది” అన్నట్లు బయట పుట్టిన శబ్దాలు వినబడకపోయినా శరీరంలో అంతర్గతంగా పుట్టే మర్మర ధ్వనులు, గలగలలు, రెపరెపలు, రక్తప్రవాహంలోని ఆటుపోట్ల స్పందనలు, పేగుల్లోని గుడగుడ శబ్దాలు, చెవులలో హోరు, మొదలైన శబ్దాలు చెవిటివారికి వినిపిస్తూనే ఉంటాయి. లేనిది ఉన్నట్టు వినిపించడం ఒక మనోవిభ్రమం. లేని పాటలు వినిపించడం దీనికి ఒక ఉదాహరణ. అలాగే “వానావానా వల్లప్పా” అంటూ గిరగిరా తిరిగితే, చెవిటివారి చెవులలో ఉన్న సంచలన యంత్రాంగం ప్రభావం వల్ల వారికీ తల తిరుగుతుంది.

4. బధిరత్వం పై బధిరుల స్పందన

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హెలెన్ కెల్లర్ 19 నెలల పసిగుడ్డుగా ఉన్న బాల్యంలోనే జబ్బుపడి వినికిడి శక్తిని, చూపుని పోగొట్టుకుంది. తనకి ప్రాప్తించిన గుడ్డితనం కంటే వినికిడిని పోగొట్టుకోవడం వల్ల కలిగిన బలహీనత, ఒంటరితనం, బాధ, ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకుని ఆమె బాధ పడింది.

ఫోనోగ్రాఫ్, విద్యుత్ దీపం, సినిమా, వగైరాలు వందకి పైగా ఆవిష్కరించిన థామస్ ఎడిసన్ కి వినికిడి లోపం ఉండేది, అయినా ఆయన బాధపడ లేదు, “నా వినికిడి లోపం వల్లనే నేను నా పరిశోధనల మీద దృష్టి నిలప గలుగుతున్నాను” అనేవాడుట!

వినికిడి లోపం ఉండీ పేరు ప్రఖ్యాతులు గణించిన మహామహులు ఇంకా ఉన్నారు. గ్రీకు చరిత్రకారుడు హీరోడోటస్ (Herodotus. సా. శ. పూ. 5), ఫ్రెంచి రచయిత గీ. డీ. మొపాసా వారి వినికిడి లోపం గురించి బాధాకరమైన వాక్పటిమతో, ఆకర్షణీయంగా వర్ణించేరు. ప్రఖ్యాత స్వరకర్త, వాగ్గేయకారుడు అయిన బీథోవెన్ చెవిటివాడే! “Children of a Lesser God” అనే నాటకంలో Mark Medoff చెవిటివారి కోసం ప్రత్యేకించిన పాఠశాలలో గురువుగా చేరిన James Leeds కి అదే పాఠశాలలో పని చేసే Sarah Norman అనే చెవిటి అమ్మాయికీ మధ్య పుట్టిన ప్రేమానురాగాలు ఎలా పరిణమిస్తాయో చెబుతాడు. బధిరత్వం మీద మరొక రెండు అద్భుతమైన ఇంగ్లీషు పుస్తకాలు: (1) David Wright రాసిన తన ఆత్మకథ, Deafness: A Personal Account, (2) Paul West రాసిన Words for a Deaf Daughter. మధ్యమ పురుషలో రాసిన ఈ పుస్తకం తన చెవిటి కూతురు మేండీ పాఠకుడిని ఉద్దేశించి మాట్లాడుతూన్నట్లు ఉండడం వల్ల వినికిడి లోపం ఉన్న వ్యక్తుల అంతర్గత మనోభావాలు ఎలా ఉంటాయో మనకి అర్థం అవుతుంది. ఈ రకం రచనలు భారతీయ భాషలలో ఉన్నాయో, లేదో నాకు తెలియదు.

వినికిడి లోపం ఉన్నా ఉన్నత శిఖరాలని అధిరోహించిన భారతీయుల ఉన్నారు. మచ్చుకి కొన్ని పేర్లు: సారా సున్నీ (Sarah Sunny) భారత సుప్రీమ్ కోర్టులో వాదించిన మొట్టమొదటి వినికిడి లోపం ఉన్న న్యాయవాది. దీక్షా దాగర్ (Diksha Dagar) గోల్ఫ్ ఆటలో ఒలింపిక్స్ లోనూ Deaflympics లోనూ ఆడిన వ్యక్తి. నిష్ఠా డుడెజా (Nishtha Dudeja) అందాలపోటీలో Miss Deaf Asia 2018 పతకం గెలుచుకుంది. ప్రియాంకా బోస్ (Priyanka Bose) బాలీవుడ్ లోనూ అంతర్జాతీయ సినిమాలలోనూ నటించిన తార. అభినయ (Abhinaya) తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సినిమాలలో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉదహరించిన వారందరూ మహిళలే అవడం కేవలం కాకతాళీయం!

వినపడడానికీ, వినిపించుకోడానికీ మధ్య తేడా ఉంది. ఇంగ్లీషులో hear అన్న మాటకీ listen అన్న మాటకీ మధ్య అర్థంలో బోలెడంత తేడా ఉంది. ఇంగ్లీషులో hear అన్నది సహజంగా జరిగే అనియంత్రిత చర్య; అనగా మన ఇచ్చా ప్రమేయాలతో నిమిత్తం లేకుండా శబ్ద తరంగాలు మన చెవిలో ప్రవేశించగా మనకి కలిగే అనుభూతి. “పక్షుల కిలకిలారావాలు వినబడ్డాయి” అన్నప్పుడు మనం ఆ కూజితాలని క్రియాశూన్యంగా విన్నాము. ఇంగ్లీషులో listen అన్నది మనం ఉద్దేశపూర్వకంగా వచ్చే శబ్దం మీద మనస్సు లగ్నం చేసి దాని అర్థాన్ని గ్రహించడం. “నేను చెప్పిన మాట విను!” అన్నప్పుడు వినడం అనేది క్రియాశీలంగా జరిగే పని. గురువు దగ్గర అంతేవాసి (శిష్యుడు) శుశ్రూష చేసేడన్నప్పుడు గురువు చెప్పిన మాట వింటూ (ఆజ్ఞానువర్తియై ఉంటూ) ఉన్నాడని అర్థం!

5. శబ్దం, రొద, తెల్ల రొద

శబ్దం అంటే sound. రొద అంటే noise. ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి? సాధారణంగా శబ్దం వెనుక ఏదో అర్థం ఉంటుంది. తలుపు చప్పుడౌతుంది. కుక్క మొరుగుతుంది. పాము బుస కొడుతుంది. ఈ శబ్దాలు వినగానే అవేమిటో మనకి అర్థం అవుతాయి. రొద అనేది అర్థం, పర్థం లేని అయోమయమైన అలికిడి. ఇక్కడ రంగులతో ఒక ఉపమానం చెబుతాను. ప్రతి ఒక్క రంగు కిరణం నిజానికి ఒక విద్యుదయస్కాంత కెరటం. సూర్యరశ్మిలో ఎన్నో రంగులు ఉన్నాయని మనకి తెలుసు. అనగా, మనకి తెల్లగా అనిపించే సూర్యరశ్మిలో ఎన్నో రంగుల విద్యుదయస్కాంత కెరటాలు ఉన్నాయి. ప్రతి కెరటానికి ఒక నిర్దిష్టమైన తరచుదనం (frequency) ఉంటుంది. ఇదే విషయాన్ని సాంకేతిక పరిభాషలో “తెల్లగా కనిపించే సూర్యరశ్మిలో ఎన్నో తరచుదనాలు ఉన్న కెరటాలు ఉన్నాయి” అంటాం. ఇదే విధంగా వీణ తీగ మీటితే ఒక స్వరం పలుకుతుంది. ప్రతి ఒక్క స్వరాన్ని ఒక నిర్దిష్టమైన తరచుదనం ఉన్న శబ్ద కెరటంలా ఊహించుకోవచ్చు. ఇలాంటి స్వరాలని ఒక క్రమ పద్ధతిలో పలికిస్తే అది సంగీతం అవుతుంది. ఇలాంటి స్వరాలని ఒక వరస వావి లేకుండా చిందరవందరగా పలికిస్తే అది అపస్వరాలతో నిండిన “గోల” అవుతుంది. ఈ గోలనే పరిభాషలో రొద (noise) అంటారు. అనగా, రొదలో అనేక స్వరాలు (స్వచ్ఛమైన శబ్దపు కెరటాలు) కలగాపులగంగా ఉంటాయి. ఈ రొదలో మళ్ళా రకాలు ఉన్నాయి. తెల్ల రొద (white noise) అంటే చిందరవందరగా ఉన్న స్వరాలన్నీ సమానమైన శక్తి కలిగిఉంటాయి. (White noise is noise with equal power across all frequencies.)

గర్భాశయంలో పసిపాప ఎదుగుతూన్నప్పుడు ఆ పసిగుడ్డుకి అనేక శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి: గుండె చప్పుడు, రక్తప్రవాహపు చప్పుడు, పేగులు చేసే చప్పుడు, వగైరా. ఈ చప్పుళ్ళు అన్నీ కలిసినప్పుడు అవి తెల్ల రొదని పోలి ఉంటాయి. అందుకనే పసిపిల్లల్ని పడుక్కోబెట్టినప్పుడు తెల్ల రొద చేసే ఉపకరణాన్ని పడకగదిలో పెడితే, గర్భాశయంలో పరిచయమైన శబ్ద వాతావరణం ఏర్పడి వారు బాగా నిద్రపోతారు.

అన్ని శబ్దాలూ ఆరోగ్యానికి మంచివి కావు. అమెరికావాళ్లు, రష్యావాళ్ళు, రొదని ఒక ఆయుధంగా వాడిన సంఘటనలు ఉన్నాయి. వారు ఎక్కువ కీచుదనం, ఎక్కువ శక్తి ఉన్న శబ్దాలని ప్రత్యర్థి దేశాల సచివాలయాలు మీద గురి పెట్టి ప్రసారం చేయడం వల్ల అక్కడ ఉన్న సిబ్బంది ఇబ్బందిలో పడ్డారని ఆ మధ్య వార్తలలో చదివేను. బంధితులైన శత్రు సైనికుల మీద అమెరికా మిలటరీ తెరిపి లేకుండా, బిగ్గరగా సంగీతం వినిపించి వాళ్లకి పిచ్చెక్కేటట్లు చేసేవారని కూడా వార్తలలో చదివేను. ఇది మనకి తెలియని వింతేమీ కాదు. భారతదేశంలో ముస్లింలు నమాజు చేసేటప్పుడు, క్రైస్తవులు చర్చిలో ప్రార్థనలు చేసేటప్పుడు ఊరంతా వినబడేలా వారి ప్రార్థనలని ప్రసారం చెయ్యడం, దానికి ప్రతిస్పందనగా హిందువులు వారి పూజాకార్యక్రమాలని ప్రసారం చెయ్యడం ఈ కోవకి చెందిన వ్యవహారాలే!

అతి బిగ్గరగా ఉండేవి, కర్ణకఠోరంగా ఉండే శబ్దాలు కూడా మంచివి కావు. విమానం చప్పుళ్ళు, వాహనాలు చేసే రొద, సంపీడన యంత్రాలు చేసే మోత, అతి బిగ్గరగా మ్రోగే వాయిద్యాలు, వగైరా చెవుల ఆరోగ్యానికి మంచివి కావు. దీనినే ధ్వని కాలుష్యం అంటున్నారు. ఈ ధ్వని కాలుష్యాన్ని ఎదుర్కోడానికి రొదని రద్దు చేసే ఉపకరణాలు (noise cancellation devices) వచ్చేయి. ఇవి రొదలో ఊగిసలాడే ధ్వని కెరటాలకి ప్రతికూలంగా ఉండే కొత్త ధ్వని కెరటాలని పుట్టిస్తాయి. ఈ రెండు కెరటాలు ఒకదానిని మరొకటి రద్దు చేసుకుంటాయి.

మనం పాడినప్పుడు మన స్వరతంతువులతోపాటు మన ఎముకలు కూడా కంపిస్తాయి! పెదిమలు మూసిపెట్టి ఝంకారపు ధ్వని చేస్తే ఆ శబ్దం కపాలపు ఎముకల వెంట ప్రయాణించి – కర్ణభేరిని తాకకుండా – లోపలిచెవి లోకి వెళుతుంది.

“ఓ……… మ్” అనే మంత్రాన్ని జపించినప్పుడు కాలహరణం చేస్తూ, సాగదీస్తూ, సుదీర్ఘ శ్వాస తీసుకోవడం వల్ల “మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది, ఆలోచనలు నిశ్చలంగా ఉంటాయి” అని మనం నమ్ముతాం. ఎందువల్ల ట? సుదీర్ఘ శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు మెరుగుపడతాయి. కపాలంలో ఉన్న ఎముకలలోనూ, ఛాతీలో ఉన్న ఉరోస్థి మీద ఉన్న మృదులాస్థి లోనూ, కణజాలాల కదలిక మెరుగుపడి, శక్తి ప్రసరణ సమతుల్యంగా జరుగుతుంది. హృదయ స్పందన స్థిరంగా ఉంటూ, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. “ఓం” ధ్వని శరీరంలోని కణజాలాలనూ, నాడీ వ్యవస్థనూ ఉత్తేజపరుస్తుంది. శరీరంలోని నాడీ మండలాలపై శక్తి ప్రసరణను మెరుగుపరచి, చైతన్య స్థాయిని పెంచుతుంది. ఇదంతా కేవలం నమ్మకమేనా? శాస్త్రీయమైన పునాదులు ఉన్నాయా? ధ్యానం చేసేటప్పుడు మంత్రాన్ని ఉపయోగించడంలో అంతరార్థం ఏమిటంటే ధ్యానం అంతర్గతంగా తెల్ల రొదని పుట్టిస్తుంది ట. బయటనుండి వచ్చే, ఏకాగ్రతకి భంగం కలిగించే, గడబిడ శబ్దాలని ఈ తెల్ల రొద రద్దు చేసి మన శరీరాన్ని శబ్దం చొరబడలేని ఒక దుర్గంగా మారుస్తుంది!

6. భాష, మాటలు, సంగీతం

శబ్దాన్ని విని, అర్థం చేసుకోగలిగే వ్యవస్థ లేకపోతే భాష, మాట, పాటల ప్రస్తావన ఉండదు కదా. భావ వ్యక్తీకరణకి భాష అవసరం. కానీ భాషలన్నిటికీ నోటితో మాటలు ద్వారా శబ్దాలు చెయ్యవలసిన అవసరం లేదు. చెవిటివారి కోసం ప్రత్యేకించి సైగ భాషలు (sign languages) ఉన్నాయి. జంతువులు రకరకాల శబ్దాలతో వర్తమానాలు పంపుకుంటాయి. కానీ మాట ద్వారా భావ వ్యక్తీకరణకి కావలసిన పూర్తి సరంజామా ఒక్క మానవుడి దగ్గరే ఉంది.

దేహనిర్మాణ సరళిని పరిశీలిస్తే, మానవుడి స్వరపేటిక (larynx) కంఠంలో బాగా దిగువకి ఉంది. మనం మాట్లాడుతున్నప్పుడు (లేదా, గాలి పీల్చి, వదిలేటప్పుడు), “పలక” (epiglittis) అనే తలుపులాంటి అవయవం నిట్టనిలువుగా ఉండి గాలిని స్వరపేటిక వైపు పంపుతుంది. అప్పుడు స్వరపేటికలో ఉన్న తంతువులు కంపించి శబ్దం పుడుతుంది. మనం ఏదైనా మింగినప్పుడు ఈ పలక శ్వాసనాళం (trachea) పై పడి, దానిని మూసేసి, ఆహారం తిన్నగా ఆహారనాళం (esophagus) లోకి వెళ్ళేటట్లు చూస్తుంది. ఈ కార్యక్రమం సజావుగా జరగకపోతే “పలక మారింది” అంటాం. పలక మారడం అప్పుడప్పుడు ప్రాణాపాయ పరిస్థితులకి దారి తీయవచ్చు! జంతువులలో స్వరపేటిక వాటి కంఠంలో బాగా ఎగువకి ఉంటుంది. కనుక వాటికి “పలక మారడం” అనే ప్రమాదం జరగదు. కానీ ఈ రకం అమరిక వల్ల జంతువులు వాటి కంఠంలో పుట్టే శబ్దాలని మనలా నియంత్రించలేవు. అధవా కొన్ని జంతువులలో స్వరపేటిక మనలోలా దిగువకి ఉండి, అవి కూడా శబ్దాలని నియంత్రించగలిగినా ఏయే శబ్దాలని ఎప్పుడు పుట్టించాలో నిర్ణయించగలిగే శక్తి ఆయా జంతువుల మెదడులో లేదు. ఈ పనిని మన మెదడులలో, ఎడమ వైపు ముందు భాగంలో ఉన్న “బ్రోకా మెదడు” (Broca’s area) చేస్తుంది.

శ్రవణ వ్యవస్థ యొక్క కీలకమైన బాధ్యత విన్న మాటని అర్థం చేసుకుని స్పందించడం. ఈ పనిని ఎడమ మెదడులో ఉన్న “వెర్నికీ మెదడు” (Wernicke’s area) చేస్తుంది. శబ్ద వాకేతాలు కుడి మెదడులోకి కూడా వెళతాయి. అక్కడ మాట ఉచ్చారణ లోని తూగు, లయ, ప్రాస, శ్లేష వంటి అంశాలు ప్రక్రియాపన చెందుతాయి.

శ్రవణేంద్రియం యొక్క బాధ్యత ఎంత మౌలికమైనదో వివరించడానికి మన మెదడు మాటలకి, భాషకి, సంగీతానికి ఎలా స్పందిస్తుందో చూద్దాం. మానవుడి శ్రవణేంద్రియం చేసే కీలకమైన పని భాషణానికి స్పందించడం; భాషణాన్ని బౌద్ధికంగానూ, ఉద్విగ్నంగానూ సంవదించడానికి అతి ముఖ్యమైన ఆయుధం మన శ్రవణేంద్రియం! (A key function of human hearing is response to speech, the principal way we connect and communicate, emotionally and intellectually.) మేధోవికాసానికి వినికిడి శక్తి కీలకం. పసిపిల్లలు తమ తల్లిదండ్రుల నుండి ఎన్ని ఎక్కువ మాటలు వింటే వారు పెరిగిన తరువాత పాఠశాలలో అంత బాగా ప్రకాశిస్తారనడానికి సాక్ష్యాలు ఉన్నాయి.

సంగీతం సంగతి చూద్దాం. ఓంకారంలో సంగీతం, వేదోచ్చారణలో సంగీతం, సెలయేరు ప్రవాహంలో సంగీతం, పక్షుల కిలకిలా రావాలలో, శిలలలో – అసలు సంగీతం లేనిదెక్కడ? మానసిక ప్రశాంతత కొరకు, అనేక వ్యాధుల నివారణకి సంగీతం దివ్య ఔషధం. మన మెదడు సంగీతాన్ని ప్రక్రియాపన చేసే పద్ధతి చాలా సంక్లిష్టము. సంగీతంలోని తాళము, లయ, స్వరము యొక్క మూర్ఛన, స్వరమాధుర్యము (అనగా, శ్రావ్యమైన స్వర సమాహారం, melody), సామరస్యము (అనగా, ఒకే సమయంలో పలుస్వరాల మేళవింపు, harmony) – ఇవన్నీ మెదడులోని కదలిక (movement), సావధానత (attention), స్మరణశక్తి (memory), ఉద్వేగము (emotion), భాషణ (language) కేంద్రాలని స్పృజిస్తాయి.

పాట పాడుతూన్నప్పుడు, పాట వింటూన్నప్పుడూ పాడేవాళ్ళ మెదడుకి, వినే వాళ్ల మెదడుకి బాగా కసరత్తు జరుగుతుంది. పాటలోని లయని, తాళాన్ని అర్థం చేసుకోడానికి మెదడు కుడి భాగం పని చేస్తుంది. పాటని వింటున్న శ్రోతలు తొడమీద తాళం వేసినప్పుడు కానీ, పక్క వాద్యం వాయించే వ్యక్తి తబలాని వేళ్ళతో తాటించినప్పుడు కానీ చాలక వల్కలం (motor cortex), చిన్నమెదడు (cerebellum) రంగంలోకి దిగుతాయి. స్వరములోని తారమంద్రాతి భేదము (pitch) పసిగట్టడానికి శ్రవణ వల్కలం (auditory cortex) పని మొదలెడుతుంది. ఇంకా వివరాలలోకి వెళితే పాఠంలా ఉంటుంది కనుక వెళ్ళను.

అమెరికాలో Name That Tune అనే “ఆట కార్యక్రమం” ఒకటి మొదట 1950 దశకంలోనూ, రెండవసారి 1970 దశకంలోనూ టెలివిషన్ మీద వచ్చింది. పియానో మీద ఒక రాగం వాయించడానికి ఒకటో, రెండో స్వరాలు పలికించేసరికి పోటీదారులు ఠకీమని ఆ పాట ఏమిటో చెప్పేసేవారు. ఈ రకం సమాచారం మెదడులోని Hippocampus లో ఉంటుంది!

7. పశుపక్ష్యాదులలో వినికిడి

కొన్ని జంతువులు మన కంటే “బాగా” వినగలవు! అడుగుల సవ్వడిని బట్టి కుక్క తన యజమానిని – అదే కుటుంబంలో ఉన్న ఇతర వ్యక్తులనుండి వేరుచేసి – గుర్తుపట్టగలదు. ధూమిక శృంగం లేదా కొమ్ము బాకా (fog horn or megaphone) అనే గొట్టం బజారులో దొరుకుతుంది. ఇలాంటి గొట్టాలు రెండు కారుకి ఇరుపక్కలా తగిలించి కారుని జోరుగా నడిపితే, వాటిల్లోంచి గాలి జోరుగా వెళ్లి ఊళ వంటి ఒక శబ్దాన్ని పుట్టిస్తాయి. ఈ శబ్దం మన చెవులకి వినబడదు కానీ రోడ్డు మీదకి పరాగ్గా వచ్చిన కుక్కలు, లేళ్ళు వంటి జంతుజాలపు చెవులకి వినపడుతుంది. కొన్ని జంతువులు తలని కదల్చకుండా కేవలం చెవులని మాత్రం ఇటూ, అటూ కదిలించి చప్పుడు ఎక్కడనుండి వస్తున్నాదో గుర్తించగలవు. నిశాచరులైన గుడ్లగూబల చెవులు కొంచెం ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల శబ్దం యొక్క జనక స్థానాన్ని, ఒక డిగ్రీ ఇటూ-అటూగా, నిర్ధారించగలవు. ఏనుగులు అత్యంత మంద్ర స్వరంలో ఉన్న చప్పుళ్ళని కూడా పసికట్టగలవు. అంతే కాదు, అవి అధోధ్వనితో (infrasound) సంభాషించుకుంటాయి! అనగా, అవి శ్రవణాతీతమైన శబ్దాలతో, అతి హీనస్వరంతో సంభాషించుకుంటాయి!

వానాకాలంలో కప్పల టర్టరాయణం వినాలంటే మనం పల్లెపట్టులకి వెళ్ళాలి. కొన్ని జాతుల కప్పలు, బల్లులు, పాములు వినడానికి తమ ఊపిరితిత్తులని వాడతాయని చెబితే నమ్మబుద్ధికాదు. కొన్ని జంతువులు శబ్దాన్ని కేవలం వినడానికే కాకుండా ఒక ఆయుధంలా కూడా వాడతాయి. కొన్ని జాతుల తిమింగిలాలు, గండుమీనులు (dolphins and porpoises) చిన్న చేపలని వేటాడేటప్పుడు రిమ్మెత్తించే విధంగా చప్పుడు చేస్తాయి. ఆ ధ్వనికి భయపడి నెత్తళ్లు (Stolephorus andhraensis) వంటి చిన్న చేపలు అంతర్గతంగా రక్తస్రావం చేసుకుని సొమ్మసిల్లిపోతాయి!

రాత్రి వేళ కీచురాళ్లు (ఇలకోళ్ళు) చేసే శబ్దానికి అర్థం ఏమిటో? నిజానికి ఆ శబ్దంతో అవి సంభాషించుకోవడం లేదుట. సంభాషించుకోడానికి అవి మన శ్రవణేంద్రియాలకి అందని అతిధ్వని (ultrasound) వాడతాయి. ఒక పనిలేని దివాకీర్తి ఆ కూతలని టేపు రికార్డర్ మీద నమోదు చేసి తిరిగి ఆ కూతలని కూయిస్తే కీచురాళ్లు ఏ విధంగానూ స్పందించలేదుట! మరయితే కీచురాళ్ళ కూతలకి అర్థం ఏమిటో?

దక్షిణ అమెరికాలో ఉండే కొన్ని గబ్బిలాలకి ఒక జాతి కప్పలంటే పరమాన్నమే! ఆ కప్పలు చేసే బెకబెక ధ్వనులని ఆసరాగా చేసుకుని ఈ గబ్బిలాలు వేటాడతాయి. పోతరించిన మగ కప్పలు బెకబెకమనకపోతే ఆడకప్పలని ఆకర్షించడం ఎలా? బెకబెకమంటే గబ్బిలాలు స్వాహా చేసేస్తాయి. అయినాసరే ఆడ కప్ప పొందుకోసం మగ కప్ప “బెకబెక” అనక తప్పదు!

గబ్బిలాలు వేటాడేటప్పుడు ధారాపాతంగా క్లిక్ క్లిక్ మనే శబ్దం చేస్తాయి. ఈ చప్పుడు తరచుదనం 50,000 Hz వరకు ఉంటుంది. మన చెవుల పరిమితి 20,000 Hz అని చెప్పుకున్నాం కదా! కనుక ఆ శబ్దాలు మనకి వినపడవు. ఈ క్లిక్ క్లిక్ మనే శబ్ద తరంగాలు వాటి ఎర మీద పడి ప్రతిధ్వనిస్తాయి. ఈ ప్రతిధ్వని గోడ దగ్గరనుండి వచ్చిందా, అరటి గెల నుండి వచ్చిందా, కప్ప నుండి వచ్చిందా అన్న సంగతి కూడా గబ్బిలం మెదడు లెక్క కట్టగలదు. ఒక వస్తువు నుండి వచ్చే ప్రతిధ్వనిని ఆసరాగా చేసుకుని ఆ వస్తువు ఎక్కడుందో నిర్ధారించే పద్ధతిని “ప్రతిధ్వనితో ప్రదేశ నిర్ధారణ” (echo location) అంటారు. ఈ పద్ధతిని radar, sonar వంటి ఆధునిక సాంకేతిక ఉపకారణాలలో వాడుతూ ఉంటారు. గర్భంలో ఉన్న భ్రూణాన్ని పరిశీలించడానికి ఈ పద్ధతిని వాడినప్పుడు దానిని fetal echocardiogram అని వైద్యులు అంటారు కానీ సామాన్యులు తేలికగా ultrasound అనేస్తారు.

8. మహాభారతంలో శబ్దాన్ని నమోదు చేసే పరికరం

మాయా బజార్ సినిమాలో “నీవేనా నను పిలచినది….” అన్న పాటని టెలివిజన్ లాంటి పరికరంలో చూపిస్తారు కదా. భీష్ముడు అంపశయ్యమీద పరుండి సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు కానీ ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠురుడంటాడు, “ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరమూ వ్రాసుకోలేదు. ఇప్పుడెలా కృష్ణా?” అని.

“అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే సాధ్యం అవుతుంది” అని శ్రీ కృష్ణుడు చెబుతాడు. “మనందరిలో సహదేవుడొక్కడే “సూత స్పటికం” వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో నిక్షిప్తపరచుకుంటుంది. ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రీప్లే చేసి) వ్యాస మహర్షితో వ్రాయించు” అని కృష్ణుడు సలహా ఇస్తాడు. ఆ విధంగా మొట్టమొదటి స్పటికపు రికార్డర్ (crystal recorder) ద్వారా విష్ణు సహస్రనామం మనకు అందిందని ఒక స్వామి వారు సెలవిచ్చారు. ఈ కథనం తెలుగు “కోరా” లో చదివేను.

సంప్రదించిన మూలాలు

  1. Diane Ackerman, A Natural History of the Senses, Vintage Books, Random House, New York, NY 1991
  2. The Senses: Hearing
    https://dana.org/app/uploads/2023/09/fact-sheet-senses-hearing-baw-2020-1.pdf
  3. Otosclerosis – Penn Medicine
  4. Pulsatile Tinnitus: 7 Different Anatomic Causes of Hearing Pulsations in the Ear
  5. Tinnitus – Symptoms and causes – Mayo Clinic

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి:

వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.

 ...