బొల్లి

నాంది

బొల్లి మచ్చలని చూసి భయపడడం సర్వసాధారణం. బొల్లి మచ్చలు చూడడానికి అందంగా కనిపించవు. మానసికంగానూ సాంఘికంగానూ ఇది సమస్య అవవచ్చేమో కానీ శారీరకంగా కాని, వైద్యపరంగా కానీ ఇది సమస్య కానే కాదు! తీరని అనుమానాలతోటి, మనోవ్యధతోటి, మిడిమిడి జ్ఞానంతో సతమతమయేవారికి ఈ విషయం నచ్చజెప్పడం కష్టమే! ఈ వ్యాసం చదవడం వల్ల బొల్లి గురించి మీరు సమగ్రమైన అవగాహన పొందడమే కాకుండా, చికిత్స పొందే సమయంలో మీరు పాటించవలసిన విధులు, పథ్యాలు మొదలైన విషయాలు కూలంకషంగా అర్థం అవుతాయి.

మన శరీరపు చాయ

మన చర్మం మూడు పొరలుగా ఉంటుందని మీలో చాల మంది ఉన్నత పాఠశాలలో చదువుకునే ఉంటారు. మన చర్మం పైపొరకి రంగు లేదు. పారదర్శకంగా ఉండే ఈ పైపొరకి కిందవైపున ఉండే మెలనిన్ (melanin) అనే రంగు పదార్థమే మన శరీరపు చాయకి ముఖ్యకారణం. మెలనిన్ మోతాదు తక్కువగా ఉన్నవాళ్ళు తెల్లగా కనిపిస్తారు. మోతాదు ఎంత ఎక్కువగా ఉంటే అంత నల్లగా కనిపిస్తారు; ఓ మోస్తరుగా ఉంటే చామనచాయలో కనిపిస్తారు.

మనిషి అందంగా కనిపించడానికి శరీరపు చాయకి మధ్య ఏమీ సంబంధం లేదు. కను-ముక్కు తీరు బాగుండి, ఒడ్డు-పొడుగు సమతూకంలో ఉండి, ముఖం పొడుగు-వెడల్పులు సువర్ణ నిష్పత్తిలో (Golden Ratio) ఉంటే ఆ వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాడు (కనిపిస్తుంది). నలుపు చాయలో ఉండే కృష్ణుడు, ద్రౌపది అందమైనవాళ్ళ కిందే లెక్కలోకి వస్తారు. తెల్లగా ఉన్నా, తెస్సోడుతూ ఉంటే అది అందం అనిపించుకోదు.

బొల్లి మచ్చలు ఉన్నా ప్రపంచంలో పేరు ప్రతిష్ఠలు గణించిన పెద్దల పేర్లు కొన్ని: మైకల్ జాక్సన్, చంద్రబాబు నాయుడు, అమితాబ్ బచ్చన్.

మనకి పుట్టుకతో వచ్చే చాయని ‘తత్త్వపు చాయ’ అంటారు. బయట వాతావరణపు ప్రభావం వల్ల ఎట్టకేలకు వచ్చే చాయని ‘సంక్రమణ చాయ’ అంటారు. మన శరీరపు చాయ శరీరం అంతా ఒకేలా ఉండదు. ఎండ తగిలే చోట్ల (ముఖము, ముంజేతులు) నలుపు డౌలు కొంచెం ఎక్కువగానూ, లోపలి భాగాలలో (ఛాతీ, తొడలు) కొంచెం తెలుపు ఎక్కువగానూ ఉంటుంది. చాయలో ఈ మార్పు క్రమేణా జరగకపోతే మనం చారల గుర్రాలలా కనిపిస్తాం! (తెల్లవాళ్ళల్లో పనిగట్టుకుని ఎండలో పడుకొని ఒళ్ళు నల్లబరచుకొనే ఆచారం ఒకటి ఉంది. సముద్రపుటొడ్డు నుండి రాగానే వీళ్ళని చూస్తే నిజంగానే చారల గుర్రాలలా కనిపిస్తారు!)

చర్మపు రంగులో మార్పు కొద్దిగా జరిగినా, క్రమేణా జరిగినా ఎబ్బెట్టుగా కనిపించదు; కొట్టొచ్చినట్లు తెల్లటి మచ్చలు కనిపించినప్పుడే ఇబ్బంది. అందుకనే తెల్లగా ఉంటే బాగుండునని మనకి మనస్సులో ఎంతలా ఉన్నా, శరీరం మీద తెల్లటి మచ్చలు కనిపించేసరికి భయపడి వైద్యుడి దగ్గరకి పరిగెడతాం.

బొల్లి

బొల్లి జాతి రోగాలన్నిటిని గుత్తగుచ్చి ఇంగ్లీషులో లూకోడెర్మా (Leucoderma) అంటారు. లూకో అంటే తెలుపు, డెర్మిస్ అంటే చర్మం. కనుక లూకోడెర్మా అంటే తెల్లటి చర్మం అని అర్థం. బొల్లిని వైద్య పరిభాషలో విటిలైగో (vitiligo) అంటారు. చరక సంహిత లోనూ, తదితర సంస్కృత గ్రంథాలలోనూ దీనిని ‘శ్వేత కుష్టు’ అనే పేరుతో పిలిచారు. కానీ ఈ పేరు సరి అయినది కాదు. కుష్టు (leprosy) రోగానికి, బొల్లికి ఏ విధమైన సంబంధమూ లేదు.

మహాభారత కథలో పాండురాజుకి వచ్చిన ‘పాండు రోగం’ మూడొంతులు బొల్లి అయి ఉంటుందని నా ఊహ. దీన్ని చూసి కుంతీదేవి అదేదో భయంకరమైన రోగం అని భయపడిన్నీ, పిలల్ని కనకపోతే పున్నామ నరకాలు వస్తాయని భయపడిన్నీ, దేవతల సహాయంతో పిల్లలని కని ఉంటుందనిన్నీ ఒక వాదం లేవదీయవచ్చు. బొల్లిని చూసి కుంతీదేవి భయపడకపోతే భారత కథ మరొక విధంగా మలుపు తిరిగి ఉండేదేమో.

మెలనిన్ కణాలు

మన శరీరం అంతా రకరకాల జీవకణాల మయం. ఒకొక్క రకం ఒకొక్క పనిని చేస్తాయి. ఉదాహరణకి మన చర్మం లోపలి పొరలలో ఉన్న మెలనిన్ కణాలు నలుపు రంగుని తయారుచేసే కార్ఖానాలు. ఈ కార్ఖానాలలో మెలనిన్ అనే రంగు పదార్ధం (pigment) నిరంతరం అలా తయారవుతూనే ఉంటుంది. శరీరం మీద సూర్యరశ్మి పడ్డప్పుడల్లా ఈ రంజన ద్రవ్యం మరికొంచెం ఎక్కువగా, మరికొంచెం జోరుగా తయారవుతుంది. అందుకనే వేడి దేశాలలో నివసించేవారికి – బయట తిరిగే అవకాశాలు ఎక్కువ కనుక – వారి చర్మం చలి దేశాల వారి చర్మం కంటే నల్లగా ఉంటుంది. ఒక విధంగా ఈ నలుపు రంగు మనకి లాభదాయకం. చర్మంలో మెలనిన్ ఉన్నంత సేపూ సూర్యరశ్మిలో ఉండే అత్యూద కిరణాలు (ultraviolet rays) మనకి హాని చేయకుండా అడ్డుకుంటుంది. ఇదే విషయాన్ని మరొక రకంగా చెప్పాలంటే వేడి దేశాలలో నివసించేవారికి మెలనిన్ అనే రంగు పదార్ధం ఒక రక్షరేకు లాంటిది; ఈ రక్షణ లేకపోతే అత్యూద కిరణాల ధాటికి మనందరికీ ఈపాటికి చర్మపు కేన్సరు వచ్చేసి ఉండేది!

అప్పుడప్పుడు ఈ మెలనిన్ కణాలు సరిగ్గా పని చెయ్యకపోతే వాటి ఉత్పత్తి తగ్గిపోతుంది, లేదా పూర్తిగా ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ రంగు పదార్థపు ఉత్పత్తి ఆగిపోతుందో అప్పుడు ఆ కణాలు ఉన్నంత మేరా చర్మం వెలవెలపోయి మనకి అక్కడ తెల్లటి మచ్చలా కనిపిస్తుంది. వీటినే బొల్లి మచ్చలు అంటారు. ఉండవలసిన చోట పళ్ళు లేకపోతె ‘బోసి’ నోరు అనరూ? అలాగే చర్మం మీద ఉండవలసిన చోట రంగు లేకపోతే దానిని ‘బొల్లి’ మచ్చ అంటారు.

బొల్లి మచ్చలు రాడానికి కారణం ఏమిటి?

మెలనిన్ తయారీకి ఆటంకాలు రాడానికి అనేక కారణాలు ఉండొచ్చు.

  • కొందరి శరీరాలలో, కొన్ని కొన్ని సందర్భాలలో, మన శరీరంలో ఉండే రక్షక వ్యవస్థ పైనుండి వచ్చే రోగకారక అంశాలతో పోరాడడానికి బదులు మన సొంత జీవకణాల మీదే తిరుగుబాటు చేస్తాయి. ఈ పరిస్థితిని ఇంగ్లీషులో autoimmunity అంటారు. ఈ పరిస్థితి వల్ల వచ్చే రోగాలని autoimmune diseases అంటారు. ఇటువంటి అంతర్యుద్ధంలో మెలనిన్ తయారీ ఆగిపోవచ్చు.
  • మన పర్యావరణం కలుషితం అవడంతో పాటు బొల్లి ప్రాబల్యం పెరుగుతోందని కొందరు అంటున్నారు. మన పర్యావరణంలో రోజురోజుకి పెరిగే కాలుష్యాల ప్రభావం పైన చెప్పిన అంతర్యుద్ధానికి దోహదం చేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
  • కొందరికి నాడీమండలంలో జరిగిన మార్పుల కారణంగా బొల్లి మచ్చలు రావచ్చు. ఈ రకం మచ్చలు శరీరంలో ఒక పక్కనే కనిపిస్తాయి. అనగా, అన్ని మచ్చలు శరీరానికి కుడి వైపునైనా ఉంటాయి, ఎడమ వైపునైనా ఉంటాయి. ఏ నాడీతంతులైతే దెబ్బ తిన్నాయో ఆ తంతుల ప్రభావం ఉన్న మేరనే మచ్చలు కనిపిస్తాయి. ఈ రకం బొల్లిని segmental vitiligo అంటారు. కుడి ఎడమల విచక్షణ లేకుండా కనిపించే మచ్చలని nonsegmental vitiligo అంటారు.
  • పడని పదార్థాలు శరీరానికి తగిలినా, గాఢమైన ఆమ్లములు కానీ, క్షారములు కానీ శరీరం మీద పడినా, శరీరం కాలినా, తీవ్రమైన ఒరిపిడికి గురి అయినా మెలనిన్ ఉత్పత్తి ఆగిపోయి బొల్లి మచ్చలు వచ్చే సావకాశం ఉంది.
  • నూటికి ముప్పయి సందర్భాలలో బొల్లి మచ్చల అంకురం వంశంలో ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది. ఈ రకం మచ్చలు శరీరానికి రెండు పక్కలా పార్శ్వ సౌష్ఠత ప్రదర్శిస్తూ కనబడతాయి. తల్లిదండ్రులిద్దరికి బొల్లి ఉన్న సందర్భాలలో పిల్లలకి సంక్రమించే అవకాశం సైద్దాంతికంగా బాగా పెరుగుతుంది. అయినా సరే తల్లిదండ్రులిద్దరికి బొల్లి ఉన్నా సరే 80 శాతం పిల్లలకి ఈ వ్యాధి సంక్రమించడం లేదు.
  • బొల్లి – పెళ్ళిళ్ళు

    వెలిసిపోయిన బట్ట కట్టుకుంటే ఎంత ప్రమాదమో వెలిసిపోయిన చర్మం ఉన్నవారిని ముట్టుకున్నా అంతే ప్రమాదం. వెలిసిపోయిన చర్మం చూసి భయపడడం వెర్రితనం.

    బొల్లి మచ్చలు ఉన్నవారికి పెళ్ళిళ్ళు గబుక్కున కావు, మన దేశంలో. మచ్చలు ఉన్న మనిషి అమ్మాయి అయితే ఇక ఆ పిల్ల అవస్థ చెప్పనక్కరలేదు. బొల్లి బెంగతో పెళ్ళి బెంగని జత చేస్తే బొల్లిని కుదర్చడం కష్టం అవుతుంది. యుక్త వయస్సులో ఉన్న పిల్లలకి బొల్లి మచ్చలు కనబడడం మొదలయితే మచ్చలు ముదిరిపోయే ముందు అవశ్యం పెళ్ళి చేసేసి అటు మీదట వైద్యం చేయించడం సర్వత్రా శ్రేయస్కరం.

    బొల్లి కలిగించే మనస్తాపం వర్ణనాతీతం. ఎవరికైనా ప్రాణాంతకమైన జబ్బు వస్తే జాలిపడతారు. ప్రాణం పోతే ఒకసారి ఘొల్లుమంటారు. కానీ బొల్లి వ్యాధి వచ్చిన అమ్మాయిల జీవితం సజీవ సమాధే! ఒక పక్క వ్యాధి వచ్చిందని బెంగ. మరొక పక్క ఎవరైనా చూస్తారేమోనని దిగులు. గుండె నిబ్బరం ఉన్న కొందరు ఈ కొత్త పరిస్థితికి అలవాటు పడిపోతారు. మనోధైర్యం ఉంటే కానీ బొల్లి వ్యాధిని జయించలేము. బొల్లి మచ్చలు ఉన్నంత మాత్రాన జీవితం అంతా వమ్ము అయిపోయిందని చింతించడం మంచిది కాదు. రోజురోజుకి కొత్త మందులు వస్తున్నాయి. కొత్త పద్ధతులు వస్తున్నాయి.

    బొల్లి అంటురోగమా?

    బొల్లి అంటురోగం కానే కాదు, ఆ మాటకొస్తే బొల్లి అస్సలు రోగమే కాదేమో. శరీరంలో రంగు ఉత్పత్తి ఆగిపోవడం వల్ల ఆరోగ్యానికి ఇతరత్రా భంగం కలుగనంతవరకు దీనిని రోగం కింద జమకట్టనక్కరలేదు. పైపెచ్చు ఇది ఒకరి నుండి మరొకరికి అంటుకునే జబ్బేమీ కాదు. ఇది సూక్ష్మజీవుల కారణంగా వచ్చే జబ్బు అస్సలు కాదు. ఇది శరీరంలో జీవనప్రక్రియ కుంటుపడడం వల్ల వచ్చే రుగ్మత మాత్రమే!

    శతాబ్దాలపాటు ఈ వికారం మన మధ్యలో ఉన్నా ఇటీవలి కాలంలోనే ఇది ప్రజలలో ప్రబలంగా కనిపిస్తోందని కొందరు అంటున్నారు. బొల్లి ప్రపంచవ్యాప్తంగా 1% జనాభాలో ఉన్నదే అయినా తెల్లవాడి తోలు మీద బొల్లి మచ్చలు చటుక్కున కనబడవు. పైపెచ్చు ఈ మచ్చల వల్ల ఆరోగ్యానికి వాటిల్లే నష్టం ఏమీ లేదు కనుక తెల్లవాళ్ళు దీని గురించి పెద్దగా పట్టించుకోరు. బొల్లి భారతీయుల్ని ఇబ్బంది పెట్టినంతగా మరెవరినీ ఇబ్బంది పెడుతూన్నట్లు లేదు. భారతీయులలో ఇది 7%-14% ఉందని అంచనాలు ఉన్నాయి. కనుక ఈ మూఢనమ్మకాల నిర్మూలనకు మనమే నడుం కట్టుకుని పోరాడాలి. మన శరీరపు చాయ మీద బొల్లి మచ్చలు అందవిహీనంగా కనిపిస్తాయి. మన సాంఘిక వ్యవస్థలో ఉన్న మూఢాచారాల వల్ల ఈ ‘జబ్బు’ చాలామందిని మనస్తాపానికి గురి చేస్తున్నాది. కనుక ఈ వ్యాధి మీద పరిశోధనలు చేసి, తగిన మందులు కనిపెట్టవలసిన బాధ్యత మన మీదనే ఎక్కువగా ఉంది.

    బొల్లిని కుదర్చగలమా?

    సరి అయిన వైద్యుడి పర్యవేక్షణలో కుదర్చగలమనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. చర్మవ్యాధులు రాకూడదు కానీ వస్తే కుదర్చడానికి చాలా కాలం పడుతుంది; నాలుగైదు ఏళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు. చిన్న చిన్న మచ్చలని, కొత్తగా పుట్టుకొచ్చిన మచ్చలని పోగొట్టడం తేలిక. వేళ్ళ కొనల మీద మచ్చలు, పెదిమల మీద మచ్చలు పోడానికి చాలా కాలం పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో చిన్న చిన్న మచ్చలు వాటంతట అవే పోతాయి.

    నూరింట 70-80 మందికి ‘సోరలెన్’ (Psoralen, రసాయన సంక్షిప్త నామం C11H6O3) అనే ఇంగ్లీషు మందు ద్వారా గుణం కనిపిస్తుంది. ఈ నోటి మందు గుణం చెయ్యాలంటే మందు వేసుకున్న తరువాత కొద్ది గంటలు ఎండలో కూర్చోవాలి. మిగిలిన 30-20 శాతపు సందర్భాలలో గుణం అస్సలు కనిపించదు. అటువంటి సందర్భాలలో మందు ఎందుకు పని చెయ్యలేదో నిర్ధారించాలి. సర్వసాధారణంగా డయబెటీస్ ఉన్నా, లివర్ వ్యాధి ఉన్నా ముందు ఆయా వ్యాధులని అదుపులోకి తీసుకుని వచ్చి అప్పుడు ‘సోరలెన్’ వైద్యం చేస్తే గుణం కనిపించే అవకాశాలు పెరుగుతాయి.

    సోరలెన్‌తో వైద్యం

    ఈ సోరలెన్ అనే రసాయనం అనేక వనమూలికలలో సహజసిద్ధంగా లభించే పదార్థమే! ఇది బొల్లి మీద రామబాణంలా పనిచేస్తుందని అంటారు. ఈ మందు ఇంగ్లీషు పేరు కొత్తేమో కానీ మందు మాత్రం కొత్తేమీకాదు; మన దేశంలో శతాబ్దాల తరబడి వాడుకలో ఉన్నదే!

    ఈ సోరలెన్‌ని పైపూతకి లేపనంలా వాడవచ్చు. లేదా లోపలికి పుచ్చుకోవచ్చు. మందు పుచ్చుకున్న తరువాత ఒంటపట్టడానికి రెండు, మూడు గంటలు పడుతుంది. అప్పటికి ఈ మందు రక్తంలోకి చేరుకుంటుంది. ఆ సమయం లెక్కగట్టి ఆ వేళకి ఎండలో కూర్చుంటే మందు బాగా పనిచేస్తుంది. ఎండలో కూర్చున్నా, అత్యూద కిరణాలు వెదజెల్లే దీపపు కాంతిలో కూర్చున్నా శరీరంలో మెలనిన్ తయారయి తెల్లటి మచ్చలని క్రమేపి పోగొడుతుంది.

    మనకి తెలిసినంతవరకు సోరలెన్ జాతి మందులు హాని చెయ్యవు. మన ఖర్మ కాలి ఏవైనా అవాంఛనీయ ఫలితాలు కనబడ్డా అవి చాలా సాధువుగా ఉంటాయి. కొందరికి తెల్లమచ్చలు కందినట్లు ఎర్రగా కనబడతాయి. చాలా అసాధారణమైన సందర్భాలలో మచ్చలు పొక్కులెక్కవచ్చు. సోరలెన్ వైద్యం ప్రారంభించిన కొత్త రోజులలో కొంతమందికి తల భారంగా ఉండడం, కడుపులో తిప్పడం, చిరాకు (nervousness), మనోవ్యాకులత (depression) మొదలైన లక్షణాలు పొడచూపడం కద్దు. ఈ అవాంఛనీయ లక్షణాలు అన్నీ కొద్దీ రోజులలో సర్దుకుంటాయి. అలా కానీ పక్షంలో మందు మోతాదు తగ్గించవలసి ఉంటుంది.

    సోరలెన్ వైద్యం ఎన్నాళ్ళు చేయాలి?

    ఈ ప్రశ్నకి నిర్దిష్టంగా సమాధానం చెప్పడం కష్టం. ఎండలో ఎంతసేపు కూర్చోవాలి అనేది మనిషి తత్త్వాన్ని బట్టి, ఆ మనిషి నివసించే స్థలాన్ని బట్టి ఉంటుంది. కొందరిలో గుణం తొందరగా కనిపిస్తుంది, కొందరిలో ఆలస్యం అవుతుంది. సూర్యరశ్మిలో అత్యూద కిరణాల పాలు ఎక్కువ ఉంటే ఎండలో ఎక్కువసేపు కూర్చోనక్కరలేదు. ఈ ‘పాలు’ దేశ కాల పరిస్థితులని బట్టి మారుతూ ఉంటుంది. భూమధ్యరేఖ నుండి ఉత్తరానికి వెళుతూన్నకొద్దీ సూర్యరశ్మిలో అత్యూద కిరణాల పాలు తగ్గుతుంది. కనుక ఇండియాలోని విశాఖపట్నంలో పనిచేసే ‘మంత్రం’ అమెరికాలోని బోస్టన్‌లో పనిచెయ్యకపోవచ్చు. కనుక ఈ విషయంలో వైద్య నిపుణుల సూచనలను పాటించాలి.

    ఉదాహరణకి విశాఖపట్నంలో ఒక ఉపతాపి (patient) ఉదయం 9 గంటలకి సోరలెన్ మందు తీసుకున్నాడని అనుకుందాం. గంటన్నరో, రెండు గంటలో ఆగి, మందు ‘ఒంటబట్టిన’ తరువాత పదిన్నరకో, పదకొండింటికో ఎండలో కూర్చోవడం మొదలు పెట్టాలి. ఎంతసేపు కూర్చోవాలి? తెల్లగా ఉన్న బొల్లి మచ్చలు మాడి ఎర్రబడే వరకు! అందుకని ఒక చేతిలో అద్దం, మరొక చేత గడియారం పట్టుకుని మచ్చలని ఆరారా చూస్తూ కూర్చోవాలి. ఎప్పుడైతే మచ్చలు కందినట్లు ఎర్రగా కనబడతాయో అప్పుడు వేళ కాగితం మీద నమోదు చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ కొన్ని నెలలపాటు చెయ్యాలి.

    ఇదే పరిశ్రమ అమెరికాలో చెయ్యవలసి వస్తే కొన్ని సవరణలు చెయ్యాలి. ఉత్తర అమెరికాలో సాధారణంగా సూర్యరశ్మిలో అత్యూద కిరణాలు మధ్యాహ్నం 12 నుండి 2 వరకు ఎక్కువగా ఉంటాయి. కనుక పరిస్థితులకి అనుకూలంగా ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి.

    ఉద్యోగస్తులకు ప్రతిరోజూ మధ్యాహ్నం వేళ రెండు గంటలు ఎండలో కూర్చోవడం అంటే వీలు పడదు. పట్టణాలలో పిచికగూడుల వంటి అపార్టుమెంట్లలోకి ఎండ సులభంగా జొరబడదు. ఇటువంటి సందర్భాలలో కృత్రిమంగా అత్యూద కిరణాల్ని వెదజల్లే దీపాల దగ్గర కూర్చోవాలి. ఈ రకం దీపాలని పూవా (PUVA) దీపాలు అంటారు. ఇవి ఇండియాలో అందరికి అందుబాటులో ఉండవు.

    ఇంతటితో కథ అయిపోలేదు. ఎండలో కూర్చున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, కంటి మీద సూర్యరశ్మి పడకుండా చలవ కళ్ళజోడు పెట్టుకోవాలి. రెండు, బొల్లి మచ్చల మీద కాకుండా చుట్టూ ఉన్న చర్మం మీద వేసలీన్ రాసుకోవాలి. ఇలా చెయ్యకపోతే బొల్లి మచ్చ చుట్టూ ఉన్న చర్మం బాగా నలుపెక్కి అందవికారంగా కనిపిస్తుంది.

    ఈ వైద్యం పూర్తి అయాక చర్మానికి పూర్వపు రంగు వచ్చేస్తుందా? ఏ చర్మరోగం అయినా పూర్తిగా కుదరడానికి కొన్ని సంవత్సరాలే పట్టొచ్చు. కనుక ఓపిక పట్టాలి. ముందస్తుగా తెల్లటి మచ్చల మీద చిన్న చిన్న నల్లటి చుక్కలు కానీ మరకలు కానీ వస్తాయి. ఒక ఏడు పోయిన తరువాత ఈ నల్లటి మరకలు క్రమేపి వెలిసి శరీరం రంగులో కలిసిపోతాయి. తెల్ల మచ్చ పోగానే అక్కడ నుండి మొలిచే రోమాలు కూడా యథాతథంగా మామూలు రంగుకి వచ్చేస్తాయి.

    ఇతర పద్ధతులు

    సోరలెన్ వైద్యం సానుకూలపడనప్పుడు ఘృతార్థాలు (steroids) వాడి చూడవచ్చు. లేసర్‌తో చేసే వైద్య పద్ధతులు కూడా ఉన్నాయి. ఇటీవల అమెరికా ప్రభుత్వ సంస్థల అనుమతి పొందిన కొత్త మందులలో చెప్పుకోదగ్గవి: Ruxolitinib, Povorcitinib.

    ఇక ఏ మందూ పనిచేయని పరిస్థితులలో ప్లాస్టిక్ సర్జరీ ప్రయత్నించి చూడవచ్చు. ఇది నూరింట డెబ్భయ్ పాళ్ళు పని చేస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ అంటే శరీరంలో మరొక చోట బాగున్న చర్మాన్ని ఒలిచి, దానిని బొల్లి మచ్చల మీద తాపడం చెయ్యడం. ముఖం మీద, చేతుల మీద ఉన్న మచ్చలు ఎప్పటికీ లొంగకపోతే ప్లాస్టిక్ శస్త్రచికిత్స ఒక మార్గాంతరం.

    కుదిరిపోయిన మచ్చలు తిరిగి కనిపించే సావకాశం ఉందా?

    ఈ ప్రశ్నకి అసందిగ్ధంగా సమాధానం చెప్పలేము. బొల్లి ఎవరికి ఎప్పుడు ఎందుకు వస్తుందో మనకి ఇంకా పూర్తిగా అవగాహన కాలేదు. సాధారణంగా ఇరవైయవ ఏడు నిండకుండానే మచ్చలు కనబడడం మొదలవుతాయిట. ఏదో ఒక కారణం వల్ల లక్షణాలు దడదడా చూపెట్టి, ఎలా వచ్చేయో అలానే ఆగిపోతాయిట. కొన్నాళ్ళు పోయిన తరువాత మళ్ళా తిరగబెట్టవచ్చట. ఇలా వస్తూ, పోయే రోగం కనుక మందు ప్రభావం వల్ల తగ్గిందో లేక సహజంగా వచ్చే ఆటుపోట్ల వల్ల తగ్గినట్లు కనబడుతోందో చెప్పడం కష్టమట. కనుక మంచి వైద్యుడి పర్యవేక్షణ తప్పనిసరి. జీవితంలో ఎదురయే ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయాలలో ఇది ప్రకోపించే సావకాశాలు ఎక్కువ అని వైద్యులు అంటున్నారు. బట్టల కట్టు బిగుతుగా ఉన్నప్పుడు పుట్టే ఒరిపిడి వల్ల కూడా ఈ వ్యాధి లక్షణాలు పొడచూపే అవకాశాలు ఉన్నాయని కొందరి అభిప్రాయం.

    ఈ వ్యాధికి పథ్యం ఉందా?

    మంచి ఆహారం తినడం, వ్యాయామం చెయ్యడం అన్ని సందర్భాలలోనూ మంచి అలవాటే. విటమిన్ సి ఉన్న పుల్లటి పదార్థాలు తినకూడదని ఆయుర్వేదంలో ఉంది. ఈ నమ్మకమే ఎలోపతిలో (ఇంగ్లీషు వైద్యం) కొన్నాళ్ళు ఉండేది. ఇది ఆధారం లేని గుడ్డి నమ్మకం అని ఎలోపతి వైద్యులు తేల్చి చెప్పేరు. చేపలతో పాటు పెరుగు తింటే బొల్లి వస్తుందనే కాకమ్మ కథ ఒకటి ప్రచారంలో ఉంది కానీ దానికి దిట్టమైన ఆధారాలు లేవు. హోమియోపతి వైద్యంలో పథ్యం అంటూ ఏది ఉన్నట్లు లేదు.

    ఆయుర్వేదం, హోమియోపతిలో బొల్లికి మందులు లేవా?

    ఆయుర్వేదం, హోమియోపతి, యునాని లోనూ ఈ వ్యాధికి మందులు ఉన్నాయని అంటారు కానీ ఈ మందులు గుణం చేసిన సందర్భాలని శాస్త్రీయంగా పరిశోధించి, విశ్లేషించి, నమోదు చేసిన సందర్భాలు అరుదు. కనుక మందు నిజంగా పని చేసిందో, తథాస్తు ప్రభావమో (placebo effect) లేదా కాకతాళీయంగా గుణం కనిపించిందో నిర్ధారించి చెప్పడం కష్టం. అంతే కాకుండా హోమియోపతి వైద్యులు వారు వాడుతూన్న మందు పేరేమిటో చెప్పరు – అదేదో వ్యాపార రహస్యంలా దాచిపెడతారు. అందువల్ల నిజంగా పనిచేసే మందు ఉన్నా అది అడవి కాసిన వెన్నెలే! పోనీ, వారు మందు పేరు చెప్పేరనుకుందాం. అప్పుడు మనం డబ్బుకి కక్కుర్తిపడి సొంత వైద్యం మొదలుపెడతాము కదా. ఆయుర్వేదంలో కూడా మందులు ఉన్నాయి. పరిశోధన, పోషణ లేక వారి మందులు కూడా వాడుకలో నమ్మకం పోగొట్టుకుంటున్నాయి. ఉదాహరణకి గరుడ ఫలం (Hydnocarpus wightianus) గింజల నుండి తీసిన తైలాన్ని ఇంగ్లీషులో చాల్మూగ్రా తైలం (Chaulmoogra oil) అంటారు. ఈ తైలాన్ని బొల్లి మచ్చల మీద రాస్తే మచ్చలు పోతాయి. ఈ తైలం మందుల దుకాణాలలో దొరుకుతుంది.

    ఒక రోగి చరిత్ర

    పైన చెప్పినదంతా సిద్ధాంతం. ఇప్పుడు నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. దీనిని కేవలం ఒక ఉపాఖ్యానం (anecdote) గానే పరిగణించాలి కానీ శాస్త్రీయంగా జరిగిన పరిశోధన ఫలితం కాదు. ఒక కోకిల కూసినంత మాత్రాన వసంతం వచ్చినట్లేనా?

    అది 1995 ప్రాంతం. ఆనంద్ అనే ఉపతాపి వయస్సు 55-60 ఉండొచ్చు. నివాసం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం. ఉద్యోగపు జీవితంలో ఎక్కువ ఒత్తిడి ఎదుర్కుంటూన్న సమయం. ఒక ఉదయం గెడ్డం గీసుకుందుకని అద్దం ముందు నిలుచోగానే పై పెదవి మీద, మీసం ఆకారంలో, తెల్లటి పొడుగాటి మచ్చ అకస్మాతుగా కనబడింది. అది కుడి వైపే ఉంది. కుడి బుగ్గ మీద దమ్మిడీ అంత మేర తెల్లటి మచ్చ కనబడింది. కుడి ముంజేతి మీద దమ్మిడీ అంత మేర మరొక తెల్లటి మచ్చ కనబడింది. కైజర్ ఆసుపత్రిలో చర్మవైద్యపు నిపుణుడిని సంప్రదించేడు. ఆ వైద్యుడు గదిలో దీపాలు అన్నీ ఆర్పేసి అత్యూద కిరణాలు మాత్రమే ప్రసరించే నల్ల దీపం (dark lamp) వేసి రోగిని అద్దంలో చూడమన్నాడు. ఒక్క పెదవి మీదనే కాదు; ముఖం కుడి భాగం అంతా తెల్లటి మచ్చలే! అప్పుడు చెప్పేడు ఆయన: “నాయనా! దీనిని విటిలైగో అంటారు. దీనికి మందు లేదు. బజారుకెళ్ళి నీ శరీర చాయకి నప్పే మేకప్ సామాను కొనుక్కుని రోజూ మేకప్ చేసుకుని పని లోకి వెళ్ళు.” ఈ అయిదు నిమిషాల సంప్రదింపుకి ఆయన ఫీజు 400 డాలర్లు!

    ఆనంద్ నా సలహా అడిగేడు. నేను చెప్పినదేమిటంటే, “అయ్యా! నాకు తెలిసిన మేరకి విశాఖపట్నంలో డాక్టర్ బి. నరసింహారావు అనే ఇంగ్లీషు వైద్యం చేసే వైద్యుడు ఉన్నారు. ఆయన ప్రత్యేకత బొల్లిని కుదర్చడం. ఆయనకి ఎంత పేరుందంటే ఆయనకి మద్రాసు, హైదరాబాదు, కలకత్తాలో కూడా ఆఫీసులు ఉన్నాయి. వెళ్ళి నా పేరు చెప్పి పరిచయం చేసుకొండి.

    “ఈ రుగ్మత మీద రాంబాణంలా పనిచేసే మందు ఒకటి హోమియోపతిలో ఉందని మా నాన్నగారు చెప్పేవారు. సాధారణంగా హోమియోపతిలో ‘ఫలానా జబ్బుకి ఫలానా మందు’ అనే సూత్రం లేదు. ‘రోగి తత్త్వాన్ని బట్టి ఫలానా రోగికి ఫలానా మందు’ అనేదే వారి సూత్రం. కానీ ఈ సూత్రానికి మూడు మినహాయింపులు ఉన్నాయి. ఒకటి, శరీరానికి దెబ్బ తగిలితే వెంటనే అర్నికా వాడాలి. రెండు, మనస్సుకి దెబ్బ తగిలితే వెంటనే హైపరికమ్ వాడాలి. మూడు, బొల్లి మచ్చలు కనబడితే…” అంటూ “ఆయన చెప్పిన మందు పేరు నాకు ఇప్పుడు గుర్తుకి రావడంలేదు. హైదరాబాదులో శర్మగారు అనే హోమియో వైద్యుడు ఉన్నారు. ఆయనకి మంచి పేరు ఉంది. ఆయనని కూడా సంప్రదించండి. ఏ పుట్టలో ఏ పాము ఉందో” అని సలహా ఇచ్చేను.

    నా స్నేహితుడు విమానం టికెట్టు కొనుక్కుని హైదరాబాదు వెళ్ళి ముందు నరసింహారావుగారిని కలుసుకున్నాడు. ఆయన నేను పైన చెప్పిన PUVA వైద్యం చెయ్యమని సలహా ఇచ్చి, మందులు రాసి ఇచ్చేరు. అమెరికాలో ఎండలు తక్కువ కనుక ఎండలో రోజూ నాలుగేసి గంటలు కూర్చోమని సలహా ఇచ్చేరు.

    ఆనంద్‌ని హోమియో వైద్యుడు శర్మగారి దగ్గరకి మా అన్నయ్య దగ్గరుండి తీసుకుని వెళ్ళేడు. ఆయన – ముఖం మీద కనబడుతూన్న మచ్చలని చూసి, మరే ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదంటూ – అప్పటికప్పుడు రోగి నోట్లో ఆవగింజలంత మాత్రలు అరడజను వేసి, వేరొక పెద్ద సీసా నిండా వేరొక రకం మాత్రలు నింపి వాటిని వారానికి మూడు మాత్రలు చొప్పున ఏడాది పాటు వేసుకోమన్నారు. అనగా, హోమియోపతి వైద్యం మొదలయినట్లే కదా.

    అప్పుడు ఆనంద్‌తో మా అన్నయ్య అన్నాడుట. “అయ్యా! ఏం మందు ఇచ్చేరు అని శర్మగారిని అడిగితే మర్యాదగా ఉండదని అడగలేదు కానీ ఆ మందుని గరుడఫలం నుండి తీసిన తైలంతో చేస్తారని మా నాన్నగారు చెప్పగా విన్నాను. ఆ తైలం చాల్మూగ్రా తైలం అనే పేరుతో అమ్ముతారు. సీసా ఒకటి కొనుక్కుని పట్టుకెళ్ళండి. మీకు అభ్యంతరం లేకపోతే పైపూతకి లేపనంగా వాడి చూడండి.”

    ఆనంద్ మూడు మందులూ పట్టుకుని అమెరికా తిరిగి వచ్చేడు. పూవా వైద్యంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఆ మందుని వాడడం మానేసి హోమియో మాత్రలు లోపలికి, చాల్మూగ్రాయిల్ పై పూతకి ఏడాది పాటు వాడేసరికి మచ్చల ఉధృతం తగ్గింది. రెండు, మూడేళ్ళు పోయేసరికి మచ్చలు పూర్తిగా పోయాయి!

    ఈ ఉదంతం చెప్పడానికి కారణం ఇంగ్లీషు వైద్యాన్ని తోసిపుచ్చడానికీ కాదు, హోమియో వైద్యాన్ని సమర్ధించడానికీ కాదు. ఒకానొక సందర్భంలో – ఈ జబ్బుకి మందు లేదు అని అమెరికాలో వైద్యులు చెప్పిన సందర్భంలో – హోమియో వైద్యం పని చేసిందనిన్నీ, మూడు గంటలు ఎండలో కూర్చునే కంటే మూడు మాత్రలు నోట్లో వేసుకోవడంలో సౌకర్యం ఉందని చెప్పడానికే. కనుక ఈ దిశలో మన దేశంలో పరిశోధన చెయ్యవలసిన అవసరం ఉంది!

    నాకు చేరిన సమాచారం ప్రకారం డా. నరసింహారావుగారు, డాక్టర్ శర్మగారు – ఇద్దరూ స్వర్గస్తులయేరు.