ఆగస్టు 4, 2001. ఆర్లేండో అంతర్జాతీయ విమానాశ్రయం
ఇమ్మిగ్రేషన్ హాలు వస్తూన్న ప్రయాణీకులతో కిటకిటలాడుతోంది. పౌరులు ఎడమ పక్క వరుసలలోకి, అతిథులు కుడిపక్క వరసలలోకి బారులు తీర్చి నిలబడి ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ ఇన్స్పెక్టర్లకి రోజూ తరగనిదంపులా చేసే పనే: ‘తరవాత వారు!’ అని పిలవటం, ‘పేస్‌పోర్టు!’ అని యాంత్రికంగా అడగటం. ఆ పేస్‌పోర్టు అందుకుని, దానిని చదివే యంత్రంలోని గాడిలో పెట్టి గీకుతూ, ‘ఏపని మీద వస్తున్నారు? ఎన్నాళ్ళు ఉంటారు?’ అని ముక్తసరిగా రెండు మూడు ప్రశ్నలు అడిగి, ‘అమెరికాకి స్వాగతం’ అంటూ పేస్‌పోర్టులో ముద్ర వేసి ప్రయాణీకులని బయటకి పంపుతున్నారు అధికారులు.
తమ తమ విధులని చకచకా నిర్వర్తించుకుంటూ పోతూన్న ఇమ్మిగ్రేషన్ తనిఖీదారులని ఒకసారి పరకాయించి చూసి, సంతృప్తిగా తల పంకించేడు హోజే పెరేజ్ – తన ఆఫీసు గది గుమ్మం దగ్గర నిలబడి మీసాలని సవరించుకుంటూ. వేలకొద్దీ ప్రయాణీకులు ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. అలాగని ఏమరుపాటు పనికి రాదు. ఒక్క వ్యక్తి దేశంలోకి అక్రమంగా ప్రవేశించినా, నిషిద్ధమైన వస్తువులని (మాదక ద్రవ్యాలు, మొక్కలు, విత్తనాలు, వగైరా) దొంగచాటుగా దేశంలోకి తీసుకువచ్చినా అది ఏ అనర్ధానికి దారి తీస్తుందో కదా. అందుకని అధికారులు అప్రమత్తతతో ఉండటం అత్యవసరం.
హోజే పెరేజ్ ఆఫీసులో బల్ల మీద టెలివిజన్ సి.ఎన్.ఎన్. ఛానెల్ మీద వచ్చే బొమ్మలని మాత్రం నిశ్శబ్దంగా చూపిస్తోంది. టేపు మీద నమోదు చేసిన వార్తలని తిరిగి తిరిగి ప్రసారం చేస్తూన్నట్లున్నారు. వచ్చిన వార్తలే పదే పదే పునరావృత్తం అవుతున్నాయి: ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ వాళ్ళు లండన్‌లో మరొక కారులో బాంబు పెట్టి పేల్చేరుట. యుగొస్లావియాలో ముస్లిం తిరుగుబాటుని ఎలా అదుపులో పెట్టటమా అన్నది కోసొవో సమావేశంలో ప్రెసిడెంట్ బుష్ ఎదుట ముఖ్యాంశం. ఈ వార్తలు చూడగా చూడగా మెదడు తిమ్మిరెక్కి పోయినట్లుంది హోజే పెరేజ్‌కి! బయటకి వచ్చి ప్రజావాహినిని చూస్తూ నిలబడ్డాడు.
హోజే పెరేజ్ పై అధికారి ఒక దస్త్రం పట్టుకుని వస్తూ, “హోజే! ఇది సౌదీ అరేబియా నుండి వస్తూన్న ఒక ప్రయాణీకుడి దస్త్రం. ఇంగ్లీషు రాదుట. ఇమ్మిగ్రేషన్ ఫారమూ, దిగుమతి సుంకాల ఫారమూ పూర్తిగా నింపలేదు. కొంచెం చూడండి.” ఆ దస్త్రం పుచ్చుకున్నాడు హోజే సరే అంటూ.
ఇమ్మిగ్రేషన్ ఫారమూ, కస్టమ్స్ డిక్లరేషనూ చాలమంది పూర్తిగా నింపలేరు. ఇలాంటి వ్యక్తులని దేశం లోపలికి రానిచ్చే ముందు ఎలా తనిఖీ చెయ్యాలో, ఆ నిబంధనలన్నీ, పుస్తకంలో రాసిపెట్టి ఉంటాయి: ప్రశ్నించు, తనిఖీ చెయ్యి, నిశ్చయించు. ప్రశ్నించాలంటే భాష రావాలి. అంటే, అరబ్బీ, ఇంగ్లీషు తెలిసిన దుబాసీ కావాలి. ఇమ్మిగ్రేషన్ వారికి ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండే దుబాసీలు ఉంటారు. వారిలో షఫీక్ ఫవూద్ అనే ఆసామీని ఎంపిక చేసి అతనిని ఫోనులో పిలచేడు. పరిస్థితిని వివరించి లైన్‌లో వేచి ఉండమని చెప్పేడు. భాష సమస్య తీరింది కనుక ఏయే ప్రశ్నలు అడగాలో తేల్చుకోడానికి దస్త్రం తెరచి, ముఖ్యాంశాలని పరిశీలించి చూసేడు.
మహమ్మద్ ఆల్ ఖతానీ దుబాయ్‌లో విమానం ఎక్కి, అక్కడ నుండి లండన్ చేరుకున్నాడు. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ వారి విమానంలో, ఒకే ఒక పెట్టెతో, అమెరికా చేరుకున్నాడు. ప్లారిడాలో డిస్నీవరల్డ్ చూడటానికి సౌదీ నుండి పర్యాటకులు తరచు వస్తూ ఉంటారు. ఈ ‘కేసు’ని పది నిమిషాలలో తేల్చెయ్యవచ్చని, ఇదే పరిస్థితిలో పడ్డ ప్రయాణీకులు వేచి ఉండే గదిలోకి వెళ్ళి, ఒక వ్యక్తిని ఎంపిక చేసి, అతని ఎదురుగా నిలబడి, “మహమ్మద్ ఆల్ ఖతానీ?” అని అడిగేడు. దస్త్రంలో ఉన్న ఫొటోకీ, ఎదురుగా కూర్చున్న వ్యక్తికీ మధ్య ఉన్న పోలికలకోసం పరికించి చూస్తూ.
కుర్చీలో కూర్చుని, మోచేతులనీ మోకాళ్ళ మీద ఆనించి, తదేకంగా నేలని పరిశీలిస్తూన్న ఖతానీ తల పైకెత్తి, లేచి నిలబడ్డాడు. హోజే ఆ ఆరడుగుల ఆసామీ కళ్ళల్లోకి సూటిగా చూసేడు.
మోకాళ్ళు దిగేంత వరకు పొడుగున్న నల్లటి కమీజు, నల్లటి కుర్తా, నల్లటి జోళ్ళు, గుబురుగా పెరిగి సంరక్షణ లేని నల్లటి గడ్డం – ఇదీ ఆ ప్రయాణీకుడి అవతారం. “దయచేసి నాతో రాండి,” అంటూ హోజే పెరేజ్ సౌదీని తనతో ఒక చిన్న గదిలోకి తీసుకెళ్ళి, గది తలుపు వెయ్యకుండా, బారుగా తెరిచే ఉంచాడు, ‘ఇదేదో బందిఖానా’ అనే భ్రమ కలిగి భయపడకుండా ఉండటానికా అన్నట్లు.
అది ఆర్భాటం లేని చిన్న గది. ఆ గదిలో ఒక చిన్న బల్ల, రెండు కుర్చీలు ఉన్నాయి. ఇద్దరూ చెరొక వైపూ ఎదురెదురుగా కూర్చున్నారు. బల్ల మీద ఉన్న త్రిభుజాకారపు పరికరం మీద ఉన్న మీటని నొక్కి, “డాక్టర్ షఫీక్ ఫవూద్! మీరు అక్కడ తయారుగా ఉన్నారా?” అంటూ వేచి ఉన్న దుబాసీని పలకరించి, ఖతానీ వైపు తిరిగి, “ఈ టెలిఫోనుకి అవతల పక్క అరబ్బీ మాట్లాడే వ్యక్తి ఉన్నారు. ఆయన సహాయంతో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరిచ్చే సమాధానాలని బట్టి అమెరికాలో ప్రవేశించటానికి మీకు అనుమతి ఇవ్వటమో, నిరాకరించటమో జరుగుతుంది.” అని ఇంగ్లీషులో చెప్పి, అనువాదం కోసం హోజే ఆగేడు. డాక్టర్ ఫవూద్ ఈ వాక్యాన్ని అనువదించి చెబుతూ ఉంటే ఖతానీ హోజేని మింగేస్తాడా అన్నట్లు కొరకొరా చూస్తున్నాడు. హోజే తను అడగవలసిన ప్రశ్నలని ఒకటీ ఒకటీ అడగటం మొదలుపెట్టేడు.
“తిరుగు ప్రయాణానికి మీ దగ్గర టికెట్టు ఎందుకు లేదు?”
“ఇక్కడ నుండి మరెక్కడికి వెళతానో నాకే తెలియదు. అటువంటప్పుడు తరువాత మజిలీకి టికెట్టు ఎలా కొనుక్కుంటాను?”
“ఇక్కడ నుండి ఊళ్ళోకి తీసుకువెళ్ళటానికి ఎయిర్‌పోర్టుకి ఎవ్వరైనా వచ్చేరా?”
“ఒకరు వస్తారు.”
“వారి పేరు?”
“నాకు తెలియదు.”
“ఈ ఊళ్ళో ఎక్కడ బస చేస్తున్నారు?”
“హొటేల్లో.”
“ఆ హొటేలు పేరు?”
“నాకు తెలియదు.”
“మీకు ఇంగ్లీషు వచ్చినట్లు లేదు. మిమ్మల్ని కలుసుకోటానికి ఎవ్వరు వస్తున్నారో మీకు తెలిసినట్లు లేదు. బయటకి వెళ్ళిన తరువాత చాల ఇబ్బంది పడిపోతారు.”
“నా కోసం బయట ఒక వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు.”
“ఆ వ్యక్తి పేరేమిటి? అతని టెలిఫోను నంబరు కాని ఉందా?”
“అవన్నీ వ్యక్తిగత విషయాలు. అవన్నీ మీకు చెప్పవలసిన అవసరం లేదు.“
హోజే పెరేజ్ ఖతానీని చుస్తూ ఆలోచనలో పడ్డాడు. సౌదీ అరేబియా నుండి యాత్రికులు చాల మంది వచ్చి ఫ్లారిడాలో బాగా డబ్బులు ఖర్చు పెట్టి వెళుతూ ఉంటారు. ఈ వ్యక్తి ఎవ్వరో తెలియదు. భయపడి సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోతున్నాడా? లేక ఇతని ప్రవర్తనకి మరేదైనా కారణం ఉందా? రెండు నిమిషాలు పోయిన తరువాత —
“మీ దగ్గర రెండు వేల నాలుగు వందల డాలర్లు ఉన్నాయని చెప్పేరు. మీ తిరుగు ప్రయాణానికి రెండు వేలు పోగా మిగిలిన నాలుగు వందలు హొటేలు ఖర్చులకి, తిండికి, తిరగటానికి సరిపోవు.”
“మా వాడొకడు డబ్బు పట్టుకొచ్చి ఇస్తాడు.”
“ఎవ్వరైనా ఎందుకు డబ్బు ఇస్తారు?”
“నాకు కావలసినవాడు కనుక.”
“ఈ వ్యక్తిని ఎన్నాళ్ళబట్టి తెలుసు?”
“కొద్ది రోజుల బట్టి.”
హోజే పెరేజ్ లేచి నిలబడి, “ఇప్పుడే వస్తాను,” అని చెప్పి గదిలోంచి బయటకి నడచి వచ్చి, తలుపు చేరవేసి పక్క గదిలోకి వెళ్ళి, రెండు నిమిషాలలో చేతిలో ఒక పుస్తకంతో తిరిగి వచ్చేడు.
“నేను అడిగే ప్రశ్నలకీ, మీరు చెప్పే సమాధానాలు సూటిగా లేవు. నిజమే చెబుతానని మీచేత ప్రమాణం చేయించి మళ్ళా అడుగుతాను. నేను అడిగిన ప్రశ్నలకి జాగ్రత్తగా ఆలోచించి సమాధాలు చెప్పండి. ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎదుట అబద్ధం చెబితే జైలు శిక్ష పడుతుంది.”
డాక్టర్ ఫవూద్ ఈ వాక్యాన్ని అనువదించి చెప్పే వరకు హోజే ఆగి, ఖతానీ ముఖ కళవళికలలో మార్పులని గమనించసాగేడు. ఖతానీ ముఖంలో కొద్దిగా ఆరాటం కనిపించింది కాని, తటపటాయించకుండా ప్రమాణం చెయ్యటానికి ఒప్పుకున్నాడు. ఫవూద్ సహాయంతో ప్రమాణ పత్రం చదివి, ప్రమాణం చేయించి, కాగితం మీద సంతకం పెట్టించి, మళ్ళా ప్రశ్నలు అడగటం మొదలుపెట్టేడు.
“మీ పేరు?”
“మహమ్మద్ అల్ ఖతానీ”
“మీరు బయటకి వెళ్ళిన తరువాత, మిమ్మల్ని కలుసుకోటానికి ఎవరు వస్తున్నారు?”
“నేను చెప్పను” అంటూ ఖతానీ లేచి నిలబడ్డాడు.
అంతవరకు వారిద్దరి మధ్య జరుగుతూన్న సంభాషణనే తర్జుమా చేస్తూన్న డాక్టర్ ఫవూద్ హోజేని ఉద్దేశిస్తూ ఇంగ్లీషులో, “ఇతని ధోరణి చూస్తే ఇతనేదో దాస్తున్నాడనిపిస్తోంది,” అని చెప్పేడు.
హోజే పెరేజ్ మరో సారి బయటకి నడచేడు. గదిలో ఉన్న వ్యక్తి మీద, దూరం నుంచే, ఒక కన్నేసి ఉంచమని అక్కడ ఉన్న పోలీసుతో చెప్పి, చరచర నాలుగు గదులు అవతల ఉన్న మరొక గదిలోకి వెళ్ళి, అక్కడ కంప్యూటర్‌లో ఉన్న ‘నేషనల్ ఆటోమేటిక్ ఇండెక్స్ లుకౌట్ సిస్టం’ని సంప్రదించి చూసేడు. ఖతానీ పేరు అందులో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎవ్వరూ ఇతని కోసం వెతకటం లేదు. ఇతను ఎక్కడా నేరాలు చేసిన దాఖలాలు లేవు. నిఘా వెయ్యవలసిన వ్యక్తుల జాబితాలో ఇతని పేరు లేదు. హోజే పెరేజ్‌ది ఆధారాలు లేని అనుమానం. నల్లవాళ్ళంతా చెడ్డ వాళ్ళే అనటం, మెక్సికో వాళ్ళంతా దొంగాళ్ళే అనటం ఏమి సబబు? ఈ అరబ్బులు కోపిష్టి వాళ్ళు. ఈ ఖతానీ ఇంగ్లీషు రాని ఏ పల్లెటూరి బైతో అయుండవచ్చు. లేక ఏ చిన్న ముఠాకో నాయకుడు అయి ఆత్మాభిమానంతో కోపం తెచ్చుకుని ఉండొచ్చు. ముందూ వెనకా చూసుకోకుండా అరెస్టు చేస్తే ఏమి చిక్కులు వస్తాయో? హోజే పెరేజ్ మరొక సారి గదిలోకి వచ్చేడు.
“మీరు సౌదీలో చేసే ఉద్యోగం?”
“కార్లు అమ్ముతాను.”
“సరే!” అంటూ తనతో పట్టుకొచ్చిన చిన్న పెట్టె తెరచి, బల్ల మీద పెట్టి, ఖతానీ చేతులు అందుకుని, ఒక క్రమ పద్ధతిలో అతని పది వేళ్ళకీ సిరా పులిమి, చకచకా వేలి ముద్రలు తీసేడు. వేలిముద్రలు తీసి, సంతకాలు పెట్టించుకుంటూ ఉంటే ఖతానీ ఏమీ అభ్యంతరం పెట్టలేదు. ఇదంతా అమెరికాలో ప్రవేశించటానికి ముందు రివాజుగా చేసే తంతు అనుకుని ఉంటాడు.
వేలిముద్రల కాగితాలు అన్నీ భద్రంగా దాచి, హోజే పెరేజ్ లేచి నిలబడ్డాడు.
“సార్, మిమ్మల్ని అమెరికా ఆహ్వానించలేకపోతున్నాదని చెప్పటానికి చింతిస్తున్నాను. మీ దరఖాస్తుని ఉపసంహరించుకోటానికి మీకు ఆఖరు సారి అవకాశం ఇస్తున్నాను. దుబాయ్ వెళ్ళే విమానం దగ్గరకి నేను దగ్గరుండి తీసుకెళతాను. అక్కడ మీ దగ్గర ఉన్న డబ్బుతో టికెట్టు కొని ఇస్తాను.”
ఖతానీ నిశ్చేష్టుడై నిలబడ్డాడు. అతనికి కోపం తెరలు తెరలుగా వస్తోంది. ఏమి చెయ్యాలో పాలు పోలేదు.
“మీరు నన్ను మోసం చేసేరు. మీరు అనుమతి ఇస్తారనుకుని వేలిముద్రలు కూడ ఇచ్చేను. ఇదంతా పచ్చి మోసం. నేను తిరిగి వెళ్ళటానికి వీలు లేదు. టికెట్టు కొనటానికి నేను డబ్బు ఇవ్వను. ఏమిటి చేస్తారు?”
“టికెట్టు కొనే వరకు మా అమెరికా ప్రభుత్వపు అతిథి గృహంలో మిమ్మల్ని ఉంచుతాం. టికెట్టు ఎప్పుడు కొంటే అప్పుడే ఇంటికి వెళ్ళ వచ్చు.”
దారి, తెన్ను తెలియక, “సరే! అలాగే!!” అని నీలుగుతూ ఎమిరేట్స్ వారి గేటు వైపు నడిచేడు.
సెప్టెంబర్ 11, 2001. న్యూ ఆర్క్ అంతర్జాతీయ విమానాశ్రయం
యునైటెడ్ వారి ఫ్లయిట్ 93 ఉదయం 8:00 గంటలకి బయలుదేరవలసినది 40 నిమిషాలు ఆలశ్యం అయింది. జియా జారా విమానం ఎక్కేడన్నమాటే కాని అతని బుర్రలో, వెనకాతల ఎక్కడో, ఐదు వారాల క్రితం జరిగిన సంభాషణే వినిపిస్తోంది. తనూ, మహమ్మద్ అత్తా ఆర్లేండో అంతర్జాతీయ విమానాశ్రయం బయట కారులో కూర్చుని వారి బృందంలో చేరవలసిన ఆఖరి వ్యక్తి కోసం మూడు గంటలకి పైగా ఎదురు చూసేరు. ఎప్పటికీ బయటకి రాడే!
“ఖతానీ లేకుండా మేము నలుగురం కలసి ఈ పని చెయ్యలేము” తను, మహమ్మద్ అత్తాతో అంటున్నాడు, “మిగిలిన జట్లన్నిటిలోను అయిదుగురేసి ఉన్నారు. నలుగురు సరిపోరు.”
“మనం గంటల తరబడి నిరీక్షించి చూసేం. ఖతానీ లండన్‌లో బయలుదేరేడని మనకి తెలుసు. కనుక ఇమ్మిగ్రేషన్ వాళ్ళతో ఏమి ఇబ్బందులు పడుతున్నాడో. ఇప్పుడు మరొక వ్యక్తి కోసం వెతుకుతూ కూర్చుంటే మొదటికే మోసం. కనుక నలుగురితో సరిపెట్టుకోవాలి. మార్గాంతరం లేదు.”
ఇలా ఆలోచనలు ముసురుకుంటూ ఉండగా జియా జారా మొదటి తరగతి విభాగంలో, మొదటి వరసలో, నడవకి పక్కనే ఉన్న ఉపవిష్టికలో కూర్చుని తన జట్టు వాళ్ళల్లో మరొకడు మొదటి తరగతి రెండవ వరస కుర్చీలో కూర్చోవటం చూసేడు. కళ్ళతోనే పలకరించుకున్నారు ఇరువురూ. మరిద్దరు పొదుపు తరగతిలోకి వెళ్ళటం కూడ చూసేడు, జియా. సంతృప్తిగా కళ్ళు మూసుకుని అల్లాని తలుచుకుని, మౌనంగానే ప్రార్ధన చెసేడు. అల్లా మీద మనస్సు నిలవలేదు. తను విమానం ఎక్కే ముందు జెర్మనీలో ఉన్న తన స్నేహితురాలికి రాసిన ఉత్తరంలోని మాటలే అతని స్మృతిపథంలో పదే పదే మెదిలాయి: “నా విధి నేను నిర్వర్తిస్తున్నాను. ఫలితం చూసిన తరువాత నువ్వే గర్వ పడతావు.”
ఖతానీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. తను, తన వెనక కుర్చీలో ఉన్న వాడు విమానాన్ని నడపగలరు. వీళ్ళిద్దరూ కాక్‌పిట్‌లో ఉండిపోతే వీళ్ళ రక్షణకి ద్వారపాలకులుగా మిగిలిన ఇద్దరూ ఉంటారు. ప్రయాణీకులని భయపించి అదుపులో పెట్టటానికి మరొక వ్యక్తి ఎంతైనా అవసరం.
జారా వెనక్కి తిరిగి చూసేడు. విమానం నిండుగా లేదు. అక్కడక్కడ ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. ఈ కొద్దిమంది ప్రయాణీకులని అదుపులో పెట్టటం కష్టం కాకపోవచ్చు. గత పద్దెనిమిది నెలల బట్టీ పూర్వప్రయోగాలు చేసుకుంటూనే ఉన్నారు. నిజంగా ఇది జరిగే పనేనా? అనుకున్న ప్రకారం అందరూ తమ విధులు నిర్వర్తిస్తారా? లేక తానొక్కడే ఈ సాహసం చేస్తే మిగిలిన వాళ్ళు ఆఖరు క్షణంలో కాళ్ళకి నీరసం వచ్చి వెనక్కి తగ్గుతారా? ఇప్పుడు ఇంకా ఈ శషభిషలు ఎందుకు అనుకున్నాడు.
ఉదయం 8:41 — విమానం పరుగుబాట మీద జోరుగా వెళ్ళి అలవోకగా గాలిలోకి లేచింది.
ఉదయం: 9:35 — విమానం లేవవలసిన ఎత్తుకి లేచి పశ్చిమ దిక్కుగా, శాన్ ఫ్రాన్సిస్కో వైపు, ప్రయాణం మొదలుపెట్టింది. విమానాన్ని ఆటోపైలట్‌లో పెట్టి పైలట్లు ఇద్దరూ చేతులు చాపుకుని ఫ్లైట్ అటెండంట్ అందించిన నారింజ రసం చప్పరిస్తున్నారు. ఇంతలో అంతా త్రుటి కాలంలో జరిగిపోయింది.
ఒకటవ తరగతిలో ఉన్న జారా, అతని వెనక కుర్చీలో ఉన్న వ్యక్తీ, ఇద్దరూ లేచి కాక్‌పిట్ తలుపులు తోసుకుని లోపలికి వెళుతూ ఉంటే అక్కడ ఉన్న అటెండంట్ అడ్డుకుంది. వెంటనే ఆమెని కత్తితో పొడిచేస్తే ఆమె నేల కూలిపోయింది. వారు కాక్‌పిట్‌లో చొరబడి చోదకులిద్దరినీ కత్తితో పొడిచి, వాళ్ళని కుర్చీలనుండి బయటకి లాగేసి ఆ కుర్చీలలో కూర్చుని పటకాలు బిగించుకున్నారు.
అదే సమయంలో వెనక భాగంలో ఉన్న ఇద్దరు అనుయాయులు, తలకి ఎర్రని రిబ్బన్లు చుట్టుకుని లేచి నిలబడి, “ఈ విమానాన్ని హైజాక్ చేస్తున్నాం. ఇదిగో! ఈ చేతిలో ఉన్నది బాంబు! అందరూ విమానం వెనక్కి జరగండి. ముందుకి కదిల్తే పేల్చేస్తాం.”
వెనక 23వ వరుసలో, మధ్య కుర్చీలో ఉన్న జెరమీ, విమానం సీటు వెనక అమర్చిన ఫోను తీసి, కిందకి వంగి, తన భార్యని పిలిచేడు.
“ఇదిగో! జాగ్రత్తగా విను. కబుర్లకి సమయం కాదిది. మా విమానాన్ని అరబ్బీ వాళ్ళు ఎవరో హైజాక్ చేస్తున్నారు. వాళ్ళ మాటలని బట్టి ఇంకా చాల విమానాలని హైజాక్ చేస్తూన్నట్లు అర్థం అవుతోంది. కింద పరిస్థితి ఏమిటో చెప్పగలవా?” చాల నెమ్మదిగా ఆ ఫోనులో గుసగుసలాడేడు.
“అయ్యో! న్యూ యార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఒక బురుజుని అప్పుడే ఒక విమానం ఢీకొంది. నువ్వు లైనులోనే ఉండు. టి. వి. మీద మరొక వార్త వస్తోంది. అయ్యో! అయ్యో!! మరొక విమానం ఆ రెండో బురుజుని ఢీకొంది.”
“వీళ్ళ వాలకాన్ని బట్టి ఈ విమానాన్ని వెనక్కి తిప్పి వాషింగ్టన్‌లో వైట్ హవుస్‌ని గుద్దే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడే విమానాన్ని వెనక్కి తిప్పేరు. ఐ లవ్ యూ. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో,” అని వెంటనే ఫోను పెట్టేసేడు.
జెరమీ, అతని పక్క నున్న టాం, టాడ్, మార్క్ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. నలుగురూ ఒక్క సారి లేచి కాపలా కాస్తూన్న ఇద్దరి హైజాకర్ల మీద తిరగబడ్డారు.
సెప్టెంబర్ 11, 2001 రాత్రి. కాందహార్, ఆఫ్ఘనిస్తాన్
మహమ్మద్ అల్ ఖతానీ కాలు కాలిన పిల్లిలా టెలివిజన్ ముందు పచార్లు చేస్తున్నాడు. గదిలో మిగిలిన వాళ్ళంతా చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. అల్-ఖైదా అమెరికా మీద చేసిన దండయాత్ర ఇంత విజయవంతం అవుతుందని వాళ్ళు అనుకోలేదు. ప్రపంచ వాణిజ్య కేంద్రంలో ఉన్న రెండు బురుజులు కుప్పకూలిపోయాయి. పెంటగన్ భవనం కూడ కాలిపోతోంది.
కాని యునైటెడ్ 93 ఏమైందో ఎవ్వరూ, ఏమీ చెప్పటం లేదు. మరొక రెండు గంటలు పోయిన తరువాత ఆల్-జజీరా వారు తెర మీదకి వచ్చి, యునైటెడ్ 93 పెన్సిల్వేనియాలో ఒక పొలంలో కూలిపోయిందని వార్త ప్రసారం చేస్తున్నారు. “తాజాగా వస్తూన్న వార్తలని బట్టి యునైటెడ్ 93లో ఉన్న ప్రయాణీకులు హైజాకర్ల మీద తిరగబడి, విమానం వాషింగ్టన్ వరకూ రాకుండా ఆపేసరనిన్నీ, ఆ పోరాటంలో విమానం కూలిపోయిందనిన్నీ వార్తలు చదివే అతను చెబుతున్నాడు.
అక్కడ తచ్చాడుతూన్న ఖతానీ వైపు తిరిగి, “ముదనష్టపోడా! నీ గెడ్డం గొరిగించి నిన్ను గాడిదెక్కించి ఊరేగించినా పాపం లేదు,” అంటూ ఖాలెద్ షేక్ మహమ్మద్ మండిపడ్డాడు. “పందొమ్మిది మంది ఏ ఇబ్బందీ లేకుండా ఇమ్మిగ్రేషన్ వాళ్ళ కళ్ళు కప్పి అమెరికాలో జొరబడ్డారు. నీకేమి పోయేకాలం వచ్చిందిరా? సిగ్గు లేకుండా చేతులాడించుకుంటూ తిరిగి వచ్చేసేవు?”
చేసేది లేక ఖతానీ అక్కడ నుండి పక్క గదిలోకి వెళ్ళిపోయేడు. ఆతని గుడ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి. అతను అమెరికాలో చొరబడ లేకపోయినందుకు గాను దుష్ఫలితం ఇప్పుడు కనిపించింది. దీనికి శిక్ష మరణ దండనే విధిస్తారు అని ఖతానీ నమ్మేడు. కాని అల్ ఖైదా మరోలా ఆలోచించినట్లుంది. అనవసరంగా వీడిని అప్పుడే చంపి సాధించేది ఏముంది? అందుకని, మరొక సారి ఖతానీకి ఒక-వైపు టిక్కెట్టు ఇచ్చి అమెరికా సేనలతో యుద్ధం చేసే నిమిత్తం బోరా-బోరా గుహలకి పంపేరు.
అప్పటికే అమెరికావారి వాయుదళాలు ఆ గుహల మీద బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఆ దాడిలో ఖతానీ ప్రాణాలతో పట్టుబడిపోయాడు. ముందు జలాలాబాదు జైల్లో పెట్టేరు. జనవరి 2002 నాటి కల్లా ఖతానీ క్యూబాలోని గౌన్‌టానమో బే మిలటరీ జైల్లోకి వచ్చి పడ్డాడు.
నవంబరు 17, 2002, గ్వాంటానమో బే, క్యూబా
సార్జెంట్ రావూల్ రొమేరొ తన కమేండర్ ఎదుట సెల్యూట్ చేసి నిలబడ్డాడు. “సార్జెంట్, వీటిని చూడండి.”
అవి రెండు జతల వేలి ముద్రలు. “వీటిలో ఒక జత ఆగస్టు 4న ఆర్లేండో విమానాశ్రయంలో తీసినవి. రెండవ జత, డిసెంబరు 2001న జలాలాబాద్‌లో తీసినవి. ఈ రెండూ ఒక వ్యక్తివే అని వేలిముద్రల నిపుణులు తీర్మానించేరు. గత నెలలలో మన హయాంలోకి వచ్చిన ఖైదీలలో ఉన్నాడు ఈ వేలిముద్రలు గల వ్యక్తి. మనకి తెలియకుండానే జాలం లోంచి జారుకున్న ఇరవైయవ చేప మన ప్రయత్నం లేకుండానే మన వలలో చిక్కుకున్నట్లు ఉంది.”
రావూల్ ఆ వేలి ముద్రలని చూసి తల పంకించేడు. “ఇటువంటి ఖైదీలని ఎలా ప్రశ్నించి సమాచారం రాబట్టాలో సూచిస్తూ సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం: నిద్ర లేకుండా చెయ్యటం. గట్టిగా కర్ణకఠోరమైన సంగీతం వినిపించటం. నమాజు చెయ్యటానికి అవకాశం ఇవ్వకపోవటం. పరమ క్రూరంగా హింసించే దేశాలకి బదిలీ చేసెస్తామని బెదిరించటం.”
నవంబరు 28, 2002. గ్వాంటానమో బే, క్యూబా
లోచెడ్డీ తప్ప మిగిలిన బట్టలన్నీ ఊడదీసి, కళ్ళకి గంతలు కట్టి, తిరుగుడు కుర్చీలో కూచోబెట్టి, చేతులు రెండూ కుర్చీ వెనక్కి లాగి వాటికి బేడీలు వేసి, కూర్చోబెట్టేరు ఖతానీని. గదిలో వాతనియంత్రణ యంత్రం జోరుగా చల్లటి గాలిని ముఖం మీదకి కొడుతోంది. పదిహేను నిమిషాలు పోయిన తరువాత సార్జెంట్ రావూల్ రొమేరో వచ్చి ఎదురుగా నిలబడి గంతలు విప్పేడు.
“చూడు ఈ ఫోటోలని” అంటూ ఎదురుగా బల్ల మీద పందొమ్మిది ఫొటోలు పరచి పెట్టేడు. చలిగాలికి ఒణుకుతూ ఖతానీ ఆ ఫోటోలని చూసి ముఖం పక్కకి తిప్పేసుకున్నాడు.
“మహమ్మద్ ఖతానీ! ఈ పందొమ్మిది మందీ నిన్ను నమ్ముకున్నారు. వీళ్ళందరినీ నట్టేట్లో ముంచేసేవు. ఏమి బావుకుందామని ప్రాణాలు చేతిలో పెట్టుకుని పారిపోయావు?”
రావూల్ వెనకనే ఉన్న సార్జెంట్ లీసా స్మిత్ ముందుకి వచ్చి, “ఆ గోడ మీద చూడు” అంటూ అరబ్బీలో రాసిన మాటలు చూపించింది.
అబద్దాలకోరు! పిరికిపంద! పనికిమాలినవాడు!
“అది నువ్వేనా?” గోముగానే అడిగింది లీసా.
ఖతానీ కళ్ళు మూసుకుని, తల పంకిస్తూ “నాం” అన్నాడు.
రావూల్ వెనకనుండి వచ్చి, ఖతామీ చెవి దగ్గర నోరు పెట్టి, “చూడు! ఖతానీ! ఇక్కడ ఖాళీగా ఉన్న ఇరవైయవ స్థానంలో నీ ఫోటో ఉండవలసింది. పిరికి పందా! పారిపోయేవు! ప్రాణాలకోసం! నీ జిహాద్ గంగలో కలిసిపోయింది.”
ఖతానీకి కళ్ళ వెంబడి జలజలా నీళ్ళు కారటం మొదలయింది.
“ఎవ్వరు? మీ జట్టుకి నాయకుడు ఎవ్వరు?” రావూల్ గర్జించేడు.
“ఒసామా బిన్ లాడెన్.”
రావూల్ ఒక్క సారి ఆగేడు. ఈ ఖైదీ అడిగిన ప్రశ్నకి తిన్నగా సమాధానం చెప్పేడు. అది కూడ నిజం చెప్పేడు.
“నువ్వు ఆర్లేండో ఎందుకు వెళ్ళేవు?”
“నేను చెయ్యవలసిన పనేమిటో నాకు ఎవ్వరూ చెప్పలేదు. వెళ్ళమన్నారు. వెళ్ళేను.”
“నిన్ను ఆర్లేండో విమానాశ్రయంలో కలుసుకుందికి ఎవరు వచ్చేరు?”
“నాకు తెలియదు.”
రావూల్ కోపంతో గిర్రున తిరిగి, బల్ల మీద చేతితో గట్టిగా బాదేడు. ఆ దెబ్బకి ఆ బల్ల మీద ఉన్న ఫోటోలు కొన్ని చెదిరి కింద నేల మీద పడిపోయాయి.
“నీతో విమానంలో నీ జట్టువాళ్ళు మరెవ్వరు ఉన్నారు?”
“నేనొక్కడినే.”
“నాకు నీతో కూర్చుని కబుర్లు చెప్పటానికి తీరిక లేదు” అంటూ మరొకసారి కోపం ప్రదర్శించేడు. నిజానికి ఖతానీ చెబుతూన్నవన్నీ నిజమే అని రావూల్‌కి తెలుసు. కాని, తనకి కావలసిన సమాచారం ఇంకా దొరకలేదు.
“చెప్పు! ఒక్క పేరు చెప్పు! నీతో పని చేసిన వాళ్ళల్లో ఒక్కడి పేరు చెప్పు.”
నీళ్ళు చిమ్ముతూన్న కళ్ళతో, “ఒక్క సారి ఒంటేలుకి వెళ్ళాలి” అని ప్రాధేయపడ్డాదు ఖతానీ.
“ఒక్క పేరు చెప్పు. నిన్ను ఒంటేలుకి వెళ్ళనిస్తాను.”
“ఆబూ అహమ్మద్ అల్ కువైటీ! నాకు ఇంటర్నెట్ నేర్పేడు.”
“ఇంటర్‌నెట్? వైట్ హౌస్ మీదకి దాడి చెయ్యటానికి బయలుదేరిన నువ్వు ఇంటర్‌నెట్ నేర్చుకోవలసిన అవసరం ఏమిటి? అబద్దాల రాస్కెల్!” అంటూ కోపంగా బయటకి వెళ్ళిపోతూ, సార్జెంట్ లీసా స్మిత్ వైపు తిరిగి, “అతనికో సీసా ఇచ్చి అందులో, నీ ఎదటే, ఒంటేలు పోసుకోమని చెప్పు,” అంటూ జరజరా బయటకి వెళ్ళి తన గదిలోకి జారుకున్నాడు.
గదిలో కంప్యూటర్ మీద మహమ్మద్ అల్ కువైటీ అన్న పేరు ఎక్కించి, “ఈ వ్యక్తి ఖైదీ నంబరు 063కి ఇంటర్‌నెట్ వాడటం నేర్పించేడుట. ఎవరీ కువైటీ? సి. ఐ. ఎ. వారికి ఈ పేరు చేరవేసి వాకబు చెయ్యండి,” అని రాసి ఆ వార్తని వెంటనే పంపించేసేడు.
ఆగస్టు 4, 2010, ఇస్లామాబాద్, పాకిస్తాన్
అమెరికా ప్రభుత్వపు రహస్య గృహం. అంతర్భాగంలో సి. ఐ. ఎ. మనిషి పాల్, ఆ దేశంలో జరుగుతూన్న సెల్ ఫోను సంభాషణలని జాగ్రత్తగా వింటున్నాడు.
“ఎవ్వరు?” పక్కనున్న కర్మచారి అడిగేడు.
“ఎవ్వరో వార్తలు మోసేవాడుట? పదే పదే వినిపిస్తోంది. ఎవరై ఉంటారో?”
“ఎవ్వరో అంటే సరిపోదు. పేరు కావాలి.”
“షేక్ ఆల్ కువైటీ అని వినిపిస్తోంది.”
“అరెరె! ఆ పేరు గ్వాంటానమో బేలో ఉన్న ఒక ఖైదీ నోటి వెంట ఏడేళ్ళ క్రితం వినిపించింది. ఇంటర్‌నెట్ నేర్పుతాడుట.”
“వాడి గాత్రముద్ర టేపు మీద నమోదు చేసేం. వాడి సెల్ ఫోను నంబరు కూడా మా దగ్గర ఉంది. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఆ అక్షాంశ రేఖాంశాలు సంపాదిస్తున్నాం.”
“ఆబతాబాద్! ఇస్లామాబాద్ పొలిమేరల్లోనే ఉంది. ఆల్ కువైటీ అక్కడే ఉన్నాడు.”
మే 2, 2011 ఉదయం 2:00. ఆబతాబాద్, పాకిస్తాన్
అమెరికన్ నావిక దళం వారి సీల్ టీమ్ వంద సార్లయినా పూర్వప్రయోగాలు చేసుకుని ఉంటారు. ఎట్ట ఎదుట ఆరడుగుల ఆరంగుళాలు పొడుగున్న గెడ్డాల వ్యక్తే ఒసామా బిన్ లాడెన్ అని గుర్తు పట్టటానికి క్షణం కూడ పట్టలేదు. చేతిలో ఉన్న హెక్లర్ అండ్ కాచ్ 416 పిస్తోలుతో గురి పెట్టి రెండు సార్లు పేల్చేడు, “ఈ రెండూ వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండు బురుజులకి,” అంటూ.
బిన్ లాడెన్ తన పడక గదిలోకి పరిగెడుతూ నేల మీద పడిపోయేడు. అతని భార్యలు ఇద్దరు అతని మీద పడి లబో, దిబో అంటూ ఉంటే ఒకామె కాలి మీద పిస్తోలుతో కాల్చి పక్కకి తోసేసి, నేల మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూన్న బిన్ లాడెన్ ఛాతీ మీద గురిపెట్టి – “ఒకటి పెంటగన్ భవనానికి, మరొకటి యునైటెడ్ 93కి,” అంటూ పేల్చేడు.
బిన్ లాడెన్ ప్రాణాలు తీసినది నేవీ సీల్ తూటాలే అయినా, బిన్ లాడెన్ చావుకి నిజమైన కారకుడు అలనాడు ఆర్లేండో విమానాశ్రయంలో, కేవలం మనస్సులో పీకుతూన్న అనుమానం మీద, ఖతానీ వేలిముద్రలు తీసుకున్న హోజే పెరేజ్ అని మనం మరచిపోకూడదు.
[Glen Beck, ”The Missing 9/11 Terrorist: The Power of Everyday Heroes,” in Miracles and Massacres: True and Untold Stories of the Making of America, Simon & Shuster, New York, NY 2013 అనే ఇంగ్లీషు మూలం లో 50 శాతం పైగా కత్తిరించగా మిగిలినదానికి స్వేచ్ఛానువాదం.]