వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు

3. తెలుగుపై ఇంగ్లీషు ప్రభావం

అనుకరణకి గమ్యం తెలుగు అనుకున్నప్పుడు ఏ తెలుగు అనే ప్రశ్న వస్తుంది? ఈ వ్యాసం నిర్మించుకున్న పరిధిలో మన గమ్యం శిష్టవ్యవహారికం – అనగా, ఈ రోజుల్లో వార్తాపత్రికలలోను, అంతర్జాలపత్రికలలోను, కథలలోను, తరచుగా కనిపించే వ్యవహార శైలి భాష. ఈ రకం భాష ముద్రణా మాధ్యమంలో కనిపిస్తోంది కాని టెలివిజన్ కార్యక్రమాల్లో ‘లంగరమ్మలు, లంగరయ్యలు’ మాట్లాడే భాషలో వినిపించటం లేదు. హలంతాలైన ఇంగ్లీషు శబ్దాలు కలుపు మొక్కలలా అజంతాలైన తెలుగు క్షేత్రంలో చొరబడటం తెలుగులో తెలుగుతనం లోపించడానికి ఒక కారణం. ఈ ధోరణి తెలుగు నుడికారానికే ఎసరు పెడుతున్నాది. ఉదాహరణకి, పుట్టగొడుగుల వేపుడు చెయ్యటం ఎలాగో, ఒక తెలుగు పత్రికలో, ఈ దిగువ చూపిన విధంగా అభివర్ణించేరు ఒక రచయిత్రి.

తయారు చేసే పద్ధతి:

ఆయిల్ ని హీట్ చేసి, అందులో థరవ్‌గా వాష్ చేసి డ్రెయిన్ చేసిన బాస్మతీ రైస్‌ని త్రీ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. అప్పుడు సూటబుల్ ఎమౌంట్ వాటర్ పోసి బోయిల్ చేసి రైస్ మెత్తబడేవరకూ కుక్ చెయ్యాలి. కుక్డ్ రైస్‌ని కూల్ చెయ్యాలి. అనదర్ డిష్ లో ఆయిల్ పోసి అందులో డైస్ చేసిన అనియన్ పీసెస్, క్యాప్సికం, బీన్స్ వేసి వన్ మినిట్ ఫ్రై చెయ్యాలి. ఆఫ్టర్‌వర్డ్స్ సోయ సాస్, టొమేటో పేస్ట్, పెప్పెర్ పౌడర్, సాల్ట్ ఏడ్ చేసి అప్పుడు డైస్ చేసిన మష్‌రూం పీసెస్ మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చెయ్యాలి. మష్రూం పీసెస్ సాఫ్ట్‌గా అయిన తరువాత కుక్ చేసి, కూల్ చేసిన రైస్ మిక్స్ చేసి టెన్ మినిట్స్ ఫ్లేం మీద ఉంచి అప్పుడు సెర్వ్ చెయ్యాలి. చాల టేస్టీగా ఉంటుందీ డిష్. ట్రై చెయ్యండి.

ఇంగ్లీషు వాడకం తెలుగులోకి ఎంతలా జొరబడిందో, తెలుగులో తెలుగుతనానికి ఎసరు పెట్టే ప్రతికూల శక్తుల ప్రభావం ఎంతగా బలిసిందో చెప్పడానికి పై ఉదాహరణ చాలు. ఇప్పుడు ఒక ‘ఎదురు ఉదాహరణ’ని కూడ ఇస్తాను. ఒక ఇంగ్లీషు వ్యాసంలో ఈ దిగువ వాక్యం కనిపిస్తే సంపాదకులు ఒప్పుకుంటారా?

The Brahma brought the pooja saamagri into the madapam and instructed the vadhuvu and varudu to do a pradakshinam to the agnihotram.

శీర్షాసనం అనే భావం పాశ్చాత్యులకి లేదు; అది మన యోగశాస్త్రంలోని మాట. ఇంగ్లీషు పుస్తకాలలో శీర్షాసనం అని రాస్తే అర్థం కాదని ఆ మాటకి బదులు ‘హెడ్ స్టేండ్’ అని రాస్తున్నారు. అంటే ఏమిటన్నమాట? ఇంగ్లీషువాడికి ఇంగ్లీషులో సులభంగా ఇమడని కొత్తమాట తారస పడితే దానికి సమానార్ధకమైన ఇంగ్లీషు మాట తయారు చేసుకుంటున్నాడు. మనమో?

ఇవి ఆవేశంతో ఇచ్చిన ఉదాహరణలు కావు. ప్రతి భాషలోనూ అరువు తెచ్చుకున్న మాటలు ఉంటాయి. కాలక్రమేణ ఈ పరాయి మాటలు వాటి పూర్వపు వాసనని పోగొట్టుకొని కొత్త భాషలో కలిసిపోతాయి. ఈ రకంగా ఇంగ్లీషులో నాలుగింట ఒక మాట ఫ్రెంచి భాష నుండి వచ్చి కలిసిందన్నది నమ్మశక్యం కాని నిజం. ఇదే విధంగా – సహస్రాబ్దాల కాలవ్యవధిలో – సంస్కృతం నుండి తెలుగులోకి ఎన్నో మాటలు వచ్చేయి కదా. ఈ ప్రక్రియ శ్రుతి మించటంతో గ్రాంథికానికి ఆదరణ తగ్గి శిష్టవ్యవహారికానికి ఆదరణ పెరిగింది. పాత శిష్టవ్యవహారికంలో ‘సంస్కృత తత్సమాల పాలు’ తగ్గాలని మనం కోరుకున్నట్లే కొత్త శిష్టవ్యవహారికంలో ‘ఇంగ్లీషు తత్సమాల పాలు’ తగ్గాలని నా ప్రతిపాదన. తెలుగులో ఇంగ్లీషు పాలు ఎంత వరకు భరించవచ్చు? ‘ఇంగ్లీషులో ఫ్రెంచి పాలు ఉన్నంత,’ అని ప్రతిపాదించవచ్చు.

3.1 పూర్వపు పద్ధతి

పూర్వకాలంలో తెలుగు విజాతీయ భాషలని ఎదుర్కొన్నప్పుడు విదేశీ మాటలతో సరితూగే సరికొత్త మాటలని తయారు చేసుకునేది. అలా వీలు కాని పక్షంలో ‘తద్భవ రూపం’లో తనలోకి దింపుకునేది. ఆ ప్రక్రియ ఎలా సాగిందో చూద్దాం.

పాశ్చాత్యులు మన దేశానికి వర్తకం చెయ్యటానికి వచ్చిన కొత్త రోజులలో దక్షిణ అమెరికా నుండి ఎన్నో మొక్కలని తీసుకువచ్చి మనకి పరిచయం చేసేరు. మిరపకాయలు, పొగాకు, బంగాళాదుంపలు, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, మొదలైనవి. ఈ పేర్ల వెనక చరిత్రని చూస్తే తెలుగులో ఉన్న సృజనాత్మక శక్తి అర్థం అవుతుంది.

  • మిరపకాయలు: మాంసాన్ని వండడానికి మిరియాలు ముఖ్యంగా కావాలి. ఆ మిరియాలు భారతదేశంలోనే దొరికేవి. భారతదేశపు పూర్వపు ఆర్ధిక ఔన్నత్యానికి మిరియాలే కారణం. తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ని పట్టుకున్నప్పుడు పాశ్చాత్యులు భారతదేశానికి వచ్చే దారి బందయిపోయింది. దానితో సముద్రపు దారి కనుక్కుందామనే ప్రయత్నంలో, దారిలో అడ్డుతగిలిన అమెరికాలో పడ్డారు. అక్కడ పచ్చగా, ఎర్రగా, కారంగా ఉండే కాయలని చూసి అవే మిరియాలు అనుకొని వాటికి మిరియపుకాయలు అని వారి భాషలో పేరు పెట్టుకున్నారు. మిరియాలని ఇంగ్లీషులో పెప్పర్స్ అంటారు కనుక మధ్య అమెరికాలో కనిపించిన ఎర్రటి, పొడుగాటి కాయని ‘పెప్పర్ కార్న్’ అన్నారు. ఆ మొక్కలని మన దేశం తీసుకు వచ్చేరు. అది మనం కని, విని, ఎరగని కొత్త మొక్క. తెల్లవాళ్ళు దానిని పెప్పర్ కార్న్ అన్నారు కనుక దానికి మనవాళ్ళు మిరియపు కాయ అని పేరు పెట్టేరు. అదే మిరపకాయగా మారింది.
  • పొగాకు: ఇది కూడ తెల్లవాళ్ళు దక్షిణ అమెరికా నుండి తీసుకువచ్చిన మొక్కే. దీని ఇంగ్లీషు పేరు ‘టుబేకో’ని పూర్తిగా విస్మరించి మనవాళ్ళు దీనికి శుద్ధ తెలుగులో, పొగాకు అని పేరు పెట్టేరు. ఈ పేరు పెట్టిన వ్యక్తినీ, ‘డ్రెడ్జర్’కి తవ్వోడ అని పేరు పెట్టిన వ్యక్తిని మనం ఎంత గౌరవించినా సరిపోదు.
  • సపోటా: ఈ పండు కూడ దక్షిణ అమెరికాదే. అక్కడా దీన్ని సపోటా అనే అంటారు. అచ్చుతో అంతం అయిన పేరు కనుక మన భాషలో ఇది చక్కగా ఇమిడి పోయింది. నేను మెక్సికోలో ఈ పండు పేరు విన్నప్పుడు మన తెలుగు పేరే వాళ్ళు తస్కరించేరని అనుకున్నాను.
  • సీతాఫలం, రామాఫలం: ఈ రెండు కూడ దక్షిణ అమెరికా పళ్ళే. వీటికి నోరు తిరగని పేర్లు ఏవో ఉన్నాయి. మనవాళ్ళు వీటికి తెలుగు పేర్లు కాకుండా సంస్కృతం పేర్లు పెట్టేరు. తెలుగు పేరు అయితే చివర ‘పండు’ వచ్చి ఉండేది. గమనించేరో లేదో ఈ రెండింటికే ‘ఫలం’ అనే తోక ఉంది; మిగిలినవాటన్నిటికీ ‘పండు’ తోకే!

    తోక ప్రస్తావన వచ్చింది కనుక, సీతాఫలం, రామాఫలంతో పాటు హనుమాఫలం ఉంటే బాగుంటుందని అనిపించింది. ఉష్ణమండలాలలో పెరిగే మరొక పండు పేరు ‘స్టార్ ఫ్రూట్.’ దీని స్వస్థలం శ్రీలంక. నున్నటి కాకరకాయ ఆకారంలో ఉండి అడ్డుకోతలో నక్షత్రాకారంలో ఉంటుందీ పండు. దీనికి నేను హనుమాఫలం అని పేరు పెట్టేసిన తరువాత దీనిని తెలుగులో అంబాణంకాయ అంటారని వికీపీడియాలో చదివేను. అంబాణంకాయ పేరు కన్న హనుమాఫలం పేరు బాగులేదూ?

ఇలా కొత్త భావాలకి తెలుగులో పేర్లు పెట్టే ధోరణి నా చిన్నతనం వరకు ఉండేది. కేవలం కాకతాళీయమో, కారణ-కార్య సంబంధం ఉందో తెలియదు కాని తెలుగు తిరోగమనం ఆంధ్ర రాష్ట్ర అవతరణతో మొదలయింది. ఈ రోజులలో, గోదావరి మీద కొత్త వంతెన కట్టేరు — అంటే మనల్ని చదువులేని బైతుల్లా చూస్తారు; గోదావరి మీద కొత్త బ్రిడ్జ్ కట్టేరు — అంటే పరవాలేదు. గోదావరి మీద నూ బ్రిడ్జ్ బిల్డుతున్నారు — అనే ప్రయోగం సుదూర భవిష్యత్తులో విన్నా వింటారు.

4. వైజ్ఞానిక విషయాన్ని అనువదించటం – నా సొంత దృక్కోణంలో

ఈ పత్రం యొక్క పరిధిలో పాఠ్యపుస్తకాలు లేవు కనుక ప్రభుత్వం వారు జారీ చేసిన నిబంధనలు కాని, తెలుగు అకాడమీ వారు ప్రచురించిన నిఘంటువులలోని పదజాలం కాని వాడాలనే నిర్బంధం నాకు లేదు. నా పరిధి అనుసరణల వరకే కనుక మూల గ్రంథాన్ని తు. చ. తప్పకుండా పాటించాలనే నిర్బంధం కూడ లేదు. మూలం లోని భావాన్ని సమగ్రంగా గ్రహించి, తిరిగి తెలుగులో చెప్పటమే నా ముఖ్యోద్దేశం. ఈ గమ్యం చేరుకోడానికి అవసరం అయితే పాఠ్యక్రమాన్ని మార్చడానికి కాని, మూలంలో ఉన్న ఉపమానాలని మార్చడానికి కాని, మూలంలో ఉన్న ఇంగ్లీషు మాటలకి సరి కొత్త తెలుగు మాటలని తయారు చేసి ప్రయోగాత్మకంగా వాడడానికి కాని వెనుక తియ్యను.

నేను తెలుగులో తిరగ రాయడానికి ముందు సాధారణంగా ఇంగ్లీషు మూలాన్ని — కేవలం అర్థం చేసుకునే నిమిత్తం — రెండు, మూడు సార్లు చదువుతాను. అప్పుడు ఆ పాఠాన్ని తెలుగులో చెప్పే నిమిత్తం కొన్ని ముఖ్యాంశాలని దృష్టిలో పెట్టుకుని తెలుగులో రాయటం మొదలు పెడతాను. రాతకి ఉపక్రమించే ముందు అందరికీ ఎదురయే సమస్యలే నాకూ ఎదురవుతాయి. మొదటిది, ఇంగ్లీషులో చదివినది పూర్తిగా అర్థం అయిందా? సాహిత్యాన్ని అనుకరించేటప్పుడు ఈ సందర్భంలో ఎదురయే సమస్యలు, ఇబ్బందులు వైజ్ఞానిక విషయాలని అనుకరించేటప్పుడు ఉండవు. ఈ సందర్భంలో మనకి కావలసినదల్లా భావ ప్రకటన; భాష అర్థం అయినంత మాత్రాన భావం అర్థం అవాలని లేదు. వృత్తి పదాల అర్థాలు తెలిసినంత మాత్రాన సరిపోదు. గణిత సమీకరణాల వ్యుత్పత్తి తెలిసినంత మాత్రాన సరిపోదు. వాటి వెనక ఉన్న భావసూక్ష్మత అవగాహనలోకి రావాలి. అనువాద లక్ష్యం తెలుగు అయినప్పుడు ఈ ఇబ్బంది ఇనుమడిస్తుంది. పాఠకులు శాస్త్రంతో పరిచయం లేని సామాన్యులు అయినప్పుడు ఈ ఇబ్బంది విషమిస్తుంది.

4.1 సారూప్యాల వాడుక

విజ్ఞాన శాస్త్రంలో కంటికి కనబడని ఊహనాల (కాన్సెప్ట్స్, concepts) అవసరం తరచు వస్తూ ఉంటుంది. చెప్పేది సుబోధకంగా ఉండడానికి పాఠకులకి పరిచయమైన నమూనాలు ఇటువంటి సందర్భాలలో వాడతారు.

ఉదా 1. నేను కళాశాలలో చదువుకునే రోజులలో ఇంగ్లీషులో రాసిన పాఠ్య పుస్తకాలు వాడేవాడిని. వాటిలో వస్తువుల ఆకారాలు వర్ణించటానికి ‘పిల్ బాక్స్, బ్రెడ్ బాక్స్, డోనట్’ వంటి సారూప్యాలు ఎక్కువగా కనిపించేవి. ఇవేమీ నాకు పరిచయమైన మాటలు కావు. పిల్లి అంటే తెలియని వాడికి మార్జాలం అంటే ఏమి తెలుస్తుంది? పిల్‌బాక్స్ అంటే మాత్రలు దాచుకునే పెట్టె. బ్రెడ్‌బాక్స్ అంటే రొట్టె దాచుకునే పెట్టె. డోనట్ అంటే చిల్లుగారె ఆకారంలో ఉండే తియ్యటి తినుబండారం. మా ఇంట్లో ఉండే హొమోపతీ మందుల సీసాలు అడ్డు కోతలో గుండ్రంగా ఉండేవి, కాని పిల్ బాక్స్ అడ్డుకోతలో చతురస్రాకారంగా ఉండి, అరచేతిలో పట్టేంత, చిన్న కుంకం భరిణంత పెట్టె. దీనిని ఇంగ్లీషు పరిభాషలో ‘రెక్టేంగ్యులర్ పేరలలోపైపెడ్’ అంటారు. ఈ నోరు తిరగని మాట చెపితే పిల్లలు భయపడతారని ఆ పుస్తకం రాసిన అమెరికా ఆసామీ ‘పిల్ బాక్స్’ అన్నాడు. అలాగే బ్రెడ్ బాక్స్ అంటే అదే ఆకారంలో ఉండే పెద్ద పెట్టె. డోనట్ అంటే చిల్లు గారె ఆకారం. అనుకరించేటప్పుడు మన అనుభవ పరిధిలో ఉన్న మాటలు వాడితే వ్రతమూ చెడదు, ఫలమూ దక్కుతుంది.