నా అమెరికా ప్రయాణం

1

అమెరికా రావాలన్న ఊహ నా బుర్రలో ఎప్పుడు ప్రవేశించిందో తిథి, వార నక్షత్రాలతో చెప్పలేను. కాని నేను చదువుకునే రోజులలో నాకు అమెరికా అంటే మోజేమీ ఉండేది కాదు. అమెరికాలో చదువుకోవాలని కాని, అక్కడకి వలస వెళ్ళి స్థిరపడి పోవాలని కాని ఎప్పుడూ అనుకోలేదు.

అది 1958. కాకినాడ ఇంజనీరింగు కాలేజీలో కడపటి రోజులు. బుచ్చన్నయ్య “ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్” మీద అమెరికా వెళ్ళేడు. బుచ్చన్నయ్య మా బంధు వర్గంలోనే చాల తెలివైనవాడనే గట్టి నమ్మకం మాలో చాలమందికి ఉండడంతో వాడు వెళ్ళినంత మాత్రాన వాడి వెనక మేమంతా వెళ్ళగలమనే ఊహ మా మస్తిష్కాలలో ఎక్కడా మెరవ లేదు. కాని వాడు రాసే ఉత్తరాల ద్వారా అమెరికా దేశపు ఉనికి, ఎల్లలు అర్థం అవటం మొదలయాయి.

అన్నయ్య కాశీ నుండి తిన్నగా అలా అమెరికా వెళ్ళిపోయాడు, మన వైపైనా రాకుండా. కనుక మా ఇంట్లో ఎవ్వరికీ అమెరికా గురించి కాని, అమెరికా ప్రయాణానికి కావలసిన హంగులని సమకూర్చుకోవడం లో ఉన్న కష్టసుఖాల గురించి కానీ అవగాహన ఏమీ లేదు.

ఇలా అన్నానని అమెరికా గురించి బొత్తిగా ఏమీ తెలియని వ్యక్తిని కానండోయ్. ఆ మాటకొస్తే నా హైస్కూల్ రోజులలోనే అమెరికాలో ఉన్న ఎం ఐ. టి. గురించి విన్నాను. మా ఇంటికి నాలుగిళ్ళ దిగువున అవసరాల వారి అబ్బాయి అప్పాజీ అనే కుర్రాడు ఒకడు ఉండేవాడు. ఆతను నా కంటె నాలుగేళ్ళు పెద్ద. ఒక సారి ఎం ఐ. టి. నుండి దరఖాస్తు, సరంజామా – అంటే వీశెడు బరువున్న కేటలాగు – వచ్చేయి. దాంట్లో బొమ్మలు చూడడం చూసేను. తర్వాత దాని సంగతే మరచి పోయేను.

అమెరికా గురించి జనరల్ నాలెడ్జి కూడ నాకేమీ లేదనుకునేరు. వినండి, చెబుతాను.

మా తమ్ముడు శేషగిరి పాఠ్యపుస్తకంలో “రిప్ వాన్ వింకిల్” కథ ఉండేది. అది వాడు చదువుతూ ఉంటే విన్నాను. ఈ రిప్ వాన్ వింకిల్ ఊర్మిళా దేవి కంటె ఆరాకులు ఎక్కువ చదివినట్లు ఉన్నాడు. కేట్‌స్కిల్ కొండలలో ఇరవై ఏళ్ళు నిద్ర పోయి లేస్తాడు. బోడి మెట్ట, ఏనుగు కొండ, సూది కొండ వగైరా పేర్లు విన్న నాకు ఈ పిల్లులని చంపే “కేట్స్ కిల్” కొండల పేరు మనస్సులో నాటుకు పోయింది.

ఒక సారి హౌరా-మెడ్రాస్ మెయిల్‌లో ఫస్టు క్లాసులో ప్రయాణం చేస్తూ, అనకాపల్లిలో భోజనం ఆర్డరు చేసిన మిస్ కాక్స్ అనే అమెరికన్ అమ్మాయిని బండి తుని వచ్చే లోగా ఎవరో పొడిచి చంపేసేరు. తుని స్టేషన్‌లో ఉన్న యూరొపియన్ స్టయిల్ రెస్టరాంట్ లో పని చేసే బేరర్ లంచి పట్టుకుని వెళ్ళేడు, పెట్టె లోపలికి. రక్తపు మడుగులో అసువులు బాసిన ఆ అమ్మాయి అవశేషాలు అక్కడ అగుపించేయి. నేను తుని స్టేషను లో తరచు తిరుగాడుతూ ఉండేవాడిని కనుక, పోలీసులు దర్యాప్తుకని ఆ రైలు పెట్టెని విడదీసి, గూడ్సు షెడ్డు పక్కన నిలిపి, మిగిలిన రైలు బండిని మద్రాసు పంపించడం కళ్ళారా చూసేను. ఆ పిల్ల తెల్ల పిల్ల కాకపోతే పోలీసులు ఇంత హడావుడి చేసేవారా అని పెద్దవాళ్ళు అనుకుంటూ వుంటే నేను విన్నాను కూడ!

అమెరికా మీద క్రమేపీ ఒక అభిప్రాయం ఏర్పడడానికి కాకినాడలో నా సహాధ్యాయి కర్రా వేంకటేశ్వరరావు చేసిన చిన్న చిలిపి పని కొంత దోహదం చేసింది. పేపర్లో పెన్ ఫ్రెండు కావాలన్న ప్రకటన చూసి కర్రా వాడు ఒక అమెరికన్ పిల్లకి ఉత్తరం రాసేడు. రాసినప్పుడు మాకెవరికీ చెప్పలేదు. ఆ అమ్మాయి అయోవా నుండి జవాబు రాసింది! పైపెచ్చు ఫొటో పంపించింది. ఈ వార్త హాస్టల్ అంతా శరవేగంతో దూసుకు పోయింది. మేమందరం వెళ్ళి ఆ ఫొటోని చూసి, ఆ అమ్మాయి రాసిన ఉత్తరం చదివి ఎవరికి తోచిన విధంగా వేంకటేశ్వరరావు ని వేళాకోళం చేసేం. ఈ వ్యాసం రాస్తూన్న సందర్భంలో లండన్‌లో ఉన్న కర్రాని పిలచి అడిగేను. వివరాలు ఏవీ జ్ఞాపకం లేవన్నాడు. అమెరికా అమ్మాయిలంతా ఏ రీటా హేవర్తు లాగో, ఎస్తర్ విలియంసు లాగో, లేదా ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లో తరచుగా వచ్చే ఏ హాలీవుడ్ పిన్ అప్ పిల్ల లాగో ఉంటారనుకున్న మాకు ఆ ఫొటో చూసిన తర్వాత ఒక రియాలిటీ ఛెక్ అయింది. బాగా పుష్టిగా, ఏపుగా కనిపించిందా పిల్ల. అమెరికాలో బరువు సమస్యకి కారణం ఈ మధ్య పుట్టుకొచ్చిన “ఫేస్ట్ ఫుడ్స్” అని ఆడిపోసుకోవటం ఎందుకు?

నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో కాల్‌టెక్స్ రిఫైనరీ మీద టిల్లోట్సన్ అనే అమెరికన్ ఆసామీ పెత్తనం చేస్తూ ఉండేవాడు. మా స్టూడెంట్ బాడీ ప్రెసిడెంటు దుర్వాసుల శ్రీరామ శాస్త్రి విశాఖపట్నం వాడు. అందుకని, కాలేజి వార్షికోత్సవాలకి టిల్లోట్సన్ నీ అతని పెళ్ళాన్నీ ముఖ్య అతిథులు గా ఆహ్వానించేడు. ఆవిడ మా అందరి ఎదటా సిగరెట్టు ముట్టించింది. మేమంతా ఆవిడని సర్కస్ చూసినట్లు చూడలేదు కాని, అమెరికన్ అమ్మాయి కదా అని ఒక సారి, సిగరెట్టు ముట్టించింది కదా అనీ మరో రెండు సార్లు – ముత్యం మూడు సార్లు – మెడలు రిక్కించి మరీ చూసేం.

ఇలా చెప్పుకొస్తున్నానని నన్ను మరీ బైతులా కట్టెయ్యకండి. మా ఊళ్ళో మన ఆడ వాళ్ళు చుట్టలు కాల్చడం చూసేను కాని, అసలు ఆడవాళ్ళు సిగరెట్లు తాగడం సినిమాల్లో తప్ప, మన మధ్య లో నేను ఎప్పుడూ చూడలేదు.

ఆ మాటకొస్తే తునిలో, మా పక్కింట్లో, తంగిడిబిల్లి నారాయణ పెళ్ళాం కొవ్వూరి వెంకయ్య అడ్డ పొగ వేసేది – అంటే వెలుగుతూన్న చుట్ట కొసని నోట్లోను, పీకని బయటకి కనిపించేటట్లు పెట్టుకుని కాల్చటం. ఏదీ, మన దేశాన్ని చూసి ఈ అమెరికా కుర్రాళ్ళు ఎన్నెన్నో పిచ్చి చేష్టలు – మేరువానా నుండి మెడిటేషన్ దాకా – చేసేరు. కాని నాకు తెలుసున్నంత వరకు అమెరికన్ ఆడవాళ్ళు మన దగ్గర అడ్డ పొగ వెయ్యటం ఇంకా నేర్చుకో లేదు.

వెంకయ్యప్పని ఒక సారి అడిగేను.

“వెంకయ్యప్పా! వెంకయ్యప్పా! ఇద్దరు పిల్లల్ని కన్నావు కదా. ఇంకా నీ ఇంటి పేరుని మార్చుకోలేదేమి?”

“ఎంకటేశులు బాబూ! ఈ గొల్లిగాడు మనువు తీరిపోయిందని నన్ను ఒగ్గీసినాడనుకో. అప్పుడు నానేటిసేసేది? ఆడి పేరు ఆడిదే. నా పేరు నాదే!”

ఇది అమెరికన్ థింకింగ్ అంటారా? ఇండియన్ థింకింగ్ అంటారా? చెప్పండి!

ఆ మాట కొస్తే మా ఇంటికెదురుగా ఉండే బండి నాయుడు అప్పన్న పెళ్ళాం చిన్నమ్మి, ఎర్రయ్య పెళ్ళాం గంగమ్మ – ఇద్దరూ కూడ – ఎప్పుడూ టాఫ్ లెస్ గానే ఉండే వారు. ఇటువంటి “ఎడ్వాన్స్‌డ్ కల్చర్ మధ్య పెరిగిన నా అంతటి వాడిని నేను! ఏమనుకుంటున్నారో!

అయ్యా! ఇదీ అమెరికా వచ్చే ముందు నా నేపథ్యం!

కాకినాడలో నా సహాధ్యాయి పిండిప్రోలు వెంకట్రావు నా ఈ నేపథ్యాన్ని బాగా అవగాహన చేసుకున్న వ్యక్తి కనుక నన్ను ‘పార్వతీశం’ అని పిలచే వాడు. మా ఊరు మొగల్తుర్రు కాకపోయినా, మా ఇంటి పేరు కూడ వేమూరి వారే కనుక నేను “ఓయ్” అని పలికేవాడిని.

2

కాకినాడలో చదువు అయిపోయిన తర్వాత నేవేలీలో నాలుగున్నర నెలలు ఉద్యోగం వెలగబెట్టి. అక్కడ ఆరోగ్యం దెబ్బ తినగానే ఉద్యోగం మానేసి నేరుగా ఇంటికి వచ్చేసేను.

భిలాయ్ లో ఉద్యోగం చేస్తూన్న నరసింహం బావ పని లేకుండా ఇంటి దగ్గర కూర్చున్న నన్ను చూసి దగ్గరుండి భిలాయి తీసుకెళ్ళిపోయేడు. నేను అక్కడ దరఖాస్తు నింపటం, ఉద్యోగంలో చేరిపోవటం అన్నీ చకచకా అరగంటలో అయిపోయాయి. ఇంటర్వ్యూ లాంటిది ఏదీ లేదు. నాకు తెలియకుండానే, కట్టు బట్టలతో వచ్చిన వ్యక్తిని ఆ పట్టుని అలా ఉద్యోగంలో చేరి పోమన్నారు. అక్కడ బెంచీ మీద ప్రతీక్షిస్తూ కూర్చున్న అనతోలే అలక్స్యేవ్ నన్ను తన వెంట జీపులో తీసుకు పోయాడు.

పని లోకి వెళ్ళిన దగ్గర నుండి తిరిగి వచ్చేదాకా అదొక చిన్న రష్యాలా ఉండేది. ఉండేదేమిటి? మేం భిలాయిని రష్యా అనీ, ఆంధ్రాని ఇండియా అనీ అనేవారం.

నేనక్కడ చేసే ఉద్యోగానికి కాకినాడ చదువు సరిపోలేదని నాకు మొదటి రోజులలోనే స్పష్టమైపోయింది. ఎటు చూసినా నాకు తెలుసున్న విషయాల కంటె తెలియని విషయాలే ఎక్కువ కనిపించేవి. అందుకని పని అయిపోయిన తర్వాత, సాయంకాలం పూట, కొంతమంది రష్యన్ ఇంజనీర్లు మాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగు పాఠాలు చెప్పేవారు – దుబాసీల సహాయం తో.

అప్పటికే బుచ్చన్నయ్య రాచెస్టర్ లో పి. హెచ్. డి. చేస్తున్నాడు కదా. చదువుల విషయంలో మా ఇంటిల్లిపాదికీ వాడు గురువు, సలహాదారుడును. అందుచేత నాకే తేటతెల్లమౌతూన్న నా అజ్ఞానానికి ఆరాటాన్ని వెల్లడి చేస్తూ వాడికి ఒక ఉత్తరం రాసేను. దానికి సమాధానంగా వాడు షెల్కునాఫ్ అనే ఆసామీ రాసిన లెక్కల పుస్తకం ఒకటి కొని పంపేడు. ఆ పుస్తకం అంతా చదివేసి ప్రతి అధ్యాయం చివర ఉన్న సమస్యలన్నిటిని పరిష్కారం చేసెయ్యమన్నాడు. దీని వెనక అసలు రహస్యం అమెరికా వచ్చేక కాని నాకు బోధ పడ లేదు. అన్నయ్య అమెరికా వచ్చిన కొత్తలో ప్రొఫెసరు రూడిన్ దగ్గరకి వెళ్ళి “ఏమిటి చెయ్యమంటారు?” అని అడిగితే దానికి సమాధానంగా టొపాలజీ పుస్తకం ఒకటి ఇచ్చి ఇది పూర్తిగా చదివేసి, తర్వాత కనిపించు, అప్పుడు మాట్లాడదాం అన్నాట్ట. ఆయన వీడి మీద ప్రయోగించిన మంత్రాన్నే వీడు నా మీద ప్రయోగించేడన్న మాట!

నాకు తీరుబడి దొరికినప్పుడల్లా ఆ పుస్తకం కుంటుతూ, మెక్కుతూ పూర్తి చేసేసరికి ఒక సంవత్సరం పట్టింది. నాకు కొరుకు పడని సమస్య ఏదైనా తారస పడితే అన్నయ్యకి ఉత్తరం రాస్తే ఆ లెక్క ఎలా చెయ్యాలో వాడు తిరుగు టపాలో చెప్పేవాడు.

ఈ కరస్పాండెన్సు కోర్సు ఇలా జరుగుతూన్న రోజులలో “పోనీ నేను కూడ అమెరికా వచ్చి చదువుకుంటే ఎలా ఉంటుంది?” అని ఒక ఉత్తరం రాసేను. దానికి సమాధానంగా “అబ్రహం అండ్ బెక్కర్ రాసిన పుస్తకం ఒకటి మద్రాసులో దొరుకుతుంది, అది కొనుక్కుని పూర్తిగా చదివెయ్. ఈ లోగా దరఖాస్తు కాగితాలు నేను పంపుతాను” అని రాసేడు.

ప్రొఫెసర్ రూడిన్ మీద కసిని నా మీద ఇలా తీర్చుకున్నాడేమో అని ఇప్పటికీ నాకు అనుమానమే. అమెరికా పేరు పెట్టి అన్నయ్య నన్ను ఒక పాము పామేస్తున్నాడేమో అని ఒక అనుమానం పుట్టుకొచ్చింది. ఎందుకంటే, “అబ్రహం అండ్ బెక్కర్” కొని తెప్పించేను కదా. దీని ముందు షెల్కునాఫ్ నల్లేరు మీద బండి నడక. అసలు విషయం మౌలికంగా అర్ధం అయి చావ లేదు. ఆ భావ సంకల్పనని వివరిస్తూ ఉన్న లెక్కలు అస్సలు అర్ధం కాలేదు. కూర్చున్నవాడిని కుదురుగా కడుపులో చల్ల కదలకుండా కూర్చోకుండా కొరకంచుతో తల గోక్కున్నానా అని ఒక పక్క ఆవేదన పడుతూ ఉంటే మరొక పక్క నుండి అప్లికేషన్ ఫారాలు ఒకటీ ఒకటీ రావటం మొదలు పెట్టేయి.

ఇంతవరకూ నెట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి తగ్గితే ఏం బాగుంటుందిలే అని ఆ దరఖాస్తు కాగితాలు నింపడం మొదలు పెట్టేను. అసలు వాటిలో భాష అర్ధం అయేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. “ఫస్ట్ నేం” అంటాడు. “మిడిల్ నేం” అంటాడు. “లాస్ట్ నేం” అంటాడు. ఫొటొ స్టేట్ కాపీ అఫ్ ద ట్రాన్స్క్రిప్ట్” అంటాడు. సెమెస్టర్ అంటాడు. నిజం చెప్పొద్దూ. నాకు ఈ మాటలేవీ అర్ధం అయి చావ లేదు. నా దగ్గర నిఘంటువు లేదు. ఉన్నా ఆ మాటకి అర్ధం నిఘంటువులో చూడాలన్న స్పూర్తి కూడ లేదు.

పైపెచ్చు రికమెండేషన్ లెటర్స్ కావాలంటాడు. నేను కాకినాడ వదలిపెట్టి మూడేళ్ళు అవుతోంది. నేనెవ్వరినో అక్కడ ఎవరికి జ్ఞాపకం ఉంటుంది? ఉన్నా భిలాయి నుండి నేనొక ఉత్తరం ముక్క రాసినంత మాత్రాన వారు ఆ రికమండేషన్ పంపుతారా. పంపిరిపో, నా గురించి మంచి మాట రాస్తారా? రాసి పంపేరే అనుకుందాం. వాళ్ళు నాకా విషయం తెలియబరచక పోతే? ఏ సంగతీ నాకు ఎలా తెలుస్తుంది? పోనీ అడగడానికి స్వయంగా కాకినాడ వెళ్ళేనే అనుకుందాం. తీరామోసి వెళ్ళిన తర్వాత నాకు కావలసిన వ్యక్తులు అక్కడ లేకపోతే? ముందుగా ఎపాయంట్‌మెంట్ పుచ్చుకుందామంటే ఆ రోజులలో ఫోను సౌకర్యం లేదు. ఎపాయంట్‌మెంట్ లేకుండా వెళితే డిసప్పోయంట్‌మెంట్ ఖాయం.

నాకొక ఊహ తట్టింది. నేను రోజూ పని చేస్తూన్న రష్యన్ ఇంజనీరు దగ్గర రికమండేషన్ పుచ్చుకుంటేనో? ఈ విషయం బుచ్చన్నయ్యకి రాసి వాడి సలహా అడిగితే వాడు నేను భిలాయిలో పని చేస్తూన్నట్లు కాని, నాకు రష్యన్ భాష మాట్లాడటం వచ్చని కాని మాటవరసకేనా ఎక్కడా అనొద్దని వార్నింగు ఇచ్చేడు. వాడు ఎందుకు అలా అన్నాడో అప్పట్లో నాకు అర్ధం కాలేదు. అమెరికా వచ్చిన్ తర్వాత తెలిసింది. వీళ్ళకి కమ్యూనిష్టులంటే ఏహ్యభావం ఒక పక్క, సింహస్వప్నం మరొక పక్క. ఏమాత్రం వీరితో ఏకీభవించకపోయినా, “ఆర్ యూ ఎ కామ్మునిష్ట్” అనేవారు. పొరపాటునైనా “అవును” అన్నామంటే మన పుట్టి ములిగిందన్నమాటే. అందుకని “క” అనే అక్షరంతో మొదలయే మాట మాటవరసకైనా వీళ్ళతో మాట్లాడవద్దని ఒక సలహా ఇచ్చేడు అన్నయ్య. ఆ రోజులలో వాడు సలహా ఇచ్చేడంటే అది ఆర్డరే.

ఏది ఏమైతేనేమి, చివరికి ఒక అరడజను యూనివర్సిటీలని ఎంపిక చేసి దరఖాస్తులు నింపి పంపేను. “ఈశాన్య దిశగా కూర్చుని మరీ నింపు” అని నాన్నగారు చెప్పినట్లే చేసేను. ఏ పని ఉపక్రమించే ముందైనా “సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే| శరణ్యే త్ర్యయంబకే దేవీ, నారాయణి నమోస్తుతే|” అన్న శ్లోకం చదవకూండా చెయ్యనిచ్చే వారు కాదు నాన్నగారు. తునిలో ఉన్నప్పుడు ఏదో పాత కాలపు మనిషిలే అని ఆయన శ్లోకం పఠిస్తూ ఉంటే మెదలకుండా కూర్చునే నేను, భిలాయిలో నా అంతట నేనే ఆ శ్లోకం గుర్తుకి తెచ్చుకుంటూ – ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు? – కాగితాలు నింపేవాడిని.

కాగితాలు దాఖలు చెయ్యడానికి దరఖాస్తు ఒక్కంటికి పది, పదిహేను డాలర్ల రుసుం ఉండేది.

ఆ రోజులలో ఫారిన్ ఎక్స్చేంజి సులభంగా ఇచ్చేవారు కాదు. పైపెచ్చు డాలరుకి నాలుగున్నర రూపాయల చొప్పున దరఖాస్తు ఒక్కంటికి నలభై ఐదు రూపాయల రుసుమూ, మార్కుల జాబితాలకి నకలు టైపు చేయించడం, వాటిని సర్టిఫై చేయించడానికి గజిటెడ్ ఆఫీసరు సంతకానికి వెళ్ళినప్పుడు బిళ్ళ బంట్రోత్తుకి రూపాయ లంచం, తపాలా ఖర్చులు, ఇలా అమాంబాపతులు కలుపుకుని సునాయాసంగా 60 రూపాయల వరకూ ఖర్చు.

నాకప్పటికి పెళ్ళి కావలసిన చెల్లెళ్ళు, చదువుకో వలసిన తమ్ముళ్ళూ ఉన్నారు. నాన్నగారు రిటైరైపోయారు. నేను బ్రహ్మచారిని కావడం వల్ల ఉద్యోగం చేస్తూన్న అన్నదమ్ములలో నాదే “డిస్పోజబుల్” జీతం. ఈ జీతం రెండు వందలతో మొదలయి రెండు వందల యాభై వరకు పెరిగింది. నా ఖర్చులకి ఏ నూరు రూపాయలో వాడుకుని ఎంత మిగల్చ గలిగితే అంత మిగిల్చి నాన్నగారికి పంపేవాడిని. కనుక అమెరికా దరఖాస్తు పెట్టినప్పుడల్లా ఆయనకి ఓ 60 రూపాయలు తగ్గుతుంది. అందుకని ప్రతి దరఖాస్తు లోనూ, “అయ్యా! దరఖాస్తు రుసుం కట్టుకునే తాహతు నాకు లేదు. ఓక వేళ మీరు నాకు ఎడ్మిషనూ, స్కాలర్షిప్పూ ఇస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఆ రుసుం కట్టుకుంటాను,” అని ఒక ఉత్తరం రాసి పంపేవాడిని.

ముందు చకచకా రెండు “రిజక్షన్ లెటర్సు” వచ్చేశాయి. ఆ ఉత్తరాలలో భాష చూసి – నిజం చెప్పొద్దూ – “అయ్యో! పాపం!!” అనిపించింది. మనం అంటే ఈ అమెరికా వాళ్ళకి ఎంత అభిమానం. నా అర్హతలని చూసి వాళ్ళు ముగ్ధులు అయిపోయారుట. మరో రోజో, మరో సారో అయితే వాళ్ళు నన్ను తప్పకుండా చేర్చుకుని స్కాలర్షిప్పు కూడ ఇచ్చేవారుట. కాని ఆర్ధికంగా అధిగమించలేని అవరోధాలని ఎదుర్కొనటం వల్ల కొద్దిమంది విద్యార్ధులనే తీసుకుంటున్నారుట. క్షమించమని అడగలేదు కానీ అంతపనీ చేసేరు, వాళ్ళ భాషా పాటవంతో. తర్వాత ఎడ్మిషన్ ఇస్తాం కానీ స్కాలర్షిప్ ఇవ్వలేమని కొంతమంది రాసేరు. ఇక్కడితో అమెరికా అధ్యాయం అంతం అయిపోయిందని ఒహ కొబ్బరికాయ కొట్టేసి భిలాయిలోనే స్థిరపడిపోదాం అనుకున్నాను.

ఈ అనుకోవడం పూర్తిగా అనుకోనే లేదు, భిలాయిలో ఉన్న ఉద్యోగం కూడ ఊడే సూచనలు కనబడ్డం మొదలైనాయి. మొదటి దఫా కట్టడం పూర్తి కాబోతోంది, రెండవ దఫా ఇంకా మొదలు కాలేదు. కనుక అందరికీ చేతి నిండా పని లేదు. కొంతమందిని బొకారో బదిలీ చేసేరు. కొంతమందిని కన్ష్త్రక్షన్ నుంది ఆపరేషన్ అండ్ మైంటెనెన్సు లోకి తీసుకుంటున్నారు. కాని వీరందరిచేతా భిలాయిలో “ఏడేళ్ళు ఉద్యోగం చేస్తాం” అని బాండు రాయించుకుంటున్నారు. ఈ ఏడేళ్ళూ నిండకుండా ఒక్క రోజు ముందుగా కంపెనీని వదలి పెట్టినా సరే పదివేల రూపాయలు జరిమానా కట్టాలి.

ఏడిసినట్లుందనుకున్నాను. పూర్వం ట్రెయినింగుకి రష్యా పంపించే రోజులలో ఈ పద్ధతి ప్రవేశ పెట్టేరు – రష్యా పంపడానికి బోలెడు ఖర్చు అవుతుంది కనుక. ఇప్పుడు ట్రెయినింగు అంతా భిలాయి లోనే. పైపెచ్చు ఆ ఫేక్టరీని మా స్వంత చేతులతో కట్టేం. టెస్టు చేసి ఆపరేషన్ వాళ్ళకి మేమే అప్పగించి యంత్రాలన్నీ ఎలా నడపాలో మేమే వారికి తరిఫీదు ఇచ్చేం. ఇప్పుడు ఏడేళ్ళు బాండు ఎందుకు రాయాలో నాకు అర్ధం కాలేదు. పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది.

“పోనీ ఆ అమెరికాలోనైనా సీటు వచ్చింది కాదు, ఈ గొడవ ఉండేది కాదు” అని ఇంటిల్లిపాదీ ఒకసారి అనుకుని తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆలోచనలో పడిపోయేం.

ఇలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడల్లా నాన్నగారు ఒక లాగ, అమ్మ ఒక లాగ స్పందించేవారు. నాన్నగారు నా జాతకం తీసి “ఈ జాతకుడికి విదేశ ప్రయాణం ఉందిరా. కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది!” అన్నారు.

జాతకంలో కనిపిస్తోందేమో కాని ఎదట అటు రష్యా వెళ్ళడానికి కాని, ఇటు అమెరికా వెళ్ళడానికి కాని కంచు కాగడా వేసినా సావకాశం కనిపించటం లేదు.

అమ్మ పద్ధతి వేరు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడల్లా సత్యనారాయణ వ్రతం చేయించేది. మర్నాడు సోమయాజులు గారు వచ్చి నా చేత వ్రతం చేయించేరు. వ్రతం అయింది. కథ చదవటం అయింది. అందరు ప్రసాదాలు తిన్నారు. మొదటి విడత భోజనాలు కూడ అయేయి. సోమయాజులు గారు తాంబూలం సేవిస్తూ వరండాలో కూర్చున్నారు. ఆయనున్నారుకదా అని నేను గొట్టాలలోకి దిగి పోకుండా ఇంకా పట్టుపంచ కట్టుకునే ఉన్నాను.

ఈ సమయంలో తపాలా జవాను వచ్చి ఉత్తరాలు ఇచ్చి వెళ్ళేడు. అందులో యూనివర్శిటీ అఫ్ డెట్రాయిట్ నుండి వచ్చిన్ ఉత్తరం ఒకటి ఉంది. ఆ కవరు చాల పల్చగా ఉంది. లోపల ఒకే ఒక కాగితం ఉంది. ఇది మరొక రిజెక్షన్ లెటర్ అని నాకు తెలుసు. నాన్నగారు, “సర్వ మంగళ మాంగళ్యే, శివే సర్వార్ధ సాధకే, శరణ్యే త్ర్యయంబకే దేవీ నారాయణి నమోస్తుతే” అని యధావిధిగా శ్లోకం మరొకసారి చదివేరు. నాన్నగారి నోటి వెంట ఆ శ్లోకం కనీసం లక్ష సార్లైనా విని ఉంటానేమో. కనుక ఆయన చాదస్తాన్ని కాదనటం ఎందుకని శ్లోకం పూర్తయే వరకూ ఆగి ఉత్తరం విప్పేను. ఆ ఉత్తరం సారాంశం ఇది.

“డియర్ మిస్టర్ వేమూరి, మేము నెల్లాళ్ళ కిందట నీకు ఎడ్మిషను, స్కాలర్‌షిప్పూ ఇస్తూ ఉత్తరము, దానితో పాటు ఐ-20 ఫారము పంపేము. నువ్వు మా ఆఫర్‌ని అంగీకరించి వస్తున్నావో, తిరస్కరించి రావటం లేదో ఇంతవరకు తెలియబరచలేదు. ఈ ఉత్తరం అందిన వెంటనే ఏ విషయమూ తెలియజేస్తే దానిని బట్టి ఈ స్కాలర్‌షిప్ మరొకరికి ఇవ్వడానికి వీలవుతుంది. ఇట్లు ఫాదర్ ఫారెల్”

“ఇది ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహమే” అంది అమ్మ.

“అక్కరకు రాని ఉత్తరాలన్నీ లక్షణంగా అందేయి కానీ, కావలసిన కాగితం కాస్తా గల్లంతు అయిందన్నమాట. ఇంకా నయం. వాళ్ళు మరొక ఉత్తరం రాసేరు కనుక సరిపోయింది,” అంటూ నాన్నగారు సర్వమంగళ మాంగళ్యే మళ్ళా అందుకున్నారు.

వెల్లువలా పెల్లుబికిన ఉత్సాహం చల్లారడనికి మూడు నిమిషాలు కూడ పట్ట లేదు. తనకి కాలూ చెయ్యీ ఆడటం లేదని అమ్మ పడక గదిలోకి వెళ్ళిపోయింది. వెనకాతలే నేను వెళ్ళేను. అవి ఆనంద బాష్పాలనే అనుకున్నాను.

“నాయనా, ఇప్పటికే బుచ్చన్నయ్య వెళ్ళిపోయి మూడేళ్ళయింది. వాడు తిరిగి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు కంట బడతాడా అని రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు కూడ వెళ్ళిపోతే ఎలారా? నువ్వు రెండేళ్ళల్లో తిరిగి వచ్చెస్తానని మాట ఇస్తేనే నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకుంటాను.”

అంతేకాని గాంధీ గారి తల్లిలా మద్య మాంసాలు ముట్టుకోవద్దు, పరాయి స్త్రీని చూడ వద్దు మొదలైన ఆంక్షలు పెట్టలేదు. గుడ్డిలో మెల్ల.

అలాగే అన్నాను.

3

అమెరికా వెళ్ళటం అంటే మాటలా? నాలుగైదు వారాల కంటె ఎక్కువ వ్యవధి లేదు. పేస్‌పోర్టుకి వీసాకి దరఖాస్తులు పెట్టాలి. మా ఇంట్లో అంతా చదువుకున్న వారే అయినప్పటికీ ఎవ్వరికీ పేస్‌పోర్ట్ అంటే ఏమిటో, వీసా అంటే ఏమిటో, ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటో సరిగ్గా తెలియదు.

తునిలో ఫారిన్ వెళ్ళి తిరిగొచ్చిన వాళ్ళెవరైనా ఉన్నారేమోనని చూసేం. రంగం వెళ్ళి వచ్చిన వాళ్ళనీ, మరీషస్ వెళ్ళొచ్చిన పాటక జనాన్ని మినహాయిస్తే నా ఎరికలో నేనే మొట్టమొదట మా ఊరు నుండి అమెరికా వెళ్ళబోతూన్న వ్యక్తినేమోనని ఒక అనుమానం పట్టుకుంది. మా మాజీ హెడ్‌మాస్టారు పులుగుర్త వెంకటరత్నం గారి పిల్లలు జెర్మనీ వెళ్ళినట్లు గుర్తు. కాని వాళ్ళు జెర్మనీ వెళ్ళే వేళకి మా ఊరు వదిలేసి రాజమండ్రి వెళ్ళిపోయారు.

కనుక మాకు సలహా ఇవ్వడానికి అనుభవం ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు.

తెలియని దేశం వెళ్ళటానికి బెదురు.

ఇప్పటికే ఆలశ్యం అయిపోయింది కనుక మీదటికి వస్తే ఎలాగుంటుందని బుచ్చన్నయ్యని సలహా అడుగుతూ ఒక టెలిగ్రాము ఇచ్చేం.

ఈ సెప్టెంబరుకే వచ్చెయ్యమనీ, వివరాలు ఉత్తరంలో రాస్తాననీ చెబుతూ రెండు రోజులలో తిరుగు టెలిగ్రాము వచ్చింది.

అమెరికా సెప్టెంబరులో వెళ్ళాలంటే ముందు భిలాయిలో ఉద్యోగం వదిలేసి ఈ అమెరికా పనిమీద ఏకాగ్రతతో పని చేస్తే తప్ప కాగితాలు కదలవు. తీరామోసి ఉద్యోగం వదిలేసిన తర్వాత పేస్‌పోర్టు, వీసా, రిజర్వు బేంకు పెర్మిటు, ఇన్‌కం టేక్స్ వారి వద్ద నుండి “నో అబ్జెక్షన్ సర్టిఫికేటు” వేళకి అమరక పోతే రెండింటికి చెడ్డ రేవడిలా ఇంట్లో కూర్చోవాలి.

భిలాయి తిరిగి వచ్చేను. మా డి. ఇ. గారిని చూద్దామని నిశ్చయించేను. మా పక్క వీధిలోనే ఆయన ఉండేవారు. పేరు కె. సి. జైన్. ఆయనని కర్కోటకుడు అని మేం తెలుగులో పిలిచుకునేవాళ్ళం. నా బట్టలు ఎప్పుడూ బొగ్గుతో మాసిపోయి ఉండేవని నన్ను కొంచెం నీటుగా ఉండలేవా అని కోప్పడేవాడు. “బట్టలు మిలమిలా మెరుస్తూ ఉంటే పనులెలా అవుతాయి? ఇది ఫేక్టరీయా? ఆసుపత్రా?” అని నా రష్యన్ బాసు అనేవాడు. ఈ భేదాభిప్రాయంలో నేను జైను గారి మాట ఎప్పుడూ వినేవాడిని కాదు. అయినా ఇప్పుడు అవసరం నాది. తెల్లటి బట్టలు కట్టుకుని జైన్ గారిని చూడడానికి వెళ్ళేను. నా పరిస్థితిని అంతా ఆయనకి చెప్పి “ఏమిటి చెయ్యమంటారు?” అని ఆయననే సలహా అడిగేను.

ఒక తెల్ల కాగితం నాకిచ్చి ఒక రాజీనామా ఉత్తరం డిక్టేటు చేసేరు. తారీఖు వెయ్యద్దన్నారు.

మరొక తెల్ల కాగితం ఇచ్చి, దాని మీద ఆ మర్నాటి తారీఖుతో నెల్లాళ్ళపాటు సెలవు కావాలని ఉత్తరం రాయించేరు.

“రావ్, నువ్వు ఇంటికి వెళ్ళి నీ పనులు చూసుకో. బొంబాయిలో విమానం ఎక్కే ముందు నాకొక కార్డు ముక్క రాసి పడెయ్. నీ జాబు రాగానే, నీ రాజీనామా మీద తారీఖు వేసి ఎస్. ఇ. గారికి పంపుతాను. నీకు పేస్‌పోర్టు, వీసా వేళకి రాని పక్షంలో మళ్ళా భిలాయి తిరిగి వచ్చేసి ఉద్యోగంలో చేరిపో.
“ ఈ శలవు కాగితం అంటావా! నువ్వు ఒళ్ళు దాచుకోకుండా రాత్రనక, పగలనక పని చేసేవని నాకు తెలుసు. నువ్వు ఏమైపోయావని నన్ను ఎవరూ అడగనన్నాళ్ళూ ఈ ఉత్తరం నా ఫైలు లో ఉంటుంది. నువ్వు భిలాయి తిరిగి వచ్చెస్తే ఈ కాగితం తిరిగి నీకిచ్చెస్తాను. సరా?”

ఆయనని కర్కోటకుడు అని పిలచినందుకు కొంచెం బాధ పడ్డాను. ఆయనకి మనస్పూర్తిగా దండం పెట్టేసి, మర్నాడు నా జీతం లో నుండి ఇన్‌కం టేక్సు వాళ్ళకి ముట్టవలసినది ముట్టిందని ఒక సర్టిఫికేటు తీసుకుని, పెట్టె, బెడ్డింగు సర్దుకుని, పుస్తకాలు, వగైరాలు అన్నీ కట్ట కట్టి చిత్తరంజన్ ఇంట్లో (దాన్ని సత్రవ అనే వాళ్ళం) అటక మీద పడేసి, రాయపూరు లో బండి ఎక్కి తుని వచ్చేసేను.

ఈ చిత్తరంజన్ తెలుగు వాడే. కాకినాడలో నాకు ఒక ఏడు సీనియరు. ఆసిస్టెంటు ఇంజనీరుగా పని చేసేవాడు. 1996-97 ప్రాంతాలలో పిల్లలని చూడడానికి అమెరికా వచ్చి, సిలికాన్ వేలీలో కొద్ది రోజులు ఉన్నాడు. వెతికి నన్ను పట్టేడు. అప్పటికి చీఫ్ ఇంజనీరు అయేడు. వాళ్ళ అటక మీద నేను పెట్టిన పుస్తకాలు ఇంకా ఉన్నాయిట. ఏమి చెయ్యమంటావు అని అడిగేడు. ఎప్పటి 1961. ఎప్పటి 1998! చిత్తరంజన్ ప్రశ్నకి నేనేమి సమాధానం చెప్పేనో గుర్తు లేదు కాని, ఈ సందర్భంలో ఒక ఉదంతం జ్ఞాపకం వస్తోంది. అది చెబుతాను.

మా పెద్దన్నయ్య, మరేమండ రామారావు మంచి స్నేహితులు. ఇద్దరు కలసి కథలు రాసేవారు. ఊహ రామారావుది, రాత అన్నయ్యది. ఆనందవాణి, వినోదిని, చిత్రగుప్త, ఆంధ్ర పత్రిక మొదలైన పత్రికలలో వీళ్ళు రాసిన కథలు తరచు వచ్చేవి. ఒక సారి వీళ్ళిద్దరు బెజవాడ రైల్వే ప్లేట్‌ఫారం మీద ఎందుకో చిక్కడి పోయేరు. వీళ్ళు మారవలసిన బండి పన్నెండు గంటలో ఎంతో లేటు. ఆ రోజులలో రైళ్ళు 24 గంటలు లేటుగా నడచిన వైనం నేను ఎరుగుదును. మారేమండ రామారావుని సామానుకి కాపలా కూర్చోమని అన్నయ్య ఏదో చిన్న పనుందని ఊళ్ళోకి వెళ్ళేడు. ఊళ్ళో తెలుసున్న వాళ్ళు తారసపడితే వాళ్ళతో కబుర్లలో పడిపోయి అన్నయ్య రామారావు సంగతి మర్చి పోయి, హొటేలుకి వెళ్ళి భోజనం చేసి, కిళ్ళీ నముల్తూ ఉంటే గభీమని రామారావు గుర్తుకొచ్చాడు. అన్నయ్య పరుగు పరుగున స్టేషన్‌కి వచ్చి ఆరు గంటల సేపు సామాను దగ్గర పడిగాపులు పడుతూ, కించిత్తైనా కోపగించుకోకుండా ఉన్న రామారావు కనిపించేడు. అలా చిత్తరంజన్ 35 ఏళ్ళ పాటు నా పుస్తకాలని భద్రపరచి, ఆ విషయం ప్రత్యేకం అమెరికా పట్టుకొచ్చి చెప్పేడంటే అది విశేషం కాక మరేమిటి?

తుని వచ్చేసిన తర్వాత విషయాలు ఒకొక్కటి అవగాహన అవటం మొదలుపెట్టేయి. పేస్‌పోర్టు వచ్చేముందు పోలీసు రిపోర్టు కావాలి. ఈ పోలీసు రిపోర్టు ఊళ్ళో తీసుకుని దానిని కలక్టరు ఆఫీసుకో ఆర్. డి. ఒ. ఆఫీసుకో పట్టుకెళ్ళి కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని అప్పుడు అవన్నీ మెడ్రాసు పంపాలి. పంపి రెండో మూడో నెలలు ఆగితే, అన్నీ సవ్యంగా ఉంటే పేస్‌పోర్టు వస్తుంది. అన్ని రోజులు ఆగలేని వాళ్ళు మెడ్రాసు పోయి అక్కడ పేస్‌పోర్టు ఆఫీసులో పడిగాపులు పడితే కొంచెం త్వరగా తెమలొచ్చు. మెడ్రాసులో అరవ్వాళ్ళకి ఇచ్చినంత సులభంగా తెలుగు వాళ్ళకి పేస్‌పోర్టులు ఇవ్వరని కొందరు బెదిరించేరు.

పోతే వీసా సంగతి. వీసాకి మెడ్రాసు వెళ్ళి తీరాలి. అక్కడ మెడికల్ ఎక్జామినేషను, తర్వాత ఇంటర్వ్యు.

బయలుదేరడానికి ముందు మసూచికం టీకాలు, కలరా ఇంజెక్షను.

అంతేకాదు. రిజర్వు బేంక్ వాళ్ళు ఎనిమిది డాలర్లు దేశం నుండి బయటకి పట్టికెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి పత్రాన్ని పి. ఫారం అనేవారు.

ఆదాయపు పన్నులు అన్నీ కట్టేసినట్టు ఇన్‌కం టేక్సు వాళ్ళు ఇచ్చిన కాగితం ఉండనే ఉంది.

కాగితాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇహ కావలసింది డబ్బు. ఒకటి, ఓడ టిక్కెట్టు. అది ఏ మూడు వేల రూపాయలో ఎంతో ఉండేది. రెండు, అమెరికన్ కాన్సలేటు వారికి హామీ పత్రం. ఏ కారణం వల్లనైనా అమెరికా ప్రభుత్వం వారు నన్ను కాని, నా శరీరాన్ని కాని తిరిగి ఇండియా పంపవలసి వస్తే దానికయే విమానం ఖర్చు, అమాంబాపతులు, కలుపుకుని ఫది వేల రూపాయలకి హామీ ఇవ్వాలి. వెళ్ళినప్పుడు మనం పడవలో వెళ్ళేమో, ఈదుకు వెళ్ళేమో వాళ్ళకి అనవసరం. తిరిగి పంపవలసి వస్తే విమానంలో రాచ మర్యాదలతో పంపుతారుట. ఉత్తుత్తనే సంతకం పెడితే సరిపోదుట. స్థిరాస్థి దన్ను చూపించాలిట. మా ఊళ్ళో ఉన్న వర్తకులు చాల మంది ఈ రకం హామీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాని ప్రయాణపు టిక్కెట్టు కొనుక్కోడానికి ఉత్తుత్తి డబ్బు సరిపోదు. నిజం డబ్బు కావాలి. కావాలంటే అది కూడా సర్దుబాటు చేసే వాళ్ళు మా ఊళ్ళో ఉన్నారు. కాని రిటైరైపోయిన నాన్నగారికి చీటికీ, మాటికీ డబ్బు అప్పు చెయ్యటం ఇష్టం ఉండేది కాదు. అప్పులతో ప్రాణం పోతే రుణం మిగిలిపోతుందేమోనని ఆయన బెంగ.

ప్రయాణానికి ట్రేవెల్ గ్రేంటు ఎవరైనా ఇస్తారేమోనని చూసేం. తెన్నేటి విశ్వనాధం గారి సహాయంతో హుమయూన్ కబీర్ అంతటి వాడిని పట్టి టాటా వారి దగ్గరకి ఒక రికమెండేషను పట్టుకెళ్ళేను. అయినా పని చెయ్య లేదు. వాళ్ళు “ఈ ఏటికి వేళ మించి పోయింది, మీదటికి ప్రయత్నం చెయ్యండి, అప్పుడు రావచ్చు” అని మొండి చెయ్యి చూపించేరు. ఇచ్చే చేతులన్నీ ఒక్క లాగే కనిపిస్తాయి; కాని మొండి చేతులు మాత్రం రకరకాలు! ల్ కి ఏత్వం, ద కి కొమ్ము ఇవ్వడం లో ఎంత చాతుర్యం చూపవచ్చో నెమ్మది నెమ్మదిగా అర్ధం అవటం మొదలైంది.

టిక్కెట్టు కొనుక్కోడానికి ఇంట్లో తంతే దమ్మిడీ లేదు కాని, ప్రయాణానికి మాత్రం ప్రయత్నాలు ముమ్మరంగా జరిగి పోతున్నాయి.

అప్పుడు బుచ్చన్నయ్య ఉత్తరం రాసేడు. “టిక్కెట్టు కొనుక్కుందికి 800 డాలర్లు అప్పు చేసి పంపుతాను, నెలకి ఏభై చొప్పున తీర్చేస్తే ఏణ్ణర్ధంలో అప్పు తీరిపోతుంది” అని సలహా ఇచ్చేడు. అమెరికా వెళ్ళి జల్సాగా డబ్బు ఖర్చు పెట్టేసుకుందాం అన్న ఊహ ఏ మారుమూలనైనా ఉండి ఉంటే అది కాస్తా హారతి కర్పూరంలా అక్కడే హరించుకుపోయింది. నేనింకా అమెరికా వెళ్ళనే లేదు, కాని నాకు రాబోయే రెండు వందల అసిస్టెంటుషిప్ లోనూ ఏభై నాన్నగారికి ఇంటి ఖర్చులకి, ఏభై అప్పు తీర్చడానికి కేటాయింపు అయిపోయింది.

“పరవా లేదు. పాడు ఖర్చులు పెట్టకుండా బుద్ధిగా చదువుకుంటే స్కాలర్షిప్ డబ్బు వీటన్నిటికీ సరిపోతుంది” అని బుచ్చన్నయ్య ధైర్యం చెప్పేడు. పాడు ఖర్చులకీ డబ్బు సరిపోవటానికి మధ్య ఉన్న విలోమ సంబంధం అర్ధం అయింది కాని, బుద్ధిగా చదువుకోటానికీ డబ్బు సరిపోవటానికీ మధ్య లంకె అర్ధం కాలేదు. తర్వాత నిలకడ మీద ఆలోచించగా తెలిసింది. మా అన్నయ్య దృష్టిలో “బుద్ధిగా చదువుకోవటం” అంటే మంచి మార్కులు రావడమే కాకుండా, “అమ్మాయిల వెంట తిరగకుండా ఉండటం’. ఇంకేమి తిరుగుతాను, చేతిలో చిల్లి గవ్వ లేకుండా? “అరుంధతి మాట దేవుడెరుగు కానీ ఆరు వేలు అప్పు కనిపిస్తున్నాది” అన్నాడుట వెనకటికి ఒహడు. అలాగ, పేస్‌పోర్టు లేదు, వీసా లేదు, కాని ముందస్తుగా అమాంబాపతులు కలుపుకుని ఐదు వేలు అప్పు కనిపించింది.

పేస్‌పోర్టు పోస్టులో తెప్పించుకుందికి వ్యవధి లేదు కనుక , దరఖాస్తు కాగితాలు తీసుకుని మెడ్రాసు వెళ్ళేను. ఒక రోజల్లా అక్కడ కూర్చున్న తర్వాత, “పోలీసు రిపోర్టు రాలేదు, పేస్‌పోర్టు ఇవ్వం పొమ్మన్నారు. పుల్లయ్య యావ్వారంలా అయిందనుకొని నెత్తి మీద చెంగేసుకుని తుని తిరుగు ప్రయాణం కట్టేను.
ఆ రోజుల్లో ఇప్పటిలా కంప్యూటర్లతో రిజర్వేషన్ చేసే పద్ధతి లేదు. ఆ రోజులలో ఇండియాలో కంప్యూటర్లే లేవు. అప్పటికప్పుడు అనుకుని ప్రయాణం చేస్తే నరకం కంట పడేది. టికెట్టు కౌంటరు దగ్గర దొమ్మీ లోకి అభిమన్యుడు పద్మవ్యూహం లోకి జొరబడ్డట్టు దూరి పోవాలి. రెండంగుళాలు వ్యాసం ఉన్న చిన్న కంతలోకి నాలుగు చేతులు ఒక్కసారి వెళ్ళేవి. టిక్కెట్లు, చిల్లర ఉన్న చెయ్యిని బయటకి లాగ గలిగితే నోబెల్ బహుమానం వచ్చినంత గర్వంగా ఉండేది.

మొత్తం మీద హౌరా మెయిలు ఎక్కేను. ఆ రోజుల్లో మెడ్రాసు నుండి తుని వెళ్ళాలంటే పూరీ పేసెంజరు, మెయిలు – ఈ రెండే గతి. మెయిలు లో ఫస్టు క్లాసు, సెకండు క్లాసు, ఇంటరు, ఐస్ వెండరు, మిలిటరి, పోస్టల్ సర్వీసు, లేడీస్ – ఇలా ఒకొక్క బోగీని ఒకొక్క విధంగా కేటాయించెయ్యడంతో, రిజర్వేషన్లూ, రైల్వే పేసులూ లేని నా బోటి మూడవ తరగతి ప్రయాణీకులకి బోగీలో సగం భాగం ఉండేది. ప్రయాణం దుర్భరంగా ఉండేది. ఆ రోజు రైలు ఎంతలా కిటకిటలాడిపోయిందంటే, సాయంకాలం మెడ్రాసులో బండి ఎక్కిన వాడిని, మర్నాడు ఉదయం పదిగంటలకి రాజమండ్రి చేరుకునే వరకు నిలబడే ఉన్నాను, ఆ తొడతొక్కిడిలో నేల మీద కాలు మోపుకుందికి కూడ జాగా దొరకక అలా గాలిలోనే నిలబడ్డాను! నా జీవితంలో మొదటిసారి అనిపించింది: “ఎప్పుడు ఈ దేశం నుండి బయట పడతానా, ఎప్పుడు సుఖపడతానా” అని.

ఈ భాగోతం అంతా అయేసరికి నేను వెళదామనుకుంటూన్న పడవ కాస్తా బొంబాయి వదలి పెట్టేసింది. మూలుగుతూన్న నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇహ నాకు ఆ విమానం ఖర్చులు తప్పేట్టు లేవు.

ఈ మారు మనిషి సాయం ఉంటే బాగుంటుందని చిట్టన్నయ్య కూడ నాతో మెడ్రాసు వచ్చేడు. విమానం ఖర్చులకి కావలసిన డబ్బు అంతా లోపల బనీను జేబులో పెట్టి ఆ జేబుని మూసేస్తూ అక్క ఒక పోగు వేసి కుట్టింది.

సెప్టెంబరు ఎనిమిదిన పేస్‌పోర్టు వచ్చింది. అది పట్టుకుని మౌంట్ రోడ్డులో ఉన్న అమెరికన్ కాన్స్సలేటుకి పరిగెట్టేం. వీసా త్వరలోనే వచ్చింది. అక్కడనుండి థామస్ కుక్ అండ్ సన్స్ వారి ఆఫీసుకి సాయంకాలం ఆఫీసు మూసేసే వేళకి వెళ్ళి విమానం టికెట్టు కొన్నాం. వారే ఎనిమిది డాలర్లు ఫారిన్ ఎక్స్చేజి కూడ ఇచ్చేరు. ఇవన్నీ తెమిలిన తర్వాత పరుగు పరుగున తుని వచ్చేం. ఇక బొంబాయికి బయలుదేరి వెళ్ళటానికి ఎక్కువ వ్యవధి లేదు.

మర్నాడే బొంబాయికి రైలు ప్రయాణం. రెండు రోజులు పట్టింది కాని కూర్చుందుకి చోటు దొరికింది. బొంబాయి ఊరు నాకూ, చిట్టన్నయ్యకి కూడ తెలియదు. తన స్నేహితుడు, జోషీ విక్టోరియా టెర్మినస్ లో మమ్మల్ని కలుసుకుని విమానం ఎక్కించే ప్రయత్నం అంతా బుచ్చన్నయ్య అమెరికా నుండే చేసేడు. కనుక మేం ఇద్దరం అతి ధైర్యంగా చేతులాడించుకుంటూ సెప్టెంబరు ఉదయం తొమ్మిదింటికల్లా వి. టి. లో దిగేం.

స్టేషన్‌లో ఎంతసేపు నిరీక్షించినా జోషీ కనిపించడే. ఆ జొషీని మేం ఎప్పుడూ చూడలేదు. ఆందుకని బండి ఎక్కడైతే దిగేమో అక్కడే కదలకుండా రెండు గంటలు నిరీక్షిస్తూ కూర్చున్నాం. అతనొచ్చి సాయం చేస్తాడన్న ధైర్యంతో మేమేమీ సన్నాహాలు చేసుకోలేదు. ఆప్పటికప్పుడు ఏమి చెయ్యగలం?

స్టేషన్ కి దగ్గరగా వెల్‌కం హొటల్ అని ఒక దక్షిణాది హొటల్ కనిపించింది. అందులో దిగేం. స్నానం గట్రా కానిచ్చి, ఆ చుట్టుపట్లే నాలుగు వీధులు తిరిగేం. ఎదురుగా ఒక అమ్మాయి బొమ్మతో పేద్ద ప్రకటన కనిపించింది. “పి-ఫారం దొరక్క పోతే పోయింది, మెయిడెన్ ఫారం బ్రా కొనుక్కోండి” అని ఆ ప్రకటన సారాంశం. అందులో సందర్భోచితంగా కనిపించిన వ్యంగ్యాన్ని గమనించి ఇద్దరం నవ్వుకున్నాం.

ఇహ భోజనం చేసి ఎయిర్‌పోర్టు కి వెళ్ళాలి. సాయంకాలం ఆరు గంటలు అయింది. భోజనాల వేళ కాలేదు కాని మా ఇద్దరికీ భోజనం పెట్టడానికి ఒప్పుకున్నారు. సర్వర్ మా ఇద్దరి కంటె బాగా ఇంగ్లీషు మాట్లాడెస్తూ కబుర్లు మొదలు పెట్టేడు. మా వాలకం చూసి నేను అమెరికా వెళుతున్నట్టు సులభంగానే పసి గట్టేడు. విమానాల గురించి కబుర్లు మొదలు పెట్టేడు. విమానం ఎక్కడానికి నాకు బెదురుగా ఉంటే విమానం ఎక్కించడానికి అన్నయ్య బెదురుగా ఉన్నాడు. ఈ సెర్వర్ విమానాలలో రకాలు, వాటిని నడిపే పద్ధతులు చెబుతూ ఉంటే వినడానికి బాగానే ఉన్నాయి కాని బెదురు తగ్గ లేదు. కడుపులో ఏదో కలవరం.

ఏమిటో “త్రీ పోయింట్ లేండింగ్” అన్నాడు; అంటే ముందున్న చక్రం, వెనక ఉన్న చక్రాల జత ఒకే సారి నేల్ మీద ఆంచడం. చాలా కష్టం కాని కొందరు చెయ్యగలరు. తర్వాత “టూ పోయింట్ లేండింగు” అన్నాడు; అంటే వెనక ఉన్న చక్రాల జత ముందు నేలని ఆనిన తర్వాత ముందున్న చక్రాన్ని నెమ్మదిగా కిందకి దించటం.

“వన్ పోయింట్ లేండింగ్” ఉంటుందా?” అని అడగబోయి, నాలిక్ కరుచుకుని, ఎందుకేనా మంచిదని అడగలేదు

నేను బందరులో ఇంటరు చదువుతున్న రోజులల్లో కోలవెన్ను సుబ్బారావు ఇటువంటి సందర్భం లోనే “పడవ నూరు డిగ్రీలు పక్కకి వాలితే కండిషన్ రెడ్ అవుతుందా, లేక యెల్లో అవుతుందా?” అని చుట్టపు చూపుకి వచ్చిన ఒక నేవీ ఆఫీసర్‌ని అడిగేడు. “రెడ్ కాదు, నువ్వు డెడ్ అవుతావు” అని చెప్పేడాయన.

ఈ నూరు డిగ్రీలు సుబ్బారావు బుర్రలో ఎలా పాతుకు పోయేయో చెబితే కాని ఈ కథ రక్తి కట్టదు. నేను హిందూ కాలేజి లో ఇంటర్మీడియేట్ చదువుకుంటూన్న రోజులలో మా తరగతి లో 600 మంది మగ పిల్లలు, పన్నెండు మంది ఆడ పిల్లలు ఉండేవారు. కనుక ఈ పన్నెండు వందల కళ్ళూ ఆ పన్నెండు మంది అమ్మాయిల మీదే ఉండేవి. అందులో ఒక అమ్మాయి ఏ. డి. ఎం. ఓ. గారి కూతురు. మిగిలిన అమ్మాయిలంతా ఎడ్ల బళ్ళల్లోనో, జటకాలలోనో కాలేజి కి వస్తే ఈ అన్నె వారి అమ్మాయి కారులో వచ్చేది. దగ్గరగా వెళ్ళి చూసి, పలకరించే ధైర్యం లేకపోయినా, దూరం నుండి చూస్తే, సన్నగా, పొడుగ్గా, నాజూగ్గానే ఉండేది. ఆ అమ్మాయి రోల్ నంబరు 100. కనుక 100 అనే సంఖ్య మా సుబ్బారావుకి ఆరాధ్య దేవత అయిపోయింది. విగ్రహారాధన విన్నాను కాని సంఖ్యారాధన చూడటం ఇదే మొదటి సారి. ఏ సందర్భంలో అంకెల ప్రస్తావన వచ్చినా అక్కడ 100 ని ఇరికించి నప్పుతుందో నప్పదో చూసుకునేవాడు మా సుబ్బారావు. పరిక్ష లో నూరు మార్కులు, క్రికెట్ లో సెంచరీ, నీరు మరిగే స్థానం – ఇలా 100 కి సృష్టిలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందని నమ్మేసే స్థితిలోకి దిగజారిపోయేడు. కనుక తుఫానులో ఊగిసలాడుతూన్న పడవ 100 డిగ్రీలు ఊగితే ఏమౌతుందని అడిగేడంటే మనం ఎలా ఆక్షేపించగలం? ఊగే పడవ 100 డిగ్రీలు ఒరిగితే సముద్రం అడుగున ఉంటుందన్న విషయం తెలియని వాడు కాదు, సుబ్బారావు; తర్వాత ఆంధ్రా యూనివర్శిటి లో కెమెస్ట్రీలో పి. హెచ్. డి. చేసేడు. ఆ అమ్మాయి మీద మోజు కొద్దీ పప్పులో కాలేసేడు. ఈ సంఘటన నా బుర్రలో నాటుకు పోయిందేమో “వన్ పోయింట్ లేండింగ్” గురించి అడగ లేదు.

దరిమిలా నేను అమెరికా వచ్చేసిన తర్వాత, ఆ అమ్మాయి గురించి వాకబు చేస్తే మెనింజైటిస్ వచ్చి పోయిందని విని చాల బాధ పడ్డాను.

విమానాల కబుర్లు విమానాల ప్రమాదాల వైపు మళ్ళాయి. బాండుంగ్ కాంఫరెన్సు నుండి తిరిగి వస్తున్న ఎయిర్ ఇండియా వారి విమానం, “కాశ్మీర్ ప్రిన్సెస్” సౌత్ చైనా సముద్రంలో కూలిపోవడం గురించి చెప్పేడు. అందులో చైనా ప్రధాని జో ఎన్ లై ఉన్నాడనుకుని సి. ఐ. ఎ. వారు దానిని కూల్చేసేరుట. వీడికి తెలియని విషయం లేనట్టుంది.

విమానం సముద్రం మీద వాలితే అది రెండు మూడు నిమిషాలు కంటె ఎక్కువ కాలం తేల లేదుట. ఇలా వాటర్ లేండింగ్ లో ఉన్న కష్ట సుఖాలు చెప్పుకొస్తున్నాడు. “లేండ్ మీద వాలితే దాన్ని లేండింగ్ అంటారు కాని, నీటి మీద వాలితే దానిని లేండింగ్ అనొచ్చా అని నాకు చిన్న వ్యాకరణ భూయిష్టమైన సందేహం వచ్చింది. “వింగ్ టిప్” రన్‌వే కి తగిలితే విమానం బోల్తా కొడుతుందన్నాడు. ఇంకా ఏవేవో చెప్పుకు పోతున్నాడు. నా ముఖం లో కత్తి వేటుకి నెత్తురు చుక్క లేదు. అది గమనించి అన్నయ్య వాడి చేత కబుర్లు ఆపు చేయించేడు. దబదబా నాలుగు మెతుకులు కతికి గబగబా బయటకి వచ్చేసేం.

ఆ రోజు 12 సెప్టెంబరు 1961. రాత్రి పన్నెండు దాటిన తర్వాత విమానం ఎక్కేను. విమానం సవ్యంగా నూ యార్క్ చేరుకుందనే వార్త వచ్చే వరకు తను బొంబాయిలోనే ఉంటానన్నాడు అన్నయ్య..

విమానం సగం ఖాళీ. నేను కిటికి సీటు లో కూర్చున్నాను. బయట చిట్ట చీకటి. ఏమీ కనిపించటం లేదు.

అది సూపర్ కాన్‌స్టలేషన్ విమానం. ఇంజనుకి ప్రొపెల్లరు, జెట్టు రెండూ ఉంటాయి. ఈ రకం ఇంజనుకి వెనక వైపు నీలి రంగు మంట లాంటిది కనిపిస్తుంది. దాన్ని చూసి భయపడవద్దని పైలట్ ముందుగానే చెప్పేడు.

విమానం ఎగిరే ఎత్తు చేరుకుంది. హాస్టెస్ అందరికి చాకలేట్లు, ఆ తర్వాత రెండు రకాల సిగరెట్టు పెట్టెలు ఇచ్చింది. నా పక్కనున్న అమెరికన్ పిల్ల సిగరెట్టు ముట్టించింది.

భోజనాలయాక చాల మంది నిద్ర లోకి జారుకున్నారు. పుంజుగుంట (కాక్‌పిట్ అన్న మాటని తెలుగులో రాద్దామనే సరదా తప్ప దురుద్దేశం ఏమీ లేదు.) చూడాలని ఉంటే ఒకరి తర్వాత మరొకరు ముందుకి వచ్చి చూడ వచ్చని పైలట్ చెప్పేడు. కొంచెం సేపు తటపటాయించి, నేను వెళ్ళి చూసి వచ్చేను. ఈ రోజులలో ఈ పని చెయ్యటం మన తరమా?

విమానం అరేబియా సముద్రం దాటి అరేబియా దేశం మీదకి వచ్చే సరికి కొరివి దయ్యాలలా ఎక్కడ చూసినా మంటలే. వైజాగు లో కాల్‌టెక్స్ వారి నూనె శుద్ధి కర్మాగారం వద్ద ఇటువంటి “ఫ్లేర్” ఒకటి చూసేను కనుక అవి కొరివి దయ్యాలనుకుని భయపడ లేదు. కాని అన్ని ఫ్లేర్‌లని ఇంతకు ముందెప్పుడు చూడ లేదు. మెల్లిగా మంటలు దూరం అయిపోయాయి. కైరో మరొక రెండు గంటలలో చేరుకుంటామని పైలట్ చెప్పేడు.

నేను కిటికీ లోంచి అలా చూస్తూనే ఉన్నాను. ఇంతలో ఇంజను వెనక నుండి వచ్చే నీలం మంట ఎర్రగా మారింది. బందరులో ఇంటరు చదువుతూన్న రోజులలో బన్సెన్ బర్నర్ మంట నీలం నుండి ఎరుపుకి ఎప్పుడు మారుతుందో తెలుసుకున్నాను కనుక ఇక్కడ కూడ అటువంటి ప్రకియ ఎదో జరుగుతోందని అనుకున్నాను. అంత కంటె విమానాల గురించి పెద్దగా నాకేమీ తెలియదు – వెల్కం హొటల్ లో సర్వర్ దగ్గర నేర్చుకున్న విషయాలు తప్ప.

ఈ లోగా ఆ ఎర్ర మంట బాగా పెద్దదయింది. కొద్ది సేపటిలో మంట ఏ రంగూ లేకుండా పూర్తిగా ఆరిపోయింది. నేనున్న వైపు రెక్క కింద రెండు ఇంజనులు ఉన్నాయి. ఆ రెండో ఇంజను నీలం మంటనే చూపిస్తోంది. ఇంజనీరుని కదా. నేను చూస్తూన్న దాంట్లో తర్కం నాకు అర్ధం కాలేదు.

దూరంలో ఆకాశం ఎర్రబడుతోంది. విమానం మలుపు తిరుగుతోంది. మేపు ప్రకారం మళుపు తిరగవలసిన అవసరం నాకు కనబడ లేదు; ఇప్పుడే కదా చెప్పేడు, రెండు గంటలలో కైరో చేరుకుంటున్నామని? ఈ లోగా విమానం పూర్తిగా వెనక్కి తిరిగింది. ఎర్రబడుతూన్న ఆకాశం అట్నించి ఇటు వచ్చింది. విమానం ప్రవర్తన అర్ధం కాలేదు. ఈ లోగా పైలట్ ప్రకటన చేసేడు. విమానానికి చిన్న ఇబ్బంది వచ్చిందిట. ఎందుకైనా మంచిదని ఒక సారి కిందకి దిగి తనిఖీ చేసుకుని వెళ్ళడానికి దహరాన్ లో విమానాన్ని దింపుతున్నాను అన్నాడు. ఒక గంట కంటె ఎక్కువ ఆలస్యం అవదని హామీ ఇచ్చేడు.

అప్పట్లో దహరాన్ ఏ దేశం లో ఉందో నాకు తెలియదు. దిగేం. అది మాములు విమానాశ్రయం కాదు; అమెరికా వారి వాయుదళాల స్థావరం. మమ్మల్ని అక్కడ ఒక మిలటరీ హొటల్లో పడేసేరు. గంట ఆలశ్యానికి హొటేలు ఎందుకు? తర్వాత విమానం కంపెనీ వాళ్ళు తుపాకేస్తే కనిపించకుండా అదృశ్యం అయిపోయేరు. నోరున్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరి దారి వారు చూసుకున్నారు. నా లాంటి వాళ్ళం ఏమి చెయ్యాలో తెలియక అలా ఆ హొటల్లో మూడు రోజులు నట్టడి పోయేం.

నాలాంటి వాళ్ళు నలుగురం కలుసుకుని బ్రహ్మ ప్రయత్నం చేసి ఒక ఏజంటుని పట్టేం. నూ యార్క్ లో నన్ను విమానం దింపుకోటానికి రాబోతూన్న అన్నయ్యకి ఒక టెలిగ్రాము ఇవ్వాలి. కాని వాడి రాచెస్టర్ ఎడ్రస్ మాత్రమే నా దగ్గర ఉంది. నూ యార్కు లో ఎక్కడ దిగేడో తెలియదు.

రాచెస్టర్ అడ్రసుకి ఒక టెలిగ్రాము ఇప్పించేను, విమానం కంపెనీ వాళ్ళ చేత. ఇచ్చేం అన్నారు. కాని నిజంగా ఇచ్చేరన్న నమ్మకం నాకు లేదు. అలాగే తునిలో నాన్నగారికి మరొక టెలిగ్రాము ఇప్పించేను; నేను క్షేమంగానే ఉన్నానని. కాని బొంబాయిలో ఉన్న చిట్టన్నయ్యకి టెలిగ్రాము ఎక్కడికి ఇవ్వాలో తెలియ లేదు. ఆ వెల్‌కం హొటలు అడ్రసు కూడ నా దగ్గర లేదు.

నా టెలిగ్రాము అందుకోకుండానే నూ యార్కు సిటీ వచ్చేసిన బుచ్చన్నయ్యకి పరిస్థితి తేలికగానే అర్ధం అయిందిట. బొంబాయిలో ఉన్న చిట్టన్నయ్యకి సగం సగం వార్త వచ్చిందిట. “విమానం ఇంజనుకి నిప్పంటుకుందిట. అందుకని కైరో చేరలేదుట,” అని ఎవరో చెప్పేరుట. విమానం ఏమైందో చెప్పలేదుట. విమానం కూలిపోయి ఉంటే పేపరులో వస్తుంది కదా! అయినా సరే, బెంగ బెంగే! తాజ్ మహల్ హొటేలు లో ఉన్న టి. డబ్ల్యు. ఏ. వారి ఆఫిసులో అడిగితే ఎయిర్‌పోర్టు కి వెళ్ళి అడగమన్నారుట. శాంటా క్రూజ్ లో అడిగితే ఊళ్ళొ కనుక్కోమన్నారుట. ఆ ఎడారిలో ఎక్కడో కూలిపోయిందేమో అన్న బెంగ వాడి మస్తిష్కాన్ని దొలిచేస్తున్నాది. బొంబాయిలో విమానాల్ కంపెనీల వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి, ఇంక చేసేది లేక, ఏ మొహం పెట్టుకు ఇంటికి వెళ్ళడమా అని భయపడుతూ, రైళ్ళు మారుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి మూడు రోజులు పట్టిందిట. అప్పటికి నేను క్షేమంగా నూ యార్కు చేరుకున్నట్లు అన్నయ్య ఇచ్చిన టెలిగ్రాము తునిలో అందింది కనుక సరిపోయింది.

ఇక దహరాన్‌లో నా సంగతి. నేనున్నది సౌదీ అరేబియాట. చేతిలో ఎనిమిది డాలర్లే ఉన్నాయి. ఎప్పుడు దేనికి అవసరం వస్తాయో? అందుకని, రెండు రోజుల పాటు, ఆ ఎడారి మధ్యలో, ఆ హొటల్లో కాలం గడిపేను. తిండి తినటం, దిక్కులు చూస్తూ కూర్చోవటం, పడుక్కోవటం. తిండి తినడానికి రెస్టరాంటుకి వెళ్ళేను కదా. “నేను శాకాహారిని. తినడానికి ఏమైనా ఉందా?” అని అడిగేను. మష్‌రూం సూపు తప్ప మరేదీ లేదన్నాడు. నేను అంతకు ముందు సాంబారు, పులుసు తిన్నాను కాని, సూపు ఎప్పుడూ తినలేదు. పైపెచ్చు కుక్క గొడుగులతో చేసిన సూపా? అసలు కుక్క గొడుగులు తింటారా? కుక్క గొడుగులు శాకాహారమా? మాంసాహారమా?
నేనిలా తర్జనభర్జనలు పడుతూ ఉంటే సర్వరు అన్నాడు. “అదొక్కటే ఉంది. కావాలంటే పట్టుకొస్తాను. లేక పోతే పస్తు పడుక్కో.” గత్యంతరం లేక అదే తిన్నాను. తర్వాత తెలిసింది. తినే మష్‌రూం ని పుట్ట గొడుగులనీ, తినకూడని వాటిని కుక్క గొడుగులనీ అంటారని. మష్‌రూం శాకాహారం కిందకే వస్తుందని చెప్పేరు.

సెప్టెంబరు 14 న టి. డబ్ల్యు. ఏ. వారి విమానం మరొకటి వచ్చి దహరాన్ లో నట్టడి పోయిన వాళ్ళందరినీ ఎక్కించుకుని నేరుగా లండన్ తీసుకు పోయింది. లండన్ చేరుకునేసరికి నూ యార్క్ వెళ్ళే విమానం మా కోసం వేచి ఉంది. నన్ను, నా లాంటి మరొక ఇద్దరిని కారులో ఎక్కించుకుని, మా కోసం నిరీక్షిస్తూన్న ఆ రెండవ విమానం దగ్గరకి తీసుకెళ్ళి ఎక్కించేరు. అది వెంటనే గాలి లోకి లేచి ఎగిరి పోయింది. ఈ హడావుడిలో లండను విమానాశ్రయం ఎలా ఉంటుందో చూసే అవకాశం కూడ రాలేదు.

లండన్ నుండి నూయార్కు తీసికెళ్ళిన విమానం బోయింగు 707. జెట్టు విమానం. అప్పట్లో అది చాల కొత్త విమానం. విమానం ఎక్కి కూర్చున్నాను. ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియదు కాని నూయార్కులో దిగే ముందు లేపేరు. కిటికీ లోంచి చూస్తూ ఉంటే నూయార్కు లో దీపాలు అద్భుతంగా కనిపించేయి. సెప్టెంబరు 14 రాత్రి ఎనిమిదింటికి విమానం నేల మీద వాలింది.


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...