మధుమేహం – రక్తపోటు 1

నాంది

ప్రపంచంలో ఉన్న 8,000 మిలియన్ జనాభాలో దరిదాపు 550 మిలియను ప్రజలు మధుమేహంతో (diabetes) బాధ పడుతున్నారు అని ఒక గణాంకం చెబుతోంది. అనగా, నూరింట ఆరుగురు! అంతేకాదు. ఇండియాలో ఉన్న 1,500 మిలియన్ల జనాభాలో దరిదాపు 80 మిలియన్ల వయోజనులు అనగా (వయస్సు 20-79), నూరింట ఐదుగురు, మధుమేహం బారిన పడుతున్నారనిన్నీ, అందుకే ప్రపంచంలో ‘మధుమేహానికి ఇండియా ముఖ్యపట్నం’ అని ఇటీవల అనడం మొదలు పెట్టేరు! అతి రక్తపు పోటు (high blood pressure), లేదా అతిపోటు (hypertension) విషయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది: ప్రపంచంలో ఉన్న దరిదాపు 1,300 మిలియన్ల వయోజనులలో రక్తపు పోటు అతిగా ఉంటోందని అంచనాలు చెబుతున్నాయి. అనగా, ఉరమరగా మూడింట ఒకరు ఈ వ్యాధితో బాధ పడుతున్నారు!

ఈ రెండు అస్వస్థతలకీ మధ్య ఒక అవినాభావమైన లంకె ఉంది. అలాగే ఈ రెండింటికీ, హృదయ-నాళ (cardiovascular) జబ్బులకీ మధ్య కూడా లంకె ఉంది. డయబెటీస్ కారణంగా ధమనులు మృదుత్వం కోల్పోయి గట్టిబడతాయి. ఈ పరిస్థితి (atherosclerosis) వల్ల రక్తపు పోటు పెరుగుతుంది. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే మూత్రకోశాలు (kidneys) పాడవుతాయి. ఈ కారణంగా రక్తంలో నీటి పాలు పెరుగుతుంది. అనగా రక్తపు ఉరువు (volume) పెరుగుతుంది. దానితో రక్తపు పోటు పెరుగుతుంది.

ఈ రెండు జబ్బుల గురించి మనకి ఎంత తెలుసు? ఇవి ఎందుకు ఇంత ఎక్కువగా వస్తున్నాయి? ఈ రెండింటికీ మధ్య లంకె ఏమిటి? వీటినుండి రక్షణ పొందటం ఎలా? ఈ విషయాలు సమగ్రంగా అర్థం కావాలంటే కొంచెం ఓపికగా, కొంచెం లోతుగా ఈ అంశాన్ని పరిశోధించాలి.

ఈ వ్యాసంలో అనేక సాంకేతిక పదాలు ఉపయోగించేను. వీటికి సమానార్థకాలు ఇంగ్లీషులో కూడా ఇచ్చేను. ఒక్కోసారి ఒకే ఇంగ్లీషు మాటకి అనేక తెలుగు మాటలు వాడుకలో ఉంటున్నాయి. అందరికీ అర్థం అవాలన్న కోరికతో అన్ని పదాలూ, అడపా తడపా వాడేను. నా కపోలకల్పితాలైన మాటలు కూడా అక్కడక్కడ వాడేను. విషయం అర్థం అవుతున్నాదా అన్న అంశం మీద దృష్టి కేంద్రీకరించమని మనవి.

1. రక్తంలో ఎర్ర కణాల కథ

హైదరాబాద్ నగరం జనాభా దాదాపు ఒక కోటి అని ఒక అంచనా ఉంది. ఒక్కో ఇంట్లో నలుగురు మనుషులు ఉంటారనుకుంటే హైదరాబాద్‌లో దాదాపు 25 లక్షల ఇళ్ళుండాలి. మానవ శరీరంలో దాదాపు 40 లక్షల కోట్ల జీవకణాలు (cells) ఉన్నాయంటారు. ప్రతి జీవకణాన్నీ ఒక ఇల్లు అనుకుంటే, మన శరీరంలో దాదాపు 40 లక్షల కోట్ల ఇళ్ళున్నాయన్నమాట; అంటే హైదరాబాద్‌ లాంటి నగరాలు రెండు కోట్లు ఇముడుతాయి మన శరీరంలో!

ప్రతి ఇంట్లో రోజూ చాలా వస్తువులు అవసరం అవుతాయి కదా? ముఖ్యంగా పాలు, బియ్యం, కూరగాయలు, పప్పులూ మసాలా దినుసులూ కావాలి గదా? అప్పుడప్పుడు వీటిని బజారునుంచి తెచ్చుకుంటూ ఉండాలి. వంట చెయ్యాలంటే గాస్ సిలిండర్ కావాలి. ఖాళీ సిలిండర్ తిరిగి ఇచ్చెయ్యాలి. ఇవన్నీ రవాణా చెయ్యడానికీ, ఇళ్ళనుంచి చెత్త తీసుకెళ్ళటానికీ రోడ్లూ, వాహనాలూ ఉండాలి. ఒక ఇంటిని ఒక కణంతో పోల్చినప్పుడు, శరీరంలో కూడా ఈ రోడ్లూ, ఈ వాహనాలూ, ఈ రద్దీ ఉండాలి కదా?

రోడ్లు చేసే పని మన శరీరంలో రక్త నాళాలు చేస్తాయి. ప్రతి కణానికీ కావలసిన ఆహార పదార్థాలు నాళాల్లో ప్రవహించే రక్తం ద్వారా చేరతాయి. ఇక ఈ పదార్థాలను వండుకోవటం గురించీ, వండుకోవటానికి అవసరం అయ్యే గాస్ సిలిండర్ గురించీ మాట్లాడుకుందాం.

మనం తినే పదార్థాలలో ఎక్కువభాగం రకరకాల కర్బనోదకాలు (carbohydrates లేదా carbs). మనం తినే ఆహారంలో ఉండే పిండి పదార్థాలు (starches), చక్కెరలు (sugars), పీచు (fiber), కణోజు (cellulose) కర్బనోదకాల జాతివే. వీటిలో కొన్ని జీర్ణం అయినప్పుడు గ్లూకోజ్‌‌గా (glucose) మారుతాయి. ఈ గ్లూకోజు ఒక జాతి చక్కెర (sugar) అని గమనించండి. గ్లూకోజ్‌ను ముడి పదార్థంగా వాడి మన జీవకణాలు వాటికి కావలసిన పదార్థాలను తయారు చేసుకోవడానికి వాడుకుంటాయి. లేదా, దాన్ని ‘తగలబెట్టి’ అందులోవున్న శక్తిని బయటకులాగి, వాడుకుంటాయి. గ్లూకోజ్‌ని తగలబెట్టటం ఏమిటీ అని అనుకుంటున్నారు కదూ? గ్లూకోజ్‌ని మన శరీరం ఇంధనం లాగా వాడుకుంటుంది. ‘తగలబెట్టడం’ అంటే రూపు మార్చడం (metabolize చెయ్యటం)!

వంట చెయ్యటానికి వాడే ఇంధనాన్ని సహజ వాయువు (natural gas) అంటారు. ఆ వాయువుని తగలబెట్టినప్పుడు అందులోవున్న శక్తి మంటలాగా బయటకొచ్చి మనం అన్నం వండుకోవటానికో, పాలు కాగబెట్టుకోవటానికో, నీళ్ళు వెచ్చబెట్టుకోవటానికో పనికొస్తుంది. గాస్‌ని తగలబెట్టాలంటే గాలిలో ఆమ్లజని (ప్రాణవాయువు, oxygen) ఉండాలి. సహజ వాయువుని ఆమ్లజనితో తగలబెడితే దానిలోని శక్తి బయటకొచ్చినట్లే, మన శరీరంలోని జీవకణాలలో గ్లూకోజ్‌ని ఆక్సిజన్‌తో తగలబెడితే గ్లూకోజ్‌లో ఉన్న శక్తి బయటకొస్తుంది. ఆ శక్తిని మన కణాలు వాటి అవసరాలకోసం వాడుకుంటాయి. సహజ వాయువుని తగలబెట్టటం సులభం. ఎందుకంటే గాలిలో ఆమ్లజని ఉంది, ఇంధనం సిలిండర్లలో వస్తుంది. మనకి గాస్ సిలిండర్ కావాల్సినప్పుడు ఫోన్‌ చేస్తే ఆ సిలిండర్లబ్బాయి ఒక సిలిండర్ తెచ్చిపెడతాడు. శరీరంలో కణాలకు కావలసిన ఇంధనం మన ఆహారంలో ఉంది. కాని దానిలోంచి శక్తిని బయటికి లాగాలంటే ఆమ్లజని కావాలి. మరి శరీరానికి ఈ ఆమ్లజనిని ఎవరు తెచ్చిపెడతారు?

మన శరీరంలో ఆమ్లజనిని తెచ్చిపెట్టటానికి ప్రత్యేకమైన కణాలున్నాయి. ఇవే మన రక్తంలో ఉండే ఎర్ర కణాలు (red blood cells). రక్తం ఎర్రగా ఉండటానికి కారణం ఇవే. శరీరంలో ఉన్న ప్రతి కణానికీ ఆమ్లజనిని సరఫరా చేసేవి ఈ ఎర్ర కణాలే. మనం పీల్చే గాలిలోంచి ఆమ్లజనిని ‘సిలిండర్’లలోకి ఎక్కించి శరీరంలో ఉన్న అన్ని కణాలకూ సరఫరా చేసేది ఈ ఎర్ర కణాలే. నిజానికి ఈ ఎర్ర కణాల్లో సిలిండర్లు ఉండవుగాని, సిలిండర్ల స్థానంలో హీమోగ్లోబిన్‌ అనే బణువులు (molecules) ఉంటాయి. ఒక్కో ఎర్ర కణంలో 280 మిలియను (28 కోట్ల) హీమోగ్లోబిన్లు ఉంటాయి. ఒక్కో హీమోగ్లోబిన్‌ బణువు నాలుగు ఆమ్లజని బణువులను మోసుకొస్తుంది. అంటే ప్రతి ఎర్ర కణం దాదాపు వంద కోట్ల ఆక్సిజన్‌ బణువులను మోసుకొస్తుంటుందన్నమాట. ఇక్కడ ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి. ప్రతి హీమోగ్లోబిన్‌ బణువులో నాలుగు ఇనుము అయాన్లు (Iron ions) ఉంటాయి (బొమ్మ మధ్యలో Fe). నిజానికి ఇవి లేకపోతే హీమోగ్లోబిన్‌ ఆమ్లజనిని పట్టుకోలేదు. అంటే, ఆమ్లజని మన కణాలకు సరఫరా అవ్వాలంటే హీమోగ్లోబిన్‌‌లో ఇనుము ఉండాలి. ఆ సరఫరా లేకపోతే మనం ఆహారం నుండి శక్తిని బయటకు లాగి వాడుకోలేం. అలా వాడుకోలేక పోతే మనం నీరసపడిపోతాం. అందువల్లే డాక్టర్లు రక్తపరీక్ష చేసి మీ రక్తంలో ఇనుము ఎంత ఉందో, హీమోగ్లోబిన్‌ ఎంత ఉందో చూస్తారు. రక్త హీనత అంటే తగినంత హీమోగ్లోబిన్‌ లేకపోవటమే. దీన్ని రక్తలేమి అంటారు. (గ్రీకు భాషలో a + haima = anemia = no blood.)


బొమ్మ 1. (నాలుగు N అణువులు, మధ్యలో ఒక Fe అయాను కలసి ఒక తొట్టెలా తయారయి, ఒక ఆమ్లజని బణువుని మోసుకొస్తాయి. ఒక హిమోగ్లోబిన్ బణువులో ఇటువంటి తొట్టెలు నాలుగు ఉంటాయి.

ఇక సంచార ప్రతిష్టంభనాల (traffic jams) గురించి ఒక్క మాట. రక్త నాళాలు రోడ్లు లాంటివి అనుకున్నాం కదా? మరి రోడ్డు మీద ప్రమాదం జరిగో, లేక రోడ్డు మీద గుంటలు పడో, ట్రాఫిక్ ఆగిపోయిందనుకోండి. అంటే శరీరం విషయంలో ఎర్ర కణాలు ఆమ్లజనిని మోసుకు రాలేకపోయాయనుకోండి. మెదడులో అలా జరిగితే ఆమ్లజని చేరని ప్రాంతం చచ్చిపోతుంది. పక్షవాతం లాంటి జబ్బు వస్తుంది. గుండెకు చాలినంత ఆమ్లజని చేరకపోతే గుండెపోటు వస్తుంది.

ఆమ్లజనిని మనం ప్రాణవాయువు అని ఎందుకు అంటామో మీరు ఇప్పుడు గ్రహించి ఉంటారు. అది లేకపోతే మనం మన జీవకణాల్లో గ్లూకోజ్‌ని తగలబెట్టలేం, దాన్నుంచి శక్తిని బయటకు తియ్యలేం. శక్తి లేకపోతే మనం బ్రతకలేం కాబట్టి ఆమ్లజనిని ప్రాణవాయువు అంటాం.

అప్పుడప్పుడు గేస్ సిలిండర్ పేలిపోవడం వల్లో, గేస్ లీక్ అవటం వల్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ప్రమాదంలో మనుషులు చచ్చిపోవటం, ఇళ్ళు కాలిపోవటం కూడా జరుగుతుంది. ప్రాణవాయువుతో కూడా ఇటువంటి ప్రమాదం ఒకటి ఉంది. గ్లూకోజ్‌ని తగలబెట్టే క్రమంలో ఆమ్లజని నీరుగా మారుతుంది, గ్లూకోజేమో బొగ్గుపులుసు వాయువు (carbon dioxide) గా మారుతుంది. నీరుగా మారే క్రమంలో ఆమ్లజని ప్రమాదకరమైన రూపాల్లో (వీటిని విశృంఖల రాశులు లేదా free radicals అంటారు) ఉంటుంది. కానీ సాధారణంగా ఆ రూపాలు కణాల ‘వంటగదుల్లోంచి’ బయటకు రావు కాబట్టి వాటివల్ల ప్రమాదం ఉండదు. అయితే ఒక్కోసారి, నూటికి నాలుగైదు సార్లు (4-5%), ఈ ప్రమాదకరమైన ఆమ్లజని రూపాలు (అనగా, విశృంఖల రాశులు) లీక్ అవుతాయి. అలా నిష్యందం చెందిన (లీక్ అయిన) రూపాలు ఆయా కణాలను చంపెయ్యగలవు. వాటి చుట్టూ ఉన్న కణాలకు కూడా వీటివల్ల హాని జరగవచ్చు. నిజానికి ఇలా లీక్ అయ్యే ఆమ్లజని రూపాలవల్లే నరాలకు సంబంధించిన జబ్బులు వస్తాయని ఒక ప్రతిపాదన కూడా ఉంది.

ఆమ్లజనిని వాడుకునే కణాలకే ఇంత ప్రమాదం పొంచి ఉంటే, ఆ ఆమ్లజనిని మోసుకొచ్చే ఎర్ర కణాలకు ఇంకా ఎంత ప్రమాదం ఉండాలి? గాస్ సిలిండర్లు వాడుకునే వినియోగదారుల కంటె అన్ని సిలిండర్లను బండిలో వేసుకుని వచ్చే వారికి ఇంకా ఎక్కువ ప్రమాదం కదా? మరి ఎర్ర కణాలు అలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉండటానికి ఏం చేస్తాయి? మీరు నమ్ముతారో నమ్మరోగాని ఎర్ర కణాల్లో అసలు ‘వంటగదులు’ లేవు! ఒక్కటి కూడా లేదు. మామూలు కణాల్లో ఒక్కోదాంట్లో కొన్ని వేల వంటగదులు (వీటిని మైటోకాండ్రియా అంటారు) ఉంటాయి. వంటగదిలో గ్లూకోజ్‌ని తగలబెట్టేటప్పుడే కదా ఆక్సిజెన్‌ ప్రమాదకరమైన రూపాల్లోకి మారేది. అస్సలు ఒక్క వంటగది కూడా లేకపోతే ఎంత ఆమ్లజని ఉన్నా ప్రమాదం ఉండదుకదా? కానీ, వంటగది లేకపోతే ఎర్ర కణాలకు కావాల్సిన శక్తి ఎలా వస్తుంది? గ్లూకోజ్‌ను వంటగదిలో తగలబెడితేనేకదా శక్తిని బయటకు లాగ్గలిగేదీ, వాడుకోగలిగేదీను!

ఎప్పుడో మూడు వందలకోట్ల సంవత్సరాల క్రితం జీవకణాలు మొదట ఆవిర్భవించినప్పుడు వాటిలో వంటగదులు ఉండేవి కాదు. గ్లూకోజ్ దొరికినా దాన్ని రెండు ముక్కలు చేసి అందులోంచి కొంచెం శక్తిని మాత్రం బయటకు లాగి వాడుకోగలిగేవి ఆ ఆదిమ జీవకణాలు. ఆ కాలంలో గాలిలో ఆమ్లజని ఉండేది కాదు. ఆమ్లజని ఉండి, దాన్ని వాడుకోగలిగితే ఆ ఆదిమ కణాలు గ్లూకోజ్‌ నుంచి పదిహేను రెట్లు ఎక్కువ శక్తిని లాక్కోగలిగేవి. ఎర్ర కణాల విషయంలో, ఆమ్లజని ఉన్నా, అసలు ఆమ్లజనిని శరీరంలోని అన్ని కణాలకూ మోసుకుపోయేవి అవే అయినా, వంటగదులు లేకపోవడం వల్ల, ఆమ్లజనిని వాడుకోలేక పోవటం వల్ల, ఈ కణాలు గ్లూకోజ్‌ నుంచి కొంచెం శక్తిని మాత్రమే తీసుకోగలుగుతాయి. అంటే ఆదిమ జీవ కణాల స్థాయిలో చుట్టూ నీళ్ళున్నా తాగటానికి నీళ్ళు లేవు అన్నట్లుంది కదా ఈ ఎర్ర కణాల పరిస్థితి!

మరి అంత తక్కువ శక్తితో ఎర్ర కణాలు ఎలా బతుకుతున్నాయి? ఇంకో విషయం – మనింట్లో వంటగది లేకపోయినా పక్కింట్లో సిలిండర్ పేలితే మన ఇల్లు కూడా కూలిపోవటమో, తగలబడటమో జరగొచ్చు కదా? మరి ఎర్ర కణాలకి కూడా ఇతర కణాల ఆమ్లజని వాడకంనుంచి అలాంటి ప్రమాదం లేదా? నిజమే పాపం! ఎర్ర కణాల పరిస్థితి కష్టమైనదే. కావలసినంత శక్తి సమకూర్చుకునే మార్గం లేదు. శక్తి లేకుండా చుట్టుపక్కల కణాలనుంచి వచ్చే ప్రమాదకరమైన ఆమ్లజని రూపాల నుంచి తన ఇంటిని కాపాడుకోవడమూ కష్టమే. అందుకేనేమో ఎర్ర కణాలు ఎక్కువ రోజులు బతకవు. సగటున ఒక మనిషి 80-90 సంవత్సరాలు బతికితే, ఎర్ర కణాలు దాదాపు 120 రోజులు మాత్రమే బతుకుతాయి. రోజూ ఎన్ని ఎర్ర కణాలు చచ్చిపోతాయో అన్ని కణాలను శరీరం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మొత్తం మీద రక్తంలో ప్రవహించే ఎర్ర కణాల సంఖ్య స్థిరంగానే ఉంటుంది.

శరీరం ఒక మహానగరం అనుకున్నాం కదా. అందులో ఉండే నలభై లక్షల కోట్ల కణాల్లో దాదాపు నాలుగో వంతు ఎర్ర కణాలే. చాలీ చాలని తిండితో, చిన్న వయసులోనే అస్తమించే ఈ ఎర్ర కణాలు లేకపోతే మిగతా ముప్ఫయ్ లక్షల కోట్ల కణాలు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండగలవా?

2. ఓ! గ్లూకోజ్ గారా? రండి, లోపలికి రాండి!

ఎవరో తలుపు కొడితే మీరు తలుపు తీశారు. “ఓ! మీరా, రాండి!” అని సాదరంగా ఆహ్వానించారు. అంటే తలుపు కొట్టిన మనిషిని మీరు గుర్తు పట్టారు, అస్మదీయుడే కాబట్టి లోపలికి రమ్మన్నారు. మీ ఇంటికి లాగనే మన శరీరంలోని జీవకణాలకి కూడా ఇలాంటివే – అంటే తలుపుకొట్టిన వారిని గుర్తుపట్టి లోపలికి రానిచ్చేవి – తలుపులుంటాయి. కానీ మీ ఇంటి తలుపులకూ ఈ కణాల తలుపులకూ కొన్ని ముఖ్యమైన తేడాలు కూడా ఉన్నాయి.

ప్రతి కణానికీ చుట్టూ ఒక సన్నటి పొర (membrane) ఉంటుంది. ఈ పొరలోగుండా కణం నుంచి బయటకూ, బయటనుంచి కణం లోనికీ ఏదీ సులభంగా వచ్చే అవకాశంలేదు – ఒక్క నీళ్ళు తప్ప. మరి కణానికి అవసరమైన సరంజామా కణంలోకి ఎలా వస్తాయి? చాలా ఇళ్ళకు ఒక్క తలుపే ఉంటుంది. వచ్చే వాళ్ళందరూ దాని గుండానే లోపలికి వస్తారు. కణాల్లో అలాకాదు. ప్రతి కణానికీ దాదాపు ఇరవై ముప్ఫయ్ రకాల రవాణా తలుపులు (transporters) ఉంటాయి. ఒక్కో రకం తలుపులు కొన్ని వందల, లేక కొన్ని వేల, సంఖ్యలో ఉంటాయి.


బొమ్మ 2. జీవకణాల గోడలలో రకరకాల రవాణా తలుపులు.

ఇప్పుడు మనం గ్లూకోజ్ గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలో ఉన్న ప్రతి కణం దానికి కావాల్సిన శక్తి కోసం, ఇతర అవసరాల కోసం, గ్లూకోజ్‌ని వాడుకుంటుంది. మన ఆహారంలో ఉండే చాలా పదార్థాలు జీర్ణం అయినప్పుడు గ్లూకోజ్‌గా మారతాయి. మనం గ్లూకోజ్ లేకుండా బ్రతకలేం. కానీ మన రక్తంలో, మన కణాల్లో, గ్లూకోజ్ మితికి మీరి ఎక్కువయితే షుగర్ జబ్బు (Diabetes) వస్తుంది. దీనినే మధుమేహం అని కూడా అంటారు. అందువల్ల గ్లూకోజ్ చాలా కీలకమైన పదార్థం – అది సమతూకంలో ఉన్నంతసేపూ! కనుక దాని గురించి మనం లోతుగా తెలుసుకోవటం అవసరం.

చాలామంది ఈ డయబెటీస్‌ని షుగర్ జబ్బు అనిన్నీ, షుగర్ అనిన్నీ అజాగ్రత్తగా అనేస్తూ ఉంటారు. రసాయనశాస్త్రంలో గ్లూకోజ్‌ ఒక రకం ‘షుగర్’. తీపి పదార్థాన్ని దేన్ని అయినా షుగర్ అనటంలో తప్పు లేదు గాని, మనం కాఫీలో వాడే షుగర్ (చక్కెర) గ్లూకోజ్ కాదు; అందులో రెండు రకాల చక్కెరలు ఉన్నాయి. ఈ షుగర్ (చక్కెర) మన శరీరంలో జీర్ణం అయినప్పుడు దాంట్లో సగభాగం గ్లూకోజ్‌గా మారుతుంది. ఈ గ్లూకోజ్‌ని మన జీవకణాల్లోకి రానివ్వటానికి ఒక్క గ్లూకోజ్‌ని మాత్రమే గుర్తుపట్టే రవాణా తలుపులు ఉంటాయి. ఇందాక చెప్పినట్లు, ఇలాంటి తలుపులు ఒక్కో కణకవచం మీద వేల సంఖ్యలో ఉంటాయి. అంటే వేల సంఖ్యలో గ్లూకోజ్ బణువులు (molecules) ఒకేసారి, వేరు వేరు తలుపుల ద్వారా కణం లోపలికి ప్రవేశించవచ్చన్నమాట! ఈ తలుపులు గ్లూకోజ్‌ని తప్ప మరొక బణువుని దేన్నీ గుర్తుపట్టవు, లోపలికి రానివ్వవు. ఇతర రకాల తలుపులు ఇతర బణువులను ఇలాగే గుర్తుపట్టి లోపలికి రానిస్తాయి. అంటే కణకవచాల మీద ఒక్కోరకం బణువుకు ప్రవేశం ఇవ్వడానికి ఒక్కోరకం తలుపులు ఉంటాయన్నమాట. ఇంకొక విషయం – మీరు తలుపు తెరిచి అస్మదీయుడే అని గుర్తుపట్టారు కదా? ఈ తలుపుల విషయంలో అక్కడ ఎవరూ నిలబడి వచ్చే వారిని గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. ఆ తలుపులే గుర్తుపడతాయి. నిజానికి ఈ తలుపులు గ్లూకోజ్‌ని పట్టుకుని, లొపలికి తీసుకొచ్చి వదిలిపెడతాయి.

ప్రతి కణం చుట్టూ రక్త నాళాల నుంచి స్రవించే ద్రవం ఉంటుంది. అందులో ఉన్న గ్లూకోజ్ తలుపుల ద్వారా కణాల్లోకి వస్తుంది. కణాలు గ్లూకోజ్‌లో అంతర్గతంగా ఉన్న శక్తిని బయటకు లాగే ప్రయత్నంలో దాన్ని కొంచెం మార్పు చేస్తాయి. మీరు ఫాస్పేట్ అన్న మాట వినే వుంటారు. (పొలాలకు వేసే ఎరువుల్లో ఫాస్పేట్ ఉంటుంది.) మన కణాలు గ్లూకోజ్‌ లోపలికి రాగానే దానికి ఒక ఫాస్పేట్‌ని తగిలిస్తాయి. ఒక సారి ఈ ఫాస్పేట్ అతుక్కున్న తర్వాత ఈ గ్లూకోజ్ తలుపులగుండా బయటకు పోలేదు. ఎందువల్లంటే ఈ వింత ఆకారాన్ని తలుపులు గుర్తుపట్టవు. గుర్తులేనివాటిని తలుపులు పట్టుకుని బయటకు తీసుకెళ్ళవు కదా? అందువల్ల బయటనుంచి గ్లూకోజ్ సులభంగా లోపలికొస్తుంది గాని, లోపలికి రాగానే దాన్ని మన కణాలు వాడుకోవటం మొదలు పెడతాయి కాబట్టి బయటికి వెళ్ళలేదు.

మరి ఎంత గ్లూకోజ్ వస్తుంది లోపలికి? దానికేమైనా మితం అంటూ ఉందా? మీ డాక్టర్ “మీకు షుగర్ ఎక్కువగా ఉందండీ” అన్నప్పుడు ‘ఎక్కువగా’ అంటే ఏమిటి? అసలు ఎంత ఉండాలి? షుగర్ మంచిదేగదా? అందుకేగదా తింటాం? మంచిదేదైనా ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా మంచిదిగదా? నెమ్మదిగా ఒక్కో ప్రశ్నకీ సమాధానాలు వెతుకుదాం.

సగటున ఒక మనిషిలో దాదాపు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. అందులో దాదాపు 5 గ్రాములు గ్లూకోజ్ ఉంటుంది. (ఒక చెంచాలో నాలుగు గ్రాములు గ్లూకోజ్ పడుతుంది కాబట్టి మొత్తం రక్తంలో ఒకటింపావు చెంచాల గ్లూకోజ్ ఉంటుందన్నమాట.) అనగా, ఒక్కో లీటర్‌ రక్తంలో దాదాపు ఒక గ్రాము. అలా కాకుండా డాక్టర్లు దాన్ని లీటర్‌లో పదోవంతులో – అనగా, ఒక డెసిలీటర్‌లో – ఎంత గ్లూకోజ్ ఉందో చెప్తారు. అంటే, సాధారణంగా ఒక డెసిలీటర్‌ రక్తంలో 0.1 గ్రాము (అనగా, గ్రాములో పదో వంతు) గ్లూకోజ్ ఉంటుందన్నమాట. దాన్ని అలా చెప్పి వదిలెయ్యరు. ఒక్కో గ్రామును వెయ్యిభాగాలు చేసి – అనగా, మిల్లిగ్రాములు చేసి – 0.1 గ్రామును 100 మిల్లిగ్రాములు అంటారు. ఇంతకీ మనం అర్థం చేసుకోవలసినది ఏమిటంటే ఆరోగ్యంగా ఉన్న మనిషి రక్తంలో, ఒక డెసిలీటర్లో దాదాపు 100 మిల్లిగ్రాముల గ్లూకోజ్ ఉంటుంది అని. ఇదే విషయాన్ని డాక్టర్లు “మీ రక్తంలో షుగర్ 100 ఉంది” అని చెప్తారు.

ఈ 100 అన్నదాన్ని మనం సాధారణ సాంద్రణ (usual concentration) అని చెప్పుకుందాం. నిజానికి ఈ సాంద్రణ ఎప్పుడూ నిలకడగా 100 దగ్గర ఉండదు. పొద్దుటే అల్పాహారం ముందు పరీక్ష చేస్తే 70-80 ఉండవచ్చు. భోజనం చేసిన తర్వాత రెండు గంటలకు పరీక్ష చేస్తే 140 ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే మంచిదికాదు.

గ్లూకోజ్ రక్తంలో సాధారణ సాంద్రణలో ఉన్నప్పుడు (100 అనుకున్నాం కదా) శరీరంలో ఉన్న అన్ని కణాల్లోకి సమానంగా పోతుందా? నిజానికి అలా పోదు. కొన్నిట్లోకి ఎక్కువగా, కొన్నిట్లోకి తక్కువగా పోతుంది. కారణం ఏమిటంటే అన్ని కణాలమీదా ఒకే రకం రవాణా తలుపులు ఉండవు. మనం మూడు రకాల తలుపుల గురించి మాట్లాడుకుందాం.

– మొదటి రకం తలుపులని, ఎక్కువ సమర్థత తలుపులు (ఎస) అందాం. ఇవి రక్తంలో గ్లూకోజ్ మట్టం 100 దగ్గర ఉన్నప్పుడు, 85% సమర్థతతో పనిచేస్తూ ఉంటాయి. అంటే అవి పనిచెయ్యకుండా ఉండేది 15% సమయంలో మాత్రమే.

– రెండవ రకం తలుపులని, తక్కువ సమర్థత తలుపులు (తస) అందాం. ఇవి రక్తంలో గ్లూకోజ్ మట్టం 100 దగ్గర ఉన్నప్పుడు దాదాపు 50% సమర్థతతో పనిచేస్తూ ఉంటాయి. అంటే సగం సమయంలో ఏ పనీ చెయ్యకుండా ఖాళీగా ఉంటాయన్నమాట.

– మూడో రకం తలుపులను, అతి తక్కువ సమర్థత తలుపులు (అతస) అందాం. రక్తంలో గ్లూకోజ్ మట్టం 100 ఉన్నప్పుడు ఇవి దాదాపు 25% సమర్థతతో మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. మిగతా సమయంలో ఖాళీగా ఉంటాయి.

ఈ ఎక్కువ తక్కువ సమర్థతలకు కారణం ఈ తలుపులు గ్లూకోజ్‌ని గుర్తుపట్టటంలో ఉంది. దీనికి ఒక ఉపమానం చెబుతాను. మీ ఇంట్లో కొందరికి కాఫీలో ఒక చెంచా పంచదార వేస్తే సరిపోతుంది. కొందరికి రెండు చెంచాలు వేస్తేగాని రుచి సరిపోదు. కొందరికి రెండు కూడా చాలవు. ఈ తేడాకి కారణం ఏమిటంటే ఇవి మన నాలుక మీద తీపిని గుర్తుపట్టే బణువులు. వీటిని రుచి బొడిపెలు (taste buds) అంటారు. ఇవి కొందరి నాలుక మీద ఎక్కువగా, కొందరి నాలుక మీద తక్కువగా ఉండవచ్చు. లేక కొందరి నాలుక మీద ఎక్కువ సమర్థవంతమైనవి, కొందరి నాలుకమీద తక్కువ సమర్థవంతమైనవీ కావచ్చు. ప్రస్తుతానికి మనం తిరిగి గ్లూకోజ్ తలుపుల విషయం చూద్దాం.

రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే ఈ తలుపులు ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు మీరు కోకాకోలా లాంటి ఒక కూల్ డ్రింక్ తాగారనుకోండి. ఇవి ఒక్కో సీసా 330 మిల్లీలీటర్లు ఉంటాయి. అందులో ఉరమరగా 39 గ్రాముల పంచదార (table sugar) ఉంటుంది. అది జీర్ణం అయినప్పుడు దాదాపు 20 గ్రాముల గ్లూకోజ్ అవుతుంది (మిగతా 19 గ్రాముల పదార్థాన్ని ఫ్రుక్టోజ్ అంటారు. దాని గురించి ఇప్పుడు అనవసరం). అనగా, ఐదు చెంచాల గ్లూకోజ్! అంటే, మామూలుగా మీ రక్తంలో ఉండే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఈ డ్రింక్ తాగగానే మీ రక్తంలో గ్లూకోజ్ నాలుగు రెట్లు పెరగాలి కదా? అంటే 400 దాకా పోవాలి. కాని ఆరోగ్యంగా ఉన్న మనిషి రక్తంలో, ఇలాంటి ఏ తీపి రసాలు అయినా, తాగిన తర్వాత రెండు గంటలకు రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ 140 ప్రాంతంలో ఉండాలంటారు. అంతకంటే ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా 180 దాటితే, డయబెటీస్ లేదా షుగర్ వ్యాధి ఉంది అంటారు. మరి 400 ఉండాల్సింది 140 మాత్రమే ఎట్లా ఉంటుంది? ఇది అర్థం కావాలంటే మనం మళ్ళా మన తలుపుల దగ్గరకెళ్ళాలి.

రక్తంలోంచి గ్లూకోజ్ రవాణా తలుపులగుండా జీవకణాల్లోకి వెళ్తుంది. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువయ్యేకొద్దీ కణాల్లోకి పోవటం ఎక్కువవుతుంది. ఇది మనం చెప్పుకున్న మూడు రకాల తలుపులకూ వర్తిస్తుంది. అందువల్ల ఆరోగ్యంగా ఉన్న మనుషుల్లో రక్తంలో గ్లూకోజ్ మితిమీరి (140 దాటి) ఎక్కువ కాదు. కానీ మనకు మూడు రకాల తలుపులున్నాయికదా? మూడూ ఒకే రకంగా పని చేస్తాయా?

మొదటి రకం తలుపులు, అంటే ఎస-రకం, చాలా అవయవాల్లో, ముఖ్యంగా మెదడులో ఉన్నాయి. మెదడు తన శక్తి కోసం పూర్తిగా గ్లూకోజ్ మీదే ఆధారపడుతుంది. మరో ఇంధనాన్ని దేన్నీ వాడుకోలేదు. రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ 100 మిల్లిగ్రాములు ఉన్నప్పుడు మెదడు కణాలమీద ఉన్న గ్లూకోజ్ తలుపులు 85% సమర్థతతో పనిచేస్తుంటాయి. అందువల్ల సాంద్రణ పెరిగినప్పుడు ఈ తలుపుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రక్తంలో ఎక్కువయిన గ్లూకోజ్‌ని ఇవి పెద్దగా తొలగించలేవు.

ఇప్పుడు అతస-రకం తలుపుల గురించి మాట్లాడుకుందాం. క్లుప్తంగా, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు దాన్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర వహించేవి ఈ తలుపులు. ఇవి కాలేయం (Liver) లోనూ, వృక్వకము (Pancreas) అనే చిన్న అవయవం లోనూ ఉంటాయి. ముందు పాంక్రియాస్ గురించి మాట్లాడుకుందాం. అతస-రకం తలుపులు రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ 100 ఉన్నప్పుడు 25% సమర్థతతో మాత్రమే పని చేస్తూ ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పెరిగేకొద్దీ ఇవి ఇంకా సమర్థంగా పనిచేస్తాయి. సాంద్రణ పెరిగేకొద్దీ గ్లూకోజ్ కణాల్లోకి రావటం ఎక్కువవుతుంది. పాంక్రియాస్‌లోని కొన్ని కణాలకు ఒక బాధ్యత ఉంది. అవి గ్లూకోజ్ ఎంత ఎక్కువగా లోపలికి వస్తే అంత ఎక్కువగా ఇన్సులిన్‌ (insulin) అనే రసాయనాన్ని రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ ఇన్సులిన్‌ ప్రభావం ముఖ్యంగా మూడు అవయవాల మీద ఉంటుంది. అవి రక్తంలో ఎక్కువయిన గ్లూకోజ్‌ని వేగంగా తీసేస్తాయి. ఇప్పుడు ఆ అవయవాల గురించి మాట్లాడుకుందాం.

3. ఇన్సులిన్ ప్రభావం

ఇన్సులిన్‌ ప్రభావం ఉన్న అవయవాల్లో ముఖ్యమైనది కాలేయం. కాలేయంలో ఉన్న కణాలను ఇన్సులిన్‌ చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఈ కణాల మీద కూడా వృక్వకము (పాంక్రియాస్) మీద ఉన్న తలుపులు లాంటివే ఉన్నాయి. అవి మామూలుగా 25% సమర్థవంతంగా పని చేస్తూ ఉంటాయి. కానీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువయ్యే కొద్దీ వీటి సమర్థత పెరుగుతుంది. కాలేయం పెద్ద అవయవం కాబట్టి ఈ తలుపుల సమర్థత పెరగటంతో, కాలేయపు కణాల్లోకి గ్లూకోజ్ రావటం ఎక్కువవుతుంది. నిజానికి రక్తంలో గ్లూకోజ్ 140 కంటే ఎక్కువ కాకపోవటంలో ఒక ముఖ్యపాత్ర కాలేయానిదే. మామూలుగా కాలేయపు కణాలు తమ శక్తి అవసరాలకు కొవ్వును వాడుకుంటాయి. కాలేయం పెద్ద అవయవం కావటం వల్ల, అది గనక తన అవసరానికి పూర్తిగా గ్లూకోజ్‌నే వాడుకుంటే, మన రక్తంలో ఉండే గ్లూకోజ్ మెదడుకి సరిపోదు. ఆ గ్లూకోజ్‌ని మెదడుకి వదిలేసి, తను కొవ్వుని వాడుకుంటుంది కాలేయం. కానీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువయినప్పుడు లోపలికి వచ్చిన గ్లూకోజ్‌లో కొంత భాగాన్ని తమ అవసరానికి కూడా వాడుకుంటాయి కాలేయపు కణాలు. మిగతా గ్లూకోజ్‌ బణువులను ఒకదానికొకటి జతపరిచి పెద్ద చాంతాడంత బణువుని తయారు చేస్తాయి. దీన్ని తీపిజని (glycogen) అందాం. ఇది చాలా పెద్ద బణువు కావటం వల్లా, దీన్ని గుర్తుపట్టే తలుపులు లేకపోవటం వల్లా, ఇది కణం నుంచి బయటకు వెళ్ళలేదు. అందువల్ల ఈ కాలేయ కణాలు గ్లూకోజ్‌ గిడ్డంగులలా పనిచేస్తాయి.

లోపలికి వచ్చిన గ్లూకోజ్‌లో కొంత భాగాన్ని కొవ్వుగా మారుస్తాయి కాలేయ కణాలు. నిజానికి మన శరీరంలో కొవ్వు తయారు కావటం ఇలాగే జరుగుతుంది. ఈ మధ్య డాక్టర్లు స్కాన్లు చేసి, మీ లివర్లో కొవ్వు ఉన్నది (fatty liver) అని చెప్తున్నారు. (దీనికి కారణాల గురించి మరోసారి మాట్లాడుకుందాం.) ప్రస్తుతానికి కాలేయంలో తయారయిన కొవ్వును ఈ కణాలు రక్తంలోకి వదిలేస్తాయి. అది కొవ్వును దాచిపెట్టే కణజాలానికి (tissue) చేరుతుంది.

ఇంతకీ కాలేయం మీద ఇన్సులిన్‌ ప్రభావం ఏమిటో మనం మాట్లాడుకోలేదు. తమ అవసరాలకోసం గ్లూకోజ్‌ని వాడుకోవటం, గ్లూకోజ్‌ని తీపిజనిగా మార్చటం, గ్లూకోజ్‌ని కొవ్వుగా మార్చటం – కాలేయంలో జరిగే ఈ మూడు ప్రక్రియలను ఇన్సులిన్‌ చేస్తుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువయినప్పుడు కాలేయం దాన్ని వాడుకుంటుంది. తీపిజనిగా, కొవ్వు లాగా మారుస్తుంది. ఈ పనులు చెయ్యటానికి ఇన్సులిన్‌ అవసరం. మీరు గమనించారో లేదో, ఇంతవరకూ మనం మాట్లాడుకున్న ఎస- (ఇవి అన్ని అవయవాల్లో ఉన్నాయి), అతస- (కాలేయం, పాంక్రియాస్) తలుపుల మీద ఇన్సులిన్‌కి ఎలాంటి ప్రభావం లేదు. ప్రభావం ఉన్న తలుపుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఒక 70 కిలోల బరువున్న మనిషిలో 25-28 కిలోల కండరాలుంటాయి, 10 కిలోల (మగవాళ్ళల్లో) నుంచి 17 కిలోల (ఆడవాళ్ళల్లో) కొవ్వు గిడ్డంగి కణజాలం (ఎడిపోజ్ టిష్యూ) వుంటుంది. ఇవి రెండూ పెద్ద అవయవాలు. మామూలుగా ఇవి వాటికి కావాల్సిన శక్తికోసం కొవ్వును ఎక్కువగానూ గ్లూకోజ్‌ను తక్కువగానూ వాడుకుంటాయి. ఈ అవయవాల కణాల మీద గ్లూకోజ్ తలుపులు ఉంటాయి, కానీ చాలా తక్కువ. (ఇంత పెద్ద అవయవాల మీద ఎస- తలుపులుంటే మెదడుకు గ్లూకోజ్ మిగలదు. అప్పుడు అది అల్లాడి పోతుంది, మనల్ని కోమాలోకి తీసుకెళ్తుంది!) కానీ సాఫ్ట్ డ్రింక్ తాగ్గానే, పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్‌ రక్తంలోకి విడుదల కాగానే, ఇన్సులిన్‌ ఈ రెండు అవయవాల మీద (కండరములు, కొవ్వు గిడ్డంగులు మీద) ఒక వింత ప్రభావం చూపుతుంది. ఈ రెండు అవయవాల్లో తస- తలుపులు చాలా ఉంటాయి, కాని అవి కణం చుట్టూ ఉండే పొరమీద కాదు, కణంలో లోపల దాచి పెట్టి ఉంటాయి. ఇన్సులిన్‌ ప్రభావం వల్ల అవి పొర మీదకొస్తాయి. ఇప్పుడు ఈ తలుపుల ద్వారా గ్లూకోజ్ లొపలికి వస్తుంది. కండరాలు, కొవ్వు నిల్వ, పెద్ద అవయవాలు కాబట్టి, వాటి కణాలు గ్లూకోజ్‌ని తీసుకోవటం మొదలయినప్పుడు రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ తొందరగా పడిపోతుంది. భోజనం ముందు 90 సాంద్రణ ఉన్న రక్తంలో భోజనం అయిన ఒక గంట తర్వాత దాదాపు 180 ఉంటుంది, రెండు గంటల తర్వాత 140 ఉంటుంది, మూడు నాలుగు గంటలకు తిరిగి 90 చేరుతుంది. రక్తంలో గ్లూకోజ్ మామూలు సాంద్రణకి చేరగానే ఈ తలుపులు మళ్ళా కణంలోకి వెళ్ళిపోతాయి. ఇదీ ఆరోగ్యంగా ఉన్న మనిషిలో జరిగే ప్రక్రియ.

మరి అలా కాకుండా పానీయం తాగిన తర్వాత (భోజనం తర్వాత అయినా) మూడు నాలుగు గంటల తర్వాత కూడా గ్లూకోజ్ సాంద్రణ 180, లేక అంతకంటే ఇంకా ఎక్కువగానో ఎందుకుంటుంది కొందరికి? అలా జరక్కుండా ఉండటానికి మనం ఏమైనా చెయ్యగలమా? భోజనం తర్వాత మూడు నాలుగు గంటల్లో గ్లూకోజ్ సాంద్రణ 180 నుంచి 90కి పడిపోతుంది కదా, మరి ఇంకొక నాలుగు గంటల్లో 90 నుంచి 10-20 దాకా పడిపోదా? అలా జరిగితే మెదడు కణాలు చచ్చిపోవూ? అలా జరక్కుండా గ్లూకోజ్ సాంద్రణ ఎప్పుడూ 80-90 కంటే తక్కువ కాకుండా ఎలా చేస్తుంది మన శరీరం? వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం.

4. కొందరికి రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఎందుకు ఉంటుంది?

ఆహారంలో ఉండే కర్బనోదకాలు (carbohydrates) జీర్ణం అయిన తర్వాత గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి వెళ్తాయి. అక్కడనుంచి ఆ గ్లూకోజ్ శరీరంలోని అన్ని మూలలకూ చేరుతుంది. ఆరోగ్యంగా ఉన్న మనుషుల రక్తంలో – తిన్న తర్వాత – గ్లూకోజ్ సాంద్రణ చాలా సేపు ఎక్కువగా ఉండదు. రెండు మూడు గంటల్లో తిరిగి మామూలు స్థాయికి (80-100) చేరుతుంది. దీనికి ముఖ్య కారణం ఇన్సులిన్‌. ముందు చెప్పినట్లు ఈ ఇన్సులిన్‌ ప్రభావం వల్ల రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ తొందరగానే తగ్గిపోయి మామూలు స్థాయికి చేరుతుంది. కానీ కొందరిలో గ్లూకోజ్ సాంద్రణ మామూలు స్థాయికి ఎందుకు రాదో మనకు పూర్తిగా తెలియకపోయినా, తెలిసినంతలో రక్తంలో ఇన్సులిన్‌ తగినంతగా లేకపోవటం వల్ల గానీ, ఉండీ పనిచెయ్యకపోవటం వల్ల గానీ మధుమేహం (diabetes) వస్తుంది అని అంటున్నాం. ఇది సమగ్రంగా పరిశోధించవలసిన అంశమే!

సారణి 1. గ్లూకోజ్ సాంద్రణ (Glucose Concentration)

ఆరోగ్యంగా ఉన్న వారి రక్తంలో

మధుమేహం ఉన్న వారి రక్తంలో

భోజనానికి ముందు
భోజనం తర్వాత 1 గంటకు
భోజనం తర్వాత 2 గంటలకు
భోజనం తర్వాత 3 గంటలకు

80-90
160
130
85

120 కంటే ఎక్కువ
200 కంటే ఎక్కువ
180 కంటే ఎక్కువ
125 కంటే ఎక్కువ

మొదటి రకం డయబెటీస్ (Type 1 Diabetes):

ఇన్సులిన్‌ లేకపోవటంవల్ల వచ్చే జబ్బును 1వ రకం మధుమేహం (Type-1 Diabetes) అని పిలుస్తారు. ఇన్సులిన్‌ తగినంతగా లేకపోవటానికి ముఖ్యమైన కారణం దాన్ని తయారుచేసే వృక్వకపు (పాంక్రియాస్) కణాలు క్షీణించటమే. ఈ క్షీణించటానికి కారణాలు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం అని, పాంక్రియాస్‌లో వచ్చిన కొన్ని మార్పుల వల్ల దాన్ని శత్రువుగా భావించి మన శరీరమే దాన్ని చంపేస్తుందని, ఇది స్వయంనిరోధకత లోపించడం (autoimmune disease) అనిన్నీ శాస్త్రజ్ఞులు అంటున్నారు.

రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటూ ఉంటే, దాన్ని తగ్గించడానికి పాంక్రియాస్ ఎక్కువగా ఇన్సులిన్‌ని తయారు చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో పాంక్రియాస్ ఉరువు (size) పెరుగుతుంది. ఉరువు పెరిగిన చోటుకు తగినంత ఆమ్లజని (oxygen) అందదు. కణాలు క్షీణించటం మొదలవుతుంది. క్షీణించి చచ్చిపోయిన కణాలను తీసివెయ్యటానికి భక్షక కణాలు (macrophages) వస్తాయి. భక్షక కణాలు చేరిన చోటుకు శత్రుసంహారం చేసే ఇతర తెల్ల కణాలూ కూడా వస్తాయి. పాంక్రియాస్ యుద్ధభూమిలాగా తయారవుతుంది. కొంత కాలానికి చచ్చిపోతుంది. ఇక శరీరంలో ఇన్సులిన్‌ తయారు కాదు. ఇన్సులిన్‌ లేకపోతే రక్తంలో గ్లూకోజ్ తగ్గదు కదా? డయబెటీస్ ఉన్న వారిలో టైప్-1 డయబెటీస్ ఉన్న వారు 10% ఉంటారు. ఈ జబ్బు సాధారణంగా చిన్న వయసులోనే వస్తుంది. ప్రస్తుతం ఈ జబ్బుకు సూదితో ఇన్సులిన్‌ ఎక్కించి చికిత్స చేస్తున్నారు.

రెండవ రకం డయబెటీస్ (Type 2 Diabetes):

ఇన్సులిన్‌ ఉండీ పనిచెయ్యని స్థితిని టైప్-2 డయబెటీస్ అంటున్నారు. ఈ జబ్బు రావటానికి ముఖ్యంగా రెండు కారణాలు: రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం, శరీరంలో కొవ్వు నిల్వలు, ముఖ్యంగా పొట్టమీద ఎక్కువగా ఉండటం. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటానికి కారణం ఇన్సులిన్‌తో ఏదో సమస్య ఉందని, ఇన్సులిన్‌ సమస్యకు కారణం గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం అనీ చెప్పటం కోడి ముందో, గుడ్డు ముందో చెప్పలేకపోవటం లాగా ఉంది కదూ? అందుకే మనకు ఈ విషయం గురించి పూర్తిగా తెలియదు అని ముందే చెప్పాను.


బొమ్మ 3. రక్తంలో గ్లూకోజ్ మట్టాన్ని నియంత్రించే మార్గాలు.

గ్లూకోజ్ రక్తంలో ఎక్కువగా ఉండటంతో ముఖ్యమైన చిక్కేమిటంటే అది ప్రాణ్యములకి (proteins లేదా మాంసకృత్తులకు) అతుక్కుని (నిజానికి, వాటితో రియాక్ట్ అయ్యి) వాటి రూపాన్ని మార్చేస్తుంది. ఇలా రూపం మారిన ప్రాణ్యములు సరిగ్గా పనిచెయ్యవు. మామూలుగా ప్రాణ్యములు మన శరీరంలో చాలా రకాల పనులు చేస్తాయి. ఇవి సరిగ్గా పని చెయ్యకపోతే మన శరీరంలో రసాయనిక మార్పులు (reactions; దురదృష్టవశాత్తూ వీటిని తెలుగులో ప్రతిచర్యలు అంటున్నారు) జరగవు, విషక్రిములు చావవు, కణాల్లోకీ అవసరమైన పదార్థాలు రవాణా కావు, కండరాలు పనిచెయ్యవు, ఇంకా చాలా అవసరమైన పనులు సరిగ్గా జరగవు. ఇన్సులిన్‌ కూడా ఒక ప్రాణ్యమే. పైగా ఇన్సులిన్‌ సరిగ్గా పనిచెయ్యటానికి చాలా ఇతర ప్రాణ్యముల సహాయం అవసరం. గ్లూకోజ్ వీటికి అతుక్కుంటే ఇవి ఏవీ సరిగ్గా పనిచెయ్యలేవు. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువయ్యేకొద్దీ, గ్లూకోజ్ ప్రాణ్యములకు అతుక్కోవటం, అలా అతుక్కోవడం వల్ల వాటి ఆకారం మారడం, అలా మారడం వల్ల అవి సరిగ్గా పని చెయ్యకపోవటమూ జరుగుతుంది.

ఎటూ ఈ అతుక్కోవడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు ఎ1సి (HbA1c) గురించి చెప్తాను. ఎర్ర కణాల్లో ప్రాణవాయువును మోసుకొచ్చే హీమోగ్లోబిన్‌ గురించి మీకు ఇదివరకే చెప్పాను. ఇదీ ఒక ప్రాణ్యమే కాబట్టి దీనిక్కూడా గ్లూకోజ్ అతుక్కుంటుంది. ఈ గ్లూకోజ్ అతుక్కున్న హీమోగ్లోబిన్ని ఎ1సి (glycated hemoglobin లేదా HbA1c) అంటారు. రక్తంలో గ్లూకోజ్ ఎంత ఎక్కువగా ఉంటే ఎ1సి అంత ఎక్కువగా ఉంటుంది. నిజానికి రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో చూడటానికి నేరుగా గ్లూకోజ్‌ని టెస్ట్ చెయ్యడం కంటే ఈ ఎ1సి ఎంత ఉందో చూడటం మెరుగైన పద్ధతి. ఎందుకంటే గ్లూకోజ్ పరీక్షకి మీరు ఒక రాత్రి పస్తుండాలి, పొద్దుటే ఏదీ తినకుండా, కాఫీ కూడా తాగకుండా, వెళ్ళి రక్త పరీక్ష చేయించుకోవాలి. ఒక్కోసారి మర్చిపోయి కాఫీ తాగిన వారు సిగ్గుపడో, భయపడో తాగలేదని చెప్తారు. ఎ1సి పరీక్షకి పస్తుండాల్సిన పనిలేదు. పైగా, ఈరోజు గ్లూకోజ్ టెస్ట్ చేయించుకుంటే గ్లూకోజ్ ఈరోజు ఎంత ఉందో మాత్రమే తెలుస్తుంది. ఎ1సి పరీక్ష చేయించుకుంటే గత 120 రోజుల్లో సగటున రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో తెలుస్తుంది. ఎందువల్లంటే, ఇదివరకు చెప్పినట్లు, ఒక్కో ఎర్ర కణం సగటున 120 రోజులు బతుకుతుంది. అంటే కణంలో ఉండే హీమోగ్లోబిన్‌ కూడా సగటున 120 రోజులే ఉంటుంది. అందువల్ల దానికి అతుక్కున్న గ్లూకోజ్ ఈ 120 రోజుల్లోనే అతుక్కొని ఉండాలి. గ్లూకోజ్ అతుక్కున్న అణువులు ఎక్కువగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉందన్నమాట, తక్కువగా ఉంటే గ్లూకోజ్ తక్కువ ఉన్నట్లు. హీమోగ్లోబిన్‌లో 5% ఎ1సి ఉంటే రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ 97 ఉన్నట్లు లెక్క చెప్తారు, 6% ఉంటే 126 అనీ, 7% ఉంటే 154 అనీ, 8% ఉంటే 184 అనీ అంటారు. ఆరోగ్యంగా ఉన్న మనిషికి 5.7% కంటే తక్కువగా ఉండాలనీ, 6.5% గానీ అంతకంటే ఎక్కువగానీ ఉంటే ఆ మనిషికి డయబెటీస్ ఉన్నదనీ చెప్తారు. (HbA1c = 5.7% అంటే రక్తంలో గ్లూకోజ్ 117 ఉందని, 6.5% అంటే 140 అనీ, 140 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ జబ్బు ఉన్నట్లని మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా? )

ఇక మళ్ళా ఇన్సులిన్‌ గురించి మాట్లాడుకుందాం. ఇన్సులిన్‌ సరిగ్గా పనిచెయ్యకపోవటానికి మరోకారణం మితిమీరిన కొవ్వు నిల్వలు. మీకు కాలిమీద ఏదో పురుగు కుట్టిందనుకోండి. కుట్టిన చోట నొప్పి పుడుతుంది. కొంచెం సేపట్లో ఆ కుట్టిన చోట వాపు కనిపిస్తుంది కూడా. వాపు ఎక్కువగా ఉంటే దానివల్ల కూడా నొప్పి పుడుతుంది. వీటన్నిటికీ కారణం పురుగు కుట్టిన చోటుకు రక్తప్రసారం పెరగటం, రక్తం నుంచి కొంత ద్రవం ఆ కుట్టిన చోటుకు చేరి అక్కడ వాపు రావటం, వాపు మధ్యలో ఉన్న కణాలకు ప్రాణవాయువు తగినంతగా అందకపోవటం, దాన్ని గుర్తుగా తీసుకునే భక్షక కణాలు ‘శత్రుసంహారానికి తయార్’ అంటూ అక్కడకు చేరటం, వాచిన చోట దెబ్బతిన్న కణాలను తొలగించటం. ఇదీ కథ. ఇంత తతంగం జరుగుతున్న చోట నొప్పి పుట్టదా?

సరే, కొవ్వు నిల్వకూ పురుగు కుట్టటానికీ ఏమిటి సంబంధం అనుకుంటున్నారు కదూ? శరీరంలో – అదీ ముఖ్యంగా నడుం చుట్టూ, పొట్ట మీదా – కొవ్వు ఎక్కువగా పేరుకున్నప్పుడు, పురుగుకాటుకు స్పందించిన విధంగానే శరీరం స్పందిస్తుందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు కొవ్వు కణాలు మామూలు కణాలకంటే పెద్దవిగా ఉంటాయి. వీటికి ఆమ్లజని తగినంతగా అందదు. ఆ ఊపిరాడని స్థితిలో (hypoxia) కొవ్వు నుంచి కొన్ని పదార్థాలు రక్తంలోకి వస్తాయి. ఇవి పురుగు కాటుకు శరీరం స్పందించినప్పుడు రక్తంలో కనపడే పదార్థాల్లాంటివే! ఈ పదార్థాలు మామూలుగా ఇన్సులిన్‌ చేసే పనిని సమర్థవంతంగా చెయ్యనివ్వవు. అంటే రక్తంలోంచి గ్లూకోజ్‌ని కొవ్వు కణాల్లోకీ, కండరాల్లోకీ తీసుకోనివ్వవు. కాలేయంలో గ్లూకోజ్‌ నుంచి కొవ్వునూ తీపిజనినీ (glycogen) తయారు చెయ్యనివ్వవు. ఈ కారణాలవల్ల రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ అలాగే ఎక్కువగా నిలబడిపోతుంది.

ఇన్సులిన్‌ సరిగ్గా పనిచెయ్యకపోవడానికి మరో కారణం రక్తంలో, కణాల్లో – ముఖ్యంగా కాలేయపు కణాల్లో, కండరాల కణాల్లో – కొవ్వు పదార్థాలు ఎక్కువ కావడం. ఇలా పేరుకుపోయిన కొవ్వు వల్ల ఇన్సులిన్‌ మామూలుగా చేసే పని చెయ్యలేదు. అంటే ఇన్సులిన్‌ ఉండీ ప్రయోజనం లేదు.

5. డయబెటీస్ రాకుండా చూసుకోగలమా?

షుగర్ జబ్బు (డయబెటీస్ లేదా మధుమేహం) వంశపారంపర్యంగా వస్తుందని మీరు వినే ఉంటారు. అంటే మీరు జబ్బు రాకుండా ఆపలేరు. అది నిజమా?

మీకు యాభై సంవత్సరాల వయసు అనుకుందాం. మీ చిన్నప్పుడు మీ కుటుంబంలో ఎంతమందికి డయబెటీస్ ఉండేది? ఇప్పుడు ఎంతమందికి ఉంది? వంశపారంపర్యంగా వచ్చే జబ్బయితే మీ చిన్నప్పుడు జనాభాలో ఎంత శాతం ఆ జబ్బు ఉందో ఇప్పుడూ అంతే శాతం ఉండాలి. వంశపారంపర్యంగా వచ్చే ఏ జబ్బయినా యాభై సంవత్సరాల కాలపరిమితిలో దాని గణాంకం మారదు. మారకూడదు. అలా మారితే అది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కాదు.

అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మధుమేహం 1980 తర్వాత విపరీతంగా ఎక్కువయింది. దీనికి ముఖ్య కారణాలు మూడు: 1. మితిమీరి తినటం, 2. తినేదాంట్లో తీపి పదార్థాలూ, కొవ్వు పదార్థాలూ ఎక్కువగా ఉండటం, 3. వ్యాయాయం లేకపోవటం.

కొందరు నిపుణులు దీనికి మరో రకం భాష్యం చెప్తారు. మధుమేహం వంశపారంపర్యంగా వచ్చే జబ్బే కాని, ‘మితిమీరి తినకపోతే, తీపి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినకపోతే, వ్యాయామం చేస్తూ ఉంటే ఈ జబ్బురాదు’ అంటారు. అనగా, జబ్బు రాకుండా చూసుకోవటం కొంతవరకు మన చేతుల్లో ఉందనే కదా తాత్పర్యం? ‘మనకి ఇలా రాసి పెట్టి ఉంది. కానున్నది కాక మానదు’ అన్న వేదాంత ధోరణిలో గాలిలో దీపం పెట్టి వదిలేస్తున్నామా? మానవ ప్రయత్నం చేస్తున్నాం కదా.

మితిమీరి తినటం అంటే ఏమిటి? రక్తంలో ఐదు గ్రాముల గ్లూకోజ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా? ఒకేసారి యాభై గ్రాముల గ్లూకోజ్ (గిన్నెడు తెల్లబియ్యంతో చేసిన వరి అన్నం) తిన్నాం అనుకుందాం. అంటే రక్తంలో ఉన్నదానికంటే పది రెట్లు ఎక్కువ ఎక్కించామన్నమాట! రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అయినప్పుడు అది కణాల్లోకి పోతుంది, వృక్వకాన్ని (పాంక్రియాస్‌) విపరీతంగా ఉత్తేజపరుస్తుంది, రక్తంలోనూ కణాల్లోనూ ప్రాణ్యములని (మాంసకృత్తులని) పాడుచేస్తుంది. ఏదో ఒక్కసారో, రెండుసార్లో ఇలా జరిగితే సరే; కాని ఇదే మనం అలవాటుగా చేస్తే కొంత కాలానికి సరిపడేంత ఇన్సులిన్‌ తయారు కాకనో, తయారయినా పని చెయ్యకనో డయబెటీస్ వస్తుంది. అదే కొంచెం కొంచెంగా తినటం అలవాటు చేసుకుంటే రక్తంలో గ్లూకోజ్ పెద్ద ఎత్తున పెరగదు. పెరిగిన సాంద్రణను శరీరం సులభంగా తగ్గించి మామూలు స్థాయికి తేగలదు. అంటే రోజుకు రెండు సార్లు ఎక్కువ మోతాదులో తినటం కంటే, అదే తిండిని నాలుగు సార్లు కొంచెం కొంచెంగా తినటం ఆరోగ్యకరం అన్నమాట.

ఇక ఆహారాల్లో మంచివీ, హానికరమైనవీ ఉన్నాయి. తిన్న తర్వాత తొందరగా జీర్ణం అయి గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి చేరేవి (పెద్ద గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్నవి) మంచి ఆహారాలు కావు. ఈ లెక్కన గ్లూకోజ్ అన్నిటికంటే హానికరమైనది. ఈ లెక్కని కాఫీలోను, తీపి పదార్థాల తయారీలోనూ వేసే చక్కెర హానికరమైన ఆహారమే. తొందరగా జీర్ణం అయి గ్లూకోజ్‌గా మారే తెల్లటి వరి అన్నం ఆ కోవకు చెందిందే. బ్రెడ్‌, పీజ్జా, పళ్ళరసాలూ పానకాలు, బాగా పండిన అరటిపళ్ళు, తీపి ద్రాక్షలు – నిజానికి బాగా తియ్యగా ఉండే పదార్థాలు అన్నీ – అలాంటివే. గ్లూకోజ్‌తో సంబంధం లేకపోయినా, రక్తంలో కొవ్వును అధికం చేసే, నూనెలో వేయించి తయారు చేసే, పదార్థాలు – గారెలు, కోడి మాసం, వగైరాలు – హానికరమైన ఆహారాలు. ఇలాంటి ఆహారాలు కూడా ఒకేసారి ఎక్కువ తినకుండా మితంగా తినవచ్చు.

ఇక ముడి బియ్యం (brown rice), జొన్న, సజ్జ, రాగి ఇలాంటి వాటితో వండే అన్నం, కాయలు, కూరలు, పప్పులు, పాలు, కొవ్వు తక్కువగా ఉన్న మాంసాహారాలు మంచి ఆహారాలు.

ఇక వ్యాయామం గురించి. నేను పాఠశాలకు పోయే రోజుల్లో నాకు తెలిసిన వారిలో అనేకులు ఆరోగ్యం కొరకు ప్రత్యేకం వ్యాయామం చెయ్యడం అరుదుగా చూసేవాడిని. అసలు వ్యాయామం చెయ్యటానికి ఎవ్వరికీ తీరిక ఉండేదికాదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు. చీకటితో పొలాలకు వెళ్ళి చీకటి పడినదాకా పని చేస్తూ ఉండేవారు. షుగర్ జబ్బు వూళ్ళో ఎక్కడో ఒకరిద్దరికి ఉన్నట్లు తెలుసు. ఇప్పుడు ఆ జబ్బు ఊళ్ళో దాదాపు సగం మందికి ఉన్నట్లుంది. ఇప్పుడు పొలాల్లో పని చేస్తూ కనపడేవారు తక్కువ. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగింది. శరీర శ్రమ అవసరం అయ్యే పనులు తగ్గాయి.

శరీర శ్రమ ఎందుకు చెయ్యాలి? దానికీ షుగర్ జబ్బుకూ సంబంధం ఏమిటి? గత పది సంవత్సరాల్లో జరిగిన పరిశోధనలవల్ల డయబెటీస్‌కి వైద్యం చెయ్యటంలో మందులు ఎంత ఉపయోగకరమో వ్యాయామం కూడా అంతే ఉపయోగకరం అని తేలింది. ఇలాంటి పరిశోధనలు సాధారణంగా చిన్న చిన్న జంతువుల మీద చేస్తారు. పరిశోధనల మూలంగా తెలుసుకున్న విషయాలు మనుషులకు కూడా వర్తిస్తాయని శాస్త్రజ్ఞుల అంచనా. ఇలాంటి ఒక పరిశోధన ఫలితాలు ఈ కింది పట్టికలో చూడండి.

సారణి 2. రక్తంలో గ్లూకోజ్ (వ్యాయామం చేసినప్పుడు)

ఆరోగ్యంగా ఉన్న జంతువు – 106
షుగర్ జబ్బు ఉన్న జంతువు – 383
వ్యాయామం చేస్తున్న జంతువు – 234
చికిత్స పొందుతున్న జంతువు – 252

ఈ పట్టికలో ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే వ్యాయామం చెయ్యటం వల్ల రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ తగ్గడం. మందు వల్ల ఎంత ఫలితం ఉందో వ్యాయామం వల్ల కూడా అంతే ఫలితం ఉంది; నిజానికి కొంచెం ఎక్కువే ఉంది. దీనికి కారణం ఏమిటంటే వ్యాయామం చెయ్యటం వలన కండరాల్లోకి రక్త ప్రసారం ఎక్కువవుతుంది. ఇంతకు ముందు చెప్పుకున్నామే, కండరాల్లో ఉండే గ్లూకోజ్ తలుపుల గురించి. వ్యాయామం చేసే వారిలో ఆ తలుపులు కణాల పొరల మీదకు వచ్చి గ్లూకోజ్‌ని లోపలికి తీసుకెళ్తాయి. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ తగ్గుతుంది. వ్యాయామం అంటే బరువులు ఎత్తడం, పరుగులు పెట్టడమే చెయ్యనక్కర లేదు. కనీసం ప్రతి రోజూ ఒక గంట సేపు నడిచినా సరిపోతుంది.

తాగుడు (మద్యపానం) వల్ల కూడా డయబెటీస్ వచ్చే అవకాశం ఉంది. మన శరీరంలో మద్యం కొవ్వుగా మారుతుంది. అది పొట్ట మీద చేరుతుంది. రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ అయినప్పుడు అవి ఇన్సులిన్‌ని సరిగ్గా పనిచెయ్యనివ్వవు. మరో విషయం ఏమిటంటే రక్తంలో గ్లూకోజ్ సాంద్రణను నికరంగా ఉంచే అవయవాల్లో కాలేయం ముఖ్యమైనది. మితిమీరిన మద్యపానం వల్ల కాలేయం క్షీణిస్తుంది. అందువల్ల తాగుడుకు అలవడిన వారి రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ స్థిరంగా ఉండదు.

ఇంతవరకూ మధుమేహం రాకుండా ఉండేందుకు మనం తీసుకోగలిగే కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. మన చేతులో లేని వాటి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు అనుకుంటాం కదా? అయినా వాటి గురించి తెలుసుకుంటే మనకు చేతనయినంతవరకూ జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాంటి రెండు విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఇలాంటి వాటి వల్ల కలిగే అవస్థను ఆంగ్లంలో స్ట్రెస్ (stress) అంటున్నాం. ఒత్తిడి వల్ల డయబెటీస్ వచ్చే అవకాశం ఉంది, లేక జబ్బు ఉన్న వారికి ఒత్తిడి వల్ల అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దీనికి ముఖ్య కారణాలు రెండు. ఒత్తిడి వల్ల తినటం ఎక్కువ కావచ్చు. దాంతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరగటం, రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ కావటం, అందువల్ల ఇన్సులిన్‌ పనిచెయ్యకపోవటం, జబ్బు రావటం! ఎక్కువ తినక పోయినా ఒత్తిడి వల్ల రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం కోర్టిజోల్‌ అనే ఒక హార్మోన్‌. హార్మోన్‌ అంటే శరీరంలో ఒక చోటునుండి మరోచోటికి వార్తలు మోసుకుపోయే దూత. మన శరీరంలో ఎడ్రినల్ అని ఒక గ్రంథి ఉంది. ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న మనిషిలో ఈ గ్రంథి నుండి కోర్టిజోల్ విడుదల అయి రక్తంలోకి వస్తుంది. అక్కడనుంచి అన్ని అవయవాలకూ చేరుతుంది. ఈ దూత మోసుకొచ్చే ముఖ్య సందేశం ‘ఈ మనిషి ఒత్తిడిలో ఉన్నాడు, దీంట్లోంచి బయటపడాలంటే ఈ మనిషికి శక్తి అవసరం, కాబట్టి గ్లూకోజ్ తయారు చెయ్యండి’ అని. ఈ గ్లూకోజ్ తయారు చేసే ముఖ్య అవయవం కాలేయం. ఒత్తిడిలో ఉన్న మనిషిలో కాలేయం గ్లూకోజ్‌ని తయారు చేసి రక్తంలోకి పంపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పెరుగుతుంది. చాలా కాలంగా ఒత్తిడిలో ఉన్నవారు తినటం ఒక్కటీ తగ్గిస్తే సరిపోదు. ఒత్తిడి తగ్గించే మార్గాలు కూడా చూడాలి.

పొలాల్లో పురుగు మందులూ కలుపుమొక్కల మందులూ చల్లేవారికి రక్తంలో గ్లూకోజ్ సాంద్రణ పెరుగుతుంది. అప్పుడు డయబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అన్ని రకాల పురుగు మందులూ ప్రమాదకరమైనవా? కావా? ఈ మందులు ఎంత కాలం వాడితే జబ్బు వస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు ఇంకా ఖచ్చితమైన సమాధానాలు లేవు. ఆర్గనో ఫాస్ఫేట్, ఆర్గనో క్లోరిన్‌ రకం మందులమీద జరిగిన పరిశోధనలలో ఇవి డయబెటీస్ కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీవనాధారంగా మందులు చల్లేవారు ఇవి ముక్కుల్లోకి, నోట్లోకీ పోకుండా జాగ్రత్త పడాలి, చర్మంమీద పడితే వెంటనే శుభ్రం చేసుకోవాలి. మందులు చల్లేవారే కాకుండా, ఆ పొలాల నుంచీ మళ్ళ నుంచీ వచ్చిన కూరగాయలమీద ఈ మందులు ఉండవచ్చు. వాడుకునే ముందు కూరగాయలను శ్రద్ధగా శుభ్రం చెయ్యటం అత్యవసరం.

(సశేషం)

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...