గ్రీకు పురాణ గాథలు 10

రాజుగారివి గాడిద చెవులు

నేను చిన్నప్పుడు పత్రికలలో (చందమామ, బాల, బాలమిత్ర) చదివిన కథలన్నిటిలోను నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉన్న కథ ‘రాజుగారివి గాడిద చెవులు’ కథ అంటే అది అతిశయోక్తి అవదు. ఇది గ్రీకు పురాణ కథలలో ఒకటన్న విషయం నాకు ఈనాడే తెలిసింది!

గ్రీకు పురాణ కథలలో పేరెన్నికగన్న కథ ఫ్రిజియా (Phrygia) అనే రాజ్యానికి రాజు అయిన మైడస్ (Midas) కథ. గ్రీకు పురాణ కథా చక్రాలలో మైడస్ గురించి రెండు విభిన్నమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒవిడ్ (Ovid) రాసిన మెటమార్ఫసిస్‌ (Metamorphosis)లో మైడస్ గురించిన కథలు మనకి కనిపిస్తాయి. ఆ రెండు కథలు ఇక్కడ చెబుతాను.

గ్రీకు పురాణ కథలలో కనిపించే సేటర్ (satyr) అనేది ఒక నరాశ్వం. అనగా కొంత భాగం మనిషి రూపం, కొంత భాగం గుర్రం రూపం. ఇలాంటి స్వరూపాలనే మన పురాణాలలో కిన్నరులు (అశ్వ ముఖము, నర శరీరము కలవారు), కింపురుషులు (నర ముఖము, అశ్వ శరీరము కలవారు) అని వర్ణించేరు. సిలెనస్ (Silenus) అనే పేరు గల ఒక నరాశ్వం గ్రీకు దేవుడు డయోనిసస్ (Dionysus) సహచర్యంలో కనబడుతూ ఉంటాడు. ఒక రోజు సిలెనస్ తప్పతాగేసి రాజుగారి తోటలో పడిపోతాడు. రాజభటులు అతనిని రాజు దగ్గరకి తీసుకెళతారు. మైడస్ సిలెనస్‌ని గుర్తుపట్టి పది రోజులపాటు సపర్యలు చేస్తాడు. మైడస్ చేసిన సహాయానికి ముగ్ధుడైన డయోనిసస్ ప్రతిఫలంగా మైడస్‌ని ఒక వరం కోరుకోమని చెబుతాడు. దూరాలోచన లేకుండా తాను పట్టిందల్లా బంగారం అయిపోవాలి అని కోరుకుంటాడు మైడస్.

ఇక్కడ నుండి కథని ఎవరికి నచ్చిన విధంగా వారు నడిపించవచ్చు. నథేనియల్ హాతోర్న్ చెప్పిన కథలో, మైడస్ స్పర్శ వల్ల ఉద్యానవనంలో గులాబీలు పరిమళం లేని పసిడి పువ్వులుగా మారిపోయాయని, అందువల్ల మైడస్ కూతురు ఏడిచిందని, ఏడుస్తున్న కూతురుని సముదాయించడానికి మైడస్ ఆమెని చేరదీసేసరికి ఆ అమ్మాయి బంగారు విగ్రహంగా మారిపోయిందని ఉంది. మరొక కథనంలో పళ్ళెంలో ఉన్న భోజన పదార్థాలు ముట్టుకునేసరికల్లా భోజనం బంగారం అయిపోతుంది. మైడస్ ఆకలితో అలమటించిపోతాడు. కారణం ఏదయినా చేసిన తప్పు తెలుసుకుని మైడస్ పశ్చాత్తాపపడతాడు. డయోనిసస్ కనికరించి పాక్టోలస్ నదిలో గ్రుంకులిడితే వరం యొక్క ప్రభావం సడలిపోతుందని ఉపశమన మార్గం చెబుతాడు. (ఈ నది టర్కీలోని సార్డిస్ దగ్గర ఉంది.) మైడస్ ఆ నదిలో ములిగేసరికల్లా ఆ వరం యొక్క ప్రభావం మైడస్ నుండి నదిలోని నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఆ నదిలోని ఒండ్రుమట్టిలో బంగారం నలుసులు కనబడుతూ ఉండడానికి కారణం ఆనాటి మైడస్ స్పర్శే అని ప్రజలలో ఒక నమ్మకం ఉంది.

మైడస్‌కి సంబంధించిన కథ మరొకటి ఉంది. సువర్ణ స్పర్శ వల్ల జరిగిన పరాభవానికి ఒకింత చింతించి మైడస్ కోటగోడలు దాటి బయట ఉన్న పచ్చిక బయళ్ళలో తిరుగుతూ ఉంటాడు. అడవులకి, కొండలకి, పచ్చిక బయళ్ళకి అధినేత అయిన పాన్ (Pan) అనే ఒక నరమేషం వాయిస్తున్న పిల్లనగ్రోవి సంగీతానికి మైడస్ ముగ్ధుడవుతాడు. ఒకసారి అపాలోకి పాన్‌కి మధ్య సంగీతం పోటీ జరుగుతుంది. ఈ పోటీలో గెలుపెవరిదో నిశ్చయించడానికి నియమించబడ్డ నిర్ణేతగణంలో మైడస్ ఒక నిర్ణేత. మిగిలిన నిర్ణేతలంతా అపాలో సంగీతమే గొప్పగా ఉందంటే మైడస్ మాత్రం వ్యతిరేకంగా వెళ్ళి పాన్‌ని సమర్థించడంతో అపాలోకి కోపం వచ్చింది. ‘సంగీత జ్ఞానం లేని మైడస్ చెవులు గాడిద చెవులుగా మారిపోవాలి!’ అని శపిస్తాడు. ఇంకేముంది, మైడస్‌కి మాములు చెవుల స్థానంలో గాడిద చెవులు వస్తాయి. ఎంత అప్రతిష్ట! ప్రజలకి తెలిస్తే పరువు గంగలో కలసిపోతుంది కదా! మైడస్ తలపాగా ధరించడం మొదలుపెట్టేడు. ఎంత రాజైనా తలకాయని మంగలి చేతులలో పడకుండా దాచలేడు కదా. రాజుగారివి గాడిద చెవులు అని మంగలికి తెలిసిపోయింది. మూడో కంటివాడికి ఈ రహస్యం తెలిసిందంటే తల తీయించేస్తానని మైడస్ మంగలిని బెదిరించేడు. రాచరహస్యం! రచ్చకెక్కితే కొంపలంటుకుపోవూ? కడుపులో దాచుకోలేక మంగలి కడుపు ఉబ్బిపోతోంది. ఏమిటి చేస్తాడు? ఏమిటి చెయ్యగలడు? ఎవ్వరికో ఒకరికి చెప్పాలి. తనకి తెలిసిన రహస్యాన్ని ఒక పుట్టలో ఊదేశాడు!

కొన్నాళ్ళకి ఆ పుట్ట మీద వెదురు బొంగులు పెరగడం మొదలెట్టేయి. అవి గాలికి ఇటు అటూ ఊగినప్పుడల్లా, పిల్లనగ్రోవిలో గాలి ఆడినట్లు అయి, అవి ‘రాజుగారివి గాడిద చెవులు’ అని పాట ప్రసారం చెయ్యడం మొదలెట్టేయి!

ఇంతకీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మైడస్ అనే రాజు నిజంగా 3000 సంవత్సరాల క్రితం (అనగా, సు.సా.శ.పూ. 800లో) ఫ్రిజియా (Phrygia) అనే రాజ్యాన్ని పరిపాలించేడనడానికి ఆధారాలు ఉన్నాయి. ఈ ఫ్రిజియా రాజ్యం ప్రస్తుతం టర్కీ ఉన్న ప్రదేశంలో ఉండేది. ఇటీవల, అనగా సా. శ. 1957లో, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంవారు గోర్డియన్‌లో (Gordion) జరిపిన తవ్వకాలలో మైడస్ తండ్రి గోర్డియోస్ (Gordios) యొక్క శ్మశానవాటిక కనబడింది. అక్కడ శవపేటికలో కనిపించిన అస్థిపంజరం, దానిచుట్టూ ఉత్తరక్రియలకి సంబంధించిన విందుభోజన సామాగ్రి కనిపించేయిట.

మరయితే మైడస్ పట్టినవన్నీ నిజంగా బంగారం అయిపోయేవా? ఆనాటి దుస్తుల్ని విశ్లేషించి చూస్తే వాటన్నిటికీ ఎరుపు డాలు ఉండడాన్ని బట్టి అవి మూడొంతులు అయోభస్మం (తుప్పు లేదా oxide of iron) రంగు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ రంగుని చూసి బంగారం అనుకుని ఆ కథ సృష్టించి ఉండవచ్చు. మరి గాడిద చెవుల మాట? ఈ సంశయాన్ని తీర్చటానికి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం సరిపోదు.

ఈ కథ ముగించేలోగా మైడస్ తండ్రి గోర్డియోస్ గురించి చిన్న పిట్టకథ ఒకటి అప్రస్తుతం కాదు. ఫ్రిజియా రాజ్యానికి ఒకప్పుడు రాజులేకుండా అయిపోయింది. అప్పుడు టెల్మిసస్‌లో (Telmissus) ఉన్న ఒరాకిల్, ‘రాజ్యంలోకి ఎవరైతే మొట్టమొదట ఎడ్లబండిని తోలుకుంటూ వస్తారో వారే ఫ్రిజియా రాజ్యానికి రాజు’ అని జోస్యం చెప్పింది. గోర్డియోస్ అనే పేరు గల ఒక రైతు ఎడ్లబండిని తోలుకుంటూ ఊళ్ళోకి రాగానే అతనికి పట్టాభిషేకం చేసేసేరు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి కృతజ్ఞతగా మైడస్ ఆ బండిని ఆ ఒరాకిల్ ఆలయంలో ఒక స్తంభానికి పెద్ద మోకుతో గట్టిగా ముడివేసి కట్టేసేడు. ముడి మీద ముడివేసి ఎంత గట్టిగా కట్టేడంటే దానిని విప్పడానికి ఎవ్వరి తరంకాలేదు. నాలుగు వందల సంవత్సరాల తరువాత, సుమారు సా.శ.పూ. 400లో, అలెగ్జాండర్ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ బ్రహ్మముడి ఇంకా అలానే ఉంది. ఆ ముడి ఎవ్వరు విప్పుతారో ఆ వ్యక్తి ఆసియా అంతటికి సార్వభౌముడు అవుతాడని అక్కడ ఒరాకిల్ జోస్యం చెప్పింది. ఈ మాట విని అలెగ్జాండర్ ఆ ముడిని విప్పడానికి ప్రయత్నించి మొదట విఫలం అవుతాడు. అప్పుడు ‘ముడి విప్పడం ముఖ్యం కానీ ఎలా విప్పేమన్నది ప్రధానం కాదు’ అంటూ తన కరవాలం తీసుకుని ఒక్క వేటులో ఆ ముడిని రెండు ముక్కలు చేసి విప్పేడుట. ఎప్పటికీ పరిష్కారం దొరకకుండా ఏళ్ళ తరబడి వేధిస్తున్న సమస్యని ఎవరైనా ఒక్క వేటులో పరిష్కరిస్తే ‘గోర్డియన్ ముడిని విప్పినట్లు’ (untying the Gordian knot) అనే నుడికారాన్ని వాడతారు.

హెరాక్లీస్ కథ

గ్రీసు పురాణ గాథలలోని హెరాక్లీస్ (Heracles) అనే మహా యోధుడే రోమనుల హెర్క్యులిస్‌గా రూపాంతరం చెందేడు. హెర్క్యులిస్ (Hercules) అనే పేరు ప్రపంచవ్యాప్తంగా పరిచితం అయిన పేరు. ఆ మాటకి వస్తే గ్రీసు యోధులలో ఒక్క హెరాక్లీస్ శిల్పమే – శిథిలావస్థలో – భారతదేశంలో, మధుర దగ్గర దొరికింది. ఇది ఇప్పుడు కొల్‌కతా లోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉందిట!

హిందూ పురాణాలలో భీముడితో తులతూగగల బలశాలులు మరో అయిదుగురు ఉన్నారు: బకాసురుడు, హిడింబాసురుడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు. కానీ గ్రీకు పురాణాలలోను, రోమను పురాణాలలోను హెరాక్లీస్ (లేదా హెర్క్యులిస్)తో ఉజ్జీ అయిన అరివీరభయంకరుడైన బలశాలి మరొకడు లేడు.

హెరాక్లీస్ దైవాంశ సంభూతుడు; సాక్షాత్తు జూస్‌కి (Zeus) ఒక మానవ వనిత ఆల్కిమెనీకి (Alcmene) పుట్టిన కొడుకు అవడం వల్ల తండ్రి నుండి కొన్ని దైవ లక్షణాలు, తల్లి నుండి కొన్ని మానవ లక్షణాలు అబ్బేయి.

ఈ ఆల్కిమెనీ ఎవరు? ఈమె ఎలక్ట్రియాన్ (Electryon) కూతురు. ఈ ఎలక్ట్రియాన్ ఎవరు? ఇతను పెర్సియస్‌కీ ఆండ్రోమెడాకి పుట్టిన కొడుకు. పెర్సియస్ ఎవరు? జూస్‌కీ డనాఎకి (Danaë) పుట్టిన కొడుకు. అనగా, జూస్ కొడుకు పెర్సియస్, అతని కొడుకు ఎలక్ట్రియాన్ కాబట్టి వరసకి జూస్‌కి ఆల్కిమెనీ మునిమనవరాలు అవుతుంది.

హెసియోడ్ చెప్పిన కథనం ప్రకారం ఆల్కిమెనీ అంతటి అందమైన మానవ వనిత మరొకతె లేదు. సన్నటి నడుము, సంపెంగ ముక్కు, నల్లటి కళ్ళతో ఆమె అందం ఆఫ్రొడీటీ అందాన్ని తలదన్నేలా ఉండేదని హెసియోడ్ వర్ణిస్తాడు.

ఒకనాడు ఆల్కిమెనీ తన స్నేహితుడు, ప్రియుడు, అయిన ఏంఫిట్రియాన్‌తో (Amphitryon) కలసి యుద్ధరంగంలోని విడిదికి వెళుతుంది. ఏంఫిట్రియాన్ రణరంగంలో ఉన్న సమయంలో ఏంఫిట్రియాన్ వేషంలో జూస్ ఆల్కిమెనీ మందిరంలోకి ప్రవేశించి, తన మునిమనవరాలితో రమిస్తూ మూడు రాత్రులు గడపడం వల్ల హెరాక్లీస్‌తో ఆమె గర్భవతి అవుతుంది! నాలుగవ రోజు రణరంగం నుండి ఏంఫిట్రియాన్ రాకతో జరిగిన మోసం ఆల్కిమెనీకి అవగతం అవుతుంది. రణరంగం నుండి తిరిగి వచ్చిన ఏంఫిట్రియాన్ భార్యతో రమించడం వల్ల ఆల్కిమెనీ గర్భంలో ఇఫిక్లెస్ (Iphicles) పిండం పెరగడం మొదలవుతుంది. ఇలా ఇద్దరు పురుషులకి చెందిన బిడ్డలు ఒకేసారి తల్లి కడుపులో పెరగడం సాధారణంగా జరగదు కానీ అసంభవం కాదు. (దీనినే ఇంగ్లీషులో heteropaternal superfecundation అంటారు.) కనుక ఏంఫిట్రియాన్‌కి ఇఫిక్లెస్ సొంత కొడుకు, హెరాక్లీస్ సవతి కొడుకు అవుతారు.

జూస్ పట్టమహిషి హేరాకి జూస్ ఒక మానవ వనితతో నడుపుతున్న వ్యవహారం నచ్చలేదు. ఆల్కిమెనీ గర్భంలో పెరుగుతున్న హెరాక్లీస్ మీద ద్వేషం పెంచుకుంది. ఇలా రగులుతున్న ద్వేషం తన కడుపులోనే దాచుకుని అవకాశం కోసం ఎదురుచూడసాగింది. హోమర్ ఇలియడ్‌లో చెప్పిన కథనం ప్రకారం ఆల్కిమెనీ మరునాడు ప్రసవిస్తుందనగా జూస్ – హేరా ప్రోద్బలంతో – ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేసేడు. ఏమని? మరునాడు పుట్టబోయే బాలుడే దేవలోకానికి అధిపతి అవుతాడని! హేరా హుటాహుటి ఒలింపస్ పర్వతం నుండి దిగివచ్చి పెర్సియస్ పెద్ద కోడలు నెలలు నిండకుండానే ప్రసవించేటట్లు చేసింది. అదే ఊపులో నెలలు నిండిన ఆల్కిమెనీ మరునాడు ప్రసవించకుండా మంత్రశక్తితో ఆపుచేసింది. ఈ కుతంత్రం వల్ల హెరాక్లీస్‌కి చెందవలసిన రాజ్యం పెర్సియస్ పెద్ద మనుమడు, నెలతక్కువవాడు అయిన యురీస్టియస్‌కి (Eurystheus) దక్కింది.

హేరా వేసిన ఎత్తుకి పైయెత్తు అన్నట్లు ఒకనాడు ఎథీనా ఆకలితో ఉన్న చిరుతప్రాయపు హెరాక్లీస్‌ని తీసుకెళ్ళి అనాథ బాలుడని చెప్పి హేరా అక్కున చేర్చింది. హేరా తన చన్నులని కుడవడానికి అందించింది. పాలు తాగుతున్న హెరాక్లీస్ ఆ చనుమొనలని కొరికేడు. హేరా రొమ్ముల నుండి ప్రవహించిన పాలే ఆకాశంలో మనకి కనిపిస్తున్న పాలపుంత! అంతేకాదు, దైవాంశ ఉన్న హేరా పాలు తాగడం వల్ల హెరాక్లీస్ బలం ఇనుమడించింది, రవంత దైవాంశ కూడా ప్రాప్తించింది.

ఈ సంఘటనతో హేరాకి హెరాక్లీస్ మీద ద్వేషం కూడా ఇనుమడించింది. ఒకనాడు చంటిబిడ్డ ఉయ్యాలలో పడుక్కుని ఉండగా వాడిని చంపడానికి రెండు పాములని పంపించింది. ఆ పాముల్ని చంటివాడు చేతులతో నలిపి చంపేశాడు.

ఇంతటితో హెరాక్లీస్ ఇడుములు అంతం కాలేదు. హేరా పగకి పట్టపగ్గాలు లేకుండాపోయాయి. హేరా పెడుతున్న బాధలు భరించలేక హెరాక్లీస్ తన భార్యని పిల్లలని చంపేస్తాడు. తరువాత పశ్చాతాపంతో కుంగిపోతాడు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా యురీస్టియస్ కొలువులో ఉండి అతను ఆదేశించిన పనులు చెయ్యడానికి ఒప్పుకుంటాడు. వీటినే హెరాక్లీస్ చేసిన పన్నెండు సాహస కృత్యాలు అంటారు. నిజానికి ఈ పన్నెండింటిని మించి మరెన్నో సాహసాలు చేసేడు. ఈ పన్నెండింటిలో కొన్ని మాత్రమే ఈ దిగువ చెబుతాను.

కత్తులకూ, బరిసెలకూ, బాణాలకూ లొంగని ఒక భయంకరమైన సింహం ఆ ప్రాంతాలని బాధిస్తుంది. దానిని చంపాలి. హెరాక్లీస్ దాని పీకని చేతులతో నలిపి చంపేసి, దాని చర్మాన్ని ఒలిచి అంగవస్త్రంగా ధరించి, దాని శరీరాన్ని గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరేసేడు. అదే ఇప్పుడు మనకి ఆకాశంలో కనిపించే సింహ రాశి(Leo). హెరాక్లీస్ విగ్రహాలలో ఈ సింహపు తోలు తరచు కనిపిస్తూ ఉంటుంది.

ఆ ప్రాంతాలలో తొమ్మిది తలకాయల మహాసర్పం ఒకటి ఉండేది. ఈ పాముని సాక్షాత్తూ హేరా పెంచి పెద్దచేసింది; హెరాక్లీస్ మీద కసి తీర్చుకునే నిమిత్తం! ఆ పాము తల ఒకటి నరికితే మరొకటి పుట్టుకొస్తూ ఉండేది. దానిని చంపాలి. హెరాక్లీస్ దాని తొమ్మిది తలలూ ఒకే వేటులో నరికేసి, తిరిగి తల మొలవకుండా కాలుతున్న శలాకతో వాతలు పెట్టి, చంపేసేడు. అదే ఇప్పుడు ఆకాశంలో అజగరం (Hydra) అనే నక్షత్ర రాశిగా మనకి కనిపిస్తుంది.

హెరాక్లీస్ సాధించిన ఘనవిజయాలు చూసి యురీస్టియస్, హేరా సహించలేకపోయారు. ఈమారు ఒక మృగాన్ని చంపడానికి బదులు ప్రాణాలతో పట్టి తెమ్మని ఆదేశించారు. అది డయానా దేవతకి చెందిన లేడి. అతి వేగంగా పరిగెత్తగల, బంగారు కొమ్ములు ఉన్న లేడి. ఆ లేడిని గాయపరచకుండా పట్టుకుని, తెచ్చి, రాజుకి ఇవ్వాలి. హెరాక్లీస్ ఒక ఏడాదిపాటు ఆ లేడిని వెంటాడి చిట్టచివరికి పట్టుకున్నాడు. యురీస్టియస్ ఏమనుకున్నాడంటే అడవిలో తిరుగాడే లేడిని బంధిస్తే వనదేవత ఆర్టెమిస్‌కి కోపం వస్తుంది. అప్పుడు ‘కాగల కార్యాన్ని ఆర్టెమిస్ తీరుస్తుంది’ అనుకున్నాడు. కానీ లేడిని పట్టుకుని వస్తూవుంటే ఆర్టెమిస్, ఆమె కవల సోదరుడు అపాలో హెరాక్లీస్‌కి ఎదురయ్యారు. వారికి తన కథ చెప్పి లేడిని పట్టుకున్నందుకు క్షమాభిక్ష వేడుకున్నాడు. ఏ కళనుందో ఆర్టెమిస్ సరే అంది. హెరాక్లీస్ బతికిపోయాడు!

ఆర్కేడియాలో పంట భూములని నాశనం చేస్తున్న అడవిపందిని ప్రాణాలతో పట్టుకోవాలి. ఖైరాన్ సహాయంతో హెరాక్లీస్ ఆ అడవిపందిని పట్టుకుంటాడు.

వెయ్యి పశువులు ఆక్రమించి, ముప్ఫయ్ ఏళ్ళుగా సంరక్షణ లేకుండా పడి ఉన్న లెజియన్ రాజుగారి పశువులసాలని శుభ్రం చెయ్యాలి. రెండు నదీప్రవాహాలని మళ్ళించి, పశువులసాల గుండా ప్రవహింపజేసి, ఒక్కరోజులో ఆ సాలను శుభ్రపరుస్తాడు.

కంచు ముక్కులు, లోహపు రెక్కలతో బాటసారులను వేధించి తింటున్న రాక్షసి పక్షులని చంపాలి. ఎథీనా సహాయంతో వీటిని ఎదుర్కొని పారదోలుతాడు. అవి చెల్లాచెదరు అయిన తరువాత వాటిలో కొన్నింటిని చంపి కొన్నింటిని తరిమికొడతాడు. అలా పారిపోయిన పక్షులే మరల అర్గోనాటులని ఎదుర్కోడానికి జేసన్-అర్గోనాట్‌ల కథలో వస్తాయి.

ముక్కులోంచి మంటలు చిమ్ముతూ, బుసలుకొడుతూ, క్రీట్ ద్విపాన్ని ధ్వంసం చేస్తున్న పోసైడన్ దేవుడి ఆంబోతులని అదుపులో పెట్టాలి.

ఇలా మొత్తం పన్నెండు సాహసకృత్యాలు చేసేడు. అంటారు కానీ నిజానికి మరెన్నో సాహసాలు చేసేడు.

సొఫోక్లిస్ చెప్పిన కథనం ప్రకారం రకరకాల జంతువుల రూపాలలోకి, పక్షుల రూపాలలోకి మారిపోగలిగే అకెలూస్ (Achelous) అనే జలదేవుడుతో యుద్ధంచేసి డియనీరా (Deianira) అనే అందగత్తెని పెళ్ళి చేసుకున్నాడు. చివరికి పరోక్షంగా ఆమె వల్లనే అతనికి చావు మూడింది. అదెలా అంటే వీరిరువురు ఒక పడవలో ఒక నదిని దాటుతూ ఉండగా నెసస్ (Nessus) అనే పేరు గల ఒక నరతురంగం (centaur) డియనీరాని ఎత్తుకుపోయింది. హెరాక్లీస్ దానిని వెంబడించి చంపుతాడు. అది ప్రాణాలు విడచిపెడుతూ డియనీరాకి తన రక్తాన్ని కొద్దిగా బహుమానంగా ఇస్తుంది. ఇచ్చి, ‘నీ భర్త నిన్ను గాక మరొకరిని చేరదీస్తున్నాడని అనుమానం వస్తే అతను కట్టి విడిచిన బట్టని ఈ రక్తంలో ముంచినట్లయితే నీ భర్త నీవాడవుతాడు’ అని చెబుతుంది.

ఒకసారి హెరాక్లీస్ ఒక బానిసపిల్ల ప్రేమలో పడతాడు. డియనీరాకి ఆ విషయం తెలిసింది. అప్పుడు తన భర్త కట్టి విడిచిన బట్టలని ఆ నరతురంగం ఇచ్చిన రక్తంలో ముంచింది. నిజానికి ఆ రక్తం ప్రమాదకరమైన విషం. ఆ విషం హెరాక్లీస్‌ని చంపింది. అప్పుడు జూస్ మెరుపులు పిడుగులతో కూడిన తన వజ్రాయుధాన్ని హెరాక్లీస్ శరీరం మీదకి విసురుతాడు. హెరాక్లీస్ ఆత్మ ఒలింపస్ పర్వతం మీద ఉన్న ఇతర దేవగణాలని చేరుకుంది. హెరాక్లీస్ భౌతిక శరీరం మీద మంటలు లేచాయి. ఆ మంటలు ఎగసి స్వర్గందాకా వెళ్ళేయి. ఆకాశం ఎర్రబడింది. హెరాక్లీస్ నక్షత్ర లోకంలో చిరస్థాయిగా నిలచిపోయేడు.

చీకటిరాత్రి తలెత్తి ఆకాశం వైపు చూస్తే హెర్క్యులిస్ నక్షత్ర మండలాన్ని గుర్తించడం అంత తేలిక కాదు. ఎందుకంటే ఆ రాశిలో పేరెన్నికగన్న నక్షత్రాలు ఏవీ లేవు. ఈ రాశి బూటెస్ (భూతేశ), లైరా (వీణ) మండలాలకు మధ్యస్థంగా, అఫియాకస్‌కి తల తగులుతోందా అన్నట్లు తలకిందులుగా కనిపిస్తుంది.

హెర్క్యులిస్ నక్షత్ర మండలాన్ని జాగ్రత్తగా చూస్తే ఒక తెల్లని మచ్చ కనిపిస్తుంది. దీనిని దుర్భిణిలో చూస్తే ఇది ఒక నక్షత్రాల గుత్తి (star cluster) అని తేలింది. దీనిని వేదకాలపు భారతీయులు గుర్తించి ఋగ్వేదం 1-154-5వ మంత్రంలో, విష్ణోః పదే పరమే మధ్య ఉత్సః అన్నారు. అంటే, విష్ణుపద మండలంలో గొప్ప తేనెపట్టు వంటి చక్కని దృశ్యం అని అర్థం!

హెరాక్లీస్ గ్రీకు యోధులందరిలోకి ఎక్కువ కీర్తిప్రతిష్ఠలు గడించేడు. ప్రపంచవ్యాప్తంగా ఇతనికి ఉన్నన్ని విగ్రహాలు మరే గ్రీకు యోధునికి లేవేమో! ఇతని విగ్రహాలన్నిటిలోను గడ్డం లేని ముఖం, కండలు తిరిగిన శరీరం, చేతిలో విల్లమ్ములకు బదులు దుడ్డుకర్ర ఉండడం, సింహపు చర్మం వీపు మీద వెళ్ళాడుతూ ఉంటే సింహపు పంజాలు మెడ కింద ముడేసినట్లు ఉండడం సర్వసాధారణం. హెరాక్లీస్ చేసిన వీరవిహారాలలో భారతదేశపు పొలిమేరలలోకి కూడా వచ్చేడని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి ఋజువుగా మధురలో దొరికిన తల లేని హెరాక్లీస్ విగ్రహం ఒకటి కొల్‌కతాలోని ఒక సంగ్రహాలయంలో ఉంది!


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...