రచయిత వివరాలు

పూర్తిపేరు: ఆర్. శర్మ దంతుర్తి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

తన జీవితంలో ఒకే ఒకసారి పెద్దన్నయ్య తిరుపతి వెళ్ళాడు. అదైనా రెండో అక్క పెళ్ళి తర్వాత అందరితో పాటు. ఆ జనం, గోలా, దీర్ఘమైన ప్రయాణం అవీ తనకి నచ్చలేదని చెప్పాడు వెనక్కి వచ్చాక. ఎప్పుడైనా వెళ్ళే మా ఊరి గుడిలోనే సంతోషంగా ఉంటుందిట. పెద్దక్క అత్తవారివైపు ఇంటికిగానీ మిగతా అక్కలని చూడడానిక్కానీ ఎప్పుడూ వాళ్ళింటికి పిలిచినా వెళ్ళలేదు. మాకు వెళ్ళాలని ఉంది అంటే మమ్మల్ని, వదినతో పాటు వెళ్ళమనేవాడు డబ్బులు ఇచ్చి.

సాయంత్రం వ్యాహ్యాళికి వచ్చిన బింబిసార మహారాజు, ఆ రోజు గుర్రం దాని ఇష్టం వచ్చిన దారిలో తీసుకెళ్ళినపుడు ఊరు చివర శ్మశానం దగ్గిర తేలాడు. కాలుతున్న శవాలు ఏమీ లేవు కానీ తాను వచ్చినట్టు గమనించాడు కాబోలు ఎవరో అరుస్తున్నాడు, దగ్గిరకి రమ్మని. వెళ్ళి చూస్తే రెండు మూడు రోజుల క్రితం కొరత వేయబడిన ఎవరో నేరస్థుడు. ఆ మనిషి చేతులు వెనక్కి విరిచి కట్టివేయబడి ఉన్నాయి.

ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఎవరో పిలిచారు వాళ్ళమ్మాయి బర్త్‌డే పార్టీకి రమ్మని. అతనికి వెళ్ళాలని లేక మీరు వెళ్ళిరండన్నాడు భార్యాపిల్లలను. జీవితంలో ఒక్క సరదాలేదు ఉత్త దద్దమ్మ అంటూ ఆవిడ సణిగింది, ఇప్పుడీ పిల్లలను తను డ్రైవ్ చేసుకొని తీసుకువెళ్ళాల్సి వచ్చేసరికి. అబ్బా, డాడీ, యూ ఆర్ యూస్‌లెస్ అన్నారు తొమ్మిదీ, పదేళ్ళ కూతుళ్ళిద్దరూ. వాళ్ళు వెళ్ళాక సోఫాలో జారపడి కళ్ళు మూసుకున్నాడు.

భిక్షాటన, ముష్టి అనే ఈ రెండింటికి తేడా ఉంది. ప్రపంచంలో ఉన్నవన్నీ వదులుకుని, బతకడానికి కావాల్సినది మాత్రమే తీసుకునేది భిక్షాటన. ముష్టి అనేది ‘నాకింకా కావాలి’ అనుకుంటూ ఎంత ఉన్నా కూడబెట్టుకునేది. ముష్టివాడికి తన దగ్గిర డబ్బు ఉందా లేదా, అనేవన్నీ అనవసరం. ఆవురావుమని ఇచ్చినదంతా తీసుకోవడమే పని. ఈ ముష్టి ఎత్తేవాళ్ళు అత్యంత ధనవంతుల నుంచి అతి బీదవారి వరకూ ఉన్నారు. ముష్టి ఎత్తే సరుకు ఒకటే తేడా.

మూడు మైళ్ళు పరుగెట్టాక కట్టెలకు వెళ్ళిన ఇద్దరూ ఎదురుగా వస్తూ కనిపించేరు. వాళ్ళు నిజంగానే చుట్టలు తాగుతూ కాలక్షేపం చేశారు. కట్టెలు ఇంకో గంటలో వస్తాయని వీరితో బొంకారు. ఈ ఇద్దర్నీ చూశాక పరుగెట్టే ఇద్దరూ ఆగి చెప్పారు శవం కదలడం, మూలుగు వినడం అవీ. ఇది విన్న వాళ్ళు వీళ్ళని వెక్కిరించారు పిరికిపందలని. మొత్తానికి నలుగురూ కలిసి మరోసారి శ్మశానానికి తిరిగొచ్చారు. గుడిసెలోకి వెళ్ళాక తెల్సింది – కాదంబిని శవం అక్కడ లేదు.

ఈ లోకంలో రహస్యంగా ఉన్న ప్రదేశం, ఏకాంతంగా చేసే కర్మ అంటూ ఏదీ లేదు. దేవతలు, ఋషులు, మొదలైనవారి దివ్యచక్షువులకి కనపడకుండా ఉండేది ఏమీ లేదని నాకు తోచింది. నేను చేసేది ఎవరికీ కనిపించకపోయినా, అణువణువునూ శాసించే ధర్మసూత్రాలకి గోచరం కానిదేదీ ఉండబోదు కదా. శూన్యము అంటే ఏదీ లేనిచోట అని అర్ధం అయితే అక్కడ నేను ఉన్నాను కదా అది అశూన్యం కావడానికి?

ఆనందుడు చెప్పడం ప్రకారం భగవానుడు భిక్షుసంఘానికి ఎవర్నీ నాయకుడిగా నిర్దేశించలేదు. దీనికి రెండు కారణాలు కావొచ్చు. మొదటిది ఆయన ముఖ్య శిష్యులైన శారిపుత్ర, మౌద్గలాయనులు అప్పటికే దేహం చాలించారు. రెండోది, ఎవరికైనా నాయకత్వం కట్టబెడితే వాళ్ళు ఉత్తరోత్తరా అధికారం కోసం పాకులాడుతూ, దెబ్బలాటలతో ధర్మం గురించి పూర్తిగా మర్చిపోయే రోజులు రావడానికి అవకాశం ఎక్కువ.

వేడి, వేడి వడి వడి అంతర్జాలంలో విర్రవీగే
సాంకేతిక విజ్ఞాన అంధకారంలో ప్రపంచం
ఒక్కుమ్మడిగా ఆంక్షలకీ, కట్టడికీ చేరాలంటే
అలోచనలకి అనేక వారాల సమయం పట్టదూ?

నేను వెళ్ళేసరికి తాతకీ అమ్మమ్మకీ సంతోషం, మనవడు ఇంజినీర్ అయిపోతున్నాడని కాబోలు. పెద్దవాడినౌతున్నాను కనక ఇప్పుడు నాతో అన్ని విషయాలు చెపుతున్నారు. నేనే అడిగాను అబ్బలనాన్న సంగతి. వేసవిలో రాలేదుట కానీ గణపతి నవరాత్రుల సమయంలో వచ్చాట్ట. అవును ఇంకా ఒక్కడే. ఆయన భార్య ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆవిడ పుట్టింటివారిక్కూడా తెలియదు ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో, కొంతమందైతే ఆవిడ చచ్చిపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు.

ఆనందుడు నవ్వుతూ చెప్పాడు, “పిచ్చివాడా, ‘బుద్ధేర్లోకానతస్త్రాతుమితి స్థితోస్మి’ ఆయనే చెప్పారన్నావుగా? మనకి ఈ ప్రపంచంలో తగులుకున్న భవరోగానికి దారి చూపించే భగవానుడికి గృహస్థు ఇంటికి దగ్గిర దారి ఎటువైపు ఉందో తెలియకపోవడమేమిటి? నీ కోసమే అటువైపు కావాలని, నేను మరొకర్ని తోడు పంపిస్తానన్నా వద్దని, ఒక్కడూ వచ్చాడు. నీ అదృష్టం ఏమని చెప్పేది?”

ఈ పధకం ప్రకారం బంధులుడు, అతని ముప్ఫై ఇద్దరు పిల్లలూ రహస్యంగా వెళ్ళి ఫలానా రాజ్యం సరిహద్దుల్లో జరగబోయే తిరుగుబాటు అణచాలి. అలా వాళ్ళు వెళ్ళినపుడు అక్కడ దాక్కున్న ప్రసేనజిత్తు సైన్యం ఈ బంధులుణ్ణీ, అతని పిల్లలనీ హతమారుస్తుస్తుంది వాళ్ళు నిద్రలో ఉండగా. అలా అతి బలవంతుడైన బంధులుణ్ణి పిల్లల్తో సహా వదిలించుకుంటే దరిద్రం వదులుతుంది ప్రసేనజిత్తుకి.

ప్రపంచంలో జనం అందరూ కూడా అనేకానేక రోగాలతో, విపత్తులతో మూలుగుతున్నారు. కొంతమందికి శారీరిక అనారోగ్యం అయితే కొంతమందికి మానసిక అనారోగ్యం. తనతో సహా ఎవరికీ కూడా పూర్తి ఆరోగ్యం అనేదే లేదు. జీవితంలో ఒకే ఒక విషయం ప్రతీవారికీ జరిగేదీ, జరగక తప్పనిదీ – చావు మాత్రమే. ఇదేనా సిద్ధార్థుడు సన్యాసం తీసుకోవడానిక్కారణం?

దారిలో ఏదో కూడలి దగ్గిర గుమికూడి ఉన్నారు జనం, ఏదో వింత చూస్తున్నట్టు. దగ్గిరకెళ్ళి చూశాడు. దారుణమైన నెప్పితో పడి ఉన్న ఒక స్త్రీ మూలుగుతోంది. ప్రసవవేదన. ఇందుకేనా భగవానుడు చెప్పేది జననమరణాలనుంచి విముక్తి పొందాలని? పాపం ఎంతటి వ్యథ! చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికీ ఏమీ చేయడానికి పాలుపోవడంలేదు. ఎవరో పరుగున పోయి వైద్యుణ్ణి పిలుచుకొచ్చారు.

శ్రావస్తి నగరానికి వెనక్కి వస్తూంటే ఊరి బయట కనిపించిన ఖాళీ స్థలం గురించి వాకబు చేశాడు అనాథపిండకుడు. తనకి తెల్సిన విషయాల ప్రకారం అది కోసల రాజు ప్రసేనజిత్తుకి చెందినది. భగవానుడి కోసం ఒక విహారం నిర్మించడానికి ఈ స్థలం సరిపోతుందనుకుంటే దీన్నిరాజు దగ్గిరనుంచి కొనాలి. తానో వర్తకుణ్ణని తెలిస్తే ఏం ధర చెప్తాడో? తన ప్రయత్నం చేయడం తప్పులేదు కదా.

తమని బాణాలతో కొట్టిన ఆ రాముడే కొద్ది రోజుల ముందు, తమ తల్లి తాటకిని కడతేర్చాడు. ఆ కుర్రాడు పినతల్లి కైక దగ్గిరే విలువిద్య అంతా నేర్చుకున్నాడనీ ఆవిడ ఈ కుర్రాణ్ణి స్వంత తల్లికంటే ఎక్కువగా చూసుకుంటోదంనీ తెలిసొచ్చింది. సవితి అంటేనే తన పిల్లలు కాని వారిని రాచిరంపాన పెడుతుందని కదా లోకంలో అనుకునేది? ఇదో వింత అయితే, తన తల్లి తాటకిని చంపినందుకు విశ్వామిత్రుడు తన దగ్గిరున్న అస్త్రవిద్యంతా ఈ రాముడికి ఉచితంగా ధారపోశాడు.

రాయ్‌చరణ్ అలా వెళ్ళడం ఆలస్యం, కుర్రాడు ఇటు నదికేసి తన బండి లాక్కుంటూ వెళ్ళిపోయేడు. విపరీతమైన వేగంతో పోయే నీళ్ళ ప్రవాహం చూసేసరికి వాడికి మరింత సరదా పుట్టింది. పక్కనే దొరికిన చిన్న కర్ర పట్టుకుని నీళ్ళలోకి దాన్ని వంచుతూ చేపలు పడుతున్నట్టూ వంగడం, నీళ్ళని ఆ కర్రతో కొట్టడం సాగించేసరికి చిన్న నీటి తుంపర వాడి మీద పడింది. దాంతో నీళ్ళంటే మరింత ఉత్సాహంతో మరింత ముందుకి వెళ్ళాడు బండిని లాక్కుంటూ…

భగవానుడి ఎదురుగా పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్న నందుడికి మొదటగా కనిపించినది, కాలుతున్న ఇనప స్తంభం. దానిమీదకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న ఒక కోతి. స్తంభం మీద చేయి వేసినప్పుడల్లా కోతి చేయి కాలుతోంది. చేయి వెనక్కి తీసుకోవడం మళ్ళీ మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో కోతి కాళ్ళూ చేతులూ నోరూ చెవులూ కాల్తున్నాయి.

“మొదటిసారి సుజాత ఇచ్చిన పాయసం వల్ల నా ప్రాణలు నిలిచి గౌతముడినైన నేను జ్ఞానోదయంతో ధర్మాన్ని కనుక్కోగలిగాను. ఆ రోజు సుజాత పాయసం ఇచ్చి ఉండకపోతే తథాగతుడే లేడు. బుద్ధత్వం పొందాక ప్రారంభించిన ధర్మ చక్ర పరివర్తనం ఈ రోజుకి దాదాపు పూర్తైంది. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు; ప్రతీ ప్రాణీ అంతమై తీరుతుంది. ఆ క్రమంలోనే ఈ పరివర్తనం అనేది ఎప్పుడో ఒకసారి అంతమవ్వవల్సిందే కదా?”

ఈ ఆలోచనతో సిద్ధార్థుడికి మరింత పట్టుదల, ఓపిక అంకురించాయి. గిన్నెలో పాయసం పూర్తిగా తిన్న కాసేపటికి, ఆహారం తిన్న తనని జ్ఞానమార్గంలోంచి భ్రష్ఠుడైనట్టు భావించి దూరంగా కదిలిపోతున్న అయిదుగురు శిష్యులూ కనిపించారు. మరోసారి చిరునవ్వు గౌతముడి మొహంలో. పోనీయ్. ఈ జీవితంలో తాను జ్ఞానం సంపాదించనంతవరకూ ఎవరికీ ఏ ఉపదేశం చేయలేడు. ఎవరికెవరు? కోహం? కోహం? ఇదీ తాను మొదట తాను తెలుసుకోవల్సినది.

ఒక్కసారి గుండె మీద వేయి శతఘ్నుల పోటు. ఊపిరి అందడం లేదు ఇవాన్‌కి. పెద్ద గోతిలో పడిపోతూండగా చివర్లో కనిపించిన ఓ వెలుగు. ఓ పక్కకి వేగంగా వెళ్తూంటే నిజంగా అటుగాక మరో వ్యతిరేక దిశలో వెళ్తూన్న భావన. ‘హమ్మయ్య, ఇదేదీ నిజం కాదన్నమాట. సరే మరేది నిజం?’ ఇవాన్ మనసులో కొత్త ఆలోచన రూపు దిద్దుకోవడం తెలుస్తోంది, అన్నింటినీ ముంచేసిన కొత్త నిశ్శబ్దం లోంచి.

వెళ్ళిన పావుగంటకి ఉపన్యాసం మొదలైంది. బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుందీ, అది సాధించడం ఎంత కష్టం, అది రావడానికి ముందు మనిషి తనంతట తాను ఎలా మారాలీ అనేవి విశదంగా చెప్తున్నారు. అహంకారం వదిలించుకోవాలి. నిమిత్త మాత్రుడిలా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. నిందాపనిందలు పట్టించుకోకూడదు. శీతోష్ణ, సుఖదుఃఖాలకి సమానంగా స్పందించాలి.

రెండు రోజులు భీకరంగా జరిగేక రెండు వైపులా జవాన్లు చాలామందే పోయారు. కాల్పులు విరమించమని ఆర్డర్ వచ్చి, యుద్ధం దాదాపు అయిపోయేసరికి అబ్దుల్ కరీమ్‌కి కాలులోకి బులెట్లు దిగబడి బాగా గాయాలయాయి. శ్రీవాత్సవ ట్రాన్స్‌మిటర్‌లో ఆర్మీ మెడిక్స్‌కి సమాచారం అందించేడు. కాసేపట్లో హెలికాప్టర్ పంపుతామన్నారు.

జేరిన కొత్తలో జగదీష్ సింగ్ కేసి చూసి, ఓ అస్సాం కుర్రాడు, మనీష్ అనే అతను సింగ్ ఎత్తు ఎంతో అడిగి పేంట్ కేసి చూపిస్తూ, ‘సైజు ముఖ్యం తమ్ముడూ, ఇది ఇండియన్ ఆర్మీ,’ అన్నాడని బాగా ప్రచారం అయింది ఆ రోజుల్లో. మనీష్ అలా అన్నందుకు సింగ్ నొచ్చుకున్నా తర్వాత స్పోర్టివ్‌గా తీసుకుని మర్చిపోయాడని చెప్పుకున్నారు.

సంక్రాంతికి బయట నాలుక్కూడలిలో
మా చేత వేయించిన భోగిమంట గుర్తుందా?
ఆ మంచు కురిసిన పొద్దున్న మంట దగ్గిర
నీ చేయి పట్టుకుని చలి కాచుకుంటూంటే
మా ఇద్దర్నీ తలోవైపూ పట్టుకున్న
నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం
మేము నీకు తీర్చలేని బాకీ

ఆపరేషన్ అయిన నాలుగోనాడు ఇంకా హాస్పిటల్లో ఉండగానే మరోసారి గుండెల్లో నెప్పి వచ్చింది సుబ్బారావుకి. ఈ సారి రక్తంలో కట్టిన గడ్డ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పల్మోనరీ ఎంబోలిజమ్ వచ్చిందని కొత్త పేరు చెప్పేడు డాక్టరు; తాను సర్జరీ చేసినప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల రక్తం గడ్డ కట్టిందనీ ఆ గడ్డ మెల్లిగా ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించిందనే తప్పు నొక్కిపెట్టి. ఏదైతేనేం, ఇంక మహా అయితే రెండు రోజులు బతకొచ్చు. ఈ లోపుల స్పృహలోకొచ్చి మాట్లాడితే గొప్పే.

అలా కాలిఫోర్నియాకు పోవడం బాగా కలిసొచ్చింది ఇద్దరికీ. ఇద్దరికీ ఉద్యోగాలు వెంటవెంటనే దొరికేయి. జీతం ఆరెంకెల్లోకి, హెచ్-1 వీసా గ్రీన్ కార్డులోకి, గ్రీన్ కార్డు సిటిజన్‌షిప్ గానూ మారితే, రెండు కార్లు, అయిదు బెడ్రూముల ఇల్లు, ఇద్దరు పిల్లలూ ఒకదాని మీద ఒకటి వచ్చి చేరేయి. రెండేళ్ళకోసారి వర్ష మొగుడితోటీ పిల్లల్తోటీ ఇండియా వచ్చి వెళ్తోంది.

మర్నాడూ ఆ పైరోజూ కూడా స్తిపనీదా ఆలోచనలు ఎవ్‌గెనీని వదల్లేదు. ఏవో పనులున్నా అవన్నీ చేస్తున్నా మనసునిండా ఈవిడే. పెళ్ళితో తన పాత జ్ఞాపకాలన్నీ పూర్తిగా పోయాయనే అతననుకున్నాడు. స్తిపనీదా పొందు అతనిప్పుడు కోరుకోటల్లేదు కానీ ఆమె పైని వ్యామోహం ఇంకా ఉన్నందుకు అతను మథనపడ్డాడు. తరవాత గుర్రాల దగ్గరకి నడుస్తుండగా తనను దాటి పరుగెత్తుకుంటూ పోయిన అదే ఎర్ర గౌనూ తలకు చుట్టిన ఎర్ర రుమాలూ అదే ఆరోగ్యవంతమైన శరీరం అతనికి ఆ పొలాన్నీ ఆ గడ్డివామినీ ఆ మధ్యాహ్నాలనూ గుర్తుకు తెచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టాయి.

తను అమెరికా వెళ్ళకముందు ఎప్పుడో కాలేజ్‌ డేస్‌లో ఉండగా లోకల్ ట్రెయిన్ ఎక్కిన అనుభవం గుర్తొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది కల్పనకి. మామూలు కంపార్ట్‌మెంట్‌లో అయితే మనిషిని నలిపేయడం గారంటీ. ఫస్ట్ క్లాస్‌లో అయితే కాస్త డీసెంట్‌గా ఒకళ్ళనొకళ్ళు ఆనుకుంటూనో, లేకపోతే వేళ్ళాడుతూనో నిలబడొచ్చు. అక్కడికీ తన చేతిలో పర్స్ పోకుండా దాచుకోగలిగితే అదృష్టమే. అయినా బాంబేకి ఇలాంటి వర్షం మామూలే కదా అనుకుంటూండగానే మళ్ళీ తండ్రి కంఠం వినిపించింది ఫోనులో, “విన్నావా? కారు బయటకి తీయవద్దు!”

సభలో అందరూ రాజుగార్ని ఆహ్వానించాక చర్చ మొదలైంది. సారాంశం ఏమిటంటే రాజు లైలీ మెరుపుదాడి చేసి ఎసర్‌హాడన్‌ని చంపేసి వదుల్చుకుంటే పీడ విరగడౌతుంది. దీనికి లైలీ ఒప్పుకోలేదు. “వద్దు. యుద్ధం మూలంగా జనక్షయం మన వల్ల ఎప్పుడూ మొదలు కాకూడదు. శాంతిదూతలుగా ఓ అయిదారుగుర్ని పంపించి ఎసర్‌హాడన్‌తో మంచిగా మాట్లాడి చెప్పి చూడమందాం. ఎంత కఠినాత్ముడైనా కాస్త మంచిగా మాట్లాడితే వింటాడన్న నమ్మకం నాకుంది.”

రెడ్డీ అల్లుడూ అరగంటలో కారు దిగేసరికి గుడి చుట్టూ జనం పోగై ఉన్నారు వింత చూస్తూ. డబ్బులు ముట్టుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు. వినాయకుడి డబ్బా, మజాకా? సాక్షుల్లేకుండా ముట్టుకుంటే జైలూ, దేవుడి డబ్బులు ముట్టుకుంటే నరకమూను. అదీకాక ఈ హుండీ తెరవాలంటే బేంకు వారు రావాలి; దేవుడిది ధర్మఖాతా కదా? కానీ బేంకు వారు గంట పది దాటకుండా, ఆఫీసులు తీయకుండా అలా వచ్చేస్తారా? కొన్నిసార్లు వచ్చేస్తారు మరి.

“ఈయనకి తెలియని విషయం లేదు. తెలుగు, పద్యాలు, పాటలు, యోగా, జ్యోతిషం, హస్త సాముద్రికం, పాద సాముద్రికం, నుదిటి మీద గీతలు చదవడం, వైద్యం, ఇంజినీరింగు, లా అండ్ ఆర్డర్, బస్కీలు తీయడం, కబడ్డీ, వాలీబాల్ అలా మీరేది చెప్పినా అందులో ఈయన నిష్ణాతుడని ఈయన స్వంత అభిప్రాయం. అక్కడతో పోతే బాగుణ్ణు కానీ ప్రజలందరూ ఈయన్ని చూసి, ఈయనకిన్ని కళలెలా వచ్చాయబ్బా అని ఏడ్చుకుంటున్నారనీ, కుళ్ళుకుంటున్నారనీ ఈయననుకుంటూ ఉంటాడు.”

“తమ్ముడూ, ఇప్పుడు మనం జీవితంలో చరమాంకాన్ని చేరుకున్నాం. ఇప్పటివరకూ చేసిన పాప పుణ్యాలూ, ఆచరించిన ధర్మాధర్మాలు ఒక్కటే మన వెంటే వచ్చేవి. మనం ఐదుగురం అతిరధ మహారధులుగా ఉండీ వస్త్రాపహరణం సమయంలో ఏమి చేయగలిగాం? భగవంతుడైన కృష్ణుడు తన స్వంత కొడుకుగా పుట్టిన తర్వాత కూడా వచ్చి విడిపించేవరకూ దేవకీ వసుదేవులు కారాగారంలోనే కదా బతికినది? ఎవరి పుణ్యఫలం వారిది. చివరిదాకా నువ్వు బతికి ఉంటే మాత్రం ద్రౌపది కష్టాలు పడదని రూఢిగా చెప్పగలవా?

ఏం వాగుతున్నావురా? దేవుడంటే అనంతం కదా? అలా మెళ్ళో వేలాడదీసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోయేవాడు దేవుడెలా ఔతాడు? ఒళ్ళు కొవ్వెక్కి నిజానిజాలు తెలియక మాట్లాడుతున్నావు కాబోలు. విను, దేవుడంటే మా బ్రహ్మ ఒక్కడే. ఆయనే ఈ సృష్టి అంతట్నీ సృజించి లయం చేస్తూ ఉంటాడు. ఆయన్ని గుర్తుంచుకోవడానికి అనేకానేక గుళ్ళూ, గోపురాలు కట్టాం. ఓ సారి గంగాతీరం పోయి చూసిరా.

ఒక్కసారి హేజ్‌వుడ్ నవ్వడం మొదలెట్టాడు. మొదట్లో చిన్నగా మొదలైన నవ్వు తెరలు తెరలుగా పెద్దదై పక్కనున్న డేవిడ్, లిండాలు చూసినా సరే నవ్వుతూనే ఉన్నాడు. కాసేపటికి వచ్చే నవ్వు ఆపుకోలేక గదిలో ఉన్న కిటికీ దగ్గిరకెళ్ళి బయటకి చూస్తూ అదే పనిగా నవ్వు. ఇదంతా అర్ధం కాని డేవిడ్, “స్టాన్, ఆర్ యూ ఓకే?” అన్నాడు. లిండా కూడా కాస్త విస్తుపోయినట్టు చూసేసరికి తేరుకుని సుధీర్‌తో అదే నవ్వు మొహంతో అన్నాడు హేజ్‌వుడ్, “మీ నాన్నగారు మీ కూడా వచ్చారా?”

అంతకుముందు ఎప్పుడైనా చర్చ్‌కి వెళ్ళడానికి ఆసక్తి ఉండేది. ఇప్పుడు పొద్దున్నే లేవడానికీ, తిండి తినడానికీ కూడా వెగటే. దేవుడి గురించి విన్నదీ కన్నదీ అంతా కట్టుకధే అనే అనుమానం మొదలైంది. దేవుడనే వాడుంటే ఇలా చేస్తాడా? వయసైపోతున్న తనని వదిలేసి చిన్నకుర్రాణ్ణి తీసుకెళ్ళిపోయేడు. చర్చ్‌లో ప్రతీవారం పాస్టర్ భగవంతుడికి అపారమైన కరుణ ఉందని అంటాడే! మరి కళ్ళముందటే ఇలాంటివి జరుగుతూంటే ఎలా నమ్మడం?

మౌనంగా ఉన్న కైక నోరు తెరిచింది. “మంధరా, ఇప్పుడు నువ్వు వచ్చినది రఘువంశ మహారాజు దశరధుడి దగ్గిరకి. రఘువెటువంటివాడో, సూర్య వంశం ఎటువంటిదో నీకు తెలియకపోవచ్చు. నిన్ను ఇక్కడకి విశ్వామిత్రులవారు పంపించారంటే అందులో మనకి తెలియని నిగూఢ రహస్యం ఏదో ఉందన్న మాట. చూద్దాం ఏం జరగబోతోందో. ఈ రాజభవనం నీ ఇల్లే అనుకో. నీ చేతనైన సహాయం చేస్తూండు. మా పూర్వీకులని కూడా రావణుడు చంపాడని నేను విన్నాను. ఏదో ఒకరోజు వాడికి ఆయుర్దాయం తీరిపోతుంది.”

“పాపమా? ఎవడండీ చెప్పేడు? మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకోమనే బుర్ర నిచ్చేడు మనకి సృష్టికర్త. ఆ బుర్ర ఉపయోగించి గింజలు ఉడకబెట్టుకు తినొచ్చు, పిండిచేసుకుని రొట్టె చేసుకోవచ్చు, లేకపోతే పానీయాలు చేసుకోవచ్చు. పక్కింటాయనకి ఓ బస్తా ఇవ్వగా లేంది మీ ఆనందం కోసం ఓ బస్తా గింజలు విదల్చలేరూ? అదీ మీరు తాగబోయే పానకం కోసమే కదా?” పగలబడి నవ్వేడు నికోలాస్.

మధ్యాహ్నం భోజనం అయ్యేక అంగట్లో ఖాళీ ఉన్నప్పుడు వచ్చారు తండ్రీ త్రివక్రా – సుదాముణ్ణి చూడ్డానికి. వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టి అడిగేడు. “ఎందుకు మీరీ పిల్లని అలా హింసిస్తున్నారు రోజూ? ఈ శరీరం, ఈ అవకరాలు అన్నీ భగవంతుడిచ్చినవి. మనం ఏదో జన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇలాంటి మానవ జీవితం వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఆ మిగిలిపోయిన కర్మ మౌనంగా అనుభవించేస్తే మేలు. ఎవరూ కూడా అవకరాలు కావాలని కొని తెచ్చుకోరు కద?”

మరణ శిక్ష అంటే ఎవరో ఒకరు కత్తితో నేరస్తుణ్ణి నరకాలి. లేకపోతే ఉరి తీయాలి. అయితే ఎప్పట్నుంచో మొనాకోలో అసలు హత్యలూ నేరాలు లేవు కనక ఉరితీసే తలారీ ఎక్కడా లేడు దేశంలో. జూద గృహాల్ని మాత్రమే చూడ్డం అలవాటైపోయిన సైన్యంలో ఏ ఒక్కడూ దీన్ని తలకెత్తుకోవడానికి ముందుకి రాలేదు. నేరస్తుణ్ణి వదిలేస్తే దీన్ని చూసుకుని మరో హత్యా కలహాలు మొదలౌతాయ్. సరే తలారిని వెదికే లోపుల వీణ్ణి జైల్లో ఉంచుదాం అని తీర్మానం అయింది. మరి జైలే లేదు మొనాకోలో.

ముని గుడిసె లోంచి బయటకొచ్చి మిఖాయిల్‌ని తీసుకెళ్ళి ఓ చెట్టును పడగొట్టించేక దాన్ని మూడు ముక్కలుగా కాల్పించేడు నిప్పుల మీద. అవి బొగ్గుముక్కల్లాగా అయ్యేక చెప్పేడు ముని, “ఇవి సగం లోతుగా ఇక్కడ పాతిపెట్టు. రోజూ నోటితో వీటిని తడుపుతూ ఉండు. నీకిదే పని. ఎప్పుడైతే ఈ మూడూ పూర్తిగా ఆకులు వేసి మళ్ళీ మొలవడం మొదలు పెడతాయో అప్పుడు నీకు పాప ప్రక్షాళన అయినట్టు.”

“దేవుడి ప్రమాణంగా నాకేమీ తెలియదు, నేను కాదు హత్య చేసింది” అని చెప్పేడు ఆక్సినోవ్ కానీ గొంతుకలోంచి మాట రావడం కష్టమౌతోంది, ఎప్పుడూ చూడని కష్టం ఎదురయ్యేసరికి. పోలీసులకు నమ్మబుద్ధి వేయలేదు ఈ సమాధానాలన్నీ. పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్ళిదగ్గిర్లో ఉన్న జైల్లో పెట్టేరు. మొత్తానికి తోటి ప్రయాణీకుణ్ణి హత్య చేసినందుకూ, అతని దగ్గిర్నుంచి ఇరవైవేల రూబుళ్ళు కొట్టేసినందుకూ పోలీసులు ఆక్సినోవ్ మీద కేసు తెచ్చారు.

అప్పుడు తలుపు తట్టింది అదృష్టం. అక్కడున్న వాళ్ళు మనిషికొక పాతిక ఎకరాలు ఇస్తారుట, కుటుంబానికి పాతిక కాదు. పాహోం ఎగిరి గంతేసేడు. అలా పాహోంకి వచ్చింది నూట పాతిక ఎకరాలు! తనకి మునుపున్న ఇరవై ఎకరాలు ఇప్పుడు చిన్న నాటుమడి కింద లెక్క! అన్నీ వదులుకుని వచ్చినవాడికి నూట పాతిక ఎకరాలు ఉత్తినే వస్తూంటే చేదా? అవి ముక్కలైతేనేం? పాహోం మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టేడు. వోల్గా నది నీళ్ళో మరేమో కానీ పాహోం పట్టిందల్లా బంగారమైంది పొలాల్లో.

“మీరు జ్ఞాన సంపన్నులని ఊళ్ళో వాళ్ళు చెప్తూంటే విని నాకున్న మూడు సందేహాలు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏ పని చేయడానికైనా సరైన సమయం ఏదో తెలుసుకోవడం ఎలా? నాకు కావాల్సిన ముఖ్యమైన మనుషులెవరో గుర్తించడం ఎలా? నాకున్న పనుల్లో అతి ముఖ్యమైన పని ఏది? ఇవే నా ప్రశ్నలు. వీటిని ఎంతమందినో అడిగాను కానీ ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయేరు. కొంతమంది చెప్పినా అవి నాకు నచ్చలేదు.”

ఎక్కడా ఆగకుండా సూర్యుడు పైకొచ్చేదాకా నడిచాక ఏలీషా ఒక చెట్టు కింద కూర్చుని సంచీ బయటకి తీసేడు. ఉన్న డబ్బులు లెక్కపెడితే పదిహేడు రూబుళ్ళ ఇరవై కొపెక్కులు మిగిలాయి. కూర్చున్న చోటునుంచి ఒకవైపు, జీవితాంతం వెళ్దామనుకున్న జెరూసలం రా రమ్మని పిలుస్తోంది. ఏలీషా ఆలోచనలు పరివిధాలా పోయేయి. చేతిలో డబ్బులు చూస్తే వీటితో జెరూసలం వరకూ వెళ్ళగలడం అసంభవం.

సరంగు ఈ లంకలో ఆగడం ఎంత ప్రమాదమో, ఎందుకు వద్దో అన్నీ పాస్టర్‌కి చెప్పి ఆయన్ని అక్కడకి వెళ్ళకుండా ఆపుదామని చూశాడు కాని పాస్టర్ మంకుపట్టూ, ఆయన పాస్టర్ అనే గౌరవం వల్లా ఏదీ కుదర్లేదు. ఓ అరగంటలో చకచకా పడవ దింపడం, పాస్టర్ గారూ ఇంకో ఇద్దరు పడవ నడిపే బెస్తవాళ్ళూ దిగడం అయింది.

పని ఉన్నప్పుడు ఎక్కడా ఆపకుండా పనిచేయడం, పనిలేనప్పుడు మౌనంగా ఆకాశం కేసి చూడడం, ఇవే మైకేల్ నిత్య కృత్యాలు. మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు, మాట్రియోనా సైమన్‌తో అసహ్యంగా దెబ్బలాడి, తర్వాత మనసు మార్చుకుని మైకేల్ కి భోజనం పెట్టినప్పుడు మైకేల్ చిన్నగా నవ్వడం తప్ప, ఆ తర్వాతెప్పుడూ మైకేల్‌ని నవ్వు మొహంతో చూసినట్టూ సైమన్‌కి గుర్తు లేదు.

ఏదో అనబోయి మళ్ళీ జాతకం చూడ్డం మొదలుపెట్టాడు సిద్ధాంతి గారు. సామర్లకోట వచ్చింది. పెద్దాయన కాఫీ ఇప్పించేడు సిద్ధాంతి గారికి. ఎక్కే దిగే జనాల్ని పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ పాప జాతకంలో లీనమై ఉన్నారు. పాప కొంచెం చిరాకుగా ఉన్నట్టు గమనించేడు లూ.

ఇంద్రజిత్తు వెంటనే కోపంగా చెప్పేడు, “తండ్రీ ఈ విభీషణుడు దేవతల పక్షపాతి. ఈయన్ని నమ్మకండి. ఇంద్రుణ్ణి గెల్చిన నేనూ, యముణ్ణి గెల్చిన మీరూ ఉండగా మనకి ఎవరెదురు చెప్పగలరు? లౌక్యంతో బలి మహరాజుని వంచన చేసి ఆయన ద్వార పాలకుడైన విష్ణుడేపాటి? మనం ముందు సుతలం మీదకే దండెత్తి పోదాం.”

ఫోటోలో అమ్మాయ్ నవ్వుతోంది. తీరిగ్గా రామం కాయితం మీద రాసేడు తాను అడగవల్సిన ప్రశ్నలూ అవీ. 1) వంట వచ్చా? ఛ, ఛ. మొదట్లోనే వంట గురించి అడగడం బాగుండదు. కొట్టేసి మళ్ళీ మొదలెట్టేడు. 1) మీ పేరు? ఏడిసినట్టుంది. తనకి పేరు తెల్సీ అడగడం ఏం బావుంటుంది? (కొట్టేసి మళ్ళీ,) 1) మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు?

ఫెళ ఫెళ ఉరుముల్తో టప టప చినుకుల్తో వాన
ఊరంతా ముంచేసే వాన కాలవలన్నీ ఉప్పెంగే వాన
పైర్లన్నింటినీ కళకళలాడించే వాన
నాలుగు నెలలుగా చూసినా రాని వాన

మహా ప్రజాపతి మంచం మీద పడుకుని ఉంది. రెండో కానుపు అయ్యి ఇంకా రెండో రోజే. ఒళ్ళు తెలియని జ్వరం, నీరసంతో ఉన్నా పరిచారిక వచ్చేసరికి కళ్ళు తెరిచి, “సిద్ధార్దుడు అన్నం తిన్నాడా? ఏమి చేస్తున్నాడు?” అనడిగింది. పరిచారిక కళ్ళు విప్పార్చి చూసింది ప్రజాపతి కేసి.

నాన్న చెప్పడం ప్రకారం తను పుట్టింది ఇండియాలో చిన్న పల్లెటూర్లో. దాదాపు ఇరవై ఏళ్ళు అదే ఊర్లో ఉన్నాడు, తెలుగు మాత్రం మాట్లాడుతూ. ఇంగ్లీషొచ్చినా మాట్లాడే అవసరం రాలేదుట ఎప్పుడూ. చాలా బీద కుటుంబం. ఏమీ ఉండేది కాదు.

“అమ్మా నీకు ఇంకా యాభై ఏళ్ళు రాలేదు. నాన్న పోయినప్పటినుంచీ నువ్వు ఒక్కత్తివే ఉంటున్నావు కదా? నా పెళ్ళి అయితే నువ్వొక్కత్తివీ ఎలా? నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదూ? ఏమిటి నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్పు?

ఫోన్ పెట్టేసిన గీత చాలా సేపు స్థబ్ధుగా కూర్చున్నాక లేచి తనకు తెలిసున్న తెలుగాయనకి చెప్పింది విషయాలన్నీ. ఆయన విని తనకి తెల్సున్న లాయర్ దగ్గిరకి తీసుకెళ్ళేడు. వేరే పాథాలజిస్ట్ చేత రెండో ఒపీనియన్ అడగొచ్చనీ, తాను హెల్ప్ చేస్తాననీ చెప్పేడు.

స్వర్గ తుల్యమైన సుఖాలు వదులుకుని కట్టుబట్టల్తో సన్యసించాలంటే ఎంతటి మనోధైర్యం కావాలి? తథాగతుడైనాక ఒక్కసారి కూడా ‘నా మాట నమ్ము’ అని అనలేదని వింది.

మగత మగత నిద్రలో జోగుతున్న కోటిగాడు గబుక్కున లేచి కూర్చున్నాడు ‘కొట్టకండి, కొట్టకండి, అమ్మా నన్ను కొట్టడానికి మళ్ళీ ఒచ్చేరే, నేనేం చేసేనే?వద్దని చెప్పవే’ అంటూ…

మరి నా ఇలాంటి మంచి ఆలోచన్లు వచ్చే మనస్సు ఉండడానికీ, దాన్ని పరమేశ్వరార్పణం చేయాలంటే ఏం చెయ్యాలో సెలవివ్వండి.