ఎవరో తలుపు తడుతూంటే వెళ్ళి తలుపు తీసేడు భూస్వామి. ఎదురుగా తన దగ్గిర ఓ రెండు మూడు సార్లు పనిచేసిన పాలేరు కనిపించేడు.
“ఏం ఇలా వచ్చేవ్?” అడిగేడు.
“నాలుగు రోజుల క్రితం కొడుకు పుట్టేడండి. వాడికి బాప్టిౙమ్ చేయించాలి కదా. మరి జ్ఞానస్నానం చేయించేప్పుడు మీరు గానీ చర్చికి వచ్చి గాడ్‌ఫాదర్‌గా ఉంటారేమో కనుక్కుందామనీ…” మొహం ఇంత చేసుకుని చెప్పేడు పాలేరు.
భూస్వామి ఆలోచించేడు ఓ క్షణం. తనకింద పనిచేసిన పాలేరు అయిన వీడెక్కడ? తానెక్కడ? రెండు మూడు సార్లు తన మోచేతి నీళ్ళు తాగ్గానే పరుగెట్టుకుంటూ వచ్చేశాడే అడగడానికి? ఇప్పుడు ఒప్పుకుంటే రేప్పొద్దున్న కుర్రాడు పెద్దాడయ్యేక ఇంకోటీ, మరోటీ అడగడూ? ఎవడికి పడితే వాడికి బుద్ధులు చెప్పి జ్ఞానాన్నిచ్చే తండ్రి లాంటి బాధ్యత తీసుకోడం ఎలా కుదుర్తుంది?
“కుదరదోయ్, వేరే వాళ్ళని చూసుకో. ఈ ఊరు చిన్నదైనా ఎవరో ఒకరు దొరక్కపోరు,” తలుపు వేస్తూ పుటుక్కున దారం తెంపినట్టూ సమాధానం చెప్పేడు భూస్వామి.
పాలేరు మనసు చివుక్కుమనిపించింది. పేదవాడి కోపం పెదవికి చేటు. ఇంకో ఇంటికి బయల్దేరేడు. మళ్ళీ అదే కథ అక్కడ కూడా. ఇలా నాలుగ్గడపలు ఎక్కి దిగేసరికి తెలిసొచ్చింది. ఎవరూ ఇక్కడ తన కొడుక్కి గాడ్‌ఫాదర్‌గా ఉండరు. వేరే ఊర్లో చూసుకోవాల్సిందే. చేసేదేం లేక తీరిక చూసుకుని పక్క ఊరికి బయల్దేరేడు. దారిలో ఎదురుగా గుర్రం మీద ఒక రౌతు వస్తూ పాలేర్ని చూసి అడిగేడు.
“ఏమోయ్, ఎక్కడికిలా బయల్దేరేవ్ పొద్దున్నే?”
“నాల్రోజుల క్రితం కొడుకు పుట్టేడండి. బాప్టిౙమ్ అప్పుడు వీడికి జ్ఞానపుతండ్రిగా ఉండమంటే ఎవరూ ఒప్పుకోలేదు ఈ ఊర్లో. అందుకే పక్క ఊరికి బయల్దేరేను.” పాలేరు అప్పటిదాకా ఊర్లో రైతులందరికీ అప్పచెప్పిన పాఠం మరో సారి చెప్పేడు.
“దాని కోసం పక్క ఊరికెందుకు? నీకిష్టమైతే గాడ్‌ఫాదర్‌గా నేనుంటాను, సరేనా.”
“తప్పకుండా. అయితే గాడ్‌మదర్‌గా ఎవర్ని చూసుకోమంటారు?”
“అదేమంత కష్టమైన పని? దుకాణాల వీధి కూడలి లేదూ, ఆ కూడలికి ఎడమ పక్క ఇల్లు ఒకటుంటుంది. వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నాయన కూతుర్ని గాడ్‌మదర్‌గా ఉండమని అడుగు.”
“భలేవారే! ఇప్పటిదాగా ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు ఈ ఊళ్ళో. ఒక్కడు కూడా ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గిరకెళ్తే చివాట్లు పెట్టడూ?”
“అవన్నీ మనసులో పెట్టుకోక మళ్ళీ అడుగు. ఈ సారి ఒప్పుకుంటాడు. ఆవిడ్ని తీసుకుని చర్చ్‌కి రా. నేను అక్కడికే వస్తా.” రౌతు గుర్రంపై వడివడిగా కదిలిపోయేడు.
రౌతు చెప్పిన ప్రకారం వెళ్ళి నాలుగు వీధుల కూడలి దగ్గిర్లో ధనవంతుడి ఇంటి తలుపు తట్టేడు పాలేరు. తలుపు తీసి బయటకొచ్చినాయిన ఏ కళనున్నాడో కానీ సౌమ్యంగా అడిగేడు.
“ఏమిటి సంగతి?”
“మాకు పుట్టిన అబ్బాయికి మీ అమ్మాయిని గాడ్‌మదర్‌గా ఉండడానికి చర్చ్‌కి పంపించగలరేమో అని అడుగుదామని వచ్చేను.”
“ఎప్పటికి రావాలి అమ్మాయ్?”
“రేపు పొద్దున్న. ఓ గంటలో పని అయిపోవచ్చు.”
“సరే. ఇంటికెళ్ళి అన్నీ సిద్ధం చేసుకో. పొద్దున్నే మా అమ్మాయ్ వచ్చి నిన్ను కల్సుకుంటుంది చర్చ్ దగ్గిర. సరేనా?” నవ్వుతూ చెప్పేడు ఇంటాయన.
మర్నాడు పొద్దున్నే పాలేరూ వాళ్ళావిడా పాస్టర్ చర్చ్‌లో అన్నీ సిద్ధం చేసేసరికి గాడ్‌ఫాదర్, గాడ్‌మదర్ ముందురోజు చెప్పినట్టూ ఏ వంకా పెట్టకుండా వచ్చి సిద్ధంగా ఉన్నారు. దైవ ప్రార్థన చేస్తూ జ్ఞానస్నానం చేయించాడు పాస్టర్. చంటి పిల్లాడి తల మీద నుంచి నీళ్ళు పళ్ళెంలో పోసేక పాస్టర్ పాలేర్ని అడిగేడు.
“ఏం పేరు పెడదామనుకుంటున్నారు?”
“మిఖాయిల్”
తతంగం అయ్యేక గాడ్‌ఫాదర్ గుర్రం ఎక్కి వెళ్ళిపోయేడు. పాలేరు కానీ వాళ్ళావిడ కానీ మళ్ళీ ఆయన్నెప్పుడు చూసింది లేదు. ప్రతీ పండగకీ మిఖాయిల్ గాడ్‌మదర్ దగ్గిరకి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటున్నాడే కానీ ఎప్పుడు గాడ్‌ఫాదర్ దగ్గిరకి వెళ్ళింది కానీ ఆయన్ని చూసింది కానీ లేదు.
పదేళ్ళు గడిచేయి. మిఖాయిల్ చురుగ్గా పెరుగుతున్నాడు. ప్రపంచజ్ఞానం వంటబడుతోంది. ఓ ఈస్టర్ పండక్కి గాడ్‌మదర్ దగ్గిర ఆశీస్సులు తీసుకున్నాక ఇంటి కొచ్చిన మిఖాయిల్ తండ్రి నడిగేడు.
“నాన్నా నా గాడ్‌ఫాదర్ ఎవరు?”
“ఆయనెవరో మాకూ తెలియదు. ఈ ఊర్లో ఎవరూ నీకు గాడ్‌ఫాదర్ గా ఉండనంటే వేరే ఊరికి బయల్దేరేను నేను. అప్పుడు దారిలో గుర్రం మీద కనిపించేడు. మర్నాడు పవిత్ర జలం తలమీద పోసేక నీకు పేరూ అదీ పెట్టి ఎలా వచ్చినాయన అలాగే వెళ్ళిపోయేడు. మేము ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని చూసింది లేదు. ఆయన ఉన్నాడో పోయాడో, అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఎవరూ గాడ్‌ఫాదర్‌గా రాకపోతే ఆయన్ని పెట్టుకోవాల్సి వచ్చింది.”
“మీలాగే నేను కూడా వేరే ఊరికి వెళ్తే దారిలో నాకు కనిపిస్తాడేమో?” మిఖాయిల్ అడిగేడు ఆసక్తిగా.
పాలేరూ వాళ్ళావిడా మొహం మొహం చూసుకున్నారు పదేళ్ళ కుర్రాడి తెలివికి. పాలేరు చెప్పేడు కాసేపటికి తేరుకుని: “ప్రయత్నం చేస్తే తప్పులేదు కానీ కనబడతాడనుకోవడం అత్యాశే.”
కుర్రాడు ఆ ఈస్టర్ రోజే బయల్దేరేడు గాడ్‌ఫాదర్ కనబడతాడేమో చూడ్డానికి. చాలాసేపు నడిచేక గుర్రం మీద రౌతు కనిపించి అడిగేడు.
“చూడబోతే చిన్న పిల్లాడిలా ఉన్నావు, ఎక్కడికి బయల్దేరేవ్ వంటరిగా?”
“ప్రతీ పండగకీ గాడ్‌మదర్ ఆశీస్సులు తీసుకుంటున్నాను. కానీ గాడ్‌ఫాదర్ ఎప్పుడూ కనిపించలేదు. అమ్మా, నాన్నల్ని అడిగితే ఆయనెక్కడుంటాడో తెలియదు అన్నారు. నాన్నకి కూడా పక్క ఊరికి వెళ్తూంటే దారిలో కనిపించాడుట. నాకూ కనిపిస్తాడేమో అని ఇలా బయల్దేరేను.”
“ఔనా? నేనే నీ గాడ్‌ఫాదర్‌ని.”
కుర్రాడికి సంతోషమైంది. వెంటనే గాడ్‌ఫాదర్ చెంపల మీద ముద్దిచ్చి ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పి అన్నాడు:
“ఇప్పుడు మీకు పెద్ద పనేం లేకపోతే మా ఇంటికి రాకూడదూ? అలా కుదరదంటే, నన్ను మీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్ళండి.”
“ఇప్పుడు కుదరదు. ఈ పక్కనున్న ఊళ్ళలో నాకు బోల్డు పని ఉంది. రేపు కుదురుతుంది.”
“పదేళ్ళలో ఒక్కసారి కనిపించారు. ఇప్పుడు వెళ్ళిపోయేక మళ్ళీ రేపు కనిపిస్తారా? రేపు మిమ్మల్ని ఎలా కల్సుకోవటం?”
“నన్ను కలుసుకోవాలనుంటే రేప్పొద్దున్నే మీ ఇంటి దగ్గిర్నుంచి బయల్దేరి తిన్నగా తూర్పు దిక్కుగా అడివి లోకి నడుచుకుంటూ వస్తే ఒక మైదానం, ఇంకా ముందుకి వెళ్తే చుట్టూ ప్రహరీ వున్న ఓ ఇల్లూ కనిపిస్తాయ్. అదే నేనుండే ఇల్లు. అక్కడ కొచ్చావంటే గుమ్మం దగ్గిర నేనే చూస్తూ ఉంటాను నీ గురించి. దారిలో నీకు కనబడేవన్నీ ఆగి జాగ్రత్తగా గమనించు. మర్చిపోకు సుమా.”
మిఖాయిల్ ఏదో అడిగే లోపుల రౌతు గుర్రంపై వడివడిగా కదిలిపోయేడు ముందుకి. మిఖాయిల్ ఇంటికొచ్చి మర్నాటి కోసం ఆసక్తిగా ఎదురు చూసేడు.
మిఖాయిల్ మర్నాడు గాడ్‌ఫాదర్ చెప్పినట్టూ అడివి లోకి నడిచేడు. పోగా పోగా మైదానం వచ్చింది. అక్కడ చుట్టూ చూడడం మొదలు పెట్టేడు. ఎదురుగా ఓ చెట్టూ, చెట్టుకి కట్టిన తాళ్ళ ఆధారంతో వేలాడుతున్న పెద్ద బరువైన దూలం కనిపించేయి. దానికిందే ఒక పెద్ద పాత్రలో తేనె ఉంది. ఇక్కడికి తేనెపట్టు లేకుండా తేనె ఎలా వచ్చిందా అనుకునేంతలో ఒక ఎలుగుబంటీ దాని పిల్లలూ వచ్చేయి; తేనె వాసన పసిగట్టాయి కాబోలు. అయితే దూలాన్ని పక్కకి తప్పించకుండా తేనె తాగడం అసాధ్యం. పెద్ద ఎలుగు దూలాన్ని పక్కకి తోసి తేనెలో చేయి పెట్టింది. దూలం తాళ్ళతో వేలాడుతూండటంతో అది గడియారపు లోలకంలా అటువేఫు వెళ్ళి బలంగా వెనక్కి వచ్చి ఎలుగుబంటి మొహాన్ని తాకింది. ఈ సారి ఎలుగుబంటి పెద్దగా అరిచి మళ్ళీ దూలాన్ని రెండింతల బలంతో పక్కకి తోసి తేనె నాకడానికి ప్రయత్నం చేసింది. ఈ సారి దూలం విసురుగా వచ్చి ఎలుగు పక్కనే ఉన్న పిల్లలకి తగిలింది మొహం పచ్చడయ్యేలాగా. ఒక పిల్ల వెంఠనే అక్కడికక్కడే చచ్చిపోవడం తల్లి చూసింది కానీ తేనె మీద వ్యామోహం వల్ల పెద్దగా గాండ్రించి మళ్ళీ ఇంకా బలంగా దూలాన్ని నెట్టింది. తిరిగొచ్చిన దూలం బలంగా ఎలుగు మొహాన్ని తాకడంతో దాని కపాలం పగిలి ప్రాణాలు గాలిలో కల్సిపోవడం మిఖాయిల్ చూసేడు, అదిరిపోతున్న గుండెలు చిక్కపట్టుకుంటూ. మిగిలిన పిల్లలు రెండూ కీచుమంటూ అడవిలోకి పారిపోయాయి. ఇదంతా ఆశ్చర్యంగా చూసి మిఖాయిల్ ముందుకి కదిలేడు గాడ్‌ఫాదర్‌ని కల్సుకోవడానికి.
ఇంటి బయటే గాడ్‌ఫాదర్ కనిపించి మిఖాయిల్‌ని లోపలకి తీసుకెళ్ళి ఇల్లూ, దొడ్డీ, వాకిలీ, అన్ని గదులూ చూపించేడు. ఇల్లంతా, బయటా లోపలా అద్భుతం అనిపించింది మిఖాయిల్‌కి. చివరికో గది తలుపు దగ్గిరకొచ్చేరు ఇద్దరూ.
“ఈ ఇల్లంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. కానీ ఇప్పుడు నీ ఎదురుగా ఉన్న తలుపు ఉంది చూశావా? అది కావాలనే సీలు వేసి వుంది. అది మాత్రం ఎప్పుడు తెరవ్వొద్దు.”
“తెరిస్తే?”
“తెరిస్తే, ముందు నువ్వు చూసిన ఎలుగుబంటి కధే ఇక్కడ మళ్ళీ జరుగుతుంది. గుర్తు పెట్టుకో. అన్ని సార్లు చెప్పక్కర్లేదనుకుంటా.”
మిఖాయిల్‌ని ఇంట్లో వదిలేసి గాడ్‌ఫాదర్ బయటకెళ్ళిపోయేడు పని మీద. ఆయన ఇలా బయటకెళ్ళగానే మిఖాయిల్ ఇల్లంతా తిరుగుతూ గడిపేడు మూడు గంటలు. అయితే ఆ ఇంట్లో – మూడు గంటలనుకున్న మిఖాయిల్ – నిజానికి ముఫ్ఫై ఏళ్ళు గడిచేయి. ఎక్కడా ఎప్పుడూ విసుగన్నదే లేదు ఆ ఇంట్లో. ఇన్నేళ్ళు పోయేక ఓ రోజు మిఖాయిల్ మూసి వున్న తలుపు దగ్గిరకొచ్చేడు. గాడ్‌ఫాదర్ దాన్ని తీయద్దొన్నట్టు చెప్పినది గుర్తొచ్చింది. “ఓ సారి మెల్లిగా తలుపు తెరిచి చూద్దాం. వెంఠనే మూసేస్తే ఏం కొంప ములిగిపోదు,” అనుకుని మెల్లిగా తలుపు తోసేడు మిఖాయిల్.
సీలు వేసిన తలుపే కానీ తోయగానే తెరుచుకుంది. ఆ తలుపు లోంచి లోపలకి వెళ్తే అక్కడున్నది ఇప్పటి దాకా చూసిన గదులకన్నా అద్భుతం. ఆ గదిలో ఓ సింహాసనం లాంటిదీ దాని పక్కనే ఒక రాజదండమూ కనిపించేయి. కుతూహలంగా మిఖాయిల్ ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. పక్కనున్న రాజదండం ఇలా చేతిలోకి తీసుకున్నాడో లేదో వెంటనే గది పూర్తిగా మారిపోయింది. మునుపున్న గోడలూ, నేలా ఏమీ లేవు. ఇప్పుడు ప్రపంచం, అందులో జరిగే ప్రతీ విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయ్.
మిఖాయిల్ సంతోషంగా తన ఊరు కనిపిస్తుందేమో, పంటలు అవీ ఎలా ఉన్నాయో చూడొచ్చు కదా! అనుకున్నాడు మనసులో. ఇలా అనుకోగానే తన ఊరూ అందులో జరిగే అన్ని విషయాలూ కనిపించడం మొదలు పెట్టాయి.
మొదటగా కనిపించింది, తన తండ్రి వేసిన పంట. పంట అంతా కోసి పెట్టి ఉంది. సంతకి మర్నాడు తరలిస్తారులా ఉంది. ఈ లోపున ఎవరో రావడం కనిపించింది మిఖాయిల్‌కి. పరకాయించి చూస్తే ఆ వచ్చేది తన తండ్రి కాదు, ఎవరో దొంగ. మిఖాయిల్ వెంటనే కేక పెట్టాడు, “నాన్నా లే, లేచి పంట చూసుకో, దొంగలెత్తుకుపోతున్నారు,” అంటూ. పాలేరు లేచి పరుగెట్టాడు తన తోడుగా ఇంకొందర్ని తీసుకుని. వెళ్ళేదారిలో “పంట దొంగలెత్తుకు పోతున్నారని” కల వచ్చినట్టు తన తండ్రి మిగతావాళ్ళకి చెప్పడం మిఖాయిల్ విన్నాడు. పంట దగ్గిరకొచ్చి దొంగని పట్టుకోవడం వాణ్ణి జైలుకి పంపించడం అన్నీ మిఖాయిల్ కూర్చున్న సింహాసనం మీద నుంచే చూసేడు.
ఇదయ్యేక మిఖాయిల్ తన గాడ్‌మదర్ ఎలా ఉందా అంటూ దృష్టి సారించేడు. ఆవిడ పడుకున్నప్పుడు, వాళ్ళాయన లేచి గాడ్‌మదర్‌కి తెలియకుండా ఇప్పటి దాకా ఉంచుకున్న మరో ఆవిడ దగ్గిరకి బయల్దేరుతున్నాడు, పెద్ద మనిషి. మిఖాయిల్ కేకలు పెట్టేడు, “అమ్మా మీ ఆయన వ్యభిచారానికి ఒడిగట్టాడు చూసుకో,” అంటూ. గాడ్‌మదర్ లేవడం, వాళ్ళాయన ఉంచుకున్నావిడని కర్రతో బాదడం, మొగుణ్ణి ఇంట్లోంచి పొమ్మనడం మిఖాయిల్‌కి కనిపించింది.
ఈ రెండు దృశ్యాలూ చూసేక ఆఖరిగా తన తల్లి ఎలా ఉందా అని మిఖాయిల్ చూడబోయేడు. ఆవిడ పడుకుని ఉంది ఇంట్లో. అదే అదనుగా చూసి దొంగ ఎవడో ఇంట్లో సామానంతా మూటగడుతున్నాడు. మిఖాయిల్ అరిచేడు వెంటనే, “అమ్మా దొంగ, దొంగ” అంటూ. ఆవిడ లేచి దొంగని ఆటకాయించబోయేసరికి వాడో కత్తి తీసేడు బయటకి ఆవిడ్ని బెదిరించడానికి. మిఖాయిల్ ఇంక ఊరుకోలేక కోపంగా చేతిలో ఉన్న రాజదండంతో దొంగని కొట్టేడు. అది వాడి కణతల మీద తగిలి అక్కడికక్కడే చచ్చిపోవడం చూసి మిఖాయిల్‌కి మహదానందమైంది.
దొంగ ఇలా చావడం, మిఖాయిల్ ముందు ఉన్న దృశ్యాలన్నీ తెర తీసేసినట్టు కనపడకపోవడం ఒక్కసారే జరిగేయి. గది ఎప్పట్లా నాలుగు గోడలతో అలాగే ఉంది. తలుపు తీసుకుని గాడ్‌ఫాదర్ లోపలకి రావడం చూసి మిఖాయిల్ రాజదండం ఎక్కడ్నుంచి తీశాడో అక్కడ పెట్టి సింహాసనం దిగి సిగ్గుతో తలవంచుకున్నాడు. లోపలకొచ్చిన గాడ్‌ఫాదర్ కంఠం ఖంగుమని మోగింది.
“నేను తెరవవద్దన్న తలుపు తీసి నువ్వు చేసినది మొదటి తప్పు. ఆ సింహాసనం ఎక్కడం, రాజదండం చేతుల్లోకి తీసుకోవడం రెండో తప్పు. ఆ రాజదండాన్ని నీ ఇష్టం వచ్చినట్టూ వాడడం మూడో తప్పు. నేను కనక ఇప్పుడు వచ్చి ఉండకపోతే నువ్వు ఆ సింహాసనం మీద కూర్చుని ప్రపంచాన్ని సగం నాశనం చేసి ఉండేవాడివి అర్ధ గంటలో.”
మిఖాయిల్ తలెత్తలేకపోయేడు. చేతికొచ్చిన పంటని దొంగతనం చేసే దొంగని పట్టుకోవడం, తన స్వంత అమ్మని చంపబోయే వాణ్ణి రాజదండంతో కొట్టడం ఎలా తప్పు అయిందో మిఖాయిల్‌కి అర్ధం కాలేదు.
“ఇదిగో చూడు,” మిఖాయిల్ ఆలోచనలు పసిగట్టినవాడిలా, గాడ్‌ఫాదర్ మిఖాయిల్‌ని తీసుకెళ్ళి మళ్ళీ సింహాసనం మీద కూర్చోపెట్టి చెప్పేడు. గాడ్‌ఫాదర్ ఇలా అనగానే మళ్ళీ మిఖాయిల్‌కి ప్రపంచం అంతా కనబడటం మొదలైంది. అందులో తన తండ్రి ఏడవడం, బైట పశువుల దొడ్డి తగలబడటం అన్నీ కనిపించేయి. గాడ్‌ఫాదర్ చెప్పేడు.
“నీ తండ్రి దగ్గిర దొంగతనం చేసినవాడు జైల్లోంచి బయటకొచ్చి ప్రతీకారం తీర్చుకోవడం కోసం మీ నాన్నకున్న గుర్రాలు రెండూ ఎత్తుకెళ్ళాడు. అది చాలక ఇప్పుడు కోపంతో కొట్టాలన్నీ తగలబెడుతున్నాడు. పంట దొంగతనం దగ్గిరే వదిలేస్తే ఆ దొంగ అక్కడే ఆగి ఉండేవాడు. కానీ నువ్వు చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు నీ తండ్రి అనుభవిస్తున్నాడు చూడు.”
“ఇప్పుడు చూడు ఇప్పుడు నీ గాడ్‌మదర్ ఏమైందో.” గాడ్‌మదర్ వాళ్ళాయన దారిలో తప్పతాగి పడి ఉండడం, ఇంకో వ్యభిచారిణితో కలిసి ఉండడం కనిపించింది. ఇంకా చూస్తే గాడ్‌మదర్ తాగుడికి బానిసై జీవితం నాశనం చేసుకొంటూంది. ప్రశ్నార్ధకంగా గాడ్‌ఫాదర్ కేసి చూసేడు మిఖాయిల్. ఆయన చెప్పేడు.
“గాడ్‌మదర్ మొగుణ్ణి ఇంట్లోచి వెళ్ళగొట్టేక ఆయన మొదటి ఆవిడ్ని కూడా వదిలేసి మిగతా ఆడవాళ్ళ వెంట విచ్చలవిడిగా తిరుగుతున్నాడిప్పుడు. మునుపైతే గాడ్‌మదర్‌కి తెలుస్తుందేమో అని జాగ్రత్తగా ఉండేవాడు. ఇప్పుడెలాగూ తెల్సింది కనక ఇలా తయారైయాడు. ఇదంతా మర్చిపోవడానికి నీ గాడ్‌మదర్ తాగుడికి బానిసైంది.”
మిఖాయిల్ నోటి మీద చేయి వేసుకున్నాడు నోట్లోంచి వచ్చే ‘అయ్యో’ అనేది బయటకి వినపడకుండా. గాడ్‌ఫాదర్ చెప్పడం సాగించేడు.
“ఈ నువ్వు చేసిన రెండు పనులూ ఇలా ఉంటే మూడో పని మాత్రం దారుణమైంది. చూడు ఇప్పుడు.” మిఖాయిల్ తన తల్లి కేసి చూసేసరికి ఆవిడ కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తోంది, “ఆ రోజున నేను దొంగ చేతిలో చచ్చిపోయి ఉంటే ఎంతో బాగుండేది. నేను చెయ్యెత్తి ఒక్కటి కొట్టేసరికే వాడు చచ్చిపోయేడు. నేను చేయి ఎత్తకపోతే నన్ను బెదిరించి వదిలేసి ఉండేవాడు కనీ ఇప్పుడు నేను హంతకురాలినైన నేరం నన్ను చంపుతోంది.”
ఇదంతా మిఖాయిల్ చూశాక గాడ్‌ఫాదర్ అతణ్ణి సీలు వేసిన గదిలోంచి బయటకి తీసుకొచ్చి చెప్పేడు.
“ఆ దొంగ పది మందిని చంపేడు నువ్వు కొట్టక ముందు. ఇదే జీవితంలో వాడు మంచి పనులు చేసి ఆ పది మందినీ చంపిన పాపాలని పరిహారం చేసుకోవాల్సి ఉంది. కానీ వాణ్ణి చంపి ఆ పాపం నువ్వు మూటగట్టుకున్నావు. సీలు వేసిన తలుపు తీస్తే ఎలుగుబంటి దూలాన్ని తోసిన కధే పునరావృత్తమౌతుంది అని చెప్పేను గుర్తుందా? మొదటిసారి ఎలుగుబంటి దూలాన్ని తోసి చిన్న దెబ్బ తగిలించుకుంది. రెండో సారి బలంగా తోసి పిల్లల్ని చంపుకుంది. మూడో సారి మరింత బలంగా తోసి అదే చచ్చిపోయింది. నువ్వు చేసినది కూడా అంతే. ఇప్పుడు నువ్వు కూడగట్టుకున్న పాపాన్ని బయటి ప్రపంచంలోకి వెళ్ళి ప్రక్షాళన చేసుకునే సమయం ఆసన్నమైంది.”
“ఈ పాపం నేనెలా పరిహారం చేసుకోవాలి?” వణుకుతున్న కంఠంతో అడిగేడు మిఖాయిల్.
“నువ్వు సింహాసనం మీద కూర్చుని ఎన్ని తప్పులు చేశావో ఎంత చేటు కలిగించావో దానికి రెట్టింపు మంచి ఈ ప్రపంచంలో చేయగలిగిననాడు నీకు పాపపరిహారం అయినట్టు గుర్తు.”
మిఖాయిల్‌కి మతి పోయినట్టయింది. నోరు పెగిలించుకుని అన్నాడు, “ఇదంతా అసలు సాధ్యమేనా?”
“ఇంట్లోంచి బయటకి వెళ్ళి తిన్నగా నడుస్తూ వెళ్తే ఓ ఊరికి చేరుతావు. అక్కడ జనాన్ని గమనించి నీకు చేతనైనంత సహాయం చేయి. తర్వాత ఓ ముని, ఓ చిన్న గుడిసె కనిపిస్తాయి. ఆ ముని దగ్గిరకెళ్ళి నీ పాపం ఎలా పరిహారం చేసుకోవాలో అడుగు. ఆయన చెప్పినవన్నీ పూర్తి చేస్తే పాపం పరిహారం ఐనట్టే.” మిఖాయిల్‌ని ఇంట్లోంచి బయటకి పంపించేడు గాడ్‌ఫాదర్.
మిఖాయిల్ నడుచుకుంటూ పోయేడు ముందుకి. “ఈ ప్రపంచంలో ఉన్న చెడు వదిలించడం ఎలా? చెడ్డవాళ్ళని జైల్లో పెట్టొచ్చు, దండించవచ్చు. మహా అయితే ఉరి శిక్ష తగునేమో? ఈ పద్ధతులేమీ కాకుండా ప్రపంచంలో చెడు ఎలా వదిలించడం? చెడు వదలకుండా మంచి జరగడం అనేది ఎలా సాధ్యం? తెగని ఆలోచనలే కానీ మిఖాయిల్‌కి కావాల్సిన సమాధానం మాత్రం ఎంత ఆలోచించినా తట్టలేదు. ఆలోచనల్తో నడుస్తూనే ఉన్నాడు.
దార్లో ఓ బాగా పెరిగిన జొన్న చేనులోకి ఓ దూడ వెళ్ళడం కనిపించింది. అక్కడే పనిచేస్తున్న కొంత మంది దూడని అదిలించడానికి బయల్దేరేరు. సగం మంది దాన్ని బయటకి తోలడానికి ప్రయత్నిస్తుంటే మిగతా వాళ్ళు చేను గట్టు మీద నించున్నారు బయటకొచ్చిన దూడని పట్టుకోవడానికి. దూడ చేను లోంచి బయటకొచ్చి గట్టు మీద జనాల్ని చూసి బెదిరిపోయి మళ్ళీ లోపలికే పరుగెడుతోంది. దీని మూలాన చేనంతా తొక్కేయడం అవుతోంది. గట్టుమీద ఉన్న దూడ యజమానురాలు “అయ్యో దూడని చంపేయకండి,” అని అరుస్తోంది. మిఖాయిల్ ఇదంతా చూసి వాళ్ళతో అన్నాడు.
“దూడని అటూ ఇటూ పరుగెట్టించి దాని భయపెడుతున్నారు తప్ప పట్టుకోలేక పోతున్నారు కదా? అందరూ ఓ పక్క నుంచుని ఈ దూడ యజమానురాల్ని పిలవమనండి. అదే సులభంగా బయటకొస్తుంది.”
మిఖాయిల్ ఇలా అనగానే అందరూ ఓ పక్కగా నుంచున్నారు. యజమానురాలు “తువ్వాయ్, ఇలా రామ్మా” అని పిలవగానే దూడ బయటకొచ్చి యజమాని దగ్గిరికి వెళ్ళింది. మిఖాయిల్ ముందుకి కదిలిపోయేడు గాడ్‌ఫాదర్ చెప్పిన మునిని కల్సుకోవడానికి. దారిలో మళ్ళీ ఆలోచనలు, “ఈ దూడ సంగతి అదీ చూస్తే అర్ధమౌతున్నదేమంటే, చెడు మూలాన చెడు ఎక్కువవుకోంది. ఎంత చెడుని తరిమేద్దామన్నా అది మళ్ళీ మళ్ళీ తలెత్తడమే తప్ప వేరు దారి ఉన్నట్టు కనిపించదే? దూడని యజమానురాలు పిలవగానే అది బయటకొచ్చినట్టు చెడుని పిలవడానికి ఏదైనా దారి ఉందా? అదీగాక ఇప్పుడు దూడ యజమాని మాట వింది. ఎప్పుడూ అలా వింటుందని ఏమిటి? అసలు విన్నా అలా చేను లోంచి బయటకి రాకపోతే?” మిఖాయిల్‌కి ఏమీ పాలుపోలేదు. నడక మాత్రం సాగించేడు.
రాత్రి అయ్యేదాకా నడిచి ఓ కుగ్రామం చేరేడు మిఖాయిల్. ఊరి చివరున్న ఇంటావిడ మిఖాయిల్ రాత్రికి అక్కడ ఉండడానికి ఒప్పుకుంది. నడుం వాల్చేక ఇంటావిడ చేస్తున్నది గమనించేడు మిఖాయిల్. ఇల్లంతా తుడుస్తోంది ఆవిడ. అన్నం తినే బల్ల మాత్రం అదే పనిగా తుడిచిందే తుడుస్తోంది కానీ అది మురికి గానే ఉండడం మిఖాయిల్ గమనించేడు. ఆవిడ విసుక్కుంటూంటే మిఖాయిల్ అడిగేడు.
“అమ్మా ఎందుకా విసుగు?”
“ఈ టేబిల్ ఎంత తుడిచినా దీని మురికి పోదే? ఇది ఎప్పటికయ్యేను, నేనెప్పుడు పడుకునేది? విసుగు కాక ఇంకేం చేయమంటావ్ నాయినా?”
“అదే మురికి గుడ్డ వాడి అదే టేబిల్ తుడుస్తున్నారు ఇందాకట్నుండీ, తుడిచిన మట్టే మళ్ళీ అద్దుకుంటోంది కదా? ముందు ఆ గుడ్డని నీళ్ళలో ముంచి కడగండి. తర్వాత తుడిస్తే టేబిల్ శుభ్రంగా కాదూ?”
మర్నాడు పొద్దున్నే ఇంటావిడ దగ్గిర శెలవు తీసుకుని మళ్ళీ ప్రయాణం సాగించేడు మిఖాయిల్. కాసేపటికి కొంతమంది వడ్రంగులు చట్రం తయారు చేయడానికి అవస్థ పడటం కనిపించింది. చట్రానికి కర్ర వంగబెడదామని అది పట్టుకుని ఓ రాయి చుట్టూ తిరుతున్నారు. ఇది చూసి మిఖాయిల్‌కి నవ్వొచ్చింది ఎందుకంటే వీళ్ళందరూ కర్రని పట్టుకుని ఈ రాయి చుట్టూ తిరుగుతూంటే ఆ రాయి కూడా చుట్టూ తిరుగుతోంది. ఇదంతా చూసి మిఖాయిల్ చెప్పేడు.
“ఇలా అయితే మీ పని ఎప్పటికీ కాదు. ఆ రాయి స్థిరంగా కదలకుండా ఉండాలి. అప్పుడు మీ దగ్గిరున్న కర్రని దాని చుట్టూ వంచడం సులభం.”
వాళ్ళని వదిలి నడిచిన కాసేపటికి ఇంకో జనసమూహం దగ్గిరకి వచ్చేడు మిఖాయిల్. ఇక్కడ వీళ్ళు చేసేది మరింత వింతగా ఉంది. ఎండుపుల్లల్తో మంట వేస్తున్నారు చలి కాచుకోవడానికి. కానీ మంట ఇలా అంటుకోగానే పచ్చి కట్టెలు వేయడం వల్ల మంట వెంటనే ఆరిపోతోంది. ఇదే పని చేసినదే చేస్తూ ఒకర్నొకరు చూసుకుంటున్నారు తప్ప ఏమీ ఆలోచిస్తున్నట్టు లేదు. మిఖాయిల్ చెప్పేడు వాళ్ళతో:
“మీకు ఆ పచ్చి కర్రలు కూడా కాలేంత మంట కావాలంటే ముందు ఎండు చితుకులు వేసిన మంట బాగా పెరిగి పెద్దదయ్యేలా ఉండాలి. అది అలా పెరిగే వరకూ ఆగండి. మంట పెద్దయ్యేక ఏం వేసినా కాలుతుంది.”
ఇలా చూసినవన్నీ నెమరు వేసుకుంటూ నడిచి నడిచి మిఖాయిల్ ముని ఉండే గుడిసె దగ్గిరకొచ్చేడు. తలుపు కొట్టగానే ముసలాయన బయటకొచ్చి అడిగేడు.
“ఎవరు నువ్వు, ఏం కావాలి?”
“నేనో పాపాత్ముణ్ణి”
మిఖాయిల్ మొత్తం జరిగిన కధంతా చెప్పేడు ముసలాయనకి. మొదట గాడ్‌ఫాదర్ ఎలా కనబడ్డాడు, ఆయన్ని కల్సుకోవడం, ఎలుగుబంటి కధ, తర్వాత గాడ్‌ఫాదర్ తెరవ వద్దన్న తలుపు తీయడం దగ్గిర్నుంచి చివర్లో ఎండు చితుకుల మంట ఎలా ఆరిపోతోందో, తాను వాళ్ళందరికీ ఎలా సహాయం చేశాడో అన్నీ చెప్పుకొచ్చేడు మిఖాయిల్. ముసలాయన తలాడించి ఊరుకున్నాక మిఖాయిల్ అడిగేడు చివరిగా.
“ప్రపంచంలో చెడన్నది ఉందని మనందరికీ తెల్సినదే. అయితే దాన్ని సమాజం లోంచి ఎలా తీసివేయడం అనేది మాత్రం ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కావట్లేదు. ఇటువంటప్పుడు గాడ్‌ఫాదర్ చెప్పినట్టూ నా పాపాలకి ప్రక్షాళన చేసుకోవడం ఎలా?”
ముని గుడిసె లోంచి బయటకొచ్చి మిఖాయిల్‌ని అడివి లోకి తీసుకెళ్ళి ఓ చెట్టును పడగొట్టించేడు. అది పడ్డాక దాన్ని మూడు ముక్కలుగా చేయించి కాల్పించేడు నిప్పుల మీద. అవి కాలిపోయి బొగ్గుముక్కల్లాగా అయ్యేక చెప్పేడు ముని.
“ఇవి సగం లోతుగా ఇక్కడ పాతిపెట్టు. రోజూ నోటితో నీళ్ళు ఆ పక్కనున్న వాగులోంచి తీసుకొచ్చి వీటిని తడుపుతూ ఉండు. నీకిదే పని. ఎప్పుడైతే ఈ మూడూ పూర్తిగా ఆకులు వేసి మళ్ళీ మొలవడం మొదలు పెడతాయో అప్పుడు నీకు పాప ప్రక్షాళన అయినట్టు.”
గాడ్‌ఫాదర్ చెప్పినది పాప ప్రక్షాళన చేసుకోమని కదా? ఈ కాల్చిన కర్రముక్కల్ని రోజూ నీళ్ళు పెట్టి తడుపుతూ ఉంటే అది తన పాపాలని ఎలా ప్రక్షాళన చేస్తుందో, ఎందుకలా చేయాలో మిఖాయిల్‌కి అర్ధం కాలేదు. అడుగుదామని పక్కకి చూస్తే ముని వెనక్కి గుడిసె లోకి వెళ్ళిపోతున్నాడు. సరే ఏదైతే అదే అవుతుంది వీళ్ళిద్దరూ ఇలా చేయమన్నారు కదా అనుకుని మిఖాయిల్ అప్పటినుంచే నోటితో నీళ్ళు తీసుకొచ్చి పాతిన కర్రల్ని తడపడం మొదలు పెట్టేడు. కాసేపటికి ఆకలి వేసింది. ముని దగ్గిరేదో ఉండవచ్చు తినడానికి అనుకుని గుడిసె కేసి బయల్దేరేడు మిఖాయిల్. తలుపు ఎంత తట్టినా తీయకపోయేసరికి తోసి చూసేడు. అక్కడున్న మంచంమీద ముని పడుకుని ఉన్నాడు. ఒంట్లో చలనం ఉన్నట్టు లేదు. దగ్గిరకెళ్ళి చూసేసరికి తెల్సింది – ఆయన ప్రాణం ఎప్పుడో పోయినట్టుంది.
గుడిసెలో కనబడిన ఏదో ఒకటి తిని ఆకలి చల్లారేక ముసలాయన్ని పూడ్చడానికో గొయ్యి తవ్వడం మొదలుపెట్టేడు మిఖాయిల్. రోజు పొద్దంతా తవ్వడం, రాత్రి కాల్చిన కర్రలకి నీళ్ళు పోయడం చేసేక మర్నాడు కింద ఊర్లోంచి కొంతమంది జనం మునిని చూడ్డానికొచ్చేరు. జరిగినదంతా విని మునిని ఖననం చేయడానికి సహాయం చేసేరు జనం అందరూ తలో చేయి వేసి. వెళ్ళిపోయే ముందు చెప్పేరు, “ఈ తినే పదార్థాలన్నీ మేము ముని కోసం తీసుకొస్తూ ఉంటాం. ఆయన పోయి మీకు ఆశీర్వాదం ఇచ్చాడు కనక ఇప్పట్నుంచీ మీకు ఇస్తాం. రోజూ రాలేము కానీ వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒకటి పట్టుకొస్తాం.”
మిఖాయిల్ అలా పాత ముని స్థానంలో గుడిసెలో ఉండటానికి అలవాటు పడ్డాడు. అప్పుడప్పుడూ వచ్చే ఊరి జనాభా మిఖాయిల్‌కి తినడానికేదో పట్టుకొస్తున్నారు. ఇలా కొండ మీదకి ఓ కొత్త ముని వచ్చాడనీ, పాప ప్రక్షాళన కోసం కాలిపోయిన కర్రలని నోటితో నీరు తీసుకొచ్చి తడుపుతూంటాడనీ అందరికీ తెలియవచ్చింది తొందర్లోనే. అప్పటునుంచీ ధనవంతులందరూ మిఖాయిల్ కోసం బహుమతులూ అవీ పట్టుకురావడం మొదలైంది.
ఓ రెండేళ్ళు గడిచాయి. ఈ కర్రల్ని తడపడమే తప్ప ప్రపంచంలో చెడు తొలగించడం ఎలా అనే ప్రశ్నకి మిఖాయిల్‌కి కావాల్సిన సమాధానాలు దొరికేయి కాదు. ఇన్ని రోజులూ మిఖాయిల్ మాత్రం రోజు తప్పకుండా కర్రల్ని నీళ్ళతో తడుపుతూనే ఉన్నాడు ముని చెప్పినట్టు.
ఓ రోజు గుడిసె బయట ఏదో శబ్దం అయితే బయటకొచ్చి చూసేడు మిఖాయిల్. ఎవరో గుర్రం మీద వెళ్తూ ఆనందంగా పాట పాడుతున్నాడు.
“ఎవరోయ్ నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావ్? బాగా సంతోషంగా ఉన్నట్టున్నావే?” మిఖాయిల్ ఆరా తీసేడు.
“నేనో దొంగని. ఇలా దారి కాసి ప్రయాణీకుల్ని చంపి వాళ్ళని దోచుకుంటూ ఉంటాను. ఎంత ఎక్కువ మందిని చంపితే ఆ రోజు అంత ఆనందం,” చెప్పేడు ఆగంతకుడు గుర్రం మీదనుంచే.
మిఖాయిల్‌కి మూర్ఛ వచ్చినట్టయింది. “నేనేమో పాప ప్రక్షాళన కోసం నా పని చేసుకుంటూంటే వీడెక్కడ దాపురించేడు? ఇప్పుడు వీడీ చుట్టు పక్కల తిరుగుతున్నట్టు తెలిస్తే ఊర్లో ప్రజలు రావడం మానేస్తారు. అయినా ఇంతటి దుర్మార్గుడిలో చెడు పోగొట్టడం ఎలా?” ఇదంతా ఆలోచించి చెప్పేడు మిఖాయిల్.
“నీ లాంటివాడు ఇక్కడకి రాకూడదు. ఇక్కడకి జనం వస్తూ ఉంటారు. భగవంతుడంటే భయం భక్తీ వున్న వాళ్ళందరూను. నువ్వేమో చూడబోతే జనాల్ని చంపుతానంటున్నావ్. ఇక్కడ్నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడూ ఇటువైపు రావొద్దు. ఇంకా వీలుంటే నువ్వు చేసే పనులకి పశ్చాత్తాపం తెచ్చుకుని ఆ పనులు మానేసి భగవంతుణ్ణి శరణు కోరుకుంటే ఆయన కరుణిస్తాడు.”
దొంగ పగలబడి నవ్వేడు ఇది విని, “నువ్వెవడివోయ్ చెప్పడానికి? నాకు భగవంతుడంటే భయం లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా. నేను వయసులో ఉన్నాను. ఇప్పుడు నాకు భగవంతుడెందుకూ? నీ దగ్గిరకొచ్చే పళ్ళూడిన ముసిలి పీనుగులకి చెప్పుకో ఈ పాఠాలన్నీ. మనందరం ఎలాగోలా బతకాలి కదా? నేను నీలాగా ఎవరో పట్టుకొచ్చి ఇచ్చే దానధర్మాల మీద బతికేవాణ్ణి కాదు. భగవంతుడూ, భయం, భక్తీ అని నాకు జ్ఞాపకం చేసినందుకూ ఈ రోజు మరో ఇద్దర్ని చంపబోతున్నాను నేను; చూసుకో. నీ దారి నీదీ, నా దారి నాదీను. మళ్ళీ ఎప్పుడు ఉచిత సలహాలు పారేయకు. ఇలా చెప్పినందుకు నిన్ను చంపి పారేసేవాణ్ణి కానీ మొదటి సారి అని వదిలేస్తున్నా. జాగ్రత్త,” దొంగ వెళ్ళిపోయేడు.
మర్నాటినుంచీ మళ్ళీ దొంగ వస్తాడేమో అని మిఖాయిల్ బెదురుతూనే గడిపేడు. ఇలా ఇంకో ఎనిమిదేళ్ళు గడిచేయి. ఈ ఎనిమిదేళ్ళూ మిఖాయిల్ తన దగ్గిరకొచ్చే జనం పట్టుకొచ్చిన తిండి తింటూ నోటితో నీళ్ళు తెచ్చి మొక్కలకి పోస్తూనే ఉన్నాడు. బొగ్గు ముక్కలు చిగురించిన దాఖలాలు లేవు. ఓ రోజు ఎప్పాట్లాగే మొక్కలకి నీళ్ళు పోసి ఎవరైనా వస్తారేమో ఊర్లోంచి అని చాలా సేపు చూసేడు మిఖాయిల్. ఆలోచనల్లో చటుక్కున గుర్తొచ్చింది, దొంగ తనని దానధర్మాల మీద ఆధారపడి బతుకుతున్నాడని అనడం. మనసులో ఎక్కడో ముల్లు గుచ్చుకున్నట్టూ వాడు చెప్పింది నిజమేనన్నట్టూ అనిపించింది. ఇప్పటిదాకా జరిగిన జీవితం గుర్తు తెచ్చుకుంటే, తాను మొదట వచ్చినప్పుడు ముని ఎలా బతకమని చెప్పాడో అలా బతుకుతున్నాడా? ఆయన చెప్పింది ఇలా బతకమనేనా? మొక్కల్ని తడపడమే తపస్సుగా బతకమని చెప్పేడు ఆయన. కానీ ఇప్పుడు తాను చేస్తున్నదేమిటీ? జనం కోసం ఎదురు చూడ్డం అలవాటైపోయింది. వాళ్ళొస్తే సంతోషమూ రాకపోతే తనని పట్టించుకోవట్లేదని ఏడుపూనా? ముని బతకమని చెప్పింది ఇలా కాదే? ఈ జనం అందరూ వస్తూంటే తానో గొప్పవాణ్ణని అహంకారం ఒకటి బయల్దేరింది ఇప్పుడు. ఇదంతా చూస్తే పాపాల ప్రక్షాళన కోసం వచ్చి కొత్త పాపాలు మూటగట్టుకుంటున్నాను తప్ప పాతవి అలాగే ఉన్నట్టున్నాయే?
ఓ నిర్ణయం తీసుకున్నవాడిలా లేచి అడవిలో పక్కనే ఉన్న ఎవరూ రాని లోయలోకి, జనం మధ్య నుంచి దూరంగా వెళ్ళిపోడానికి మిఖాయిల్ నడవడం మొదలుపెట్టేడు. కాసేపు నడవగానే ఎనిమిదేళ్ళ క్రితం మొదటిసారి కనిపించిన దొంగ మళ్ళీ గుర్రం మీద ఎదురయ్యేడు.
“ఎక్కడికి వెళ్తున్నావ్?” దొంగే అడిగేడు మాట కలుపుతూ.
మిఖాయిల్, తనని ముని ఎలా బతకమన్నాడో, కాని తాని చెప్పినదానికి విరుద్ధంగా ఎలా బతికాడో, ఈ జనాల్ని తప్పించుకోవడానికి దూరంగా పోతున్నట్టూ అన్నీ చెప్పేడు. దొంగ ఆశ్చర్యపోయిన మొహంతో అడిగేడు.
“ఇప్పటిదాకా జనం పట్టుకొచ్చే తిండి వల్ల నీకు గడిచిపోయింది. ఇప్పట్నుంచి ఎలా బతుకుతావ్?”
“అంత దూరం ఆలోచించలేదు. పాప ప్రక్షాళన కోసం వెళ్తూంటే భగవంతుడేదో సాయం చేయడా?”
దొంగ ఇది విని ఏమీ అనకుండా సాలోచనగా గుర్రాన్ని కదిలించి ముందుకి సాగిపోయేడు. వాడు వెళ్తూంటే మిఖాయిల్‌ని ఆలోచనలు చుట్టుముట్టేయి, “దొంగతో వాడి జీవితం మార్చుకోమనీ, మనుషుల్ని చంపవద్దనీ ఎందుకు చెప్పలేకపోయేడు తాను? వీడు క్రితం సారి కనపడినంత కోపంగా లేడే? అయినా తాను ఎందుకు నోరు మెదపలేకపోయేడు?” ఈ ఆలోచన రాగానే చటుక్కున వెనక్కి తిరిగి అరిచేడు మిఖాయిల్, “ఇప్పటికైనా సరే నువ్వు మారాలి. చేసిన హత్యలకీ, పాపాలకీ పశ్చాత్తాపం, ప్రక్షాళన చేసుకోపోతే భగవంతుడు ఊరుకోడు.”
దొంగ తక్కువ తిన్నాడా? ఇది విని వాడూ దూరం నించే చేతిలో చురకత్తి ఝుళిపిస్తూ అరిచి చెప్పేడు, “నా గురించి పట్టించుకోవద్దని ముందోసారి చెప్పేను. ఇది రెండో సారి నీకు ఇచ్చే హెచ్చరిక. మళ్ళీ నా దారిలో కనిపించావంటే నిన్ను చంపి తీరుతా.”
మిఖాయిల్‌కి భయం వేసింది ఈ దొంగ అన్నంతపనీ చేస్తాడేమో అని. పరుగెట్టుకుంటూ లోయలోకి పారిపోయేడు దొంగ నుంచి దూరంగా. ఆ రోజు రాత్రి మళ్ళీ మొక్కలకి నీళ్ళు పోయడానికి వెళ్ళేసరికి మూడిట్లో ఒక మొక్క చిగురించడం మిఖాయిల్‌కి కనిపించింది.
మిఖాయిల్ మకాం లోయలోకి మార్చాక ఇప్పుడు పొద్దస్తమానం జనాల దగ్గిర్నుంచి దూరంగా ఉండడం, రాత్రి మొక్కలకి నీళ్ళుపోయడం దినచర్యగా మారింది. కొన్ని రోజులుకి తన దగ్గిరున్న తిండి అంతా అయిపోయేక మిఖాయిల్ ఏవైనా దుంపలూ, పళ్ళూ దొరుకుతాయేమోనని వెదకడానికి అడివి లోకి బయల్దేరేడు. కాసేపు గడిచేసరికి ఓ చెట్టు మీద వేలాడుతూ రొట్టె కనిపించింది. అది తీసుకుని మళ్ళీ లోయలోకి వెళ్ళిపోయేడు. రొట్టె అయిపోగానే మళ్ళీ మిఖాయిల్ బయల్దేరడం, మళ్ళీ అదే చెట్టుమీద రొట్టె కనిపించడం సాధారణంగా జరిగేది. జీవితం గడిచిపోతోంది. ఇప్పుడున్న నిజమైన భయం ఒక్కటే. ఈ దొంగ గానీ మళ్ళీ కనబడితే తాను పాపాలన్నీ ప్రక్షాళన చేసుకునే లోపల చంపేస్తాడేమో? ఈ భయం తోటే ఇంకో పదేళ్ళు గడిచేయి. ఈ పదేళ్ళలోనూ ఒక్క మొక్కే మొలిచి చిగురించింది. మిగతా రెండూ ఎప్పటికి చిగురించేను?
ఓ రోజు మొక్కలకి నీళ్ళు పోసి వస్తూ దారిలో నీరసంగా కూలబడ్డాడు మిఖాయిల్. వయసైపోతోందా? తన పాప ప్రక్షాళన ఈ జీవితంలో జరిగేనా? ఆలోచనలు చుట్టుముడుతూండగా ఒక్కసారి మిఖాయిల్‌కి తెలిసి వచ్చింది – ఈ పదేళ్ళూ తాను చావుభయంతో బతికేడు, దొంగ తనని చంపేస్తాడేమో అని. ఇదా తాను చేసుకుంటున్న పాప ప్రక్షాళన? ఛీ, ఛీ! చావు బతుకులు భగవంతుడి చేతుల్లో కదా ఉండేది? భగవంతుడి ఆజ్ఞ లేకపోతే ఈ దొంగ తనని ఏం చేయగలడు? ఎంత పిరికివాడిలా బతికేడు ఇప్పటి దాకా? మిఖాయిల్ ఆలోచనలు సాగుతూండగానే దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. మిఖాయిల్ ధైర్యంగా లేచి దొంగని కల్సుకోవడానికి ముందుకెళ్ళేడు.
వచ్చే దొంగ కూడా ఇంకో కుర్రాడు కనిపించేడు. కుర్రాడి చేతులూ కాళ్ళూ కట్టేసి ఉన్నాయ్. గుర్రం మీదనుండి వేలాడుతున్నాడు. మిఖాయిల్ గుర్రం వెళ్ళే దారికడ్డంగా నుంచుని, “ఈ కుర్రాడెవరు? ఎందుకలా తీసుకెళ్తున్నావ్? ఎక్కడికి వెళ్ళేది?” గద్దించి అడిగేడు.
“అడవిలోకోయ్ వెర్రిమొహమా. ఈ కుర్రాడు ఊళ్ళో ధవంతుడి కొడుకు. వీడి నాన్న డబ్బులన్నీ ఎక్కడో దాచేడు. ఎక్కడున్నాయో చెప్పమంటే నోరు విప్పడే? అలా అడివి లోకి తీసుకెళ్ళి కాలో చెయ్యో తీసేస్తే వాడే చెప్తాడు సమాధానం. తప్పుకో, ఉత్తినే నా పనికి అడ్డం రాకు.”
మిఖాయిల్ గుర్రం దగ్గిరకెళ్ళి దాని కళ్ళెం పట్టుకుని చెప్పేడు స్థిరంగా, “ఈ కుర్రాణ్ణి వదుల్తావా లేదా?”
దొంగ కాస్త ఆశ్చర్యపోయేడు మిఖాయిల్ చూపించిన తెగువకి. కత్తి బయటకి తీసి అరుస్తూ చెప్పేడు, “కుర్రాడి సంగతి కాదు గానీ, ఇప్పుడు గుర్రాన్ని ముందుకెళ్ళనీయకపోతే నీకు ఈ కత్తి రుచి చూపించాల్సి వస్తుంది. తప్పుకో పక్కకి.”
మిఖాయిల్ అక్కడే నుంచుని మరింత ధృఢంగా అన్నాడు, “నీకూ, నీ కత్తికి బెదిరే వాణ్ణి కాదు. ఆ కుర్రాణ్ణి మర్యాదగా పోనీయ్. నన్ను చంపాలని ఉంటే ఇదే సమయం. కానీ కుర్రాణ్ణి ముందుకి తీసుకెళ్ళాలంటే నా శవం మీదనుంచే. నేను బతికున్నంతవరకూ ఈ కుర్రాణ్ణి ముందుకి తీసుకెళ్ళనిచ్చేది లేదు.”
వయసు మళ్ళిందనో మరోటో కానీ దొంగ మిఖాయిల్ మీద చేయి చేసుకోలేక పోయేడు. కాసేపు ఈ అరుపులూ కేకలూ అయ్యేక కత్తితో కుర్రాడి కట్లు అన్నీ తెంపి చెప్పేడు. “పోండి. మీరిద్దరూ నా పనికి అడ్డం. ఈ సారికి ఊరుకుంటున్నాను.” కుర్రాడు పరుగెట్టుకుంటూ ఊర్లోకి పోయేడు. మిఖాయిల్ అక్కడే నుంచుని చెప్పేడు దొంగతో, “ఇప్పటికైనా బుద్ధి మార్చుకో లేకపోతే నీ పాపాలకి సరైన శిక్షపడే రోజు దగ్గిర్లోనే ఉంది.”
దొంగ ఈ సారికి మాత్రం ఏమీ బదులివ్వకుండా ముందుకెళ్ళిపోయేడు. ఆ మర్నాడు మిఖాయిల్ మొక్కలకి నీళ్ళు పోయడానికి వెళ్ళేసరికి రెండో కర్ర చిగురించడం కనిపించింది. ఇంక మిగిలినది ఒక్కటే. అది కూడా చిగురిస్తే మిఖాయిల్ ప్రక్షాళన పూర్తయినట్టే!
మరో పదేళ్ళు గడిచాయి. ఈ సరికి మిఖాయిల్ మనసులో కోరికలూ, భయం లాంటివన్నీ పోయేయి. ఒక్కొక్కటిగా వదిలించుకున్న కోరికలూ అన్నీ పోయేక మనసులో సంతోషంగా అనిపించడం మొదలైంది. ఈ సంతోషం ఏదో సంపాదించడం వల్ల వచ్చింది కాదు, అన్నీ వదులుకోవడం వల్ల వచ్చింది. భావ, మనో దారిద్రాలన్నీ వదిలేక వచ్చిన పూర్తి సంతోషం. ఎప్పటికీ తరగిపోని సంతోషం. భగవంతుడింతటి సంతోషాన్ని సొంతంగా సంపాదించుకోమని ప్రజలని సృష్టిస్తే ఏం చేస్తున్నాం? ఏదో దొరకలేదనీ, ఇది లేదనీ అది లేదనీ వెంపర్లాడుతూ ఉన్న సంతోషాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇదే సత్య దర్శనం! ఇదే సత్య దర్శనం!!
ఇలా ఆలోచిస్తూ మిఖాయిల్ తాను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ చెప్పడానికి బయల్దేరాడు. దారిలోనే కనిపించేడు దొంగ. ఈ సారి అతని వాలకం బొత్తిగా బావోలేదు. కళ్ళు దించుకుని ఏదో పెద్ద తప్పు చేసినవాడిలా ఉన్నాడు. మిఖాయిల్ దొంగని చూసి ఏదో అందామనుకుని, “పోనీయ్, వీడితో మాట్లాడి ఏమీ ప్రయోజనం లేదు. నేను చెప్పే సత్య దర్శనం గురించి వీడికెక్కడ అర్ధమౌతుంది?” అనుకుంటూ, దొంగ కేసి చూడకుండా ముందుకి కదిలిపోయేడు.
రెండడుగులు వేయగానే మిఖాయిల్ మనసు చివుక్కుమంది. తాను పొందిన ఇంతటి సంతోషం పొందడానికి అందరూ అర్హులైనప్పటికీ తానెందుకు దొంగని మార్చలేకపోతున్నాడు. మంచి పని వీడితోనే మొదలు పెట్టవచ్చు కదా? ఇలా అనిపించగానే మిఖాయిల్ చెప్పేడు దొంగతో, “తమ్ముడూ, ఈ సారైనా నేను చెప్పేది విను. నీ జీవితం అంతా ఇలాగే జనాల్ని చంపుతావా? పాపం మీద పాపం మూటగట్టుకుంటూ ఎన్నాళ్ళిలా? ఓ సారి ఆలోచించు. నువ్వింత క్రూరంగా బతుకుతున్నా సరే భగవంతుడెంత దయామయుడో చూడు, నీకు కావాల్సిన డబ్బూ తిండీ అన్నీ సమకూరుస్తున్నాడు కదా?”
దొంగ చెప్పేడు శాంతంగా, “నన్నిలా వదిలేయండి,” అని.
మిఖాయిల్ ఈ సారి గుర్రం దగ్గిరకి వెళ్ళి దాన్ని కదలకుండా కళ్ళెం పట్టుకుని చెప్పేడు, “ఎప్పటికైనా నువ్వు మారాలని నీకూ తెల్సు. ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టకూడదు? నాకు సంతోషంగా ఎలా ఉండాలో పాప ప్రక్షాళన ఎలాగో ప్రత్యక్షంగా తెలిసింది. డబ్బూ దస్కం కూడబెట్టుకుంటే వచ్చేది కాదిది. నీకు కూడా నేర్పుతా. రా, ఈ పాప పంకిలం లోంచి బయటకొచ్చే దారి నీ ముందు సిద్ధంగా ఉంది…” మాట తడబడుతోంటే మిఖాయిల్ ఆగేడు.
దొంగ మిఖాయిల్ కేసి చూసేడు. మిఖాయిల్ కళ్ళలోంచి నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి. తోటి మానవులని నిర్దాక్షిణ్యంగా చంపుతూన్న తన మీద ఇంతటి దయ ఎవరికైనా ఎలా సాధ్యం? సత్య దర్శనం అయితే ఇలా ఉంటుందా? ఒక్కసారి కదిలిపోయి గుర్రం దిగేడు దొంగ, కాళ్ళు వణుకుతూంటే కింద కూలబడిపోయి చెప్పేడు, “ఇరవై ఏళ్ళు మిమ్మల్ని పట్టిచుకోకుండా ఉందామనుకున్నాను. కానీ ఈ రోజు మీరు నన్నూ, నేను చేసే పాపాలనీ చూసి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటే తెలిసి వచ్చింది. మొదట్లో మీరు జనాల్ని వదిలేసి వెళ్తూంటే ఎలా బతుకుతారని అడిగేని కదా? భగవంతుడే ఏదో దారి చూపిస్తాడని అన్నప్పుడు మీ కోరికలన్నీ పోతున్నట్టు నా కర్ధమైంది. అప్పటినుంచే ఎవరికీ తెలియకుండా రోజూ చెట్టు మీద రొట్టె ఉంచేవాడ్ని మీ కోసం…”
మిఖాయిల్‌కి తానిక్కడకి వచ్చే ముందు ఇంటావిడ టేబిల్ తుడవడం గుర్తొచ్చింది. గుడ్డ ముందు పూర్తిగా శుభ్రంగా ఉన్నప్పుడే టేబిల్ కూడా పూర్తిగా శుభ్రం చేయడం సాధ్యం. అలాగే తనకి పూర్తిగా ప్రక్షాళన అయితే గానీ తాని మిగతా వాళ్ళకి చెప్పడానికి తగడు.
“…ఎప్పుడైతే ధనవంతుడి కుర్రాణ్ణి – మిమ్మల్ని చంపుతానని బెదిరించినా సరే – వదలమన్నారో ఆ రోజు నేను మరికాస్త మెత్తబడ్డాను. శిలలాంటి నా మనస్సు మీ మూలాన ఈ రోజు పూర్తిగా కరగడం మొదలైంది…”
మిఖాయిల్‌కి తర్వాత జరిగిన సంఘటన గుర్తొచ్చింది. చట్రం బిగించే ముందు అక్కడున్న రాయి స్థిరంగా ఉండాలి. తనకి మృత్యు భయం ఉన్నంతవరకూ బొంగరం లాగా అలా చట్రం కోసం అవస్థ పడుతున్న వడ్రంగుల లాగా తిరగడమే అయింది తన బతుకు. ఒక్కసారి ఆ మృత్యు భయం పోగానే తనకి సత్య దర్శనంలో ముందుకెళ్ళడానికి దారి సుగమమైంది. అప్పుడే దొంగ మెత్తబడటం మొదలు పెట్టాడు కూడా. భావ దారిద్రం, భయాలు అన్నీ పోగొట్టుకుని స్థిరంగా ఉండగలిగినప్పుడే ముందుకెళ్ళడం సాధ్యమైంది.
“… అయినా నా మనసు పూర్తిగా కరగలేదు. కానీ ఇప్పుడు నన్ను చూసి మీ కళ్ళమ్మట నీళ్ళు కారుతూంటే ఇంక నేను ఆగలేకపోయేను. ఎంతో కర్కోటకుణ్ణి అయిన నన్ను మీరు మార్చగలిగేరు. చెప్పండి, పాప ప్రక్షాళణ కోసం ఏం చేయాలి నేను?”
మిఖాయిల్ దొంగతో పాటూ తాను రోజూ నీరు పోసే మొక్కల దగ్గిరకి వెళ్ళేడు. అద్భుతం, మూడో కర్ర కూడా చిగురిస్తోంది అప్పుడే! మిఖాయిల్‌కి అప్పుడు తాను ఆఖరి సారిగా చూసినది గుర్తొచ్చింది. మంట బాగా పెద్దదవకుండా పచ్చి కట్టెలు వేస్తే ఏమైందో. మంట పూర్తిగా పెద్దదయ్యాక ఎటువంటి కర్రనైనా మండించగలదు కానీ ముందే పచ్చి కట్టెలు వేస్తే వెలిగించిన మంట కూడా ఆరిపోతుంది. అలాగే సత్య దర్శనం అయిన మనిషే ఇంకో మనిషికి దారి చూపించగలడు కానీ అది అవకుండా ఏదో సాధిద్దామనుకుంటే వృధా ప్రయాసే.
మిఖాయిల్ తాను నేర్చుకున్నదంతా దొంగకి – ఏళ్ళ క్రితం తాను ఇక్కడికి వచ్చినప్పుడు ముని తనకి చెప్పినట్టే – చెప్పేడు. మర్నాడు దొంగకి క్రితం రోజు రాత్రే ప్రాణం విడిచిన మిఖాయిల్ పార్ధివదేహం కనిపించింది. మొహంలో సత్య దర్శనాంతపు దేదీప్యమైన వెలుగు మాత్రం వాడకుండా అలానే ఉంది.
(మూలం: The Godson, 1886.)