శిక్ష ఖరీదు

మొనాకో రాజ్యం చిన్నదే గానీ రాజూ, సైన్యం, మంత్రులూ అన్నీ ఉన్నదే. అటు ఫ్రాన్సూ, ఇటు ఇటలీ ఉన్నా ఏమీ యుద్ధాలూ, ఎవరితోనూ జగడాలూ లేని దేశం. రాజ్యం అంతా సుభిక్షం కాదు కానీ ప్రజలకి తినడానికీ పని చేసుకోవడానికీ లోటు లేదు. అయితే సైన్యాన్ని పోషించడానికి కావాల్సిన డబ్బుల దగ్గిరే చిక్కంతా. కొత్త పన్నులు వేసే పరిస్థితి లేదు. ఇప్పటికే ఉన్న పన్నుల్లో ఏదీ పెంచడం కుదరదు. ఇటు నుయ్యీ అటు గొయ్యీలా ఉంది పరిస్థితి. సైన్యాన్ని పూర్తిగా రద్దు చేస్తే తర్వాత ఎవరొచ్చి ఆక్రమించుకున్నా దేశం ఉనికే పోయే ప్రమాదం.

సభ జరుగుతోంది. చర్చకి వచ్చిన సంగతి అందరికీ తెల్సిందే. సైన్యాన్ని పోషించడానికీ, రాజునీ, మంత్రులనీ ఆ కుర్చీలలో కొనసాగించడానికీ ఖర్చుకి సరిపడా డబ్బు, పన్నులు పెంచకుండా, కొత్త పన్నులు వేయకుండా ఎలా రాబట్టుకోవటం?

కూర్చున్న మంత్రులూ, రాజూ ఎంత కిందా మీదా పడినా సరైన మార్గం దొరకనప్పుడు ఓ పెద్దాయన సభలో చేయెత్తేడు – మాట్లాడ్డానికి కాబోలు. రాజూ, మంత్రీ, సైన్యాధికారీ అటువేపు చూసేరు కుతూహలంగా. పెద్దాయన లేచి నిలబడి చెప్పేడు:

“అక్కడ ఫ్రాన్సులోనూ, ఇటు ఇటలీలోనూ జూదం ఆడడం నేరం. ఎవరైనా ఊళ్ళో ఇంట్లోంచి బయటకొచ్చి సరదాగా పేక ముక్కలో లేకపోతే ఇంకో ఆటో ఆడి పందెం కాయడం రెండు దేశాల్లోనూ ఒప్పుకోరు. మనం ఈ రెండింటి మధ్యలో ఉన్నాం. ఈ రెండు దేశాల ప్రజలకీ ఇక్కడకి రావడానికి మహా అయితే గంట ప్రయాణం. మనం ఈ జనాలకి సరదాగా జూదం ఆడ్డానికి ఏదైనా ఓ దారి చూపించామంటే వాళ్ళొచ్చినప్పుడు ఒకటో రెండో ఫ్రాంకులు పన్ను వేసి డబ్బులు రాబట్టొచ్చు.”

“అదంత సులువా?” మంత్రి అడిగేడు.

“సులువు కాకపోవచ్చు. కానీ ప్రయత్నం చేస్తే తప్పు లేదుగా? ఓ ఇల్లు తీసుకుందాం అద్దెకి. అందులో రకరకాల ఆటలు పెడదాం. ఒక్కో ఆటకి ఇంత రుసుము. ఆ రుసుములో ఇంత పన్ను అని వసూలు చేయొచ్చు.”

“ఈ ఇంట్లో డబ్బులు పోయినవాళ్ళూ నెగ్గిన వాళ్ళూ దెబ్బలాటల్తో కొట్టుకు ఛస్తే మనకో తలనెప్పి కాదూ?”

“అలా జరక్కుండా మన సైన్యం చూడలేదా? ఇప్పుడు మొత్తం సైన్యంలో అరవై మందికీ పనీ పాటా లేదు కదా?”

సైన్యాధికారి కొంచెం ఇబ్బందిగా కదిలేడు ఈ మాట విని. లేచి ఏదో చెప్పబోయేడు కానీ రాజు వారించేడు నవ్వుతూ. కాసేపు వాదోపవాదాలయ్యేక రాజు చెప్పేడు:

“ఈ సంగతి బాగా ఆలోచించతగ్గదే. కానీ ఒక్కసారి ఇలా మన దేశాన్ని ఆ రెండు దేశాల ప్రజలు డబ్బులు తగలేయడానికి వాడుకుంటున్నారని తెలిస్తే ఆ రెండు దేశాలూ ఊరుకుంటాయా?”

“ఊరుకోకపోతే ఉరేసుకుంటారు మనకేల? వాళ్ళు జూదం ఒప్పుకోరు. దానిమీదొచ్చే పన్నులు వాళ్ళకక్కర్లేదు కాబోలు. మనం సంపాదించుకుంటాం. ఉత్తరోత్తరా వాళ్ళే ఇలాంటివి మొదలెడితే అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి మనకి కావాల్సింది డబ్బు,” ఈ ఆలోచన అప్పటికే బాగా నచ్చేసిన మంత్రి చెప్పేడు.

వెంఠవెంఠనే ఈ ఆటలకీ, జూద గృహాలకీ సన్నాహాలు తయారైపోయేయి. ఒక్కో ఆటకి ఇంత రుసుము, మందు కొడితే ఇంత, సిగరేట్ కాలిస్తే ఇంకొంత, ఇలా పన్నులు వేయడానికి సిద్ధం అయిపోయేరు రాజోద్యోగులు. మొనాకోలో ఇలా జూదం ఆడుకోవచ్చనీ రెండో మూడో ఫ్రాంకులు పన్ను కడితే చాలనీ సమాచారం అందించేరు అటు ఇటలీలోనూ, ఇటు ఫ్రాన్సులోనూ. ఆ వార్త దావానలంలా వ్యాపించింది. ఒక్కసారిగా మొనాకో రాజు ధనవంతుడైపోయేడు. ఇప్పుడు రాజోద్యోగులకున్న పని ఒక్కటే. ఎక్కడా గొడవలు జరక్కుండా చూడ్డం, ప్రశాంతంగా పన్నులు రాబట్టుకోవడం. యుద్ధాలు ఎలాగా లేవు కనక ఉన్న సైన్యం ఈ జూద గృహాల్ని చూడ్డానికి అలవాటు పడిపోయింది.

ఇటలీకి గానీ ఫ్రాన్సుకి గానీ పట్టలేదు వాళ్ళ ప్రజలందరూ ఇలా మొనాకో వచ్చి డబ్బులు తగలేస్తున్నందుకూ, తాగి తందనాలాడుతున్నందుకూ. తమ సొంత దేశంలో తాగి తందనాలాడనంతవరకూ వాళ్ళకేం అభ్యంతరం ఉన్నట్టు లేదు. చీమ తలకాయంత ఈ మొనాకోని ఆక్రమించుకుంటే ఈ రెండు దేశాలకీ వచ్చిందీ పోయిందీ ఏమీ లేదు పెద్దగా. ఈ కారణాల చేత ఆ రెండు దేశాలు పట్టీపట్టినట్టు ఊరుకున్నాయ్. జనం మొనాకో వస్తూనే ఉన్నారు, డబ్బులు తగలేస్తూనే ఉన్నారు. మొనాకో రాజు రోజు రోజుకీ వచ్చే జనాలమీద కొత్తకొత్త పన్నులు వేస్తూ సైన్యానికీ, తన పోషణకీ డబ్బులు దండుకుంటూనే ఉన్నాడు. మొనాకోలో ఒకటి తర్వాత ఇంకోటి వచ్చి జూదగృహాలు అలా పెరుగుతూనే ఉన్నాయి. అరవై మంది సైన్యం మెల్లి మెల్లిగా ఏమరుపాటు చూపించడం మొదలుపెట్టింది; గొడవలు ఏమీ జరగటం లేదు కనక.

ఇదిలా ఉంటే ఓ రోజు జేబులో డబ్బులన్నీ పోగొట్టుకున్నాయన కోపంతో జూదగృహంలో ఒకణ్ణి కత్తితో పొడిచి చంపేశాడు. దీంతో ఒక్కసారి పాలగిన్నెలో విషం చుక్క పడ్డట్టైంది. మొనాకో దేశంలో ఇప్పటి దాకా హత్యలూ అవీ లేవు కనక న్యాయస్థానాలూ, జైళ్ళూ లేవు. కానీ అపరాధం అపరాధమే. దాన్ని చేసినవాణ్ణి శిక్షించాలి లేకపోతే రేపు ఇంకోటీ, ఎల్లుండి మరోటి జరగవూ? రాజూ, మంత్రీ ఇలా పెద్దలందరూ కల్సి ఈ నేరాన్ని విచారించేరు. పెద్ద గొడవలవీ లేకుండా ఈ నేరస్తుడికి మరణ శిక్ష ఖాయం అయిపోయింది.

ఇక్కడే వచ్చింది అసలు తంటా.

మరణ శిక్ష అంటే ఎవరో ఒకరు కత్తితో నేరస్తుణ్ణి నరకాలి. లేకపోతే ఉరి తీయాలి. అయితే ఎప్పట్నుంచో మొనాకోలో అసలు హత్యలూ నేరాలు లేవు కనక ఉరితీసే తలారీ ఎక్కడా లేడు దేశంలో. జూద గృహాల్ని మాత్రమే చూడ్డం అలవాటైపోయిన సైన్యంలో ఏ ఒక్కడూ దీన్ని తలకెత్తుకోవడానికి ముందుకి రాలేదు. నేరస్తుణ్ణి వదిలేస్తే దీన్ని చూసుకుని మరో హత్యా కలహాలు మొదలౌతాయ్. సరే తలారిని వెదికే లోపుల వీణ్ణి జైల్లో ఉంచుదాం అని తీర్మానం అయింది. మరి జైలే లేదు మొనాకోలో. మంత్రే చెప్పేడు ‘వీణ్ణి ఏదో ఒక ఇంట్లో అలా ఉంచుదాం తలుపులు వేసేసి,’ అని. ఆ తర్వాత వారంలో మంత్రి ఆలోచించి ఫ్రాన్సు ప్రభుత్వానికో ఉత్తరం పంపించేడు, ఇదిగో ఇలా ఒక హంతకుణ్ణి చంపాలి, మీదగ్గిర దీనిక్కావాల్సిన యంత్రాంగం, మనుషులూ ఉన్నారా అని అడుగుతూ. ఉత్తరం రాసిన వారానికో సమాధానం వచ్చింది ఫ్రాన్సు నుంచి – అవును మనుషుల్ని చంపే యంత్రం ఉందీ, ఉరితీసే తలార్లూ ఉన్నారు. ఏది కావాల్సినా ఇవ్వడానికి సిద్ధం కానీ వేరే దేశం – ఎంత దగ్గిరైనా సరే – పంపించాలి కనక దీనికి పదహారు వేల ఫ్రాంకులౌతై.

పదహారువేల ఫ్రాంకులనేసరికి రాజుకీ మంత్రికీ గుండెలు దడ దడలాడేయి. పదహారు వేల ప్రాంకులు మళ్ళీ రావాలంటే ఈ జూదగృహలమీద భారీగా పన్నులేయాల్సి ఉంటుంది. అప్పుడు డబ్బులు వచ్చే మాట అటుంచి పన్నులకి బెదిరి ఎవరూ రాకపోతే? అబ్బే ఇది లాభం లేదు. అదీగాక ఈ హంతకుడు పదహారువేల ఫ్రాంకులు ఖర్చుపెట్టేంత గొప్పవాడా? ఇంతవరకూ ఎలాగా వచ్చింది కనక ఇప్పుడు ఇటలీకి కూడా ఓ ఉత్తరం రాసి పారేస్తే?

ఇటలీనుంచి కూడా ఓ సమాధానం వచ్చింది త్వరలో. వీళ్ళకి పన్నెండువేల ఫ్రాంకులు చాలని. అబ్బే ఇది కూడా పెద్దగా తేడా లేదు ఫ్రాన్సు వాళ్ళు చెప్పినదానితో చూస్తే. రాజుకీ మంత్రికీ ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి మనసొప్పలేదు. ప్రస్తుతానికి హంతకుణ్ణో జైలు లాంటి ఇంట్లో ఉంచి పబ్బం గడపడమే మంచిది. మంత్రే చెప్పేడు రాజుతో,

“కాపలాదారుని చూసీ చూడనట్టు ఉండమందాం. సందు చూసుకుని వీడు పారిపోతాడని నేను అనుకుంటున్నాను.”

ఓ ఏడాది గడిచిందిలాగే వీళ్ళు తర్జనభర్జనలు పడుతూంటే. అయితే మంత్రి అనుకున్నట్టు జరగలేదు. ఓ రోజు రాజు తనదగ్గిరకొచ్చిన జమా ఖర్చులు చూస్తూంటే ఆరు వందల ఫ్రాంకులు కొత్త ఖర్చు కనిపించింది. విచారిస్తే తేలిందేమిటంటే, ఈ డబ్బులు హంతకుణ్ణి పోషించడానికి! వీడికి తిండీ, గుడ్డా, పారిపోకుండా ఓ మనిషి కాపలా, జైలు అనబడే ఇంటికి అద్దే ఇవన్నీ కల్సి.

మంత్రిని పిల్చి మాట్టాడేడు రాజు. తేలిందేమిటంటే ఈ హంతకుణ్ణి చంపడానికి ఖర్చు ఎక్కువ అనుకుంటే చంపకుండా రోజుల తరబడి మేపడానికి ఖర్చు ఇంకా ఎక్కువయ్యేలా ఉంది. అన్నింటికన్నా దరిద్రం వీడు ఇంకా వయసులో ఉన్నవాడే. ఇలా మేపుకుంటూ పోతే ఇంకో నలభై, యాభై సంవత్సరాలు చులాగ్గా బతికేయగలడు. అంటే, ముఫ్ఫైవేల ఫ్రాంకులు. దారుణం!

జైలర్ అనబడే కాపలా వాణ్ణి తీసేస్తే వాడు పారిపోతాడేమో తెలుస్తుంది కదా? లేకపోతే వాణ్ణి ఫ్రాన్సు, ఇటలీ సరిహద్దుల్లో వదిలేస్తే? ఏమో ఏం తంటా వస్తుందో. మొత్తంమీద కాపలాదారుడితో ఏదో మాట్లాడి పంపించేడు మంత్రి. ఈ మాట పట్టుకుని ఆ రోజు రాత్రి కాపలాదారు హంతకుడితో చెప్పేడు,

“చూస్తున్నావ్ కదా, ఇక్కడ నేను నామ మాత్రానికే కాపలా. నువ్వు బయటకి వెళ్తుంటే నాతో చెప్పినా చెప్పకపోయినా ఏమీ అవదు. ఇక్కడ జైల్లో దుర్భరంగా బతకడం కంటే బయటే సుఖంగా ఉండొచ్చేమో?”

హంతకుడు తలాడించి లోపలకెళ్ళేడు. వాడు మామూలువాడా? దేవాంతకుడు కనక చాలాసేపు దీర్ఘంగా ఆలోచించేడు. ఆ తర్వాత తిండి తినడం పడుకోవడం మామూలుగా అయ్యేక పొద్దున్నే బయటకొచ్చేడు. మాటా పలుకూ లేదు. ఇలా ఇంకో నెల గడిచేక కాపలాదారు మళ్ళీ చెప్పేడు,

“చూడోయ్, నువ్విక్కణ్ణించి పారిపోవచ్చు కదా? నిన్ను అడ్డుకునేవాళ్ళెవరూ లేరు. నాకూ ఇక్కడేమీ తోచటంలేదు. నీ దారి నువ్వు చూసుకోకూడదూ?”

హంతకుడికి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది, “అదెలా కుదురుతుంది? నేనిక్కడకి మొదట్లో వచ్చినప్పుడు నాకు మరణశిక్ష వేసి దేశం అంతా తెలిసే లాగా అందరికీ చెప్పి చంకలు గుద్దుకున్నారు కదా రాజూ, మంత్రీ, సైన్యం అందరూ కల్సి? ఇప్పుడు నాకు హంతకుడనే ముద్ర పడిపోయింది కనక బయటకెళ్తే ఉద్యోగం సద్యోగం ఎలా వస్తాయ్? ఎక్కడికెళ్ళాలి అయినా? ఎక్కడికెళ్ళినా నన్ను దొంగలాగే చూస్తున్నారు. నాకు వచ్చిన వృత్తి ఏదైనా ఉంటే అదెప్పుడో మర్చిపోయేను. ఇప్పుడు నాకు బయట ప్రపంచంలో ఏది ఏమిటో తెలియదు. ఇక్కడైతే రెండుపూట్లా భోజనం దొరుకుతోంది, ఏ పనీ చేయక్కర్లేదు. నాకిక్కడే బావుంది.”

ఇది విన్నాక రాజుకీ మంత్రికీ ఏమీ పాలుపోలేదు. వాణ్ణి పిల్చి మాట్లాడేరు. చెప్పిందే మళ్ళీ చెప్పేడు వాడూను. సరే ఇదెలాగా తెగేది కాదు కనక ఏడాదికింత మొత్తం ఇస్తే వాడు దేశం లోంచి పోవడానికి ఏర్పాటైంది. అయితే దీనికో హామీ పత్రం రాయించుకుని రాజముద్రతో ఇవ్వాలి. రాజుకీ, మంత్రికీ తప్పింది కాదు. చేతికంటుకున్న దరిద్రం వదుల్చుకోవడానికిదే మంచి మార్గం. అయితే ఏడాదికిచ్చే డబ్బులు ఎట్టి పరిస్థితి లోనూ పెంచబడవు. ఇలా రాత ఒడంబడిక అయ్యేక ఆ ఏడాదికి రావాల్సిన బాకీలో మూడోవంతు తీసుకుని దేశం వదిలేడు వాడు. రైలెక్కితే పావుగంటలో పక్కదేశంలో దిగొచ్చు. చేతిలో ఉన్న డబ్బుల్తో పక్కదేశంలో చిన్న మడిచెక్క కొని అక్కడో గుడిసెలో ఉంటూ కూరగాయలు పండిస్తూ వ్యాపారం ప్రారంభించేడు.

ఇప్పుడు వాడికి చీకూ, చింతా లేదు. ఏడాదికో మాటు ఈ మొనాకోకి రావడం, వచ్చిన డబ్బుల్లో కొన్ని జూదానికో మరోదానికో తగలేయడం, మిగిలిన డబ్బుల్తో ఇంటికి పోయి కాలక్షేపం చేయడం. కూరగాయలు పండితే మరికొంత వెసులుబాటు. పండకపోయినా పుట్టె మునిగిపోయిందేమీ లేదు.

వాడికి జరిగిన మంచి ఏవిటంటే వాడు హత్య చేసింది మొనాకో కావడం. లేకపోతే మరో దేశం ఏదైనా ఇంత ఏడుస్తుందా హంతకుణ్ణి ఉరేయడానికి? రాజుకీ మంత్రికీ అన్నింటికన్నా ముఖ్యంగా సైన్యాధ్యక్షుడికీ మంచి గుణపాఠం దొరికింది – ఏ పని చేయచ్చో చేయకూడదో. రాజు రెండేళ్ళలో మెల్లిగా ఇక్కడో ఫ్రాంకూ అక్కడో ఫ్రాంకూ కనీ కనపడకుండా పన్నులేసి ఈ హంతకుడి ఏడాది ఖర్చూ రాబట్టుకుంటున్నాడు జాగ్రత్తగా; కానీ మొదట్లో చేతులు కాల్చుకున్న జ్ఞాపకం మాత్రం అలాగే బుర్ర తింటూనే ఉంది ఆయన బతికున్నంతకాలం. చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత అని ఊరికే అన్నారా?

(మూలం: Too Dear!)