తోడు

మూడు వారాలు పోయేక ఓ రోజు మధ్యాహ్నం ఫోను మోగింది శారద ఇంట్లో.

“మిసెస్ శారద ప్లీజ్” మొగ గొంతుక.

“స్పీకింగ్”

“ఆ మీరేనా, నా పేరు రామారావు. నేను వనజ ఫాదర్ ని. మిమ్మల్ని కల్సినట్టూ, నవీన్ గురించి చెప్పింది. నేను వచ్చేవారం అమ్మాయితో గడపడానికి ఒర్లాండో వస్తున్నాను. మీరు ఊర్లో ఉంటారా?”

“ఉంటాను. తప్పకుండా రండి.”

“నేను అమెరికా వచ్చి ఇరవై ఏళ్ళు దాటింది. అంచేత నాకు ఇప్పటి వ్యవహారాలు తెలియవు. అదీగాక వనజకి అమ్మ లేదు. మీరు ఏమైనా చెప్పలనుకుంటే నిర్మొహమాటంగా చెప్పండి. నేను ఏమీ అనుకోను.”

“మేమూ అంతే. నవీన్ ఫాదర్ పోయి చాలాకాలం ఐంది. ఇంతకీ వనజ అమ్మగారికి ఏమైందండి?”

“వనజకి రెండేళ్ళున్నప్పుడు డే కేర్ లో దిగబెట్టడానికి కార్లో వెళ్తుంటే ఏక్సిడెంట్ అయి పోయింది. నేనప్పుడు ఆఫీసులో ఉన్నాను. వనజ బతికింది కొన్ని దెబ్బలతో. అంచేత వనజకి అమ్మ ఎవరో ఏమి గుర్తులేదు, ఫోటోలో చూడ్డం తప్ప.”

“ఓ సారీ” అనేసి, మీరు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారా అని అడగబోయి ఊరుకుంది. కొంచేపు నిశ్శబ్దం తర్వాత మళ్ళీ అంది శారద, “తల్లి లేకుండా ఎవరు పెంచారు వనజని?”

“నేనే పెంచానండి. మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనిపించలేదు. అదీగాక మళ్ళీ పెళ్ళి చేసుకుంటే వచ్చే ఆవిడ వనజని సరిగ్గా చూడకపోతే ఇంకో తలనెప్పి కదా?”

“సరే, మీరు వచ్చాక ఫోన్ చేయండి. మళ్ళీ కల్సుకుందాం.”

ఫోన్ పెట్టేసిన శారద చాలాసేపు స్థబ్దుగా కూర్చుంది. ఫోన్ చేసిన రామారావుకీ తనకు తెల్సిన రామారావుకీ పోలికలు తేవడానికి. ముందు సంగతి ఏమిటో గానీ ఇప్పుడు మాత్రం తనకీ నాకూ చాలా పోలికలున్నాయి అనుకుంది. ఇద్దరూ సింగిల్ పేరెంట్సే. తనకి డబ్బులతో ఏమీ ప్రోబ్లెం రాలేదు ఇన్స్యూరెన్స్ వల్ల. కానీ ఆయనో? ఉద్యోగం చేసుకుంటూ, పిల్లని డే కేర్ లో ఉంచి ఎలాగ నెట్టుకొచ్చాడో?

ఒర్లాండో వచ్చేక రామారావు చెప్పేడు వనజతో నవీన్ గురించి అడిగితే. “అతను ఇండియన్ అంటున్నావు కదా? మీ ఇద్దరికీ నచ్చితే నాదేమీ లేదు. నేను శారదగారితో మాట్లాడేను కూడా. ఆవిడ పెళ్ళయ్యాక నవీన్ తో ఉంటారా?”

“లేదు నాన్నా. నవీన్ ఉండమనే అన్నాడు కానీ ఆవిడ మమ్మల్ని వేరేగా ఉండమని అంటున్నారు. భాధ్యత తెలిసొస్తుంది అంటున్నారు.”

రెండ్రోజులాగి వనజ, రామారావు నవీన్ ఇంటికి బయల్దేరారు. ముందే ఫోన్ చేసి చెప్పేరు కనక డిన్నర్ రడీ గా ఉంచింది శారద. ఇంట్లోకి వచ్చిన రామారావు శారద మొహం చూసి “మీరా?” అన్నాడు. శారద కూడా ఆశ్చర్యం గా చూసింది. ఇరవై ఏళ్ళు దాటినా ఇద్దరూ ఒకర్నొకరు గుర్తు పట్టగలిగేరంటే గొప్పే కదా?

“ఏమిటీ మీ ఇద్దరూ ఒకరికొకరు ముందే తెల్సా?” అడిగేడు నవీన్. వనజ కూడా క్యూరియాసిటి అణుచుకోలేనట్టు చూసింది.

ముందు తేరుకున్నది శారద. “నేను, రామారావు గారు విజయవాడలో డిగ్రీ చదువుతున్నప్పుడు క్లాస్‌మేట్స్‌మి.”

“వావ్” అన్నారు నవీన్ వనజ ఇద్దరూ ఒకేసారి.

డిన్నర్తో పాటు మిగతా ఫార్మాలిటీస్, పాత కబుర్లు అన్నీ మాట్లాడుకున్నాక ఇంటికెళ్ళడానికి లేచేరు రామారావు, వనజ. దారిలో రామారావు సైలెంట్ గా ఉండటం చూసి అడిగింది వనజ “ఏం నాన్నా నీకు నవీన్, శారద గారు నచ్చలేదా?”

“అబ్బే అది గాదు. ఇద్దరూ బాగా నచ్చారు. ఇంతకాలం శారద గురించి తెలీదు కనక ఆవిడ గురించి పాత జ్ఞాపకాలు తరుముకుని వస్తున్నాయి అంతే”

“ఆవిడ చదువులో చురుగ్గా ఉండేవారా?”

“ఆవిడ చాలా స్మార్ట్ చదువులో. పైకి చదివించలేదు కానీ చదువుకుంటే నాతో పాటు కాల్ టెక్ లో ఉద్యోగం సంపాదించి ఉండేది ఆవిడ. అప్పట్లో వాళ్ళ నాన్న గారు ఓ సారి నాతో పెళ్ళి ప్రస్తావన చేసారు కూడాను.”

“ఎవరికీ పెళ్ళి? మీకు శారద గారికీనా?” నవ్వింది వనజ. తండ్రి కొంచెం సిగ్గు పడ్డట్టు కనిపించేడు వనజకి.

“అవును. కానీ నేను పై చదువులకని కాన్పూర్ వెళ్ళడం వల్ల అప్పుడే పెళ్ళి కి ఆలోచనలేదని చెప్పేను. ఓ సారి ఐ.ఐ.టి కి రాగానే అమెరికా, అక్కడ్నుంచి, పెళ్ళీ, నువ్వు పుట్టడం, ఆఖరికి ఇదిగో ఇలా అయ్యేను,” వనజ తల్లి గురించి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ చెప్పేడు.

“నేనెప్పుడడిగినా సరిగ్గా చెప్పలేదు నువ్వు. అసలు నాకు అమ్మ గురించి చెప్పవేం? ఏమైంది అమ్మకి?”

“నీ చిన్నప్పుడే పోయింది. అంతకన్నా చెప్పడానికేవుంది?”

“ఏమిటి పోవడానికి కారణం? హెల్త్ ప్రోబ్లెం ఏదైనా ఉండేదా?”

“అమ్మా, ఒకసారి మన మనిషి పోయేక కారణం ఏదైతేనేం? కొన్ని విషయాలు తెల్సుకోకపోవడమే మంచిది కదా?”

కాసేపాగి మళ్ళీ శారద గురించి మాట్లాడేడు రామారావు. వింటున్న వనజ, శారద గురించి మాట్లాడినప్పుడల్లా రామారావు గొంతులో మార్పు గమనించకపోలేదు. చాలా కాలానికి మళ్ళీ ఉద్యోగం, క్లాసులో చెప్పే లెక్కలూ, పలోమార్ అబ్జర్వేటరీ గొడవలు కాక శారద గురించి మాట్లాడుతుంటే వనజ అనుకుంది మనసులో, “శారద నాన్నకి మంచి మాచ్ అవుతుందేమో?”

మర్నాడు నవీన్ తో చెప్పిందా సంగతి. ముందు నమ్మలేనట్టూ చూసాడు. తర్వాత చెప్పేడు మెల్లిగా.

“ఈ సంగతి ఇంత ఈజీగా తెమిలిపోయేది కాదు. నేను అమ్మతో ఈ మాట అంటే నన్ను చంపి పాతరేస్తుంది.”

“ఆహా, నీకేం తెలీదు నవీన్. నేను చూసాను. నాన్నతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ కళ్ళలోకి. అడిగితే ముందు వద్దన్నా తర్వాత ఒప్పుకుంటారని నాకనిపిస్తోంది. అసలు అడక్కుండనే నీకెలా తెల్సు?”