మరణ మృదంగం

9.

ఝాము రాత్రి, బాగా చీకటి పడ్డాక ఎప్పుడో ప్రస్కోవ్యా అలాగే వంపుసొంపులన్నీ ప్రదర్శిస్తూ వెనక్కి వచ్చి ఇవాన్‌ని పలకరించింది. ఇవాన్ ఆవిడ రావడం చూసి కళ్ళు తెరిచి చూసి వెంఠనే మూసుకోబోయేడు. ఇంకా అక్కడే ఉన్న జెరాసిమ్‌ని ఇంటికి పంపించేసి తాను ఉంటానంది ప్రస్కోవ్యా. కానీ ఇవాన్ వెంఠనే చెప్పేడు, “వద్దు, వద్దు, నువ్వు పోయి పడుకో, ఇక్కడ జెరాసిమ్‌ ఉన్నాడు కదా?” తానెందుకు ఆవిణ్ణి బయటకి వెళ్ళమన్నాడో ఆవిడకీ తెలుసు, తనకీ తెలుసు కనక ఆవిడ వెళ్తూ అడిగింది, “నెప్పి బాగా ఎక్కువగా ఉందా?”

“ఎప్పట్లాగానే ఉందిలే, దాని సంగతికేం?”

“నిద్ర పట్టడానికి మత్తుమందు వేసుకుంటావా?”

“సరే,” ఇవాన్ మందు నోట్లో పెట్టుకోగానే ఆవిడ బయటకెళ్ళింది.

తెల్లవారుఝామున మూడింటిదాకా అది నిద్రో, కలో, మాయో ఏదో తెలియని త్రిశంకు స్వర్గం ఇవాన్‌కి. తననీ, తనకూడా ఉన్న నెప్పినీ కట్టకట్టి ఏదో నల్లటి గోనెసంచీలో కుక్కుతున్నారు. వద్దనేకొద్దీ లోపలకి తోస్తూంటే తాను ఏమీ చేయలేక పోతున్నాడు. ఆ సంచీలోంచి బయటపడితే బాగుణ్ణని ఉంది, కానీ రావడానికి శరీరం సహకరించడం లేదు. ఈ నల్లటి ఇరుకు సంచిలో కూడా నేనెక్కడికీ పోలేదంటూ తనకున్న దారుణమైన నెప్పి గుర్తు చేస్తూనే ఉంది. కాసేపటికి ఊపిరి ఆడని స్థితిలో ఒక్కసారి ఊరట, సంచీలోంచి ఎలాగో బయటపడ్డాడు. ఒక్క ఉదుట్న మెలుకువొచ్చింది. కళ్ళెత్తి పైకి సారించేడు. మొదటగా కనిపించినది తన కుళ్ళుతున్న శరీరం, ఆ పైన పుల్లల్లాగా తయారైన తన కాళ్ళు, తన కాళ్ళ దగ్గిరే కూర్చుని కాళ్ళు పడుతున్న జెరాసిమ్‌; రాత్రంతా కూర్చున్నట్టున్నాడు పాపం, కునికిపాట్లు పడుతున్నాడు.

“జెరాసిమ్‌, నన్ను వదిలేసి పోయి పడుకో, పో.”

“అబ్బే ఫర్వాలేదు, కాసేపు ఉండగలను.”

“వద్దు, పోయి పడుకో, నాకు ఫర్వాలేదులే.” పళ్ళబిగువున అన్నాడు ఇవాన్.

జెరాసిమ్‌ వెళ్ళగానే పక్కకి తిరిగి పడుకున్నాడన్నమాటే గానీ, అప్పటిదాకా లోలోపల దాగిన దుఃఖం ఒక్కసారి గట్టు తెంచుకుంటూ బయటకొచ్చింది. తన చేతకాని తనానికీ, తనకొచ్చిన ఈ జబ్బుకీ, తనకి దీనివల్ల కలిగిన ఒంటరితనానికీ, అక్కడ్నుంచి అసలు మనిషిలో ఉన్న పశుప్రవృత్తికీ, దేవుడనే వాడసలు ఉండే ఉంటే, ఆయనకున్న కఠిన హృదయానికీ, అసలు దేవుడే లేకపోతే, దేవుడు లేనేలేడు అనే ఆలోచనకీ అన్నింటినీ కట్టగట్టుకుంటూ అంతులేని ఏడుపు. చిన్నపిల్లవాడు ఆకలితో పాలకోసమో, బొమ్మ విరిగిపోతే దానికోసమో ఏడిచినట్టు, మొదలూ చివరా లేని అంతులేని ఏడుపు, కన్నీళ్ళు కారుతూంటే అలా ఏడుస్తూనే ఉన్నాడు ఇవాన్ చాలాసేపు. ఆ ఏడుపులోనే మళ్ళీ ప్రశ్నలు; దేవుడా నన్నెందుకిలా సృష్టించావు? నన్నెందుకిలా ఏడిపిస్తున్నావు, నేనేం తప్పుచేశాను?” ఇదయ్యాక అందులోంచి మళ్ళీ కోపం. “నన్ను చంపాలనుకుంటే, ఒక్క దెబ్బతో పోనీయ్, ఇలా ఎంతకాలం ఏడిపిస్తావు?”

ఏడుపుతో మెల్లిగా తెరిపిన పడ్డాక ఏదో శబ్దం, తన అంతర్గతం లోంచి వచ్చే మాటలే అవి; అజ్ఞాత వ్యక్తి కంఠం కూడా కాదు; తనలోంచి వచ్చే మాట వేరే ఎవరో తననే అడుగుతున్నట్టుంది, “ఏం కావాలి నీకు ఇవాన్?”

ఇవాన్ ఓ సారి తనకేసి చూసుకున్నాడు, ఏం కావాలి తనకి? తనకా, “బాగా అందరిలా ఆరోగ్యంగా బతకాలి, అదే తనక్కావాల్సినది. అదే అదే.”

“అంటే మునపటిలా ఎలా ఉన్నావో అలాగా? అంటే చిన్నతనం, యవ్వనం, పెళ్ళీ, పిల్లలూ; అవి సంతోషం కలిగించాయా నీకు?” అజ్ఞాత కంఠం అడుగుతోంది, “అవన్నీ మళ్ళీ కావాలా లేకపోతే అందులో కొన్ని మాత్రమేనా?”

దీనికి సమాధానం కోసం ఇవాన్ వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఓ సారి చూసుకుంటే, జీవితంలో ఏవి తనకి బాగున్న రోజులు? చిన్నప్పటి రోజులు బాగుండేవి. హాయిగా ఆడుకోవడం, పడుకోవడం. తర్వాత యవ్వనం? చదువుకునే రోజులు, కాలేజీ, ఉద్యోగం? బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తన స్వాతంత్ర్యం? వాటిలో తనకి కాస్త సంతోషం కలిగించేవి కొన్ని ఉన్నా, వద్దు. అవన్నీ పైకి బాగానే ఉన్నా విషపూరితమైనవని అని తెలిసొచ్చింది కదా? మరి పెళ్ళి? పెళ్ళి పేరుతో కామం, భోగం, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టూ రోజుల తరబడీ ఆడుకునే కపట నాటకం, ఇవాన్‌కి వణుకు పుట్టుకొచ్చింది వద్దు గాక వద్దు. ఇవన్నీ ఒకెత్తు ఐతే ఈవిడ పెట్టే సన భరించడం కన్నా ఒంటరిగా ఉండడమే మేలు. పిల్లలో? అసలే వద్దు. పుట్టిన వాళ్ళెంతకాలం బతుకుతారో? వాళ్ళెలా తయారౌతారో అనే చింత. మరి నెప్పీ, రోగమో? హతోస్మి. ఇవన్నీ చూసుకుంటే ఏది సంతోషం కలిగించేది? ఒక్క చిన్నప్పటి రోజులు మాత్రమే. పెరిగే కొద్దీ తనకి ఏది సంతోషం కలిగిస్తుందనుకున్నాడో అది ఆవిరైపోతూ జీవితంలో సుఖం అనేది ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. జీవితంలో తాను ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎక్కువ సంతోషం పొందుతున్నానని అనుకుంటూ ఉంటే నిజానికి తన జీవితం ఒక్కో మెట్టూ కిందకి అధఃపాతాళంలోకి దిగుతోంది. అంటే తన ఆరోగ్యం బాగైనా సరే తనకి జీవితంలో సంతోషం కలిగించేదేమీ లేదా? నిజంగానే లేదా? ఇప్పటికైనా తెలిసిన పరమ సత్యం తన ఎదురుగా వికట్టహాసంతో నవ్వుతున్న మృత్యువు! అయిదేళ్ళ ప్రాయంలో తానెంత సంతోషంగా ఉన్నాడో తల్చుకుంటే ఇప్పటి పరిస్థితి కానీ, అసలు ఆరోగ్యంగా బతికి ఉన్నప్పుడు కానీ ఉన్న సంతోషం అసలు సంతోషం కింద లెక్కపెట్టొచ్చా? అయితే మునపటిలాగా సంతోషంగా బతకాలంటే, వెనక్కి పోయి తాను చిన్నపిల్లవాడైపోవాలి. అలా జరగడం అసంభవం.

తనకి జరుగుతున్న ఇదంతా ఏమిటి? ఇలా నెప్పి ఎందుకు అనుభవించాలి? దీనికంతటికీ ఏదో కారణం ఉండాలి కదా? తానేదో తప్పు చేశాడు జీవితంలో. ఏవిటది? ఇలా అనుకోగానే ఇవాన్‌కి జీవితం కళ్ళముందు గిర్రున తిరిగింది. ఎక్కడా పెద్ద తప్పులు చేసినట్టు లేదు. అన్నీ బాగానే ఉన్నా ఎందుకిలా అయింది తన జీవితం? అసలు మొదటినుండీ తాను చేశాననుకున్న మంచి పనులన్నీ తప్పులేనేమో? తన తోటివాళ్ళూ, తన కూడా స్నేహితులూ చేసిన పనులే తానూ చేశాడు కదా, అవన్నీ తాను నిజంగా మంచి పనులనుకునే, అందరూ మెచ్చేవి అనుకునే చేశాడు కదా, అవన్నీ కూడా తాను జీవితంలో చేసిన తప్పులై ఉండొచ్చు. మిగతావాళ్ళు ఒప్పుకుంటే మాత్రం అవన్నీ మంచివని ఎక్కడుంది? అలాగైతే తాను పోయేముందు జడ్జ్ ముందు నిలబెట్టి ఈ తప్పుల్లో నువ్వు సమర్ధించుకునేది ఏమిటి అని అడిగితే సమర్ధించికోవడానికేమీ మిగల్లేదు, అలా ఏడుపు మొహం పెట్టి చూడ్డం తప్ప.

అజ్ఞాత కంఠం మరోసారి అడుగుతోంది, “అయితే ఇవాన్, ఇప్పుడేమంటావ్? జీవితం ఎలా ఉండాలి? ఇలాగే ఉంటే బాగుందనేనా? అలా కాకపోతే మరెలా ఉండాలో?”

ఇవాన్‌కి ఓ సారి తన ఆఫీసు గుర్తుకొచ్చింది. తాను కోర్టు లోపలకి అడుగుపెడుతుంటే జవాన్ అరుస్తాడు, “జడ్జీ గారొస్తున్నారు, జడ్జీ గారొస్తున్నారు.” ఇవాన్‌కి ఒక్కసారి వళ్ళు తెలిసినట్టయి అరిచేడు, “నేనేం తప్పూ చేయలేదు. జడ్జ్ మాత్రం ఏం చేస్తాడు తప్పు చేయకపోతే?” అప్పటికి బాగా మెలుకువ వచ్చింది ఇవాన్‌కి. అప్పటిదాకా కడుపులో దాచుకున్న దుఃఖం బయటకి రాగానే మరో పక్కకి తిరిగి పడుకున్నాడు.

ఇంత వ్యథ కలిగినా ఇవాన్‌కి వదలని ప్రశ్న ఒక్కటే: ఎందువల్ల తనకీ యమయాతన? తనకి తెలియకుండా ఎక్కడ జరిగింది తప్పో ఒప్పో తన జీవితంలో? అయితే తన జీవితంలో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని మనసులో ఓ మూల, తాను ఏ తప్పూ చేయలేదని మరో మూలా బుర్ర తొలిచేస్తూనే ఉన్నై. ఎంత ఆలోచించినా ఈ అంతులేని ప్రశ్నలకి మాత్రం ఇవాన్‌కి సమాధానం ఎప్పటికీ దొరకలేదు.

10.

మరో రెండు వారాలు గడిచాయి. ఇవాన్ ఆరోగ్యం విషమిస్తూనే ఉంది. అంతకు ముందు మంచం మీదనుంచి సోఫా మీదకీ అటూ ఇటూ వెసులుబాటుగా తిరగ్గలిగే ఇవాన్ ఇప్పుడు సోఫాకే పరిమితం అయ్యేడు. సోఫాలో పడుకున్న ఇవాన్ కళ్ళు తెరిస్తే ఎదురుగా కనిపించేది గోడ ఒక్కటే. అంతు దొరకని ప్రశ్నలకి బుర్ర పాడవడం తప్ప అవి అలా వస్తూనే ఉన్నై. ‘ఇదంతా ఏవిటసలు? చావంటే ఇదేనా?’ ఒక్కోసారి మనసులోంచి తన్నుకొచ్చేది సమాధానం, ‘అవును ఇదే చావంటే, అవును ఇదే, ఇదే.’

“మరి ఈ నెప్పీ, బాధా ఎందుకు?” ఇవాన్ తనకి తాను వేసుకునే ప్రశ్న.

“కారణమేమీ లేదు, చావంటే అలాగే ఉంటుంది.” లోపల్నుంచి వచ్చే సమాధానం.

ఇవాన్‌కి ప్రతీదీ రెండు వ్యతిరేకాల్లా కనబడడం మొదలైనది తనకి జబ్బు వచ్చినప్పటినుండీ. మొదట్లో కిడ్నీయో అపెండిక్సో; తర్వాత సరిగ్గా పని చేయకపోవడమో అది శరీరం లోంచి విడిపోవడమో; ఆ అవయవం తిరిగి పనిచేస్తుంది అనే ఆశ, చేయదనే నిరాశ. జబ్బు ముదిరేకొద్దీ ఎదురుగా వికట్టహాసం చేస్తూ క్రూరంగా నవ్వుతున్న తన మృత్యువు! సమాధానం లేని ప్రశ్న మాత్రం, ఆ మృత్యువు తన ఎదురుగా నవ్వడం ఆపేసి తనని కబళించడానికి మీదకి ఎప్పుడొస్తుందనేది మాత్రమే.

మూడునెలలనుంచీ తెలుస్తోంది. తన ఆరోగ్యం క్షీణించడం, తనని అందరూ శరీర దుర్గంధం వల్లో మరో కారణం వల్లో ఒంటరిగా చేయడం. ఇంతమంది జనం, చాలా మంది స్నేహితులూ ఉన్నా తాను ఇప్పుడో ఎవరికీ పట్టని ఒంటరి. ఎంత తనకి తాను ధైర్యం చెప్పుకుందామన్నా తన జబ్బు ముదురుతోంది. ఏదో ఒక ఆలోచన మనసులో మెదలడం, దాన్ని పట్టుకుని వెనక్కి ఆలోచిస్తూ పోతే తన చిన్నతనంలో ఎలా ఉండేదో అనే దాని దగ్గిర తేలడం. ఓ రోజు ఏ పండో తిన్న జ్ఞాపకం వస్తే, తన నోట్లో ఏదో రకమైన కంపు వల్ల ఏవో పాడైపోయిన పళ్ళు తీసుకొచ్చి తనకి తినడానికి పెట్టారని తాను అందరి మీదా అరిచాడు; చిన్నప్పుడు తిన్న ఆ పళ్ళ మంచి రుచీ వాసనా గుర్తొచ్చి. ఆ ఆలోచన అక్కడ ఆగితేనా? అక్కడనుంచి తన అన్నదమ్ముల మీదకీ, ఆడుకున్న ఆట వస్తువుల మీదకీ పాకే ఎడతెగని ఆలోచన్లు.

మరోసారి తనకీ జబ్బు ఎలా వచ్చిందీ, ఇంతవరకూ ఎలా పెరిగి తననీ మృత్యుముఖం లోకి ఈడ్చిందీ అనే ఆలోచనలు. నెప్పి పెరిగే కొద్దీ, జీవితం నాశనం అవడం తెలుస్తూనే ఉంది ఇన్నాళ్ళూ; అయినా ఏమీ చేయలేకపోయేడు. సరిగ్గా ఆలోచిస్తే, మహా అయితే తాను పుట్టినప్పుడో, సరిగ్గా బాల్యంలోనో కొన్ని సంతోషమైన రోజులుండేవి కాబోలు. అప్పటినుండీ జీవితం-–జబ్బు ఉన్నా లేకపోయినా–ఛండాలంగా తయారవుతూ వస్తోంది; అయినా తాను మాత్రం జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఏదో సంతోషంగా ఉన్నానని అనుకుంటూ వస్తున్నాడు. నిజానికి జరిగినదేమిటంటే ఒక్కో అడుగు వేసుకుంటూ తాను వచ్చినది మృత్యుముఖానికి. ఎంత దౌర్భాగ్యం! ఎంతో ఎత్తులోంచి రాయి కిందపడితే పడే కొద్దీ వేగం పుంజుకుంటున్నట్టూ తన జీవితం మృత్యువు వడిలోకి అతి వేగంగా లాగబడుతోంది. ఆ రాయి కిందపడగానే అనేక ముక్కలైనట్టూ తాను కూడా మృత్యువుని జేరగానే పటాపంచలౌతాడు. ఒక్కసారి మృత్యువు మీదకొస్తున్నట్టూ ఊహించుకుంటూ అలాగే నిశ్చేతనంగా కూర్చుండిపోయేడు ఇవాన్.

ఈ మృత్యువును అడ్డుకోవడం అసంభవం! జీవితం ఇలా జరగడం, ఇదంతా కాస్త అర్ధమైనా బాగుణ్ణు. కానీ అలా అర్ధమవడం కూడా అసంభవంగానే తోస్తోంది. తాను కానీ ఎలా న్యాయంగా బతకాలో అలా బతకలేదా అని ప్రశ్నించుకుంటే–లేదే, తాను తనకి తెలిసినంతలో న్యాయంగా ఎవరికీ ఏ హానీ చేయకుండా బతికేడు కదా? ఇంతలోనే విరక్తిగా మొహంలో నవ్వు. ఏదైతే వద్దనుకున్నాడో అదే మళ్ళీ మళ్ళీ బుర్రలోకి రావడం; అదే మళ్ళీ వద్దనుకోవడం. ఏ సమాధానం దొరకని ప్రశ్న మాత్రం తనకి సమాధానం లేని ప్రశ్నలూ, తనముందు కనబడే మృత్యువూ, ‘ఇదంతా దేనికోసం?’ అనేదీను.

11.

మరో రెండు వారాలు గడిచాక కూతురు కాస్త మంచి సమాచారం తీసుకొచ్చింది. లిసా స్నేహితుడు, అంతకు ముందోసారి ఆపెరాకి వెళ్తూ ఇవాన్‌ని చూడ్డానికొచ్చినతను లిసాని పెళ్ళిచేసుకుంటాననే ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఈ మాట ఇవాన్‌కి చెప్పడానికి ప్రస్కోవ్యా గదిలోకి వచ్చేసరికి ఇవాన్ సోఫా మీద పడుకుని పైనున్న కప్పు కేసి నిర్విచారంగా చూస్తూ నెప్పితో మూలుగుతున్నాడు. శరీరంలో జరిగే మార్పులూ నెప్పీ, మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నై.

మందు వేసుకున్నాడో లేదో కనుక్కుందామనుకుంటూ నోరు విప్పబోయిన ప్రస్కోవ్యాకి అన్ని సమాధానాలూ ఇవాన్ మొహంలోనే; తన జీవితం దాదాపు నాశనం చేసిందన్నట్టూ అంతులేని అసహ్యం, పగ, ద్వేషం, విరోధం అన్నింటితో కలగలిపి కనిపించేయి. ప్రస్కోవ్యా ఇంక నోరు మెదపలేదు.

“నన్నింక వదిలేయ్, ఇలాగే ప్రశాంతంగా ఇలాగే పోనియ్యి.” ఇవాన్ ఆవిడ మొహంలో మారే రంగులు చూసి చెప్పేడు బతిమాలుతున్నట్టూ.

ప్రస్కోవ్యా ఏదో అనబోయి బయటకెళ్ళబోయేదే కానీ ఈ లోపుల ఇవాన్ కూతురు లిసా గదిలోకి వచ్చింది తండ్రిని పలకరించి ఆ రోజు ఆయనకి ఆరోగ్యం ఎలా ఉందో అడగడానికి.

ఏ భావం లేకుండా కూతురితో అన్నాడు ఇవాన్, “త్వరలోనే మీకందరికీ నానుంచి విముక్తి దొరుకుతుంది.”

కాసేపు అక్కడే కూర్చున్న తర్వాత ఇద్దరూ బయటకి వెళ్ళడానికి కదిలేరు వాళ్ళ పనులమీద.

కూతురు లిసా ఓ సారి కళ్ళు తుడుచుకునే అమ్మతో అంది బయటకి వచ్చాక “ఇదంతా నీ తప్పా? నాన్నకి అలా అవడం మనందరికీ బాధగానే ఉంది. అయితే మాత్రం ఇంత వ్యధ మనం ఎందుకు అనుభవించాలి?”

ఎప్పట్లాగానే రోజూ వచ్చే డాక్టర్ చూడ్డానికొచ్చేడు ఆ తర్వాత. ఇవాన్ ఆయనడిగిన ప్రశ్నలకి అవునూ, కాదూ అంటూ ఏవో నోటికొచ్చిన సమాధానాలు చెప్పేక వెళ్ళేముందు మనసులో విషం వెళ్ళగక్కేడు కోపంగా, “డబ్బులకోసం తప్ప మీరిక్కడకి వచ్చే పనేమీలేదు. మీరూ, మీరిచ్చే మందులూ పనికిరావని తెలుస్తూనే ఉంది. నన్నింక ఇలా ప్రశాంతంగా పోనీయండి. ఇంక మీర్రావాల్సిన అవసరంలేదు.”

“మీ నెప్పి తగ్గించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా కదా?”

“ఆ, మీరు చేసే ప్రయత్నం ఏ మాత్రం పని చేస్తూందో తెలుస్తూనే ఉంది కదా? నా మానాన నన్ను ఉండనీయండి, అదే చాలు.” ఇవాన్ అరిచేడు ఆయన మీద.

డాక్టర్ బయటకెళ్ళి ప్రస్కోవ్యాతో చెప్పేడు, “ఈయన చివరి దశలోకి వచ్చాడు. ఈ పరిస్థితిలో ఇంక నేను చేయగలగేది ఒక్కటే. అస్తమానం నెప్పి తెలియకుండా మత్తుమందు ఎక్కువ మోతాదులో ఇవ్వడమే. చూడబోతే ఈయనకి శారీరకంగా నిజంగా నెప్పి దారుణంగా ఉన్నట్టుంది.”

అసలు ఇవాన్‌కి ఇంత కోపం రావడానిక్కారణం వేరే ఉంది. క్రితం రాత్రి జెరాసిమ్‌ ఇవాన్ కాళ్ళు పడుతున్నప్పుడు వాడి యవ్వనంలో ఉన్న శరీరాన్ని తన దుర్గంధపు శరీరంతో పోల్చి చూసుకుని తన జీవితంలో ఏదో సరిగ్గా జరగలేదని అనుకోవడం; శారీరకంగా ఇవాన్‌కి నెప్పి ఉన్నా, మానసికంగా ఉన్న నెప్పి లక్షరెట్లు ఎక్కువవడమే దీనిక్కారణం. తన జీవితం బాగానే ఉందనీ, తానేం తప్పు చేయలేదనీ, తన ఉద్యోగంలో కూడా తాను మంచి పేరు తెచ్చుకున్నాననీ మరోటనీ ఇవాన్ లోలోపల తనకి తాను ధైర్యం చెప్పుకోబోయేడు కానీ ఇవన్నీ ఎందుకూ పనికిరావనీ తన జీవితమే ఓ పెద్ద పనికిరాని జీవితమనీ లోపలి మరో గొంతు వీటన్నంటినీ నొక్కేసింది.

‘ఇలా నాకు మనసులో తోస్తున్నవన్నీ నిజం అయితే నాకు పుట్టినప్పుడు ఇవ్వబడిన అన్నింటినీ పోగొట్టుకుని చావడానికి సిద్ధం అవుతున్నానన్నమాట,’ అనుకున్నాడు ఇవాన్. దీనితో ఊరుకోక మరో విధంగా ఆలోచించడం మొదలుపెట్టేడు. పొద్దున్న ప్రస్కోవ్యా, కూతురూ రావడం, డాక్టర్ వచ్చి తనకి చావు దగ్గిరపడిందని చెప్పడం వగైరా వగైరా. దానితో ఇవాన్‌కి క్రితం రోజు రాత్రి వచ్చిన కల ఒక్కసారి గుర్తొచ్చింది. అందులో ఇవాన్ తన శరీరంలోంచి వేరుపడి తన పెళ్ళాం పిల్లలు చూస్తున్నట్టూ తన జీవితాన్ని విశ్లేషిస్తే, ఇవాన్‌కి జరిగినదంతా ఒకపెద్ద దగా. చావూ, బతుకూ కలగలిపిన దారుణమైన మోసం. ఈ ఆలోచనతో ఇవాన్ నెప్పి పదింతలు ఎక్కువైనట్టైంది. మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ, దుప్పటి మీదకి లాక్కున్నాడు మొహం కూడా కనిపించకుండా కప్పుకోవడానికి. అలా కప్పుకోవడంలో ఊపిరి ఆడనట్టు అయ్యేసరికి దీనికంతటికీ ప్రస్కోవ్యా, పిల్లలూ ఈ సంసారం అంతా కారణం అని తోచి వాళ్ళమీద రోత మరింత ఎక్కువై మనసులో దావానలం బద్దలయింది. ఎప్పటిలాగానే ఉధృతంగా నెప్పి పక్కటెముకల్లోంచి. పెద్ద మూలుగు, మరో సారి మరో పెద్ద మోతాదులో మత్తు మందు.

మధ్యాహ్నానికి మత్తు దిగేక మళ్ళీ మరణ మృదంగపు వాయింపు మొదలైంది, ఆగకుండా. గదిలోకి వచ్చినందరి మీదా ఇవాన్ అరిచి వాళ్ళని బయటకి తరిమేశాక కాస్త ఊరట పొందే సమయంలో మరోసారి ప్రస్కోవ్యా లోపలకి వచ్చింది.

“పాస్టర్ వచ్చి కొన్ని మాటలు చెప్దామనుకుంటున్నారు. అది నీకు నచ్చుతుందేమో అని…” మాటల్లో నాన్చడం, తాను ఎలాగా పోతున్నాడు కనక ఈవిడ చేసే సహాయం, అది చెప్పడానికి ఈవిడ వాడే భాష తెలుస్తూనే ఉన్నై.

“ఏవిటీ? ఇప్పుడా, ఎందుకూ, కానీ….” ఇవాన్‌లో ఏదో తెలియని ఆక్రోశం. ప్రస్కోవ్యా కళ్ళలోంచి కారే నీళ్ళూ, ఆవిడ ఏడుపు ఆపుకోలేకపోవడం ఇవాన్‌కి తెలుస్తూనే ఉంది.

“అవును, ఈ పాస్టర్ మంచివాడు, ఏమంటాడో విను…” ఏడుస్తున్న ప్రస్కోవ్యా బయటకెళ్ళింది.

“సరే, సరే.” ఇవాన్ అన్నాడు ఏదో మాట్లాడాలి కనక.

పాస్టర్ లోపలకి వచ్చాక ఇవాన్ తాను జీవితంలో చేసిన తప్పొప్పులు ఆయన ముందు చెప్పాల్సినదంతా చెప్పేడు. చేసిన తప్పులూ ఒప్పులూ ఆయన ముందు చెప్పుకున్నాక ఏదో తృప్తి. ఆ తర్వాత అసలీ జబ్బు ఎందుకొచ్చిందో ఎలా వచ్చిందో, ఈ నెప్పీ, ఆపరేషన్ చేసి బాగుచేయడం కుదురుతుందా అసలు, దాని వల్ల బతుకుతాడనే మిణుకు మిణుకుమనే ఆశా అదంతా ఎందుకో అన్నీ గొంతు పూడుకుపోయేలా చెప్పాక అరిచాడు, “నేను బతకాలి. నేను ఆరోగ్యంగా బతకాలి.”

పాస్టర్ విన్నంతసేపూ ఆయన కళ్ళలో నీళ్ళు చూస్తూనే ఉన్నాడు ఇవాన్. తర్వాత ఆయన చెప్పాల్సిన మాటలు చెప్పి బయటకి నడిచేడు. ఆయనలా వెళ్ళగానే ప్రస్కోవ్యా లోపలకి వచ్చి అడిగింది, “ఇప్పుడు కాస్త బాగున్నట్టుందా?”

ఇవాన్ ఆవిడకేసి కూడా చూడకుండా చెప్పేడు, “ఆఁ, బానే ఉందిలే.”

ఆవిడ వేసుకున్న బట్టలూ, ఒకప్పుడు తాను ఆబగా అనుభవించిన ఆవిడ శరీరం, ఆవిడ గొంతూ ఒకటే చెప్తున్నాయ్ ఇవాన్‌కి: ‘ఇదంతా అబద్ధం, ఇలా కాదు ఉండాల్సినది. ఇలా అసంబద్ధంగా అబద్ధాలతో, ఒకరితో ఒకరి మనసులో లోపల జరిగేవి దాచిపెట్టుకుంటూ బతకకూడదు.’ ఓ సారి ఇలా ఆలోచనలు మొదలవ్వగానే ఇవాన్‌కి ఆవిడ మీద ఉన్న అసహ్యం, కోపం అన్నీ మరోసారి ఉబికి పైకి వచ్చేయి. ఆ వెనకనే శరీరంలో నెప్పీ, మనసులో నెప్పీ కెలుకుతూనే ఉన్నై. నల్లటి సంచీలో కుక్కుతున్నప్పుడు ఊపిరి ఆడనట్టూ మరో బాధ. మరింత చేరువలో ఉన్నట్టూ మృత్యువు వికట్టహాసం.

ఇవాన్ మొహంలో జుగుప్స చూపిస్తూ ఆవిడమీద నుంచి ఒక్కసారి కళ్ళు తిప్పుకుని అందర్నీ “పొండి, ఇక్కడ్నుంచి పొండి, నా మానాన నన్ను వదిలేయండి” అంటూ అరుస్తూ కేకలు పెట్టేడు.

12.

ఇలా మొదలైన ఇవాన్ అరుపులు మరో మూడు రోజులు కొనసాగాయి, క్రమంగా పెరుగుతూ. ఈ మూడు రోజుల్లో ఇవాన్ ఎంతటి చిత్రవధ అనుభవించాడో ఆ అరుపుల్తో ఇంట్లో ప్రతీ ఒక్కరినీ అంతే చిత్రహింస పెట్టాడు. ఒక్కోసారి తాను నిజంగా చచిపోతున్నాడనుకుంటూ ‘ఆ, ఆ ఇదే’ అని అరవడం, ‘లేదు, లేదు. లే… ఇదికాదు’ అనుకుంటూ సాగదీసుకుంటూ అరవడం అందరికీ వినిపిస్తూనే ఉంది ఇంట్లో. ఈ మూడురోజుల్లోనూ ఇవాన్ ఆ నల్లటి గోనెసంచీలో కుక్కబడుతూ, లోపలకి తోయబడుతూ, తనకి తెలియకుండా ఎలాగో ఒకలాగ బయటకొస్తూనే ఉన్నాడు. ఉరికంబం మీద తలకి తాడు తగించాక కాళ్ళ కింద బల్ల తీసేస్తే కలిగే ఊపిరాడని పరిస్థితి ఈ మూడు రోజుల్లో మూడు కోట్ల సార్లు అనుభవించాడు ఇవాన్. ఓ పక్క ఈ గోనెసంచీ లోకి వెళ్ళడానికి తాను జీవితంలో చేసిన తప్పేం లేదని తన అంతరాత్మ వగుస్తూనే ఉంది. రెండో విషయం ఆ గోనెసంచీ లోకి వెళ్ళకుండా తప్పకపోవడం. ఇలా మనసులో జరిగే విచిత్రమైన ఆలోచనల పోరాటంతో గోనెసంచీ లోకి నెట్టబడుతూ బయటకొస్తూ యమయాతన అనుభవించేడు ఇవాన్. జీవితం ఇప్పుడు చావు, బతుకుల మధ్య సన్నటి దారంతో వేళ్ళాడుతోంది. ఆ దారం ఎప్పుడు తెగుతుందా అనేది మాత్రం తెలియని ఒక అతి మహా విచిత్రం.

ఒక్కసారి గుండె మీద వేయి శతఘ్నుల పోటు. ఊపిరి అందడం లేదు ఇవాన్‌కి. పెద్ద గోతిలో పడిపోతూండగా చివర్లో కనిపించిన ఓ వెలుగు. ఓ పక్కకి వేగంగా వెళ్తూంటే నిజంగా అటుగాక మరో వ్యతిరేక దిశలో వెళ్తూన్న భావన. ‘హమ్మయ్య, ఇదేదీ నిజం కాదన్నమాట. సరే మరేది నిజం?’ ఇవాన్ మనసులో కొత్త ఆలోచన రూపు దిద్దుకోవడం తెలుస్తోంది, అన్నింటినీ ముంచేసిన కొత్త నిశ్శబ్దం లోంచి.

ఇది జరిగింది ఇవాన్ అరుపులు మొదలైన మూడోరోజు సాయంత్రం, మరో రెండు గంటల తర్వాత ప్రాణం పోతుందనగా. ఇవాన్ సోఫా మీద పడుకుని గోనెసంచీ లోంచి బయటకి రావడానికన్నట్టూ గాలిలో చేతులూపుతూండగా ఇవాన్ చిన్న కుర్రాడు లోపలకి వచ్చేడు. చేయి అప్రయత్నంగా కుర్రాడి తలమీద పడితే ఆ తండ్రి చేయిని తన పెదాల మీదకి తీసుకొచ్చి కుర్రాడు ముద్దు పెట్టుకోవడం, కుర్రాడి కన్నీళ్ళు తన చేయి తడపడం ఇవాన్‌కి తెలుస్తూనే ఉంది. అప్పుడే గోనెసంచీ లోకి నెట్టబడుతూ చీకట్లో వెలుగు కనిపించిన ఇవాన్ కళ్ళు తెరిచి చూశాడు కుర్రాడికేసి.

ఒక్కసారి ఏదో అర్ధమైనట్టూ అనిపించింది ఇవాన్‌కి. తనకిచ్చిన జీవితాన్ని తాను సరిగ్గా జీవించలేదు. అయితే మునిగిపోయిందేమీ లేదు; ఏదో మరో విధంగా దీన్ని మరమ్మత్తు చేసి బాగు చేయవచ్చు. అయితే ఎలా దీన్ని బాగుచేయడం, ఏది సరైన పద్ధతి?

ప్రస్కోవ్యా గదిలోకి వచ్చి చావబోయే తనని చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టడం కూడా ఇవాన్ చూశాడు. ఇవాన్‌కి ఒక్కసారి అందరిమీదా జాలి పుట్టుకొచ్చింది. “నా మూలాన వీళ్ళెంత నరకం అనుభవించారు? నేను పోతున్నందుకు ఎంత బాధ అనుభవిస్తారు తర్వాత? పోనీయ్, ఈ నరకం అంతా తాను పోగానే వదిలి సంతోషంగా ఉంటారు తర్వాత.” ఇలా అనుకుంటూ ఇవాన్ ఏదో అనబోయేడు కానీ లోపలనుంచో ఆలోచన చటుక్కున ఆ మాట నొక్కేసింది, “ఎందుకు మాట్లాడ్డం? అర్ధం కావాల్సినవాళ్ళకి అదే అర్ధం అవుతుంది” అనుకుంటూ. ప్రస్కోవ్యాతో ‘కుర్రాణ్ణి బయటకి తీసుకెళ్ళండి,’ అన్నట్టూ చేతితో చూపించాడు. మాగన్నుగా మత్తు కమ్మేస్తూ ఉంటే, ముక్కలు ముక్కలుగా వస్తూ ‘మీకం… దరికీ… క్షమాప…’ ఇవాన్ మాట మూగబోయింది.

కళ్ళు మూతబడ్డాక ఇన్నాళ్ళూ తనని పిప్పి పిప్పి చేసిన భూతం తనని వదిలేస్తూన్న అనుభూతి. పక్కటెముకల్లోంచీ, రెండు పక్కలనుంచే కాదు, పైనుంచీ, కిందనుంచీ దశదిశలనుంచీ భూతం పట్లు వదిలేస్తోంది. రోగంతో ఇంతకాలం ఏడిపించినందుకు ఇవాన్ అనే పేరున్న తాను తన కుటుంబాన్నీ వాళ్ళందరినీ క్షమించమని అడిగాడు కదా? ఎంత చిన్నదీ విషయం, నెప్పి వదిలిపోతోంది. తనకున్న అన్ని బంధాలూ వదులవుతున్నాయి. ఇదిగో ఇక్కడే ఉన్నా అంటూ ఇన్ని నెలలూ తనని పట్టు వదలని మహా భూతంలా భయపెట్టిన నెప్పి ఎక్కడ? ఏదీ, ఎక్కడా ఆ నెప్పి?

ఈ పక్కనే కదా సర్వకాల సర్వావస్థల్లోనూ నేనిక్కడే ఉన్నానంటూ గుర్తు చేసిన నెప్పి? ఇంకా ఉందా? అది కిడ్నీయేనా? అపెండిక్సా? ఈ పక్కనా ఆపక్కనా? సరే ఎక్కడైతేనేం, దాన్ని అలాగే ఉండనీయ్. మరి చావో? ఎక్కడుంది తన చావు? తానిన్నాళ్ళూ అనుక్షణం దాని పేరు చెప్తే ఉలిక్కిపడిన చావు, అది వస్తే ఎలా అనుకుంటూ తాను భయపడిన చావు ఏదీ? ఎక్కడ? కనబడదే?

చావు బదులు నల్లటి సంచిలో లోలోపలకి దిగబడి పోతూంటే ఆ మూల కనిపించిన వెలుగు. చావు బదులు వెలుగు! చావు అనేది లేనే లేదు. చావు అనేది ఎప్పుడో అంతరించిపోయింది.

‘ఇదన్నమాట!’ భయం బదులు ఒక్కసారి ఇవాన్ మనసులో సంతోషం. దరిద్రం వదిలింది. హమ్మయ్యా, వదిలి పోయింది, హాయి, చావు అనేదే పోయింది. వ… ది… లి… పోయింది! ఇదీ ఇవాన్ మనసులో చివరిసారిగా కలిగిన ఆలోచన. ఒక్కసారి చివరి ఊపిరి ఆగినట్టూ, ఓ మూలుగు, కాళ్ళూ చేతులూ అచేతనం అవుతూండగానే ఇవాన్ ప్రాణాలు మెల్లిగా అనంతవాయువుల్లో కలిసిపోయేయి.

తన చేయి కుర్రాడి కన్నీళ్ళతో తడవడం దగ్గిర్నుంచి ప్రాణం పోవడం వరకూ ఇవాన్‌కి సరిగ్గా మూడే మూడు క్షణాలని అనిపించింది. కానీ అక్కడే కూర్చుని ఇవాన్‌ను చూస్తూన్న వాళ్ళందరికీ ఈ స్థితిలో ఇవాన్ అతి దారుణంగా మృత్యుభయం, యమయాతన మరో రెండు గంటలు అనుభవించాడని చెప్తున్నట్టూ మరణ మృదంగం అలా మోగుతూనే ఉంది.

(మూలం: డెత్ ఆఫ్ ఇవాన్ ఇల్యిచ్)