శ్రీ వినాయక లాండ్రీ సర్వీస్

“చూసేరు కదా! మా ఇంట్లో అందరం ఇక్కడే ఉన్నాం. మా ఇంట్లోవాళ్ళకి మంచి అవ్వాలంటే ఏదో చిన్న గుడి కట్టించాలని అంటన్నారు. మీరేవంటారు? ఏ గుడి కడితే మంచిది?” సత్యన్నారాయణ పూజ అయిపోయాక పంతులుగారు, వెంకటరెడ్డి ఇచ్చిన వాయినం, సంభావన పుచ్చుకుని ఇంటికి బయల్దేరబోతూంటే గుమ్మం దగ్గిరే ఆపి అడిగేడు రెడ్డి.

“మీకు తెలీనిదేవుంది? వినాయకుడు అన్ని విఘ్నాలనీ అణిచేస్తాడని తెలుసుకదా? ఆఖరికి మన చాకలిపేటలో కూడా వినాయకుడికి చిన్న గుడి కట్టించారు. రోజూ పొద్దున్నా, సాయంత్రం దీపం పెట్టి రావడానికో బ్రాహ్మణ్ణి కూడా పెట్టుకున్నారు. మనం ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఓ చిన్న గుడి పెట్టించుకోవచ్చు. దానికి దీపం అదీ పెట్టడానికి నేను సిద్ధమే.” పంతులుగారు కొంచెం ఆశ్చర్యంతో చెప్పేడు.

“దీనికెంతౌద్ది?”

“గుడికా, దీపం పెట్టడానికా? దేనికదే కదా?”

“గుడికే. మరీ అంత ఖర్చు ఎక్కువైతే తర్వాత చూడాలి. దేనికదే అంటన్నారు కనక దీపం పెట్టడానికేమాత్రం పుచ్చుకుంటావ్?” మెడికల్ కాలేజీ సీటుకెంతౌద్ది, ఈడి పెళ్ళికెంతౌద్ది, ఆణ్ణి లేపేడానికెంతౌద్ది, ఆడికి సీటిప్పించడానికి ఎంతౌద్ది? దీనికేవన్నా కన్సెషన్ ఉందా అని ముత్యాలముగ్గు సినిమాలో కంట్రాక్టర్ అన్నట్టూ అడిగేడు రెడ్డి.

“అయ్యా మీకు తెలీనిదేవుంది? వెయ్యి రూపాయల నోటు జేబులోంచి బయటకి తీస్తే సాయంకాలానికి పావలాకి దిక్కులేదు. అయినా మీతోనూ, వినాయకుడితోనూ బేరం దేనికీ? మీరెంత ఇస్తే అంతే. మరో మాట లేదు.”

“కొంచెంలో కొంచెం తక్కువ చేసి, చిన్న విగ్రహం, పైనో గంట, బయటో హుండీ చుట్టూ ఓ చిన్న ఇనప కంచే పెట్టేసి ఓ చెట్టుకింద పెట్టేయలేం దేవుడ్ని?”

“ఎండొచ్చినా వానొచ్చినా ఎలాగండి?”

“సరే, అయితే దానికో కప్పు, చుట్టూ గోడ ఉండాలంటావ్?”

“అది లేకపోతే గుడే అవదు కదా, మన శివాలయానికి వెళ్ళే దార్లో శంకరమఠం సత్రం ఉంది చూడండి, అక్కడే రావి చెట్టు కింద పెట్టొచ్చు. ఇప్పుడక్కడ ఖాళీయే కదా?”

“సరే సర్పంచినీ అడుగుతాలే. మరి మీకు నెలకో అయిదొందలిస్తే చాలా దీపం గట్రా ఎలిగించడానికి?”

“మీరు నూనె, దీపం పెట్టడానికి కుందెలు, మిగతా సరంజామా అన్నీ కొనిస్తానంటే నాదేముంది, మీరెంత ఇస్తానంటే అంతే తీసుకుంటాను. మరి దేవుడికి ప్రసాదం రోజూ చిన్న బెల్లం ముక్కైనా పెట్టాలి కదా? నూనే పువ్వులూ అరటిపండో బెల్లం ముక్కో అవి కూడా ఈ అయిదొందల్లో ఎలా కుదుర్తాయి చెప్పండి?”

“సరే వెయ్యి జేస్కోండి అయితే. మరో మాటొద్దు.”

“శుభం. ఎప్పుడు మొదలుపెడతారో కబురు పంపించండి, వెళ్ళిరానా మరి?” బయటనున్న తన మోటార్‌సైకిల్ కేసి నడిచాడు పంతులుగారు.


ఇది జరిగిన నాలుగు నెలలకి వెంకటరెడ్డి సర్పంచికి నచ్చచెప్పి ఒప్పించి రావిచెట్టు కింద చిన్న వినాయకుణ్ణి ప్రతిష్టించేడు. మొత్తం ఖర్చు మూడు లక్షలయింది. అందులో సగం పైన జనాల నుంచి చందాలు, ధర్మదాతల పేర్లు గుడి చుట్టూ గోడ మీద రాయిస్తామనీ చెప్పి – అలా వచ్చింది.

బుల్లి వినాయకుడు పెద్ద పెద్ద చెవుల్తో ముచ్చటగా రావిచెట్టు కింద ఊళ్ళో జరిగేవన్నీ చూస్తూ కూర్చోడానికి పంతులుగారు పెట్టిన ముహూర్తంలో నిశ్చయం అయిపోయింది. ఆయనకి ముందో ఎలక వాహనం, చుట్టూరా ఆరడుగుల ఎత్తు గోడ, చిన్న అరుగు, పంతులుగారు లోపలకెళ్ళి దీపం పెట్టడానికి వీలుగా చిన్న కటకటాల తలుపూ ఆర్భాటంగా అమర్చబడ్డాయి. అన్నింటికన్నా ముఖ్యం, బయట గోడమీద ఫలానా శ్రీశ్రీశ్రీ వెంకటరెడ్డిగారి సహాయంతో అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడింది. బయట చుట్టూ గోడలనిండా అంకమ్మగారు రెండువేలు అనీ, అన్నపూర్ణగారు అయిదువేలు అనీ రకరకాల దాతల పేర్లతో రాయబడిన ఇటుక ముక్కల మధ్యలో బందీగా వినాయకుణ్ణి కూర్చోపెట్టారు. బస్ స్టాండుకెళ్ళే భక్తులో, శివాలయానికెళ్ళేవారో దార్లో ఆగి వినాయకుడికి దణ్ణం పెట్టుకుని ఏ పదో పరకో ఇవ్వాలనిపిస్తే అవి వేయడానికి ఓ హుండీ గుడి బయట ఏర్పాటు చేయబడింది. మరి హుండీలో డబ్బులు ఏ దొంగో ఎత్తుకుపోకుండా ఉండడానికి దానికో గట్టి తాళం ఉండొద్దూ? తళ తళ మెరిసే గోద్రేజ్ నవతాళ్ కూడా శ్రీ వెంకటరెడ్డిగారి చలవే.

ఆ రకంగా ఏకైక ధర్మకర్త శ్రీ రెడ్డిగారి చలువతో పాద ద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుం బరిమార్చి, బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనగతిన్ గ్రీడించు యోగీంద్రు మర్యాదన్, అన్నట్టు వినాయకుడు వీటి మధ్యనే కూర్చుని భాద్రపద శుద్ధ చవితినాడు రావిచెట్టు కింద నుంచి ఊరికేసి చూడ్డం మొదలైంది.

సర్పంచి ఓ చిన్న ధర్మ సందేహం లేవనెత్తాడు – మరి ఈ హుండీ నిండిపోతే ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టాలి? అసలే చవితినాడు మన జనాలకి వీరభక్తి పొంగి పొరల్తుంది కదా? దీనికి వెంకటరెడ్డి దగ్గర సమాధానం సిద్ధంగా ఉంది. ఆయన సలహా ప్రకారం మూణ్ణెల్లకోసారి హుండీ అందరి ముందూ తెరుస్తారు. ఆ వచ్చిన డబ్బులు లెక్కపెట్టి వినాయకుడి పేరు మీద బేంకులో తెరవబోయే ఎకౌంట్లో వేసేయడమే. గుడి గోడకో హుండీకో గంటకో తలుపుకో మరమ్మత్తులు చేయాల్సొస్తే ఈ డబ్బులు పనికొస్తాయ్. మరి చవితినాడో మరో పౌర్ణమినాడో, ఈమధ్యనే మహరాష్ట్ర నుంచి ఎత్తుకొచ్చిన సంకటహరి చతుర్ధి పండగ నాడో మన జనాలకి కొంచెం భక్తిరసం ఎక్కువై హుండీ నిండిపోతే పంతులుగారు అందరికీ చెప్తారు. అప్పుడు ఓ సారి స్పెషల్‌గా హుండీ తెరిచి మళ్ళీ ఆ డబ్బులు బేంకులో వేసేయడమే. వెంకటరెడ్డిగారు ఏకైక ధర్మకర్త కనక సంతకం పెట్టి దేవుడి కోసం బేంకు లోంచి డబ్బులు తీసి వాడతారు.

పంతులుగారు రోజూ పొద్దున్నే వచ్చి దీపం పెట్టాలి తీసుకునే జీతానికి. ఉన్నంతలో అరటిపండో మరోటో ప్రసాదం. ఏదీ లేకపోతే గుడం నివేదయామి అనేది ఎలాగా ఉండేదే.

అన్నీ సవ్యంగా జరిగిపోయేయి. చవితి పూజ అయిపోయాక గణపతి నవరాత్రుల్లో బుల్లి వినాయకుడు కొత్త రంగుల్తో కళకళలాడేడు. ఆయనతో బాటు ఆయన వాహనం కూడా రంగులు వేయించుకుంది. గుళ్ళో గంట గణగణలాడుతూంటే నవరాత్రులు ఇట్టే గడిచిపోయాయి. నవరాత్రుల్లో ఓ మూడు వేలు సంపాదించుకున్న వినాయకుడిప్పుడు మరీ అంత లక్ష్మీ పుత్రుడు కాదు కానీ కొంచెం డబ్బున్నవాడే.


రోజులు గడుస్తున్నాయి. పంతులుగారికి జీతం రెడ్డి దగ్గిర్నుంచి బాగానే అందుతోంది. ఆయన పొద్దుటే ఆరింటికల్లా వచ్చేసి విగ్రహం మీద నిర్మాల్యం తీసి, తెచ్చిన నీళ్ళు ఓ చెంచాతో చిలకరించి, ఓం గణానాంత్వా… అంటూ మొదలు పెట్టి రెండు పువ్వులు వినాయకుడి తల మీద, ప్రసాదంగా పండో మరోటో పెట్టి అరగంటలో ముగించి వెళ్ళిపోతాడు. పిండి కొద్దీ రొట్టె కదా? రెడ్డిగారిచ్చే వెయ్యి రూపాయలకి రోజంతా ఇక్కడే కూచుంటే మిగతా పూజలూ, తన బ్రాహ్మణీకం చూసుకోవద్దూ?

పంతులుగారికి త్వరలోనే తెలిసొచ్చినదేమిటంటే రెడ్డి అసలు ఈ గుడి కట్టించడానిక్కారణం – తన బిజినెస్సు పెంచుకోవడం. ఊళ్ళో ఉన్న పటికబెల్లం ఫేక్టరీ, చేపల చెరువులు, బట్టలకొట్టు, మెడికల్ షాపు, వ్యవసాయం – ఇవి చాలక బియ్యం మిల్లూ, సగ్గుబియ్యం చేయడానికో సాగో ఫేక్టరీ మొదలెట్టాలనుకున్నారు కానీ లైసెన్సులు రావట్లేదు.

ఇదిగో ఇలా వినాయకుణ్ణి ప్రతిష్ఠించడం ఏవిటీ అలా లైసెన్సులు రావడమేమిటీ అన్నీ ఒక్కసారి జరిగిపోయాయి. రెడ్డిగారి వ్యాపారం – ఇద్దరు అల్లుళ్ళూ, ముగ్గులు కొడుకుల సహాయంతో – అంతకంతకూ పుంజుకుంది. బిజినెస్సు పైకొచ్చేకొద్దీ పంతులు గారికీ జీతం పదో పాతికో పెరుగుతోంది. వినాయకుడికీ కొత్త ప్రసాదాలు అందుతున్నాయి, పండగలకీ పబ్బాలకీ రెడ్డిగారి కుటుంబంలో పుట్టిన రోజులకీ శుభకార్యాలకీను. మిగతా రోజుల్లో పాపం ఆయన బొజ్జ ఖాళీగా ఉండకుండా చిన్న బెల్లమ్ముక్క ఉండనే ఉంది.


రోజులన్నీ ఒకేలా ఉండవు కదా, బిజినెస్సులో వచ్చే డబ్బులన్నీ బేంకుల్లో పెడితే ప్రభుత్వంవారు చూసి పన్ను కట్టమంటే? అదే బంగారం రూపంలో ఉంచుకుంటే సులువు. నగో నట్రో చేయించుకుంటే అడిగే నాథుడు లేడు. బంగారం దగ్గిర మరో వెసులుబాటుంది. అది కరిగించేస్తే అది ఎవరిదో ఎక్కడిదో వినాయకుడు కాదు కదా త్రిమూర్తులకైనా తెలియదు. నగలూ బిస్కట్లూ చేయించచ్చు. కానీ, ఏపనికీ అవి పనికిరావు. ఎలాగైనా చేతిలో నోట్లు ఆడుతూండక పోతే కష్టం కాదూ? అందుకే పది కోట్లదాకా వెంకటరెడ్డి ఇంట్లోనూ మరోచోటా మరోచోటా దాచేడు. అంతా బాగా జరిగిపోతోందనుకుంటున్న రోజుల్లో ప్రభుత్వం పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది.

నల్లధనం మురిగిపోయేలా చేయడానికి అయిదొందల నోట్లూ వెయ్యి రూపాయల నోట్లూ రద్దు చేయబడ్డయ్. మీ దగ్గిర కానీ ఈ నోట్లు ఉంటే వెంఠనే బేంకుకి వచ్చి మార్చుకోవాలి అని ప్రకటించేరు. వెంకటరెడ్డికి దడ మొదలైంది. ఏ అయిదారు లక్షలో అయితే మార్చుకోవచ్చు మరి ఇప్పుడు తన దగ్గిర దాచింది కోట్లకి పైమాటే. ఊరంతా తనని తెలియవారు లేరు. బేంకుకి తనవాళ్ళని ఒక ఇరవై మందిని పంపినా మేనేజరుకి అందరూ తెలిసినవాళ్ళే. కొద్దిపాటి కమీషను ఇస్తే మేనేజరు చూసీ చూడనట్టు పోవచ్చు. కానీ ఇంత మొత్తం కష్టం, దానికి మేనేజరులాంటి చిన్నచేప సరిపోదు.

బేంకుకొచ్చి మొహమాటం లేకుండా వెంకటరెడ్డి మేనేజర్‌తో చర్చించాడు, కేషుంది కొద్దిగా చేతిలో, ఏం చేయనూ? అని. తెలిసిన విషయం ఏమిటంటే మహా అయితే తాను అరకోటి నల్ల ధనాన్ని తెల్లగా చేసుకోవచ్చు. మిగతా వాటికి నీళ్ళధారే. ఇంటికొచ్చిన వెంకటరెడ్డి కొడుకులనీ, అల్లుళ్ళనీ కూర్చోబెట్టి చెప్పాడు సంగతి. అందరూ అన్నీ విన్నాక ఏం చేయాలో తోచని స్థితిలో చిన్న అల్లుడు ఇచ్చాడు మంచి సలహా.

ఆ సలహా ప్రకారం తమ నల్లడబ్బులో బేంకు ఇవ్వగలిగినంత వరకూ తెల్లగా చేసుకున్నాక మిగిలిన నగదు బుల్లి వినాయకుడి హుండీలో వేసేయడమే రాత్రికి రాత్రి ఎవరూ చూడకుండా. హుండీ అందరి ముందూ ఖాళీ చేస్తారు కనక ధర్మకర్త సమక్షంలో బేంకు మేనేజరు, వాళ్ళ కుర్రాళ్ళూ సాక్షిగా ఈ హుండీ తెరిచి బేంకుకి తీసుకెళ్తారు. డబ్బులు వినాయకుడివి కనక బేంకు మేనేజరు, ప్రభుత్వం వారూ రెండుచేతుల్తో నోరు మూసుకుని డిపాజిట్ చేసుకోవాలి. వినాయకుడు కూర్చున్న చోటినుండి అంగుళం కదలకుండా ఈ డబ్బులన్నీ తెల్లగా చేసుకోగలడు. లేని పక్షంలో వినాయకుడు ఊరుకుంటాడా? దేవుడి డబ్బులు ముట్టుకుంటే రౌరవాది నరకాల్లో పడిపోరూ?

అల్లుడి తెలివితేటలకి వెంకటరెడ్డి ఆనందపడిపోయి అడిగేడు, “మరి అది దేవుడి ఖాతాలోకి పోతే మనకి ఎనక్కి ఎలా వచ్చుద్ది?”

గీత చెప్పబోతున్న కృష్ణుడిలా ఓరగా నవ్వుతూ అల్లుడు చెప్పేడు, “తర్వాత వినాయకుడి ఖాతాలోంచి మనం తీరిగ్గా తీసుకుందాం. ఇప్పుడు దానికి తొందరేవుంది? మనవే కదా ధర్మకర్తలం?”

ఈ ప్లాను ప్రకారం ప్రభుత్వం వారిచ్చిన గడువులోపుల తమ దగ్గిరున్న నల్లడబ్బు తెలుపు చేసుకున్నాక, మిగిలిన నల్లడబ్బు రాత్రికి రాత్రి వినాయకుడి హుండీలో మూడో కంటికి తెలియకుండా చేరిపోయింది. ఆ రాత్రి రావిచెట్టు కింద ప్రసాదం ఎక్కువైపోయిన బుల్లి వినాయకుడిని చూసి – చవితి నాడు నవ్వినట్టూ – చంద్రుడు మళ్ళీ నవ్వేడు. అయితే ఈ సారి కొడుకు అవస్థ చూసి అలా నవ్వినందుకు చంద్రుడి మీద అమ్మవారికి కోపం రాలేదు సరి కదా తాను కూడా నవ్వు కలిపింది. వీళ్ళిద్దర్నీ చూసి వినాయకుడు కూడా నీరసంగా నవ్వేసరికి ఎలక వాహనం కూడా మొహమాటంగా నవ్వింది.


మర్నాడు పొద్దున్నే మామూలుగా దీపం పెట్టడానికొచ్చిన పంతులుగారికి ముందుగా కనబడింది నిండిపోయిన హుండీ, అందులోంచి పట్టక బయటకి తన్నుకొచ్చే అయిదు వందల, వెయ్యి రూపాయల నోట్లూను. దాని సంగతలా ఉంచి తలుపు తీయబోతే వినాయకుడి గుడిలో, వాహనం మీదా ఎక్కడపడితే అక్కడ కుప్పలు తెప్పలుగా నోట్లు. పంతులు గారికి పది నిముషాలు ఏవి చేయడానికీ పాలుపోలేదు. తలుపు తీయకుండా అలాగే వదిలి తన మోటార్ సైకిల్ దగ్గిరకొచ్చి సెల్ ఫోన్ బయటకి తీసి వెంకటరెడ్డికి ఫోన్ చేశాడు.

ఈ ఫోన్ రావడం కోసమే చూస్తున్నాడా అన్నట్టూ వెంకటరెడ్డి అందుకుని అడిగేడు, “ఏంటి పంతులుగారూ! పొద్దున్నే ఫోన్ చేసేరు?”

“మీరోసారి అర్జంటుగా వినాయకుడి గుడి దగ్గిరకి రావాలండి. మీ అబ్బాయినో, అల్లుణ్ణో తీసుకొస్తే మంచిది.”

“ఏటండి సంగతి, అంతా సరిగ్గుందా?”

“అవునండి. ఇది గుడికి సంబంధించిన విషయం, అలా ఫోను మీద చెప్పేది కాదు. ఒక్క పది నిముషాల్లో రాగలరా?”

“సరే అయితే అల్లుడితో వస్తున్నాను,” ఫోను పెట్టేసి అక్కడే ఉన్న అల్లుడితో చెప్పేడు రెడ్డి, “డబ్బులు చూసి పంతులు డంగైపోయినట్టున్నాడోయ్, మన డబ్బులకేం ఫర్లేదా?”

“పంతులుకి భయం. నోటు ముట్టుకోడు. మహా నొక్కితే కూడా ఒక కట్ట నొక్కుతాడు, అంతేగా. నాదీ భరోసా, ఏమీ కంగార్లేదు.”