జులై 13, 2009
వారం రోజులుగా వింటున్న గ్రేప్ వైన్‌కి ఆ సోమవారం తెరపడింది. శుక్రవారం పొద్దున్నే పింక్ స్లిప్పులిస్తారని తెల్సిపోయింది కనక ఎవరు పోతారో ఎవరు మిగుల్తారో అనేదాని మీద తర్జనభర్జనలు మొదలయ్యాయి. కంట్రాక్టర్లు పోతారు సరే కానీ వాళ్ళకిచ్చిన కంట్రాక్టుల వల్ల ఏడాది చివరిదాకా వాళ్ళని కొనసాగించాలి తప్పదు. ఇంకపోతే మిగిలిన ‘ఎఫిషియెంట్’ స్టాఫ్ లో గ్యారంటీగా ముగ్గురు పోయే ఛాన్స్ ఉంది. అందులో ఇద్దరు కొత్తగా చేరినవాళ్ళు కనక వాళ్ళుపోతారు. మిగిలిన పోయే/పోబడే ఒకరూ ఎవ్వరు?
తను జేరి ఆరేళ్ళు కావస్తూంది ఇప్పటికి. తన హెచ్-వన్ వీసా పొడిగించబడి ఆఖరు ఏడాదిలో కుంటుతూంది. లేబర్ ఐపోయినా గ్రీన్ కార్డు రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడు కానీ తనని తీసేస్తే ఇప్పటిదాకా కంపెనీ పెట్టుకున్న లాయర్ ఛార్జీలు, ఇమిగ్రేషన్ ఫీజులకి తిలోదకాలే కనక తనని తీసేయడానికి ఛాన్సు తక్కువేనేమో? ఉద్యోగం పోతే మారుమూల నున్న ఈ లిటిల్ రాక్‌లో నాకేం ఉద్యోగం దొరుకుతుంది? ఎవడు చెప్పొచ్చాడు ఏమి జరుగుతుందో!… ఆలోచిస్తున్నాడు రామారావు.
సాయంకాలం ఇంట్లో అదే డిస్కషన్ మళ్ళీ గీత తోటి. పదేళ్ళ పెద్దమ్మాయి, ఏడేళ్ళ బాబిగాడు ఆడుకోడానికి దగ్గిరకొస్తే కొంచెం చిరాగ్గా ఉన్నా నచ్చచెప్పి వాళ్ళని వాళ్ళ రూములోకి పంపించేడు. ఉద్యోగం పోతే తర్వాతేమిటన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాల్సి వస్తోంది. ఒకటి మాత్రం నిజం. ఎవడి ఉద్యోగం పోయినా ఈ ప్రపంచం అలా పోతూనే ఉంటుంది. ఉద్యోగం నిలబెట్టుకున్నవాడు రారాజు, మళ్ళీ రౌండ్ లే ఆఫ్‌లు వచ్చేదాకానే ఐతే మాత్రం? గంటల తరబడి గీతతో డిస్కషన్ చేసాక మొత్తం మీద తేలిందేమిటి? ఏమీ లేదు. పోవడానికి ఛాన్సు లేదని అనుకోవడానికి బాగానే ఉంది కానీ పోతే? చిరాకెత్తి “పోతే పోనీ. ఇంక దీని గురించి మాట్లాడుకోవద్దు” అంటూ వెళ్ళిపోయేడు రామారావు.
జులై 17, 2009
పేలవల్సిన బాంబు శుక్రవారం పొద్దున్నే పేలింది. రామారావుక్కూడా ఉద్యోగం పోయింది. బాస్, “నీ గ్రీన్ కార్డు ఎప్పుడొస్తుందో ఏమిటో తెలియదు. అప్పటి దాకా నిన్ను పోషించాలంటే తడిసి మోపెడు అవుతుంది. రామారావ్! నువ్వు బాగా టాలెంట్ ఉన్నవాడివి. నీకు ఇంకో ఉద్యోగం దొరుకుతుందనుకుంటున్నాను త్వరలో. ప్లస్ నీకు వచ్చే ఆరువారాల సెవరెన్స్ పేకేజ్ వస్తుంది. ఏమీ పర్వాలేదు. నీకు రెఫరెన్స్ కావాలిస్తే నేను ఉన్నాను కదా?” అన్నాడు. ఈ మాటలకేం అనుకుంటూ ఆఫీసులో తన సామానంతా ఇచ్చిన బాక్సుల్లో పెట్టుకుని ఇంటికొచ్చేడు. మధ్యాహ్నమే వచ్చేసిన మొగుడ్ని చూసేసరికి జరిగింది గీతకి చెప్పక్కర్లేకుండానే తెల్సిపోయింది.
మౌనంగా అన్నం తినేటప్పుడు గీతతో అన్నాడు రామారావు, “ఆరువారాలదాకా జీతం, బెనిఫిట్సూ అన్నీ ఇస్తారు. ఆ తర్వాత నుంచే అన్నీ చూసుకోవాల్సింది.” ఏమనాలో తోచలేదు గీతకి. “ఆరువారాలంటే సెప్టెంబర్ పదిహేను దాకానా?” తనలో తను అనుకుంటున్నట్టూ అంది. “కాదులే అక్టోబర్ ఒకటి దాకా అని చెప్పేరు, పోనీలే అని మొత్తం సెప్టెంబర్ నెలంతా ఇద్దామనుకున్నారు కాబోలు,” చెప్పి చేయికడుక్కుని లేచిపోయేడు రామారావు.
ఆగస్ట్ 18, 2009
రోజూ పంపించే రెస్యూమెలతో, వచ్చే రిజక్షన్ లెటర్స్ తో ఈమైల్ కోటా తరిగిపోతోంది. గ్రీన్ కార్డు ఉండి ఉంటేనా, అనుకోని రోజులేదు. నాన్న పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఇంట్లోనే వుంటున్నాడని పిల్లలకి కూడా తెల్సిపోయింది. రెస్టారెంట్ భోజనాలు, మాల్ షాపింగులూ, వీకెండ్ ట్రిప్పులూ అన్నీ బంద్! మెల్లిగా సబ్జక్ట్ మీద పట్టు తప్పుతోంది రామారావుకి. ఒకప్పుడు కళ్ళు మూసుకుని డేటాబేస్ మీద స్క్రిప్టు రాసేయగల్గిన రామారావుకి ఇప్పుడు తాను రాసింది కరక్టేనా అనే అపనమ్మకం పొడసూపుతోంది. ప్రాక్టీస్ చేద్దామంటే కావాల్సిన ఒరాకిల్ సాఫ్టువేరు ఇంట్లో లేదు. రామారావు జీవితంలో ఇంకో నెల అలాగే గడిచిపోయింది. ఆగస్టే రామారావు జీవితంలో అత్యంత నిదానంగా గడిచిందేమో?
సెప్టెంబర్ 10, 2009
ఇరవై రోజుల్లో రాబోయే క్రూసిఫిక్షన్ తల్చుకుంటూ లేటుగా పడుకున్నాడు రామారావు. శాలరీ రాకపోయింది సరే ఇప్పుడు అక్టోబర్ నుంచీ మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉండదు. అది కావాలంటే కోబ్రా అనేదాన్ని తీసుకోవాలి. ఎవడు పెట్టేడో కానీ ఈ కోబ్రా పేరు, అది నిజంగానే తాచుపాము లాంటిది. కరిస్తే ఇంక బతకడం కల్ల. ఈ కోబ్రాకి డబ్బులు కట్టాలి అనే ఆలోచనకే ఒళ్ళు గగుర్పొడుస్తోంది రామారావుకి. మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.
ఓ రాత్రివేళ కూతురు లేపింది. “నాన్నా నాకు భయం వేస్తోంది” అంటూ.
“ఎందుకమ్మా? ఏమైంది?”
“ఉరుములు మెరుపులు వస్తున్నాయి. తుఫాను వస్తుంది”
“ఏమీ ఫర్వాలేదు పడుకో” అంటూ అమ్మాయిని దాని రూములోకి నడిపించుకెళ్ళేడు రామారావు. తన బెడ్రూం లోకి వస్తూంటే హాల్లో ఫైర్ ప్లేస్ దగ్గిర ఏదో కదుల్తున్నట్టూ కన్పించింది. దగ్గిరకెళ్ళి చూసేడు. ఏదో సాలీడు. ఇదొకటి ఇప్పుడు. ఈ ఫైర్ ప్లేస్ క్లీన్ చేసి ఉంచుకోవాలి మళ్ళీ స్నో పడేలోపున. పొద్దున్న చూడొచ్చులే అనుకుంటూ వెళ్ళి పడుకున్నాడు.
అరగంట పోయేక మళ్ళీ వచ్చింది కూతురు ఏడుస్తూ, “డాడీ నేనిక్కడే నీ దగ్గిర పడుకుంటా!” అంటూ.
ఈ సారి రామారావుకి తప్పలేదు. పిల్లని మంచం మీద గీతపక్కకి చేర్చి కాసేపాగి తానెళ్ళి హాల్లో కార్పెట్ మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు. చిన్నగా పాప గురక వినిపిస్తోంది. అప్పుడే నిద్రపోయిందా? ఎంత అదృష్టవంతులీ పిల్లలు? ఇదేనేమో వాళ్ళు ఈ చీకూ చింతా లేకుండా పడుకో గలిగే వయస్సు, నిట్టూర్చేడు రామారావు. గడియారం పరిగెడుతూనే ఉంది.
సెప్టెంబర్ 11, 2009
గంటలో తెల్లవారుతుందనగా మెలుకువొచ్చింది రామారావుకి. కుడి చెవిలో ఏదో మంట. చిటికిన వేలు పెట్టి అటూ ఇటూ తిప్పేడు. నెప్పి తగ్గేటట్టు లేదు. ఇదెక్కడి కొత్త గోలరా భగవంతుడా అనుకుంటూ మళ్ళీ పడుకోవడానికి ఉపక్రమించేడు. ఓ గంట పోయేక గీత లేచింది. ఎనిమిదికల్లా పిల్లల్ని స్కూలుకి పంపాలి మరి. కార్పెట్ మీద పొర్లుతున్న రామారావుకేసి చూసి, రాత్రి నిద్ర పట్టలేదా? అంటూ బాత్రూంలోకి దారితీసింది. తనూ లేచి పిల్లలిద్దర్నీ రెండో బాత్రూంలోకి తోసి ఇంకో రోజు మొదలెట్టేడు నిరుద్యోగి రామారావు.
పిల్లల్ని స్కూల్లో దింపి వచ్చాక చెప్పేడు రామారావు గీతతో, “ఈ కుడిచెవిలో ఏదో దూరినట్టుంది. బాగా నెప్పి పెడుతోంది. నీళ్ళు పోసాను కానీ నెప్పి తగ్గలేదు.”
మధ్యాహ్నం రెండింటికి మొదలైంది రామారావుకి అసలు ప్రహసనం. ఒళ్ళంతా దద్దుర్లు లేచాయి ముందుగా. పిల్లలిద్దరూ స్కూల్ నించి వచ్చేసరికి రామారావు కాళ్ళు కదపలేని స్థితిలో హాల్లో కార్పెట్ మీద పడి ఉన్నాడు. గీత కంగారుగా గుండె మీద చెయ్యివేసి చూసే సరికి గుండె విపరీతంగా కొట్టుకుంటోంది. మెల్లిగా లేపి సోఫా మీద పడుకోపెట్టి ఎమర్జన్సీకి ఫోన్ చేయడానికి వెళ్ళేసరికి రామారావుకి డోకులు మొదలయ్యాయి. ఆంబ్యులెన్స్ వచ్చేసరికి రామారావు వేసుకున్న చొక్కా పూర్తిగా తడిసిపోయి కళ్ళు తేలేసి ఉన్నాడు. గీతనీ పిల్లల్నీ తర్వాత కార్లో రమ్మని రామారావుకి తీసుకుని, చెవులు గింగిర్లు ఎత్తే సైరన్ గోలతో ఆంబులెన్స్ సెయింట్ మేరీ ఆస్పత్రికి సాగిపోయింది.
“అమ్మా నాన్నకేమైందే?” అడిగేరు పిల్లలు బేలముఖంతో.
“తెలీదర్రా. ఇప్పుడు మనం హాస్పటల్కి వెళ్దాం. అక్కడ డాక్టర్ చెప్తారు.” అంది కంగారుగా కారు తాళాలు చేతిలోకి తీసుకుంటూ.
ఎమర్జన్సీ వార్డులోకి వెళ్ళగానే గీతనీ, పిల్లల్నీ ఒక రూములో కూర్చోపెట్టి నోరు విప్పేలోపుల బయటకెళ్ళిపోయింది నర్సు. కాసేపటికి ఒక డాక్టర్ లోపలకి వచ్చాడు. వస్తూనే “మీరు రామారావుకి ఏమవుతారు?” అన్నాడు.
“నేను రామారావు వైఫ్ ని. వీళ్ళిద్దరూ మాపిల్లలు.”
“ఓ ఐ సీ. నా పేరు డాక్టర్ స్టీవ్ సాండర్స్. మీకు ఇక్కడ చుట్టాలు ఎవరైనా ఉన్నారా సహాయంగా?”
ఈ పాటికి కొంచెం బెదురు పుట్టుకొచ్చింది గీతకి. “ఎందుకండీ? రామారావుకి ఏమీ ఫర్వాలేదు కదా?” డాక్టర్ సాండర్స్ గీత చేతులు మెల్లిగా వణకడం గమనించేడు.
“పిల్లల్ని బయట ఉన్న ప్లే ఏరియా లో ఉంచి రండి. నేను చెప్తాను.”
పిల్లల్ని బయట వదిలి రాగానే డాక్టర్ గదిలోకి వచ్చేడు. ఈ సారి నర్సు కూడా ఉంది ఒక గ్లాసు మంచినీళ్ళతో.
“అయాం సారీ గీతా, రామారావు ఇక్కడకొచ్చేసరికే, బహుశః ఆంబ్యులెన్సులో అయ్యుండొచ్చు, పోయాడు. ఇంకా మరణం ఎలా వచ్చిందో తెలియదు. కానీ అటాప్సి చేసి పేథాలజిస్ట్ మీకు వివరణ ఇవ్వగలరు. అయాం ట్రూలీ సారీ.”
ఒక్కొక్క పదం సమ్మెట దెబ్బలా పడుతూంటే కుప్ప కూలిపోయింది గీత. నర్సు డాక్టర్ సహాయంతో గీతని లేపి కూర్చోపెట్టి మొహం నీళ్ళతో తుడిచింది. పావుగంట కూర్చున్నాకా నూతిలోంచి మాట్లాడుతున్నట్టూ అడిగింది గీత. “మేము ఆయన్ని చూడొచ్చా?”
“తప్పకుండా. కానీ ఇక్కడ ఇంకో గంట కన్నా ఉంచము. మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిలుద్దాము. ఓ గంట పోయాక బాడీ మోర్గ్ లోకి మార్చవల్సి ఉంటుంది. కానీ ప్రాణం పోవడానికి కారణం కావాలంటే మాత్రం పేథాలజిస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాలి. దానికో రెండు మూడు రోజులు పట్టొచ్చు…” చెప్పుకుపోతున్నాడు డాక్టర్ తన ధోరణిలో.
తెల్సిన ఇంకో తెలుగు ఫేమిలీని పిలిచి మిగతా తతంగం కానిచ్చేడు డాక్టర్. రామారావు బాడీని మోర్గ్ లోకి చేర్చి అటాప్సీకి ఆర్డరిచ్చేరు. అదైనా లైఫ్ ఇన్స్యూరెన్సుకి పేపర్లు పంపించాలి కాబట్టి. తర్వాత వారం ఎలా గడిచిందో దేముడికెరుక. గీతకా ఉద్యోగం లేదు. ఉండడానికి వీసానూ లేదు. పిల్లల్ని స్కూల్ మానిపించేసింది. జీవితమే పోతుంటే స్కూల్ ఒక అడ్డా? తను నించున్న నేల రెండుగా విచ్చుకుపోయి లోపలకి కూరుకుపోతున్న భావన. తోటి తెలుగువాళ్ళు ఆదుకోకపోయి ఉంటే ఏమై ఉండేది… ఆ ఆలోచనే భయంకరంగా ఉంది.
సెప్టెంబర్ 13, 2009
“సెంట్ మేరీ హాస్పిటల్ మోర్గ్. నేను జెన్నీ మాట్లాడేది.”
“హల్లో డాక్టర్ మెల్విన్ ఉన్నారా?”
“ఉన్నారు. పిలుస్తాను,” డాక్టర్ మెల్విన్, మీకు ఫోన్! అరిచింది జెన్నీ. అయిదు నిముషాలు పోయేక మెల్విన్ చేతులు కడుక్కుని ఫోనందుకున్నాడు, “డాక్టర్ మెల్విన్ హియర్.”
“హాయ్ డాక్టర్. నేను ఫస్ట్ నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మా క్లైంట్ ఒకడు, పేరు రామారావనీ, పోయాడు ఈ మధ్యనే. మీరు అటాప్సీ చేస్తున్నారని తెల్సింది. ఏమైనా చెప్తారా మాకు? అన్నీ కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాము.”
“ఇలా ముందు ఫోన్ చేసి మీరు అడక్కూడదు, మేము చెప్పకూడదూ. రిపోర్ట్ వచ్చేదాకా ఆగండి.”
“అయ్యో, మీ కష్టం ఉంచుకోం సార్. ఫోన్ పెట్టేయకండి. రామారావనీ…”
సడన్‌గా మెల్విన్‌కి ఇంటరెస్ట్ ముంచుకొచ్చింది. “రామారావా? ఆ, ఓకే, అటాప్సీ అయిపోయింది. అతని బ్రెయిన్లో టాక్సిక్ సబ్‌స్టన్స్ ఉన్నట్టు తేలింది. అయితే అది సూయిసైడా కాదా ఇంకా తెలియదు. టాక్సికాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. ఇంకో రెండ్రోజులు పోతేగానీ ఏమీ తెలియదు. ”
“సారీ డాక్టర్, మీ కష్టం ఉంచుకోము. రామారావుకి కంపెనీ ఒక మిలియన్ డాలర్లకి ఇన్స్యూరెన్స్ ఇచ్చింది. ప్లస్ అతను ఇంకో మిలియన్ కి వేరేగా కడుతున్నాడు…”
“వాట్! రెండు మిలియన్ డాలర్లా?” అన్నాడు డాక్టర్ మెల్విన్ ఎర్రబడ్డ ముఖంతో. అప్పటిదాకా ఏదో చేస్తున్న జెన్నీ ఈ అరుపుకి ఇటువేపు తిరిగి చూసింది.
ఇన్స్యూరెన్స్ ఏజెంట్ ఇంకా చెప్పటం మొదలెట్టేడు, “కానీ అతన్ని లే ఆఫ్ చేసి ఒక నెల అవుతోంది. లే ఆఫ్ లో భాగంగా ఈ బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఇవి సెప్టెంబర్‌కి ఎండయ్యేలోపునే రామారావు పోయేడు. ఇతని ఫేమిలీకి రెండు మిలియన్లు ఉన్నట్టుండి ఇవ్వాలంటే అంత ఈజీ కాదు కదా. ఏ సూయిసైడో ఇంకోటో ఐతే మాకు అంత కష్టంగా ఉండదు. మీరు హెల్ప్ చేస్తారేమో అని మిమ్మల్ని కంటాక్ట్ చేస్తున్నాను. మీ కష్టం ఉంచుకోం లెండి. ఇంతకి ఒంట్లోకి విషం ఎలా వచ్చిందంటారు?”
ఇది విన్నాక తన జీతం, రెక్కాడితేకానీ డొక్కాడని బతుకు, ఇంకా తాను తీర్చవల్సిన మెడికల్ స్కూలు అప్పులూ అన్నీ కళ్ళముందు కదలాడేయి మెల్విన్‌కి. “చూద్దాం. అది సూయిసైడే కావచ్చేమో?” చుట్టూరా చూసి చిన్నగా అన్నాడు ఫోనులో మెల్విన్.
“మీ కష్టం ఉంచుకోమని చెప్పాంగా? ఒక లకారం దాకా మేము సర్దగలం.”
“సరే చూద్దాం. శనివారం రాత్రి తొమ్మిదికి నా సెల్‌కి మళ్ళీ ఫోన్ చేయండి. బై.”
ఫోన్ పెట్టేసి మళ్ళీ గ్లోవ్స్ తొడుక్కుని మోర్గ్ కేసి నడిచాడు. ఈ సారి కాళ్ళు గాల్లో తేలిపోతున్నాయి. ఒక లకారం. ఎన్ని శవాలు కోస్తే ఒక్కసారి తాను అంత సంపాదించగల్డు? ఈ దెబ్బతో తన దరిద్రం వదిలిపోతుంది. పోయిన రామారావెలాగా పోయేడు. అయినా ఎవడో ఇమిగ్రంట్‌కి అంత డబ్బా? ఇవతల తనూ, తన ఫేమిలీ ఇలా ఉంటే… ఆ క్షణంలో మెడికల్ స్కూల్లో చెప్పిన ఎథిక్స్ కానీ, దిక్కులేకుండా పోబోతున్న రామారావు కుటుంబం కాని డాక్టర్ మెల్విన్‌కి గుర్తు రాలేదు.
ఇదంతా దాదాపు పూర్తిగా విని, చూస్తోన్న ఇంకో రెండు కళ్ళు మెల్లిగా తలవంచుకుని పనిచేస్తున్నట్టూ నటిస్తూనే ఉన్నాయి.
సెప్టెంబర్ 14, 2009
“హల్లో నేను గీతని మాట్లాడుతున్నాను. మీరెవరండి?” అడుగుతూ కాలర్ ఐడి మీద చూసింది గీత యధాలాపంగా, అన్నోన్ కాలర్ అని ఉంది.
“అదంత అవసరం కాదు. ఫోన్ పెట్టేయకండి. నేను టెలి మార్కెటర్ని కాదు. మీ హస్బండ్ అటాప్సీలో తప్పులు కావాలని జరుగుతున్నాయి. అవి మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే మీకు రాబోయే ఇన్స్యూరెన్స్ డబ్బులు పోతాయి. అటాప్సీ చేసే డాక్టర్ మెల్విన్ ఇన్స్యూరెన్స్ కంపెనీతో కుమ్మక్కై రామారావు డెత్ సూయిసైడ్ అని రిపోర్ట్ రాయబోతున్నాడు.”
“అయ్యో, ఆయనెప్పుడు సూయిసైడ్ అని కూడా అనలేదు అలాంటివారు కాదే! ఇప్పుడేం చేయమంటారు?”
“సెకండ్ ఒపీనియన్ అని అడగండి. ఈ సారి మీకు తెల్సున్న పేథాలజిస్ట్‌తో అటాప్సీ చేయించుకోండి.”
“నాకు కాలూ చెయ్యీ ఆడట్లేదండి ఇప్పుడు. అసలే ఆయన పోయి మేము ఏడుస్తూంటే ఇదింకో తలనొప్పా?
“అయాం సారీ. మీకు హెల్ప్ చేద్దామనే గానీ ఇంకో ఉద్దేశ్యం లేదు నాకు.”
“థేంక్యూ, మీ పేరు చెప్పేరు కాదు.”
“అదంత అవసరం కాదండి. గుడ్ లక్.”
ఫోన్ పెట్టేసిన గీత చాలా సేపు స్థబ్ధుగా కూర్చున్నాక లేచి తనకు తెలిసున్న తెలుగాయనకి చెప్పింది విషయాలన్నీ. ఆయన విని తనకి తెల్సున్న లాయర్ దగ్గిరకి తీసుకెళ్ళేడు. వేరే పాథాలజిస్ట్ చేత రెండో ఒపీనియన్ అడగొచ్చనీ, తాను హెల్ప్ చేస్తాననీ చెప్పేడు. ఏదో గుడ్డిలో మెల్ల అనుకుంటూ ఇంటికి చేరింది గీత.
సెప్టెంబర్ 20, 2009
“హల్లో మెల్విన్ స్పీకింగ్”
“మీరు ఇచ్చిన రిపోర్ట్ బాగుంది. దాంతో బాటు పోవడానికి కారణం బాగానే ఉంది. కాని దీనిమీద తిరకాసు వస్తే?”
“ఓ ముందే చెప్పేను కదా? డౌట్ వస్తే పోయినాయన తాలూకు మనుషులు రెండో, మూడో రిపోర్ట్స్ కూడా అడగవచ్చు. దానికి నేనేం చెయ్యలేను. మీకు నచ్చినట్టు రాయమన్నారు. నాకిచ్చిన డబ్బులకి దానికీ సరిపోయింది. వాళ్ళు ఏం చేస్తారో నాకెలా తెలుస్తుంది? దానికి నేను బాధ్యుణ్ణి కాదు. కేసు రాకుండా చూస్తాన్నని మీరు నాకు మాటిచ్చేరు కదా?”
“ఏమీ కంగారు లేదు. భయపడకండి. మీకిచ్చిన కేష్ చేరిందా?”
“ఆ, వచ్చింది. ఇంక మీరు నాతో మాట్లాడకపోవడం మంచిది. ఇదిలా కంటిన్యూ అయితే నా లైసెన్స్ పోయే ఛాన్స్ ఉంది. గుడ్ బై.”
సెప్టెంబర్ 24, 2009
డాక్టర్ శేషయ్య లేబ్ లోంచి బయటకి రాగానే చేసిన మొదటి పని గీతకి ఫోన్ చెయ్యడం.
“నేను శేషయ్యని మాట్లాడుతున్నాను. అంతా తెలుగులోనే మాట్లాడండి. రామారావు అటాప్సీ చేసి ఇప్పుడే వస్తున్నాను. ఇంకా రిపోర్ట్ రాయలేదు. ముందు మీకే చెప్దామని ఫోన్ చేస్తున్నాను. రామారావు చెవిలో సాలీడు ఉంది. అది లోపల కుట్టినప్పుడు విషం ఎక్కి డైరక్ట్ గా మెదడులోకి పోయింది. పోవడానికి ముందు డోకులూ, ఒంటి మీద దద్దుర్లూ కానీ మీరు చూసారా?”
“అయ్యో, అయ్యో, అవునండి. పోవడానికి ముందు డోకులు వెళ్ళాయి. ఒంటి నిండా దద్దుర్లు ఉన్నాయి కూడా. అసలు సాలీడు కుడితే ఇలా అవ్వొచ్చా?”
“బ్లాక్ విడో స్పైడర్ అనేది కరిస్తే కొంతమందిలో తప్పకుండా ఇలా జరగొచ్చు. కానీ అనేకానేక విషయాల మీద ఆధారపడి ఉంటుందనుకోండి. మీరు ముందే ఎమర్జన్సీకి ఫోన్ చేసి ఉంటే రామారావు తప్పకుండా బతికేవాడు.”
“ఆయన ఉద్యోగం పోయి చాలా టెన్షన్ పడుతున్నారు పోయేముందు. డాక్టర్ల దగ్గిరకి వెళ్ళాలంటే ప్రోబ్లెమ్ కదండి.” సన్నగా వెక్కుతూ అంది గీత.
ఇంక పొడిగించడం మంచిది కాదని చెప్పేడు డాక్టర్ శేషయ్య, “సరే అమ్మా నేను రిపోర్ట్ రాసి ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా కావలిస్తే తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మీకు ఏమీ చెప్పకూడదు నిజానికి. కాని సాటి తెలుగు వారని చెప్పేను. ఎవరిదగ్గిరా అనకండి మళ్ళీ, నేను రిపోర్ట్ పంపించేదాకా. ఓకే?”
అక్టోబర్ 02, 2009
డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ ముందు చెప్పేడు గీత లాయర్ మైఖెల్, “యువర్ ఆనర్, మా క్లైంట్ సూయిసైడ్ చేసుకునే రకం కాదు. ప్లస్ మేము పేథాలజీ రిపోర్ట్ మీద రెండో ఒపీనియన్ అడిగాము. అందులో రామారావు సాలీడు కరిచి పోయాడని వచ్చింది. మొదటి డాక్టర్ సూయిసైడ్ అని రిపోర్ట్ ఇచ్చారు. దాంతో మా క్లైంట్ లైఫ్ ఇన్స్యూరన్స్‌కి ప్రోబ్లం వచ్చేటట్టు ఉంది. అంచేత ఈ కేస్…”
“లైఫ్ ఇన్స్యూరెన్స్ మనీ ఎంత ఉంది?”
“రెండు మిలియన్ డాలర్లు”
“సరే డిఫెన్స్ ఏమంటారు?” డాక్టర్ మెల్విన్ కేసి తిరిగి అడిగేడు జడ్జ్
“మా డాక్టర్ మెల్విన్ అబ్సర్వ్ చేసిన ప్రకారం, రామారావు పోయింది సూయిసైడ్ మూలానే”, చెప్పేడు మెల్విన్ లాయరు.
“సరే వచ్చే శుక్రవారం చూద్దాం. కేస్ ఏక్సప్ట్ చేస్తున్నాను. ఈ ఇన్స్యూరెన్స్, డాక్టర్ గొడవలు ఇలా ఈజీగా తెమిలేవి కాదు కదా?”
కోర్టులో ఒక వార నిశ్శబ్దంగా ఈ తతంగం అంతా వింటున్న ఇన్స్యూరెన్స్ ఏజెంట్ బైటకి నడిచేడు ఏమీ తెలియనట్టుగా.
అక్టోబర్ 9, 2009
కోర్టులో మెల్విన్ వాదనలూ, శేషయ్య వాదనలూ విన్నాక జడ్జ్ మరో వారానికి కేస్ వాయిదా వేసేడు. బయటకి వచ్చాక గీతకి బై చెప్పి బాత్రూం లోకి దూరేడు లాయర్ మైఖెల్. చేతులు కడుక్కుంటూంటే వెనకనించి వినిపించిందో కంఠం, “లాయర్, మీరు కోర్ట్ బయట కేస్ సెటిల్ చేసుకుంటారా అని అడగమని నన్ను ఇన్స్యూరెన్స్ కంపెనీ పంపించేరు.”
“ఎంతకి సెటిల్ చేసుకుందామని?” వెనక్కి చూడకుండానే అడిగేడు మైకేల్
“ఓ మిలియన్ దాకా మేము సర్దగలం”
“పిచ్చి వెధవలా కనిపిస్తున్నానా నేను? ఇన్స్యూరెన్స్ ఉన్నది రెండు మిలియన్లకి. ఇందులో మెల్విన్ తప్పుచేసేడని తెల్సిపోయింది. ఎందుకు చేసేడనేది తెలిస్తే అతని లైసెన్స్ పీకిద్దామని అనుకుంటున్నాను నేను. నువ్విచ్చే మిలయన్ మూతి తుడుచుకోవడానిక్కూడా పనికిరాదు.”
“మీరు గెలిస్తే మీకు మహా వస్తే రెండు మిలియన్లు రావొచ్చు. కానీ దీన్ని మేము రెండు మూడు ఏళ్ళు లాగి లాగి ఏడిపించగలం. అప్పుడు మీ క్లైంటుకి వీసా ప్రోబ్లెం, జరుగుబాటుకీ ప్రోబ్లెం, మీకు ఖర్చులూ, అవీ తడిసి మోపెడౌతాయ్, ఆలోచించేరా?”
“అవన్నీ కలిపినా ఇంకో యాభైవేలో లక్షో అవుతాయి. ఒక్క మిలియన్ కుదరదు.”
“సరే అయితే, వన్ పాయింట్ త్రీ.”
“నువ్వు చచ్చిపోయి మీ ఆవిడ గీత పొజిషన్లో ఉంటే నువ్వు ఒప్పుకుంటావా?” లాయర్ అడిగేడు ఆగంతకుడ్ని.
“మైకేల్, నేను వన్ పాయింట్ త్రీ అని చెప్పేది క్లైంట్‌కి. మీ ఫీజ్ ఒక లకారం దాకా సర్దుతాము. ప్లస్ మా ఖర్చులు మాకున్నాయ్ కదా? ఇంక ఎక్కువ అడిగితే నా అబోరు దక్కదు మరి.”
అక్టోబర్ 13, 2009
లాయర్ గీతకి ఫోన్ చేసి చెప్పిన ఆఫర్ గురించి గీత స్నేహితుల్తో కల్సి చర్చించింది.
“మొదట మీరు ఎక్కడ సెటిల్ అవుదామనుకుంటున్నారో తెలిస్తే దాన్ని బట్టి డబ్బులు గురింఛి మాట్లాడొచ్చు” అంది ఒకావిడ.
“మా వీసా మీద ఇక్కడ ఉండలేము. ఉండకూడదు అన్నాడు లాయర్. ఈ కేస్ సెటిల్మెంట్ ఒప్పుకోకపోతే రెండేళ్ళు లాగొచ్చు ఇన్స్యూరెన్స్ కంపెనీ దీనిని. ఆ పాటికి నాకు ఒంట్లో సత్తువ, దీని మీద ఇంటరెస్ట్ పోతాయి. ఇండియా వెళ్తే మా పేమిలీ అందరూ ఉంటారు కాబట్టి ఏదో ఒకలాగ బతగ్గలం. అయినా మాకు ఇండియా వెళ్ళడం తప్ప వేరే దారి ఏం ఉంది?” అడిగింది గీత.
“రెండేళ్ళు పోయేక రెండు మిలియన్లు ఇస్తారో ఇవ్వరో చెప్పలేం. ఎక్కువ ఇవ్వొచ్చు, తక్కువ ఇవ్వొచ్చు. అంచేత ఇప్పుడిచ్చే వన్ పాయింట్ త్రీ మంచిదే. ఇది సెటిల్ ఐపోతే మళ్ళీ మీరు కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదు. తీసుకుని సెటిల్ చేయమని నా సలహా” అంది ఇంకో ఆవిడ.
కాసేపటికి నిర్ణయం ఐపోయింది సెటిల్ చేసుకోవడానికి.
అక్టోబర్ 27, 2009
ముందే అనుకున్న ప్రకారం ఇవ్వవల్సిన రెండు మిలియన్లలో ఐదు లకారాలు మిగిల్చిన ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌ని తన గదిలోకి పిల్చేడు బాసు.
“ఎక్సలెంట్ వర్క్, ఎలా లాగించేవ్ ఇవన్నీ, అదీ కోర్ట్ కేస్ లేకుండా?”
“కేస్ పడనే పడింది. మనవాడే క్లైంట్ లాయర్తో బాత్రూంలో మాట్లాడేడు. వీసా గురించీ, రాబోయే ఖర్చుల గురించీ ఒక్కసారి బెదిరించేసరికి కిందకి దిగొచ్చేడు. మనకీ లాభమే కదా?”
“మనజేబులోంచి వన్ పాయింట్ ఫైవ్ పడింది కదా? ఏం లాభం?”
“రెండు మిలియన్లు పోతే బాగుండేదా?” చిన్నగా నవ్వు.
“లేదు లేదు, నువ్వు చేసింది మంచిదే. ఇప్పుడు పోయిన డబ్బులు ఎలాగ వెనక్కొస్తాయా అని నేను ఆలోచిస్తున్నానంతే”
“దాందేవుంది? ఇప్పట్నుంచీ ఆ స్టేట్ లోంచి వచ్చే కొత్త ఇన్స్యూరెన్సులన్నింటికీ రేట్ పెంచితే పోలా?” రెండేళ్ళలో మన డబ్బులు మనకొచ్చేస్తాయ్! ఇంతకీ… ”
“నీ ఎకౌంటు ఓసారి చూసుకో. నో వర్రీస్. కీప్ అప్ ద గుడ్ వర్క్.”
ఉపసంహారం
రెండు వారాల్లో చెక్కు చేతికొచ్చింది. అది జాగ్రత్తగా ఇండియాలో బేంక్‌కి మార్చి ఇల్లు ఖాళీ చేసి నాలుగో వారానికి గీత పిల్లల్తో ఇండియాకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ డాక్టర్ మెల్విన్ మామూలుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు అతనో అప్పుల్లేని మహారాజు. ఇన్స్యూరెన్స్ ఇచ్చిన డబ్బులు అతని మిగిలిన మెడికల్ కాలేజీ అప్పు తీర్చడానికి సరిపోయింది. లాయర్ ఒక లకారంతో సంతోషంగానే ఉన్నాడు. ఇన్స్యూరెన్స్ కంపెనీ ఒప్పుకున్న ‘న్యాయం’ ప్రకారం గీతకి డబ్బులిచ్చేసి, ఇంకో విధమైన ‘న్యాయం’తో ఇన్‌ఫ్లేషన్ పేరుతో రేట్లు పెంచేసి రామారావుకిచ్చిన డబ్బులు రాబట్టుకుంటూనే ఉంది. రామారావు లాంటి ఎన్నో కేసుల్ని ఇలా ఈజీగా పరిష్కారం చేసినందుగ్గాను ఇన్స్యూరెన్స్ ఏజెంట్ ప్రమోషన్లు పుచ్చుకుని బోనస్లతో అంచెలంచెలుగా పైకి ఎదుగుతూనే ఉన్నాడు.
మీ సందేహం సంతకెళ్ళా, ఎంత అమెరికా అయితే మాత్రం కళ్ళకి గంతలు కట్టుకుంటే పూర్తిగా చూడగలుగుతారా ఎవరైనా? అంచేత, కోర్టు ఆవరణలో కళ్ళకి గంతలు కట్టుకున్న న్యాయదేవత చేతి త్రాసులో న్యాయాన్యాలని బేలెన్స్ చేయలేక ఇంకా అలాగే సతమతమవుతోంది.