ఆత్మావై పుత్రనామాసి

చిన్నప్పుడు అమ్మ ఊరికెళ్తే
నాకూ చెల్లికీ అన్నం తినిపిస్తూ పెద్ద
అన్నం ముద్దలు కలిపి పెట్టావు గుర్తుందా?
వాటిని విప్పారిన కళ్ళతో చూస్తూ
తినలేక అవస్థపడుతూ మరో
పెద్ద ముద్దకి మారాం చేసినప్పుడు
నీ మొహంలో తుంటరి చిరునవ్వు
మేము నీకు తీర్చలేని బాకీ

సంక్రాంతికి బయట నాలుక్కూడలిలో
మా చేత వేయించిన భోగిమంట గుర్తుందా?
ఆ మంచు కురిసిన పొద్దున్న మంట దగ్గిర
నీ చేయి పట్టుకుని చలి కాచుకుంటూంటే
మా ఇద్దర్నీ తలోవైపూ పట్టుకున్న
నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం
మేము నీకు తీర్చలేని బాకీ

లెక్కపెట్టలేనన్ని పండగల్లో
శుభకార్యాల్లో, పుట్టినరోజుల్లో
నీకూ అమ్మకీ లేకపోయినా మాకిద్దరికీ
కొత్త బట్టలు కొన్న రోజు గుర్తుందా?
ఆ రోజున పాత బట్టలే కట్టుకుని
మా తలల మీద కొత్తగా కలిపిన అక్షింతలు
వేసినప్పుడు మీ ఇద్దరి మొహాల్లో ఆనందం
మేము నీకు తీర్చలేని బాకీ

మాకు వయసొచ్చాక
నా చెవిలో ఊదిన గాయత్రీ
చెల్లి మెడలో కట్టించిన తాళీ
బోసిపోయిన ఇంటి వరండా
పడక్కుర్చీలో పడుకున్నావు గుర్తుందా?
భాధ్యతలు తీరిపోయాయని
నీకేమీ మిగలలేదని కూడా ఆలోచించని
తృప్తిగా కనిపించే నీ మొహంలో నవ్వు
మేము నీకు తీర్చలేని బాకీ

ఖాళీ గూట్లో వంటరివై కూర్చునప్పుడు
ఇంటికొచ్చి అడిగినవాళ్ళకి
గుండెల్లో కష్టాలని అక్కడే నొక్కిపెట్టి
రెక్కలొచ్చిన పిల్ల పక్షులు ఎగరడం
ఎంత సహజమో చెప్పావు గుర్తుందా?
అప్పుడు నీ మొహంలో కనిపించిన ధైర్యం
మా మీద చూపించిన నమ్మకం
మేము నీకు తీర్చలేని బాకీ

ఈ బాకీలన్నీ మేమెలాగా తీర్చమని తెలిసీ
మాకెందుకిచ్చావని అడిగినప్పుడు
ఎక్కడ కనిపిస్తుందో అనే నవ్వుని
మొహంలో అలాగే కనపడకుండా దాచిపెట్టి
నువ్వు చెప్పిన వాక్యం గుర్తుందా?
“నాకు నేను చేసుకున్నదిరా ఇదంతా
నీకు చేశాననుకున్నావా!
ఆత్మావై పుత్రనామాసి.”