చలి కాలం మొదలౌతూ ఉంది. ఉన్న ఒక్క చిరిగిపోయిన కోటు వేసుకుని సైమన్ ఎప్పటిలాగానే మాట్రియోనా కన్నా ముందు లేచి క్రితం రోజు ఊర్లో భూస్వాములు ఇచ్చిన బూట్లకి చిన్న చిన్న మరమ్మత్తులు చేస్తున్నాడు. ఇక్కడో మేకూ అక్కడో కుట్టూ వేస్తున్న చప్పుళ్ళు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి గుడిసెలో. పని చేస్తున్నాడన్న మాటే గానీ సైమన్ మనసు ఇంకెక్కడో ఉంది. గుడిసె అద్దె కట్టాలి నెలాఖర్లోగా. రోజు రోజుకీ వచ్చే మరమ్మత్తు పనులతో కడుపు నింపుకోవడమే కష్టంగా ఉంది. అన్నింటికన్నా ముందు రాబోయే చలికాలానికో కోటు అత్యంతావసరం. అది లేకపోతే క్రితం ఏడు ఎంత చావుకొచ్చిందో? చప్పుళ్ళకి మాట్రియోనా లేచినట్టుంది. కాలకృత్యాలయ్యేక కాస్త వేడిగా తాగడానికి ఏదో పట్టుకొచ్చింది సైమన్ దగ్గిరకి. పని ఆపి అది తాగుతూ మాట్రియోనా కేసి చూసేడు సైమన్.
“నిన్న రాత్రి చెప్పినది గుర్తుందా? ఈ రోజు ఊళ్ళొకెళ్ళి గొర్రె చర్మం కొంటానన్నావు కదా? నేనిప్పటిదాకా దాచిన మూడు రూబుళ్ళు ఇస్తాను. మధ్యాహ్నం బయల్దేరి వెళ్తే సాయంకాలానికి వచ్చేయవచ్చు.” అన్నది మాట్రియోనా.
“ఇదిగో, ఈ రెండు బూట్ల పని అయిపోగానే స్నానం చేసి బయల్దేరుతున్నాను.”
“దారిలో తొందరపడి నీ దుకాణం దగ్గిరకెళ్ళి డబ్బులు తాగుడుకి తగలేయకు మరి. క్రితం ఏడు కోటు లేక ఎంత అనుభవించామో గుర్తుంది కదా?”
“సరే, సరే. ఊళ్ళొ బాకీలు అయిదు రూబుళ్ళ చిల్లర రావాలి. అవీ, మనదగ్గిరున్నదీ కలిపితే ఎనిమిది రూబుళ్ళవుతుంది. మంచి గొర్రె చర్మం దొరుకుతుంది ఆ డబ్బులకి.”
మధ్యాహ్నం తిండి తిని ఊతానికో కర్ర పట్టుకుని బయల్దేరబోయేడు సైమన్. గుమ్మం దాటుతూంటే మాట్రియోనా వెనకనే వచ్చి తను తొడుక్కున్న గుడ్డకోటూ, ఇంకో పాత టోపీ ఇచ్చి చెప్పింది మళ్ళీ,
“ఇవి కూడా వేసుకో వచ్చే సరికి చలి ఎక్కువగా ఉండొచ్చు. సారా దుకాణం వేపు వెళ్ళకు సుమా!”
మాట్రియోనా ఇచ్చినవి పైన వేసుకుని నడక సాగించేడు సైమన్. ఊళ్ళోకొచ్చి ఒక రైతు గురించి వాకబు చేసేడు. కానీ రైతు ఇంట్లో లేడు. వాళ్ళావిడ చెప్పడం బట్టి, తన దగ్గిర డబ్బులుంటే ఇచ్చుండేదే కనీ ఒక్క కోపెక్ కూడా లేదుట. వచ్చే వారం లోపుల సైమన్ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇప్పిస్తానని మాటిచ్చి తలుపేసుకుంది ఆవిడ. సైమన్ రెండో ఇంటికెళ్ళేసరికి అక్కడున్న రైతు, ‘దేముడి మీద ప్రమాణం, నాదగ్గిర ఈ ఇరవై కోపెక్ లకి మించి ఇంకేమీ లేదు,’ అని అవే ఇచ్చాడు ఒకసారి ఎప్పుడో తన చెప్పులు సరిచేసి కుట్టినందుకు. దానితో పాటు ఇంకో చెప్పుల జత ఇచ్చేడు సరిచేయమని.
రావాల్సిన అయిదు రూబుళ్ళలో వెనక్కి వచ్చింది ఇరవై కోపెక్కులు. వీటితో గొర్రె చర్మం కాదు కదా, గొర్రె తోక బొచ్చు కూడా రాదు. ఇంతదాకా వచ్చాక ఉత్తి చేతుల్తో పోవడమేనా? పోనీ అప్పు మీద చర్మం కొంటే? సైమన్ గొర్రె చర్మాలు అమ్మే ఆయన్ని అప్పు ఇస్తాడేమో అని అడిగేడు. “బాకీలు వసూలు చేసుకోవడం ఎంత కష్టమో మాకూ తెలుసు. డబ్బులు తీసుకురా, తర్వాత నీ ఇష్టం వచ్చినది కొనుక్కుందూగానీ,” అని బయటకి పంపించేడు ఆయన.
సైమన్‌ని బాగా నిరాశ ఆవరించింది. రైతు ఇచ్చిన ఇరవై కోపెక్కులని వోడ్కా తాగడానికి తగలేసి వెనక్కి ఇంటికి బయల్దేరేడు. అయితే ఇంతా కష్టపడి ఈ ప్రయాణంలో సైమన్ చేసినదేమిటంటే ఇరవై కోపెక్కుల బాకీ వసూలు చేసుకోవడమూ, మాట్రియోనా తిడుతుందని తెల్సినా ఇరవై కోపెక్కులే కదా అని వాటిని తాగి తగలేయడమూ, రైతు ఇచ్చిన చెప్పులు పట్టుకురావడమూను. వోడ్కా రక్తంలోకి దిగింది కాబోలు, పైకే గొణుగడం మొదలెట్టాడు వెనక్కి ఇంటికి వెళ్ళే దారిలో.
II
“నాకు వెచ్చగానే ఉంది,” పైకే అనుకున్నాడు నడుస్తూ సైమన్.
“నాకు సరైన కోటు లేకపోయినా. నేనేమీ పట్టించుకోను, గొర్రె చర్మం లేకపోయినా కోటు లేకపోయినా నేను బతగ్గలను. ఇంటావిడ సాధిస్తుంది కోటు కొనుక్కోలేకపోయాం అనీ, ఎంత సిగ్గుచేటూ అనీనూ. తెచ్చిన బూట్లకి పని వెంఠనే చేసి ఇవ్వాలా? డబ్బులు అడిగితే మాత్రం రేపు, మాపు అని తిప్పుతున్నాడీయన. ఆగాగు. నువ్వు ఊళ్ళోకెళ్ళి రావల్సిన బాకీ డబ్బులు తేకపోతే చర్మం వలుస్తాను అంటుందా? అనకపోతే అదృష్టమే. అయినా ఇదేంటీ? వీడికి పని చేసిపెట్టినందుకు ఇప్పుడో ఇరవై అప్పుడో ఇరవై కోపెక్కులూ ఇస్తాడా? ఇరవై కోపెక్కులతో ఏం చేయగలను? వోడ్కా తాగ్గలను అంతేనా? ఎంతో కష్టంగా ఉందిట నాకు డబ్బులు ఇవ్వడానికి ఈయనకి. అయితే అవ్వొచ్చుగాక. నీకైతే భూమి ఉంది, పశువులూ, పాడీ, సొంతంగా పండించుకున్న గోధుమలూ, జొన్నలూ ఉన్నాయ్, మరి నాకో? ప్రతీ గింజ కొనుక్కావాల్సిందే. పని ఉన్నా లేకపోయినా తినడానికి వారానికి మూడు రూబుళ్ళు రొట్టెలకే పోతోంది. ఇంటికెళ్ళేసరికి పొయ్యలో పిల్లి లేవదే? పిండి అయిపోయింది, ఏదీ ఇంకో రూబుల్ తే అని అడుగుతోంది. నాకున్న బాకీ నువ్వు తీర్చకపోతే నేనెక్కడ చచ్చేది?”
ఈ సరికి సైమన్ ఊరి చివర మలుపులో గుడి దగ్గిరకొచ్చేడు. తలెత్తి పైకి చూసేసరికి గుడి దగ్గిర ఏదో తెల్లగా కనిపించింది. కళ్ళు చికిలించి చూసేడు.
“అక్కడ తెల్లటి రాయి ఏమీ లేదే ముందు? ఎద్దా? ఎద్దులాగా కూడా లేదు, మనిషి తలలాగా కనిపిస్తూంటే? అయినా ఈ సమయంలో అక్కడ మనిషి ఏం చేస్తూ ఉంటాడు?” దగ్గిరకొచ్చేసరికి సరిగ్గా కనిపించింది ఈ తెలుపు ఏమిటో. నిజంగా మనిషే – బతికున్నవాడో, శవమో? దిగంబరంగా పడి ఉన్నాడు. సైమన్ కొద్దిగా వణికేడు.
“ఎవరో చంపేశారు వీడిని. ఇందులో తలదూరిస్తే నాకు తగులుకోవచ్చు” అనుకుంటూ తిరిగి నడక సాగించేడు. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఓ సారి వెనక్కి చూశాడు. ఇప్పుడు అక్కడున్న మనిషి కాస్త లేచి నించుని సైమన్ కేసే చూస్తున్నట్టున్నాడు. సైమన్‌కి భయం మరీ ఎక్కువైంది.
“అతనెవరో? నేను వెళ్తే మీదపడి నన్ను చంపితే? అదీగాక ఆయనికి వంటిమీద బట్టలే లేవు. నాకెందుకు?” వడివడిగా అడుగులేస్తూ ముందుకెళ్ళిపోయేడు సైమన్.
సరిగ్గా పదీ ఇరవై అడుగులు వెళ్ళేసరికి సైమన్ అంతరాత్మ హెచ్చరించింది, “సైమన్! నువ్వేం చేస్తున్నావ్? దొంగలు దోచేసేంత డబ్బున్నవాడివైపోయావా నువ్వు? పాపం ఆ మనిషి చలిలో అలా సహాయం కోసం చూస్తున్నాడేమో? సిగ్గు, సిగ్గు!!”
సైమన్ వెనక్కి తిరిగి ఆ మనిషి దగ్గిరకెళ్ళాడు.
III
అతను యుక్త వయస్కుడే, దేహం మీద ఏమీ దెబ్బలున్నట్టు లేదు. మెల్లిగా కళ్ళు తెరిచి సైమన్ కేసి చూశాడు. ఆ ఒక్క చూపుతో సైమన్‌కి అతనంటే అభిమానం పుట్టుకొచ్చింది. చేతిలో ఉన్న రైతు ఇచ్చిన బూట్లు కింద పారేసి తన ఒంటిమీద పైనున్న గుడ్డ కోటు విప్పేడు సైమన్.
“ఇది తీరిగ్గా మాట్లాడుకునే సమయం కాదు, రా! ఈ కోటు తొడుక్కో,” అని సైమన్ అతడిని జబ్బలు పట్టుకుని పైకి లేపాడు. అతను లేవగానే కోటు కప్పాడు కానీ అతనికి చేతులు కోటులో ఎలాపెట్టాలో తెలియలేదు. సైమన్ కోటు తొడిగి చుట్టూ ఉన్న తాడు బిగించి కట్టేడు నడుము చుట్టూరా. రైతు మరమ్మత్తుకి ఇచ్చిన ఇచ్చిన బూట్లు అతని కాళ్ళకిచ్చి చెప్పేడు:
“చీకటి పడుతోంది, నడవగలవా? అన్ని విషయాలూ తర్వాత చూసుకోవచ్చు” అతను లేచి కృతజ్ఞతతో సైమన్ కేసి చూశాడు.
“ఏమీ మాట్లాడవేం?” అడిగేడు సైమన్, “ఇదిగో ఈ కర్ర పుచ్చుకో నీరసంగా ఉంటే. తొందరగా నడిస్తే, చలి ముదిరే లోపుల ఇంటికెళ్ళిపోవచ్చు.” నడుస్తూంటే సైమన్ అడిగేడు,
“నువ్వెక్కడ వాడివి?”
“ఈ ప్రాంతాలకి చెందినవాడ్ని కాదు.”
“ఆ మాత్రం తెలుస్తోందిలే. ఈ ప్రాంతాల్లో ఉన్న జనం నాకు బాగా తెల్సినవాళ్ళే. ఆ గుడి దగ్గిరకి ఎలా వచ్చావ్?”
“ఇప్పుడు చెప్పలేను”
“ఎవరైనా కొట్టేరా?”
“లేదు, భగవంతుడే శిక్షించాడు.”
“అవునులే, భగవంతుడే జగత్ప్రభువు, కానీ నువ్వు రోజూ తిండీ, గుడ్డా, కొంపా అమర్చుకోవాలి కదా? ఎక్కడికెళ్దామనుకుంటున్నావు?”
“ఎక్కడైనా ఒక్కటే”
సైమన్‌కి ఆశ్చర్యం వేసింది. ఆగంతకుడు గౌరవంగా, బాగానే మాట్లాడుతున్నాడు. ఏమో ఎవరికెరుక, “సరే ఈ రోజుకి నువ్వు మా ఇంటికిరా. మిగతా విషయాలు తర్వాత చూద్దాం.” చెప్పేడు సైమన్. కానీ మనసులో మాట్రియోనా ఏమని సాధిస్తుందో అని మనసులో పీకుతూనే ఉంది. కానీ గుడి దగ్గర అతను చూసిన చూపు గుర్తుకి వచ్చి మనసు తేలికపడింది.
IV
మాట్రియోనా ఆ రోజుకి పనంతా అయ్యేక సైమన్ పాత చొక్కాకి చిరుగులు కుట్టడానికి కూర్చుంది. ఆలోచనలు ముసురుతున్నాయి సైమన్ గురించి, “గొర్రె తోళ్ళు అమ్మేవాడు మోసం చేయకుండా ఉంటాడా? ఈయన మంచివాడే. ఎవడ్నీ మోసం చేయడు కానీ ఏ పిల్లవాడైనా ఈయన్ని ఒంటిచేత్తో ఆడించగలడు. ఎనిమిది రూబుళ్ళు ఎక్కువ డబ్బులే. దానితో మంచి కోటు దొరుకుతుంది. క్రితం చలికాలం సరైన కోటు లేక ఎంత ఇబ్బంది పడ్డాం? ఈ రోజు కూడా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న బట్టలన్నీ తొడుక్కేళ్ళేడు. నాకు చలికి తట్టుకోవడం ఎంత కష్టంగా ఉందో. ఈ పాటికి వచ్చేసుండాలే. ఖర్మ కాలి ఈ డబ్బులు పెట్టి తాగి తందనాలాడాడా?”
బయట ఎవరో నడుస్తున్న చప్పుడు వినిపించింది. తలుపు తీయగానే అక్కడ సైమన్‌తో పాటుగా ఇంకొకడు కనిపించేడు, సైమన్ కోటు వేసుకుని, తలమీద టోపీ అయినా లేకుండా. మాట్రియోనాకి వెంతనే తెల్సిపోయింది వాసన. ‘ఇదన్న మాట వీడు చేసిన నిర్వాకం. ఎవడితోనే కల్సి మందు కొట్టేసి కోటు తాకట్టు పెట్టి ఇది చాలదన్నట్టూ ఈ దిగంబర దరిద్రాన్ని కూడా తీసుకొచ్చేడు.’
పక్కకి తప్పుకుని ఇద్దర్నీ లోపలకి రానిచ్చింది. ఆ కొత్త మనిషికి భయం ఎక్కువైనట్టుంది కళ్ళుమూసుకుని దేనికో జడుస్తున్నట్టు నించునున్నాడు. మాట్రియోనా, ‘వీడొక వెధవ అయ్యుండాలి అందుకే అలా భయపడుతున్నాడు,’ అనుకుంది. సైమన్ అక్కడున్న బెంచీ మీద కూర్చున్నాడు తీరిగ్గా.
“మాట్రియోనా, భోజనం అదీ సిద్ధంగా ఉంటే కాస్త వడ్డిస్తావా?”
మాట్రియోనా ఏదో గొణిగింది కానీ కదల్లేదు. సైమన్ చూశాడు వాళ్ళావిడ సంగతి, కానీ పట్టించుకోనట్టుగా ఆ మనిషి చెయ్యి పట్టుకుని, “రావోయ్, కాస్త ఎంగిలిపడదాం,” అన్నాడు. అతను కూడా బల్ల దగ్గర కూర్చున్నాడు.
“ఏమీ వండలేదా మాకు?” అడిగేడు సైమన్. ఇప్పటిదాకా ఉగ్గబట్టుకున్న మాట్రియోనా కోపం బయటకొచ్చింది.
“వండాను, కానీ నీకు కాదు. చూడబోతే నువ్వు వెళ్ళి ఉన్న డబ్బుల్తో తాగేసి వచ్చినట్టున్నావ్. గొర్రె చర్మం కొనడానికి కదా వెళ్ళావ్, కాని ఇప్పుడు వెనక్కి వంటి మీద కోటు లేకుండా వచ్చావు ఇంకో దరిద్రాన్ని వెంటబెట్టుకుని. మీ ఇద్దరూ కలిసి ఎంత తగలేశారో? మీలాంటి తాగుబోతులకి కాదు నేను వండినది.”
“చాలు మాట్రియోనా, ఉత్తినే అరవకు. ఇతనెవరో కూడా తెలియకుండా అలా…”
“అయితే నువ్వు తీసుకెళ్ళిన డబ్బులేం చేశావో చెప్పు ముందర.”
“ఇవిగో డబ్బులు. ట్రిఫనోవ్ డబ్బులు ఇవ్వలేదు కానీ వచ్చే వారం ఇస్తానన్నాడు.”సైమన్ జేబులోకి చేయి పోనిచ్చి, మూడు రూబుళ్ళు బయటకి తీసేడు. మాట్రియోనా కోపం ఇంకా ఎక్కువైంది. గొర్రె చర్మం కోసం కదా వెళ్ళింది? అది లేకుండా వచ్చాడు, పైపెచ్చు ఉన్న కోటు ఎవరికో ఇచ్చి ఆ దరిద్రాన్ని వెంటబెట్టుకొచ్చాడు కూడా. సైమన్ చేతిలోంచి డబ్బులు లాక్కుని, చెప్పింది.
“మీలాంటి తాగుబోతులకీ దిగంబరులకీ ఇక్కడ తిండి లేదు. పోండి.”
“ఆగు మాట్రియోనా, అసలు ఈ మనిషి ఏం చెప్తాడో ఒకసారి విను….”
“ఏమిటి వినేది? తాగుబోతు చెప్పేదేనా? నిన్ను పెళ్ళి చేసుకోమని చెప్పినప్పుడు నేను వద్దన్నాను తాగుబోతువని తెలిశాక. మా అమ్మ ఎప్పుడో ఇచ్చిన బట్టలూ కోట్లూ అన్నీ అమ్మేసి తాగేసి వచ్చావు నువ్వు.”
మాట్రియోనాతో అసలు విషయం చెప్పడానికి సైమన్ ప్రయత్నించేడు. “వోడ్కా తాగడం నిజమే కానీ అది రైతు ఇచ్చిన ఇరవై కోపెక్కులతో. ఇంటి దగ్గిర్నుంచి పట్టుకెళ్ళిన డబ్బులు వెనక్కి ఇచ్చేశాను కదా?”
“పెళ్ళి అయిన మొదటి రోజునుంచీ నేను చూస్తూనే ఉన్నాను. అమ్మ ఇచ్చిన బట్టలూ, నా నగా నట్రా అన్నీ అమ్మి తాగేశావు నువ్వు.”
“మాట్రియోనా, ఇతనెవరో కూడా నాకు తెలియదు. అలా చలిలో పడుంటే తీసుకొచ్చాను…”
“అదే నేను చెప్పేదీను, ఇలాంటి దిగంబర దరిద్రాలకి ఇక్కడ తిండి లేదు ఫోండి బయటకి, కుక్కల్లారా!”
ఉస్సూరని నిట్టూరుస్తూ సైమన్ అతనికేసి చూసేడు. అతనికిదేమీ పట్టినట్టు లేదు. మొహం దించుకుని చేతులు మోకాళ్ళమీద పెట్టి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు.
సైమన్ విప్పిన చిరుగుల కోటు విసురుగా తీసుకుని, “నేను వెళ్తున్నాను, మీ ఏడుపు మీరేడవండి” అంటూ గుమ్మంవేపు నడిచింది మాట్రియోనా. గుమ్మం దాకా రావడమైతే వచ్చింది గానీ, తలుపు తీసి అక్కడే ఆగింది. బైటికి వెళ్ళి కోపం చల్లార్చుకుందామనుకుంది కానీ, ఆ వచ్చిన మనిషి ఎవరో, ఎలాంటివాడో తెలుసుకోవాలనిపించింది.
V
“ఈ మనిషి మంచివాడైతే ఒంటి మీద బట్టలు కూడా ఎందుకులేవు? మంచివాడే అయితే నీకు ఇతను ఎక్కడ కలిశాడో ఎందుకు చెప్పవు నువ్వు?” వెనక్కి తిరిగి అడిగింది.
“సరిగ్గా అదే ఇందాకట్నుండి చెప్తున్నాను మాట్రియోనా. చెప్పింది ఏమీ వినకుండానే మమ్మల్నిద్దర్నీ తిడుతున్నావు నువ్వు. నేను గుడి దగ్గిరకి వచ్చేసరికి ఇతను చలిలో దిగంబరంగా నేలమీద పడి ఉన్నాడు. ఇది బట్టలు లేకుండా ఆరుబయట తిరిగే వాతావరణమేనా? అతనికేమైందో నాకు మాత్రమేం తెలుసు? జాలి వేసి నేను నా వంటి మీద ఉన్న ఒక కోటు అతనికిచ్చి ఇలా తీసుకొచ్చాను. అలా అతన్ని వదిలేయడం పాపం మాట్రియోనా, మనమందరమూ ఏదో ఒకరోజు పోవల్సిన వాళ్ళమే కదా.”
మాట్రియోనా నోరు తెర్చి ఏదో అనబోయింది కానీ ఆగంతకుడికేసి చూసింది అదే క్షణంలో. మొహం, కనుబొమ్మలూ చూస్తే ఏదో చాలా బాధ అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. సైమన్ కంఠం వెనకనుంచి వినబడింది.
“మాట్రియోనా, తోటి మానవుడు అలా చలిలో పడి ఉంటే వదిలేసి రావడం మంచిదేనా? అదేనా మానవత్వం?”
ఇది వినగానే అంత కోపం మీదున్న మాట్రియోనా కొంచెం తగ్గింది. లోపలకి వెళ్ళి వండిన పదార్ధాలు తెచ్చి బల్ల మీద పెట్టి, “తినండి మీకు కావాలిస్తే,” అంది.
వీళ్ళు తింటూంటే మాట్రియోనా ఆ మనిషికేసి చూస్తూ కూర్చుంది. సరిగ్గా అప్పుడే అతను తల ఎత్తి మాట్రియోనా కేసి చూసి చిన్నగా నవ్వేడు. తినడం అయ్యాక మాట్రియోనా అడిగింది,
“నువ్వెక్కడవాడివి?”
“ఈ ప్రాంతాలవాడిని కాదు.”
“సరే, కానీ రోడ్డు మీద ఎలా పడి ఉన్నావు?”
“నేను చెప్పలేను.”
“నిన్నెవరేనా దొంగలు దోచేరా?”
“భగవంతుడే శిక్షించేడు.”
“అలా నగ్నంగా రోడ్డు మీద పడి ఉన్నావా సైమన్ చూసే దాకా?”
“అవును. దిగంబరంగా, చలిలో వణుకుతున్నాను. సైమన్ చూసి నాకు కోటు, బూట్లూ ఇచ్చాడు. మీరేమో నేను చావకుండా నీళ్ళూ, ఆహారం, ఇచ్చారు. భగవంతుడు మీకు తప్పకుండా ఏదో ఒకటి ఇస్తాడు దీనికి ప్రతిఫలంగా”
మాట్రియోనా లేచి అప్పటిదాకా కుడుతున్న చిరిగిన చొక్కా, వేరే బట్టలూ పట్టుకొచ్చింది, “ఇదిగో నీకు వంటిమీద చొక్కా, బట్టలూ లేవని తెలుస్తూనే ఉంది. ఇవి వేసుకుని ఎక్కడో అక్కడ పడుకో. ఈ గుడిసెలోనే సర్దుకోవాలి మనం అందరం.”
అతను తనకిచ్చిన బట్టలు వేసుకుని ముడుచుకుని పడుకున్నాడు. మాట్రియోనా కూడా పడుకుంది కానీ వెంటనే నిద్రపట్టలేదు. ఈ కొత్త మనిషి మనసులోంచి పోవడంలేదు. అప్పుడే సరిగ్గా గుర్తొచ్చింది వీడొచ్చి తమకి రేపటి కోసం ఉంచిన రొట్టె తినేశాడని. అతనికిచ్చిన సైమన్ బట్టలు కూడా పోయినట్టే. అలా అనుకుంటూంటే మనసులో ముల్లుపెట్టి పొడుస్తున్నట్టు అనిపించింది. కానీ అతను నవ్విన నవ్వు గుర్తుకొచ్చి మాట్రియోనా హృదయం ఎందుకో తేలికపడింది. ఎడతెగని ఆలోచనల్తో అలాగే మాట్రియోనా చాలా సేపు నిద్ర లేకుండా పడుకుని ఉంది. పక్కకి చూస్తే సైమన్ కూడా తనలాగే ఉన్నాడు.
“సైమన్!”
“ఆ, ఏమిటి?”
“మీరిద్దరూ ఉన్న రొట్టె తినేశారు. రేప్పొద్దున్నకి ఏమీ లేదు. రేపు ఏమిచేయాలో తెలియదు. పొరుగింటి మార్తా దగ్గిరకి అప్పుకి పరుగెత్తాలేమో?”
“రేపటిదాకా బతికి ఉంటే తినడానికి ఏదో ఒకటి సంపాదించుకోవచ్చులే”
కాసేపయాక మళ్ళీ మాట్రియోనా అడిగింది, “ఇతను మంచివాడిలాగానే ఉన్నాడే, ఎక్కడ్నుంచి వచ్చాడో అడిగితే చెప్పడేం””
“అతని కారణాలు అతనికున్నట్టున్నాయి”
“సైమన్?”
“ఊ, చెప్పు?”
“మనం ఎవరు ఏది అడిగినా ఇస్తున్నాం కదా? మనకి ఎవరూ ఏమీ ఇవ్వరేం?”
సైమన్‌కి ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. “ఇంక పడుకుందాం” అనేసి పక్కకి తిరిగి పడుకున్నాడు.
VI
పొద్దున్న సైమన్ లేచేసరికి పిల్లలింకా పడుకునే ఉన్నారు. మాట్రియోనా పక్కింటికి వెళ్ళింది ఏదో అప్పు తేవడానికి. రాత్రి ఇంటికొచ్చిన మనిషి నిద్ర లేచాడు. అవే పాత బట్టలతో రాత్రి భోజనం చేసినప్పుడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే కూర్చుని పైకి చూస్తున్నాడు. మొహం కొంచెం కాంతివంతంగా కనపడుతోంది నిన్నటికన్నా. సైమన్ అతనితో అన్నాడు:
“సరే, ఈ జానెడు పొట్టకి తిండి కావాలి. ఒంటికి కప్పుకోవడానికేదైనా కావలి. లేకపోతే ఏమౌతుందో తెలుసు కదా? అందుచేత వీటికోసమైనా పని చేయాలి. నీకేం పని వచ్చు?”
“నాకేమీ రాదు.”
“నేర్చుకోవాలని ఉంటే ఏ పనైనా నేర్చుకోవచ్చు.”
“ఏ పని నేర్పినా చేస్తాను.”
“నీ పేరు?”
“మైకేల్”
“మైకేల్, నీ గురించి, నీ పాత జీవితం గురించి మాట్లాడదల్చుకోకపోతే అది నీ ఇష్టం. కానీ బతకడానికో ఆధారం కావాలి కదా? నేను చెప్పినట్టు నాకు చెప్పులు కుట్టడంలో సహాయం చేస్తానంటే నువ్వు ఈ ఇంట్లో ఉండి కడుపు నింపుకోవచ్చు.”
“తప్పకుండా. ఏం చెయ్యాలో చెప్పు, నేను నేర్చుకుంటాను.”
సైమన్ తాడు తీసుకుని బొటనవేలు చుట్టూ తిప్పి చూపించాడు, “చూడు ఇది అంత కష్టమైనదేమీ కాదు.” తర్వాత తాడుకి మైనం ఎలా పూయాలి, ఎలా సూదిలోకి ఈ మైనపుతాడు ఎక్కించాలి, ఎలా కుట్టాలి చూపించేడు. ఇవన్నీ మైకేల్ వెంటనే నేర్చుకున్నాడు. మూడు రోజులు గడిచేసరికి తన పుట్టిందే చెప్పులు కుట్టడానికా అనేంతగా వచ్చింది పని మైకేల్‌కి.
పని ఉన్నప్పుడు ఎక్కడా ఆపకుండా పనిచేయడం, పనిలేనప్పుడు మౌనంగా ఆకాశం కేసి చూడడం, ఇవే మైకేల్ నిత్య కృత్యాలు. మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు, మాట్రియోనా సైమన్‌తో అసహ్యంగా దెబ్బలాడి, తర్వాత మనసు మార్చుకుని మైకేల్‌కి భోజనం పెట్టినప్పుడు మైకేల్ చిన్నగా నవ్వడం తప్ప, ఆ తర్వాతెప్పుడూ మైకేల్‌ని నవ్వు మొహంతో చూసినట్టూ సైమన్‌కి గుర్తు లేదు.
VII
గిర్రున ఓ సంవత్సరం తిరిగే సరికి మైకేల్ లాగా బూట్లు కుట్టేవాడు దరిదాపుల్లో లేడని చెప్పుకునేంతగా అతని ఖ్యాతి వ్యాపించింది. దీనితో ఆదాయం పెరిగి సైమన్ జీవితం కూడా మెరుగైంది. ఓ చలికాలం రోజు సైమన్, మైకేల్ పని చూసుకుంటూండగా గుడిసె ముందు ఒక గుర్రబ్బండి ఆగింది. నౌకరు దిగి బండి తలుపు తెరిస్తే ఒక భూస్వామి దర్జాగా దిగేడు కిందకి. తల గుమ్మానికి తగలకుండా దించి లోపలకి వచ్చేడు. శాల్తీ చూస్తే తల గుడిసె కప్పుకి తగులులోంది దాదాపుగా. మొత్తం గుడిసె అంతా ఆక్రమించేడా అనిపించేటట్టు ఉన్నాడు ఆ భూస్వామి.
సైమన్ ఆశ్చర్యపోతూ లేచి కిందా మీదా పడుతూ నమస్కారాలు పెట్టేడు భూస్వామికి. మనుషులింత బలంగా ఉంటారనీ, అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారనీ సైమన్ జీవితంలో ఎప్పుడూ విన్నదీ లేదూ, చూసిందీ లేదు. సైమన్ బక్క పల్చటి మనిషి. మైకేల్ కూడా సన్నమే. మాట్రియోనా సంగతెందుకు? ఆవిడో బొమికల పోగు. కానీ ఇప్పుడొచ్చినాయన వేరే ప్రపంచంలోంచి వచ్చినట్టున్నాడు, ఎర్రటి మొహం, పోతపోసిన విగ్రహం, ఆరడుగుల పైన ఎత్తూ ఆజానుబాహుడూను. లోపలకొచ్చిన పెద్దమనిషి కోటు తీసి పక్కనే పెట్టి అక్కడున్న బెంచీ మీద కూర్చుని,
“ఇక్కడో చేయి తిరిగిన చెప్పులు కుట్టేవాడు ఉన్నాడని జనం చెప్తే విని వచ్చాను, ఎవరది?”
“నేనేనండి.” సైమన్ ముందుకొచ్చి చెప్పేడు వినయంగా.
“ఒరే నౌకర్, ఆ తోలు ఇలా పట్రా”
“ఇదే రకమైన తోలో తెలుసా?” నౌకరు పట్టుకొచ్చిన తోలు చూపించి భూస్వామి అడిగేడు.
“మంచి తోలు లాగా కనపడుతోందండి”
“మంచిదా? వెధవా, నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి తోలు చూసేవా? అది జర్మనీ నుంచి తెప్పించేను. ఇరవై రూబుళ్ళు దాని ఖరీదు, తెలుసా?” గర్జించేడు భూస్వామి.
“నాలాంటి వాడు ఇలాంటి తోలు ఎలా చూడగలడండీ?” సైమన్ భయపడిపోయేడు.
“దీంతో నాకు బూట్లు చేయగలవా?”
“తప్పకుండా చేయగలను.”
“చేయగలవా? అయితే ఎవరికోసం చేస్తున్నావో ఆ తోలు ఎలాంటిదో మనసులో జాగ్రత్తగా గుర్తుంచుకో. మంచి బూట్లు ఓ ఏడాది మన్నేలాంటివి చేయాలి, ఆకారం పోకుండా, కుట్లు ఊడకుండా. చేయగలిగితే ఆ తోలు తీసుకుని పని మొదలుపెట్టు. ముందే చెప్తున్నాను మళ్ళీ, కుట్లు ఊడినా, ఆకారం మారినా నిన్ను జైల్లో పెట్టిస్తాను. మంచి పనితనం చూపించావా నీకు పది రూబుళ్ళు ఇస్తాను. ఇప్పుడు చెప్పు చేయగలవా?”
జైలు అనే సరికి ఈ సారి సైమన్ నిజంగా భయపడ్డాడు. మోచేత్తో మైకేల్‌ని పొడిచి ‘తీసుకోమంటావా?’ అని అడిగేడు గుసగుసలాడుతూ. మైకేల్ తీసుకోమన్నట్టు తలాడించేడు. వచ్చిన పెద్దమనిషి మరీ లావు కనక వంగలేక నౌకర్ని పిలిచి “ఒరే, నా బూట్లూ మేజోళ్ళు తీయీ!” అని ఆజ్ఞాపించేడు. ఆ తర్వాత “కొలతలు తీసుకో,” చెప్పేడు సైమన్ తోటి.
సైమన్ ఈ పాటికో పదిహేడు అంగుళాల కాయితం తయారుగా ఉంచేడు కొలతలకి. చేతులు తుడుచుకుని కొలతలు తీసుకున్నాడు. కానీ కాలి పిక్కల దగ్గిర కొచ్చేసరికి ఈ పదిహేడు అంగుళాల కాయితం కూడా కొలతకి తక్కువైపోయింది. ఈ పిక్కలు చూసే సరికి సైమన్ మనసులో ఓ ఇనప కవచం మెదిలింది.
“బూట్లు ఎక్కడా పట్టేయకుండా కరవకుండా సుఖంగా ఉండాలి సరేనా!” చెప్పేడు భూస్వామి. ఈలోపున సైమన్ ఇంకో కాగితం పట్టుకొచ్చేడు. సైమన్ ఇలా కొలుస్తూండగా భూస్వామి చుట్టూ పరికించేడు.
“ఎవరతనూ?”
“అతను నాతో పనిచేసే మైకేల్. మీ బూట్లు కుట్టేది అతనే.”
“అవునా, సరే నువ్వూ గుర్తుంచుకో. ఈ బూట్లు కనీసం ఒక ఏడాది మనాలి!”
సైమన్ కూడా మైకేల్ కేసి చూశాడు. కానీ మైకేల్ భూస్వామి కేసి చూస్తున్నట్టు లేదు. భూస్వామి వెనకనున్న ఖాళీ జాగాలోకి చూస్తున్నాడు, భూస్వామి వెనకన ఎవరో నుంచున్న వాడిని చూస్తున్నట్టు. మైకేల్ అలా చూస్తూ చూస్తూ ఒక చిరునవ్వు నవ్వేడు.
“ఏమిట్రా నవ్వుతున్నావ్ వెధవా?” గర్జించేడు భూస్వామి,” బూట్లు సరైన సమయానికి ఇవ్వగలవా?”
“తప్పకుండా”, నవ్వు మానేసి చెప్పేడు మైకేల్.
“సరే గుర్తుంచుకో నేను చెప్పింది” ముందు విప్పిన బూట్లు వేసుకుని బయటకెళ్ళడానికి లేచేడు. గుమ్మం దగ్గిరకొచ్చేక వంగడం మర్చిపోయినట్టున్నాడు, చటుక్కున తగిలింది తలకి గడప. నెత్తి రుద్దుకుని గొణుక్కుంటూ బయటకెళ్ళిపోయేడు. ఆయన వెళ్ళిపోయేక సైమన్ అన్నాడు మైకేల్‌తో,
“ఈయనయ్యా మనిషి అంటే, నువ్వూ నేను మనుషులమేనా? ఈయనకేసి గుండేసి వేసి కొట్టినా ఏమీ అవదు. తల చూరికి తగిలినప్పుడు గుడిసె పడిపోతుందేమో అని భయపడ్డాను సుమా. ఆయన తలకి చిన్న గీత కూడా పడినట్టే లేదు.”
“అలాంటి జీవితాలు ఉన్నవాళ్ళు అంత ధృఢంగా ఉంటారంటే ఉండరూ? ఇలాంటి వాళ్ళని మృత్యువేనా ఏమీ చెయ్యగలదా?” మాట్రియోనా అందుకుంది వెంటనే.
VIII
“చూడూ, మనం ఈ పనిచేస్తానని ఒప్పుకున్నాం. దీంట్లో ఎక్కడా తేడా రాకూడదు. ఈ తోలు బాగా ఖరీదైనదీ, ఆ భూస్వామేమో చాలా కోపిష్టిలా కనపడుతున్నాడు. నువ్వు నాకన్నా బాగా చేయగలవు. నువ్వు తోలు సరిగ్గా కోసి పెట్టావంటే మనిద్దరం పూర్తి చేద్దాం.” సైమన్ చెప్పేడు.
మైకేల్ తోలు బల్ల మీద పెట్టి చాకుతో కోయడం మొదలుపెట్టాడు. మాట్రియోనా కుతూహలంగా ఓ సారి వచ్చి చూడబోయింది. చాలాకాలం నుంచీ సైమన్ చేసే పని చూస్తోందేమో మాట్రియోనాకి బూట్లు ఎలా చేస్తారో పరిచయం ఉంది. కానీ ఇప్పుడు మైకేల్ చేసే పని చూస్తూంటే అనుమానం వచ్చింది. మైకేల్ బూట్ల కోసం తోలు కత్తిరిస్తూన్నట్టు అనిపించలేదు. ఏదో అందామనుకుంది గానీ ‘ఏమో ఈ పెద్ద మనుషుల బూట్లు వేరేగా చేస్తారేమో, నాకెందుకు’ అనుకుని లోపలకి వెళ్ళిపోయింది. కత్తిరించడం అయిపోయేక, బూట్ల కోసం కాక మామూలు చెప్పులు కుడుతూన్నట్టు కుట్టడం మొదలు పెట్టేడు మైకేల్. మళ్ళీ వచ్చి చూసిన మాట్రియోనా ఏదో అందామనుకుంది గానీ నోరు మెదపలేదు. సాయంకాలం దాకా ఇలాగే పని సాగించాడు మైకేల్. ఇంక ఆ రోజుకి పని ఆపేసి సైమన్ లేచే సరికి మైకేల్ కుట్టడం పూర్తి చేసేడు. పైకి లేచిన సైమన్ మైకేల్ చేసిన పని చూసి భయంతో వణికిపోయేడు.
“ఇదేంటి మైకేల్, నువ్వు నాతో పాటు ఓ సంవత్సరం నుంచీ పనిచేస్తున్నావు. ఒక్కసారి కూడా నువ్వేమీ తప్పు చేసినట్టు గుర్తులేదు. ఈ తోలు ఇచ్చినాయన మనని బూట్లు చేయమని ఇచ్చేడు. సరిగ్గా చేయకపోతే జైల్లో పెట్టిస్తాననీ చెప్పేడు కదా? నువ్వే, ఈ పని తీసుకోనా అని అడిగితే, తీసుకో అని చెప్పేవు నాతో. ఇప్పుడేమో బూట్లకి బదులు చెప్పులు తయారుచేశావే? ఏం చేశావయ్యా? నన్ను నాశనం చేసేవు కదయ్యా! ఇప్పుడు నాకేం గతి?”
ఇలా తిట్టడం మొదలు పెట్టాడో లేదో, గుడిసె బయట ఏదో చప్పుడైంది. ఎవరో వచ్చినట్టున్నారు. సైమన్ కిటికీ లోంచి బయటకి చూసేడు. బయట గుర్రాన్ని కట్టి లోపలకి వచ్చినాయన పొద్దున్న భూస్వామి కూడా వచ్చిన నౌకర్ అని గుర్తించడానికి ఎంతో సేపు పట్టలేదు.
“చెప్పండి మళ్ళీ వచ్చారేం?” అడిగేడు సైమన్ భయపడుతూ.
“మా యజమానురాలు బూట్ల గురించి పంపించింది.”
“బూట్ల గురించా? ఏం కావాలి చెప్పండి?”
“మా యజమానికి బూట్లు అక్కరలేదు. ఆయన చనిపోయేరు ఈ రోజు.”
“అసంభవం!”
“ఇక్కడకొచ్చాక ఆయన ఇంటికెళ్ళేదాకా బతకలేదు. గుర్రబ్బండిలోనే పోయేడు. శవాన్ని బయటకి దింపి తీయడానికి కష్టపడాల్సి వచ్చింది. మా యజమానురాలు ఇప్పుడు బూట్లు అక్కర్లేదనీ, శవానికి వేసే చెప్పులు పొద్దున ఇచ్చిన తోలుతో చేయమనీ, అవి తయారయ్యేదాకా ఉండి వాటిని పట్టుకు రమ్మనమనీ నన్ను పంపించింది. అందుకే ఇలా వచ్చేను.”
మైకేల్ అప్పటికి తయారుగా ఉంచిన చెప్పులూ, మిగిలిపోయిన తోలుముక్కలూ అన్నీ కలిపి చుట్టగా చుట్టి సైమన్‌కి ఇచ్చేడు. మతిపోయినవాడిలా ఈ చుట్టని ఓ చేత్తో మైకేల్ నుంచి తీసుకుని రెండో చేత్తో భూస్వామి నౌకరుకి ఇచ్చేడు సైమన్. నౌకర్ బయటకెళ్ళడం, గుర్రం వెళ్ళిన చప్పుడూ ఏమీ వినపడలేదు సైమన్‌కి గానీ, మాట్రియోనాకి గానీ.
IX
ఏళ్ళు గడుస్తున్నాయి. ముపటిలాగానే ఉన్నాడు మైకేల్. అతి తక్కువగా మాట్లాడ్డం, కావాల్సినంతే తినడం, అత్యవసర పతిస్థితుల్లో తప్ప ఎప్పుడూ గడప దాటకపోవడం, ఇవే మైకేల్ నిత్యకృత్యాలు. గడిచిన ఆరేళ్ళలో మైకేల్ రెండుసార్లు మాత్రమే నవ్వడం చూశాడు సైమన్. మొదటిసారి ఇంటికొచ్చిన మైకేల్‌కి మాట్రియోనా భోజనం పెట్టినప్పుడూ, రెండోసారి భూస్వామి బూట్లకోసం తోలు ఇవ్వడానికి వచ్చినప్పుడూ. ఓ రోజు మైకేల్ ఒక కిటికీ దగ్గిరా, సైమన్ ఇంకో కిటికీ దగ్గిరా పనిలో ఉన్నప్పుడు సైమన్ కొడుకుల్లో ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చి
“చూడు మైకేల్, ఎవరో ఒకావిడ ఇద్దరు పిల్లల్తో వస్తోంది. ఒక పిల్ల కుంటుతోంది కూడా.” అన్నాడు.
మైకేల్ వెంటనే పని ఆపేసి విప్పారిన కళ్ళతో చూస్తూ ఉండిపోయేడు. సైమన్‌కి ఆశ్చర్యమనిపించింది. ఎప్పుడూ మైకేల్ ఇలా చూసినట్టు గుర్తులేదు. సైమన్ కూడా కిటికీలోంచి బయటకి చూసేడు. పిల్లలిద్దరూ కవలలు కాబోలు, ముమ్మూర్తులా ఒకేలాగా ఉన్నారు. ఓ పాప కుంటడం తప్ప ఇద్దరూ ఒకే పోలిక. గుమ్మం దాకా వచ్చేసరికి సైమన్ లేచి తలుపు తీసి లోపలకి ఆహ్వానించేడు వాళ్ళని.
“చెప్పండి, ఏమిటిలా వచ్చేరు?”
“ఈ పిల్లలిద్దరికీ బూట్లు చేయగలరా?” అడిగింది వచ్చినావిడ కూర్చుంటూ. పిల్లలిద్దరూ కొత్త వాతావరణానికి అలవాటు పడలేక ఆవిడని అల్లుకుపోయి కూర్చున్నారు పక్కనే.
“తప్పకుండా. మేమెప్పుడూ ఇంత చిన్నవి చేయలేదు కానీ మా మైకేల్ ఏది కావాలిస్తే అది చేయగల సమర్థుడు.” చెప్పేడు సైమన్ మైకేల్‌ని చూపిస్తూ.
సైమన్ మైకేల్ కేసి చూసే సరికి మైకేల్ ఈ పిల్లలిద్దరికేసి అదే పనిగా చూస్తూండడం గమనించాడు. ఆశ్చర్యం ఇంకా ఎక్కువైంది సైమన్‌కి. పిల్లలిద్దరూ మంచి బట్టల్లో, పాలబుగ్గల్తో చక్కగా ముద్దొస్తున్న మాట నిజమే కానీ ఎప్పుడూ ఏదీ పట్టించుకోని మైకేల్ వీళ్ళకేసి అలా చూడడమేమిటి? కొలతలు తీసుకోవడానికి ముందుకొచ్చేడు సైమన్.
“ఈ పిల్లలిద్దరిదీ ఒకటే పాదం అనుకో. మొదటిదానికి రెండు కొలతలు తీసుకుంటే రెండో దానికి సరిపోతుంది. వీళ్ళిద్దరూ కవలలే.” చెప్పింది తల్లి. కొలతలు తీసుకున్నాక సైమన్ అడిగేడు.
“పాపం ఈ పిల్లకి ఇలా అయిందేమమ్మా? పుట్టుకతోనే వచ్చిందా అవకరం?”
“లేదు నాయనా, పుట్టాక దాని తల్లి దీని మీదకి దొర్లిపోతే కాలు అలా అయింది.” అప్పుడే వచ్చిన మాట్రియోనా ఇది విన్నది.
“దాని తల్లి అంటున్నారేమిటి? మీరు కాదా తల్లి?”
“లేదమ్మా, నేను వాళ్ళకి తల్లినీ కాదూ, బంధువునీ కాదు. కానీ దత్తతకి తీసుకున్నాను.”
“దత్తతా? ఎందుకంత అభిమానం ఈ పిల్లలంటే?”
“ఎందుక్కాదు? నేను వీళ్ళద్దర్నీ పాలిచ్చి పెంచాను. నాకు పుట్టిన అబ్బాయే ఉండేవాడు కానీ వాడిని భగవంతుడు తీసుకెళ్ళిపోయేడు. ఇప్పుడు ఈ పిల్లలు లేకపోతే నేనూ లేను, నా జీవితమూ లేదు.”
“అయితే వీళ్ళిద్దరూ ఎవరి పిల్లలు?”
“ఆరేళ్ళ క్రితం జరిగిందిది. ఈ పిల్లలిద్దరి తల్లి తండ్రులూ ఒక వారం వ్యవధిలో చనిపోయేరు. మంగళవారం తండ్రి పోతే శుక్రవారం తల్లి పోయింది. తండ్రి పోయిన మూడు రోజులకి వీళ్ళిద్దరూ పుట్టేరు. తల్లి ఆ తర్వాత ఒక్కరోజు కూడా బతకలేదు. మా పొరుగింటివాళ్ళే. వీళ్ళ నాన్న ఓ రోజు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఆ రోజు చెట్టు మీద పడి కడుపులో పేగులు బయటకొచ్చేయి పాపం. ఇంటికి తీసుకొచ్చేసరికి ప్రాణాలు పోయాయి. అదే వారంలో ఈ పిల్లలిద్దరూ పుట్టేరు. వీళ్ళు పుట్టినప్పుడు ఆవిడ ఒక్కత్తే ఉంది ఇంట్లో. అలాగే శుక్రవారానికి ఒక్కత్తే పోయింది. పిల్లలు పుట్టిన మర్నాడు నేను చూడ్డానికి వెళ్ళాను, పొరుగిల్లే కదా అని. ఇంట్లో అన్నీ మంచు ముద్దల్లా ఉన్నాయి చలికి. పోయేటప్పుడు ఇలా పక్కకి ఒరిగిపోయి ఈ పిల్ల మీద పడిపోయింది. అందుకే ఈ పిల్లకి కాలు పాడైపోయింది. ఊళ్ళో జనం చందాలు వేసుకుని శవాన్ని పాతిపెట్టారు. ఈ మూడు రోజుల పిల్లలు మిగిలి పోయేరు. ఏం చెయ్యాలి? మేముండే ఆ ఊర్లో అప్పటికి పాలిచ్చే తల్లిని నేనొక్కత్తినే ఉన్నాను. అప్పటికి నాకు పుట్టిన అబ్బాయికి ఎనిమిది వారాలు. అప్పటికి ఈ పిల్లల్ని నేను ఇంటికి తీసుకొచ్చేను. ఊళ్ళో రైతులందరూ కల్సి నాతో, ‘మేరీ, ఇప్పటికి నువ్వే ఈ పిల్లల్ని ఉంచుకోవడం మంచిది. తర్వాత అందరం కలిసి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవచ్చు,’ అన్నారు. అప్పటికి సరేనని నేను ఒప్పుకున్నాను.
మొదట్లో ఈ అవిటి పిల్లకి పాలిచ్చే దాన్ని కాదు, ఎలాగా బతకదేమో అనిపించింది నాకు. కానీ తర్వాత అయ్యో, దీని తప్పేముంది పాపం అనిపించి ఇద్దర్నీ సాకడం మొదలు పెట్టాను. మొత్తం మీద ముగ్గుర్నీ సాకాను. ఒక్కోసారి పాలు ఎక్కువైపోతే ఇద్దరేసి చొప్పున ఒకేసారి పాలిచ్చాను కూడా. భగవల్లీల అంటే ఇదే కాబోలు, వీళ్ళద్దరూ పెరుగుతూంటే నా కుర్రాడికేదో జబ్బొచ్చింది. రెండేళ్ళు రాకుండానే వాడు పోయేడు ఆ రోగం వల్ల. మా ఆయన పిండి మరలో పనిచేసేవాడు. డబ్బులు బాగా వచ్చేవి. ఈ పిల్లల్ని సాకడంలో నా కొడుకు గురించి అంత బెంగ పడలేదు. వీళ్ళద్దరూ లేకపోతే నేను ఏమై ఉండేదాన్నో?” ఇలా అని పిల్లలిద్దర్నీ ఒక్కసారి దగ్గిరకి తీసుకుంది, కళ్ళలోంచి నీరు కారుతూంటే. మాట్రియోనా అంది నిట్టూరుస్తూ,
“అందుకే అంటారు కదా, తల్లితండ్రులు లేకపోయినా ఎలాగోలా బతకొచ్చు కానీ, భగవంతుడు లేకుండా బ్రతగ్గలమా?”
ఇలా మాట్లాడుకుంటూండగానే ఒక్కసారి గుడిసెలో పెద్ద వెలుగు వెలిగినట్టైంది మైకేల్ కూర్చున్న చోటునుంచి. అందరూ ఓ సారి అటువైపు చూశారు. మైకేల్ మోకాళ్ళపై చేతులుంచుకుని, ఆకాశం కేసి చూస్తూ సంతోషంగా నవ్వుతున్నాడు. మొహంలో దేదీప్యమానమైన వెలుగు.
X
వచ్చినావిడ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. మైకేల్ కూర్చున్న చోటు నుంచి లేచి చెప్పేడు సైమన్, మాట్రియోనాలతో,
“నేను వచ్చిన పని అయిపోయి, నాకు సమయం అయింది, ఇంక నన్ను వెళ్ళనీయండి. నేనేమైనా తప్పులు చేస్తే క్షంతవ్యుడిని.”
అప్పుడు చూసారు సైమన్ మాట్రియోనాలు మైకేల్ కేసి. అదో రకమైన వెలుగు వస్తోంది మైకేల్ నుంచి. సైమన్ పైకి లేచి తల వంచి ప్రణామం చేసి అన్నాడు.
“మైకేల్ నేను చూసినంతలో నువ్వు మామూలు మనిషివి కాదు. నేనిక్కడ నిన్ను నిర్బంధించలేను. అయితే ఒకటి అడుగుతాను చెప్పు వెళ్ళిపోయేముందు. మొదటిసారి నేను నిన్ను ఇక్కడకి తీసుకొచ్చినప్పుడు నీ మొహం ముడుచుకుపోయి ఉంది. అప్పుడు మా ఆవిడిచ్చిన రొట్టెతో నీ మొహంలో నవ్వు కనిపించింది. ఆ తర్వాత రెండో సారి భూస్వామి వచ్చి బూట్లు చేయమన్నపుడు మళ్ళీ రెండోసారి నవ్వావు. ఈ రోజు మూడోసారి మళ్ళీ నవ్వావు. ఎందుకు నువ్వు మూడు సార్లు నవ్వేవు? ఇప్పుడు నీలోంచి ఎందుకలా వెలుగు వస్తోంది?”
“నాలోంచి అలా వెలుగు రావడానిక్కారణం భగవంతుడు నన్ను క్షమించడమే. ముందు భగవంతుడు నన్ను శిక్షించేడు. నేను మూడు సార్లు ఎందుకు నవ్వేనంటే భగవంతుడు శిక్షించినప్పుడు నన్ను మూడు సత్యాలు నేర్చుకోమని పంపించేడు. అవి ఇప్పటికి నేర్చుకున్నాను. ఒకటి మాట్రియోనా నా మీద జాలి చూపించి భోజనం పెట్టినప్పుడూ, రెండోది భూస్వామి బూట్లు తయారుచేయమన్నప్పుడూ, మూడోది ఈ రోజు కవల పిల్లల్ని చూసినప్పుడూను.”
“భగవంతుడు నిన్నెందుకు శిక్షించేడు? నిన్ను ఏ సత్యాలు నేర్చుకోమని పంపించేడు?”
“భగవంతుడు నన్నెందుకు శిక్షించాడంటే నేను ఆయన చెప్పిన పని చేయకపోవడం వల్ల. నేను స్వర్గంలో ఉండే దేవతని. భగవంతుడు నన్ను భూమ్మీదకి వెళ్ళి ఒకావిడ ఆయుష్షు తీరిపోయిందనీ, ఆవిడ ప్రాణాన్ని తీసుకురమ్మనీ నన్ను పంపించేడు. నేను వచ్చేసరికి ఆవిడ పూర్తిగా జబ్బుతో ఉంది. అప్పుడే పుట్టిన, ఇద్దరు కవలలు పక్కనే ఉన్నారు. ఆవిడ తన పిల్లల్ని పాలివ్వడానికి దగ్గిరకి ఎత్తుకోలేక నానా అవస్థ పడుతోంది. చావు దగ్గిరకొచ్చింది కదా, అటువంటప్పుడు నేను కనిపించాను. ‘మా ఆయన మూడు రోజుల క్రితమే పోయేడు. నాకు నా అనేవారెవరూ లేరు ఇప్పుడు. ఈ పిల్లలిద్దరూ ఎలా బతుకుతారు? నన్ను తీసుకెళ్ళకు దయచేసి. ఈ పిల్లలిద్దరు కొంచెం పెద్దవాళ్ళయ్యాక అలాగే నన్ను తీసుకెళ్దువుగానీ,’ అని వేడుకుంది. ఇలా అనేసరికి జాలి వేసి ఒక పిల్లని ఆవిడ చేతికి ఎత్తి ఇచ్చాను పాలివ్వడానికి అనుకూలంగా. భగవంతుడి దగ్గిరకెళ్ళి, ‘పరమేశ్వరా మీరు నన్ను ఈ పని మీద పంపించేరు కానీ ఆవిడ ప్రాణం నేను తేలేకపోయేను. ఇప్పుడే పుట్టిన పసికూనలని ఎవరు చూస్తారు తల్లి లేకపోతే? తల్లీ తండ్రీ లేకుండా పిల్లలెలా బతుకుతారు? ప్రాణం తర్వాత తీసుకోవచ్చని మీతో చెప్పడానికి ఇలా వచ్చాను.’ అని చెప్పాను.
ఇలా అనేసరికి భగవంతుడు నాతో చెప్పాడు. ‘వెళ్ళు, నేను తీసుకు రమ్మన్న ప్రాణం తీసుకురా. ఈ పని చేయనందుకు నువ్వు స్వర్గంలో ఉండడానికి అర్హుడివి గాదు. భూమ్మీదకి వెళ్ళి మూడు సత్యాలు నేర్చుకో. మనుషుల్లో అంతర్లీనంగా ఉండేదేమిటి? మనుషులకి ఏది ఇవ్వబడలేదు? మనుషులెందుమూలంగా జీవిస్తారు? ఈ మూడు తెల్సుకున్నాక మళ్ళీ నువ్వు స్వర్గంలోకి రావచ్చు. వెళ్ళు.’ అప్పుడు నేను వెళ్ళి ఆవిడ ప్రాణాన్ని తీశాను. ఆవిడ శరీరం పక్కకి దొర్లి ఒక పాప మీద పడిపోయింది. నేను తీసిన ప్రాణంతో బాటూ స్వర్గంకేసి ఎగరబోతుంటే ఆ ప్రాణం దానికదే భగవంతుడి దగ్గిరకెళ్ళింది. నా రెక్కలు ఊడిపోయి నేను తటాలున భూమ్మీద పడ్డాను.”
XI
సైమన్, మాట్రియోనాలకి ఇప్పటిదాకా తమతో ఉన్నదెవరో తెలిసి ఒళ్ళు గగుర్పొడిచింది. కళ్ళలో ఆనందబాష్పాలు ఉప్పొంగేయి. మైకేల్ ఇంకా చెప్పేడు.
“నేను కింద పడిపోయినప్పుడు చలి అంటే తెలిసింది. అప్పటి దాకా మనుష్య జీవితం ఎలా ఉంటుందో తెలియదు కనక. ఆకలీ, దాహం పీడించడం మొదలు పెట్టాయి. పక్కనే ఒక గుడి కనిపించింది. అక్కడకి వెళ్ళాను ఏదైనా ఆశ్రయం దొరుకుతుందేమో అని. కానీ గుడి తలుపు తాళం వేసి ఉంది. అక్కడే కూర్చున్నాను. ఇంతట్లో ఎవరో వస్తున్నట్టూ అడుగుల చప్పుడైంది. ఆ మనిషి తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు. మొదటిసారి మనిషిగా మరో మనిషి మొహం చూశాను. ఆ మొహం భయంకరంగా కనిపించింది. తన కష్టసుఖాలు తప్ప ఇంకేమీ పట్టవా ఇతనికి? నేనిక్కడ చలిలో గడ్డ కట్టుకుపోతూంటే, నాకు రావాల్సిన బాకీలు రాలేదని ఏడుస్తాడేమిటీ? అనిపించింది. వాడిక్కావాల్సిన రొట్టె గురించే తప్ప నాకు సహాయం చేయాలని లేదా? నన్ను చూడగానే, నేను చంపేస్తానని పారిపోదాం అనుకుంటున్నాడా? ఇంతలోనే అతను వెనక్కి రావడం గమనించాను. తలెత్తి చూసే సరికి మొదట చూసిన మొహమే కానీ ఇప్పుడున్న భావాలు వేరు. మనిషే పూర్తిగా మారిపోయినట్టున్నాడు. మొహంలో ముందు కనిపించిన మృత్యువు స్థానే ఇప్పుడు భగవంతుడు కనిపిస్తున్నాడు. నన్ను లేపి బట్టలిచ్చి ఇంటికి తీసుకెళ్ళాడు.
ఇంటిలో లోపల కనిపించిన ఆడమనిషి మొహం అతడి మొహంకన్నా భయంకరంగా ఉంది; నోట్లోంచి మృత్యువచనాలు. నన్ను ఇంట్లోంచి బయటకి చలిలోకి పంపించడానికి తయారైంది. నన్ను కనక బయటకి పంపిస్తే వెంటనే ఆవిడ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని నాకు తెల్సు. ఆవిడ భర్త భగవంతుడి గురించి మాట్లాడేసరికి ఒక్కసారి ఆవిడలో మార్పు వచ్చింది. నాకు భోజనం పట్టుకొచ్చింది. నేను ఆవిడ మొహం కేసి చూశాను అప్పుడు. ముందున్న మృత్యువు ఇప్పుడులేదు. ఇప్పుడు భగవంతుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాడు.
అప్పుడు భగవంతుడు నేర్చుకోమన్న మొదటి సత్యం గుర్తొచ్చింది. భగవంతుడు నన్ను, మనుషుల్లో అంతర్లీనంగా ఉండేదేమిటో తెలుసుకోమన్నాడు. మనుషుల్లో అంతర్లీనంగా ఉండేది ప్రేమ! అప్పుడే నాకు భగవంతుడు సమాధానాలు చూపిస్తున్నందుకూ సంతోషమైంది. నేను మొదటి సత్యం నేర్చుకున్నందుకు సంతోషంగా నవ్వాను.
మీతో ఒక ఏడాది జీవించాక అప్పుడు భూస్వామి వచ్చాడు బూట్లు కుట్టించుకోవడానికి. అవి ఏడాది పాటు ఆకారం మారకుండా, కుట్లు తెగిపోకుండా ఉండాలి అంటాడు ఆయన. నేను భూస్వామి కేసి చూస్తూ ఉంటే ఆయన వెనక నాకు మృత్యువు కనిపించింది. అది చూడగలిగింది నేనొక్కడినే. ఆయన కనిపించగానే నాకు తెల్సిపోయింది ఈ భూస్వామి మరి కొద్ది గంటల్లో చనిపోతున్నాడని. అప్పుడు ‘ఈయన ఏడాదికి సరిపడా ఏది కావాలో ఏది అక్కర్లేదో అప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నాడే, సాయంకాలం లోపుల చచ్చిపోతూ కూడా?’ అనిపించింది. చటుక్కున భగవంతుడు నేర్చుకోమన్న రెండో సత్యం గుర్తుకొచ్చింది,’మనుషులకి ఏది ఇవ్వబడలేదో’ తెలుసుకుని రమ్మన్నాడు కదా? మనుషులకి వాళ్ళ అవసరాలు ఏవిటో తెలుసుకోవడం ఇవ్వబడలేదు. అందుకే రెండో సారి నవ్వాను.
ఆరేళ్ళు ఆగాక, అప్పుడొచ్చింది మేరీ పిల్లలిద్దర్నీ వెంటబెట్టుకుని. మేరీ చెప్పేదాకా నేను ప్రాణం తీసినావిడ పిల్లలు ఎలా బతికారో నాకు తెలియదు. మొదటిసారి నేను ఆవిడ ప్రాణం తీయడానికి వెళ్ళినప్పుడు ‘తల్లీ తండ్రీ లేకుండా పిల్లలు బతకలేరు, నన్ను తీసుకుపోకు,’ అని అడిగినప్పుడు అది నిజమే అనుకున్నాను నేను. కానీ ఈ పిల్లలిద్దరికీ ఏమీ కాని పొరుగింటి బాలింతరాలు వీళ్ళద్దర్నీ ఇలా సాకుతుందని నాకు కలలో కూడా అనిపించలేదు. ఇప్పుడు తనకి ఏమీ కాని ఈ పిల్లలిద్దర్నీ అక్కున చేర్చుకుని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకునే మేరీలో సాక్షాత్తూ భగవంతుడు కనిపించేడు. అప్పుడే నాకు మూడో సత్యం తెలిసి వచ్చింది. ఈ మూడూ నేర్చుకున్న నన్ను భగవంతుడు నన్ను క్షమించాడు. అందుకే మూడో సారి మళ్ళీ నవ్వేను.”
చెప్పడం ముగించగానే దేవత శరీరం వెలుగుగా మారింది. ఈ సారి వినిపించే కంఠం మైకేల్ నుంచి వస్తున్నట్టు కాక పైనుంచి అశరీరవాణి పలుకుతున్నట్టూ ఉంది.
“మనుషులందరూ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం వల్ల బతకడం లేదు. వాళ్ళు బతికేది ప్రేమ వల్లనే. కవల పిల్లలని కన్న అమ్మకి ఆ పిల్లలు పెరిగి పెద్దవ్వడానికి కావాల్సినదేమిటో తెలుసుకోవడం ఇవ్వబడలేదు. అలాగే భూస్వామికీనూ. ఆ రోజు సాయంకాలం వచ్చేసరికి ఆయన శరీరానికి కావాల్సినవి బూట్లా, లేకపోతే శవానికి తొడిగే చెప్పులా అనేది తెలుసుకోవడం ఆయనకి ఇవ్వబడలేదు. నేను మనిషిగా బతికి ఉన్నానంటే పక్కనున్న మనిషిలో మానవత్వం, ప్రేమ మిగిలి ఉన్నాయి కనకనే. పుట్టిన అనాథ కవల పిల్లలిద్దరూ బతికి బట్టకట్టారంటే కూడా పొరుగింటి మేరీలో ప్రేమ ఉండడం వల్లే కదా? ప్రజలందరూ బతికేది ప్రేమ వల్లే కానీ, నాదారి నాది అని చుట్టూ వృత్తం గీసుకుని ఉండడం వల్ల కాదు.
మనుషులకి భగవంతుడు జీవితాన్నీ, కోరికలు తీర్చుకునే తాహతునూ ఇచ్చాడని తెలుసు. మనుషులందర్నీ విడివిడిగా బతకమని భగవంతుడు చెప్పడు. అందుకే జీవితంలో వాళ్ళకేమి కావాలో ముందే చెప్పడు. వీళ్ళందరూ కలిసి బతకాలనీ, అందరికీ కలిసికట్టుగా కావాలసినవేవో అవే తప్పకుండా తెలియపరుస్తాడు. ఇప్పుడు నాకు అర్థమైనదేమిటంటే, మనుషులందరూ వేరువేరుగా తమ మటుక్కి తామే బతుకుతున్నట్టూ కనిపిస్తుంది పైపైకి కానీ నిజానికి అందరూ జీవించేది ఒకరి పై ఒకరి ప్రేమ వల్లే. ప్రేమ చూపించేవాడు భగవంతుడి ప్రతిరూపం ఎందుకంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడూ అపార దయాసాగరుడూ కాబట్టి.”
అలా వినిపించే కంఠం మెల్లిగా అంతరించింది. సైమన్ గుడిసె చూరు తెరుచుకుని కళ్ళు మిరుమిట్లు గొల్పే వెల్తురు భూమ్మీదనుంచి ఆకాశంలోకి వ్యాపించింది ఓ స్థంభంలాగా. ఆ వెల్తురు వెంటే దేవత శరీరం మీద రెక్కలు ప్రత్యక్షం అయ్యాయి. అతను అలా ఆకాశంలోకి ఎగురుతూ కనుమరుగయ్యేసరికి సైమన్, మాట్రియోనాలు చూడలేక కళ్ళు మూసుకున్నారు.
మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి గుడిసెలో సైమన్, మాట్రియోనా, పిల్లలూ తప్ప ఏమీ జరగనట్టూ అంతా ఎప్పటిలాగానే ఉంది.
(మూలం: What men live by – Leo Tolstoy)