అతిథి

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాబోయే రెండు రోజులలో బొంబయి పట్టణంలో, చుట్టుపక్కల దాదాపు ముఫ్ఫై కిలోమీటర్లవరకూ అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మత్స్యకారులని సముద్రంలోకి వెళ్ళవద్దనీ లోతట్టు ప్రాంతాలు మాహీం వంటివి జలమయం అవుతాయనీ వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. దీనిమూలంగా సముద్రతీరంలో నాలుగో నంబరు ప్రమాద సూచిక ఎగురవేయబడింది.

రేడియోలో వచ్చే వార్తలు వింటున్న కేదార్‌నాథ్ పండిట్ ఉలిక్కిపడ్డాడు. మంచం లోంచి మెల్లిగా లేచి తన ఇంట్లోకి చూశాడు. పన్నెండేళ్ళ కొడుకు మనీష్ ఏదీ పట్టనట్టు టి.వి. చూస్తున్నాడు.

“అక్క పనిలోకి వెళ్ళిపోయిందిరా?” అడిగేడు.

“ఆ, వెళ్ళి అరగంట పైనే అయింది.”

“మరి నువ్వు స్కూలుకెళ్ళవా?”

“వర్షానికి స్కూల్లేదని చెప్పారు కదా? మళ్ళీ చెప్పేదాకా వెళ్ళక్కర్లే!” నవ్వుతూ చెప్పేడు కుర్రాడు. ఇదేం వింతో కానీ, స్కూల్లో చేరి చదువుకుని బాగుపడ్డానికి ఎంత ఆనందమో, ఆ చదువు నేర్పే స్కూలు మూసేస్తే అంతే ఆనందం. మళ్ళీ మంచం మీద కూలబడి కుర్రాడికేసి చూస్తూంటే ఆలోచనలు చుట్టుముట్టాయి. తన బతుకు తెల్లారిపోయేలోపు కూతురి పెళ్ళి చేసి కుర్రాణ్ణి ఓ దారిలో పెట్టగలిగితే చాలు, అంతకంటే ఏమీ అక్కర్లేదు.

ఎప్పుడో తాను కుర్రాడిగా ఉన్నప్పుడు దాదర్‌కు వచ్చి చేరిన ఇల్లు. అదృష్టం ఏమిటంటే ఈ దాదర్ ఇంటికి పాతకాలం అద్దె నూట యాభై కడుతూ బతికేస్తున్నాడు. లేకపోతే ఈ మహానగరంలో ఇల్లు దొరక్కో, దొరికినా ఇంటి అద్దె కట్టలేకో అష్టకష్టాలు పడుతూ ఉండేవాడు. ఏమో ఎవరు చెప్పొచ్చారు ఈ మాత్రం తలమీద గూడు లేకపోయుంటే ఎప్పుడో తమ సొంత ఊరు నాసిక్ వెళ్ళిపోయి ఉండేవాడా? తనకాళ్ళు తనకుండేవా? ఆక్సిడెంటులో కాళ్ళు పోయాక యూనియన్ ఎంత దెబ్బలాడినా బట్టల కంపెనీ ఎక్కడలేని లొసుగులన్నీ పట్టుకుని కూతురు కోమలి పై చదువులకి ఇస్తానన్న డబ్బులు ఎగ్గొట్టేసింది. దాని మీద యుద్ధం ఇంకా జరుగుతోంది కానీ తనని బయటకి పంపించాక యూనియన్‌కి, కంపెనీకి పెద్దగా పట్టట్లేదు తన గురించి. ఆ డబ్బులు కాస్తో కూస్తో వచ్చినా రెండేళ్ళ బ్రేక్ తర్వాత కోమలికి చదవడానికి ఇంటరెస్టు ఉండొద్దూ? ఇల్లు గడిచేదెలా?

ఉన్న ఒక రూమ్, కిచెన్ లోనే తాము నలుగురూ సర్దుకోవడం. అమ్మాయి కోమలి ఎంతో ఆశతో డిగ్రీ పాస్ అయ్యాక ఎం.ఎం.ఎస్. చేద్దామనుకోవడం, తన ఆరోగ్యం దెబ్బతినడంతో ఇలా దొరికిన ఉద్యోగంలో చేరాల్సి రావడం. ఏం ఖర్మ? తను పిల్లలకి అన్నీ అమర్చిపెట్టాల్సిన వాడు, ఇలా పిల్ల చేత సేవలు చేయించుకోవాల్సి వస్తోంది. కో నామ కస్య సుకృతం కథ మిత్యవేయాత్. కళ్ళు చెమరుస్తూంటే చిన్నగా వచ్చే వెక్కిళ్ళు ఆపుకుని మళ్ళీ మంచం మీద వాలిపోయాడు.

కుర్రాడు కంగారుగా తండ్రికేసి చూసి అడిగేడు, “ఏమైనా కావాలా నాన్నా?”

“వద్దురా, ఓ గంట పోయాక అలా రోడ్డు మీదకెళ్ళి అక్కకి ఫోన్ చేసి చెప్పు ఇలా వర్షం ఎక్కువౌతుందిట, సాయంత్రం తొందరగా వచ్చేయమని.”

“అలాగే.” మళ్ళీ కుర్రాడు టి.వి.లో పడిపోయేడు. కేదార్‌నాథ్ వాళ్ళావిడ లలిత కిచెన్ లోంచి బయటకొచ్చి ఓ సారి అన్నీ చూసి కొడుకుతో చెప్పింది. “ఒరేయ్ నేను స్నానానికి వెళ్తున్నా, తలుపు తీయకు ఎవరికీ. నాన్న అడిగితే చెప్పు. అయినా ఆ టి.వి. చూడకపోతే పుస్తకాలు తీసి ఏదోటి చదవకూడదూ? అలా చూస్తూంటే కళ్ళు పాడౌతాయ్.”

“అమ్మా, నేను శారదాశ్రమ్ స్కూల్ అకాడెమీలో జేరతానే. అక్కడ క్రికెట్ బాగా నేర్పుతారు. నేను ఇప్పటికే మా స్కూల్లో కెప్టెన్‌ని. నన్ను చేర్చుకుంటారు అడిగితే.”

“మళ్ళీ మొదలెట్టావూ సంత? స్కూల్లో చేర్చుకుంటార్లే, అకాడెమీకి డబ్బులేవీ? వాళ్ళు బంతులకీ, బేట్లకీ, బట్టలకీ, ప్యాడ్లకి, గ్లవ్స్‌కీ అని డబ్బులు అడగరూ? వాటికి కనీసం ఇరవై వేలు అవుతాయి. మన దగ్గిర డబ్బులేవీ?”

“నేను బాగా ఆడితే కొంతమంది మేచ్‌లు ఆడడానికి డబ్బులు ఇస్తారే అమ్మా.”

“అవుననుకో, కానీ అది నువ్వు అకాడెమీలో చేరాక కదా? ఈ లోపునే ఇరవై, ముఫ్ఫైవేలు పెట్టుకోవద్దూ? అయినా బాంబేలో నీ లాంటి వాళ్ళు కో అంటే కోటిమంది ఉన్నారు. నువ్వు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తే అదే చాలు. క్రికెట్ తిండి పెడుతుందా గుడ్డ పెడుతుందా?”

ఏం మాట్లాడాలో తెలీని మనీష్ నోరు మూసుకున్నాడు. ఇదంతా విన్న కేదార్‌నాథ్‌కి తన జీవితం అంటే అసహ్యం వేసింది. ఏమిటి తాను బతికుండి చేసేది, ఇలా తిని పడుకోవడం తప్ప? మధ్య తరగతి బతుకులంటే ఇవే. చావూ రాని, బతుకూ బతకలేని ఎటూ కాని పరిస్థితి.

మరో రెండు గంటలు గడిచాక బయటకి వెళ్ళొచ్చిన కుర్రాడు చెప్పేడు తండ్రితో, “అక్కకి ఫోన్ చేశాను. ఈ రోజు వాళ్ళ ఆఫీసు మూడింటికి కట్టేస్తున్నారుట. నారిమన్ పాయింట్ దగ్గిర బస్సు ఎక్కి వెంటనే వచ్చేస్తానని చెప్పింది.”

మరోసారి రేడియో ఆన్ చేసి వాతావరణం ఎలా ఉందా అని వినబోయేడు కేదార్‌నాథ్.

ముందు అనుకున్న అరేబియా సముద్రంలోని వాయుగుండం మరింత వేగంతో ఈ రోజు మధ్యాహ్యం దాదాపు రెండు, మూడు గంటల మధ్య తీరం తాకవచ్చని తెలుస్తోంది. పెద్ద ఎత్తున ప్రమాద సూచికలు ఎగురవేయబడ్డాయి. బాంబే ఆఫీసులన్నీ రెండింటికి కట్టేసే విధంగా చూడాలని ముఖ్యమంత్రి శరద్ పవార్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల దగ్గిర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. మేయర్ ఆచార్య ప్రభుత్వాధికారులను అప్రమత్తం చేశారు…”

ఈసారి కొంచెం కంగారుపడ్డ కేదార్‌నాథ్ లలితని పిల్చి చెప్పాడు మరోసారి కోమలికి ఫోన్ చేయమని. ఆవిడకిదేం పట్టినట్టు లేదు, “మనకేమైనా ఈ వర్షాలు కొత్త కాదు కదా? కోమలికి ఇవన్నీ బాగా తెల్సినవే. వచ్చేస్తుంది. ఏమీ కంగారు వద్దు.” అనేసింది.


మధ్యాహ్నం తమ కంపెనీ స్టాక్ గురించి మార్కెట్‌ రిపోర్ట్స్ చూస్తున్న కల్పన ఓబెరాయ్ ఒక్కసారి పోన్ మోగడంతో ఎత్తి చెప్పింది, “కల్పన హియర్.”

అవతల్నుంచి తండ్రి కంఠం. “పొద్దున్న నుంచీ నేను మొత్తుకుంటూనే ఉన్నా అసలు ఆఫీసుకి వెళ్ళొద్దని. నువ్వు వింటేనా? ఒక్కసారి బైటకు చూడు. అప్పుడే రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోతున్నాయి. నీ మెర్సిడెస్ నారిమన్ పాయింట్ నుంచి ఇంటి దాకా రాదు, దాదర్ దాటాక డ్రైవ్ చేయడం కష్టం. నీళ్ళల్లో ఇరుక్కుపోవడం ఖాయం. అసలు అక్కడే ఆఫీసులో పడుకోమని చెప్దామనుకున్నాను కానీ ఈ వర్షం రెండు మూడురోజుల దాకా తగ్గదంటున్నారు. ట్రైన్ ఎక్కి వచ్చేయరాదూ ఎలాగోలా?”

తను అమెరికా వెళ్ళకముందు ఎప్పుడో కాలేజ్‌ డేస్‌లో ఉండగా లోకల్ ట్రెయిన్ ఎక్కిన అనుభవం గుర్తొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది కల్పనకి. మామూలు కంపార్ట్‌మెంట్‌లో అయితే మనిషిని నలిపేయడం గారంటీ. ఫస్ట్ క్లాస్‌లో అయితే కాస్త డీసెంట్‌గా ఒకళ్ళనొకళ్ళు ఆనుకుంటూనో, లేకపోతే వేళ్ళాడుతూనో నిలబడొచ్చు. అక్కడికీ తన చేతిలో పర్స్ పోకుండా దాచుకోగలిగితే అదృష్టమే. అయినా బాంబేకి ఇలాంటి వర్షం మామూలే కదా అనుకుంటూండగానే మళ్ళీ తండ్రి కంఠం వినిపించింది ఫోనులో, “విన్నావా? కారు బయటకి తీయవద్దు. అది నీళ్ళలో చిక్కుకుపోతే నువ్వు ఏమీ చేయలేవు. ఈ వర్షంలో దాన్ని బయటకి తీయడానికి ఎవరూ హెల్ప్ చేయలేరు కూడా. ఏదోలాగ ట్రెయిన్‌లో కనీసం బాంద్రా దాకా అయినా వస్తే నేను ఇక్కడనుంచి డ్రైవర్ని పంపిస్తా కారుతో. అక్కడ్నుంచి ఇంటికి వచ్చేయవచ్చు. సరేనా?”

“సరే కానీ మూడింటి లోపున రావడం అస్సలు కుదరదు, బోలెడు పని ఉంది.”

“పనెక్కువా, ప్రాణం ఎక్కువా? రెండింటిలోపున బయల్దేరు.” అరుస్తున్నట్టే అన్నాడు తండ్రి.

“సరే, సరే,” ఇలా తండ్రి అరవడం మామూలే కాబట్టి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసింది కల్పన.

ఆఫీస్ అద్దాల్లోంచి బైటకు చూసింది కల్పన. ఈదురుగాలి, వర్షం. బైటంతా చిక్కగా ముసురు పట్టింది. పదో అంతస్తు లోంచి చూస్తుంటే కింద రోడ్ల మీద ఏమీ కనిపించటం లేదు, మసకమసకగా కార్ల రెడ్ లైట్లు తప్ప.

పనిలో పడిపోయిన కల్పనకి మరోసారి ఫోన్ మోగేదాకా వాన సంగతి గుర్తుకు రాలేదు. ఈ సారి హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ చెప్తున్నాడు ఫోనులో, “వెదర్ బాలేదని అందర్నీ ఇంటికి పంపించేశాను. మీరొక్కరూ ఉండిపోయారు. నేనూ వెళ్ళాలండి. ఇక మీరు కూడా వెళ్ళడం మంచిది. మీకు ఏదైనా హెల్ప్ కావలిస్తే చెప్పండి.”

టైమ్ చూసుకునే సరికి ఒక్కసారి తెలిసొచ్చింది. అప్రయత్నంగా అంది పైకే, “మై గాడ్, మూడున్నరా? ఈ రోజు కారు బయటకి తీయొద్దని నాన్నగారు చెప్పారు. ఇప్పుడు ట్రెయిన్‌లో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏదైనా హెల్ప్ చేయగలరా?”

“నేను వెళ్ళేది విక్టోరియా టెర్మినస్ నుండి వేరే దారిలో, మీరు ఉండేది జూహూ దగ్గిర కనక చర్చ్ గేట్ నుంచి అంధేరికి టికెట్ తీసుకోండి. అక్కడ్నుంచి ఆటోలో ఇంటికెళ్ళిపోవచ్చు. లేకపోతే ట్రెయిన్ దిగగానే మీ నాన్నగారికి ఫోన్ చేస్తే కారు పంపిస్తారేమో?”

“అవును అలాగే రమ్మని చెప్పారు. బాంద్రాలో దిగడం మంచిదా, అంధేరీ దాకా వెళ్ళాలా?”

“అంధేరి దాకా ట్రెయిన్లో వెళ్తే మీకు ఏమౌతుందో? అసలు ట్రెయిన్స్ ఎంతవరకూ వెళ్తాయో చెప్పలేం ఈ పరిస్థితుల్లో. ముందు మీరు బయల్దేరితే…”

వస్తున్నా అంటూ వెంటనే అన్నీ కట్టేసి మేనేజర్‌తో కలిసి బయటకొచ్చింది కల్పన. పర్సులో చూసుకుంటే రెండువేల చిల్లర నోట్లు తప్ప మరేం లేవు. టికెట్ ఎంత ఉంటుందో? ఇద్దరూ ఓ టేక్సీ పట్టుకుని చర్చ్ గేట్ స్టేషన్ దగ్గిరకొచ్చారు.

కల్పన ఇచ్చిన డబ్బులు పట్టుకుని క్యూలో చొరబడి పావుగంటలో బయటకొచ్చి టికెట్టూ చిల్లరా చేతికిస్తూ చెప్పేడు మేనేజర్, “ట్రెయిన్స్ అన్నీ బాంద్రా దాకానే వెళ్తున్నాయిటండి. మీకు అక్కడివరకే దొరికింది. మీరు అక్కడ నుంచి తంటాలు పడవల్సిందే.”

“అలాగా? అసలు నాన్న చెప్పినది బాంద్రా దాకా రమ్మనే. మరి మీ సంగతి ఏమిటి?”

“ఇది చర్చ్ గేట్, వెస్టర్న్ రైల్వే. నేను వెళ్ళేది సెంట్రల్ రైల్వేలో, మళ్ళీ వి.టి.కి వెళ్ళాలి.”

“రేపటికి రావడం వీలు కాకపోతే హైరాన పడకండి. ఓ రోజు పని చేయకపోతే కొంపలు ముణిగిపోవు.”

“ఈ వర్షం చూస్తే సోమవారం దాకా రావడం కుదరక పోవచ్చు. సరే, నే వెళ్తా. వర్షం ఎక్కువౌతోంది,” బయటకి నడిచి ఈదురుగాలి వర్షంలో కల్సిపోయేడు హెచ్. ఆర్. ఎం.

కల్పన బాంద్రా వెళ్ళే ట్రెయిన్ ఎక్కి అటూ ఇటూ చూసేలోపల ట్రెయిన్ కదిలింది.

చర్చ్ గేట్ నుంచి రెండు మూడు స్టేషన్లు దాటాక అసలు విషయం తెలిసొచ్చింది. దాదాపు ట్రాక్ అంతా నీరు. అక్కడ్నుంచి నత్త నడకే. అలా స్టేషన్లు అన్నీ దాటుతూ మొత్తానికి దాదర్ చేరేసరికి చీకటి పడి ఏడు దాటుతోంది.

అప్పుడొచ్చింది అనుకోని ఉపద్రవం.

దయచేసి వినండి. ఇప్పటివరకూ కురిసిన వర్షపాతం మూలంగా దాదర్ స్టేషన్‌కి రెండువైపులా నీరు మడుగు కట్టి ఉంది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ట్రెయిన్లు ఇక ఈరోజు ఇక్కడ్నుంచి ముందుకి గానీ వెనక్కి గాని వెళ్ళవు. మీకు సహాయం కావాలిస్తే ప్లాట్‌ఫార్మ్ మూడు మీద ఉన్న రైల్వే అధికారుల్ని సంప్రదించగలరు.

రైల్వే అనౌన్స్‌మెంట్ విని అందరితోపాటే కిందకి దిగిన కల్పనకి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ఈ ట్రెయిన్స్‌లో తిరిగిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి? అడుగులో అడుగు వేసుకుంటూ జనసమ్మర్ధం దాటుకుంటూ ఒవర్ బ్రిడ్జ్ మీద నుంచి అటువైపు మూడో ప్లాట్‌ఫార్మ్ మీదకి నడిచింది. చుట్టూ ఇసకవేస్తే రాలనంతటి జనం. అసలే దాదర్ స్టేషన్; అందులో మళ్ళీ ఇంక ఆ రోజుకి కేన్సిల్ అయిపోయిన ట్రెయిన్స్. రైల్వే అధికారితో మాట్లాడ్డానికి మరో పావుగంట వెయిట్ చేశాక ఆయనడిగాడు విసురుగా ఏకవచనంలో.

“ఎక్కడికెళ్ళాలి?”

“బాంద్రా లేదంటే అంధేరి.” ఒక గంట ఫస్ట్ క్లాసులో ప్రయాణించగానే తన మొహం అంత ఛండాలంగా తయారైందా ఏకవచనంలో మాట్లాడుతున్నాడూ అనుకుంటూ చెప్పింది, రైల్వే వాళ్ళ మర్యాదలు మర్చిపోయిన కల్పన.

“ఈ రోజుకి ఇంక ట్రెయిన్స్ కదలవ్. మీ దారి మీరు చూసుకోవాల్సిందే.”

“టాక్సీలు వెళ్తాయా?”

“ఓ సారి రోడ్డుమీదకి వెళ్ళి చూడండి. దాదాపు నడుములోతు నీళ్ళు పారుతున్నాయి. బుర్ర ఉన్న డ్రైవర్ ఎవడూ టాక్సీ బయటకి తీయడు.”

“మరెలా?”

అది తన తల్నొప్పి కాదన్నట్టు భుజాలు ఎగరేస్తూ కల్పన వెనకనే ఉన్నావిడతో అన్నాడు అధికారి, “నెక్స్ట్”

వెనకనే ఉన్నావిడ ముందుకొచ్చి అడిగింది, “దాదర్‌ బయట నడిచే వీలుందా? మా ఇల్లు అటువైపు దగ్గిరే స్టేషన్‌కి.”

“వెళ్ళి చూడండి. స్టేషన్ చుట్టూరా నడుము లోతు నీళ్ళున్నాయి. అందులో కొట్టుకుపోకుండా నడవగలిగితే అదృష్టమే. కనీసం గుమ్మం దాకా వెళ్ళి చూడొచ్చు.” చెప్పినదే చెప్తూ రైల్వే అధికారి కొనసాగించాడు.

ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ పర్స్ ఒంటికి దగ్గిరగా పట్టుకున్న కల్పనా ఓబెరాయ్ ఎవరో పలకరించినట్టనిపించి పక్కకి తిరిగి చూసింది. ఎవరో కాలేజీ అమ్మాయి కాబోలు అడుగుతోంది, “ఎక్కడికి వెళ్ళాలండి?”

“బాంద్రా”

“నేను ఉండేది ఈ దాదర్‌లోనే, అటువేపు. రోడ్డుమీద నీరు బాగా వేగంగా పారుతోంది. కొట్టుకుపోతానేమో అని భయంవేసి ఇలా వచ్చాను.” నవ్వుతూ చెప్పింది అమ్మాయి.

“అదృష్టవంతులే, నీళ్ళు పారడం తగ్గగానే వెళ్ళిపోవచ్చు. నేను ఈ రాత్రంతా ఇక్కడే ఉండాలేమో” అంది కల్పన.

“అదేం? ట్రెయిన్ లేకపోతే టాక్సీలో వెళ్ళిపోవచ్చుగా?”

“మీకున్న గొడవే నాకూను. ఈ నడుము లోతు నీళ్ళలో ఎవరు నడుపుతారు టాక్సీ? నా కార్‌లోనే వెళ్ళిపోదాం అనుకున్నాను నారిమన్ పాయింట్ నుంచి. ఇంకా నయం అలా చేశాను కాదు. అది దారిలో మునిగిపోయి ఉండేది. మా నాన్నగారు వద్దని చెప్పడం వల్ల ఇలా ట్రెయిన్ ఎక్కాను ఇంటికి తొందరగా పోవచ్చనుకుని. ఇప్పుడిలా అయింది.”

కాసేపు మౌనం, కాసేపు వానల గురించి. ఆ కబుర్లూ ఈ కబుర్లు అయ్యాక కాలేజీ అమ్మాయి అంది, “మరో సారి చూసి వద్దాం వస్తారా? రోడ్డుమీద నీళ్ళు తగ్గితే వెళ్ళిపోవచ్చు.”

కల్పన కాసేపు ఆలోచించింది. చూడ్డానికి ఇద్దరూ వెళ్ళాక నీళ్ళు తగ్గిపోయి ఉంటే ఈ అమ్మాయి వెళ్ళిపోతే తన సంగతి ఏమిటి? అయినా ఈ అమ్మాయి ఏమౌతుంది తనకి? ఇప్పుడు ఇక్కడ నుంచున్నా ఈ అమ్మాయితో అటువైపు గేటు దాకా నడిచినా తనకి పోయిందేమీలేదు. కనీసం రోడ్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది కదా. అటువేపు గేటు దగ్గిర నీళ్ళు కాస్త తగ్గినట్టున్నాయి. నడుములోతు నీళ్ళు మోకాలి దాకానే ఉన్నా ప్రవాహం అలాగే ఉంది ఇప్పుడు. వర్షం ధారాపాతంగా కురుస్తూనే ఉంది.

నీళ్ళలోకి దిగి వెళ్ళబోయిన కాలేజీ అమ్మాయి ఒక్కసారి వెనక్కి వచ్చి, “నేను వెళ్ళిపోతే మరి మీరో?” అంది.

కల్పనకి ఏమనడానికీ తోచలేదు. అమ్మాయే అంది మళ్ళీ, “మీరొక్కరూ ఇక్కడ రాత్రి అంతా ఉండాలా?”

“తప్పదు కదా?”

కాసేపు సాలోచనగా చూసి అంది అమ్మాయి, “మీరు ఏమనుకోకపోతే మా ఇంటికి రండి. ఒక్క ఇరవై నిముషాలు నడిస్తే వెళ్ళిపోవచ్చు.”

కల్పన గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది. ఈ అమ్మాయి ఎవరో, ఎక్కడికి తీసుకెళ్తుందో?

తన ఆలోచన గ్రహించినట్టు వెంటనే చెప్పింది కాలేజీ అమ్మాయి, “నన్ను నమ్మలేకపోతున్నారు కదూ? అలా అనుకుంటున్నందుకు నేను ఏమనుకోను గానీ నేను కూడా నారిమన్ పాయింట్లో పనిచేసేదాన్నే. రోజూ బస్సులో వెళ్తాను ఇంటికి. అవి ఈ వర్షాలకి ఆపేశారని తెలిసాక ఇలా ట్రెయిన్‌లో వచ్చాను ఈ రోజు. కావలిస్తే ఇదిగో చూడండి, నాకు ఆఫీసులో ఇచ్చిన ఐ.డి. మీరు రాత్రంతా ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉండాలని రమ్మన్నాను గానీ మీకు ఇష్టం లేకపోతే రావొద్దు. నేను ఒక్కర్తినీ వెళ్ళిపోగలను. నాకు అలవాటే.”

కోమలి పండిట్, హ్యూమన్ రిసోర్సెస్ అసిస్టెంట్, బోరింగర్ నాల్ అండ్ కంపెనీ, ఎయిర్ ఇండియా టవర్, నారిమన్ పాయింట్, బాంబే.

ఈ సారి కల్పన అంది, “మరి నేను వస్తే మీకు ఇంట్లో ఇబ్బంది కాదూ?”

“అబ్బే అలా అనుకోకండి. నేనూ తమ్ముడూ, అమ్మా, నాన్నానే ఉండేది. వాళ్ళు ఏమీ అనుకోరు. మీరే చూస్తారుగా? బలవంతం లేదు సుమా, మీకు ఇష్టం లేకపోతే రావొద్దు.”

ఈ సారి కల్పన వెనుకాడకుండా కోమలి వెనకనే బయల్దేరింది. ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మోకాలి లోతు నీటిలో దాదాపు కాళ్ళు ఈడ్చుకుంటూ చెప్పులు కొట్టుకుపోకుండా, ఇరవై నిముషాలు అనుకున్న నడక వర్షం వల్ల దాదాపు నలభై నిముషాలు పట్టి, ఎనిమిదిన్నరకి కల్పనతో బాటు కోమలి ఇంటికి చేరారు.

ఒక్క ఉదుటున తలుపు తీసి మనీష్ అరిచేడు “అక్క వచ్చేసింది!” అంటూ. వెంటనే కోమలి కూడా ఉన్న కల్పనని చూసి నోటమ్మట మాట రాక పక్కకి తప్పుకున్నాడు.

తడిసి ముద్దయిన ఇద్దరినీ లలిత నోరు వెళ్ళబెట్టి చూస్తూంటే కేదార్‌నాథ్ అరిచేడు, “కాస్త వాళ్ళిద్దర్నీ లోపలకి రానిచ్చి బట్టలు మార్చుకోనిస్తావా? మిగతా విషయాలు మాట్లాడొచ్చు తర్వాత?”

ఇల్లు చూసిన కల్పనకి నోట మాట రాలేదు. మొత్తం ఇల్లంతా కలిపి తన బెడ్‌రూమ్ అంత లేదు. ఇందులో నలుగురా? తాను రైల్వే స్టేషన్‌లోనే ఉండాల్సిందేమో? ఇల్లు శుభ్రంగానే ఉన్నా ఇటువంటి జీవితం విన్నదే కానీ తాను ఇంతకుముందు చూసినది కాదు. తన ఇల్లూ, తన కారూ అదో లోకం. ఇప్పుడు చూస్తున్నది మరో లోకం.

టవల్ చేతికందించి తనని బాత్రూం లోకి తీసుకెళ్ళి పొడి బట్టలిచ్చిన కోమలికి ఏం చెప్పాలో తెలియలేదు కల్పనకి. అరగంట గడిచాక లలిత మాట కలిపింది భోజనం వడ్డిస్తూ. వంటవాడు అన్నీ వండేసి అక్కడ పెట్టేసి పోతే తాను రాత్రెప్పుడో ఇల్లు చేరి అవి వేడి చేసుకుని తినడం. మూడ్ సరిగా లేకపోతే విసుగొచ్చి ఏ పండో తిని పడుకోవడం అలవాటైన కల్పన ఈ వడ్డించడం చూసి కాస్త మొహమాటపడింది.

ఎవరింట్లోనో, ఎవరి బట్టలో కట్టుకుని రాత్రి గడపాలి. తనకి తెలిసిన లోకంలో గేటు దగ్గిర చప్పుడైతే అక్కడి గూర్ఖాని పిలిచి అడగడం, ఎవర్నీ లోపలకి రానీయకపోవడం, ఇవే. మరిక్కడో? తానెవరో తెలియకపోయినా రెండు చేతులూ చాచి నిస్సంకోచంగా లోపలకి ఆహ్వానించడమే కాదు, వాళ్ళ బట్టలిచ్చి భోజనం పెడుతున్నారు. ఆలోచనలు కట్టిపెట్టి ఏదో గుర్తొచ్చిన దానిలా అడిగింది కల్పన.

“మా నాన్నగారు కంగారుపడుతూ ఉంటారండి. ఇప్పుడు ఓ సారి ఫోన్ చేసుకోవడం కుదురుతుందా?”

“మా ఇంట్లో ఫోన్ లేదమ్మా, పక్క ఇంట్లో ఉంది. అడిగితే కాదనరు.” కేదార్‌నాథ్ చెప్పాడు.

ఈ ఇంట్లోనే అపరిచితురాలిని ఇలా ట్రీట్ చేస్తూంటే పక్కింటివాళ్ళు కూడానా?

“సరే కోమలిని కూడా తీసుకెళ్ళచ్చా?”

“తప్పకుండా.”

పక్క ఇంట్లో పెద్దగా ఏమీ చెప్పక్కర్లేకుండానే ఫోన్ చేసుకోనిచ్చాక తండ్రికి ఫోన్ చేసి చెప్పింది కల్పన దాదర్‌లో ట్రెయిన్ ఆగిపోయిన సంగతి.

“రాత్రంతా అలా స్టేషన్లోనే ఉంటావా? నాకు తెల్సిన వాళ్ళతో మాట్లాడి రైల్వే ఫస్ట్ క్లాస్ రూములో ఉండే ఏర్పాటు చేస్తాను, ఉండు.” అన్నాడాయన.

ఎవరో ముక్కూ మొహం తెలియని వాళ్ళింట్లో పడుకుంటున్నానంటే ఆయన ఎలా అరుస్తాడో తెలుసు కాబట్టి ఆ విషయం చెప్పకుండా చెప్పింది, “నాన్నా ఇక్కడున్న ప్రతీవారికీ పస్ట్ క్లాస్ టికెట్ ఉంది. జనం కిక్కిరిసి ఉన్నారు. మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి ఇంటికే వెళ్తున్నా. ఏమీ ఫర్వాలేదు. కంగారుపడకు.”

“ఆ ఇళ్ళలో ఎలా పడుకుంటావ్?”

“నీళ్ళలో కొట్టుకుపోవడంకన్నా, వెయిటింగ్ రూములో జనాల మధ్య నలగడంకన్నా అదే మంచిది కదా?”

“సరే జాగ్రత్త. ఏదైనా అవసరం అయితే ఎంత అర్ధరాత్రైనా ఫోన్ చేయడం మర్చిపోకు.”

ఇంతటి వర్షంలో అర్ధరాత్రి తనకి ఏదైనా జరిగితే తండ్రి నిజంగా ఏం చేయగలడో కల్పనకి అర్థంకాలేదు. వెనక్కి తిరిగి కోమలి ఇంట్లోకొచ్చాక కబుర్లలో తానేం పనిచేస్తోందో అవన్నీ చెప్పకుండా పేరూ, మిగతా విషయాలు చెప్పింది కల్పన.

ట్రెయిన్‌లో, నీళ్ళలో నడకతో ఒళ్ళు హూనమైపోయిన శరీరం నిద్రలోకి జారుకోవడానికి పదిహేను నిముషాలు పట్టలేదు కల్పనకి. మర్నాడు దాదాపు అందరూ లేచేదాకా మొద్దు నిద్ర. పరుపులు లేని ఉఠ్ఠి నేల మీద కూడా నిద్ర ఇంత బాగా పడుతుందా!


తెల్లవారుతూనే తెలిసొచ్చిన విషయం, రాత్రంతా కురిసిన వర్షం చాలదనట్టు, వాయుగుండం ప్రభావం ఇంకా ఎక్కువైందని. మధ్యాహ్నం మూడు దాకా వర్షం తగ్గే సూచనలు లేవు. కాలకృత్యాలు అయ్యేక కాసేపు ఈ కబుర్లూ ఆ కబుర్లూ చెప్పుకుంటున్నప్పుడు కల్పనకి తెలిసొచ్చాయి ఈ ఇంటి సంగతులు. కేదార్‌నాథ్ కంపెనీ ఎలా డబ్బులివ్వకుండా చేసిందీ, కోమలి డిగ్రీ కెమిస్ట్రీలో మంచి మార్కుల్తో పాసై ఎం.ఎం.ఎస్. చేద్దామనుకోవడం, మంచి మార్కులొచ్చినా అది చదవడం కుదరకపోవడం, మనీష్ శారదాశ్రమ్ క్రికెట్ అకాడెమీలో జేరడానికి డబ్బులు లేని సంగతీ- అన్నీను. ఎంతో పరిచయం ఉన్నవాళ్ళలాగా హాయిగా మాట్లాడుకున్నారు అందరూ.

“ఇంకా ఎం.ఎం.ఎస్. చేయాలని ఉందా?” కల్పన అడిగింది కోమలిని.

“మొదట్లో ఉండేది, కానీ ఇప్పుడు మర్చిపోతున్నాను ఆ విషయం. కొన్ని తప్పవు కదా జీవితంలో? మా తమ్ముడి కాలేజీ చదువు అయ్యేదాకా ఉద్యోగం తప్పదు ఈ పరిస్థితుల్లో.”

కబుర్లలో మనీష్ కల్పనతో చెప్పాడు తానాడే క్రికెట్టు, తానెలా టెండూల్కార్‌లా కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్ కొట్టగలడో అన్నీను. కల్పన తెలియనట్టు సరదాకి అడిగింది, “టెండూల్కార్ బాగా ఆడతాడా?”

ఇంట్లో అందరూ నమ్మలేనట్టు చూశారు కల్పనకేసి. మనీష్ చెప్పాడు.

“బాగా ఆడతాడా అని అడుగుతున్నారా? టెండూల్కార్ క్రీజ్‌లో ఉంటే మొత్తం బాంబే అంతా పనులన్నీ మానుకుని చూస్తూ గడుపుతారు. మీరు కానీ టెండూల్కార్ ఈ మధ్యన శారదాశ్రమ్ మేచ్‌లో కొట్టిన సెంచరీ చూసి ఉంటేనా! క్రికెట్టు ఆడ్డం వేరూ టెండూల్కర్‌లా కవర్ డ్రైవ్ కొట్టడం వేరూ. రాబోయే రోజుల్లో చూడండి దేశం అంతా టెండూల్కర్‌ పేరు ఎలా మోగుతుందో. సచిన్ కొట్టిన కవర్ డ్రైవ్ చూసి ఒకసారి కామెంటేటర్ ఏమన్నాడో తెలుసా?”

తెలియదన్నట్టు కల్పన తల అడ్డంగా ఊపింది.

“బంతి మిడ్ఆఫ్, కవర్ ఫీల్డర్ల మధ్యలోంచి బుల్లెట్ లాగా దూసుకుపోయి బుర్ర తిప్పేలోపున బౌండరీ దాటింది. ఆ ఫీల్డర్లు ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. అదీ టెండూల్కర్‌ అంటే. శారదాశ్రమ్ అంటే ఏవిటనుకున్నారు? అక్కడి క్రికెట్…”

“ఊరుకోరా, ఆవిడ బుర్ర తినేసేలా ఉన్నావు నీ క్రికెట్ పిచ్చితో” లలిత నవ్వుతూ కసిరింది మనీష్‌ని.

మధ్యాహ్నం దాకా కబుర్లయాయి. లలిత చేసి పెట్టిన భోజనం అందరితోపాటు నేల మీద కూర్చుని ఏ ఇబ్బందీ లేకుండానే తిన్నది కల్పన. తండ్రికి మరోసారి పక్కింట్లోంచి ఫోన్ చేయడం, కాసేపు కార్డ్స్, చెస్ ఆడ్డం అయింది. దాదాపు నాలుగౌతూండగా వర్షం తగ్గాక బయటకి నడుకుచుంటూ వెళ్తే తెలిసొచ్చింది కల్పనకి. దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అక్కడో చిన్న టీ కొట్టూ, ఇక్కడో కిరాణా షాపూ తీసి ఉన్నా జనం ఎవరూ లేరు.

ఎలాగోలా టేక్సీ చేసుకుని ఇంటికెళ్ళిపోదామనుకున్న కల్పనకి ఆ రోజు రాత్రి కూడా కోమలి ఇంట్లో ఉండక తప్పలేదు.

పొద్దున్నే బయల్దేరుతూంటే లలిత చిన్న పేకెట్ చేతికిచ్చి చెప్పింది, “మా ఇంట్లో పెద్దగా ఏమీ మర్యాద చేయలేకపోయాం మీకు, ఏమనుకోకండేం?”

“ఇదేమిటి?” కల్పన ఆ పేకెట్ తీసుకోకుండా ఆశ్చర్యంగా అంది.

“ఇంటికెవరైనా అతిథులొస్తే ఉత్తి చేతుల్తో పంపించకూడదమ్మా, పెద్దగా ఏమీ లేదు. నేను చేసిన శ్రీఖండ్, నాలుగు లడ్డూలు చిన్న పేకెట్లో పెట్టాను. తీసుకోండి.”

కళ్ళలో నీళ్ళు కనబడకుండా నొక్కిపట్టి ఒకసారి ఆవిడని కావలించుకుని అంది కల్పన “నేను తీసుకోలేనండీ, ఇప్పటికే మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను రెండు రోజులుగా మీ ఇంట్లో తిష్టవేసి కూర్చుని.”

కేదార్ చెప్పాడు పక్కనుంచి, “తప్పు, తప్పు, అలా తీసుకోను అనకూడదు. తీసుకోండి అతిథి దేవో భవ అని కదా మన ఉపనిషత్తులు చెప్పేది? మీరు మా ఇంటికి వచ్చినందుకు మాకేమీ కష్టంలేదు. మిమ్మల్ని కోమలి అలా స్టేషన్లో వదిలేసి వచ్చి ఉంటే నేను తిట్టి ఉండేవాణ్ణి, ఇక్కడకి తీసుకురానందుకు. తోటి వారికి మీరు మాత్రం అలా చేయరా? ఇందులో పెద్దగా చెప్పుకోవడానికేముంది?”

తన పర్సులో డబ్బులు కొన్ని తీసి కల్పన మనీష్ చేతిలో పెట్టబోతే లలిత చెప్పింది నవ్వుతూ, “ఏమీ వద్దు. మీరు మా అతిథి. ఎప్పుడైనా ఇటువైపు మళ్ళీ వస్తే ఓ సారి ఆగండి. చాయ్ తాగి వెళ్దురుగాని.”

కల్పనకి ఇంక తప్పలేదు. అందరికీ మరోమారు చెప్పి దాదర్‌లో టేక్సీ ఎక్కి బయల్దేరింది.

కల్పనని టేక్సీ ఎక్కించి వచ్చాక గుర్తొచ్చింది కోమలికి, కల్పన నారిమన్ పాయింట్లో పనిచేస్తోందని చెప్పినా ఫోన్ నెంబరు అవీ అడగలేదని. తండ్రి చెప్పాడు.

“పోనీలే, అవన్నీ ఎందుకు. ఎవరో ఒకావిడని మనింటికి దేవుడు పంపించాడు. మనకి చేతనైనంత సహాయం చేశాం.”


మూడు వారాలు గడిచాయి. బాంబేలో వర్షాలు తగ్గి ఎండలు ఎప్పటిలాగానే చురుక్కుమనిపిస్తున్నాయి.

పిల్లలిద్దరూ పనిలోకీ, స్కూలికీ వెళ్ళాక ఓ రోజు కేదార్‌నాథ్, లలిత ఇంట్లో తీరిగ్గా కూర్చునున్నప్పుడు ఎవరో తలుపు తట్టారు, కేదార్‌నాథ్ పండిట్ ఇల్లు ఇదేనా అంటూ. కేదార్‌నాథ్ ఒకప్పుడు పనిచేసిన బట్టల కంపెనీ తాలుకు మనిషి.

ఆయన చెప్పిన విషయం టూకీగా ఇది – కంపెనీ యూనియన్‌తో కల్సి ఒక నిర్ణయానికొచ్చింది మొత్తం మీద. దాని ప్రకారం రెండు మార్గాలు ఉన్నాయి. చదువు ఆగిపోయింది కనక అమ్మాయి చదువుకోడానికి ఫీజులు కడతారు. అమ్మాయికి ఉద్యోగం కావాలంటే ఒక దారి ఉంది. అమ్మాయి కెమిస్ట్రీలో చదువుకుంది కనక బట్టల కంపెనీ ఎం.డి. గారికి తెల్సిన ప్రభాదేవిలో ఉండే గ్లాక్సో కంపెనీలో చిన్న ఉద్యోగం వేయించగలరు. మనీష్ కాలేజీ చదువు, క్రికెట్ అకాడెమీకీ డబ్బులు ఇవ్వగలరు. ఇది మొదటి దారి. రెండోది ఒక్క పెద్ద మొత్తం డబ్బులిచ్చేసి చేతులు దులుపుకుంటారు. కేదార్‌నాథ్ ఏది కావలిస్తే అది చేసుకోవచ్చు.

అందరూ కల్సి రెండురోజులు ఆలోచించేరు. కోమలికి ప్రభాదేవిలో గ్లాక్సో ఉద్యోగం మంచిదే. నారిమన్ పాయింట్ దాకా రోజూ తిరగక్కర్లేదు. దగ్గిరే కనక, ఇంట్లో బయల్దేరిన పావుగంటలో సిద్ధి వినాయకుడి గుడి మీదుగా గ్లాక్సోలో ఉండొచ్చు. వీలుంటే తర్వాత ఎలాగో ఒకలాగ ఎం.ఎం.ఎస్. చేయొచ్చు, బాంద్రా కాలేజీలో సీటొస్తే. అలా మూడేళ్ళలో ఎం.ఎం.ఎస్. అయిపోతే వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు.

అనుకున్న తడవే పనులన్నీ చకచకా జరిగిపోయేయి. యూనియన్ కానీ, కంపెనీ కానీ పల్లెత్తు మాటనలేదు, దేనికీ అడ్డు చెప్పలేదు. ఇది జరిగిన పై వారానికి కోమలి గ్లాక్సో కంపెనీలో జూనియర్ కెమిస్టుగా జేరిపోయింది. మనీష్ శారదాశ్రమ్ అకాడెమీలో క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత సంవత్సరానికి కాలేజీలు తెరిచేలోపల కోమలి పుస్తకాలు దగ్గిరపెట్టుకుని ఎం.ఎం.ఎస్. ఎంట్రన్స్‌కి చదవడం మొదలుపెట్టింది.


ఎం.ఎం.ఎస్. డిగ్రీ చేతికొచ్చిన రోజున కోమలి మరో సంతోషమైన వార్త తీసుకొచ్చింది. కాంపస్ ఇంటర్వ్యూలో బోరింగర్ నాల్ కంపెనీవారు కోమలిని ప్లాంట్ మేనేజర్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ తాను ఒకప్పుడు పని చేసిన కంపెనీకి వెళ్ళొచ్చు. ఒకప్పుడు చిన్న క్లర్కుగా పనిచేసిన కంపెనీలో మేనేజర్‌గా వెళ్ళడం గొప్పే కదా?

కోమలి స్వీట్లు పట్టుకెళ్ళి గ్లాక్సో కంపెనీలో తన కొలీగ్స్‌కి చెప్పింది తాను ఎం.ఎం.ఎస్. పాసైన సంగతీ కొత్త ఉద్యోగం సంగతీను. అదే రోజు మధ్యాహ్నం కోమలిని మేనేజర్ పిలిచి చెప్పాడు, “మిమ్మల్ని గ్లాక్సో హెడ్ ఆఫీసులో ఉన్న హెచ్.ఆర్.ఎం. రమ్మన్నారు వెళ్ళిపోయే ముందు. రేపోసారి పొద్దున్నే నారిమన్ పాయింట్ వెళ్ళి కలవండి.”

“ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందాండి?”

“ఎందుకు పిలిచారో నాకు చెప్పలేదమ్మా. ఏమో, మీకిచ్చిన చదువు హామీ తీరిపోయింది కనక ఎక్కడైనా సంతకాలు పెట్టమనొచ్చేమో.”

మర్నాడు నారిమన్ పాయింట్ వెళ్ళి హెచ్.ఆర్.ఎం.ని కలిసాక ఆయన క్లుప్తంగా చెప్పేడు, “మీరు చేరిన దగ్గరినుండీ మీ పనితీరు గమనిస్తున్నాం. ఇప్పుడు మీరు ఎం.ఎం.ఎస్. కూడా పాస్ అయ్యారు. గ్లాక్సోలో ఉద్యోగం ఇస్తే ఉంటారా? లేకపోతే వేరే ఉద్యోగంలోకి మారతారా?”

“ఒక ఉద్యోగం వచ్చిందండి కాంపస్ ఇంటర్వ్యూలో. కానీ గ్లాక్సోలో ఇస్తానంటే తప్పకుండా ఆలోచిస్తాను.”

“జీతం మీకు ఆ ఉద్యోగంలో ఎంత ఇస్తారో దానికి గ్లాక్సో మేచ్ అయ్యే ఛాన్సు ఉంది కానీ…” ఏదో అనబోతూ ఆగి, ఫోన్ మోగడంతో అది తీసి చెప్పాడు, “… ఇప్పుడే వచ్చారండి, పంపించమంటారా? సరే, ఐతే.” అని ఫోన్ పెట్టేసి చెప్పాడు కోమలితో, “కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అక్కడికి దారి ప్యూన్ చూపిస్తాడు, వెళ్ళండి.”

కొంచెం గుండె తడబడుతూండగా, ప్యూన్ చూపించిన లాబీలో పావుగంట ఏం చేయాలో తెలీకుండా కూర్చున్నాక, రిసెప్షనిస్టు కాబోలు ఒకావిడ వచ్చి కోమలిని లోపలకి తీసుకెళ్ళింది. విశాలమైన ఆఫీస్‌లో ఒక పెద్ద డెస్క్ వెనకాల పనిచేసుకుంటున్న వైస్ ప్రెసిడెంట్ తల ఎత్తి చూసి హాయిగా నవ్వింది.

“హాయ్ కోమలీ, నన్ను గుర్తు పట్టావా?”