పెద్దన్నయ్య, ప్రపంచం

డెబ్భై ఎనిమిదేళ్ళ పెద్దన్నయ్య పెద్దకర్మ అయిన తర్వాత ఓ రోజు మధ్యాహ్నం భోజనాలై అందరూ వెళ్ళిపోవడానికి ముందు కూర్చుని కుటుంబ విషయాలు చెప్పుకుంటున్నాం. ఒక్కొక్కరు ఒక్కో విషయం చెప్తున్నారు పెద్దన్నయ్య గురించి. కొన్ని తెల్సినవీ, మరోసారి వింటున్నవే; కొన్ని అప్పుడే కొత్తగా తెలుసుకుంటున్నవి. పెద్దన్నయ్య పేరు అద్వైత బ్రహ్మం.

మేము మొత్తం ఎనిమిది మంది సంతానం మా నాన్నగారికి. మొదటివాడు పెద్దన్నయ్యే. రెండోవాడు చిన్నన్నయ్య పుట్టేసరికి పెద్దన్నయ్యకి ఐదేళ్ళు. ఆ తర్వాత వరసగా మేము ఆరుగురం పుట్టాం. ఐదుగురు ఆడపిల్లల తర్వాత చివరిగా నేను. పెద్దన్నయ్యకీ నాకూ దాదాపు ఇరవై ఏళ్ళ పైచిలుకు తేడా. చిన్న పిల్లలమైన మమ్మల్ని చూసుకోవడంలో అమ్మకి ఇంట్లో మిగతా ఏ విషయం పట్టించుకోవడానికి సమయం ఉండేది కాదు. నాన్నగారు ఎంత చెప్తే అంత. నేను పుట్టిన రెండేళ్ళకే మా నాయనగారికేదో సుస్తీ చేసిందిట. తాను పోయేలోపులే పెద్దన్నయ్యకి పెళ్ళిచేసేయాలని ఆరాటపడ్డారు. అప్పటికి పెద్దన్నయ్య డిగ్రీ పూర్తి చేసి ఊళ్ళోనే ఉన్న కోపరేటివ్ బేంక్‍లో ఉద్యోగం సంపాదించాడు. పది నుంచి, ఐదు దాకా ఉద్యోగం. ఆదివారాలు శెలవు. ఎంత చేసేద్దాం అనుకున్నా పెద్దన్నయ్యకి పెళ్ళి కుదర్లేదు. మరో ఐదేళ్ళు గడిచేసరికి చిన్నన్నయ్య పాలిటెక్నిక్ పాసై జూనియర్ ఇంజినీర్‍గా ఉద్యోగం సంపాదించాడు మా ఊర్లో కొత్తగా పెట్టిన మోటార్ కంపెనీలో. ఈ కంపెనీ కార్ల పాత మోటార్లు రిపేర్ చేసి కొత్తవిగా చేస్తారుట. చిన్నన్నయ్యకి మంచి భవిష్యత్తు ఉందని, జీతం పెద్దన్నయ్య జీతం కంటే ఎక్కువే అని అన్నారు. పొద్దున్నే ఏడింటికి కంపెనీలో ఉండాలి. ఒక్కోరోజు సాయంత్రం పొద్దుపోయేదాకా ఇంటికి రావడం కుదరదు కూడా. పెద్దన్నయ్య నిండు కుండలాంటి వాడు, తోబుట్టువులమైన మేమంటే ఎంత అభిమానమో; చిన్నన్నయ్యకి ఉద్యోగం వచ్చాక ఎక్కువ సంతోషపడ్డది పెద్దన్నయ్యే.

క్రమంగా నాన్నగారి ఆరోగ్యం బాగా పాడయ్యేసరికి పెద్దన్నయ్య పెళ్ళికి కంగారు ఎక్కువైంది. పెద్దన్నయ్యకి ముప్ఫై ఏళ్ళు రాబోతున్నాయి. మరో పెళ్ళి సంబంధం చూడ్డానికి బయల్దేరారు. అమ్మా, నాన్నగారు, పెద్దన్నయ్యా వెళ్ళాలని నిర్ణయం. పెళ్ళిచూపులకి ముగ్గురు వెళ్ళకూడదు కనక చిన్నవాడినైన నన్ను తీసుకెళ్దాం అని ఆలోచిస్తూంటే తానూ వస్తానని చిన్నన్నయ్య పట్టుబట్టాడు. నువ్వెందుకురా మధ్యలో అని నాన్నగారు గొడవపెడితే వాడు చెప్పాట్ట, “కాబోయే వదినని నేను చూడకపోతే ఎలా?” అని. అలా మేం ఐదుగురం, ఒక్కరోజుకి తెలుసున్న పక్క ఇంటావిడని అక్కలందరినీ చూసేలా ఉంచి పెళ్ళి చూపులకి బయల్దేరాం. పెద్దన్నయ్య ఏవో ప్రశ్నలు అడిగాడు కాబోయే పెళ్ళికూతుర్ని అయితే చిన్నన్నయ్య మాత్రం ఆవిడనే కళ్ళార్పకుండా చూస్తూ కూర్చున్నాడు. ఫలహారాలయ్యాక నన్ను పెళ్ళికూతురు లోపలకి రమ్మని పిలిచింది సరదాకి. “నీకు ఏ అన్నయ్య ఇష్టం, మేము పెట్టిన ఫలహారం బాగుందా? మీ ఇద్దరు అన్నలలో ఎవరు మంచి చలాకీగా, సరదాగా ఉంటారు, అక్కలు ఎంతమంది, ఏమి చేస్తున్నారు?” అంటూ ప్రశ్నలు వేసింది. అక్కడే ఉన్న బొమ్మల పుస్తకాల కేసి ఇష్టంగా చూస్తూంటే, తీసుకోమని నాకు ఇచ్చింది. కాసేపటికి అందరికీ చెప్పి బయల్దేరాం. బస్సు ఎక్కేదాకా ఎవరూ మాట్లాడలేదు. పక్క పక్క సీట్లలోనే కూర్చోడానికి చోటు దొరికింది.

“అమ్మాయి నచ్చిందిరా?” నాన్న అడిగాడు పెద్దన్నయ్యని బస్సు బయల్దేరి ఊరు దాటాక; అమ్మ పక్కనుంచి నవ్వు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూంటే. అమ్మాయి నచ్చడం అంటే ఏమిటో తెలిసే వయసు కాదు నాది, అందువల్ల నేను దిక్కులు చూస్తున్నాను. పెద్దన్నయ్య నోరు విప్పేలోపు చిన్నన్నయ్య చటుక్కున అన్నాడు, “నేను ఈ అమ్మాయిని తప్ప ఎవర్నీ చేసుకోను.”

“నోరు ముయ్యి వెధవా, పెళ్ళిచూపులు పెద్దన్నయ్యకా నీకా?” నాన్న అరుస్తుంటే మొహం ఎర్రబడడం తెలుస్తోంది. అమ్మ మొహంలో ఎప్పుడూ లేని హావభావాలు. ఏం జరిగిందో నాకైతే తెలియలేదు. మిగతా ప్రయాణం అంతా నిశ్శబ్దమే. పెద్దన్నయ్య ఏమనుకున్నాడో కానీ నోరు మెదపలేదు.


రాత్రి పొద్దుపోయాక ఇంటికొచ్చాం. పొద్దునే చిన్నన్నయ్య ఉద్యోగానికి వెళ్ళాక తాను బేంక్‍ కి వెళ్ళేముందు భోజనం చేస్తున్నప్పుడు పెద్దన్నయ్య చెప్పాట్ట అమ్మతో – ‘వాడికి అమ్మాయి బాగా నచ్చింది కనక వాడికే చేద్దాం పెళ్ళి నాకెలాగూ ఆలస్యం అవుతోంది కనక నాకు వద్దు’ అని. మూడు రోజులు రామరావణ యుద్ధం అయింది ఇంట్లో దీనిమీద. అయితే అరుపులూ కేకలూ లేకుండా ఇందులో ప్రశాంతంగా మాట్లాడింది పెద్దన్నయ్య ఒక్కడే – అదీ తనకి ఆ అమ్మాయిని చేసుకోవడం ‘అంత ఇష్టం లేదనీ,’ ఇష్టపడిన చిన్నన్నయ్యకే పెళ్ళి చేయమనీ చెప్తూ. ఈ లోపున మరో బాంబు పేలింది అటువైపునుండి. కాబోయే పెళ్ళికూతురికీ పెద్దన్నయ్యకీ దాదాపు ఎనిమిదేళ్ళు వయసు తేడా ఉందిట. అందువల్ల చిన్నన్నయ్యకి చేసుకుంటారా, అమ్మాయి కూడా చిన్నన్నయ్యనే ఇష్టపడిందీ అని కబురు చేశారు. మరో మూడు రోజుల యుద్ధం తర్వాత నాన్నగారు ఒప్పుకోవాల్సిన పరిస్థితి, అటు ఆరోగ్యదృష్ట్యా, ఇటు చిన్నన్నయ్య ఈవిడని తప్ప మరెవర్నీ చేసుకోనూ అనే మంకు పట్టు వల్లా. అమ్మకి ఏమాటా అనే స్వేచ్ఛ ఎప్పుడుంది కనక? అలా చిన్నన్నయ్య పెళ్ళైపోయింది. పెద్దన్నయ్య ఏదైనా బాధపడ్డాడా, మనసులో ఏముందీ అనేది ఎవరికీ తెలియలేదు. తాను చేసుకుందామనుకున్న అమ్మాయి తనకి మరదలుగా వస్తే ఇంట్లో పెద్దన్నయ్యకి ఎలా అనే విషయం కూడా ఎవరైనా ఆలోచించారో లేదో తెలియదు. పెద్దన్నయ్య మాత్రం వదినని మేమందరం పిలిచినట్టే వదినా అని పిలిచేవాడు.

చిన్నన్నయ్య పెళ్ళైన రెండేళ్ళకి మా ఇంట్లో మూడు చావులు సంభవించాయి. ఆరోగ్యం పాడైన నాన్నగారు మూడు నెలల్లో పోయారు. ఆ పైన ఏడాదికి అమ్మ పోయింది. నాన్నగారికైతే ఏదో అనారోగ్యం. కానీ అమ్మ ఏనాడు చీదినట్టైనా మేము ఎరగం. అటువంటి అమ్మ ఓ రోజు పొద్దున్నే పూజగదిలో దీపం వెలిగించి అలాగే ఒరిగిపోయింది. పెద్దవాళ్ళిద్దరూ పోయేసరికి పెద్దన్నయ్యే మమ్మల్ని తల్లీ తండ్రీలాగ ఆదుకున్నాడు. ఆఖరి చావు మరీ విచిత్రం. ఓ రోజు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళిన చిన్నన్నయ్యకి మోటార్ కంపెనీలో ఏదో ఏక్సిడెంట్ జరిగిందిట. మొత్తం ఫ్యాక్టరీ అంటుకుపోయి సర్వనాశనం జరిగింది. చిన్నన్నయ్య సజీవదహనం అయిపోయాడు. ఆఖరికి శ్మశానానికి తీసుకెళ్ళడానిక్కానీ, అపరకర్మలు చేయడానిక్కానీ ఏమీ మిగలలేదు. ఈ సారి అందరికన్నా ఎక్కువ బాధపడింది పెద్దన్నయ్యే. చిన్నయ్యకి ఆరునెలల క్రితమే పుట్టిన కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మా అందరి దగ్గిరా ఉండి తాను ఉన్నానంటూ ఓదార్చినది పెద్దన్నయ్యే. ఈ మూడు చావుల్లోనూ పెద్దన్నయ్య తన పని తాను యాంత్రికంగా చేసుకుంటూ పోయాడు తప్ప ఏదైనా బాధపడితే మాకు తెలియనివ్వలేదు. మొహంలో ఎప్పుడూ ఒక్క కన్నీటి చుక్క చూడలేదు మేము.

చిన్నన్నయ్య పోయిన పదో రోజున వదిన నాన్నగారు అంటే చిన్నన్నయ్య మామగారు అంతులేని దుఃఖంతో పెద్దన్నయ్యతో అనడం నాకు గుర్తే. “ఈ అమ్మాయికి పెళ్ళిచేసి సుఖపడదామనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా అవుతుందని తెలియలేదు. మీకు పెళ్ళి చూపుల్లో చేసిన దుర్మార్గానికి ఇప్పుడు దేవుడు నాకిలా చేశాడు కాబోలు. ఇప్పుడు నా కూతుర్నీ మనవణ్ణీ తీసుకెళ్ళి పోషించే తాహతూ డబ్బులూ లేవు. ఏమి చేయాలో తెలియకుండా ఉంది.”

“అదేమిటండి అలా అంటారు. వదిన మా ఇంట్లో మనిషి కాదా, మీరెందుకూ తీసుకెళ్ళడం? మేము లేమూ?” పెద్దన్నయ్య చెప్పిన సమాధానం విని వదినా, ఆవిడ నాన్నగారు కళ్ళు ఇంతింత చేసుకుని పెద్దన్నయ్య కేసి చూడ్డం మేము మర్చిపోలేము. ఆయన కుదుటపడ్డ మనసుతో వెళ్ళాక మా జీవితం ఓ గాడిలో పడినట్టు చెప్పుకోవాల్సిందే.


పొద్దున్నే లేచాక వదిన ఇచ్చిన కాఫీ మాలో ఎవరో ఒకరు పట్టుకెళ్ళి పెద్దన్నయ్యకి ఇచ్చేవారం. గంట తొమ్మిదౌతుంటే వంటింట్లోకి వెళ్ళేవాడు భోజనానికి. వదిన వడ్డిస్తే మాతోపాటు తిని ఆఫీసుకి నడిచి వెళ్ళేవాడు. భోజనం చేస్తున్నప్పుడు ఇది బావుంది, అది బాగోలేదు అనడం కానీ మరో కొంచెం కావాలి అనేది కానీ ఎప్పుడూ వినలేదు మేము. కూరో నారో లేనప్పుడు ఆవకాయో చారో పెట్టినా మాట్లాడకుండా తిని వెళ్ళడమే మాకు తెలుసు. అలా ఆఫీసుకి వెళ్ళినవాడు మళ్ళీ సాయంత్రం అయిదూ ఆరు అవుతూంటే వచ్చేవాడు దారిలో బజారుకెళ్ళి కూరలో, సరుకులో కొని తెస్తూ. ఏదైనా కావాలిస్తే వదిన కాయితం మీద రాసిపెట్టి ఉంచేది. భోజనం సమయంలోనో సాయత్రమో ఇచ్చేది అన్నయ్యకి. అది వెంఠనే ఆరోజో మర్నాడో పట్టుకొచ్చి ఇచ్చేవాడు.

చిన్నన్నయ్య పోయాక మోటార్ కంపెనీ ఇచ్చిన డబ్బులు వదిన పేరుమీద బేంక్‌లో పెట్టాడుట. మమ్మల్ని చదివించడానికి ఫీజులూ అవి పెద్దన్నయ్య తన జీతంలోంచే కట్టాడు. చిన్నన్నయ్య పోయాక పెద్దన్నయ్య పెళ్ళిచూపుల్లో చూసిన వదినతో అసభ్యంగా ప్రవర్తిస్తాడనీ ఆవిణ్ణే పెళ్ళి చేసుకుని ఇంకా పిల్లలని కంటాడనీ ఏవేవో అన్నారు చుట్టుపక్కలవాళ్ళు. ఎవరేమన్నా పెద్దన్నయ్య నోరు మెదపలేదు. ఏనాడూ వదినతో పెద్దగా మాట్లాడిందీ, అసభ్యంగా ప్రవర్తించినదీ లేదు; వదిన ఏదైనా చెప్తే విని అతి తక్కువలో క్లుప్తంగా సమాధానం చెప్పేవాడు. అవి ఇలా ఉండేవి:

“మీ రెండో చెల్లెలు మాధవి పెద్ద మనిషైంది, శుభకార్యానికి పురోహితుణ్ణి పిల్చి పేరంటం చేయాలి.”

“సరే చేద్దాం వదినా, నువ్వు అందర్నీ పిలిచి చేయించు. ఏమి కావాలో రాసి ఇస్తే నేను కొని పట్టుకొస్తా.”

శుభకార్యం జరిగే రోజు తాను ఆఫీసుకి శలవు పెట్టి అన్నీ సరిగ్గా జరిగేటట్టూ చూసేవాడు. వాగే నోర్లు పెద్దన్నయ్య రోజూ ప్రవర్తించే తీరు చూసి అవే మూసుకున్నాయి కొన్నాళ్ళకి. ఎవరేమన్నా కానీ పెద్దన్నయ్య వాళ్ళని తిరిగి ఏమీ అన్నట్టు, వాళ్ళతో దెబ్బలాడినట్టూ దాఖలా లేదు. ఎప్పుడైనా వదిన నాన్నగారు వచ్చి పలకరించేవారు కూతురి సంసారం ఎలా సాగుతోందో చూడ్డానికన్నట్టు. ఆయనతోనూ క్లుప్తంగా మాట్లాడేవాడు. విచిత్రంగా, ఏ రోజు పెద్దన్నయ్య వదిన పెళ్ళిచూపులకి వెళ్ళాడో ఆ రోజునుంచి మరోసారి ఎవరూ పెద్దన్నయ్య పెళ్ళి సంగతి ఎత్తలేదు. కాలం అలా తొందరగా గడిచిపోయిందా?

సాయంత్రం ఇంటికొచ్చాక మా ఆటలు అవీ అయ్యేసరికి తన గదిలోకి పిల్చేవాడు, స్కూల్లో ఎలా ఉందో, హోమ్‌వర్క్ ఏదైనా ఉంటే చేశామో లేదో కనుక్కోవడానికీ, మాకు ఏదైనా సహాయం కావలిస్తే చేయడానికీ. అప్పుడే పెన్నులు ఎవరికి కావాలి, ఫీజులు ఎప్పుడు కట్టాలి, పుస్తకాలు ఏవేవి కొనాలి అనేవి తెలిసేది. పెద్దన్నయ్య అంటే మాకు భయం లేదు కానీ అదో రకం గౌరవం. ఏదైనా తప్పు చేసినా పెద్దన్నయ్య ముందు అబద్ధం చెప్పలేకపోయేవాళ్ళం. మాలో ఎవరైనా చేసిన తప్పు చెప్పినప్పుడు ఎందుకు అలా చేయకూడదో, అలా చేస్తే ముందు ముందు ఏం జరుగుతుందో వివరించి చెప్పేవాడు. ఎప్పుడు ఎవరినీ కసురుకోవడం కానీ కొట్టడం కానీ లేదు. మొహం గంభీరంగా ఉండేది. మనిషి ఊదితే ఎగిరిపోతాడన్నట్టు సన్నగా, రివటలా ఉండేవాడు. బేంక్‌లో పనిచేస్తాడని తప్ప ఏం పనిచేస్తాడో కూడా చాలాకాలం మాకు తెలియదు.

ఎప్పుడైనా బేంక్ ఉద్యోగస్తులు ఇంటికొచ్చి ‘అద్వైతంగారు ఉన్నారాండీ’ అని అడిగేవారు పెద్దన్నయ్య గురించి. వాళ్ళని తన గదిలోకి తీసుకెళ్ళేవాడు. తన గది అంటే పెద్దగా వేరే రూమూ అదీ ఏమీ లేదు. రెండు బీరువాలు అడ్డంగా పెట్టి రెండు కుర్చీలు ఒక బల్ల, మరో బెంచీలతో ఉన్నంతలో కొంత వేరేగా ఉండేది. అక్కడ ఏమి మాట్లాడినా బయటకి ప్రస్ఫుటంగా వినిపించేది కూడా. వచ్చిన స్నేహితులకి కాఫీ, టీ ఇవ్వమని గానీ, ఫలహారం ఏదైనా చేయమని గానీ ఏనాడూ వదినని అడగలేదు. మంచినీళ్ళైనా వచ్చినవారు అడిగితే ఇచ్చేవారం అంతే. అప్పుడప్పుడూ ఎవరో బేంక్ నుంచి వచ్చి ఏవో కబుర్లు చెప్తూ ఉండేవారు. అందులో పెద్దన్నయ్య వినడమే కానీ ఏనాడూ ఎక్కువగా మాట్లాడినట్టు మేము వినలేదు. ఎవరైనా డబ్బులు అప్పు అడిగితే ఇవ్వగలిగితే ఇచ్చేవాడు. లేకపోతే లేవు అని ఏమీ మొహమాటం లేకుండా చెప్పేవాడు. తన రూములో ఏవైనా పుస్తకాలు చదువుతాడా అంటే అదీ పెద్దగా లేదు. కళ్ళు మూసుకుని కూర్చునేవాడు లేదా బయటకి ఎక్కడికో తాను ఒక్కడూ నడవడానికి వెళ్ళడం. శెలవు రోజులూ, ఆదివారాలు సాయంత్రం ఇంట్లోంచి బయటకి వెళ్ళేవాడు నడవడానికి ఊరి బయటకో, స్కూల్ వేపో మరోచోటకో. ఆ మరోచోటు అమ్మా నాన్నలని దహనం చేసిన మరు చోటు అని మాకు చాలాకాలం తెలియదు కూడా.


తాను సినిమాలు అవీ చూసేవాడు కాదు. మేము ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకుని అడిగితే వచ్చి మమ్మల్ని హాల్ దగ్గిర దింపి వెళ్ళేవాడు. సినిమా అయ్యాక వచ్చి తీసుకెళ్ళేవాడు ఇంటికి. కొంచెం పెద్దయ్యాక స్నేహితులతో వెళ్తామంటే డబ్బులిచ్చేవాడు వెళ్ళడానికి. ఇంట్లోకి టివి కొనిపెట్టాడు కానీ తానెప్పుడూ కూర్చుని చూడలేదు. తన గదిలో కూర్చుని కాయితం మీద ఏవో లెక్కలు రాసుకునేవాడు. అవి తర్వాత ఇంటిఖర్చు లెక్కలని మాకు తెల్సింది. టివిలో ఏదైనా మంచి సినిమా లేదా క్రికెట్ మాచ్ వస్తే పిలిచేవాళ్ళం పెద్దన్నయ్యని వచ్చి చూడమని. ‘నాకు అంత ఇష్టం లేదు, మీరు చూడండ్రా అనో లేదా మీరూ వదినా కలిసి చూడండమ్మా’ అనేవాడు తప్ప వచ్చి చూసేవాడు కాదు. ఆ చెప్పడం కూడా చిరునవ్వుతో చెప్పేవాడు సమాధానం. అది విన్నాక ఇంక పెద్దన్నయ్యని బలవంతం చేయడానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. కొన్నాళ్ళిలా అయ్యాక మేము అడగడం మానేశాం. మేము సినిమాలకి వెళ్ళి డబ్బులు వృధా చేస్తున్నామని కానీ టివి చూస్తూ సమయం పాడుచేసుకుంటున్నామని కానీ ఏనాడూ మామీద విసుక్కోలేదు. మేము స్కూల్లో బాగా చదువుతున్నంతవరకూ ఏమీ అనేవాడు కాదు. మేము అంత తెలివైనవాళ్ళం కాదు కానీ, అదృష్టం కొద్దీ అందరం ఎక్కడా ఫెయిల్ అవకుండా బయటపడ్డాం.

మాకు పండగకి బట్టలు కొన్నట్టే తనకీ కొనుక్కునేవాడు. కిరాణా కొట్లో కానీ బట్టల కొట్లో కానీ ఏదీ అప్పు మీద కొనేవాడు కాదు. ఉన్నంతలో ‘ఇవీ మన దగ్గిన ఉన్న డబ్బులు అందువల్ల వీటితో ఏవి వస్తే అవి తీసుకుందాం’ అంటూ అలవాటు చేశాడు. ఏ పండగపూటో, శివరాత్రినాడో గుడికి రమ్మంటే వచ్చేవాడు. తలమీద శఠగోపం పెట్టించుకున్నాక అక్కడ తెల్సున్న పూజారితో ఏదో చెప్పేవాడు అదీ రెండూ మూడు ముక్కలతో. మా ఇంట్లో జరిగే తతంగం పూజార్లకి తెలుసు కాబట్టి వాళ్ళూ పెద్దన్నయ్య గురించీ ఏమీ అడిగేవారు కాదు. మహా అయితే ‘వచ్చే నెలలో ఇలా ఓ శుభకార్యం; వీలు చూసుకుని రండి మాట్లాడదాం’ అని పిలిచేవాడు. ఏవిటీ మనిషికి ఒక మంచీ లేదు, ఒక సంతోషం లేదు అనేవారు ఒక్కొక్కప్పుడు తెలిసున్నవాళ్ళు. క్రమంగా వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు.

చదువులు పూర్తయ్యాక పెద్దక్క స్టేట్ బేంక్‌లో, ఇద్దరు అక్కలు స్కూల్లో టీచర్లుగా, ఉద్యోగం సంపాదించగలిగారు. పెద్దక్క ఉద్యోగం వచ్చాక కొంత డబ్బు సహాయం చేసేది. డబ్బులు ఇస్తే తీసుకునేవాడు కానీ ఎప్పుడూ నెలాఖరుకి ఇస్తావా అనీ, ఇయ్యి అని కానీ అడగలేదు పెద్దక్కని. అక్కలందరికీ చేతనైనంతలో పెళ్ళిళ్ళు చేశాడు; కట్నం విషయంలో తన దగ్గిర డబ్బు లేదు కట్నం ఇవ్వడానికి, ఇచ్చే తాహతు లేదని నిక్కచ్చిగా చెప్పేవాడు. ఆఖరి ఇద్దరి అక్కలకీ ఉద్యోగం రాలేదు కనక కొంచెం కష్టం అయింది పెళ్ళికి; అయినా ఏమీ అధైర్యపడకుండా సంబంధాలు వెదికి పెళ్ళిళ్ళు చేయగలిగాడు. అక్కలందరికీ పెళ్ళిళ్ళైపోయాక ఇంక నెల నెలా తనకి డబ్బులు ఏమీ ఇవ్వవద్దని, తన కుటుంబంకోసం ఉంచుకోమనీ పెద్దక్కతో చెప్పాడు పెద్దన్నయ్య. రెండెడ్ల బండి మరోసారి వంటెద్దు బండి అయింది. ఈ లోపుల పెద్దన్నయ్య బేంక్ మేనేజర్ అయ్యాడు కూడా. ఇంటికి ఫోన్ వచ్చింది. అలాగే మిగతా ఎయిర్ కండిషన్ లాంటి అవసరాలు కూడా. రెండు మూడు సంవత్సరాలలో రిటైర్‌మెంట్ కాసుకుని ఉంది. పెద్దవాడౌతూంటే డయాబెటిస్, బ్లడ్ ప్రెషరూ కూడా తరుముకు వచ్చాయి. మందులు వాడడం మొదలైంది.


తన జీవితంలో ఒకే ఒకసారి పెద్దన్నయ్య తిరుపతి వెళ్ళాడు. అదైనా రెండో అక్క పెళ్ళి తర్వాత అందరితో పాటు. ఆ జనం, గోలా, దీర్ఘమైన ప్రయాణం అవీ తనకి నచ్చలేదని చెప్పాడు వెనక్కి వచ్చాక. ఎప్పుడైనా వెళ్ళే మా ఊరి గుడిలోనే సంతోషంగా ఉంటుందిట. పెద్దక్క అత్తవారివైపు ఇంటికిగానీ మిగతా అక్కలని చూడడానిక్కానీ ఎప్పుడూ వాళ్ళింటికి పిలిచినా వెళ్ళలేదు. మాకు వెళ్ళాలని ఉంది అంటే మమ్మల్ని, వదినతో పాటు వెళ్ళమనేవాడు డబ్బులు ఇచ్చి. వాళ్ళు వస్తే సంతోషంగా ఉండేవాడు తనని చూడడానికి వచ్చినందుకు.

ఇంక నేనూ చిన్నన్నయ్య కొడుకూ మిగిలాం. చిన్నన్నయ్య కొడుకు మహా తెలివైనవాడు. ఇంజినీరింగ్‌లో చేరి ఆఖరి సంవత్సరంలో అమెరికన్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. అప్పటికి నేను బిఎస్సీలో ఉన్నాను. అమెరికా వెళ్తాను అనేసరికి పెద్దన్నయ్య వాణ్ణి కూర్చోబెట్టి చెప్పాడు అసలు విషయం. “మీ నాన్న పోయినప్పుడు కంపెనీ వారిచ్చిన డబ్బులు బేంక్‌లో ఉన్నాయి డిపాజిట్‌లో. అవి నీవే. అయితే అమెరికా వెళ్ళడానికి ఎంతవరకూ పనికొస్తాయో నాకు పెద్ద తెలీదు. నీకు అక్కడ డబ్బులు ఇస్తే సరే లేకపోతే నేను ఈ మాట చెప్పితీరాలి, నీకు పంపడానికీ నా దగ్గిర చిల్లిగవ్వ లేదు అనేది నీకు తెల్సిన విషయమే. ఇప్పటివరకూ అప్పు అనేది లేకుండా నెట్టుకొచ్చాను. నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేయి. వదినని కూడా అడిగి చూడు.”

“నాకు గారంటీగా ఏదో ఒక స్కాలర్షిప్ ఇస్తామని అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నారు, అందువల్ల ప్లేన్ టికెట్ పెట్టుకుంటే చాలు పెదనాన్నా, అమ్మని కూడా అడిగాను. నాన్నకి కంపెనీ వారిచ్చిన డబ్బులలోంచి తీసుకుంటాను; అమ్మ సరేనంది” చిన్నన్నయ్య కొడుకు చెప్పాడు. అలా చిన్నన్నయ్య కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు. వాడు విమానం ఎక్కడానికి వెళ్తూంటే వదినని బాంబేదాకా పంపించాడు నాతో పాటు. వాడు అమెరికానుంచి ఫోటోలు పంపితే సంతోషంగా చూసేవాడు అవన్నీ. డబ్బులతో జాగ్రత్తగా ఉండమని, అమెరికా వెళ్ళినది చదువుకోసం కనక కష్టపడి చదువుకోమనీ ప్రతీసారీ చెప్పేవాడు ఫోను మీద మాట్లాడినప్పుడల్లా.

చిన్నన్నయ్య కొడుకు అమెరికా నుంచి నాతో అప్పుడప్పుడూ చెప్తూనే ఉన్నాడు; బిఎస్సీ తర్వాత ఎమ్మెస్సీ చేయమనీ అమెరికా రావడానికి తాను సహాయం చేస్తాననీ. అందరికీ అన్నీ కుదురుతాయా అనుకున్నట్టు? నాకు ఎమ్మెస్సీలో సీటు రాలేదు; ఈ లోపుల ఖాళీగా ఇంట్లో కూర్చోడం ఎందుకని ఒక ప్రైవేట్ కంపెనీలో గుమాస్తాగా చేరాను. పెద్దన్నయ్య రిటైర్ అయిపోయాడు. నాకు మరో సంవత్సరానికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో డిప్లొమా వచ్చింది పార్ట్-టైమ్‌గా చదివితే. దానితో చిన్న ఉద్యోగం హైదరాబాదులో. ఇంక ఇంట్లో మిగిలినది పెద్దన్నయ్యా వదినా. సరిగ్గా ఇదే సమయానికి టీచర్‌గా పనిచేసే మూడో అక్కయ్యకి మా ఊరుకే ట్రాన్ఫర్ అయింది. దాంతో నాకు తోడుగా హైద్రాబాదు వెళ్ళమని పెద్దన్నయ్య వదినతో చెప్పాడు.

“ఖాళీ ఇంట్లో మీరొక్కరూ ఎలా ఉంటారు, వంటా అదీ ఎలా?” వదిన అడిగింది.

“ఖాళీ ఏమిటి వదినా, నేను ఉంటానుగా, అదీగాక చెల్లెలికి ఇక్కడికే ట్రాన్ఫర్ అవుతోంది. దానికి వేరే ఇల్లూ అదీ అనవసరం. ఇక్కడే ఉండమని చెబుతాను.” పెద్దన్నయ్య చెప్పాడు.

మరోసారి కొంత తర్జన భర్జనలు. ఎప్పటిలాగానే అందరి అన్ని సందేహాలనీ తన చిరునవ్వుతో తీర్చగలిగేడు. ఇదే మా దగ్గిరున్న వీక్‌నెస్. ‘మా దగ్గిర ఉన్న’ అనడం కంటే ‘పెద్దన్నయ్య మాకు నేర్పిన’ అనాలేమో. ఎందుకంటే చిరునవ్వుతో తాను చెప్పినట్టు చేస్తే ఎందుకు అందరికీ మంచిదో చెప్పే విధం చూశాక ఇంక మేము ఏమీ మాట్లాడలేకపోయేవాళ్ళం. అలా నేనూ వదిన హైద్రాబాదు వచ్చాం. జీవితం గడిచిపోతోంది. పెద్దన్నయ్య, అక్కా కలిసి ఉన్నారు మా ఊర్లో ఇంట్లో. అక్క తన ఇద్దరి పిల్లలతో రెండేళ్ళు అక్కడే ఉంది బావ ఉండే ఊరికి ట్రాన్స్‌ఫర్‌కు ప్రయత్నం చేస్తూ.

ఈలోపల చిన్నన్నయ్య కొడుకు అమెరికానుంచి వెనక్కి వచ్చేశాడు. అక్కడ వాడికి ఏదో మంచి ఐడియా వచ్చిందిట. తన స్నేహితులతో కల్సి ఒక కంపెనీ పెట్టడానికి బెంగుళూర్ వెళ్ళాడు. అది ఓ కొలిక్కి వచ్చేసరికి ఏడాది పట్టింది. అప్పుడు పెద్దన్నయ్య వాణ్ణి కూర్చోబెట్టి చెప్పాడు ఏం చేస్తే మంచిదో. వాడు బెంగళూర్‌లో ఉండే మాట అయితే వదినని కూడా తీసుకెళ్ళితీరాలి. ఏనాటికైనా తల్లికి స్వంత కొడుకు దగ్గిర ఉండడమే ఉత్తమం కదా? చిన్నన్నయ్య కొడుకు పెద్దన్నయ్యని కూడా బెంగళూర్ రమ్మన్నాడు తన దగ్గిర ఉండడానికి. ఎప్పటిలాగానే చిరునవ్వు, “నాకెందుకురా, మీరూ వదినా వెళ్ళండి” అనడం మేము ఇంక మాట్లాడలేకపోవడం. ఇదే కదా తంతు చిన్నప్పట్నుండీ? చిన్నన్నయ్య కొడుకు పెట్టిన కంపెనీలో నాకో ఉద్యోగం ఇచ్చారు. అలా నేను కూడా బెంగళూర్‌లో తేలాను వదినతో పాటు. చిన్నన్నయ్య ఖాతాలో మిగిలిన డబ్బులన్నీ వదిన పేరిట ఇచ్చేసి పెద్దన్నయ్య ఊపిరి పీల్చుకున్నాడు.

చిన్నక్క, బావ ఉండే ఊరికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వెళ్ళిపోయేసరికి పెద్దన్నయకి డెబ్భై రెండేళ్ళు వచ్చాయి. మా ఊర్లోనే అదే ఇంట్లో ఉన్నాడు. మేము ఫోన్ చేస్తే మాట్లాడతాడు. చెప్పేది వినడమే గానీ ఇలా చేయండి అలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడూ అనడం వినలేదు. పెద్దవాళ్ళం అయ్యాం కదా మా మటుక్కి మేము జీవితాల్లో స్థిరపడాలి అనుకున్నాడేమో. చాలాసార్లు బెంగళూర్ రమ్మనీ, మైసూర్ అదీ చూసివెళ్ళమనీ అడిగాము కానీ తనకి ఈ వయసులో ఓపికలేదని చెప్పేవాడు. పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. ఇల్లు ఉంది; మగవాడైన వంట మనిషిని కుదిర్చాం. ఆయన వచ్చి వంటచేసి ఏవో కబుర్లు చెప్పి వెళ్తాడు. న్యూస్ పేపర్ వస్తుంది చదువుతాడేమో. టివి ఉన్నా ఎప్పుడూ అంత పెద్దగా చూసింది లేదు. వీలున్నప్పుడు ఓపిక ఉంటే నడుస్తాడు ఊర్లో. డబ్బుల విషయంలో, తన కాళ్ళమీద నడుస్తూ ఎవరిమీదా ఆధారపడకుండా ఉన్నాడు. ఈ వయసులో తనకి అది చాలు అంటూ ఉండేవాడు. తనకి తోటి దగ్గిర స్నేహితులంటూ పెద్దగాలేరు ఎప్పుడూను. తనతో బేంక్‌లో పనిచేసేవారితో గౌరవంగా ఉన్నా అతి స్నేహం అంటూ ఎప్పుడూ లేదు. వాళ్ళు ఎక్కడికైనా కాశీ, గయ, త్రివేణీ సంగమం అంటూ తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు పెద్దన్నయ్యని పిల్చారుట ఒకట్రెండు సార్లు కానీ తనకి ఈ వయసులో ఓపిక లేదని తప్పించుకున్నాడు.

డెబ్బై ఎనిమిదేళ్ళు గడిచాక ఒకరోజు హఠాత్తుగా నిద్రలోనే పోయాడు. వంటాయన వచ్చినపుడు ఎవరూ తలుపు తీయకపోతే ఆయన పక్కవారితో చెప్పాట్ట. అందరూ తలుపులు తోసుకుని లోపలకి వెళ్ళేసరికే ప్రాణం పోయి ఉంది. అందరం వచ్చాం చూడ్డానికి. అనాయాసంగా పోయినందుకు అందరికీ సంతోషం. చితిమీద ఎవరు తలకొరివి పెట్టాలనేచోట ఏమీ అర్థంగాని పరిస్థితి. పిల్లలూ భార్యాలేరు కనక నన్ను పెట్టమన్నారు. చిన్నన్నయ్య కొడుకు కూడా పెట్టొచ్చుట. కానీ వాడు బెంగళూర్ నుంచి రావడానికి మూడు రోజులదాకా కుదరదుట. అలా నేనే తలకొరివి పెట్టాను. పెద్దన్నయ్య మాకు తల్లీ తండ్రీ కాదు, అత్యంత దగ్గిరమైన బంధువే కానీ మాకూ పెద్దన్నయ్యకీ మధ్య కొంచెం దూరం ఉండేలాగ చిన్నప్పటునుంచీ పెరిగాం. దీనిక్కారణం పెద్దన్నయ్యే. మాకు ఎంత సహాయం చేసినా మిగతా విషయాల్లో కొంచెం దూరదూరంగానే ఉండేవారం.


చిన్నపిల్లలుగా మాకు ఎవరూ లేనప్పుడు పెద్దన్నయ్యని మేము మా స్వార్థానికి వాడుకున్నామా? లేకపోతే పెద్దన్నయ్యే తనని మా స్వార్థానికి వాడుకోమని స్వాత్రంత్రం ఇచ్చాడా అనేది ఈ నాటికీ మేము చెప్పలేం. అన్నింటికన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే ఒక్కసారి చిన్నన్నయ్య పోగానే పెద్దన్నయ్య జీవితం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకపోయింది. వదిన కూడా ఒక్కసారి, ‘మీరు పెళ్ళి చేసుకోండి మరో అమ్మాయిని చూసి’ అనలేకపోయింది. మరొకావిడ ఇంట్లోకి వస్తే తన జీవితం అస్తవ్యస్తం అవుతుందనుకుందేమో? అలాగే వదిన తల్లీ తండ్రీ ఏమీ అడగలేదు. వదిన ఇంట్లో లేకపోతే పెద్దన్నయ్య తానొక్కడూ మిగతా పిల్లలని చూసుకోలేననుకుని ‘వదిన మా ఇంట్లో మనిషే కదా?’ అని ఏడుస్తున్న వదిన నాన్నగారితో అన్నాడేమో. లేదా చిన్నన్నయ్య పోయాక వదినా పెద్దన్నయ్యా కలిసికట్టుగా ఏమి ఆలోచించుకున్నారో దేవుడికెరుక. మా కష్టాలలో మేము ఉన్నప్పుడు పెద్దన్నయ్యకు కూడా జీవితంలో ఎవరో తోడు ఉండాలని గాని, పెళ్ళి చేసుకుంటాడేమో అనే ఆలోచించే తీరికా కోరికా ఓపికా మాకెవరికీ లేవు. మా స్వార్థం మేము చూసుకున్నామని చెప్పుకోవాల్సిందే.

ఒకసారి వెనక్కి చూసుకుంటే పెద్దన్నయ్య లేకపోతే మేము ఏమై ఉండేవారం? చిన్నన్నయ్య బతికి ఉండీ, పెద్దన్నయ్య మరో పెళ్ళి చేసుకుంటే ఏమై ఉండేది? వదినలిద్దరూ దెబ్బలాడుకుని ఇంట్లో వేరువేరు కాపురాలు పెట్టేవారా? మిగతా చిన్నపిల్లలని ఎవరు చూసుండేవారు? అన్నింటికన్నా వింతల్లో వింత, పెద్దన్నయ్య పెళ్ళిచూపుల్లో చిన్నన్నయ్యకి వదిన నచ్చడం ఏమిటి? పోనీ నచ్చినా ‘సరే వాడికే పెళ్ళిచేయండి’ అని పెద్దన్నయ్య ఏ అసూయా లేకుండా ఎలా అనగలిగాడు? అన్నాడు సరే, తాను పెళ్ళి చూపుల్లో చూసిన అమ్మాయి తన మరదలిగా ఇంట్లోకి వస్తే జీవితాంతం ఎలా ఓర్చుకున్నాడు? పెళ్ళైన రెండేళ్ళలో చిన్నన్నయ్యా, అమ్మా, నాన్న పోయాక పెద్దన్నయ్యకి ఈ పెద్ద సంసారం తన ఒక్కడి జీతంతో వంటరిగా ఈదే ధైర్యం ఎక్కణ్ణుంచి వచ్చింది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.

పెద్దన్నయ్య స్థితప్రజ్ఞుడూ, కర్మయోగీ కాదు కానీ తన మనసులోది ఏదైనా ‘పెదవి దాటితే పృధివి దాటుతుందని’ అనుకున్నాడేమో, నిండుకుండలాగానే ఉన్నాడు జీవితాంతం. జీవితంలో ఏవైనా రహస్యాలు మనసులో దాచుకున్నా వాటిని తనతోపాటు తన చితిమీదకే తీసుకెళ్ళాడు. ఏదైనా క్షోభ అనుభవించినా, సంతోషం కలిగినా మొహంలో కానీ నోటితో కానీ ఏమీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. తన దగ్గిర ఉన్న చిరునవ్వే పెద్దన్నయ్య అతి పెద్ద ఆయుధం. జాగ్రత్తగా మమ్మల్ని పక్షి పిల్లల్ని పెంచినట్టూ పెంచాడు. పిల్లలు పెద్దై గూటిలోంచి ఎగిరాక, తల్లి పక్షిలాగే ఏమీ చింత లేకుండా ఉన్నాడు. తన గురించి మేమెవరమూ పట్టించుకోలేదనీ సహాయం చేయలేదనీ అనుకోలేదు. పెద్దక్క సహాయం చేసినన్నాళ్ళూ వద్దనలేదు. కనీసం రిటైరైపోయాక, తన భాధ్యతలు తీరిపోయాక్కూడా ఓ తీర్థయాత్రకో మరోచోటకో వెళ్ళాలని అనుకోలేదు. మేము తీసుకెళ్తామని చెప్పినా నాకు వయసైపోయింది ఓపిక లేదు అని తప్పించుకున్నాడు తప్ప ఏదీ ఒప్పుకోలేదు. అలా అని తన చుట్టూ ఒక గిరి గీసుకుని, నన్ను ముట్టుకోకు మాలకాకీ అంటూ కూర్చోనూ లేదు. మాకు అంత చేసినా పెద్దన్నయ్యకి కనీసం ఉపనయనం కూడా అవనందుకు, మేము తనకేమీ బాకీ లేదని చెప్పడానికా అన్నట్టూ, పురోహితుడు చెప్పిన ప్రకారం ఏడాదికోసారి తద్దినం కూడా పెట్టక్కర్లేదుట. చావులో కూడా మా దగ్గిర్నుంచి ఏమీ ఆశించకుండా వెళ్ళిపోయాడు. పెద్దన్నయ్యకి ఇవ్వడమే చేతనౌను.

పెద్దన్నయ్య బతికినది అతి సాధారణమైన జీవితం; కనీసం తన సంతోషం కోసమైనా పుట్టలేదు. పెద్దన్నయ్య మా ఊరు దాటి ప్రపంచంలో ఏదీ చూడలేదు; మేమే ఆయన మొత్తం ప్రపంచం. అయితే పెద్దన్నయ్య మమ్మల్ని తన భుజాలమీద సంతోషంగా ఎక్కించుకుని మోయకపోతే మాకు అసలు సిసలు ప్రపంచం చూసే అవకాశం కలిగి ఉండేది కాదు.