యుగాల క్రితం లోకాలలో ఆకలి అరుపులు
రాబోయే యుద్ధ మేఘాలకి భయపడి
దాక్కున్న వీరుడికి కావాల్సిన స్తంభం, సందర్భం
వీలు చూసుకోవడానికి సమయం పట్టదూ?
సుఖానికి ముందు కష్టాలు తప్పవు
హిరణ్యకశిపులూ, ఏడిచే జనాలూ ఉండాల్సిందే
మార్పుదేవుంది, అదే వచ్చి తీరుతుంది
అమావాస్య తర్వాత పౌర్ణమేగా!
దుముకుతూ వచ్చేది మహాభూతమైనా
ద్విపదార్థ కాలంబు కాలాత్ముడై
లోకములనాచోటున్ విభుండెవ్వడో
భూతనాశనానికి చక్రాన్ని పంపడానికీ
అది రావడానికి సమయం పట్టదూ?
భూతాలూ, భయపడే జనాలూ ఉండాల్సిందే
మార్పుదేవుంది, తీరిగ్గా అదే వస్తుంది
పొగ తర్వాత స్వఛ్ఛమైన మంటే కదా!
వలువలు విప్పే దుశ్శాసనుడి
తొడలు పగలడానికీ, నెత్తురు తాగడానికీ
జీవిత సంగ్రామంలో వెన్నుతట్టడానికీ
అభ్యుత్థానంలో తదాత్మానం సృజామ్యహానికీ
సమయం వచ్చేదాకా ఆగాల్సిందే
దుశ్శాశనులు పుడుతూనే ఉంటారు
తొడల నెత్తురు కారుతూనే ఉంటుంది
మార్పుదేవుంది, రాక తప్పదు
మానభంగం తర్వాత మహాసంగ్రామమేగా!
ఎదిగొచ్చిన కొడుకుని బయటకి తరిమితే
తమ్ముడితో స్నేహితుల్ని కూర్చుకోవడానికీ
కోతుల్తో ఎగురుతూ సముద్రం దాటడానికీ
అదను చూసుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగానికీ
ఏళ్ళ సమయం పట్టి తీరుతుంది
పది తలల రావణులూ, వాళ్ళెత్తుకెళ్ళే సీతలూ
కూర్చుని ఏడిచే అశోక వృక్షాలూ తప్పవు
మార్పుదేవుంది, మెల్లగా రానే వస్తుంది
రావణవధ తర్వాత రామరాజ్యమేగా!
ఎత్తైన భవనాలని విమానాల్తో కూలగొట్టి
ఎలాగా వెతకరని, నమ్మిన దేశాల
బొరియల్లో తల దాచుకున్న ఎలకల్ని
ఏళ్ళ తరబడి రహస్యంగా పొంచి వేటాడ్డానికి
అనేకానేక ఏళ్ళు పట్టి తీరుతుంది
మతోన్మాదంతో మనుషుల్ని చంపే లాడెన్‌లూ
అభం శుభం తెలీని జనాల చావులూ తప్పవు
మార్పుదేవుంది, మెల్లగా రానే వస్తుంది
ఉన్న భవనాలు కూలిపోతే పునః నిర్మాణమేగా!
పెంచుకున్న కక్షలతో పక్కదేశాన్ని ఆక్రమిస్తే
విస్తుపోయి కాళ్ళూ చేతులాడని మనుషుల్తో
వేడి, వేడి వడి వడి అంతర్జాలంలో విర్రవీగే
సాంకేతిక విజ్ఞాన అంధకారంలో ప్రపంచం
ఒక్కుమ్మడిగా ఆంక్షలకీ, కట్టడికీ చేరాలంటే
అలోచనలకి అనేక వారాల సమయం పట్టదూ?
ఆక్రమణలకి అంగలార్చే పుతిన్‌లూ
పొత్తిళ్ళలో బిడ్డల్తో తలదాచుకోలేని తల్లులూ
చూస్తూ ఏమీ చేయలేని అశక్తులూ తప్పవు
ఆక్రమణల ముందు వెనుకల అంతా విధ్వంసమేగా!
మార్పేనా, ఎప్పుడొస్తుందో ఎవరికెరుక?