1.
కోర్టు గదుల్లోపల ఓ కేసు మీద వేడివేడిగా చర్చలు జరుగుతున్నై. ఓ లాయర్ ఓ పక్షానిది తప్పు అంటూంటే రెండో ఆయన వేరే వాళ్ళది తప్పు అని వాదిస్తున్నాడు. ఈ వాదనలు అంత త్వరగా ఎలానూ తెమలవు కనక ఈ ఇద్దరు లాయర్లలో ఎవర్నీ సమర్థించకుండా పీటర్, పక్కనే టేబుల్ మీద ఉన్న పేపర్ తీసి పైపైన వార్తలు చదవడం మొదలుపెడుతూ ఒక్కసారిగా అరిచేడు, “ఇది విన్నారా? ఇవాన్ ఇల్యిచ్ పోయాట్ట!”
“నిజమా?” అన్నాడు మరో లాయర్ యథాలాపంగా, అదేదో పెద్ద విషయం కాదన్నట్టూ. అయితే ఆ మాటల్లో పీటర్‌కి కాస్త ఆశ్చర్యం, ‘హమ్మయ్య, దరిద్రం వదిలింది ఇన్నాళ్ళకి’ అనే విషయాలు స్పష్టంగా వినిపించాయి.
చేతిలో పేపర్ చూపిస్తూ పీటర్ చెప్పేడు, “కావాలిస్తే చూసుకోండి ఇందులో రాసినది. ఇది వాళ్ళావిడ ప్రస్కోవ్యా ఇచ్చిన ప్రకటనలో సమాచారమే. ఇవాన్ ఇల్యిచ్ ఫిబ్రవరి 4, 1882న పోయారు. మధ్యాహ్నం శవానికి అంత్యక్రియలు జరుగుతున్నై. స్నేహితులూ, బంధువులూ అందరూ రావాల్సింది.”
ఇవాన్ ఇల్యిచ్ చాలాకాలం కోర్టులో పనిచేశాడు కనక ఆయన జబ్బుగా ఉన్నంతకాలం ఆ ఉద్యోగం ఎవరికీ ఇవ్వకుండా అట్టేపెట్టేరు. ఇప్పుడు ఇవాన్ పోవడంతో ఆ ఉద్యోగం ఎవరికొస్తుందో అనే విషయం గదిలో ఉన్న లాయర్లూ, కొత్తగా చేరిన న్యాయవాదులూ ఎవరి మనసుల్లో వాళ్ళు అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఆలోచనల్లో భాగంగానే పీటర్ కూడా తన బావమరిదికి ఏదో ఒక చోటకు బదిలీకి ప్రయత్నించాలనీ మరొకటనీ ఆలోచించడం మొదలైంది. అయితే పైకి అప్పుడే ఇవన్నీ మాట్లాట్టం బాగోదు కనక “అసలు ఏమైందో ఇవాన్‌కి?” అన్నాడు, ప్రత్యేకించి ఎవర్నీ ఉద్దేశించకుండా.
“ఏమో, ఆయన జబ్బేమిటో డాక్టర్లకి అంతుబట్టలేదు. నలుగురైదుగురి దగ్గిరకి వెళ్ళాట్ట. ఎవరికైనా ఏదైనా తెలిస్తే దానికి సంబంధించి మందులిచ్చారని అన్నారు. అవన్నీ ఏనాడూ పనిచేసినట్టు లేదు.” ఎవరో సమాధానం చెప్పేరు.
“ఆయన ఉన్నవాడేనా? పెళ్ళాం పిల్లలకి ఏమీ లోటుండదు కదా?” మరో పెద్దమనిషి అన్నాడు గుంపులోంచి.
“ఏమో, వాళ్ళావిడకి ఏదో ఉంది. కానీ అది అంత పనికొచ్చేది కాకపోవచ్చు.”
ఈ మాటల వల్ల మొత్తానికి ఈ గుంపులో తేలిందేమిటంటే–జబ్బు వచ్చినదీ, వచ్చాక పోయినదీ ఇవాన్ ఇల్యిచ్, తాము కాదు. ఇదో అంటీ అంటనట్టు ఉండే భావం మనసులో. అయితే దీనివల్ల తమకి తగులుకున్న తలనెప్పి మాత్రం ఇవాన్ పోయినందుకు ఓసారి వెళ్ళి చూడవలసి రావడం. పీటర్ ఇదే విషయం అడిగి ఎవరొస్తారా అని చూడబోతే, ఎవరికీ తీరికా కోరికా ఓపికా ఉన్నట్టు లేదు.
ఎంతాశ్చర్యం! మొన్న మొన్నటిదాకా తామేనా ఇవాన్ కూడా పేకాటకీ దానికీ తిరిగింది? సరే, పీటర్ ఇవాన్‌తో చిన్నప్పటినుండీ చదువుకున్నాడు కనక తానొక్కడే వెళ్ళడానికి తయారయ్యేడు. మిగతావాళ్ళకి ఆ రోజు సాయంత్రం ఆడబోయే పేకాటకన్నా మరో విషయం అంత ముఖ్యం కాదు కాబోలు, మరో ఇంటికి పేకాటకు బయల్దేరారు. పీటర్ ఇవాన్‌ని చూడ్డానికి బయల్దేరుతూ చెప్పేడు, “ఓ కుర్చీ నాకోసం ఖాళీగా ఉంచండి; ఓ చూపు చూసి వచ్చేస్తా!”
“అలాగే, తప్పకుండా ఉంచుతాం.” నవ్వింది పేకాట బృందం.
ఇవాన్ ఇంటికెళ్ళేసరికి పీటర్‌కి కనిపించినది ఇవాన్ వాళ్ళావిడ ప్రస్కోవ్యా, కూతురూ, ఆఖరి పిల్లాడూను. మరికాస్త లోపలికి వెళ్తే మేనల్లుళ్ళూ, మిగతా బంధుగణం. వచ్చేపోయే వాళ్ళతో ఇల్లంతా హడావుడిగా ఉంది. ఇవాన్ బతికున్న రోజుల్లో అతన్ని చూడ్డానికీ, సేవ చేయడానికీ పెట్టుకున్న మనిషి జెరాసిమ్, పరామర్శకి వచ్చే అందర్నీ ఆహ్వానించడానికీ, వెళ్ళిపోతున్నవారికి వీడ్కోలు పలకటానికీ బయట గదిలోనే ఉన్నాడు. శవాన్ని చూడ్డానికెళ్తే మొదట్లో ఏం చేయాలి? పేటిక దగ్గిరకెళ్ళి క్రాస్ వేసుకోవాలా, లేకపోతే ఏదైనా ప్రార్థన అన్నట్టూ పెదిమలు కదపాలా? ఏదీ తోచని స్థితిలో శవపేటిక దగ్గిరకెళ్ళి, అందరూ ఏం చేస్తున్నారో చూసి అదే చేసి బయటకి రాబోతూంటే ఇవాన్ వాళ్ళావిడ ప్రస్కోవ్యా పీటర్ చేయి పట్టుకుని, “మీతో మాట్లాడే పని ఉంది కాస్త ఇలా వస్తారా?” అంటూ మరో గదిలోకి దారి తీసింది.
పీటర్‌కి కొంచెం ఇబ్బంది అనిపించినా మరోదారి లేక ఆవిడ వెంటే నడిచేడు. లోపలకి తీసుకెళ్ళాక రాబోయే కన్నీళ్ళకి కాబోలు, చేతిలో రుమాలు పట్టుకోవడం పీటర్ గమనించాడు. మనసులోనే అనుకున్న మాట మాత్రం, ‘ఇదేం దరిద్రం! ఇప్పుడీవిడ సోది అంతా నేను వింటూ కూర్చుంటే, పేకాటకి సమయానికి చేరడం ఎలా?’
ఏమీ ఉపోద్ఘాతం లేకుండా ఆవిడే మొదలుపెట్టింది, “మీకు సిగరెట్ కాల్చుకోవాలని ఉంటే సరే నాకేమీ అభ్యంతరం లేదు. ఈ అంత్యక్రియలు విషయం, ఇవాన్ చివరి రోజుల గురించి ఎంత మర్చిపోదామన్నా కుదరదు కదా! వాటి గురించి అలా ఉంచి, మరో విషయం మాట్లాడదామని పిల్చాను. చివరి రోజుల్లో ఇవాన్ ఎంత కష్టం అనుభవించాడో చెప్దామని…”
“అవునా! అయ్యో, చివరిదాకా తెలివి ఉందా?” ఏదో అడగాలి కనక పీటర్ అన్నాడు.
“ఆఁ, ఉంది. చివరి మూడు రోజులూ నరకం అనుభవించాడు. ఏడుపు, కేకలు, అసలు మనిషిని పట్టుకోలేకపోయాం అనుకోండి. ఏం చెప్పమంటారు…”
పీటర్‌కి ఏమనాలో తెలియలేదు. ఇవాన్ తనకి చిన్నప్పటి నుండీ తెలుసు. అయినా ఆ నెప్పీ, బాధా తనకి కాదు కదా? తానేం చేయగలడు? ఇదే ఆలోచనల్లో ఉండగానే ప్రస్కోవ్యా అసలు తానడగబోయే విషయానికొచ్చి అడిగింది, “మీరందరూ బాగా ఒకరికొకరు తెలుసున్న లాయర్లూ, గవర్నమెంట్లో పనిచేసిన ఉద్యోగస్తులూనూ. నాకైతే ఈయన పోయినందుకు ఏదో పింఛను వస్తుందేమో, ఇవాన్ పోయినందుకు ఈ అంత్యక్రియలకీ వాటికీ ఏదైనా వస్తుందేమో మీకు తెలుస్తుందనీ, మిమ్మల్ని అడుగుదామనీ…” ముక్కు చీదింది ఆవిడ.
ఒక్కసారిగా పీటర్‌కి జ్ఞానబోధ అయింది. ఇదన్నమాట ఈవిడ తనని అడగబోయినది! చూడబోతే ఈవిడ తనకి రాబోయే పింఛను విషయాలూ అవీ బాగానే తెలుసుకున్నట్టుంది. తానేదో ఉత్తరమో దక్షిణమో ఇచ్చి మరికొంత రాబడతాడని ఈవిడ ఆశ కాబోలు. ఆవిడ చెప్పినదంతా విన్నాక పీటర్ నోరు విప్పేడు, “మీకు తెలిసినదే నాకూ తెలుసు. అంతకన్నా మనమేం చేసినా గవర్నమెంట్ ఇవ్వదు. ఇంతకన్నా రాబట్టడం అసంభవం.”
ఒక పెద్ద నిట్టూర్పు అయ్యేక ఆవిడ మిగతా మాటల్లో పీటర్‌కి ధ్వనించిందేమిటంటే, ఇంక తానేమీ డబ్బులు లాగలేడు కనక, తనవల్ల ప్రస్కోవ్యాకి ఏ అవసరమూ లేదని తెలిసింది కనక, తానింక దయచేయవచ్చు. మెల్లిగా లేచి మరోసారి ఇవాన్ పార్థివదేహం ఉన్న చోటికి వచ్చేడు పీటర్. ఈ సరికి మిగతా బంధువులంతా వచ్చారు కాబోలు గది అంతా నిండి ఉంది. దారి చూసుకుంటూ బయటకొచ్చాడు. జెరాసిమ్ కనిపించగానే అన్నాడు కాస్త దీనంగా మొహం పెట్టి, “జీవితంలో ఇదో దరిద్రపు క్షణం కదా?”
“అవును, మనందరం ఏదో ఓ రోజు ఇలా వెళ్ళవల్సినవాళ్ళమే గదా?” జెరాసిమ్ చెప్పేడు, అక్కడే పడి ఉన్న కుప్పలోంచి పీటర్ కోటు వెతికి తీసి ఆయన చేతికిస్తూ.
తన బాధ్యత తీరిపోయింది, బయటకి వచ్చిన పీటర్ అన్నీ మర్చిపోయి గుర్రం బగ్గీ ఎక్కుతూ హుషారుగా అన్నాడు, తోలేవాడితో, “సరే పోనీయ్, ఇప్పటికే మనం పేకాటకి ఆలశ్యం అయ్యేం. ఇప్పుడు వెళ్తే కనీసం మరో రెండు మూడాటలు వేయొచ్చు.”
“హేయ్” అంటూ గుర్రాలని ముందుకు దూకించాడు, బండి తోలేవాడు.
2.
ఇవాన్ ఇల్యిచ్ జీవితం అతి సాధారణమైనదీ, ఏ చికాకులూ లేనిదీను; మనందరి జీవితాల్లాగానే అందుకే అది అతి భయంకరమైనది. కోర్టులో పనిచేసిన ఇవాన్‌కి నలభై అయిదేళ్ళకే ఆయుష్షు తీరిపోయింది. ఓ సారి ఇవాన్ కుటుంబం గురించి వెనక్కి చూస్తే ఇవాన్ తండ్రికి ముగ్గురు కొడుకులు. ఓ సారి తండ్రికీ ఇవాన్‌కి జరిగిన మాటల్లోనే కొడుక్కి సరైన దెబ్బ–తగలవల్సిన చోట కొట్టేడు తండ్రి.
బాగా పొద్దుపోయాక ఇంటికి ఆలస్యంగా వస్తూ ఎవరికీ కనపడకుండా లోపలకి దూరిపోదామనుకున్న ఇవాన్‌ని ముందు గదిలోనే కూర్చున్న తండ్రి పిలిచేడు “ఒరే అబ్బాయ్, ఇటు రా!”
ఇవాన్ గుండె చిక్కబట్టుకుని తండ్రి ముందుకొచ్చేడు. తన కోసమే చూస్తున్నాడా ఇంతవరకూ? ఈయనకి కోపం వస్తే వళ్ళు చీరేస్తాడనేది ఊరంతా తెలిసినదే. అసలే సర్కారు ఉద్యోగంలో దశాబ్దాలు పనిచేసి ప్రజలందర్నీ ఎలా ఏడిపించుకు తినాలో క్షుణ్ణంగా తెలిసిన మనిషి. ఏమంటాడో ఇప్పుడు? తన చదువు గురించా, లేకపోతే తాను అప్పుడప్పుడూ ఎగ్గొట్టే క్లాసుల గురించా, ఇప్పుడు తనతో మాట్లాడబోయేది?
“ఒరే అబ్బాయ్, పెద్దాడు ఏదో ఒకటి చేసి నాలాగ సర్కారు ఉద్యోగం సంపాదించాడు. నీ తర్వాత వాడు ఎలాంటివాడో ఊరంతా తెలుస్తూనే ఉంది. వాణ్ణి దార్లో పెట్టడానికి చావొచ్చింది. కిందా మీదా పడి రైల్వేలో ఉద్యోగం వేయించాను. నీ సంగతి ఇంక తేలాలి. నువ్వేం చేద్దామనుకుంటున్నావ్? నువ్వు క్లాసులు ఎగ్గొడుతున్నావనీ, నీ పనులు బాగోలేవనీ నా దగ్గిరకి కర్ణాకర్ణీగా వార్తలొస్తున్నాయ్…” తండ్రి అడిగేడు.
“నేను ప్లీడరీ చదువుదామనుకుంటున్నానండి.” ఇవాన్ చెప్పాడు ధైర్యం కూడగట్టుకుని.
“ప్లీడరీ మంచిదే, ఏదో ఉద్యోగం వస్తుంది లేకపోతే ఆఫీసు పెట్టుకోవచ్చు. కానీ ఆ చదువులు చదవగలననే ధైర్యం ఉందా? చూడబోతే నీ తిరుగుళ్ళు అంత బాగోలేవు మరి. నీకు ధైర్యం లేకపోతే అలా పై చదువులకి డబ్బులు తగలేయడం దేనికీ?” మొదట్లో అడిగిన సౌమ్యత తండ్రి గొంతులో లేకపోవడం గమనించాడు ఇవాన్.
“ఇంక తిరుగుళ్ళు కట్టిపెట్టేసి బాగా చదువుతాను.” కంగారుగా చెప్పేడు ఇవాన్.
“సరే వెళ్ళు అయితే, నేను అన్నీ గమనిస్తున్నానని మర్చిపోకు సుమా! తేడాలొస్తే నా చేతిలోంచి ఒక్క కొపెక్ కూడా రాలదు. ఆ తర్వాత ఏమౌతుందో నీకూ తెలుసు.”
బతుకుజీవుడా అనుకుంటూ ఇవాన్ వడివడిగా లోపలకి నడిచాడు. ఉత్తరోత్తరా ఇవాన్, తండ్రి చెప్పిన ప్రతీమాటా తు.చ. తప్పకుండా వినే తన అన్నలాగా బుద్ధిమంతుడూ కాకుండా, తమ్ముడిలా మరీ తిరుగుబోతూ కాకుండా మధ్యస్థంగా పైకొచ్చేడు. బంధువుల్లో ఇవాన్ అంటే ఏమీ ప్రత్యేకత లేకపోయినా, మంచివాడనిపించుకోకపోయినా, చెడ్డవాడని మాత్రం ఎవరూ అనలేదు. చిన్న వయసులో నేర్చుకున్న వినయం విధేయత, కుర్రాడిగా ఉన్నప్పుడూ ఆ తర్వాత పెద్దయ్యాకా మర్యాదగా ఎలా మసలాలో నేర్చుకున్నదీ, ఇవాన్ ఎప్పుడూ మర్చిపోలేదు. పెద్దయ్యేకొద్దీ ప్రతీ కుర్రాడిలాగానే కొంచెం అమ్మాయిల పట్ల వ్యామోహం, కాస్త గర్వం వంటబట్టినా వాటివల్ల తనకి గానీ, అవతలవాళ్ళకి గానీ, తన కుటుంబానిక్కానీ ఏమీ అపకారం, చెడ్దపేరు రాకుండా ఇవాన్ జాగ్రత్తగానే ఉన్నాడనడం వాస్తవం. దీనికి కారణం, చదువు కోసం ఇవాన్ తండ్రి ఇచ్చిన ఆఖరి వార్నింగ్‌ను మనసులో ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవడమే.
ఇవాన్ పూర్తిగా చదువు మీద దృష్టి సారించేక ఎంతో కష్టం అనిపించిన ప్లీడరీ చదువు మెల్లిగా వంటబట్టడం మొదలైంది. స్కూల్లో ఉన్నప్పుడు చేసిన వెధవ పనులు ఎప్పుడైనా గుర్తొస్తే మనసులో ముల్లులా దిగేది ఇవాన్‌కి మొదట్లో అవి తలుచుకుని. అయితే ఓ సారి కాలేజీలో చేరాక అవే పనులు మిగతావాళ్ళూ చేస్తూంటే సరే తాను చేసినది అందరూ చేస్తున్నదే అంటూ మనసులో సమాధానం ఇచ్చుకున్నాక జీవితం గాడిలో పడడం మొదలైంది. అయితే తాను చేసిన వెధవ పనులు తండ్రికి చూచాయగా తెలియడం వల్ల, అవి చేసినందుకు కలిగిన పశ్చాత్తాపం, అవమానాల వల్ల, చేసినవి తప్పా ఒప్పా అనేవి మాత్రం ఇవాన్‌కి ఎప్పటికీ తెలియలేదు. తెలిసినది మాత్రం తాను అందరిలాగే చేశాడు. ఏదేమైనా ఇవన్నీ ఒక్కోటిగా మర్చిపోయి చదువులో పడ్డాడు ఇవాన్; చదువు సాగినంత కాలం తండ్రి, తనతో చెప్పినట్టూ, తనమీద ఓ కన్నేసి ఉంచుతాడనేది ఎప్పటికప్పుడు గుర్తుంచుకుంటూ.
మూడేళ్ళకి ప్లీడరీ చదువు గట్టెక్కేసరికి సర్కారు వారి పుణ్యమా అని సివిల్ సర్వీసులో చిన్న ఉద్యోగం కుదిరింది. తనకి చెప్పినట్టూ కుదురుగా చదువుకుని ఉద్యోగం సంపాదించినందుకు తండ్రి సంతోషించాడా లేదా అనేది ఎలా ఉన్నా, ఇవాన్ కొత్త ఉద్యోగంలో చేరడానికి కావాల్సిన బూట్లూ, బట్టలూ కొనుక్కోవడానికి మాత్రం ఆయన డబ్బిచ్చాడు. చదువుకున్న కాలేజీలో తనకి పాఠాలు చెప్పిన టీచర్లకీ, తన స్నేహితులకీ వీడ్కోలు చెప్పేసి, మారు మూల పల్లెటూర్లో వచ్చిన సర్కార్ ఉద్యోగంలో జేరడానికి తనకున్న సరంజామాతో బయల్దేరాడు ఇవాన్.
స్వంత సంపాదన చేతిలో పడుతూంటే, ఇవాన్ ఉద్యోగంలో నేర్చుకున్నదేమంటే, ఆఫీసు గంట అయిపోయాక తనిష్టం వచ్చినట్టూ చేయొచ్చు. బయట ఎలా నవ్వినా ఏం చేసినా ఉద్యోగంలో మాత్రం ఇవాన్ నిక్కచ్చి మనిషి. అయితే ఈ కుర్ర లాయర్ని తన వలలోకి లాగినప్పుడూ, ఆ తర్వాత ఆవిడ ఇవాన్‌ని వ్యభిచారం చేసే చోట్లకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడూ, తన పై ఆఫీసర్ చెప్పింది బుద్ధిగా విని ఆవిణ్ణి వదిలించుకున్నాడు ఇవాన్. ఏదైతేనేం, తన ఉద్యోగానికీ, సమాజంలో తాను సంపాదించుకున్న గౌరవానికీ ఎసరు రాకుండా ఇవాన్ జాగ్రత్త పడ్డాడనేది మాత్రం వాస్తవం. మొదట్లో తండ్రి వల్ల ఉద్యోగం సంపాదించుకున్నాడనీ, ఏదో అత్తెసరి సరుకు మనిషనీ అనుకున్న జనం ఇవాన్ నిజాయితీ ఆఫీసులో ఎప్పుడైతే తెలిసిందో అప్పట్నుండి కొంచెం గౌరవం ఇవ్వడం మొదలు పెట్టారు. దానికి తగ్గట్టుగానే మరింత నిజాయితీగా ఉంటూ ఇవాన్ నేర్చుకున్న విలువైన పాఠం: ఆఫీసు విషయాలు, అవి అయిపోయాక తాను బయట వెలగబెట్టే రాచకార్యాలు ఎప్పుడూ కలవరాదు.
అలా అయిదేళ్ళు ఆ ఉద్యోగం చేశాక, కొత్త కోర్టులూ, కొత్త లా పుస్తకాలూ అమల్లోకి వచ్చేయి. ఇవన్నీ జనాల్లోకి రావాలంటే ఎవరో ముసలి లాయర్లూ, న్యాయమూర్తుల వల్లా ఏమౌతుంది? కొత్తవాళ్ళ అవసరం అనివార్యం కనక వీళ్ళలో ఇవాన్ ప్రముఖుడిగా తేలాడు, కుర్ర లాయర్ అవడం వల్లా, పాత వ్యవస్థలో అయిదేళ్ళు పనిచేసినందు వల్లాను. దీనివల్ల ఇవాన్‌కి మెజిస్ట్రేట్ ఉద్యోగానికి పదోన్నతి వచ్చి వేరే చోటకి బదిలీ అయింది. తలతాకట్టు పెట్టాక చేసేదేముంది? ఇప్పటిదాకా పోగేసుకున్న స్నేహితుల్నీ, పరిసరాలనీ విడిచి వెళ్ళాల్సిన పరిస్థితి. అలా రెండోసారి ఇవాన్ కొత్త ఉద్యోగానికి బయల్దేరేడు.
పాత ఉద్యోగంలో టై, సూటూ, బూటు వేసుకుని ఉద్యోగానికి వెళ్తే పోలీస్ ఆఫీసర్ నుంచి కింద వాళ్ళదాకా గౌరవం ఇచ్చేవారు. అయితే ఆ గౌరవం తన పై ఆఫీసర్ అయిన మెజిస్ట్రేట్ రానంతవరకే. ఆయన రాగానే తాను చేతులు కట్టుకుని ఆయన ముందు అందరితోపాటు నిలబడాల్సిందే. అయితే ఇప్పుడు తానే ఒక మెజిస్ట్రేట్. ఎవర్నైనా తన దగ్గిరకి తీసుకొస్తే తాను చెప్పేదాకా అలా నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. తాను ఏదైనా కాయితం మీద రాసి ఆర్డర్ ఇస్తే అది ముక్కస్య ముక్కార్థంగా అనుసరించవల్సిందే. తాను అంత గొప్పవాడు.
ఇంత పెద్ద ఉద్యోగం వచ్చినా ఇవాన్ తన ఉద్యోగాన్నీ తనచేతిలో అధికారాన్నీ ఏనాడూ పాడుచేసిన దాఖలాల్లేవు. నిజాయితీగా తన ఉద్యోగం తాను చేసేవాడు. ఆఫీసు బయటకొచ్చాక కూడా తాను చేసే ఏ పని వల్ల తనకి కానీ తనకి ఉద్యోగం ఇచ్చిన సర్కార్ వారిక్కానీ ఎప్పుడూ ఎసరుపెట్టే పనులు చేయలేదు. కొత్త పుస్తకాలు వంటబట్టించుకుని, ఏదైనా క్లిష్టమైన కేసు వస్తే తన స్వంత అభిప్రాయం పక్కనపెట్టి, దాన్ని కూలంకషంగా ఏ కీలుకాకీలు విడదీసి సులభంగా తీర్పు చెప్పడం అలవాటు చేసుకున్నాడు ఇవాన్. అలా కొత్తగా వచ్చిన మెజిస్ట్రేట్ ఏ పనైనా సులభంగా చేస్తాడని పేరు రావడానికి అంత కష్టం కాలేదు. ఈ వార్తలన్నీ ఇవాన్ తండ్రికి ఎప్పటికప్పుడు చేరుతూనే ఉన్నాయ్.
ఈ కొత్త ఉద్యోగంలో ఇవాన్ సమాజంలో డబ్బున్న పైతరగతి వాడు. పాత ఊళ్ళో ప్లీడరీ ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన స్నేహాలూ, అక్కడి స్నేహితులూ వేరు. ఇక్కడ ఇవాన్ మెజిస్ట్రేటు కనక కొత్త స్నేహితులందరూ డబ్బున్న సమాజంలో బాగా పై తరగతి జనం. అందులో చాలామంది బాగా డబ్బున్న ప్లీడర్లూ, మిగతా పెద్దలూను. వాళ్ళతో పేకాట, అప్పుడో వోడ్కా ఇప్పుడో చిన్న సర్దా తీర్చుకుంటూ ఇవాన్ జీవితం గాడిలో పడుతోంది. పేకాటలో పట్లు తెలుస్తున్నై ఇవాన్‌కి. కొంచెం హుందాగా కనిపించడానికా అన్నట్టూ గెడ్డం పెంచడం మొదలుపెట్టాడు కూడా.
రెండేళ్ళు ఇలా సరదాగా గడిచేక ప్రస్కోవ్యా ఇవాన్ జీవితంలోకి ప్రవేశించింది. ఆఫీసు పని అయ్యేక ఎప్పుడైనా పేకాట దగ్గిరో మరో చోటో తారసిల్లిన ఈ ప్రస్కోవ్యా ఇవాన్‌తో అప్పుడప్పుడూ కలిసి డాన్స్ చేయడం, రాత్రిదాకా గడపడం జరిగాక ప్రస్కోవ్యాని పెళ్ళి చేసుకోవడానికి ఇవాన్‌కి ఏమీ అభ్యంతరం కనిపించలేదు. ప్రస్కోవ్యా మంచి కుటుంబంలోంచి వచ్చినదే, ఏవో కొన్ని ఆస్తిపాస్తులున్నాయి కూడా. అయితే ఇవాన్ మాత్రం ఆవిణ్ణి పెళ్ళి చేసుకునే ముందు తనకున్న ఉద్యోగం, ఆవిడకి కూడా తనంత జీతం వస్తుందనుకోవడం, తన జీతం కుటుంబానికి సరిపోతుందా, లేదా అనేది మాత్రం జాగ్రత్తగా లెక్కలు కట్టుకుని బేరీజు వేసుకుని చూసుకున్నాడనేది అతని స్నేహితుల్లో కొంతమందికి మాత్రమే తెల్సిన నిజం. అలా మొత్తానికి ఇవాన్‌కి పెళ్ళైపోయింది.
పెళ్ళైన కొత్తలో యువజంటకి వేడివేడిగా వాడివాడిగా హాయిగా గడిచింది. కొత్త ఇల్లూ, ఆ ఇంటిక్కావాల్సిన సరంజామా అమర్చుకున్నాక జీవితం ఇంక అంతా హాయే కదా. అయితే త్వరలోనే తెలిసొచ్చిన నిజం ప్రస్కోవ్యా ఏడు నెలల నిండు చూలాలు. భార్య కడుపుతో ఉంటే మాత్రం తాను ముందు గడిపినట్టే జీవితం హాయిగా గడపడానికి ఏమీ అడ్డురావాల్సిన అవసరం లేదని ఇవాన్ అనుకున్నాడు కానీ మొదటి నెలల్లోనే అసలు జీర్ణించుకోలేని, ఇప్పటివరకూ ఎప్పుడూ ఎదురవని చేదు నిజాలు బయటకి రావడం మొదలుపెట్టాయ్! మొదటి కాన్పు అవడం వల్లో మరోటో గానీ అయినదానికీ కాని దానికీ, ఇవాన్ చేసే ప్రతీ పనికీ ఆవిడ ఇవాన్‌ని తప్పుపడుతూ నసపెట్టడం నేర్చుకుంది. ఉత్తి పుణ్యానికి ఇవాన్ అంటే అసూయ పడడం, ఎక్కువసేపు ఆఫీసులో ఉంటాడనీ అసలు ఇల్లు అంటే లెక్కలేదనీ దెప్పడం మొదలైంది. ప్రస్కోవ్యా నస మొదలైన రోజుల్లో ఆవిణ్ణి పట్టించుకోకుండా ఎప్పట్లాగానే ఉండొచ్చని ఇవాన్ అనుకుంటూ తాను వెళ్ళడమో లేకపోతే స్నేహితుల్నీ బంధువుల్నీ ఒక్కోసారి తనింటికే పేకాటకి పిలుస్తూండడం గమనించాక ప్రస్కోవ్యా మరింత విజృంభించింది. బయటకి వెళ్ళనీయకుండా ఇవాన్‌కి ఏదో పనిచెప్పడం, ఆ పని అయ్యేక అది సరిగ్గా చేయలేదనడం, లేకపోతే మరో వంక ఇవాన్‌ని ఇంటిపట్టునే ఉంచడానికి. ఈ నస తప్పించుకోవడానికి ఏ మార్గమూ తట్టలేదు ఇవాన్‌కి. తాను ఊరుకునేకొద్దీ ప్రస్కోవ్యా మరింత నసగడం ఇవాన్ గమనించేడు. ఏ పెళ్ళి వల్లయితే తనకి ఆనందం దొరుకుతుందనుకున్నాడో అదే పెళ్ళి వల్ల తన జీవితంలో మునపటి సంతోషం కూడా మాయమౌతూండడం, పెళ్ళికి ముందు ఏ పని చేయడానికైనా తనకున్న స్వాతంత్రం కూడా ఇప్పుడు లేకపోవడం, ఆటు ఆఫీసు పనితోనూ ఇటు ఇంట్లో జరిగే నసతోనూ తన బతుకు అస్తవ్యస్తంగా తయారవడం ఇవాన్‌కి తెలుస్తూనే ఉంది. అయినా ఏమీ చేయలేని అశక్తత.
ప్రసవం అయ్యేక ప్రస్కోవ్యా మారుతుందనుకున్నాడు కానీ ఇప్పుడు ఇవాన్‌కి కొత్త కష్టాలు తయారయ్యేయి. పుట్టిన పిల్లకి ఎలా, ఎన్ని పాలు పట్టాలో తెలియకపోవడం, దానిక్కూడా ఇవాన్ ఓ కారణం అంటూ పేట్రేగి బుర్ర తిరిగిపోయేలా ప్రస్కోవ్యా సణుగుడు. తల్లికీ పిల్లకీ ఏవేవో రుగ్మతలు. అవి అసలు నిజంగా డాక్టర్ దగ్గిరకి వెళ్ళాల్సినంత రుగ్మతలా కాదా అనేది ఇవాన్‌కి ఆవిడ ఎప్పుడూ చెప్పని, అసలు ఎప్పటికీ తెలియని రహస్యం.
మునపటికంటే తగ్గుతుందనుకున్న ప్రస్కోవ్యా పెట్టే నస ఇప్పుడు పుట్టిన పిల్లతో రెట్టింపు అయింది. ఆలోచించగా ఇవాన్‌కి చివరకి తేలిందేమిటంటే, పెళ్ళి అనేది ఏదో కొంత సంతోషాన్నిచ్చినా అదో పెద్ద తలకి మించిన భారం. ఏ నిముషం ఎలా ఉంటుందో ఎవరికి తన సహాయం కావాలో, ఎవరు తనని విసుక్కుని పురుగులా విదిల్చి పారేస్తారో అనేది చెప్పడం అసంభవం. ఈ పెళ్ళి అనే సుడిగుండం లోంచి ఈదుకుని బయటపడి ‘నేను సంతోషంగా ఉన్నానహో’ అని చెప్పగలిగే ప్రబుద్ధుడెవడూ లేడు. తనకేదైనా ఆటవిడుపంటూ ఉంటే అది ఆఫీసు పనిలోనే. అలా ఓ ఏడాదిలో ఇవాన్ ఇంట్లో నోరుమూసుకుంటూ, ఆఫీసులోనో లేకపోతే బయటో తన సంతోషం వెతుక్కోవడానికి అలవాటుపడ్డాడు.
మూడేళ్ళు ఇలా గడిచాక ఇవాన్‌కి మరోసారి పదోన్నతి. ఇప్పుడు ఇవాన్ ఎవరినైనా సరే తన ఇష్టం వచ్చినట్టూ విచారణ జరిపించి జైల్లో పెట్టించగలడు. పెద్దలెవరైనా పిలిస్తే వెళ్ళి సభాముఖంగా ఓ గంట మాట్లాడగలడు కూడా. ఈ ఆఫీసు పని ఇలా ఉంటే ఇంట్లో ఈ లోపుల మరి కొంతమంది పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళతో పాటే ప్రస్కోవ్యా నస కూడా ఎక్కువైంది, అంతే సాధారణంగా. అయితే ఇవాన్ జీవితంలో నేర్చుకున్న విషయాలతో ఓ సారి ప్రస్కోవ్యా నోరు విప్పడం మొదలుపెట్టగానే తాను వేరే లోకంలోకి పోయినట్టూ ఈవిడ సాధించడాన్ని వినిపించుకోకపోవడం అలవాటు చేసుకున్నాడు. కనీసం అలా అనుకుంటున్నాడు. మరో ఏడేళ్ళు గడిచేక ఇవాన్‌కి మరోసారి ముక్కూ మొహం తెలియని వేరే చోటుకి బదిలీ అయింది. అక్కడకి వెళ్ళేలోపునే పుట్టిన మొదటి ఇద్దరూ పిల్లలూ ఏదో వ్యాధితో పోయారు.
కొత్త ఉద్యోగంలో వచ్చే జీతం ఎక్కువైనా ప్రస్కోవ్యాకి ఈ ఊరు నచ్చలేదు, ఇక్కడ ఏది కొనాలన్నా ఖర్చెక్కువ. ఇంత దూరం తనకి ఇష్టం లేకపోయినా ఈడ్చుకొచ్చినందుకు ఆవిడ నస మరింత ఎక్కువై ఇవాన్ జీవితం మరింత దుర్భరం అయింది. ఓసారి అయినదానికీ కానిదానికీ ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం అయితే మరోసారి పిల్లల గురించో వాళ్ళ చదువుల గురించో, ఒకరితో ఒకరు అరుచుకుంటూ–మాట్లాడుకోవడం అనడం కన్నా కొట్టుకోవడం అనడం సబబేమో-–కసురుకోవడం. ఇవి ఎక్కువయ్యే కొద్దీ ఎక్కడో మొదలైన కథ వెనక్కి పాత విషయాల మీదకీ, ఎప్పుడో పదేళ్ళ క్రితం జరిగిన వాటిమీదకీ అలా అలా పెరుగుతూ మరింత అరుచుకోవడం; ఇలా ఒకరికొకరు తమకి తెలిసీ తెలియకుండా మనసులో దూరంగా జరగడం ఇద్దరికీ తెలుస్తూనే ఉంది. ఎప్పుడైనా, అరుదుగా ఓ చిన్నపాటి తేలిక నవ్వులు ఇద్దరి మధ్యా. అదయ్యాక మళ్ళీ గొడవలూ, అరుపులూ.
ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతూంటే జీవితం ఇలాగే ఉంటుందనీ, ఇదంతా సర్వసామాన్యం అనీ ఇవాన్‌కి తెలిసివస్తోంది క్రమక్రమంగా. ఈ చెప్పులో రాయిని, చెవిలో జోరీగను తప్పించుకోవడానికి ఇవాన్ ఎక్కువసేపు ఆఫీసులో, తన ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవడంలో కాలం వెచ్చించేవాడు. లేకుంటే సాయంత్రాలు స్నేహితులతో పేకాటలో. అలా ఆఫీసులో ఇవాన్ మంచి పేరు తెచ్చుకున్నట్టు జనం అనుకోవడం, పని అయిపోయాక ఆఫీసువాళ్ళతో కబుర్లు, పేకాట, వీటితో ఇవాన్‌కి కూడా తృప్తిగానే ఉంది. ఇలా ఇవాన్ పేకాటలో, ఆఫీసు పనిలో తన స్వంత సుఖం వెతుక్కోవడం మొదలుపెట్టాక ప్రస్కోవ్యా అసలు ఇవాన్ ఇంటి గురించి పట్టించుకోవట్లేదని మరో కొత్త గొడవ మొదలెట్టింది. ఏదైతేనేం రోజులు అలా పరుగెడుతూనే ఉన్నై. అందరి జీవితాల లాగానే తన జీవితం కూడా బాగానే ఉందనుకుంటూనే ఉన్నాడు ఇవాన్. కాలం ఎవరి కోసమూ ఆగదు కదా?
పెద్దమ్మాయి లిసాకి పదహారేళ్ళొచ్చాయి. అలా ఈ అమ్మాయీ, పోగా పోయినవాళ్ళలో చివర్న స్కూల్లో చదివే కుర్రాడు మిగిలేరు ఇవాన్‌కి. కుర్రాణ్ణి తనలాగానే లాయర్ చదువులో పెడదామన్నాడు ఇవాన్. కానీ ప్రస్కొవ్యా అడ్డం వచ్చి కుర్రాణ్ణి హైస్కూల్లో జేర్పించింది. తనంటేనే ప్రస్కోవ్యాకి అసహ్యం అనుకున్నాడు ఇవాన్, కానీ ఇలా కుర్రాణ్ణి లాయర్ చదువుకి వద్దనడంతో ఈవిడకి తానే కాదు తాను చదివిన చదువంటే కూడా అసహ్యం అని ఇవాన్‌కి పరోక్షంగా చెప్పినట్టయింది. అమ్మాయికి ఇంటిదగ్గిరే చదువు. ఎక్కడ ఏం చదువుతున్నా పిల్లలిద్దరూ గాడిలో పడుతున్నట్టే అని ఇవాన్ అనుకున్నాడు. కొన్నాళ్ళు గడిచేక వేరే చోటికీ మరో ఉద్యోగానికీ మారుతావా అని అడిగారు ఆఫీసులో పెద్దలు ఇవాన్‌ని. కానీ అన్నింటినీ వద్దనుకుని అదే ఊర్లో ఉండిపోయేడు, మారితే ప్రస్కోవ్యా నస మరింత ఎక్కువ అవుతుందనుకోవడం ఒకటీ, మారిన ప్రతీసారీ ఆ కొత్త ఊళ్ళో సర్దుకోవడం మరోటీ అన్నీ గుర్తొచ్చి.
3.
అలా పదిహేడేళ్ళు గడిపాక అప్పుడొచ్చింది అనుకోని అవాంతరం ఇవాన్ జీవితంలోకి. ఉన్న ఊర్లోనే ప్రమోషను తనకి రాకుండా మరొకరికి ఇవ్వడం దీనిక్కారణం. దీనితో చిర్రెత్తుకొచ్చిన ఇవాన్ ఆఫీసులో పై వాళ్ళతోనూ తెలిసినవాళ్ళతోనూ తనకా ఉద్యోగం రానందుకు గొడవ పెట్టుకున్నాడు. ఈ జగడాలతో వాళ్ళకీ ఇవాన్ అంటే కోపం మొదలైంది. చిలికి చిలికి గాలివాన అయి మిగతా పై ఉద్యోగాలక్కూడా ఇవాన్‌ని పట్టించుకోవడం మానేశారు. ఇటు ఎదుగుతున్న పిల్లల వల్ల ఇంట్లో ఖర్చులు పెరుగుతున్నాయి. తనకేమో పదోన్నతి రాకుండా ఈ ఆఫీసు పెద్దలు అడ్డుకుంటున్నారు. ప్రస్కోవ్యా నస ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ప్రస్కోవ్యాకి ఉన్న చిన్ని ప్రపంచంలో ఎవరెన్ని తప్పులు చేసినా మొత్తం ఆవిడ చుట్టూ ఉన్న ప్రపంచం ఇంత దరిద్రంగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఇవాన్! ఇవాన్‌కి ఉన్న తలనెప్పి మరొకటి; తనకొచ్చే జీతానికీ తన ఖర్బులకీ ఎక్కడా పోలిక లేదు. అప్పు చేయకుండా బండి నడవని పరిస్థితిలో ఆఖరికి అన్నీ తెలిసిన ఇవాన్ తండ్రి కూడా నిమ్మకి నీరెత్తినట్టూ ఉండడం, ఏమీ సహాయం చేయకపోవడం చూసాక ఇవాన్‌కి అనిపించిన విషయం- తానో పనికిరాని, ఎవరికీ అఖ్ఖర్లేని ఏకాకి దద్దమ్మ అని. అయితే ఇవాన్ ఉద్యోగం, అతనికొచ్చే జీతం మూడువేల అయిదువందల రూబుళ్ళూ చూసి బైటవాళ్ళు అనుకునేది వేరు. వాళ్ళ దృష్టిలో ఇవాన్ ఒక అదృష్టవంతుడు. పదోన్నతి రాకుండా అడ్డుకున్నందుకు ఇవాన్‌కి జీవితంలో విరక్తి పుట్టి చావాలనిపించినప్పుడు, ఇవాన్ తండ్రితో సహా అందరికీ అదేమీ అసలు పట్టించుకోవాల్సిన విషయంలాగా కూడా అనిపించలేదు.
ఎవరూ సహాయం చేయని ఈ స్థితిలో ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకటే మార్గం తోచింది ఇవాన్‌కి. కొంతకాలం ఉన్న ఉద్యోగానికి శెలవు పెట్టి ప్రస్కోవ్యానీ పిల్లల్నీ పుట్టింట్లో ఆవిడ అన్న దగ్గిర దిగపెట్టి అక్కడే ఉండడం. ప్రస్కోవ్యా అన్న, తన బావ ఉండేది పల్లెటూళ్ళో కాబట్టి ఖర్చులు తగ్గుతాయి. ఉండేది పుట్టింట్లో కనక ప్రస్కోవ్యా నస, తనని సాధించడం తగ్గడానికీ ఆస్కారం ఉంది కదా?
అయితే బావ ఇంట్లో దిగేక అసలు విషయం తెలిసొచ్చింది ఇవాన్‌కి. ఇప్పుడు తనో జీతం లేని మనిషి. శెలవైతే ఇస్తారు కాని పని చేయకుండా జీతం ఎవరు ఎంత కాలం ఇస్తారు? మొదటి పదిరోజులు సరదాగా గడిచేక నిద్రపట్టని రాత్రుళ్ళతో ఇవాన్‌కి జీవితం మరింత కష్టమైంది. కొన్నాళ్ళు ఈ నరకం అనుభవించాక ఓ రోజు పొద్దున్నే ఏదో నిశ్చయానికి వచ్చినవాడిలా, బావ, ప్రస్కోవ్యా ఎంత చెప్పినా వినిపించుకోకుండా పీటర్స్‌బర్గ్ బయల్దేరాడు. వెళ్ళడానికి ఒకటే కారణం–ఎలాగైనా ఎవరి కాళ్ళో చేతులో పట్టుకుని ఎక్కడో ఒకచోట పెద్ద జీతానికి ఉద్యోగం సంపాదించాలి. విధి ఒక్కొక్కప్పుడు మనకి అనుకూలంగా మారడం నిజమనేదానికి సాక్ష్యం కాబోలన్నట్టూ, వెళ్ళాక తెలిసింది అసలు విషయం- మంత్రివర్గంలో మార్పుల వల్ల ఇవాన్‌కి మంచి రోజులు రాబోతున్నై! తర్వాత కాగితాలు వేగంగా కదిలేయి. మొదట్లో పనిచేసిన చోటే ఇవాన్‌కి పెద్ద పదోన్నతి; అదీ మామూలుగా కాదు, రావాల్సిన పదోన్నతి కన్నా రెండు మెట్ల మీదకి ఒక్కసారిగా, తంతే బూర్లె బుట్టలో పడ్డట్టూ పడ్డాడు ఇవాన్. వీటితోబాటు, శెలవులో ఉన్నందుకు డబ్బూ, జీతం బాగా పెంచుతూ మరో కాయితం ఇవ్వబడ్డాయి. ఒక్కసారి ఇన్ని సంతోషపు వార్తలు రావడంతో ఇవాన్ ఇంట్లో, ఆఫీసులో అంతకు ముందు జరిగిన పాత కక్షలూ అన్నీ మర్చిపోయి బావ దగ్గిరకి బయల్దేరేడు ఇవన్నీ చెప్పడానికి. కొన్నాళ్ళ ఎడబాటు వల్లో, కొత్త ఉద్యోగం, అందులో రాబోయే ఎక్కువైన జీతం వల్లో, లేకపోతే మరో కారణమో, ఏదైతేనేం, ఇవాన్, ప్రస్కోవ్యాల మధ్య దెబ్బలాటలూ, వాదులాటలూ ఏమీ రాలేదు. మరీ పెళ్ళయిన కొత్తలో ఉన్నంత ప్రేమ ఒకరిమీద ఒకరు ఒలకపోసుకోకపోయినా దగ్గిరగా ఉన్నట్టు అనుకోవల్సిందే.
వెనక్కి వచ్చి చెప్పిన ఈ వార్తలకి ప్రస్కోవ్యా, ఆవిడ అన్న, వదిన సంతోష పడ్డారని ఇవాన్‌కి అనిపించింది. చెల్లి మొగుడికి ఉద్యోగం లేనప్పుడు తమ ఇంట్లో తిష్టవేసి, తమ మోచేతి నీళ్ళు తాగుతున్నందుకు అన్న ఎలా ఉన్నా వదిన విసుక్కోవడం తెలిసిన ప్రస్కోవ్యా, ఇప్పుడీ ఇద్దరూ బలవంతం చేసిమరీ కొన్నాళ్ళు ఉండమంటే వాళ్ళని కాదనలేక మరో కొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. అదీగాక కొత్త ఊళ్ళో ఇల్లు చూసుకుని ఇవాన్ అన్నీ అమర్చుకోవద్దూ, పెళ్ళాం పిల్లల్ని తీసుకెళ్ళేముందు? అలా ఇవాన్ ఒక్కడే బయల్దేరేడు ఉద్యోగంలో చేరడానికి, ప్రస్కోవ్యా తనకి వచ్చిన ఉద్యోగం చూసి సంతోషించిందనుకునీ, తన గొడవలూ సణుగుడూ తగ్గినందుకూను.
కొత్త ఊర్లో ఇవాన్‌కి అంత కష్టపడక్కర్లేకుండానే, మంచి ఇల్లు దొరికింది. తామిద్దరూ ఎడంగా ఉండడం వల్లో, డబ్బు మహిమో మరొకటో మరి, ఇవాన్ సౌమ్యంగా కాకపోయినా మునపటంత దురుసుగా మాత్రం మాట్లాడటం లేదు ఎవరితోనూ. ఇంటికి కావాల్సిన మరమ్మత్తులు జరుగుతూంటే, ఖాళీ ఉన్నప్పుడల్లా అటు వెళ్ళి తానూ ఒక చేయి వేయడం, ఏది ఎక్కడ ఎలా ఉండాలో చెప్పడం- ఇవీ ఆఫీసు గంటలు అయ్యేక ఇవాన్ చేసే పనులు. రాత్రి పడుకున్నప్పుడు ఇంట్లో ఏ పని ఎలా చేస్తే ఇల్లు బాగుంటుందా అంటూ ఆలోచించడం, పొద్దున్న లేచాక ఆ ఆలోచన ప్రకారం పనులు సరి చేయించడం; ఒక్కోసారి వీటి గురించి ఆలోచిస్తూ ఆఫీసు పనిలో కూడా పరాకుగా ఉండడం; నవ్వుకుంటూ తర్వాత ఒళ్ళు దగ్గిర పెట్టుకుని పనిచేయడం; ఇవీ ఇప్పుడు ఇవాన్ జీవితంలో ముఖ్యమైన పనులు. ఇంటి పనంతా అవడానికి సెప్టెంబర్ దాకా పట్టవచ్చేమో అనుకున్నాడు కానీ అన్నీ అక్టోబర్ దాకా సాగాయి. ఈ లోపుల ఇవాన్ ఇంటి గురించీ ఆ మరమ్మత్తుల గురించీ బావకీ ప్రస్కోవ్యాకీ పెద్దగా తెలియనివ్వలేదు. కారణం ఏమిటంటే ప్రస్కోవ్యా రాగానే తాను కొన్న పెద్ద ఇల్లూ, ఆ ఇంటిని ఎలా తీర్చిదిద్దాడో–అదీ ప్రస్కోవ్యాకి అనుకూలంగా–చూపించి ఒక్కసారి ఆశ్చర్యపరుద్దామని. ఇంట్లోకి కావాల్సిన సోఫాలకీ కుర్చీలకీ ఆఖరికి కిటికీలకి పెట్టే తెరలకీ కూడా ఇవాన్ ఎముకలేకుండా చేయి ఝూడించాడు, లేకపోతే తర్వాత అమ్మగారికి కోపం రాదూ?
ఓ రోజు ఇల్లంతా కలయ తిరుగుతున్నప్పుడు ఏవో కిటికీ తెరలు సరిగ్గా పెట్టలేదనీ, అవి ఎలా పెట్టాలో చూపించడానికి ఇవాన్ స్వయంగా అక్కడే ఉన్న నిచ్చెన పైకి ఎక్కుతూ సరిగ్గా చూసుకోక, కాలు పట్టు తప్పి కింద పడ్డాడు. బిగించడానికి అక్కడే నేలమీద ఉంచిన తలుపు పిడి పక్కటెముకల్లో గుచ్చుకుని కలుక్కుమంది ఒక్కసారి. ఇవాన్ వెంఠనే లేచి నుంచుని దెబ్బ తగిలిన చోట చేత్తో రుద్దుకున్నాడు. మర్నాడూ, ఆ పై రోజూ ఏదో ముట్టుకుంటే కొంచెం నెప్పి అనిపించినా మొత్తానికి దాని గురించి పెద్దగా ఆలోచించవల్సిన అవసరం రాలేదు. మూడు రోజులు పోయాక అన్ని పనులూ సరిగ్గా జరుగుతున్నందుకూ, కొత్త ఉద్యోగానికీ అందులో వచ్చే జీతానికి అన్నింటినీ కలుపుకుని చూసుకుని ఇవాన్ సంతోషంగా తన డైరీలో రాసుకున్న విషయం ‘నేను జీవితంలో పదిహేనేళ్ళు చిన్నవాడినైపోయినట్టుగా ఉంది.’
ఇల్లు పూర్తిగా సిద్ధం అయ్యాక అందర్నీ రమ్మని ఉత్తరం రాసి ప్రస్కోవ్యా, పిల్లల్నీ తీసుకురావడానికి ఇవాన్ రైల్వేస్టేషన్‌కి వెళ్ళాడు. వచ్చిన వాళ్ళందరికీ పనివాళ్ళు ఎలా చేసిందీ, వాళ్ళని తాను ఎలా సరి దిద్దిందీ, అన్నీ చూపించాడు ఇవాన్ ఇల్లంతా కలియతిప్పుతూ. ఆఖరికి తాను నిచ్చెన మీద నుంచి కిందపడి ఎలా దెబ్బ తగిలించుకున్నాడో కూడా చెప్పేడు. చెప్పినది విని పెళ్ళాం పిల్లలూ కళ్ళూ విప్పార్చుకుని ‘ఆహా, ఓహో’ అంటే ఇవాన్ పొంగిపోయి సంతోషపడ్డాడు. సాయిత్రం టీ తాగుతూంటే ప్రస్కోవ్యా అడిగింది ఇవాన్ కింద పడడం, దాని వల్ల తగిలిన పక్కటెముకల్లో దెబ్బ సంగతీ, అసలు ఎలా కింద పడ్డాడూ అనేవి. “ఓ అదా! ముట్టుకుంటే, ఇదిగో ఇక్కడ కాస్త నెప్పి అనిపిస్తోంది, ఇప్పటికే తగ్గిపోయిందనుకో. అయినా ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు నన్నేం చేయగలవు, నేను ఓ రకంగా మంచి ఆటగాణ్ణి గదా స్కూల్లోనూ, కాలేజీలోను కూడా? నా బదులు మరొకరికి ఈ దెబ్బ తగిలి ఉంటే ప్రాణం మీదకి వచ్చి ఉండేది కాదూ?” ఇవాన్ చెప్పేడు తనకి తగిలినది పెద్ద పట్టించుకునేంత దెబ్బ కాదన్నట్టూ.
ప్రస్కోవ్యా వచ్చాక ఇంటికి మరికొన్ని మార్పులు; ఫలానా వస్తువు ఇక్కడ మాత్రమే ఉండాలి. మరొకటి ఇక్కడ ఉండకూడదు, ఇంకొకటి మరీ పాతదైపోయింది కొత్తది కొనాలి, ఈ పాత వస్తువు మరోచోట ఉండి తీరాల్సిందే. అలా ఏదైతేనేం, ఈ విషయాల్లో దెబ్బలాటలూ, అరుపులూ, కేకలూ లేకుండా ఇవాన్ బండి లాక్కొచ్చాడు. అంతా సర్దుకున్నాక చేయడానికి ఇంకేముంది? పొద్దుటే లేచి కాఫీ తాగి ఆఫీసుకెళ్ళడం, అక్కడ తీరిక లేకుండా పని. సాయంత్రం కొత్త స్నేహితులూ పేకాటతో అప్పుడప్పుడూ జీవితం బాగానే ఉంటోంది కూడా. దేనికీ కొరతనేదే లేదు. ఇన్నేళ్ళలో ఇవాన్ నేర్చుకున్న పాఠం ఆఫీసు విషయాలూ, ఇంటి విషయాలూ ఎప్పుడూ ఒకదానికొకటి కలవకుండా చూసుకోవడం. పాత జీవితంలో దెబ్బలాటలు మనసులో ఎప్పటికీ ముల్లులా మెదుల్తూనే ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇవాన్ ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాట్టం, అవసరం లేనిచోట మాట్లాడకపోవడం అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడైనా రాత్రి భోజనం అయ్యేక ఎవరైనా స్నేహితులొస్తే వాళ్ళతో కబుర్లు, లేకపోతే ఏదో పుస్తకం చదవడం, మర్నాటిక్కావాల్సిన కోర్టు కాగితాలు చూసుకోవడం. రోజులు చీకూ చింతా లేకుండా గడిచిపోతున్నాయ్. అమ్మాయి పెద్దదవుతోంది కనక కొంతమంది అబ్బాయిలు దానికూడా తిరగడం ఇవాన్, ప్రస్కోవ్యా గమనిస్తూనే ఉన్నారు. ఆఖరి కుర్రాడు స్కూల్లో ఉన్న తన లెక్కలతోనో, వాడికి కుదిర్చిన మేష్టారితోనో పాఠాలు కుస్తీ పడుతున్నాడు అందరి పిల్లల్లాగానే.
ఓ సారి ఇవాన్ తెలుసున్న అందర్నీ పిలిచి డేన్స్ పార్టీ ఇచ్చేడు ఇంట్లో. అన్నీ అద్భుతంగా జరుగుతున్నై అనుకునేంతలో ప్రస్కోవ్యా ఇవాన్‌తో దెబ్బలాట వేసుకుంది- వచ్చిన అతిథుల కోసం కొన్న కేకుల గురించీ మిగతా తిండి గురించీను. ‘ఆవిడ బయట నుంచి తెప్పించినవి బాగోలేవని ఇవాన్ మరో నలభై అయిదు రూబుళ్ళు ఖర్చుపెట్టి మరికొన్ని కేకులు కొన్నాడుట, అవి పార్టీలో ఎవరూ తినలేదనీ, మిగిలిపోయాయనీ వాటి కోసం అంత డబ్బు తగలేయడం ఎందుకని’ ఆవిడ వాదన. చిలికి చిలికి గాలివాన అయినట్టూ ఇక్కడ మొదలైన గొడవ వెనక్కి వెనక్కి పెళ్ళి అయిన రోజుదాకా వెళ్ళి ఒకరి గొంతు ఒకరు పట్టుకునేదాకా వచ్చింది. ‘నువ్వో పనికిరాని వెధవ్వి’ అని ఆవిడ తేల్చి చెప్పేసరికి ఇవాన్ తలపట్టుకుని ఇంక విడాకులే శరణ్యం అనుకున్నాడు ఆ రోజు. పార్టీలో తాను సంతోషంగా ఉన్నాడనుకున్న పది నిమిషాలూ ఆవిరై పోవడానికి ఒక్క క్షణం కూడా పట్టలేదంటే అదంతా ఆ రోజు ఇవాన్ మీద వీరవిహారం చేసిన ప్రస్కోవ్యా నోటి ప్రతిష్టే. ఈ గొడవ ఎలా ఉన్నా, ఏమైనా డాన్స్ పార్టీ మాత్రం బాగా జరిగినట్టూ చెప్పుకోవాల్సిందే. ఇవాన్ సమాజంలో బాగా పేరున్న ఒకావిడతో డాన్స్ చేశాడు సంతోషంగానే.
ఆ తర్వాతి రోజుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మరో వారం గడిచింది. ఇవాన్‌ది ఏ తప్పు ఉన్నా లేకపోయినా ఆవిడ పూర్వంలా కోపంతో మాట్లాడకుండా చేతిలో వస్తువు విసిరి విరగ్గొట్టడం, అది ఇవాన్ పట్టించుకోకపోతే ఆవిడ కోపం చూపించడానికి మరోలా ప్రయత్నం చేయడం; ఈ తతంగం చూశాక ఆవిడ ఎప్పుడైతే తానున్న గదిలోకి రాబోయిందో వెంఠనే ఇవాన్ లేచి మరో గదిలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఇది గమనించింది కాబోలు, ఆవిడ కూడా ఇదే పద్ధతిలో ఇవాన్ గదిలోకి వస్తే తాను బయటకి వెళ్ళిపోవడం సాగించింది. రోజులకొద్దీ ఒకరి మీద ఒకరికి పెరిగే విపరీతమైన అసహ్యం; ఈయనంతే మారడు అని ఆవిడనుకుంటే, ఆవిడకు ఎందుకు కోపమో ఇవాన్‌కి అంతుబట్టక పోవడం.
మామూలు రోజుల్లో ఆఫీసులో ఏం జరిగినా సాయంత్రం అయ్యేసరికి నలుగురితో పేకాట ఆడ్డానికి మాత్రం మంచి ఉత్సాహం ఇవాన్‌కి. తక్కువమందితో ఆడితే ముక్కలు సరిగ్గా రావడం అటుంచి ఆట సరిగ్గా పసందుగా ఉండటం లేదు. ఏ రోజైనా పేకాట ఆడినందుకు కొంచెం సంతోషమే, అయితే అందులో నెగ్గి డబ్బులొస్తే ఆ రోజు రాత్రి మంచం ఎక్కేముందు మరి కాస్త సంతోషం. ఎప్పుడైనా ఏ విషయంలో దెబ్బలాటలొచ్చినా స్నేహితులని మాత్రం కలిసి ఎంచుకోవడం ఇవాన్‌కీ ప్రస్కోవ్యాకీ బాగానే అలవాటైంది. సమాజంలో పై తరగతి జనాలతో స్నేహాలు పెంచుకుంటూ తమకి పనికిరాని వాళ్ళని క్రమంగా తగ్గించుకున్నారు ఇద్దరూను.
జీవితం గడిచిపోతోంది. ఆ గడిచేది సంతోషంగానేనా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే, ప్రస్కోవ్యా నోటి దురుసు లేనినాడు కాస్త ప్రశాంతత. ఏ రోజైనా ఆవిడ నోరు విప్పితే ఆ రోజు నుంచి మరో పదీ పదిహేను రోజులు నరకం. ఈ రకంగా జరిగే రోజుల్లో, పెద్దగా మిగతా మార్పులేవీ లేవు ఇవాన్ జీవితంలో.