సైజు

నేను ఇండియన్ ఆర్మీలో జవాన్‌గా చేరిన అయిదారేళ్ళకనుకుంటా డెహ్రాడూన్‌లో వేసేరు డ్యూటీ. అప్పటికి కెప్టెన్ అయిన నేను కొత్తగా వచ్చే జూనియర్ కేడెట్ కుర్రాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, సీనియర్లు వీళ్ళని సరదాగా ఏడిపిస్తూంటే అడ్డుకోవడం లాంటి పనులు చేస్తూండేవాణ్ణి. డెహ్రాడూన్‌లో ఉన్న అయిదేళ్ళలో ఆరేసి నెలలకోసారి కొత్త కుర్రాళ్ళ బాచ్ దిగుతూ ఉండేది. టేప్ రికార్డర్‌లో రివైండ్–ప్లే బాక్ అన్నట్టు ఉండేది నా పని. అయినా చేసేది ఆర్మీ ఉద్యోగం కనక ఎప్పుడూ బోరు కొట్టడం కానీ చికాకు కానీ ఉండేది కాదు. ప్రతీ బాచ్ ఒక ఛాలంజ్, ప్రతీ కుర్రాడూ రాబోయే రోజుల్లో కాబోయే ఆర్మీ సీనియర్ కనక అందరూ కలిసే ఉండేవారు.

ఆ రోజుల్లో నాకు బాగా తెలిసిన పేరు జగదీశ్ సింగ్. పంజాబ్ నుంచి ఆర్మీలో జేరడానికొచ్చే సర్దార్‌లలో ప్రతీ ఒక్కడూ ఆరడుగుల ఎత్తుతో, మాంఛి శరీర పుష్టి ఉన్నవాళ్ళే కానీ జగదీశ్ సింగ్ అలా కాదు. దాదాపు అయిదడుగుల నాలుగంగళాలు ఎత్తుతో ఊదితే ఎగిరిపోయేలా ఉండేవాడు. అసలు మొదట్లో ఈ సింగ్‌ని ఎవరు సెలక్ట్ చేశారా అనే అనుమానం వచ్చింది కానీ సెలెక్ట్ చేసినాయన ఆయన పని ఆయన చేశాడు కనక నేనూ నా స్టాఫ్ ఎవరూ నోరెత్తడానికి లేదు. అలా జగదీశ్ సింగ్ రెండేళ్ళు నాతో డెహ్రాడూన్‌లోనే ఉండిపోయేడు.

కొత్తలో ఇచ్చే ఆర్మీ ట్రైనింగ్‌లో జగదీశ్ సింగ్ సరిగ్గా ఇది చేయలేదనీ, అది చేయలేదనీ రిపోర్ట్‌లు వచ్చేవి. ఎంతైనా కుర్రాడు కదా మరో ఛాన్స్ మరో ఛాన్స్ అనుకుంటూ అందరూ ఆరునెలల్లో పూర్తి చేసే ట్రైనింగ్ జగదీశ్ సింగ్ ఎనిమిదీ తొమ్మిది నెలలు చేశాడు. ఆ తర్వాత ఆర్మీ ఏమనుకుందో తెలియదు కానీ జగదీశ్ సింగ్‌ని ఇండియన్ మిలిటరీ అకాడెమీలో చిన్న ఉద్యోగంలో వేశారు. గేట్ లోపలనుంచి వెళ్ళేవాళ్ళని తనిఖీ చేయడం, మిగతా సమయంలో ఏదో చిన్నపాటి చదువూ, ఆ తర్వాత ఎప్పటిలాగానే బస్కీలు తీయడం అవీ. ఏ కుర్రాడైనా ఆర్మీలో జేరిన రెండేళ్ళలో కండ పుష్టి పట్టి, మొహంలో తేజస్సు ఉట్టిపడుతూ బయటకొస్తాడు. కానీ ఆర్మీలో జేరిన రెండేళ్ళకి కూడా జగదీశ్ సింగ్ జేరినప్పటిలాగానే ఉన్నాడు, కొంత కండబట్టినా. మహా అయితే ఓ నాలుగు కేజీలు బరువు పెరిగి ఉండొచ్చు. అయితే జగదీశ్ సింగ్‌ను ఏడిపించడం అనేది సర్వసాధారణం అయిపోయింది మిగతా ట్రైనీలకి.

జేరిన కొత్తలో జగదీశ్ సింగ్ కేసి చూసి, మనీశ్ అనే ఓ అస్సాం కుర్రాడు, సింగ్ ఎత్తు ఎంతో అడిగి పేంట్ కేసి చూపిస్తూ, ‘సైజు ముఖ్యం తమ్ముడూ, ఇది ఇండియన్ ఆర్మీ!’ అన్నాడని బాగా ప్రచారం అయింది ఆ రోజుల్లో. మనీశ్ అలా అన్నందుకు సింగ్ నొచ్చుకున్నా తర్వాత స్పోర్టివ్‌గా తీసుకుని మర్చిపోయాడని చెప్పుకున్నారు. అయితే ఆ మనీశ్ డైలాగ్ మాత్రం ఎవరూ చాలాకాలం మర్చిపోలేదు. జగదీశ్ సింగ్ ఎక్కడ కనిపించినా ‘సైజు ముఖ్యం, ఇది ఆర్మీ!’ అని ఏడిపించడం మొదలైంది. బయట బాహాటంగా అన్నా, లోపల బారాక్స్‌లో జరిగేది మరింత కష్టంగా ఉండేది జగదీశ్ సింగ్‌కి అని చెప్పుకునేవారు. పేంట్ విప్పించి మరీ ‘సైజు ముఖ్యం తమ్ముడూ, ఇది ఇండియన్ ఆర్మీ!’ అని ఏడిపించేవార్ట. అయితే సింగ్ మాత్రం ఎవరి దగ్గిరా కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. ఏ కంప్లైంట్ రాకపోతే ఆర్మీ మాత్రం ఏం చేస్తుంది?

అక్కడకీ, కెప్టెన్‌గా ఉన్న నేను కూడా పక్కకి తీసుకెళ్ళి అడిగాను సింగ్‌ని చాలాసార్లు, అన్నీ సరిగ్గా ఉన్నాయా, ఎవరైనా తనని ఏడిపిస్తున్నారా, ఏదైనా కంప్లైంట్ ఉందా? అని. దేనికీ సమాధానం వచ్చేది కాదు, ‘అంతా బాగానే ఉంది’ అనడం తప్ప. కొంతకాలం అడిగి అడిగి నేనూ ఊరుకున్నాను.

ఆ తర్వాత రెండేళ్ళకి జగదీశ్ సింగ్‌కి ఔరంగాబాద్ ఆర్మీ క్లర్క్ స్కూల్‌కి బదిలీ అయింది. క్లర్క్‌ల స్కూల్ అంటే ఆఫీసులో చేసే పనికేమో అనుకున్నా. కానీ నాకు పూర్తిగా తెలియలేదు; తెలుసుకోవాల్సిన అవసరమూ రాలేదు. ఆ తర్వాత జగదీశ్ సింగ్ గురించి మరేమీ తెలియలేదు. ఎప్పుడైనా ఔరంగాబాద్ నుంచి ఎవరైనా డెహ్రాడూన్ వస్తే అడిగేవాణ్ణి జగదీశ్ సింగ్ గురించి. ఏమీ సమాచారం దొరకలేదు. అయినా నా పిచ్చిగానీ ఆర్మీలో ఉన్న వేలమంది సర్దార్‌లలో జగదీశ్ సింగ్ అనే ఒక సర్దార్‌ని గుర్తుపెట్టుకోవడం ఎవరి తరం? కానీ ఎవరైనా పొట్టిగా ఉన్నవాడు ఆర్మీలో చేరితే మాత్రం ‘సైజు ముఖ్యం తమ్ముడూ, ఇది ఇండియన్ ఆర్మీ!’ అని ఒకరికొకరు చెప్పుకుంటూ నవ్వుకునేవాళ్ళం. జగదీశ్ సింగ్‌ని మర్చిపోయినా డైలాగ్ మాత్రం మర్చిపోలేదు కొంతకాలం వరకూ. అలా సింగ్ మెల్లిగా నా జీవితంలోంచి కనుమరుగయ్యేడు.

తర్వాత ఈ ఇరవై అయిదేళ్ళలో నేను దాదాపు రిటైర్మెంట్ దగ్గిర్లోకి రావడంతో నన్ను ఫీల్డ్ ఆర్మీలోంచి తీసేసి చంఢీగర్ దగ్గిర్లోనే పాంచ్ కులా దగ్గిర ఆర్మీ హాస్పిటల్లో ఆఫీసు కాయితాలు చూసే పనిలో వేశారు. అదీ నేను ఒప్పుకుని కాయితాలు పెట్టుకున్నాకే–వయసైపోతోందనీ, ఒకచోట కూర్చుని చేసే పని చూపించమనీ అడిగితే.

ఎప్పటిలాగానే రాజకీయాలు, ఇండియా బోర్డర్‌లో గొడవలు జరుగుతూనే ఉన్నయ్. జవాన్లు కొంతమంది చచ్చిపోతున్నారు. కొంతమందికి కాళ్ళో చేతులో పోయి మా హాస్పిటల్లో తేల్తున్నారు. వీళ్ళందరికీ కాయితాలు చూడ్డం నా పని, వాళ్ళు హాస్పిటల్లో జేరినప్పటినుంచి విడుదలై మళ్ళీ ఇంటికెళ్ళేదాకా. ఈ గొడవల్లో ఓ రోజు కొత్త బాచ్ వచ్చి చేరింది హాస్పిటల్లో. రాత్రికి రాత్రి హఠాత్తుగా జగిరిన దాడుల్లో ఓ పెద్ద ఆర్మీ ఆఫీసర్, కల్నల్ హజారికా, అతనితో పాటు కొంతమందికి చావుదెబ్బలు తగిలాయి. వంటినిండా కట్లతో అసలు ఎవరు ఎవరో పోల్చుకోలేకుండా ఉన్నారు వచ్చిన ఆర్మీ జవాన్లు. ఎమర్జన్సీ ప్రాతిపదికన అందరికీ ట్రీట్‌మెంట్ ఇవ్వడం అయింది. పోయినవాళ్ళని వాళ్ళ కుటుంబాలకి అప్పగించి మిగతావాళ్ళని మామూలు వార్డులలోకి మార్చారు. వీళ్ళకి మరో ఆరేడు నెలలు పట్టొచ్చు జీవితం మామూలుగా అవ్వడానికి. రోజూ ట్రీట్‌మెంట్ అయ్యేక దాదాపు సాయంత్రం కావొస్తూంటే నేను ఒక్కో ఆర్మీ ఆఫీసర్, జవాన్ దగ్గిరకీ వెళ్ళి సమాచారం సేకరించాలి. హాస్పిటల్లో అంతా బాగుందా, ఏవైనా లోపాలు జరుగుతున్నాయా, తిండీ నిద్రా సరిపోతోందా అనేవి. అంతా రొటీన్ వర్క్. ఇలా అడుగుతూంటే సమాధానాలకి కోపంతో కొంతమంది అరుస్తారు, కొంతమంది బాగానే ఉన్నా అన్నీ చెప్పరు. ప్రాణం పోయే స్టేజ్ లోంచి బయటకొచ్చి హాస్పిటల్లో చేరి కాలో చేయో పోయినవాడి దగ్గిరనుంచి మామూలు సమాధానాలు ఆశించలేం కదా?

అలా ఓ రోజు కల్నల్ హజారికా దగ్గిరకి వెళ్ళవల్సి వచ్చింది. దాదాపు చనిపోతాడనుకున్న కల్నల్ హజారికా ఈ మధ్యనే సర్జరీ లోంచి బయటకొచ్చాడు. నేను ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఒక డాక్టర్‌ లోపలకొచ్చాడు. పంజాబ్ సర్దారే ఈయన కూడా; కళ్ళజోడు పెట్టుకుని తలపాగా, ఆర్మీ డ్రెస్‌లో మంచి హుందాగా ఉన్నాడు. హజారికా తలలో దిగబడిన బాంబ్ ముక్కలూ, గాజు పెంకులూ తీసి ప్రాణంపోసిన న్యూరోసర్జన్ అని తెల్సింది. వస్తూనే హజారికాని పలకరించి అక్కడే కూర్చుని అడిగేడు, “ఎలా ఉందిప్పుడు?”

“ఫర్వాలేదు డాక్టర్, అప్పుడప్పుడూ తలనెప్పి వస్తోంది. ఒక్కోసారి భారీగా; ఏం చేయాలి?”

“కల్నల్ హజారికా, మీరు బతుకుతారని ఎవరూ నమ్మలేదు. మిమ్మల్ని సర్జరీలోకి తీసుకొచ్చినప్పుడు, దాదాపు అరవై, డెబ్భై గాజు ముక్కలు మీ తలలో ఉన్నయ్. అవి తీయడానికి ఎనిమిది గంటల సర్జరీ అవసరం అయింది. ఈ తలనెప్పీ అదీ కొన్నాళ్ళకి సర్దుకుంటుంది. మీకు జరిగిన ప్రమాదంతో పోలిస్తే ఈ నెప్పి ఓ లెక్కలోకి రాదు. మొదట్లో కొన్ని మందులూ, ఆ తర్వాత కొంతకాలం ఫిజియో థెరపీ అవసరం అవుతుంది. అసలు ఏ అవయవాలూ చచ్చుపడిపోకుండా మీరు బతకడమే ఓ అద్భుతం.”

డాక్టర్ మాటల్లో ‘నేను, సర్జరీ చేసి, మిమ్మల్ని, బతికించాను’ అనే పదాలు వాడకపోవడం గమనించి ఆయన నిగర్వానికి నేను లోలోపలే సర్జన్‌ని మెచ్చుకున్నాను. నా మటుక్కి నాకు ఇటువంటి సర్జన్‌ని కలుసుకోవడం మంచి సంతోషాన్నిచ్చింది. అసందర్భపు ప్రశ్నలా అడిగేను వీళ్ళ మాటల మధ్యలో సందు చూసుకుని, “డాక్టర్ న్యూరోసర్జరీలో మీరెక్కడ చదువుకున్నారు?” కల్నల్ కూడా కాస్త ఇంటరెస్ట్ చూపించాడు ఈ కబుర్లలో; అస్తమానూ హెల్త్ గొడవలతో హాస్పిటల్ కబుర్లు తలనెప్పి కనక.

“ఆర్మీ సెంటర్లో బేసిక్ ట్రైనింగ్, అక్కడ్నుంచి అనేకానేక ఆర్మీ బేస్‌లలో తిరిగాక, చదువులో ఇంటరెస్ట్ చూసి పటియాలాలో మెడికల్ కాలేజ్‌కి స్పాన్సర్ చేస్తామన్నారు. నేను చదువుకున్నది అక్కడే. ఆ తర్వాత మిగతా ఆర్మీ హాస్పిటళ్ళలో సీనియర్ సర్జన్‌ల దగ్గిర్నుంచి నేర్చున్నదే, నాకు తెలిసినదంతా. ఇదంతా ఆర్మీ పెట్టిన భిక్షే,” క్లుప్తంగా చెప్పేడు సర్జన్. మళ్ళీ అదే నిగర్వం మాటల్లో.

నేనూ కల్నల్ ఇది విని నోర్లు వెళ్ళబెట్టాక ఆయనే చెప్పేడు కల్నల్‌తో, “మీకు ఇంత పెద్ద ఆపరేషన్ జరగడం వల్ల మొదట్లో మనుషులని గుర్తుపట్టడం, పాత విషయాలు గుర్తురావడం అదీ కొంత కష్టం కావొచ్చు, అంతా మెల్లిగా సర్దుకుంటుంది.”

నన్ను చూపిస్తూ, చిన్న నవ్వుతో కల్నల్ అన్నాడు, “ఆ విషయంలో కాస్త బాగానే ఉన్నట్టుంది, మనుషులని గుర్తుపట్టగలుగుతున్నాను. ఇప్పుడు ఈయన్నీ, సర్జన్ అయిన మిమ్మల్నీ గుర్తుపట్టగలుగుతున్నా కదా?”

“సంతోషం, నన్ను గుర్తుపట్టారా?” మా ఇద్దరికేసీ చూసిన సర్జన్ మొహంలో చిన్నపాటి నవ్వు.

కాసేపు నేనూ, కల్నల్, సర్జన్ కేసి పరీక్షగా చూసాం. ఏమీ గుర్తురాలేదు.

“మాఫ్ కీజీయే, నా బుర్ర అంత దూరం పనిచేయకపోవచ్చు. ఇంతకు ముందు మనం కలిసి పనిచేశామా? ప్రస్తుతానికి మీరు సర్జన్ అని చెప్పగలను అంతే.” కల్నల్ చెప్పుకున్నాడు తన గురించి.

“మరి మీరో?” నాకేసి చూసి అడిగేడు సర్జన్.

“నేనా? మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టే లేదు,” నేను నా అజ్ఞానం చూపించాను.

“మొదట్లో నేను డెహ్రాడూన్‌లో చేరినప్పుడు నాకు ట్రైనింగ్ ఇచ్చిన కెప్టెన్ మీరే. కల్నల్ మనీశ్ హజారికా ఆ రోజుల్లో నన్ను, ‘సైజ్ ముఖ్యం తమ్ముడూ, ఇది ఆర్మీ!’ అని సరదాగా ఏడిపించేవారు గుర్తుందా?” సర్జన్ పెదాల మీద చెరగని చిరునవ్వు.

గుర్తొచ్చిందో లేదో కానీ కల్నల్ మనీశ్ హజారికా మంచం మీదనుంచే నీరసంగా నవ్వేడు. నేను దాదాపు నోరు వెళ్ళబెట్టాను ఒక్కసారి బుర్రలో బల్బు వెలిగినట్టై. ఈ కల్నల్ హజారికా ఆ రోజుల్లో జగదీశ్ సింగ్‌కి పేరు పెట్టి ఏడిపించిన అస్సాం కుర్రాడు మనీశ్! బక్క పలచగా, ఊదితే పడిపోయేలా ఉండి ఆరునెలల ఆర్మీ ట్రెనింగ్ ఎనిమిదీ, తొమ్మిది నెలలు చేసిన ఒకప్పటి జగదీశ్ సింగ్, ఇప్పుడు–మొదట్లో తనని ఏడిపించిన ఆర్మీ జవాన్‌కి–ఆపరేషన్ చేసి కాపాడిన ఆర్మీ న్యూరో సర్జన్! ఆ రోజుల్లో ఆర్మీ ఈ పొట్టివాణ్ణి ఎలా సెలెక్ట్ చేసిందా అని బుర్రలు బద్దలు కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు తెలుస్తోంది ఆర్మీ చేసిన సెలక్షన్ ఎటువంటిదో.

“మీరు నన్ను సరదాగా ఏడిపించడం మొదలు పెట్టాక ఆర్మీలో నేను నేర్చున్నది ఇదే. సైజు అనేది తప్పకుండా ముఖ్యమే, అయితే దీని సైజ్ మరింత ముఖ్యం,” తన ఛాతీ మీదా, గుండె మీదా చేయి వేసి చూపిస్తూ వెళ్ళడానికి లేస్తూ అదే నవ్వుతో చెప్పేడు డెహ్రాడూన్ మిలిటరీ హాస్పిటల్ నుంచి కల్నల్ హజారికా సర్జరీ కోసం ప్రత్యేకంగా వచ్చిన ఆర్మీ స్పెషలిస్ట్ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీశ్ సింగ్.