సింహాద్రి ఎక్స్‌ప్రెస్ తునిలో ఆగింది, యధాప్రకారం లేటుగా వచ్చి. ఏ కలకత్తా అంత దూరం నుంచి వచ్చే బండి లేటంటే ఏదో అర్ధం చేసుకొవచ్చు కానీ విశాఖపట్నం నుండి వచ్చేదీ లేటే? ఏవిటో ఈ ఇండియన్ రైల్వేస్ అంతా అయోమయం. డి.వి. లూ ఉరఫ్ దామెర్ల వెంకటేశ్వర్లు ప్లాట్‌ఫామ్ మీదకి దిగేడు. రూల్ ప్రకారం పది నిముషాలు హాల్టు కానీ ఈ బండి కదిలేసరికి ఒక మహాయుగం గడుస్తుంది ఒక్కే స్టేషన్ లోనూ. లేట్ ఎందుకవ్వదూ?
అలా గాలి పీల్చి, ఓ టీ తాగి బండి కదిలే లోపు వెనక్కొచ్చేడు డి.వి. లూ. వచ్చేసరికి తన సీట్లో ఓ పదీ పన్నెండేళ్ళ పిల్ల, ఆ పాప నాన్న కాబోలు కూర్చునున్నారు. లూని చూసి ఒక మొహమాటం నవ్వు నవ్వి – “ఇదిగో ఇక్కడకే. కొవ్వూరు రాగానే దిగిపోతాం,” అని సంజాయిషీ ఇచ్చేడు పెద్దాయన.
“ఫర్లేదు కూర్చోండి. మనం అందరం సర్దుకోవచ్చు,” అని ఓ మూలకి ఒదిగి కూర్చున్నాడు తను చదివే ఇంజినీరింగ్ కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ అలా ముద్దుగా పిల్చుకునే మిస్టర్ లూ.
“ఎక్కడిదాకా బాబూ?” బండి కదిలేక పెద్దాయన మొదలెట్టేడు.
“రాజమండ్రీ,” చెప్పేడు లూ.
“చూడబోతే వైజాగ్ నుంచి వస్తున్నట్టున్నావు, ఏం చేస్తూ ఉంటావ్?” ఈయనకివన్నీ ఎందుకో?
“చదూకుంటున్నానండి,”
“కెమికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం.” మళ్ళీ ఏమిటి ఎక్కడ అని ఎలాగా అడుగుతాడు కనక ముందే చెప్పేశాడు. విన్నాడో లేదో గానీ, “ఈ బండి పిఠాపురంలో ఎంతసేపు ఆగుతుందో?” అన్నాడు పక్కనున్న పాపతో.
“ఫర్లేదు నాన్నా. ఐదూ పది నిముషాలు ఆగినా ఆయన వచ్చేస్తారు.” పాప అనడం విన్నాడు లూ.
పిఠాపురంలో బండి ఆగ్గానే పెద్దాయన పరిగెట్టుకుంటూ గుమ్మం దగ్గిరకెళ్ళేడు ఎవర్నో రిసీవ్ చేసుకోవాలేమో. రెండు నిముషాల్లో ఇంకో పెద్దాయన్ని వెంటబెట్టుకొచ్చేడు.
“కూర్చోండి, ఈ కుర్రాడు రాజమండ్రీ దాకానే, మనం మనం సర్దుకోవచ్చు,” అని ఆయనకి చోటు చూపించేడు.
వచ్చినాయన మొహమ్మీద విభూది రేఖలూ చేతిలో పంచాంగం, సరంజామా అది తెచ్చాడు. ఎవరో సిద్ధాంతి కాబోలు. బండి కదుల్తూనే ఇద్దరూ కబుర్లలో పడ్డారు. లూ కిటికీలోంచి చూస్తూ ఓ చెవి ఇటు పారేసి వింటున్నాడు. సిద్ధాంతి వచ్చేక సీట్ల మార్పిడీ, సర్దుబాట్లలో ఇప్పుడు లూ కి ఎదురుగా కూర్చున్న పాప వచ్చే పోయే వాళ్ళకేసి చూస్తోంది; అప్పుడప్పుడూ కిటికీ లోంచీను.
“ఇప్పుడు పాపకి పన్నిండేళ్ళా?” సిద్దాంతిగారు అడుగుతున్నాడు.
“అవును. ఇదిగో జాతక చక్రం తెచ్చాను. కొవ్వూర్లో దిగేలోపల చూసెయ్యగలరా? నేను ఎప్పుడో చూశాననుకోండి, మీరు చూడ్డం వేరూ, తండ్రిగా నేను చూడ్డం వేరూ” తండ్రి అడుగుతున్నాడు. ఈయనా సిద్ధాంతే కాబోలు.
“ఈ బండి ఎలాగా లేట్ అవుతుంది; దీన్ని సామర్లకోటలో తొక్కేసి ఏ కోణార్క, ఈస్టుకోస్టు లాంటి పెద్ద బండినో పంపించారనుకోండి, మనకే మంచిది.” జాతకం అందుకుంటూ చెప్పేరు సిద్ధాంతి.
లూకి అప్పటికే బోరు కొట్టడం మొదలైంది ఈ జాతకాలతో. ఇరవై నిముషాలు గడిచేక సిద్ధాంతి గారు నోరు విప్పేడు.
“ఇప్పుడు ఏలినాటి శని నాలుగో సంవత్సరం జరుగుతోంది. ఈ పాటికి పాపకి ఏదో ఏక్సిడెంట్ అయ్యుండాలే?” సిద్ధాంతి అన్నాడు. లూ పాప కేసి చురుగ్గా చూశాడు ఏదైనా కాలో చెయ్యో విరిగిందేమో అని. అటువంటిదేమీ కనబళ్ళేదు.
“లేదే? ఏలినాటి శని నిజమే గానీ పాపది తులా లగ్నం కదా?” సాలోచనగా అన్నాడు తండ్రి.
ఏదో అనబోయి మళ్ళీ జాతకం చూడ్డం మొదలుపెట్టాడు సిద్ధాంతి గారు. సామర్లకోట వచ్చింది. పెద్దాయన కాఫీ ఇప్పించేడు సిద్ధాంతి గారికి. ఎక్కే దిగే జనాల్ని పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ పాప జాతకంలో లీనమై ఉన్నారు. పాప కొంచెం చిరాకుగా ఉన్నట్టు గమనించేడు లూ. బండి కదిలి అనపర్తి వచ్చేసరికి సిద్ధాంతి గారు కాయితాలు మూసేసి చెప్పడం మొదలు పెట్టేరు.
“నేను చూడ్డం అయిపోయింది. మీ పాపకి పంథొమ్మిదో ఏట పెళ్ళౌతుంది. కానీ ద్వితీయ కళత్రం గేరంటీ.”
ఒక్కసారి పక్కలో బాంబు పడ్డట్టూ అదిరిపడ్డాడు తండ్రి. పాపకి అర్ధం అయిందో లేదో కానీ లూ వీళ్ళకేసి చూసేడు. ఆ చూపులకి ఏదైనా మహాత్యం ఉంటే సిద్ధాంతి భస్మం అయిపోయి ఉండేవాడు.
“నేను చూశానండీ, ఎక్కడా నాకు అలా అనిపించలేదే?” తండ్రి అడుగుతున్నాడు ఏదో పెద్ద ఆపద ఆల్రెడీ పాప మీద పడిపోయినట్టూ. గొంతుకలో మునుపున్న జీవం ఇప్పుడు లేదు.
“మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటులో పనిచేస్తూ కాలక్షేపానికి చూస్తారు జాతకాలు. నేనైతే పొద్దున్నించి సాయంకాలం దాకా ఇదే పని. ఇరవయ్యో ఏట మీ పాపకి ఈ మహాదశ ప్రారంభం అవుతోంది. ఇది మొదలయ్యే లోపుల పెళ్ళి జరిగి తీరుతుంది. కానీ ఆ మహాదశ మొదలౌగానే రెండేళ్ళలో ద్వితీయ కళత్రం స్పష్టంగా కనిపిస్తూంటే!”
తండ్రి కాస్త ముందుకు జరిగి సిద్దాంతిగారు చూపించిన జాతకంలో మహాదశా అదీ చూస్తున్నాడు. మళ్ళీ ఇద్దరూ ఈ మహాదశలో ఏం జరుగుతుందీ, ఎలా, ఎక్కడ జరుగుతుందీ, అలా ఇంతకు ముందు ఎవరికైనా జరిగిందా అనేవి వాదించుకుంటూన్నారు.
బండి అనపర్తి వదిలి మెల్లిగా కదల్డం ప్రారంభించింది. లూ పాపకేసి చూసేడు. ముడుచుకుపోయి ఏమి మాట్లాడాలో మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీనట్టు వాడిపోయి ఉంది. జాలి వేసింది లూకి.
“ఏం చదువుతున్నావమ్మా?” అడిగేడు లూ.
“ఎనిమిదిలోకి వచ్చానండి ఈ ఏడు.”
“నీకు ఏ సబ్జక్ట్ నచ్చుతుంది?”
“సోషల్ స్టడీస్ తప్ప మిగతావన్నీ. మా మేస్టారు సోషల్ సరిగ్గా చెప్పరు. అందుకే నాకు నచ్చదు.”
“తెలుగు వాచకంలో ఏదైనా పద్యాలు గుర్తున్నాయా?”
“ఓ, ఎందుకులేవు? ముప్పున గాల కింకరులు ముంగిట వచ్చినవేళ అనేది వచ్చు నాకు. శ్రీరమ సీతగాక అన్నది కూడా.”
“అవి ఎందులోవో తెలుసా?”
“తెల్సండీ, కంచెర్ల గోపన్న రాసిన దాశరధీ శతకం లోనివి. నా దగ్గిర ఇంట్లో దాశరధీ శతకం ఉంది. అది కూడా నేను చదివాను.”
“మరి సైన్సులో ఏమి గుర్తుంది?” లూ మెచ్చుకోలు కళ్ళతో చూసి అన్నాడు పాపతో.
“కాంతి పరావర్తనం, కణం, రకరకాల మొక్కలూ అనేవి చెప్తున్నారు ఇప్పుడు. మొక్కలంటే మేము ఇంట్లో పెంచే వంటివే. మా ఇంట్లో ఉన్న కరివేపాకు, గోరింటాకు అలాంటివే.”
“పెద్దయ్యాక ఏమౌదామనుకుంటున్నావ్ పాపా?”
“నాకు తెలుగంటే చాలా ఇష్టం. కాలీజీలో తెలుగు చదువుకుని తెలుగు లెక్చరర్ని అవుతాను.”
“ఇంజినీరింగ్, మెడిసిన్ నచ్చదా?” కొంచెం కుతూహలంగా అడిగేడు లూ.
“అందరూ ఇంజినీరింగ్ అంటూ పగలూ రాత్రీ చదువుతున్నారు. మా క్లాస్మేట్లు అందరూ మా అమ్మ చదవమంది, మా నాన్న చదవమంటున్నాడు అనడమే. నేను అడిగాను మా ఫ్రెండ్స్‌ని. సగం మందికి ఇంజినీరింగ్ ఇష్టం లేదు కానీ చదువుతాం అంటున్నారు అమ్మా నాన్నా అనడం వల్ల. నాకు తెలుగు లెక్చరర్ అవ్వాలని ఉంది. అమ్మతో చెప్పాను. అమ్మ కూడా సరే అంది.”
సింహాద్రి ఆగింది ఊరి బయట – సిగ్నల్ ఇచ్చినట్టు లేదు. లూ బయటకి చూసేడు. కొంచెం దూరంలో కడియం స్టేషన్ కనిపిస్తోంది. అయితే ఇంకో పది నిముషాల్లో రాజమండ్రియే. పక్కకి చూసేడు కంపార్ట్మెంటు లోకి. సిద్ధాంతిగారూ, పాప నాన్నగారూ ఇంకా పాప జాతకం మీద తర్జన భర్జనలు పడుతున్నారు. పాప మళ్ళీ మొహం వేలాడేసుకుని కూర్చుంది.
పది నిముషాలు గడిచేక మెల్లిగా బండి కదల్టం మొదలైంది. మాట్లాడుతున్న పాప నాన్నగార్ని వారించి లూ అడిగేడు.
“మేష్టారూ, మీరూ, మీ సిద్ధాంతిగారూ ముక్కుపచ్చలారని ఈ పన్నెండేళ్ళ పాప గురించి, పాప ముందే ద్వితీయ కళత్రం అంటూ మాట్లాడ్డానికి మీకిద్దరికీ ఏమీ అనిపించట్లేదా?”
పాప నాన్న కాస్త అపాలెజిటిగ్గా తల వంచుకున్నాడు.
“జాతకంలో ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. అది పైకి అనడంలో తప్పేం ఉంది?” సిద్ధాంతి అడిగేడు లూని. సిద్ధాంతి కేసి ఉరిమినట్టు చూసి చెప్పేడు లూ.
“అవునా? సరే. చూడండీ, మీరెక్కినప్పట్నుంచీ చూస్తున్నాను. ఒక్కసారి కూడా పాప జాతకం బాగుంది అన్న ముక్క మీ నోట్లోంచి రాలేదు ఇప్పటిదాకా. ఇంకో తొమ్మిదీ పదేళ్ళలో ఏమౌతుందో ఎవరూ చెప్పలేరు. నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మొదటి సారి ఎంసెట్ రాస్తే నాకు సీట్ రాలేదు. ఎందుకంటే నేను ఫార్వార్డ్ కేస్ట్ వాడిని. నా జాతకం చూపించేరు మా నాన్న గారు ఎవరికో. అది చూసి ‘వీడికి జన్మలో ఇంజినీరింగ్ సీట్ రాదు, వీడికి కాలీజీలో చదువు కూడా తక్కువే కనక మోటార్ సైకిల్ షాపులో మెకానిక్‌గా చేర్పించండి’ అని చెప్పాడు ఆయన. నేను మా నాన్నగారితో దెబ్బలాడి ఒక ఏడాది గడువు అడిగాను మళ్ళీ ఎం సెట్ రాయడానికి. రెండో సారి సీట్ రాక పోతే అప్పుడు మెకానిక్ దగ్గిర చేరే కండిషన్ మీద ఒప్పుకున్నారు. రెండో సారి నేను ఎంసెట్ టాపర్ని. ఇప్పుడు నేను ఆంధ్రా యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాను. అప్పుడు నా జాతకం చూసిన సిద్ధాంతిగారు మా కుటుంబంలో అందరితోనూ మాట్లాడ్డం మానేశాడు. ఇంక జాతకం సంగతి చెప్పేదేముంది?”
పాప నాన్నగారితో మళ్ళీ ఇలా అన్నాడు లూ.
“మీ పాపతో నేను మాట్లాడేను. నాకు అర్థమైనంతలో మీ పాప బ్రిలియంట్ స్టూడెంట్. తెలుగు లెక్చరర్ అవ్వాలనుకుంటోంది. ఈ జీవితం మనది. మనం ఏమి కావాలనుకుంటే అదే కావొచ్చు. దానికి నేనే పెద్ద ఉదాహరణ అని మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా. కొవ్వూర్లో దిగే లోపున వచ్చే బ్రిడ్జీ మీద నుంచి ఈ జాతకం గోదావర్లో పారేసి పాప మీద శ్రద్ధ పెట్టండి. ఉత్తినే పాప ఎదురుగా ఇలాంటి చెత్తంతా మాట్లాడి ఊదర గొట్టేయకండి. అది నాన్నగారిలా మీ బేసిక్ బాధ్యత. ఇలాంటి చెత్త సంభాషణ మీ పాప మనస్సుని ఎంత డామేజ్ చేస్తుందో మీకు తెలియదా?”
చేష్టలుడిగిపోయి నోరు తెరుచుని వింటున్న శ్రోతలందర్నీ దాటుకుంటూ బేగ్‌తో బయటకి నడిచేడు లూ అప్పుడే రాజమండ్రీలో ఆగిన బండిలోంచి. బండి దిగేక బయటకి వెళ్తూ వెనక్కి తిరిగి చూసేడు తను కూర్చున్న కంపార్ట్ మెంట్ కేసి. పాప తనకేసే చూస్తోంది. పాప నాన్నా, సిద్ధాంతిగారూ ఇంకా షాక్ లోంచి తేరుకున్నారో లేదో. పాప కేసి చూసి చిన్నగా చేయి ఊపేడు. పాప కూడా చేయి ఊపింది. అయితే పాప మొహంలో చిన్నటి నవ్వు క్రమంగా పెద్దదై ఈ చెవి నుంచి ఆ చెవికి వ్యాపించడం చూసి తృప్తిగా బయటకి నడిచేడు వెంకటేశ్వర్లు.