నాయం హంతి న హన్యతే

చక్రవర్తి కావాలనుకుంటున్న ఆసీరియా రాజు ఎసర్‌హాడన్‌కి తలనెప్పిలా తయారైనది పక్కరాజ్యం రాజు లైలీ ఒక్కడే. మిగతా చిన్నచిన్న రాజ్యాలు అన్నీ ఎసర్‌హాడన్‌కి లొంగిపోయినా రాజు లైలీ మాత్రం లొంగకుండా యుద్ధాలు చేస్తూ, ధైర్యంగా ఎసర్‌హాడన్‌ ప్రణాళికలు తిప్పి కొడుతూనే ఉన్నాడు యుద్ధం ప్రకటించినప్పుడల్లా.

పక్కరాజ్యాన్ని ఏదో విధంగా తమ రాజ్యంలో కలుపుకుంటే దాని సంపదతో ఎసర్‌హాడన్‌ చుట్టుపక్కల అడ్డులేని సార్వభౌముడౌతాడు. మంత్రులతో చర్చించాక ఎసర్‌హాడన్‌ సైన్యం ఓ రోజు ముందు ఉరుమూ మెరుపూ లేని పిడుగులాగా ఒక్కసారి మెరుపుదాడితో రాజు లైలీ కోట మీద పడింది రాత్రికి రాత్రి. ఎంత అప్రమత్తంగా ఉన్నా రాజు లైలీ, మంత్రులు పట్టుబడిపోయారు. సైన్యాధికారుల్నీ, సైన్యాన్నీ ఊచకోత కోసి అందినంతమందిని మట్టుపెట్టాక, కోటనూ రాజ్యాన్నీ స్వాధీనం చేసుకుని రాజు లైలీని బందీగా పట్టుకుంది ఆసీరియా సైన్యం. రాజు అని అయినా చూడకుండా చేతులూ కాళ్ళూ కట్టేసి పశువులా తమ రాజ్యానికి ఈడ్చుకుపోయారు లైలీని. ఇదంతా ఎసర్‌హాడన్‌ చూస్తూనే ఉన్నా అడ్డుచెప్పలేదు. ఇంతవరకూ తనకి లొంగలేదనే కోపం అడ్డు చెప్పనివ్వలేదు. ఆ తర్వాత శత్రునిశ్శేషానికి, మరో రెండు మూడు రోజుల్లో లైలీనీ, అతని మంత్రుల్నీ, ఆప్తులనీ ఉరి తీయడానికి కూడా నిశ్చయం అయిపోయింది.


లైలీని మర్నాడు ఉరి తీస్తారనగా ఎసర్‌హాడన్‌ అంతఃపురంలో మంచం మీద పడుకున్నప్పుడు మెల్లిగా పట్టిన నిద్రలో కల. కలలో ఎవరిదో ఒక అపరిచిత కంఠం వినిపిస్తోంది.

“ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?”

“రేపు లైలీని ఉరి తీయబోతున్నారు. ఇంతకాలం నాకు లొంగకుండా ప్రతిఘటించిన అతన్ని మరో విధంగా, కర్కశంగా ఎలా చంపితే బాగుంటుందా అని.”

“నువ్వు నిజంగానే లైలీని చంపగలవా?”

“అదేం ప్రశ్న? ఇంతకు ముందు వాడి సైన్యాన్నీ, ఆక్రమించుకున్న మిగతా రాజ్యాలలో రాజుల్నీ, సైనికుల్నీ చంపలేదా? అలాగే లైలీని.”

“చంపేశావు అని నీకెలా తెలుస్తుంది?”

“వాడి శరీరంలో ప్రాణం పోతుంది, అచేతనం అయిపోతాడు. ఆ శరీరాన్ని దహనమో, పాతిపెట్టడమో చేస్తారు కదా? ఆ తర్వాత లైలీ అన్నవాడు మనకి కనిపించడు. జనాలకి కొన్నేళ్ళ తర్వాత అసలు లైలీ అంటే ఎవరో తెలియనే తెలియదు.”

“అంటే నీ కళ్ళ ముందు కాని, నీ ప్రజలకి కాని, మరెవరికీ కానీ కనిపించకపోతే వాడు లేనట్టేనా?”

“కాదా? ప్రాణమే పోయాక ఇంకెవరు మిగిలేది?”

“అలా కాదే, ప్రాణం పోతోంది అని నువ్వే అంటున్నావు కదా? ప్రాణం శరీరంలోంచి పోతోంది. ఎక్కడికిపోతోంది? అది తెలుసా?”

“…”

“నువ్వే లైలీవి. నువ్వు నిన్నే ఎలా చంపుకుంటావు?”

“నేను లైలీ అనడం ఏవిటి నీ పిచ్చి కాకపోతే? నేను ఎసర్‌హాడన్‌ని. నేను నేనే. వాడు వేరే.”

“కాదు. నువ్వూ లైలీ వేరువేరని అనుకుంటున్నావు కానీ మీరిద్దరూ ఒకటే”

“అది మీకెలా తెలుసు?”

“తెలుసు, కావలిస్తే నీకు చూపించగలను కూడా. చూడాలని గానీ తెలుసుకోవాలని కానీ ఉందా?”

“చూపించు చూద్దాం.”

“సరే ఇలా వచ్చి ఈ నీళ్ళతొట్టెలో నిల్చో. నేను నీ తల మీద నీళ్ళు పోస్తూ ఉంటా. నేను చెప్పేవరకూ తలెత్తకుండా కళ్ళు మూసుకుని ఉండు.”


తలమీద నీళ్ళు పడడం మొదలవ్వగానే ఎసర్‌హాడన్‌ కంటికి లైలీ రాజ్యం, అంతఃపురం కనిపించాయి. తాను రాజులాగా లోపలకి నడుస్తూంటే వందిమాగధులు కూడా వస్తున్నారు – లైలీ మహారాజుకీ జై అంటూ. అదేమిటి, తాను ఎసర్‌హాడన్‌ అయితే తనని లైలీ అంటున్నారిక్కడ? రాణి ఎదురుగా వచ్చి లోపలకి తీసుకెళ్ళి చెప్పింది రాజుకి, “రాత్రి ఎసర్‌హాడన్‌ మెరుపుదాడిని తిప్పికొట్టి వచ్చారు కదా? అందువల్ల రాజ్యం అంతా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. వెళ్ళి సభలో అందర్నీ పలకరించి రండి.”

సరిగ్గా అప్పటినుంచే ఎసర్‌హాడన్‌కి తాను ఎసర్‌హాడన్‌ అన్న జ్ఞానం పూర్తిగా పోయింది. ఆ జ్ఞానం పోయినట్టు గానీ పోయినందుకు ఏ చింతా ఉన్నట్టు గానీ లేదు. తాను ఇప్పుడు రాజు లైలీ. రాణి చెప్పినట్టు రాజదుస్తులు ధరించి లైలీ సభలోకి వెళ్ళాడు.

సభలో అందరూ రాజుగార్ని ఆహ్వానించాక చర్చ మొదలైంది. సారాంశం ఏమిటంటే ఎసర్‌హాడన్‌ ఆగడాలు రోజు రోజుకీ ఎక్కువౌతున్నాయి. ఈసారి ఎసర్‌హాడన్‌ యుద్ధం ప్రకటించేదాకా ఆగడం అనవసరం. రాజు లైలీ మెరుపుదాడి చేసి ఎసర్‌హాడన్‌ని చంపేసి వదుల్చుకుంటే పీడ విరగడౌతుంది.

దీనికి లైలీ ఒప్పుకోకుండా సభకి సమాధానం చెప్పాడు, “వద్దు. యుద్ధం మూలంగా జనక్షయం మన వల్ల ఎప్పుడూ మొదలు కాకూడదు. శాంతిదూతలుగా ఓ అయిదారుగుర్ని పంపించి ఎసర్‌హాడన్‌తో మంచిగా మాట్లాడి చెప్పి చూడమందాం. ఎంత కఠినాత్ముడైనా కాస్త మంచిగా మాట్లాడితే వింటాడన్న నమ్మకం నాకుంది.”

ఎసర్‌హాడన్‌ దగ్గిరకి పంపాలనుకునే అయిదుగురినీ ఎంచడం అయ్యాక, మరో అయిదారు గంటలు రాజ్యానికి సంబంధించిన విషయాలు చూసి లైలీ సభ చాలించాడు. రాజ్యం గురించి ఇంత కష్టపడుతూ అలసిపోయిన రాజుగారి వినోదం కోసం వేట ఏర్పాటు చేయబడింది.

రాజు లైలీ మందీమార్బలంతో వేటకి బయల్దేరాడు. వేట అద్భుతంగా సాగింది. రాజు రెండు జింకల్ని బాణాలతో గురి చూసి కొట్టి చంపాడు. సాయంత్రం బాగా పొద్దుపోయాక రాజ్యానికి తిరిగి వచ్చిన లైలీ స్నానం చేసి కాసేపు మరో వినోదం చూశాడు – ఈసారి ఎవరో నర్తకీమణులు పాటలు పాడుతూ నృత్యం చేస్తూంటే. ఆ రోజు అలా గడిచిపోయాక మర్నాడు మళ్ళీ సభ.

ఈసారి సభలో నేరస్తులకి శిక్ష విధించడం, పన్నుల వ్యవహారాలూ, వగైరా వగైరా సవాలక్ష పనులు. ఇలా సాయంత్రం వరకూ రాజు లైలీ తీరిక లేకుండా గడిపాడు. ఇంత కష్టపడిన రాజుకి మరోసారి వేట ఏర్పాటు చేయబడింది. ఈసారి కూడా వేట అద్భుతంగా సాగింది. ఒక ఆడసింహాన్ని చంపి దాని పిల్లలని పట్టుకొచ్చాడు. సాయంత్రానికి అంతఃపురంలో యధావిధిగా మళ్ళీ పాటలూ, నృత్యం.

రాజు లైలీకి వారాలూ నెలలూ గడిచిపోతున్నాయి. ఎసర్‌హాడన్‌ దగ్గిరకి పంపిన శాంతిసందేశం మోసుకెళ్ళిన అయిదుగురి సభ్యుల కోసం ఏరోజుకారోజు చూడడమే కానీ చాలాకాలం వాళ్ళ జాడే లేదు.

ఇలా కొన్నాళ్ళు గడిచాక ఓ రోజు ముక్కుచెవులు నరకబడిన ఈ అయిదుగురు శాంతిదూతలూ ఎసర్‌హాడన్‌ దగ్గిర్నుంచి ఓ వార్త మోసుకుని తిరిగొచ్చారు. వీళ్ళ ద్వారా పంపిన సందేశం ఏమిటంటే – వెంఠనే ఎసర్‌హాడన్‌ని చక్రవర్తిగా అంగీకరించి బంగారం, వెండి, డబ్బు, రాజ్యంలో ఉన్న మణులూ మాణిక్యాలు బహుమతిగా పంపించాలి. లేని పక్షంలో ఈ శాంతిదూతలకి అయినట్టే రాజు లైలీకి కూడా చెవులూ ముక్కూ కోయబడతాయి.

కాస్త కంగారుగానూ కొంచెం భయంతోనూ రాజు లైలీ సభలో అందరితోనూ చర్చించాడు ఏమి చెయ్యాలో. సభ మొత్తం ఒప్పుకున్నది ఏమిటంటే ఎసర్‌హాడన్‌ ఆగడాలు ఇంక ఒప్పుకునేది లేదు. వెంఠనే తామే యుద్ధం ప్రకటించాలి. ఈ సారి లైలీకి ఒప్పుకోక తప్పలేదు. వెంఠనే యుద్ధం ప్రకటించబడింది. ఎసర్‌హాడన్‌ సైన్యం లక్షల్లో ఉంటే లైలీ సైన్యం వేలల్లో ఉంది. ఎంత ధైర్యంగా పోరాడినా చివరికి లైలీకి ఓటమి తప్పలేదు. యుద్ధంలో లైలీ రథం తిరగబడిపోయి తునాతునకలైంది. ఎసర్‌హాడన్‌ లైలీని బందీగా పట్టుకున్నాడు. లైలీతోపాటు అతని మంత్రుల్నీ సైన్యాన్నీ అందర్నీ పశువుల్లా కట్టేసి ఆసీరియాకి ఈడ్చుకుపోయారు. లైలీ తనకు లొంగిపోలేదనే కసి తీర్చుకునే సమయం ఎసర్‌హాడన్‌కి వచ్చిందిప్పుడు. రోజుకింతమంది చొప్పున అతని మంత్రులనీ, సైన్యాధికారుల్నీ లైలీ కళ్ళముందే చంపమని ఎసర్‌హాడన్‌ ఆజ్ఞలు జారీ చేశాడు. అందరూ చచ్చిపోయాక జీవచ్ఛవంగా మిగిలిన లైలీని అప్పుడు చంపుతారు. అలా ఎసర్‌హాడన్‌ కసి పూర్తిగా తీరుతుంది.

కలలో లైలీగా ఉన్న ఎసర్‌హాడన్‌కి ఇదో నరకం. ఒకప్పుడు రాజఠీవితో ఉన్న లైలీ ఇప్పుడో దిక్కులేనివాడు. ఎసర్‌హాడన్‌ సైన్యం ఓ ముద్ద పడేస్తే తినాలి అంతే. వంటిమీద ఉన్న కనీసపు బట్టలు కూడా ఎసర్‌హాడన్‌ పెట్టే భిక్షే. రోజూ తన కళ్ళ ముందు జరిగే తన ఆప్తుల చావులు చూడవల్సి రావడం మరో నరకం. లైలీ ఇదంతా ఓర్చుకుంటూ ధైర్యంగా ఉందామనుకున్నాడు కానీ ఎసర్‌హాడన్‌ సైన్యం అది కుదరనివ్వలేదు. లైలీని మరింత ఏడిపించడం కోసం అతని ఆప్తులని చంపేముందు చేతులూ కాళ్ళు నరకి, నీకు కూడా ఇలాగే అవుతుంది సుమా అనే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ఎసర్‌హాడన్‌ సైన్యాధిపతులు. ఆ చావులన్నీ చూసినా ఏడవలేని స్థితిలోకి వచ్చిన లైలీని మరింత ఏడిపించడానికి అతని భార్యని కొరడాలతో కొడుతూ ముక్కూ చెవులూ కోసి ఉరి తీశారు.

ఇంత దారుణం కళ్ళముందు జరుగుతూంటే లైలీ, “ఇది అన్యాయం, అమానుషం” అని గొంతెత్తి అరిచాడు కానీ పట్టించుకునే నాథుడు లేడు.

అలా ఒక్కొక్కరూ చచ్చిపోయాక లైలీ వంతు వచ్చింది. రాజు బట్టలు ఊడదీసి నగ్నంగా ఉరికంబం ఎక్కించే ముందు ఎసర్‌హాడన్‌ సైనికుడు మొహం మీద ఉమ్మేసి వెక్కిరిస్తూ “నువ్వు ఇంతకు ముందో మహారాజువి. మరిప్పుడో?” అన్నాడు.

లైలీకి ఏమనడానికీ నోరు పెగల్లేదు. ఇద్దరు సైనికులు పెడరెక్కలు విరిచికట్టి తీసుకెళ్ళి ఉరితాడు మెడకి తగిలించారు. కంఠం చుట్టూ ఉరితాడు బిగుసుకుంటూంటే ఊపిరి ఆడని లైలీ యమయాతనపడుతూ కాస్త గింజుకున్నాక మత్తులోకి జారుకున్నాడు. మరి కాసేపటికి అతని శరీరం నిశ్చేతనం అయింది.


‘ఇదంతా మాయ; నిజం కాదు, నేను లైలీని కాదు, నిజానికి నేను ఎసర్‌హాడన్‌ని’ అనే ఆలోచన తట్టి, లైలీగా చచ్చిపోయిన ఎసర్‌హాడన్‌ కళ్ళు తెరిచాడు. అయితే ఇప్పుడు తాను ఎసర్‌హాడన్‌ కాదు, లైలీ కూడా కాదు. అడవిలో గడ్డి మేస్తున్న ఒక జింక. ఇదంతా అర్ధమయ్యేసరికి మరో జింకపిల్ల తన దగ్గిర పాలు తాగడానికి ప్రయత్నం చేస్తోంది. అసలు సంగతి చూస్తే అసలు ముందు తన రాజ్యంలో తన స్వంత అంతఃపురంలో నిద్రపోయిన ఎసర్‌హాడన్‌ కలలో రాజు లైలీ. ఆ లైలీ ఉరి తీయబడ్డాడు. కానీ ఉరితీయబడిన లైలీ ఇప్పుడొక తల్లి జింక; తోడుగా తనకో చిన్న జింకపిల్ల కూడా. అది పాలుతాగుతోంటే, ‘ఇదేమిటి నేను ఎసర్‌హాడన్‌ని కదా, ఇలా జింకలా ఉన్నాను?’ అనే స్పృహే లేదు. ఆ సంగతి అలా ఉంచితే తన పిల్ల పాలు తాగుతోంటే అదొక రకమైన అనిర్వచనీయమైన ఆనందం అనుభవంలోకి వస్తోంది.

ఈలోపునే ఒక బాణం వచ్చి జింకపిల్ల పొట్టలో దిగబడింది. అది అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసరికి ఆ పిల్లని వదిలి తాను ప్రాణం రక్షించుకోవడానికి పరుగుపెడుతూంటే మరో బాణం తన పొట్టలో వేగంగా వచ్చి గుచ్చుకుంది. బాణం తాలూకు గాయం, రక్తం తోడేస్తూంటే ప్రాణం పోతోందనేది కట్టెదుట కనబడే సత్యం.

లైలీగా ఉన్నప్పుడు తనకి అమానుషమైన ఉరి, జింకగా ఉన్నప్పుడు పొట్టలో గుచ్చుకున్న గాయం – దారుణంగా నెప్పెడుతూంటే ఓర్చుకోలేక బాధతో కేకలుపెడుతూ, చేతులు ఆడిస్తూ ఎసర్‌హాడన్‌ తల ఒక్కసారిగా పైకెత్తాడు.


ముసలాయన ఇంకా తలమీద నీళ్ళు పోస్తున్నట్టే ఉంది. ఎసర్‌హాడన్‌ తలపైకెత్తడం చూసి, ‘ఏమిటి సంగతి’ అన్నట్టు చూశాడు.

“ఎంత భాధ పెట్టారు! ఇదంతా ఎలా సంభవం? ఎన్ని ఏళ్ళు గడిచాయి మీరు నా తలమీద నీళ్ళు పోయడం మొదలుపెట్టి?” ఎసర్‌హాడన్‌ అడిగేడు.

“ఏళ్ళా? ఇలా వచ్చి నిల్చున్నావు, నేను పోయడం మొదలుపెట్టాను అంతే. ఇంకా అయిదు నిముషాలు కాలేదు. నేను పోసే నీటి కుండలో నీరు ఇంకా పదోవంతు కూడా పోయందే?”

ఎసర్‌హాడన్‌కి నోట మాట రాలేదు. కళ్ళప్పగించి ఆలా చూస్తూ ఉంటే నీళ్ళు పోసిన ముసలాయన చేత్తో నీళ్ళు మొహం మీద చిలకరిస్తూ అడిగాడు “ఇప్పుడర్థం అయిందా ఇదంతా ఏమిటో?”

ఒక్కసారి ఎసర్‌హాడన్‌కి జ్ఞానోదయం అయినట్టయింది. ఇదన్న మాట సంగతి. తాను చంపాలనుకున్న రాజు లైలీ, తాను చంపిన జింకలు, సింహాలూ ఆత్మస్వరూపులే. తాను వాళ్ళకి చేయబోయే గాయాలు, నొప్పి మొదలైనవన్నీ తనకి స్వంతంగా చేసుకున్నట్టే.

చిలకరించిన నీళ్ళు మొహం మీద పడగానే కల చెదిరిపోయి చటుక్కున ఎసర్‌హాడన్‌కి మెలుకువ వచ్చింది. మిగతా రాత్రి అంతా తెల్లవారరడం కోసమా అన్నట్టు మంచం మీద దొర్లుతూ గడిపేడు.

మర్నాడు తెల్లవారుతూనే రాజసభలో ఎసర్‌హాడన్‌ లైలీకీ, మిగతావాళ్ళకీ జరగబోయే ఉరి శిక్షలన్నీ రద్దు చేయమని మంత్రులకి పురమాయించాడు. ఆ తర్వాత రెండు రోజులు రాజ్యంలో ఎవరి కంటా పడకుండా ఏకాంతంగా తన మందిరంలో ఆలోచిస్తూ గడిపిన ఎసర్‌హాడన్‌ మూడవనాడు రాజ్యాన్ని కొడుకు ఎసర్‌బనిపల్ చేతికిచ్చి రాజమందిరంలోంచి హఠాత్తుగా మాయమయ్యాడు. ఎసర్‌హాడన్‌ హత్య చేయబడ్డాడని, పిచ్చెక్కి రహస్యంగా రాజమందిరంలోనే ఒంటరిగా బతుకుతున్నాడని, తనని విడిచిపుచ్చాక రాజు లైలీ ఎసర్‌హాడన్‌ని ఖైదు చేయించాడని, ఇలా నమ్మశక్యంకాని వార్తలు ఒకదాని వెంట ఒకటి తామరతంపరగా పుట్టుకొచ్చాయి. ఎసర్‌హాడన్‌ ఏమయ్యాడో మాత్రం ఎవరికీ తెలియలేదు.


ఇది జరిగిన చాలా సంవత్సరాలకి ఊరూరా తిరిగే ఓ మహనీయుడు రాజ్యంలోకి వచ్చి జనాలకి త్యాగం, అహింస అనేవాటి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన ఎక్కడ ఎన్నిసార్లు ఏం చెప్పినా దాని సారం మాత్రం ఇదే – ప్రాణం, ఆత్మ అనేవి ఎప్పుడూ అందరికీ ఒకేలాగ ఉంటాయి. ఆత్మవత్సర్వభూతాని అన్నట్టు ఎవరూ కూడా మరొకరి నుంచి వేరుగా లేరు. నీలో ఉన్న ఆత్మే నాలోనూ ఉంది; ఆ పరమాత్మే నేను. నాయం హంతి న హన్యతే – ఆత్మ అనేది చనిపోయేదీ కాదు, ఇతరులచేత చంపబడేదీ కాదు. ఎవరైనా మరొకరికి హాని చేస్తే అది తనకి చేసుకున్న హాని మాత్రమే. అహింసా పరమో ధర్మః

(మూలం: Leo Tolstoy – Esarhaddon, King of Assyria, 1903.)