మనిషికెంత భూమి?

“పట్నంలో జీవితం ఎలా ఉంది?” మధ్యాహ్నం తీరుబడిగా కూర్చుని, చాలాకాలం తర్వాత తనని చూడడానికి వచ్చిన అక్కని, చెల్లెలు అడిగింది.

“బానేవుంది. అక్కడి సుఖాలు అక్కడివి. ఇక్కడ పల్లెటూర్లో ఉన్నంత దుమ్మూ ధూళీ లేవు. పిల్లలకి ఆడుకోవడానికీ ఏదైనా కొత్తది నేర్చుకోవడానికీ రకరకాల మార్గాలున్నాయి. మంచి తిండీ, గుడ్డా కట్టుకోగలుగుతున్నాం.”

చెల్లెలికి ఏమైనా అనిపించిందో లేదో కానీ ఈ మాటల్లో అక్కడే ఉన్న చెల్లెలు కొడుక్కి మాత్రం ఎత్తిపొడుపు వినిపించింది. వెంఠనే అన్నాడు, “కాదు మరీ? పాలల్లో నీళ్ళకీ, రొట్టెపిండిలో కల్తీకి అలవాటు పడితే అన్నీ బాగానే ఉంటాయి.”

అక్కకి తగలవల్సిన చోటే తగిలింది ఈ మాట. “అవున్లేరా, కనీసం పందులతో, గొడ్లతో, దొడ్డిలోంచి ఇంట్లోకి నిముషానికోసారి వచ్చేపోయే కోడిపెట్టల్తో వేగక్కర్లేదు” ఎత్తిపొడిచిందావిడ.

“ఏం? అవి లోపలకి వస్తే మాకు నష్టమేమిటీ? మాతో పాటే అవీ కూడా బతుకుతున్నాయి. మీకు పట్నంలో ఆఖరికి కష్టం సుఖం చెప్పుకునే తోడు ఉంటుందా? మేమున్నంత సుఖంగా ఉండగలుగుతున్నారా?” ఈ సారి కొంచెం సౌమ్యంగా అడిగేడు కుర్రాడు.

“ఈ పల్లెలో ఏం సుఖం? మీ నాన్నని అడుగు చెప్తాడు. మీకు చాలినంత భూమే లేదు. పక్క ఇంట్లో వాళ్ళ గొడ్లు మీ పొలం మీద పడితే పంట నాశనం అవుతోంది. వాళ్ళని అడిగితే అదో పెద్ద దెబ్బలాట. నిజానికి ఏం పండిస్తున్నారో, ఏం మిగుల్తోందో? ఎప్పుడూ పొలం పుట్రా చాలట్లేదనే గోల.”

ఈ సారి చెల్లెలు కొడుకు ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకున్నాడు వాడికి తెలియని విషయాలు వచ్చేసరికి. కానీ ఆ పక్కనే వింటున్న చెల్లెలి మొగుడు పాహోం చెవిలో పడ్డాయి ఈ మాటలన్నీ. వాళ్ళ కబుర్లూ అన్నీ అయ్యేక రాత్రి పడుకునేటప్పుడు పాహోంకి గుర్తొచ్చాయి మరదలు అన్న మాటలు. “ఎంత నిజం! నాకు ఈ అర కొరా భూమితో చచ్చే చావు వచ్చింది కదా. ఆవిడ చెప్పిందీ నిజమే. ఉన్న పొలంలో పంట పక్కవాళ్ళ గొడ్లు వస్తే నాశనం అవుతోంది. వాళ్ళతో చెప్దామంటే మొహమాటం. పోనీ అని చెప్పినా వాళ్ళేమీ కట్టడి చేస్తున్నట్టు లేదు. సొంత భూమి ఉండటం వేరూ, కౌలికి తీసుకుని చావు కొనితెచ్చుకోవడం వేరూను. తాము పోగేసిన డబ్బుల్తో ఏమాత్రం భూమి వచ్చేను ఈ ఊర్లో?” ఇలాంటి ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు.

మరదలు వెళ్ళిపోయిన కొన్ని వారాలకి తమ ఊర్లో ఉన్న భూమి అమ్మకానికొచ్చినట్టు తెల్సింది పాహోంకి. కానీ అది వందెకరాల పైమాటే. ఒక్కటిగానే తప్ప ముక్కలుగా అమ్మరుట. వందెకరాలు కొనే తాహతు కాదు పాహోంది. ఊర్లో రైతులందరికీ అమ్మే యజమానిని కాళ్ళా వేళ్ళా పడి బతిమాలేసరికి ఇరవై ఎకరాల చొప్పున అమ్మడానికి ఒప్పుకున్నాడు ఆయన. తన దగ్గిరున్నదీ, భార్య మెడలో నగా నట్రా అన్నీ ఊడ్చేసి, ఇక్కడా, అక్కడా కొంత మొత్తం అప్పో సొప్పో తెచ్చి మొత్తానికి ఇరవై ఎకరాలు కొనగలిగేడు పాహోం.

రెండేళ్ళు గడిచాయి.

పంట బాగుండటం వల్ల అప్పులు తీరిపోయేయి సరే. కానీ ఈ కొత్తగా కొన్న ఇరవై ఎకరాలు తన ఇంటికి దగ్గిర కాదు. ముందున్న భూమీ ఇప్పుడున్న భూమీ వేరు వేరు చోట్ల. తిరగడానికి ఒళ్ళూ హూనం అవుతోంది. పక్క చేలల్లో ఉండే గొడ్లు తన చేలోకి రావడం, తాను వాళ్ళని అడగడం, వాళ్ళు ఏమీ చేయకుండా ఊరుకోవడం అనేది అలా సాగుతూనే ఉంది. ఈ దెబ్బలాటల్లో న్యాయస్థానాల చుట్టూ తిరగడం ఓ పెద్ద పని ఇప్పుడు. ఎక్కువ భూమి ఉంటే సుఖపడదామనుకున్నాడు కానీ చచ్చే చావొచ్చింది పాహోంకి.

ఓ రోజు మధ్యాహ్నం అనుకోకుండా ఓ బాటసారి వచ్చేడు పాహోం ఇంటికి. వేరే ఊరు వెళ్తూ ఇక్కడ చిక్కు పడిపోతే రాత్రికి కాస్త చోటిస్తారేమో అని పాహోంని అడిగేడు. పాహోం ఆయన్ని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించేడు. భోజనాలయ్యాక కబుర్లలో చెప్పేడు పాహోం తనకున్న తలనెప్పులన్నీ. అన్నీ చెప్పి అన్నాడు చివరికి, “ఎక్కువ పొలం ఉంటే సుఖం అనుకున్నాను కానీ దిగే దాకా లోతు తెలియదన్నట్టు ఉంది నా పరిస్థితి.”

వచ్చినాయన అన్నీ విని చెప్పేడు, “మీకు వోల్గా నది తెలుసు కదా? ఆ నదికి పైన భూములు చాలా చవగ్గా ఉన్నాయంటున్నారు. మా ఊళ్ళోనే ఉన్న ఒకాయన – ఏమీ ఉన్నవాడు కాదు అసలు – తట్టా బుట్టా సర్దుకుని అక్కడికి వెళ్ళిపోయేడు. మూడేళ్ళలో ఇరవై ఐదు ఎకరాల భూమీ, పాడీ, పశువులూ అన్నీ సంపాదించేడు. కొత్తవాళ్ళు వెళ్తే అక్కడున్న జనం అంతా సంతోషంగా రమ్మని పిలిచి భూమి చవగ్గా అమ్ముతారుట. మా ఊరినించి వెళ్ళినాయన అలా సంపాదించిందే ఆ పాతిక ఎకరాలూను. వోల్గా నది పైన అంటే ఇంక చెప్పేదేముంది? అవన్నీ సుక్షేత్రాలు. ఇక్కడ మీకింత కష్టం అంటున్నారు కనక వీలుంటే అక్కడ చూడండి. ఒకే చోట ఏకాండి పొలం ముక్కలు లేకుండా దొరుకుతుంది.”

మర్నాడు ఆ బాటసారి వెళ్ళిపోయేడు. చలి రోజులు వెనకపడి వాతావరణం కాస్త బాగున్నాక పాహోం ఇంటి బాధ్యతలన్నీ పెళ్ళాం పిల్లలకి అప్పచెప్పి వోల్గా పైనున్న భూములు చూడ్డానికి బయల్దేరేడు. వెళ్ళాక తెల్సింది – తన ఇంటికొచ్చిన బాటసారి చెప్పినది అక్షరాలా నిజం! కొత్తగా వచ్చినవాళ్ళకి పాతిక ఎకరాలు ఇస్తున్నారు. డబ్బులుంటే మైళ్ళ కొద్దీ భూమి ఉంది కొనుక్కోవడానికి; అదీ కారు చౌకగా! పాహోం మట్టి చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసేడు. అద్భుతం! వెనక్కి వస్తూ దార్లోనే ఏం చేయాలో పాహోం నిశ్చయం చేసుకున్నాడు.

“ఇప్పుడున్న ఊర్లో తనకి జగడాలు తప్పవు. ఈ ఊర్లో ఉంటే తన బతుకు ఎప్పటికీ గొర్రె తోకే. ఆ మూల నుంచి ఈ మూలకీ, ఈ మూలనుంచి ఆ మూలకీ తిరిగేసరికి తన ఒళ్ళు హూనం అవుతోంది. అయినా వోల్గా పైన భూములకీ ఇక్కడ భూములకీ నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా!”

ఇంటికొచ్చిన నెలలోపున తన ఆస్తులన్నీ అమ్మేసేడు పాహోం. పొలాలకి మంచి ధరే వచ్చింది. ఆ పైనెలలో బిచాణా ఎత్తేసి వోల్గా పైనున్న భూముల కోసం పాహోం కుటుంబంతో సహా బయల్దేరి వెళ్ళిపోయేడు.

వెళ్ళాక పొలం కొనబోతుంటే అప్పుడు తలుపు తట్టింది అదృష్టం. అక్కడున్న వాళ్ళు మనిషికొక పాతిక ఎకరాలు ఇస్తారుట, కుటుంబానికి పాతిక కాదు. పాహోం ఎగిరి గంతేసేడు. అలా పాహోంకి వచ్చింది నూట పాతిక ఎకరాలు! తనకి మునుపున్న ఇరవై ఎకరాలు ఇప్పుడు చిన్న నాటుమడి కింద లెక్క! అయితే ఓ చిక్కొచ్చింది ఇక్కడ కూడా. నూట పాతిక ఎకరాలు ఒకే చోట ఇవ్వడం కుదర్లేదు. మళ్ళీ ఇక్కడో ముక్కా, అక్కడో ముక్కా ఇచ్చేరు. అన్నీ వదులుకుని వచ్చినవాడికి నూట పాతిక ఎకరాలు ఉత్తినే వస్తూంటే చేదా? అవి ముక్కలైతేనేం? పాహోం మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టేడు. వోల్గా నది నీళ్ళో మరేమో కానీ పాహోం పట్టిందల్లా బంగారమైంది పొలాల్లో.

గోధుమలు అద్భుతంగా పండుతున్నాయి ఇక్కడ. కానీ అన్ని పొలాల్లోనూ ఒకే పంట వేయడం కష్టమైంది. ఒకే ఏకాండి భూమి ముక్కలు లేకుండా ఉంటే పొలం చూసుకోడం, సాగు చేయడం సులభంగా ఉండేది కానీ తనకున్న వేర్వేరు ముక్కల వల్ల గోధుమ పంట సాగు చేయడం కష్టమౌతోంది. ఇంతలో పాహోం గోధుమలు వేసిన పంట పక్కనే ఉన్న ఆసామీ పొలం కౌలుకిస్తున్నాడని తెల్సింది. అది తీసుకుని ఏకాండిగా గోధుమలు పండించడం మొదలుపెట్టాడు పాహోం. ఇక్కడున్న చిక్కేమిటంటే ఫలసాయం బాగున్నా కౌలుకి డబ్బులు పోతున్నాయి. అంచేత రాబడి పెద్దగా లేదు. ఒకేచోట భూమి ఏకాండీగా ఉంటే ఎంత బాగుణ్ణో అని ఎన్నోసార్లు అనిపించింది పాహోంకి.

ఇదే స్థితిలో కొట్టుమిట్టాడుతూ మరో మూడు సంవత్సరాలు గడిపేడు పాహోం. ఒకరోజు ఓ సంగతి తెలిసింది. ఊళ్ళో ఒకాయన పదమూడు వందల ఎకరాలు చవగ్గా అమ్ముతున్నాడు. అదంతా ఇక్కడో చోటా అక్కడో చోటా కాదు, అంతా ఒకే ఏకాండీ చెక్క. పాహోం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టైంది. వెంఠనే వెళ్ళి బేరం చేసేడు. పదిహేను వందల రూబుళ్ళకి బేరం సిద్ధం చేసుకుని కాయితాల మీద సంతకాలు పెట్టడానికి తయారౌతూంటే భూమి కొనడానికి పాహోంలో కనబడే ఉత్సాహం చూసి అక్కడే ఉన్న ఒకాయన చెప్పేడు:

“మీకు పొలం కొనాలనే ఉబలాటం ఎక్కువగా ఉన్నట్టుంది. దానికోసం ఇన్ని డబ్బులు తగలేయడం ఎందుకూ? నేని ఇప్పుడే దూరదేశం నుంచి వస్తున్నాను పొలం కొని. అక్కడ ఇంకా చవగ్గా దొరుకుతుంది భూమి.”

“ఎంత చవకలో దొరకొచ్చు?”

“నేను పదమూడు వేల ఎకరాలు వెయ్యి రూబుళ్ళకి కొన్నాను.”

“ఏమిటీ?” పాహోం నోరు వెళ్ళబెట్టేడు.

“కావలిస్తే చూసుకోండి,” అంటూ ఓ కాయితం చూపించాడు ఆయన.

ఈ కాయితం చూసిన పాహోంకి కాళ్ళూ చేతులూ ఆడలేదు. తాను ఇక్కడ పదిహేను వందలు పెట్టి కొనే భూమి దుబారా! ప-ద-మూ-డు-వే-ల ఎ-క-రా-లు! ఇక్కడున్న నూటపాతిక ఎకరాలతో తాను ఎప్పటికి వెయ్యి ఎకరాలు సంపాదించగలిగేను? ఆ భూములెలాంటివో, అవి ఎలాగ కొనాలో ఇంకా విషయాలు చెప్పమని వేధించాడు పాహోం ఆ కొత్తాయనని.

“ఈ భూములమ్మే వాళ్ళు బష్కీర్లు. వాళ్ళకి పెద్దగా చదువూ సంధ్యా లేదు. అలా అని డబ్బున్న వాళ్ళూ కాదు. నేల మంచిదే. వ్యవసాయం చేసుకుంటే చేసుకున్నవాడికి చేసుకున్నంత. మీకు చవగ్గా భూమి కావాలంటే నేను ఏం చేసేనో అదే చేయొచ్చు.”

“మీరేం చేసేరు? చెప్పండి,” తొందరపెట్టేడు పాహోం ఆయన్ని.

“నేను వాళ్ళందరికీ బహుమతులూ, టీ, వందరూబుళ్ళకి సమానమైన తినుబండారాలూ అవన్నీ ఇచ్చేను. వాళ్ళు ఇవన్నీ జీవితంలో చూడలేదుట. మీ ఇష్టం వచ్చినంత భూమి కొనుక్కోండి అన్నారు. నా దగ్గిరున్న వెయ్యి రూబుళ్ళకి పదమూడువేల ఎకరాలు వచ్చింది. ఆప్యాయంగా పలకరించండి. కొంచెం బాగా మాట్లాడి, మంచి బహుమతులు ఇవ్వండి. ఆ తర్వాత మీరే అక్కడ రాజు!”

బష్కీర్ల దగ్గిరకి ఎలా వెళ్ళాలో దారీ, అక్కడికి వెళ్ళాక ఎవర్ని కలవాలో ఆ వివరాలన్నీ సంపాదించి పాహోం దాదాపు పరిగెడుతున్నట్టూ ఇంటికి వచ్చేడు.

మర్నాడే ఓ పాలేర్ని వెంటబెట్టుకుని, పెళ్ళాం పిల్లల్తో చెప్పి బష్కీర్లని కలుసుకోవడానికి బహుమతులూ, తివాచీలూ, తేయాకూ, డబ్బులూ పట్టుకుని ప్రయాణం సాగించేడు పాహోం.

ఏడు రోజుల ప్రయాణం తర్వాత ఏదేమైతేనేం, పాహోం, అతని పాలేరూ బష్కీర్లు ఉండే గుడారాలకి చేరేరు. పాహోం అక్కడ గమనించినదేమిటంటే బష్కీర్లకి చేసే పనేమీ లేదు. వాళ్ళకున్న గుర్రాలకి ఆడవాళ్ళు పాలు తీస్తున్నారు. ఆ పాలూ వెన్నా తిని మగవాళ్ళందరూ ఓ చోట చేరి కబుర్లు చెప్పుకోవడం, లేకపోతే చుట్టూ ఉన్న అడివిలోంచి ఏవో తెచ్చుకుని తినడం. వాళ్ళకి వ్యవసాయం రాదూ, చేయరూ. అన్నింటికీ మించీ ఏ పనీ చేసే అవసరం ఉన్నట్టు కనిపించలేదు కూడా. అయితే వాళ్ళందరూ మంచివాళ్ళవడం వల్ల పాహోంని చూడగానే రమ్మని సాదరంగా ఆహ్వానించేరు. అయితే వాళ్ళకి పాహోం మాట్లాడే రష్యన్ భాష రాదు. ఉన్నవాళ్ళలో ఒక దుబాసీని పట్టుకు మాట్లాడ్డం మొదలు పెట్టారు — పాహోం ఎందుకొచ్చాడో, తమకి బహుమతులు ఎందుకిస్తున్నాడో తెల్సుకోవడానికి.

పాహోం తానొచ్చిన పని గురించి చెప్పేడు, “మేమున్న ప్రదేశంలో భూమి తక్కువా, జనం ఎక్కువా. మీ భూమి మా దాని కంటే సారవంతంగా కనిపిస్తోంది. నేను ఇక్కడ భూమి కొనడానికి వచ్చాను. మీరు ఎంత అడుగుతారో చూసి దాన్ని బట్టి మనం బేరం కుదుర్చుకోవచ్చు.”