ఆమె మొగుడు

మొట్టమొదట అతన్ని పనికిరాని వెధవగా పిలిచి తిడుతూ శాపనార్థాలు పెట్టినది తండ్రి, ఏడవ తరగతిలో అత్తెసరు మార్కులొచ్చినందుకు, క్లాసు నోటు పుస్తకాలలో పెన్సిల్తో బొమ్మలు వేస్తున్నందుకూ. ఆపైన మూడేళ్ళకి పదో తరగతిలో వచ్చిన సెకండ్ క్లాసు దేనికీ పనికిరాదు కాబట్టి, ఇంట్లో ఉన్న మరో బంధువు ముందే తండ్రి పనికిరాని వెధవని మళ్ళీ తిట్టాడు. ఆ బంధువూ తండ్రికి వంత పాడాడు. ఆ వేసవి సెలవుల్లో ఇంటర్మీడియేట్‌లో చేరకముందే, గుంటూరులో ఐఐటి కోచింగ్‌లో చేర్పించారు. పదిమందితో కలిసి ఒకే రూములో ఉంటూ చదువుకోవడం. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో అర్థంకాని ఫార్ములాలు; లెక్కల్లో బుర్ర తినేసే ఈక్వేషన్లు. ఐఐటిలో పెడదామని చూశాడు తండ్రి కానీ అది పని చేయలేదు. ఎలానో వైజాగులో ఏదో ఇంజినీరింగు కాలేజీలో సీటు వచ్చింది. తల్లి మాట ఏనాడూ ఎలానూ పనిచేయదు ఇంట్లో. ఆవిడకి మొగుడు ఎంత చెప్తే అంత. పెళ్ళైన మూడేళ్ళకే, ఎంత నోరుమూసుకుని పడివుంటే అంత చల్లగా తన కాపురం సాగుతుందని ఆవిడ అర్థం చేసుకుంది. వైజాగ్ వెళ్తున్నందుకు తండ్రి లోపల ఏమనుకున్నాడో లేదో కానీ తల్లి పైకి ఏమీ అనకపోయినా లోపల ఏదో కాస్త బాధపడ్డట్టే కనిపించింది. ఈ వైజాగ్ ప్రయాణానికి అందరికన్నా సంతోషపడినవాడు అతనే. ఇంజినీరింగ్‌లో చేర్తున్నందుకు కాదు. ఇక ఈ రోజువారీ ‘పనికిరాని వెధవ’ పిలుపులు విననక్కర్లేదు. ఉన్న ఊర్లో తమ పేటలో అతనో హీరో అయ్యాడు ఇంజినీరింగ్‌లో చేరినందుకు, కానీ ఇంట్లో ఐఐటి సీటు తెచ్చుకోలేని పనికిరాని వెధవగానే మిగిలిపోయాడు. ఇన్నాళ్ళూ కీ ఇచ్చి ‘ఇంజినీరింగ్ చదువు’ అని పురిపెట్టి ఎక్కించారు తప్ప ఇది అతనికి నచ్చిందా లేదా అని ఎవరూ అడగలేదు.

ఇష్టం లేని చదువు చదువుతూ అదే తనకి మంచిది అనుకుంటూ ఇష్టమైన బొమ్మలు వేయడం ఓ పక్క ప్రాక్టీస్ చేస్తూ ఎలానో ఇంజనీర్ అయ్యాడు. బొమ్మలు బాగా వేయడం నేర్చుకుని ఒక ఎడ్వర్‌టైజ్‌మెంట్ కంపెనీలో పనిచేయాలని అనుకున్నాడు, కానీ తండ్రి పడనీయలేదు. ఇంజినీరింగ్ అయ్యాక అందరూ వెళ్తున్నారు కదా అని అదే దార్లో తాను కూడా ఓ రాయివేసి ఎలానో ఎమ్.ఎస్. కోసం అమెరికా చేరుకున్నాడు. మరో ఐదేళ్ళకి అక్కడ ‘చదువై’పోయి వీసాల కసరత్తులు చేసి ఒక ఉద్యోగం అంటూ వచ్చాక దేశం వెళ్ళి తండ్రి చూసిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. బహుశా కొత్తజీవితం బాగుంటుందనుకున్నాడు. మానవ సంబంధాలు ఎప్పటికీ స్వార్థంతో కూడుకున్నవని తెలియలేదు. ఆవిడగారికి అమెరికా వచ్చిన ఆరు వారాలలోనే తెల్సిపోయింది మొగుణ్ణి ఎలా ఆడించాలో. ఆవిడ అత్తారింట్లో ఉన్న రెండువారాల్లో చూచాయగా విన్నదే – తన మొగుడు దేనికీ పనికిరాని వెధవ. నిత్యం రుసరుసలాడే మామగారు చెప్పినట్టూ ఈ వెధవకి పెళ్ళి ఎక్కడ రిజిస్టర్ చేయించాలో, రెవెన్యూ స్టాంప్ ఎక్కడ కొనాలో కూడా తెలియదు. కూరల మార్కెట్లో వంకాయలు, బెండకాయలూ కూడా ఏరలేడు.

మరికొన్నాళ్ళకి అతని అవసరం వచ్చింది అందరికీ – అతనే ఇంటికి పెద్ద కాబట్టి. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, బావగార్ల రిక్వెస్ట్ డిమాండ్లు, తండ్రి కొత్తగా నేర్చుకున్న ఇన్వెస్టుమెంటు హాబీకి కావలసిన డబ్బులు. అతనేమీ తనకంటూ మిగుల్చుకోలేదు. ఈ లోపుల అతనికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టేరు. వాళ్ళు పెరిగే రోజుల నుంచే అమ్మ నోట్లోంచి నిరంతరం వచ్చే, వినే పదం ‘మీ నాన్న ఒక దద్దమ్మ.’ వంట చేయడం కూడా రాదు. డబ్బులు ఎప్పుడూ లేవు అని చెప్పడమే తప్ప ఏదోరకంగా రెండో సంపాదన చూసుకుందామని లేదు. పిల్లలకి కనీసం ఖరీదైన బట్టలైనా కొనలేడు. ఉన్నది ఒకటే డొక్కు టయోటా కారు. ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా తల్లీ తండ్రీ, అత్తామామల్ని ఎవర్నీ కూడా చూడ్డానికి అమెరికా తీసుకురాలేదు, పురుళ్ళకి కానీ మరోదానిక్కానీ. వాళ్ళని తీసుకురావాలంటే ఖర్చులౌతాయని, ఆ అప్పులు తాను కట్టుకోలేననీ అతను చెప్పాక కూడా ఈ సాధింపు తప్పలేదు, కానీ అతనో చేతకాని దద్దమ్మ అనేది ప్రస్ఫుటంగా అందరికీ తెలిసింది. ఏళ్ళు గడిచాక ఎవరి కుటుంబాలతో వారున్నారు. అత్తగారి వైపు కూడా అతను ఏదో చేయగలిగిన సహాయం చేశాడు. తల్లీ తండ్రీ రెండేళ్ళ క్రితమే పోయినప్పుడు వాళ్ళ చివరి కర్మలు చేసి వచ్చాక అతనికి మరో సారి దేశం వెళ్ళే పనిలేదని స్పష్టమైంది.

ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఎవరో పిలిచారు వాళ్ళమ్మాయి బర్త్‌డే పార్టీకి రమ్మని. అతనికి వెళ్ళాలని లేక మీరు వెళ్ళిరండన్నాడు భార్యాపిల్లలను. ‘జీవితంలో ఒక్క సరదా లేదు ఉత్త దద్దమ్మ’ అంటూ ఆవిడ దెప్పింది, ఇప్పుడీ పిల్లలను తను డ్రైవ్ చేసుకొని తీసుకువెళ్ళాల్సి వచ్చేసరికి. ‘అబ్బా, డాడీ! యూ ఆర్ యూస్‌లెస్’ అన్నారు తొమ్మిదీ, పదేళ్ళ కూతుళ్ళిద్దరూ. మొదటిసారి వాళ్ళకీ తెలిసినట్టుంది తండ్రి ఎవరో. వాళ్ళు వెళ్ళాక సోఫాలో జారపడి కళ్ళు మూసుకున్నాడు. వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసరికి రాత్రి ఎనిమిది దాటుతుంది.

పనికిరాని వెధవ, దద్దమ్మ, ఇప్పుడు యూస్‌లెస్. ఇదే పదం అతను మొదట విన్నది తండ్రి నోట, తర్వాత భార్య నోట, ఆపైన అనేకమంది నోటా. ఇప్పుడు పిల్లలూ అదే అంటున్నారు. నోరు, భాష, రంగూ, రూపూ మారాయి గానీ పదం అదే, అర్థం అదే. నీరసంగా నవ్వుకున్నాడు. తాను పుట్టడమే ఒక తప్పు. తల్లీ తండ్రీ ఒకరాత్రి సుఖం కోరుకున్నప్పుడు అది తాను పుట్టడానికి కారణం కావడం తన తప్పు. తనకి బొమ్మలు వేసుకోవడం ఇష్టం అయితే తప్పు, ఐఐటిలో సీటు రాకపోవడం తప్పు, వైజాగ్‌లో పనికిరాని చదువూ తప్పే. తల్లితండ్రులకి వాళ్ళు పోయేదాకా డబ్బు సహాయం చేసినా అమెరికా తీసుకురాలేకపోవడం తన చేతకానితనం. ‘అందరికీ కావాల్సినంత’ డబ్బు తన దగ్గిర లేకపోవడం తన పనికిరానితనం; చెల్లెళ్ళకి, బావగార్లకీ సహాయం చేసినా అత్తగారికీ మామగారికీ ‘తగినంత’ సహాయం చేయలేనందుకు తానో దద్దమ్మ. అందరు అమెరికా కొడుకుల్లా మూన్‌లైటింగ్ చేసి ఇండియాలో అపార్టుమెంట్లు కొనలేనందుకు తండ్రికి చివరిదాకా తనొక పనికిరాని వెధవే.

కనీసం ఎవరింటికైనా వెళ్తే ‘హలో హలో’ అనడం తప్ప రాజకీయాలు, సినిమాలు, కథలో కాకరకాయలో ఏదీ తాను మాట్లాడలేడు. అందరూ గలగల మాట్లాడుతూంటే కళ్ళూ చెవులూ అప్పగించడమే తనకు చేతనౌను. అక్కడకీ మిగతా అమ్మలక్కలు అన్నారుట కూడా ఈవిడతో ‘మీ ఆయన నోరు మెదపడే?’ అని. ఈవిడ తర్వాత చెప్పింది, ‘మీరింత దద్దమ్మ అనుకోలేదు’ అని జోడిస్తూ. నిజమే కదా తాను ఎవరికీ ఎందుకూ పనికిరాడు. కీ ఇచ్చే బొమ్మలాగా ఆడగలడు. ఆ బొమ్మలో స్ప్రింగ్ కానీ పాడైతే, లేదా దాంట్లో బాటరీలు వేసేవారు లేకపోతే తాను నిజంగానే పనికిరానివాడే. తనకి ఉన్న ఒకే ఒక్క భరోసా – ఉద్యోగం వచ్చిన కొత్తల్లో తీసుకున్న మిలియన్ డాలర్ల జీవితభీమా. ఏనుగు బతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అనే సామెత ఉంది, కానీ తనలాంటి మనుషులకి చస్తేనే విలువ ఎక్కువ బతికివున్నప్పటి కన్నా. చూచాయగా ఏదో అర్థమైనట్టున్నప్పుడు చిన్నగా కునుకు. సాయింత్రం అయిదింటికి మెలకువ వచ్చింది.

బాత్రూమ్‌ లోకి వెళ్ళి మొహం కడుక్కుని ప్రెషప్ అయ్యాక, ఎయిర్‌బేగ్‌లో ఒక రెండు జతల బట్టలు, పాస్‌పోర్ట్, ఉన్నవాటిలో తన బేంక్ క్రెడిట్ కార్డు, గ్రీన్‌కార్డ్, సెల్‌ఫోన్, ఇంట్లో ఎమెర్జన్సీకి దాచిపెట్టిన ఆరువందల కేష్ పట్టుకుని బయటకి వచ్చాడు తలుపు జాగ్రత్తగా లాక్ చేసి. ఊబర్‌కి ఫోన్ చేశాడు ఎయిర్‌పోర్ట్‌కని. అదొచ్చేలోపున ఫోన్ లొకేషన్, షేర్ లొకేషన్ అన్నీ కేన్సిల్ చేసి భార్య ఫోన్ బ్లాక్ చేశాడు. మిగిలినది వాట్సాప్. దానితోపాటు ఫోనులో ఉన్న పేమెంట్ కార్డులూ అవీ డెలీట్ చేశాడు. ఊబర్ టాక్సీ బయలుదేరాక మిగతా ఫోన్ మొత్తం క్లీన్ చేసి డ్రైవర్‌తో ఎయిర్‌పోర్ట్‌కి కాదు, గ్రే హౌండ్ బస్ స్టేషన్‌కి పోవాలని చెప్పాడు. ఊబర్ డ్రైవర్‌కి కేష్ ఇచ్చాక ఉన్న ఊరినుండి డెట్రాయిట్‌కి బస్సు పట్టుకున్నాడు. ఎనిమిది గంటల ప్రయాణం. ఫోన్‌లో ఉన్న తన ఆఫీసు మేనేజర్ నెంబర్‌కి మెసేజ్ పెడదామా అని ఒక క్షణం ఆలోచించాడు కానీ అది అనవసరం; వాళ్ళు ఎలాగా ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటారు. ఫోన్ ఫాక్టరీ రీసెట్ చేసి సిమ్‌కార్డ్ తీసి ట్రాష్‌లో పడేశాడు.

ఎనిమిదింటికి ఇంటికొచ్చిన అమ్మగారికీ పిల్లలకీ తండ్రి కనబడలేదు. పిల్లలకి పార్టీలో వారికి ఇచ్చిన గిఫ్ట్‌లు తండ్రికి చూపించాలని ఉంది కానీ ఆయన తమ కూడా రానందుకు మొహం మాడ్చుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయేరు. అమ్మగారు ‘ఈయన ఎక్కడకో నడకకి బయల్దేరి ఉంటా’డనుకుని ఒక మెసేజ్ పంపి, బట్టలు మార్చుకుని టీవీ చూడ్డంలో నిమగ్నమైంది. ఈవిడ పంపిన మెసేజ్‌కి సమాధానం రావడం లేదు. వాయిస్ కాల్‌కి కూడా ఎవరూ ఆన్సర్ చేస్తున్నట్టు లేదు. ఈ చేతకాని దద్దమ్మ ఫోన్ కానీ పోగొట్టుకున్నాడా? రాత్రి పదకొండింటికి కూడా దద్దమ్మ ఆచూకీ ఎక్కడా తెలియలేదు. ఇక తెలిసున్న వాళ్ళందరికీ ఫోన్ చేసింది ఆవిడ. మర్నాటి దాకా చూసి పోలీస్ రిపోర్ట్ ఇవ్వొచ్చని అందరూ సలహా ఇచ్చాక ఆవిడ ఇంట్లో, గరాజ్‌లో బయట యార్డ్‌లో మరోసారి చూసి మొగుడు ఎక్కడా లేడని నిర్ధారించుకున్నాక నిద్రకి ఉపక్రమించింది, మనసులో కొంచెం భయపడినా.

డెట్రాయిట్లో బస్సు దిగిన అతను ఎటిఎమ్ దగ్గరికెళ్ళి అయిదువేలు కేష్ తీశాడు. దాంతో ఇండియాకి టికెట్ కొనుక్కొని విమానం ఎక్కే సమయానికి అమ్మగారు, తన స్నేహితులతో వెళ్ళి పోలీసులతో మాట్లాడుతోంది ఈయన కనిపించకపోవడం గురించి. రెండు రోజులు పోయాక తెల్సింది ఈయన క్రెడిట్ కార్డు డెట్రాయిట్లో వాడబడిందని. ఎయిర్‌లైన్స్ రికార్డుల ప్రకారం ఈయన ఢిల్లీ, ఇండియా వెళ్ళాడు. అలా పోలీసులు చెప్పాక మనసు కుదుటబడింది ఏదో ఎమర్జన్సీ వల్ల వెళ్ళాడేమో, ఎలాగా రెండువారాల్లో వచ్చేస్తాడని. ఇది ఇంక తమ పరిధిలోకి రాదు కనక అమెరికా పోలీసులు కేసు క్లోజ్ చేసి చేతులు దులుపుకున్నారు. మరో మూడురోజులకి ఆమెకి తెల్సిన విషయం అతను ఇండియా వెళ్ళినట్టు అక్కడ ఎవరికీ తెలియదుట. చెల్లెళ్ళకి గానీ బావలకి గానీ ఎవరికీ చెప్పలేదు. ఢిల్లీలో తమకి తెల్సినవారు ఎవరూ లేరు. ఎందుకెళ్ళాడో తెలియదు. చెల్లెళ్ళు తమ వదిన చెప్పినట్టూ అక్కడ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇచ్చారు.

రెండువారాలు గడిచేసరికి అమ్మగారికి కంగారు ఎక్కువై ఇండియాకు వచ్చింది పిల్లలతో. బిలియన్‌కి పైబడి ఉన్న జనాభాలో ఒక ఇండియన్‌ని పట్టుకోవడం అంత సులభం కాదని, దానికి టైమ్ పడుతుందనీ పోలీసులు నచ్చచెప్పాక పిల్లలూ ఆవిడా ఓ రోజు ఏడిచారు. అప్పుడు తెలిసివచ్చిన జీవిత సత్యం ఏమిటంటే ఆవిడా, పిల్లలూ అమెరికా వెళ్ళిపోవడమే మంచిది. ఇక్కడ ఉండలేరు, ఉన్నా ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి, ఎవరున్నారు అనే ప్రశ్నలు వస్తున్నై. అలా అమ్మగారు పిల్లలతో అమెరికా వచ్చేసింది. మరో నెలకి లాయర్ని పట్టుకుని సంప్రదిస్తే ఆయన చెప్పాడు, ఎలాగో ఒకలాగ ఓ సర్టిఫికేట్ సంపాదిస్తే – అవును ఆయన పోయినట్టే – తాను ఇన్స్యూరెన్స్ డబ్బులు ఇప్పించగలడు నయానో భయానో. కొంచెం బెదురు, వణుకు పుట్టుకొచ్చాయి ఆవిడకు. మరో నెల చూసి స్నేహితులనబడే వారందరూ చెప్పాక మరోసారి ఇండియావచ్చి కొంత ఖర్చు పెట్టి ఓ సర్టిఫికేట్ సంపాదించింది తమ్ముళ్ళ సహాయంతో. దాంతో అమెరికన్ లాయర్ కథ నడిపి ఇన్స్యూరెన్స్ డబ్బులు ఇప్పించేడు. అదే సర్టిఫికేట్ చూసి తమ ఆఫీసులో మనిషి పోయినందుకు అమెరికన్ కంపెనీ విచారించి మరికొంత డబ్బు ఇచ్చింది. అమ్మగారు, పిల్లలూ అలా సెటిలైపోయారు.

అమెరికాలో ఉన్నప్పుడు అతను పంపిన డాలర్లు తండ్రికీ తల్లికీ బతికున్నంతకాలం బాగానే పనికి వచ్చాయి. చెల్లెళ్ళూ బావగార్లూ బాగుపడ్డారని చెప్పుకోవాల్సిందే ఆయన చేసిన సహాయంతో. భార్యా, పిల్లలకీ కూడా ఆయన ఇన్స్యూరెన్స్ డబ్బులు పనికి వచ్చాయి. అమెరికన్ కంపెనీలో ఆయన పనికివచ్చినట్టే కనక ఆయన పదిహేనేళ్ళకి పైన ఒకేచోట పనిచేయగలిగేడు. పనికిరాని వెధవగా జీవితం అంతా పిలవబడిన అతను ఢిల్లీలో దిగాక ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు. ఎవరైనా అతనిని నోరెత్తనిస్తే కదా ఎప్పుడైనా కనీసం ఆయన మనసులో ఏముందో తెల్సుకోవడానికి. అయితే అతను (వెళ్ళి) పోయిన తర్వాత, అవసరార్థం ఆయన డెత్ సర్టిఫికేట్ సృష్టించిన భార్య మాత్రం ఇప్పటికీ నుదుటి మీద బొట్టు పెట్టుకుంటూనే ఉంది.

(ఈమాటలో లైలా యెర్నేనిగారి ఒక వ్యాఖ్య స్ఫూర్తితో – రచయిత.)