పూల అంగడికి పొద్దున్నే బయలుదేరుతూంటే పక్క ఇంట్లోంచి అరుపులు వినిపించాయి సుదాముడికి, “నా ప్రాణానికి నువ్వెక్కడ దొరికావే? నా బతుకే ఇలా ఏడుస్తుంటే, నువ్వూ, నీ అవకరాలు ఉన్న శరీరమూ, నాకు శనిలా దాపురించేవు.”
మనస్సు చివుక్కుమంది. బయటనే అరుగు మీద కూర్చున్న ఈ త్రివక్ర అనే అమ్మాయి తండ్రి కేసి చూసేడు సాలోచనగా. ఇదంతా నా ఖర్మ అన్నట్టూ ఆయన నుదిటి మీద వేలు అడ్డంగా రాస్తూ చూపించేడు. సుదాముడు ఆయన దగ్గిరకెళ్ళి చిన్న గొంతుతో చెప్పేడు.
“మధ్యాహ్నం భోజనం అయ్యేక కాస్త తీరిక చేసుకుని, అమ్మాయితో పాటు నా పూల అంగడికి రండి. మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు.”
“అలాగే” అన్నట్టూ తలాడించేడు తండ్రి. ఆయన కంట్లో సన్నటి నీటి పొర సుదాముడి కంట పడనే పడింది. ఓదార్పుగా భుజం తట్టి, “హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే” నోటిలో నిరంతరంగా సాగిపోయే కృష్ణ స్మరణంతో అంగడి కేసి నడిచేడు.
మధ్యాహ్నం భోజనం అయ్యేక అంగట్లో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చారు తండ్రీ త్రివక్రా – సుదాముణ్ణి చూడ్డానికి. వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టి అడిగేడు. “ఎందుకు మీరీ పిల్లని అలా హింసిస్తున్నారు రోజూ? ఈ శరీరం, ఈ అవకరాలు అన్నీ భగవంతుడిచ్చినవి. మనం ఏదో జన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇలాంటి మానవ జీవితం వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఆ మిగిలిపోయిన కర్మ మౌనంగా అనుభవించేస్తే మేలు. ఎవరూ కూడా ఇవి కావాలని కొని తెచ్చుకోరు కద?”
“నాకేం రాదని, అందరి పిల్లల్లా ఉండననీ అమ్మ నన్ను రోజూ కొడుతోంది.” త్రివక్ర ఏడుస్తూ చెప్పింది.
“ఊరుకోమ్మా, రోజూ చూస్తూంటే అసలు తల్లి అనేది ఇలా ఉండగలదా అనిపిస్తోందనుకో అది నా భార్యో, ఈ కంస మహారాజు మనమీద కాపలా పెట్టిన రాక్షసో. దానికి నేనెన్ని సార్లు చెప్పినా అలాగే మాట్లాడుతోంది. ఏం చేద్దామన్నా నాకు కరచరణాలు ఆడటం లేదు.” తండ్రి సముదాయించాడు కూతురిని.
“ఇలా అమ్మాయిని ఇంట్లో కూర్చోపెట్టడం కంటే ఏదో ఒక వృత్తి నేర్పరాదూ?” సుదాముడడిగేడు తండ్రిని.
“దీనికి ఎవరైనా ఏదైనా నేర్పుతానంటే నేను వెంఠనే జేర్పించనా?” తండ్రి చెప్పేడు.
“నా పక్క అంగడిలో లేపనాలు తయారు చేసే ఆయన చాలా కాలం నుంచీ పని ఎక్కువగా ఉందనీ ఎవరో ఒకరు సహాయానికి కూడా ఉంటే బావుణ్ణనీ అంటున్నాడు. లేపనాలంటే చేయడం కొంచెం కష్టమే కానీ అలవాటైతే ఎవరైనా చేయవచ్చు.”
“నాకెన్ని అవకరాలున్నా కానీ చేతులు కాళ్ళూ బాగానే ఉన్నాయి. అమ్మ ఇంట్లో నాకు చూపించే నరక యాతన కన్నా కష్టమా ఈ లేపనాలు నేర్చుకోవడం?” పదేళ్ళ పాప మాటలకి శ్రోతలిద్దరూ ఆశ్చర్యపోయేరు.
ఎన్ని అవకరాలున్నా లేపనాలు చేయడం నేర్చుకోవడానికి పనిలో కుదురుకున్న త్రివక్ర పని దొంగ కాదు. యజమానిక్కూడా సంతోషమే. ఈ అమ్మాయి అందరి పిల్లల్లా నిముషానికోసారి లేచి అటూ ఇటూ తిరగదు. ఒద్దికగా ఓ చోట కూర్చుని తానేదో, తన పనేదో. ఇంటి దగ్గిరైతే తల్లి తిట్టే తిట్లు గుర్తొస్తాయి కాబోలు పాపకి ఇక్కడే బాగున్నట్టుంది. తీరిక వేళల్లో సుదాముడి దగ్గిర కృష్ణుడి గురించో, ఆయన చేసే కృష్ణ స్మరణమో వినడం. త్రివక్రకి మొదట్లో కృష్ణుడెవరో తెలియడానికే ఊహకందేది కాదు. గోకులం నుంచి తెరలు తెరలుగా వచ్చే కధలు వింటూంటే ఈ నల్ల పిల్లాడు భగవంతుడి అవతారం అనుకోవడం తాను వింది. కూర్చుంటే అంత సులభంగా లేవలేని తనకి, ఇన్ని అవకరాలున్న తనకి, సుదాముడంతటి వాడికే లేనిది, భగవంతుడి దర్శనం అవుతుందా?
పక్క అంగడిలో సుదాముడికీ ఇదే రకం ఆలోచనలు – ఎక్కడి గోకులం, ఎక్కడి తానూ, తన పూల అంగడి? ఎప్పుడైనా తన జీవిత కాలంలో ఓ సారి ఆ కృష్ణుడు మధురానగరం వస్తే, గిస్తే, ఊరి మారుమూలనున్న తన అంగడి కేసి వచ్చేనా తనని చూసేనా? ఈ జీవితం ఇలా అయిపోవాల్సిందే కాబోలు. వేల ఏళ్ళ తపస్సు చేసే మునులకే లేదు ఆయన దర్శనం, నేనెంత? ఇంకో వంద జన్మల తర్వాతైనా బాగుపడొచ్చు ఈ కృష్ణ స్మరణంతో. ఆయనకి ఎప్పుడు నన్ను చూడాలనిపిస్తే అప్పుడే వస్తాడు. చూడబోతే ఇన్ని భ్రూణ హత్యలు చేసే రాజు గారి అనుచరులూ, ఈ రాజుగారూ నా కన్నా అదృష్టవంతులు కాబోలు. కనీసం వాళ్ళకి చచ్చే ముందు ఆయన్ని చూసే భాగ్యమైనా కలుగుతోంది.
“ఈ చిన్న మరక, అదీ లోపల వేసుకునే అంగీ మీద, పోవాలా? పైన వేసుకునే బట్టల మూలంగా ఇది కనబడనే కనబడదు కదా? అయినా సరే ఈ మరక ఉందని నన్ను కంస మహారాజు కొరడా దెబ్బలు కొట్టించేడు. ఈ వెధవ రాజు ఉంటే ఎంత? పోతే ఎంత? నా తడాఖా చూపిస్తాను. రేపీపాటికి ఈ గుడ్డలెన్నీ ఎలా మెరుస్తాయో….” తప్పతాగి ఒళ్ళు తెలీకుండా పేలుతూ కసిగా బండమీద రుద్దుతున్నాడు బట్టలన్నీ రజకుడు.
“నాయినా అమ్మ తిండి తినడానికి రమ్మంటోంది,” పదేళ్ళ కుర్రాడొచ్చి చెప్పేడు.
చేతిలో గుడ్డ తీసి వాడి నడుం మీద కొట్టి అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తూ అరిచేడు, “పోరా నువ్వూ మీ అమ్మా, పోయి యమునలో దూకండి.” కుర్రాడేడుస్తూ లోపలకి పోయేడు. గంటా రెండు గంటలు గడిచేక మరకలు పోగొట్టి ఉతికిన బట్టలన్నీ ఆరేసి లోపలకెళ్ళి పడుకున్నాడు. తాగిన మైకంలో ఒంటి మీద కొరడా దెబ్బల నెప్పి తెలియలేదు మర్నాటి పొద్దున్న దాకా.
లేపనాల అంగడికి ఓ రోజు మహారాజుగారి దగ్గిర్నుంచి కబురు! ఏమి చావొచ్చిందో అని గుండెలదురుతూండగా, యజమాని దాదాపు పరుగెట్టుకుంటూ రాజ దర్శనానికి వెళ్ళేడు.
“ఏమోయ్ నీ దగ్గిర లేపనాలు చేసే ఒకమ్మాయ్ ఉందిట, పని చేయడంలో మంచి సిద్ధహస్తురాలని విన్నాం. నగరంలో వాణిజ్య ప్రముఖుల దగ్గిరా ఆ లేపనాలన్నీ చూశాం. ఇంకా నీ దగ్గిరే పనిచేస్తోందా?”
“అవును మహారాజా, వెన్నెముక కాస్త వంకర కానీ చేతులతో అద్భుతమైన లేపనాలు చేయగలదు. అది అమ్మాయికి దేవుడిచ్చిన వరం.”
“రేపట్నుంచి మహారాజుగారికి కావాల్సిన లేపనాలన్నీ ఆ అమ్మాయి చేత చేయించి పంపించు. నీకూ, ఆ అమ్మాయికి తగిన విధంగా జీతం అందుతుంది. ఏమేమి లేపనాలు కావాలో ఓ రోజు ముందుగా నీకు మా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇష్టమేనా?”
“తప్పకుండా మహారాజా”
“నీ కేమన్నా కావలిస్తే రాజభవనంలో అడుగుతూ ఉండు. లేపనాలు అద్భుతంగా ఉండాలి. ఎక్కడా తేడా రాకూడదు సుమా. గుర్తు పెట్టుకో మరి.”
“అవశ్యం. మీరంతగా చెప్పాలా?
కంస మహారాజు త్రివక్రని తన స్వంతానికి లేపనాలు చేయించుకోవడం కోసం పెట్టుకున్నాడనే వార్త సుదాముడికి చేరింది. ఆయన సంతోషంగా చెప్పేడు అమ్మాయితో, “చూశావా భగవంతుడి అనుగ్రహం? నీ అవకరం భగవంతుడికి కనపడదు. ఆయనకందరూ ఒకటే. ఆయన బమ్మిని తిమ్మి చేయగలడు. ఎప్పుడో ఓ సారి మన కంస మహారాజు ఆయన చేతిలో ఛస్తాడని ప్రజలందరూ అనుకోవడం నీకు తెల్సిందే కదా? ఆయన్ను చూసే అదృష్టం నాకు ఎలాగా ఉన్నట్టు లేదు. రాజభవనానికి వెళ్తూ ఉంటావు కనక నువ్వేనా చూడగలవు. జాగ్రత్తగా గమనిస్తూ, కంసుడికి కాదు, ఇదంతా భగవంతుడి కోసం అనుకుంటూ రోజూ నువ్వు శ్రద్దగా పని చేయి. దీక్షగా పని చేస్తూ అద్భుతాలు చేయడమే యోగం అంటున్నారు తెలిసినవాళ్ళు.”
త్రివక్ర తలవంచుకుని అలాగేనన్నట్టూ ఊపింది. తలెత్తితే తన కన్నీళ్ళు సుదాముడి కంటపడేను. ఇంట్లో సాక్షాత్తూ స్వంత తల్లి చేతిలో నరకయాతన అనుభవించే తనని బయటకి తీసుకొచ్చి జీవితానికో దారి చూపించిన ఈ సుదాముడి ఋణం ఏ జన్మకి తీరేను?
పట్టుకొచ్చిన బట్టలన్నీ చూసి కంసుడు రజకుణ్ణి లోపలకి పిల్చేడు, “ఈ సారి బట్టలన్నీ బాగున్నాయి. కొరడా దెబ్బలు బాగా పని చేసినట్టున్నాయే?” అదో వంకర నవ్వు మాటల్లో.
“ఆయ్”, రజకుడికి అంతకంటే నోట మాట రాలేదు. ఏమో ఏమంటే ఏమౌతుందో. పాత దెబ్బలు ఇంకా నడుము మీద మండుతున్నాయ్.
“సరే ఫో,” కసిరినట్టూ చెప్పేడు కంసుడు.
బయటకొచ్చిన రజకుడికి లోపల ద్వేషం అనంతంగా పెరిగిపోతూంది ఈ కంసుడి మీద. “….తనకి గానీ ఒక్క అవకాశం వచ్చిందా ఈ కంసుణ్ణి తల తగేలా చంపేసి ఉండేవాడు. చిన్న మరక, అదీ లోపల వేసుకునే అంగీ మీద. దాన్ని చూసి తనకి కొరడా దెబ్బలు! ఇవి మానడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పేరు మందు ఇచ్చిన ఆచార్యులు. పోనీ కొట్టాక అక్కడే వదిలేడా? ఈ రోజు పిల్చి మరీ నవ్వుతున్నాడు మొహం మీద. ఎంతటి దుర్మార్గుడు కాకపోతే నేను ఏడుస్తూంటే అలా నవ్వగలడు? భగవంతుడనేవాడుంటే నన్ను ఇలా కొరడా దెబ్బలు కొట్టిస్తాడా, ఈ ప్రపంచం ఇలా ఏడుస్తుందా? నాకు జరిగే ప్రతీ దానికీ నేను మాత్రం నా ఖర్మ అనుకోవాలి. అయితే ఈ రాజుగారు చేసే పనులకి మాత్రం ఏమీ ఖర్మా గిర్మా లేదు. నేనేమో వళ్ళు హూనం చేసుకుని బట్టలు మల్లెపూవులా మెరిసిపోయేలాగ ఉతకాలి. ఈ తెల్లటి బట్టలేసుకుని ఈ చచ్చు మహారాజు చేసేదేవిటీ? ఊరూరా తలొకణ్ణీ పంపించి చంటిపిల్లలని చంపించడం. ఇదా న్యాయం? ఎప్పుడో గోకులం నుంచి వచ్చి కృష్ణుడు ఈ కంసుణ్ణి చంపేదాకా నేను ఇలా ఏడవాలా? రానీయ్, ఆ కృష్ణుడు కానీ నాక్కనబడ్డాడా ఇలా నన్ను కొట్టించినందుకు సరైన గుణపాఠం నేర్పుతాను. ఈ కంసుడి దగ్గిర ఎంత బాగా పనిచేసినా నాకు దెబ్బలు తప్పవు. కృష్ణుణ్ణి వీళ్ళందరూ భగవంతుడనీ, ఎప్పుడో వచ్చి ఈ కంసుణ్ణి చంపుతాడనీ అనుకోడమే తప్ప ఇప్పటిదాకా ఆయనొచ్చే అతీ గతీ లేదు. నేనెలాగా ఈ కంసుడి బారి నుంచి తప్పించుకోలేను. ఆ కృష్ణుడు కానీ వచ్చి నాక్కనిపించాడా అప్పుడు చూపిస్తాను నా కోపం అంతా.” కోపంగా గొణుక్కుంటూ, జాలిగా చూస్తున్న మధురానగరం జనాలని తప్పుకుంటూ ఇంటికి నడక సాగించేడు రజకుడు.
“కంస మహారాజు మిమ్మల్ని పిలుచుకు రమ్మని శెలవిచ్చారు,” సేవకుడు చెప్పేడు అక్రూరుడితో.
“సరే పద పోదాం” నిలుచున్నపాటే బయల్దేరేడు.
వచ్చిన అక్రూరుడితో చెప్పేడు కంసుడు, “చూడూ నువ్వు నాకు బాగా ఆప్తుడవనీ, నా క్షేమం కోరేవాడివనీ ఇలా పిలిచి చెప్తున్నాను. అక్కడ గోకులంలో కుర్రాళ్ళిద్దరూ నా గుండెల్లో బల్లెంలా తయారయ్యేరని నీకు తెల్సిందే కదా? రాబోయే రోజుల్లో నేను ధనుర్యాగం మొదలు పెడుతున్నాను. ఆ కుర్రాళ్ళని ఇద్దర్నీ ఎలాగో ఒకలాగ – మందు పెట్టో, మభ్య పెట్టో…”
అక్రూరుడు కంసుడికేసి తలెత్తి చూసేడు. నవ్వొచ్చింది కంసుడి మాటలకి. ఈయన పంపించిన రాక్షసులందర్నీ ఒంటిచేత్తో చంపేసిన కృష్ణుణ్ణి, లీలామానుషవిగ్రహుడనీ, సాక్షాత్తూ భగవంతుడనీ ప్రపంచం అంతా అనుకునే కృష్ణుణ్ణి మభ్యపెట్టో మందు పెట్టో ఏదో చేయాలిట! కంసుడి మతి గానీ పోలేదు కదా?
“…వింటున్నావా? ఎలాగో ఒకలాగ ఇక్కడకి తీసుకొచ్చావంటే నా దగ్గిర ఇద్దరు మల్ల యుద్ధ యోధులున్నారు – చాణూర ముష్టికులని – వాళ్ళిద్దరితో ఆ కుర్రాళ్ళని చంపించేస్తాను. పీడ విరగడౌతుంది. ఏదో ఒకటి అడ్డొచ్చి ఈ కుర్రాళ్ళు మల్ల యుద్ధంలో చావకపోతే మిగిలిన ఉపాయం ఏమిటంటే మన భద్రగజం ఉంది గదా – కువలయాపీడం, దానిచేత వీళ్ళని తొక్కించేయడమే. అర్ధం అయిందా?”
“సరే” చావబోయేవాళ్ళ జాబితా చదివిన కంసుణ్ణి చూస్తూ తలాడించేడు అక్రూరుడు.
“ఎప్పుడు బయల్దేరుతావు?”
“రేపే బయల్దేరమని శెలవా?” చావడానికి కంసుడికంత తొందరెందుకో?
“నాకు తెలుసు నువ్వు నా క్షేమం కోరేవాడివని. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అక్కడ చెప్పకు సుమా? ఇవన్నీ తెలిస్తే కుర్రాళ్ళు బెదిరిపోయి నీకూడా రావడానికి భయపడొచ్చు. జాగ్రత్త మరి. నువ్వు మంచి మాటకారివి. కపటం అదీ లేకుండా మాట్లాడు. వెళ్ళిరా.”
కంసుడి దగ్గిర్నుంచి వెనక్కి వచ్చిన అక్రూరుడి ఒళ్ళు గాలిలో తేలుతున్నట్టుంది. రేపీపాటికి తనకి లీలామానుష విగ్రహుడైన భగవంతుడి దర్శనం కాబోతోంది. ఏం తపస్సు చేశాడు తాను? తెలిసో తెలియకో పాత్రులైన వాళ్ళకి ఏదైనా దానం చేశాడా? ఇంటికొచ్చి పడుకున్నాడన్న మాటేగానీ రాత్రంతా కలత నిద్రే. కంసుడి దగ్గిర్నుంచి వచ్చాడంటే వీడు కూడా రాక్షసుడై ఉంటాడని అనుకుని కృష్ణుడు తన కేసి కూడా చూడడేమో? నీ పేరేమో అక్రూరుడా, నువ్వు చేసేది కౄరుడైన కంసుడి దగ్గిర ఉద్యోగమా అని అందరి ముందు నవ్వి హేళన చేయడు కదా? అయినా కృష్ణుడు కనపడగానే ఆయన నోరు తెరిచే లోపుల కాళ్ళమీద పడి నమస్కారం చేస్తే నేను చేసిన తప్పులు క్షమించడా?
మర్నాడు ఉదయమే రథం బయల్దేరుతూంటే అక్రూరుడు చెప్పేడు సారథితో, “గోకులం వచ్చే ముందు కాస్త జాగ్రత్తగా చూసి చెప్పు నాయనా, కృష్ణుడి పాద ముద్రలు కనపడితే వాటికి నమస్కారం పెట్టుకుంటాను ముందు.”
“కృష్ణుడి పాద ముద్రలు గుర్తించడం ఎలా?”
“పద్మయుగళం, చక్ర, చాప, హల, జలచర రేఖాంకితాలు ఉంటాయి. అవే కొండ గుర్తు”
“తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను,” రథం మధురానగరం వీధుల్లోకి సాగిపోయింది.
కంసుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా తెలిసిందో, రథం ముందుకి నడుస్తూంటే ప్రజలు చెవులు కొరుక్కోవడం తెలుస్తోంది. ఎదురుగా వచ్చే త్రివక్ర అక్రూరుణ్ణి చూసి పక్కకి తప్పుకుంది. రథం తనని దాటి పోతుంటే ఒక్కసారి ఏదో గుర్తొచ్చిన దానిలా గొంతెత్తి అరిచింది.
“నువ్వు కానీ కృష్ణుణ్ణి మధురానగరం తీసుకొస్తే మా గురువుగారు – సుదాముడు నడుపుతూన్న పూల అంగడికి రమ్మని చెప్పడం మర్చిపోకేం?”
అక్రూరుడు వెనక్కి చూశాడు రథం లోంచి ఎవరా అరిచింది అనుకుంటూ. నడుము వంగిపోయి మరుగుజ్జులా నేలకంటుకు పోయి ఉన్న త్రివక్ర రథం పైనున్న అక్రూరుడికి కనిపించలేదు. తల తిప్పి ముందుకి దృష్టి సారించేసరికి ఎదురుగా వీధి మధ్యలో తప్ప తాగిన రజకుడు.
“కృష్ణుడి దగ్గిర కేనా? ఇలా వీధిలోకి రమ్మను. నా నడుమ్మీద కొరడా దెబ్బలు చూడమను. నాలాంటి అమాయకుల్ని కాదు చావగొట్టించడం. దమ్ములుంటే వచ్చి కంసుణ్ణి చంపమను. నా తఢాఖా …”
తాగిన మైకంలో వాగుతున్న రజకుణ్ణి సైనికులు పక్కకి లాగేరు. రథం మెల్లిగా సాగుతూంటే అక్రూరుడికి తెలిసొచ్చింది. కంస పాలన ఎలా ఉందో. ఇలా వీధిలో అందరూ అడిగేవన్నీ తాను కృష్ణుడికి చెప్పాలి. ఆయన్ని చూడగానే తనకివన్నీ చెప్పడానికి నోరు పెగలాలి. ఏమో, ఇంతా చేసి తన అదృష్టం ఎలా ఉందో?
గోకులం దగ్గిర పడుతూంటే రథసారథి ఆపి చెప్పేడు, “ఈ తోపుల దగ్గిర కృష్ణుడి పాద ముద్రలు కనిపిస్తున్నట్టున్నాయి చూడండి.”
రథం దిగి సునిశితంగా గమనించేడు అక్రూరుడు, “అవును ఇవే.” కనపడిన ప్రతి పాద ముద్ర దగ్గిరా ఆగి నమస్కారం పెడుతూ నడక సాగించేడు. రథం మెల్లగా వెనకనే నడుస్తూంది.
దాదాపు ఊరి బయటకి వచ్చేసరికి అక్కడే ఉన్న నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై జల్లెడు వాడు మౌళి పరి సర్పిత పింఛము వాడు కనిపించగానే పరుగున వెళ్ళి కాళ్ళమీద పడ్డాడు. ఇంతవరకూ కృష్ణుడు కనపడితే ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి అనుకున్న అక్రూరుడికి వాగ్భంధం అయినట్టుంది. అలా నవ్వు రాజిల్లెడు మోము వాడికేసి చూడడమే!
అక్రూరుణ్ణి పైకి లేపి అప్యాయంగా దగ్గిరకి తీసుకున్నాడు కృష్ణుడు. ఒళ్ళు జలదరించింది. ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేశాక దగ్గిరే కూర్చుని కృష్ణుడడిగేడు, “ఏం అక్రూరా, మీ రాజుగారూ, మా మామా అయిన కంసుడు కుశలమే కదా? మా తాత గారూ అందరూ బాగున్నారా? ఏమిటిలా వచ్చావ్ ఒక్కడివీ? నీకేమైనా కావలిస్తే నిస్సంకోచంగా అడుగు సుమా?”
ఎలాగో నోరు పెగుల్చుకుని తానొచ్చిన పని చెప్పేడు అక్రూరుడు. అలాగే కంసుడి ఆలోచనలూ, వేయబోయే ప్రణాలికలూ చెప్పేడు. అదే పనిగా మధురానగరంలో తాను చూసినవీ, ఎవరెవరు ఎలా మాట్లాడినదీ చెప్పి అన్నాడు, “నేను నిన్ను చూడ్డానికొచ్చాను తప్ప ఇవన్నీ పితూరిగా చెప్పడానికి కాదు సుమా? నీ ఇష్టం ఎలా ఉంటే అలాగే చేయి. నేను నీకు చెప్పేటంతటి వాణ్ణా?”
“నీ గురించి నాకు తెలియదా? నీ మనసులో అటువంటి శంకలేమీ పెట్టుకోకు. మనం రేపే బయల్దేరుదాం,” అన్నీ విని చెప్పేడు కృష్ణుడు.
రథం మధురానగరం కేసి కదులుతూంటే వెనక నుంచి గోకులవాసులు అనే మాటలు వినిపిస్తున్నాయ్. “ఈయన పేరు అక్రూరుడు. చేసేవన్నీ కౄరమైన పనులూను. లేకపోతే కృష్ణుణ్ణి కంసుడి చేత చంపించడానికి ఇంత దూరం వస్తాడా?”
ఇవి విన్న అక్రూరుడు కృష్ణుడికేసి దీనంగా చూసేడు. కృష్ణుడు మరేం ఫర్వాలేదన్నట్టూ అక్రూరుడి భుజం తట్టేడు. వాహనం మధుర సమీపిస్తూంటే దారిలో ఆపి సంధ్య వార్చడానికి అక్రూరుడు రధం దిగడం చూసి బలరాముడు హెచ్చరించేడు, “తొందర్లో వచ్చేయాలి సుమా, సాయంత్రానికి మనం మధుర చేరాలి మరి.”
అక్రూరుడటు వెళ్ళగానే, “నారాయణ, నారాయణ” అంటూ నారదుడు రధం దగ్గిరకొచ్చి అడిగేడు కృష్ణుణ్ణి, “స్వామీ ఏం జరగబోతోంది? అక్రూరుడి సంగతి సరే కానీ సుదాముడికీ, రజకుడికీ, త్రివక్రకీ కూడా కనిపించాలనే వెళ్తున్నావా మధురకి? పోనీ కనిపించావనుకో ఏం జరగబోతోంది వాళ్ళకి?”
“వేచి చూడు నారదా. తినబోతూ రుచులెందుకు?” నవ్వేడు కృష్ణుడు.
యమునలో నీళ్ళలో దిగి మునిగేసరికి అక్రూరుడికి కనిపించిందో అద్భుతమైన దృశ్యం – శేషతల్పం మీద యోగనిద్రలో మహావిష్ణువు. పరీక్షగా చూస్తే ఆ విష్ణువు ముగ్ధమనోహరంగా నవ్వే ఈ బాలకృష్ణుడే. కల కనడం లేదు కదా అనుకుంటూ నీళ్ళ లోంచి పైకి లేచి రధం మీదనున్న రామకృష్ణులకేసి కళ్ళు నులుపుకుని దృష్టి సారించేడు. అదే నవ్వు; రెండోసారీ, మూడోసారీ కూడా నీళ్ళలో ముణిగినప్పుడు కనిపించిన దృశ్యం అదే.
ఏమో నా మనస్సు ఏ స్థితిలో ఉందో అనుకుంటూ రధం దగ్గిరకొచ్చేసరికి కృష్ణుడు అడుగుతున్నాడు నవ్వుతూ, “యమున అంత దగ్గిర్లో ఉంది కదా, ఏవో మాయలు చూసినట్టు నీ మొహంలో ఆశ్చర్యం కనిపిస్తోంది. ఏం విశేషాలు కనపడ్డాయో యమునలో?”
“నీ మోములో లేని మాయా విశేషాలు యమునలో ఏముంటాయి కృష్ణా?” గొంతు గద్గదకమైపోతూంటే అన్నాడు అక్రూరుడు.
రథం నగర పొలిమేరల్లోకి చేరగానే ఆపించి చెప్పేడు కృష్ణుడు, “ఇప్పుడు మేము నగరం చూసి రేపు నీ ఇంటికి వస్తాం. అప్పటిదాకా నీ పనులు చూసుకో. మామతో మేము మధుర వచ్చామనీ రేపు పొద్దున్నే వచ్చి అంతు చూస్తామనీ చెప్పడం మర్చిపోకు సుమా”
రథం కదిలిపోగానే బలరామ కృష్ణులు నగరం లోకి నడిచేరు. ఎలా చేరిందో వార్త – జనం చూడ్డానికి ఎగబడుతుంటే చూసి – ఎవరో ఒకడు రజకుడికి చేరవేసేడు. అప్పటికే బట్టలమూట నెత్తి మీద పెట్టుకుని వస్తూన్న రజకుడికి ఒళ్ళు మండిపోయింది.
“రానీయ్ చెప్తాను. పేరుకేమో ఈయన భగవంతుడు. నేను చేయని పనికి నన్ను కంసుడు కొరడా దెబ్బలు కొట్టిస్తే ఊరుకుంటూ కూర్చుంటాడా? భగవంతుడికేమో పక్షపాతం ఏమీ లేదని అంటారే? లేకపోతే నన్ను కొరడా దెబ్బలు కొట్టించే కంసుడికింత సంపదా, దాసదాసీ జనం అన్నీను; నాకేమో కొరడా దెబ్బలూను. నన్నిలా ఏడిపించకపోతే ఒక్క దెబ్బతో చంపి పారేయరాదూ? ఈ కంసుడి దగ్గిర ఉద్యోగం కన్నా చావే మేలు…” కోపం అంతా మొహంలో చూపిస్తూ కృష్ణుడికి ఎదురుగా వచ్చేడు రజకుడు.
“ఏమోయ్ ఈ బట్టలెవరికీ? మేము ఇప్పుడే గోకులం నుంచి వస్తున్నాం. ఈ నగరంలో జనం చూడబోతే బాగా ధనవంతుల్లా ఉన్నారు. మాకు కట్టుకోవడానికి మంచి బట్టలివ్వరాదూ?” కృష్ణుడు అడగడం విని రజకుడి కోపం ఎక్కువైంది.
“ఏవిటేవిటీ? నువ్వే చెప్తున్నావ్ కదా గోకులం నుంచి వచ్చాననీ? అక్కడ పాలూ వెన్నా తిని ఒళ్ళు బాగా కొవ్వెక్కి బలిసినట్టున్నావ్ కాబోలు; లేకపోతే కంస మహారాజు బట్టలు కావాలా నీకు? తప్పుకో పక్కకి. కంసుడికి తెలిస్తే నిన్ను చంపించి నన్ను మళ్ళీ కొరడాతో కొట్టిస్తాడు. ఇంతకీ నువ్వు నన్ను కొట్టించడానికే కదా పుట్టిందీ? లేకపోతే….”
కోపంతో కళ్ళు ఎర్రబడుతుంటే కృష్ణుడన్నాడు, “ఒరే రజకా, కంసుడికి రేపట్నుంచి మళ్ళీ బట్టలు కట్టుకునే అవసరం లేదు కానీ ఇవి మాకిస్తావా లేదా?”
“ఇవ్వను గాక ఇవ్వను. నీ చేతనైంది చేసుకో,” అప్పటికే కంసుడివల్ల చాలా దెబ్బలు తిని రోజూ నాకు చావొస్తే బాగుణ్ణు అనుకుంటూ గడిపిన రజకుడు చెప్పేడు ధృఢంగా.
ఒక్కసారి మెరుపు మెరిసినట్టైంది కళ్ళ ముందు. తర్వాత మెడ మీద తగిలిన దెబ్బా, దాని ప్రభావం తెలుస్తూంటే రజకుడు నేలకొరిగిపోయేడు. కళ్ళ ముందు కనిపించిన దృశ్యంలో నల్లనివాడి పద్మనయనంబులవాడి మనోహరమైన రూపం కదులుతుంటే రజకుడి ప్రాణాలు గాలిలో కల్సిపోయేయి.
రామకృష్ణులు నగర వీధుల్లోకి నడక సాగించేరు. ఎదురుగా లేపనాలు పట్టుని నడుస్తూ త్రివక్ర! కనిపించిన కృష్ణుణ్ణి చూస్తూనే నోరు తెరుచుకుని మాట రాక అలా చూస్తూ ఉండిపోయింది. భగవంతుణ్ణి చూస్తూనే మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలూ పనిచేయడం మానేస్తాయని సుదాముడు చెప్పినది కూడా గుర్తు రాలేదు త్రివక్రకి. అలా తెల్లబోయి చూస్తోన్న త్రివక్ర దగ్గిరకొచ్చి నవ్వుతూ అన్నాడు కృష్ణుడు:
“అమ్మాయీ, నువ్వు చూడబోతే చక్కనిదానిలా కనిపిస్తున్నావు. ఈ లేపనాలు ఎవరికో మరి? ఇప్పుడే మేము ఈ కొత్త బట్టలు వేసుకుని మధురానగరం చూడ్డానికి బయల్దేరేం. ఈ లేపనాలు మాకిచ్చావంటే అవి పూసుకుని మధురానగరం చూడాలని ఉబలాట పడుతున్నాం. ఇవ్వననవు కద?”
తన వంకర శరీరం, అవకరాలూ, సుదాముడు చెప్పిన విషయాలు చటుక్కున మనసులో మెదిలేయి. త్రివక్రకి నోట మాటరాలేదు. కృష్ణుడు చేత్తో తనని తట్టీ మళ్ళీ అడుగుతుంటే, ఒక్కసారి తెలివి తెచ్చుకుని “నువ్వు అందగాడివేలే, అందరికీ అటువంటి అందం ఎక్కడనుంచి వస్తుంది? నన్ను చక్కనిదానివని వెక్కిరించడం దేనికీ? ఈ లేపనాలన్నీ కంసుడి కోసం చేశాను కానీ మీక్కావాలిస్తే తప్పకుండా తీసుకోండి.” అంది సంతోషంగా.
కృష్ణబలరాములు లేపనాలు ఒంటికి రాసుకున్నాక కృష్ణుడు అన్నకేసి చూసేడు. సరే అన్నట్టూ రాముడు తలూపడం చూసి కృష్ణుడు తన పాదం బొటనివేలు త్రివక్ర కాలి మీద ఉంచి చూపుడు వేలు గడ్డం కింద ఆనించి పైకి లేపేడు.
గ్రీష్మ ఋతువులో పెరిగే మల్లెతీగలా, పరవళ్ళు తొక్కే యమునా నదిలా మరుగుజ్జు లాంటి త్రివక్ర కింద నుంచి పైకి వంకర్లన్నీ పోయి తీగలాగా సాగుతూ కృష్ణుడి ఎదురుగా నిలబడింది. కాసేపు తనకేం జరిగిందో అర్ధం కాలేదు. ఇన్నేళ్ళలోనూ నేల అంత దగ్గిరగా కనిపించేది ఇప్పుడు దూరమైనట్టుందే? కళ్ళు నులుపుకుని మళ్ళీ చూసింది నేల కేసీ ఎదురుగానున్న కృష్ణుడి కేసీ. బలరాముడు చిరునవ్వు నవ్వుతున్నాడు. పక్కనున్న జనంలో ఎవరో “అత్యద్భుతం హరే! అత్యద్భుతం హరే!!” అంటూ అరవడం త్రివక్రకి వినిపించింది.
ఒక్కసారి కృష్ణుడి చేయి పట్టుకుని వదలకుండా అంది త్రివక్ర, “నన్ను ఇలా చేసినందుకు నీకేమిచ్చినా ఋణం తీరదు. నా ఇంటికి వచ్చి సంతోషపెట్టు.”
“మా పని అయ్యేక వస్తాం, ఇప్పుడు కుదరదు సరేనా?” నవ్వుతూ అన్నదమ్ములు ముందుకి సాగిపోయేరు. రజకుడినీ త్రివక్రనీ చూడడం అయిపోయింది. మంచి బట్టలూ లేపనాలు ధరించడం అయింది. మిగిలినది ఒక్క మెడలో పూలమాల మాత్రమే. తిన్నగా నడుచుకుంటూ సుదాముడి అంగడి దగ్గిరకొచ్చేరు.
తన ఎదురుగా కనబడిన వాళ్ళని చూసి కాళ్ళు తొట్రుపడుతూంటే లేవలేక లేచి స్వాగతించేడు సుదాముడు, ఎటువంటి అదృష్టం తనకి అనుకుంటూ. అడగకుండానే తమకి కావాల్సిన పూలమాలలన్నీ ఇచ్చి స్వహస్తాలతో అలంకరించిన సుదాముణ్ణి చూస్తూ, “నీకేం కావాలో సందేహించకుండా కోరుకో ఇస్తాను,” అడుగుతున్నాడు కృష్ణుడు.
జ్ఞానం వచ్చినప్పటునుంచి తాను అహోరాత్రాలు ఎవరికోసమైతే కలవరించాడో ఆయన, తన ఎదురుగా నిల్చుని ఏం కావాలో కోరుకో అని అడుగుతున్నాడు. తనకా? ఏం కావాలి? ఒక్కసారి జ్ఞాననాడి కదిలినట్టయ్యి “నీ పాద కమలసేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపార భూత దయ తప్ప ఇంకేమీ వద్దు,” మనఃస్ఫూర్తిగా అన్నాడు సుదాముడు.
“లెస్సగా అడిగావు సుదామా, నువ్వు కోరింది తప్పకుండా పొందుతావు. ఇప్పుడు ధనుర్యాగం కోసం కంసుడు ధనస్సు ఎక్కడుంచాడో చెప్పు.”
దారి చూపించి, అలాగే అపస్మారకంగా కనురెప్పలు ఆడకుండా తమకేసి చూసే సుదాముణ్ణి వదిలి ముందుకి కదిలిపోయింది అన్నదమ్ముల ద్వయం.
నాలుగు రోజులు గడిచేయి.
కంసుడి భద్రగజం కువలయాపీడం మట్టి కరిచింది చాణూర ముష్టికులూ, చివరికీ కంసుడూ మరణించారు. ఉగ్రసేనుడికి మధురానగర పట్టం కట్టడం, కృష్ణుడు ముందు మాట ఇచ్చిన ప్రకారం అక్రూరుడింటికీ, త్రివక్ర ఇంటికీ వెళ్ళడం అయింది. మధురానగరం విడిచి వెళ్ళిపోతుంటే దారిలో నారదుడు కనిపించి అడిగేడు కృష్ణుణ్ణి:
“భగవంతుడు కనపడినప్పుడు మద, మోహ, మాత్సర్యాలు ఏవైనా మిగిలితే అవి పోయి బ్రహ్మ జ్ఞానం కలగాలి కదా? మరి ఈ రజకుడికి ఎందుకలా అయింది? త్రివక్రకీ, సుదాముడికీ ఎందుకు అలా వరాలిచ్చావు?”
“నారదా నా భక్తుడికి నేను దాసుణ్ణి. నీ గురించి ఎంతకాలమైనా వేచి ఉండగలను అనుకునే భక్తుడూ, ఎవరికెక్కువ సహనం ఉందో చూద్దాం అనుకునే నేనూ పందెం వేసుకుంటే నేనెప్పుడూ ఓడిపోతూ ఉంటాను. ఈ విషయంలో నేను పూర్తిగా అశక్తుణ్ణి. నాకేసి భక్తుడొక అడుగువేస్తే నేను ఎంతో ఆదరంగా పది అడుగులు ముందుకు వెళ్ళాలి. కానీ వెళ్ళాక ఆ భక్తుణ్ణి నాలో కలుపుకోవడానికి ఆస్కారం ఇద్దామనుకుంటూంటే వాళ్ళ కర్మల్ని బట్టీ, మనో భావాల బట్టీ నాకిది కావాలి నాకది కావాలి అని అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళ ఇష్టాల్ని కాదనలేక అసలు వీళ్ళకేమి కావాలో తెలుసో తెలియదో, వీళ్ళేం అడుగుతారో చూద్దాం అనుకుంటూ ముందు వాళ్ళని అడుగుతూ ఉంటాను, మీకేం కావాలో కోరుకోండి, అని. వాళ్ళో సారి కోరికలు అడిగేసరికి ఇచ్చిన మాటకి కట్టుబడి వాళ్ళు కోరినది ఇస్తూ ఉంటాను. నువ్వే చూశావు కదా? రజకుడు వాడికి తగిలిన కొరడా దెబ్బలకి తప్పు నాదేననీ, నాచేతిలో చావొస్తే బాగుణ్ణనీ రాత్రీ పగలూ కలవరించేడు. అలాగే త్రివక్ర ఒక్కసారి మంచిరూపం వచ్చేసరికి తనని సంతోషపెట్టి నా వల్ల పిల్లల్ని కనాలనుకుందేకానీ జ్ఞానం ఇమ్మని అడగలేదు. సుదాముడొక్కడే సరిగ్గా జ్ఞానిలాగా తనకేమి కావాలో తెల్సి అడిగాడు. ఎవరు అడిగింది వాళ్ళకి ఇచ్చాం. యద్భావం తద్భవతి. ఇంతకన్నా నన్నేం చేయమంటావు నారదా?”
“నారాయణ, నారాయణ” చేతులు జోడించేడు నారదుడు. రథం గోకులం వైపు సాగిపోయింది.