తెల్ల కాయితం

కొత్తపాళీ బ్లాగులో ఇచ్చిన ఇతివృత్తానికి కథ రాయండి అనే సవాలుకి జావాబుగా వచ్చిన కథ ఇది.


కోటిగాడికి పొద్దుట లేచినప్పట్నుంచీ మహా చిరాగ్గా ఉంది. క్రితంవారం ఇచ్చిన హోంవర్కు ఈపాటికి స్కూల్లో ఇవ్వాలని ప్రకాశం మాస్టారు చెప్పారు. ఇవ్వకపోతే పెద్ద పరీక్షలకి వెళ్ళనివ్వరనీ చెప్పారు. నాన్నకి ఎన్నిసార్లు చెప్పాడో – నాన్నా నాకు తెల్ల కాయితాలు కావాలీ హోంవర్కుకీ అనీ. ఇంట్లో ఎవ్వరికీ వాడి అరుపులు వినిపించలేదు. నాన్నేమో ఎప్పుడూ వాడు పడుకున్నాక లేటుగా వచ్చి మళ్ళీ వాడు లేచేలోపులే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. అమ్మతో చెప్తే ’చూద్దాం లేరా, నాన్న రానియ్యి’ అంటోంది. ఎప్పుడో హోంవర్కు అంతా చేసి పెట్టుకున్నాడు పాతకాయితాలమీద. కొత్తకాయితాలు ఇస్తే ఒక్క అరగంటలో ఫెయిర్ కాపీ రాసి ప్రకాశం మేస్టారుగారికి ఇచ్చేయగల్డు. రాత్రి నాన్న వచ్చేదాకా పడుకోకుండా కాసుక్కూర్చుని అన్నం తింటూంటే చెప్పాడు కూడానూ. కోటి చెప్పిందంతా విని ఇలాగన్నాడు నాన్న.

“అదేంటీ ఇప్పుడు కొత్తగా అడుగుతావ్? మనం ఇంటద్దే, పప్పు, ఉప్పూ కొనుక్కునేసరికి మనదగ్గిరేఁవుందీ? ఏదో తంటాలు పడుతూ ఆ పాత కాయితాల మీదే రాసుకుంటున్నావు కదా? ప్రకాశం మేష్టారు కూడా ఫర్లేదన్నారుగా? మళ్ళీ ఏదేనా అన్నారా? నన్నెళ్ళి మాట్టాడమంటావా?”

“మాస్టారేవన్లేదనుకుంటా. వాడికే నామోషీగా ఉంది గావోసు, వాడి ఫ్రెండ్స్ అందరూ కొత్త కొత్త పెన్నులూ, పుస్తకాలూ, కాయితాలూ తెచ్చుకుంటూంటే. ఏరా కోటీ, ఇలారా ప్రకాశం మేష్టారు మంచాయనే, ఏవైనా అన్నారా ఎవరైనా?” అంది అమ్మ పక్కనుంచి.

వెక్కుతూ ముక్కుతూ ఏడుస్తూ అంతా చెప్పాడు కోటి. మున్సబు గారబ్బాయి రమేషూ, ఫాన్సీషాపు ఓనరుగారబ్బాయి గురువారెడ్డీ, ఆఖరికి పక్కవీధిలో ఉండే అవధాన్లుగారమ్మాయ్ సుబ్బలక్ష్మీ రోజూ తనని ఏడిపిస్తున్నారనీ. ఎప్పుడూ దరిద్రపుగొట్టు పాతకాయితాలు పట్టుకొస్తున్నాననీసి. ’నీ బట్టలూ, నీ కాయితాలూ చూస్తేనే తెలిసిపోతోంది కోటీ, నువ్వు కోటి దరిద్రం గాడివనీ’ అని రోజు తన్ని చూసి నవ్వుతున్నారనీ. ఇదంతా విన్నా వాడి నాన్నకి ఏమీ పట్టలేదు. ఫెళ్ళున ఒక్క నవ్వు నవ్వీసేడు. గొంతుక పొలమారుతూంటే, అమ్మ అందిచ్చిన గ్లాసులో మంచినీళ్ళు తాగి – ’ఒరే కోటీ, ఏ కాయితాలమీద రాస్తున్నావనేది కాదురా, ఏఁవి రాస్తున్నావనేది ముఖ్యం. నువ్వు రాసేది మీ మాస్టారికి అర్ధం అయ్యిందా? నేకెన్ని మార్కులొచ్చాయ్? ఇవే చూసుకోవాల్సినవి. ఈ పిల్లకాయలు కొంతకాలం ఏదో వాగుతారు. ఇవ్వాళేం వాగుతారో రేపటికి గుర్తుండదు వాళ్ళకి. బాగా చదూకుంటే నువ్వు పెద్దయ్యాక బోల్డు కాయితాలు కొనుక్కోచ్చు. ఏఁవంటావ్?” అనీ ఇంకా ఎవో రకరకాల కథలు చెప్పేసి కోటిగాడిని నిద్రపుచ్చేసాడు.

కోటిగాడికి మాత్రం దరిద్రం వదల్లేదు ఈసారి కూడా. ఈ హోంవర్కు కూడా పాతకాయితాలమీదే ఇవ్వాలి. ఈ కాయితాలు కూడా వాడి నాన్న ప్రెస్సులోంచి పట్టుకొచ్చినవే. నాన్న పన్జేసే ప్రెస్సులో ఎన్నో రీముల తెల్ల కాయితాలు చూసాడు కోటి. ఓ పదో పదిహేనో కాయితాలు తేడే తనకి ప్రెస్సులోంచి? అక్కడకీ వాడోరోజు అడిగేసాడు కూడానూ. “నాన్నా నీ ప్రెస్సులోంచి ఓ పది కాయితాలు తెచ్చి నాకిచ్చీరాదూ హోంవర్కు చేస్కుంటానూ?” అనీసి. ’తప్పురా, ఆ కాయితాలు మనవి కాదు. అలా దొంగతనం చేయకూడదు. గాంధీ గారేంచెప్పారో మర్చిపోయావా? పుస్తకాల్లో చదవడఁవే కాదు. చేసి చూపించాలి’ అన్నాడు వాడి నాన్న. తర్వాత అడిగితే అమ్మ కూడా ఇలాగే అంది ’తప్పు నాన్నా, మనకున్నంతలో ఒద్దిగ్గా అలాగే ఉండాలి. దొంగతనం, మళ్ళీ దాన్ని దాచడానికి అబద్ధాలూ, ఎందుకొచ్చిన గోల? ఇంకా నీకు కావలిస్తే నేను మీ మేస్టారితో మాట్లాడాతాను.’ కానీ కోటి వద్దనీసేడు. మేస్టారెప్పుడూ మంచాయనే, ఏవీ అనరు కదా?

ఓ గంట కూర్చుని తొందరగా హోంవర్కు అంతా ఫెయిర్ కాపీ వేరే ఒకవేపు కాయితాలమీద రాసేసి కోటి స్కూలికి తయారయ్యాడు. అన్నం తిని ఇలా బయల్దేరాడో లేదో కానీ, కోటి పుస్తకాలు పట్టుకున్న చేతివేపే దూసుకుంటూ పోయిందో మోటార్ సైకిలు. అదురుతున్న గుండెల్తో కోటి పక్కకి గెంతాడు కానీ లేకపోతే ఏక్సిడెంటు అయ్యేదే. పుస్తకాలన్నీ కింద పడిపోయాయ్. దుమ్ములోంచి వాట్ని ఏరుకూంటూంటే మోటార్ సైకిలు వెనక కూర్చున్న రమేషు కోటిగాడికేసి చెయ్యూపుతూ నవ్వుతున్నాడు. వాడి నాన్నే కదూ కావాలని నన్ను ఒరుసుకూంటూ పోనిచ్చాడూ బండి? ఎంత మున్సబు అయితేమాత్రం ఇంత పొగరా? వెనక కూర్చున్న రమేషుగాడే కోటిగాడ్ని చూపించి ఉంటాడు వాళ్ళ నాన్నకి.

కోటి స్కూలుకెళ్ళేసరికి అప్పుడే ఫస్ట్ బెల్లు కొట్టేసారు. కంగారుగా క్లాసులోకి పరుగెట్టి మేస్టారికి హోంవర్కు ఇచ్చేసాడు. తన సీట్లోకొచ్చి పుస్తకాలు సర్దుకూంటూంటే కనిపించిందో కాయితం. ’ఇదేంటీ, తనదగ్గిరకి ఈ తెల్లకాయితం ఎలా వచ్చిందీ?’ అనుకుంటూ దాన్ని అటూ ఇటూ తిప్పిచూసాడు కోటి. ’తానెప్పుడూ పాత ఒకవేపు ఖాళీ ఉన్న కాయితాలమీదే రాస్తాడు కదా? ఈ కాయితం తనది కాదు. రెండు వేపులా ఖాళీగా ఉన్న కాయితం తనదగ్గిరకెలా వచ్చిందీ?’ పరధ్యానంగా మేష్టారు చెప్పే పాఠం వింటూంటే చటుక్కున గుర్తొచ్చింది. ఇందాక రోడ్డుమీద తన పుస్తకాలు పడిపోయినప్పుడు ఎవరిదో కాయితం కల్సిపోయింది. తానూ చూసుకోలేదు స్కూల్ తొందర్లో. దీని మీద తాను తరవాత మాంఛి దస్తూరితో అందంగా రాసుకోవచ్చు. ఇలాగ దొరికిన కాయితం మీద ఊహల్లో తేలిపోతూ కోటి అపురూపంగా దాన్ని పెద్దపుస్తకంలో దాచాడు ఎవరికీ కనపడకుండా. సాయంకాలం ఇంటికొస్తూంటే, కోటిగాడి చిన్ని బుర్రలో ఎన్నో ఆలోచనలు. “అమ్మకి చూపించి అమ్మ ఎలా చెప్తే అలా చేయొచ్చు. నాన్నకి చూపిస్తే ఎక్కడైనా దొంగతనం చేసానంటాడేమో? అమ్మ ఒప్పుకుంటే తర్వాత నాన్నక్కూడా చూపించొచ్చు….”

రాత్రి ఇంటికొచ్చాక అమ్మకి చూపించాడు తనకి దొరికిన తెల్లకాయితం. అమ్మ మొహంలో చూడాలి ఎంత సంతోషమో! ’ఒరే ఇదెక్కడదీ’ అనడిగింది కూడాను. తానెక్కడ దొంగతనానికి దిగుతున్నాననుకుందో. ’రోడ్డుమీద దొరికిందోచ్’ అన్నాడు కోటి, ’నేను ఎన్ని దెబ్బలైనా పడతానుకానీ దొంగతనం చేస్తానా?’ రాత్రి నాన్నక్కూడా చూపించాడు. నాన్న మాత్రం ఎప్పటిలాగానే నవ్వి ఊరుకున్నాడు. ఎప్పుడో నిద్రపడుతూంటే వాడి నాన్న అమ్మతో దొరికిన తెల్ల కాయితం గురించి మాట్టాడుతూ ’పిచ్చి వెధవ’ అన్నట్టుగా లీలగా వినిపించింది కోటికి.

మర్నాడు కోటిగాడి క్లాసులో చెప్పారు ప్రకాశం మేష్టారు ’వచ్చే సోమవారం ఇన్సెక్టర్ గారొస్తున్నారు మన్నందర్నీ తనిఖీ చేయడానికి. అందరూ మాంఛి బట్టలేస్కుని, మీకిచ్చిన హోంవర్కూ, అదీ పట్రాండి’ అంటూ. క్లాసైపోయాక కోటి వెళ్ళి అడిగాడు మేష్టార్ని. ’నాకెప్పుడూ మంచి కాయితాల్లేవూ ఎలాగా? కానీ తన దగ్గిర ఒక మాంఛి దొరికిన కాయితం ఉంది కదా? అది అన్నింటికన్నా పైన పెట్టేసి కింద మామూలు ఒన్ సైడు కాయితాలు చూపిస్తే ఫర్లేదంటారా?’ అని. మేష్టారు ఫర్లేదన్నాక ఏనుగెక్కినంత సంతోషంతో ఇంటికొచ్చాడు కోటి, అమ్మతో చెప్పడానికి. అప్పటికప్పుడు అమ్మ ఉన్న వాటిల్లోంచి కాస్త మంచి బట్టలు తీసి ఉతికి మడతబెట్టి ఉంచింది వాడికి.

అనుకున్న సోమవారం రానే వచ్చింది. తళతళ్ళాడుతూన్న మొదటి పేజీ మీద తన పేరూ, మిగిలిన హోంవర్కు కిందనా రాసి కోటి దర్జాగా మొదటి బెంచిలో కూర్చుని తన హోం వర్కు మేష్టారికిచ్చాడు. ఇన్స్పెక్టర్ గారు పొద్దున్నే వస్తారనుకుంటే మధ్యాహ్నం మూడింటికొచ్చారు. ఆయన వెనకనే బెత్తం పట్టుని హెడ్ మేస్టారు! ఇన్స్పెక్టర్ పిల్లల్ని ఏవో ప్రశ్నలడుగుతూంటే, హెడ్ మేష్టరు టేబుల్ మీద కాయితాలు చూస్తూ, పైన మెరిసే తెల్లకాయితం చూసి దాన్ని బొత్తిలోంచి బయటకి లాగి ఇదెవరిదీ అన్నాడు. మెరిసిపోయే పైనున్న తెల్ల కాయితం కిందనున్న రంగురంగుల ఒన్ సైడు పేపర్లని దాచడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ తన ఓటమిని ఈజీగా ఒప్పుకోడానికి తయారౌతోంది. ఇన్స్పెక్టరు హెడ్ మేస్టారుకేసి చూస్తే ఆయన ప్రకాశం మేష్టారి కేసి చూసి, కోటిగాడ్ని నుంచోపెట్టాడు. హెడ్ మేస్టారు పొద్దున్నుంచీ వెయిట్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ కోసం, ఆయన రాగానే ఓ మంచి ఇంప్రెషన్ కోసం. ఇప్పుడు ఆ అవకాశం కోటిగాడి రూపంలో వెతుక్కుంటూ వచ్చింది.

“ఆఖరికి ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారంటే కూడా మీకు లెఖ్ఖ లేదన్న మాట. పాత రంగు కాయితాలమీద ఇలాగేనా హోంవర్కు చేయడం? మళ్ళీ అది కనిపించకుండా పైన ఓ తెల్లకాయితం పెట్టేసి నా కళ్ళు కప్పుదామనుకున్నారా?” అంటూ హెడ్ మేష్టారు కోటిగాడి మీదకెళ్ళి బెత్తంతో చితకబాదాడు. హెడ్ మేస్టారు అంత కోపంగా కోటిగాడ్ని కొడుతూంటే క్లాసులో ఒక్కరూ కిక్కురుమనలేదు. ప్రకాశం మేష్టారు అడ్డుకుని చేతిలో బెత్తం లాక్కో పోతే కోటిగాడి ప్రాణం ఆ రోజు పోయేదే. ఆ బెత్తం లాక్కోవటంలో ఆఖరికి ప్రకాశం మేష్టారిక్కూడా దెబ్బలు తగిలాయి. కొట్టేసాక హెడ్ మేష్టారు ఇన్స్పెక్టర్ కేసి విజయగర్వం తో చూసాడు. ప్రకాశం మేష్టారు వెంటనే హెడ్ మేష్టార్నీ, ఇన్స్పెక్టర్నీ బయటకి తీసుకెళ్ళి చెప్పారు కోటి గురించి, కోటిగాడి కుటుంబం స్థితిగతుల గురించీ. క్లాసులోంచి బయటకొచ్చిన ఇన్స్పెక్టర్ హెడ్ మేస్టర్ని తల వాచేటట్టు చివాట్లు పెట్టి ఇంక ఏ క్లాసులూ చూడకుండా వెళ్ళిపోయాడు. హెడ్ మేష్టారి మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు.

ఏడుస్తూ ఇంటికొచ్చిన కోటిగాడ్ని చూసి వాడి అమ్మ ఆశ్చర్యపోయింది. ’ఏమైందిరా? వంటి నిండా ఆ దెబ్బలేంటీ?’ అంటూ. బావురుమంటూ జరిగిందంతా చెప్పాడు కోటి. అమ్మ వెంటనే ప్రకాశం మేష్టారింటికెళ్ళి అడిగింది. ’ఇలాగేనానండి కొట్టడం? రేప్పొద్దున్న వీడికేదైనా అయితే? వచ్చిన ఇన్స్పెక్టర్ బానే ఉన్నాడు కానీ ఈ హెడ్ మేస్టారు వీణ్ణి కొట్టడం దేనికీ? మనిషా పశువా? ఆయన్ని రానీండి చెపుతాను.’

రాత్రంతా కోటిగాడి వంటిమీద మందు రాస్తూ, అమ్మ, నాన్నా వాడి పక్కనే కళ్ళళ్ళో వత్తులేసుకుని కూర్చున్నారు. ’అమ్మా నాకు మంచి కాయితాలుంటే హెడ్ మేష్టారు కొట్టేవాడు కాదు కదే?’ ’నేను ఆ కాయితం దొంగతనం చేయలేదమ్మా సరస్పత్తోడే, నన్నెందుక్కొట్టారు మరీ?’ ’ప్రకాశం మేష్టారు కూడా ఫర్లేదన్నారుగా అమ్మా మరి నన్నెందుక్కొట్టేరే?’ కోటి కలవరిస్తూనే ఉన్నాడు. వళ్ళు సల సలా కాగిపోతూంటే అర్ధరాత్రి వాడి నాన్న వెళ్ళి డాక్టర్నీ, ప్రకాశం మేష్టార్ని తీసుకొచ్చాడు. డాక్టరిచ్చిన మందు వేసాక ప్రకాశం మేష్టారు కూడా తెల్లవారేదాకా కోటిగాడ్ని చూస్తూ కూర్చున్నాడు.

భళ్ళుమని తెల్లవారేసరికి కోటి ఇంటి తలుపు చప్పుడైంది. తలుపు తీస్తే ఎదురుగా హెడ్ మేష్టారు, వాళ్ళావిడా, ఓ పెద్ద పేకట్టు పట్ట్కుని ఓ ప్యూనూ. హెడ్ మేష్టారు కోటిగాడ్ని చూస్తూనే వెక్కుతూ ’కోటీ, నా కోపం ఇంతవరకూ తెస్తుందనుకోలేదు. తప్పంతా నాదే. మీ మేష్టారు చెప్తున్నా వినకుండా కొట్టేను నిన్ను. ఈ కొట్టడంలో మీ మేష్టారుక్కూడా దెబ్బల్తగిలాయి. ఇప్పట్నుంచీ నేను ఏ పిల్లగాడ్నీ కొట్టను. నీ గురించి మీ మేష్టారు చెప్పారు నాకు. నీకు ఇప్పట్నుంచీ ఎన్ని కావలిస్తే అన్ని కాయితాలు నేనే పంపిస్తాను. ఇదిగో ఈ ప్యూను పట్టుకొచ్చేడు చూడు పేకట్టు? అందులోనే ఉన్నాయి ఓ పది కొత్త నోట్ బుక్స్. అవి ఐపోయాక మీ మేష్టారు నాకు చెప్తే నేను మళ్ళీ పంపిస్తాను” అని ఇటువైపు తిరిగి ’అమ్మా, మీరిద్దరూ కోటిగాడి అమ్మా, నాన్నా అనుకుంటాను. ఇదిగో బెత్తం. మీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టండి. మిమ్మల్నీ క్షమించమని అడగాడినిక్కూడా నేను అర్హుడ్ని కాదు.” అన్నాడు.

నులక మంచంలో, మగత నిద్రతో జోగుతున్న కోటిగాడు హెడ్ మేష్టార్ని చూసి, గబుక్కున లేచి కూర్చున్నాడు ’కొట్టకండి, కొట్టకండి, అమ్మా నన్ను కొట్టడానికి మళ్ళీ ఒచ్చేరే, నేనేం చేసేనే? వద్దని చెప్పవే’ అని ఏడుపు లంకించుకుంటూ.

“లేదురా నాన్నా, కొట్టడానిక్కాదు. నీకు లేవని, ఆయన కొత్త పుస్తకాలు తెచ్చిచ్చాడూ” అన్నారు ముక్త కంఠంతో వాడి అమ్మా, నాన్నా రెండువైపుల్నించీ కోటిని పట్టుకుంటూ. ప్యూన్ తాను తెచ్చిన పేకేట్టు విప్పి కొత్త నోట్ బుక్స్ కోటిగాడి చేతిలో పెట్టాడు.

తనచేతిలో కొత్త పుస్తకాలు విప్పారిన మొహంతో చూస్తూనే, కోటిగాడు, ప్రకాశం మేష్టారికేసి తిరిగి ’మేష్టారూ, ఇవ్వేళ జరం మూలంగా స్కూల్ కి రాలేనండీ, ఓ రోజు హాజరు పడకపోతే ఫర్లేదంటారా?’ అన్నాడు ఇంకా వెక్కుతూనే.

“మరేం ఫరవాలేదు కోటీ. నువ్వు చాలా మంచివాడివనీ, బాగా చదూతావనీ ఇప్పుడే హెడ్ మేష్టారికి చెప్పేను. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను నిన్ను చూడ్డానికీ. అప్పటి దాకా సుబ్బరంగా మందు వేసుకుని పడుకో’ అంటూ బయటికి దారితీసేరు ప్రకాశం మేష్టారు. వెనకనే హెడ్ మేష్టారు.

అందరూ వెళ్ళిపోయాక కొత్త పుస్తకాల్ని గుండెలమీద పెట్టుకుని వాటిని రెండు చేతుల్తో కావలించుకుని అలాగే నిద్రలోకి జారుకున్నాడు కోటి.