పొద్దున్నే గుర్రాలని బయటకి తీసి బండి సిద్ధం చేస్తున్నాడు ఆక్సినోవ్. ఇప్పుడైతే ముఫ్ఫైల్లో పడి అక్కడో వెంట్రుకా ఇక్కడో వెంట్రుకా నెరుస్తోంది కానీ హుషారుగానే ఉన్నాడు. పట్నంలో సంత అంటే సరుకంతా అమ్మేసి ఊరంతా చూడొచ్చు. డబ్బులకి డబ్బులూ, వ్యాపారానికి వ్యాపారమూను. హుషారు కాదు మరీ? పనివాడు అమ్మే సరుకు బండిలో పెడుతూంటే గుర్రాలని చూస్తూ బండి ముందు నిలబడి ఉన్నాడు ఆక్సినోవ్.
ఈ లోపుల ఏదో కొంపలంటుకుపోతున్నట్టు ఇంటి లోపల్నుంచి ఆవిడ పిల్చింది, “కాస్త ఇలా రా లోపలకి,” అంటూ. విసుక్కుంటూ ఇంటివేపు కదిలేడు.
“ఏవిటి సంగతి?” లోపలకొచ్చిన ఆక్సినోవ్ అడిగేడు. ఆడవాళ్ళు ఎవరైనా ఇప్పుడు ‘నేను కూడా వస్తా’ అంటారేమో అని ఆక్సినోవ్ బెదిరిన మాట వాస్తవం. వాళ్ళు కానీ వస్తానంటే ఈ వేసవి పొద్దున్నే వేడెక్కకుండా బయల్దేరి వెళ్ళిపోదాం అనుకున్న ప్రయాణం బెడిసికొట్టినట్టే.
“రాత్రి పీడకల వచ్చింది నీ గురించి; ఈ రోజు ఎక్కడకీ వెళ్ళకు,” బతిమాల్తున్నట్టూ అంది భార్య.
“ఏంటా కల? నేను సంతకి వెళ్తే డబ్బులన్నీ వోడ్కా తాగి తందనాలాడతానని కదూ నీ భయం?”
“కాదు, నీ జుట్టు పూర్తిగా ముగ్గుబుట్టలా తెల్లబడిపోయినట్టూ, నువ్వెంతో ముసలి వాడివైపోయినట్టూ వచ్చింది కల.”
ఆక్సినోవ్ నవ్వేడు. “తెల్లజుట్టు అదృష్టానికి సంకేతం. నేను సరుకంతా అమ్మేసి ఒక్క గ్లాసుకూడా వోడ్కా తాగకుండా వెనక్కి వస్తాను సరేనా? ఒకప్పుడు కొంచెం మందు ఎక్కువ కొట్టి చెత్తగా ప్రవర్తించిన మాట నిజమే కానీ పెళ్ళయ్యాక అన్నీ మానేశానని నీకూ తెలుసు.”
“అది కాదు, ఎందుకు నాకు భయం వేస్తోందో నాకే తెలియదు. ఈ కల మూలానే అలా అనిపిస్తోంది. నువ్వు తాగుడు మానేశావని తెల్సినా. ఈ రోజు ప్రయాణం మానుకోకూడదూ?”
కాసేపు వాగ్యుద్ధం అయ్యేక ఆక్సినోవ్, పనివాడితో కల్సి సంతకేసి బయల్దేరేడు. బండిలో పక్కనే ఒక గిటార్, టీ కాచుకునే సరంజామా అంతా ఉంది. సాయంత్రం ఏదో పూటకూళ్ళ ఇంట్లో ఉండి రేపటికి సంతకి వెళ్తే మూడురోజుల్లో ఇంటికొచ్చేయవచ్చు. బండి సాయంకాలానికి దారిలో పూటకూళ్ళ ఇంటికి చేరింది. అదే సంతకి వెళ్తున్న వేరే ప్రయాణీకుడు కలిసేడు ఆక్సినోవ్‌కి అక్కడే. ఇద్దరూ రాత్రి భోజనం చేసి కబుర్లు చెప్పుకున్నాక ఆక్సినోవ్ లేచి చెప్పేడు.
“రేపు పొద్దున్నే నేను సంతకి వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ కల్సుకుందాం, నాకు నిద్ర వస్తోంది.”
మర్నాడు తెలవారగట్లే ఆక్సినోవ్ లేచి ప్రయాణం సాగించేడు. దాదాపు పాతిక మైళ్ళు ప్రయాణం తర్వాత గుర్రాలకి మేత పెట్టడానికి బండి ఆపాడు పనివాడు. పనిలో పనిగా ఆక్సినోవ్ టీ చేయడానికి సరంజామా అంతా దింపి పొయ్యి వెలిగించి అది కాగుతూంటే గిటార్ తీసి వాయించడం మొదలు పెట్టేడు సరదాకి.
ఇంతలో పక్కనే ఇంకో బండి ఆగింది. ఆ బండిలోంచి దిగినాయన ఆక్సినోవ్ దగ్గిరకొచ్చి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టేడు. ఎక్కడకి వెళ్తున్నావ్, ఏం పనిమీద, పేరు, ఊరు వగైరా. అన్నింటికీ సమాధానాలు చెప్పేక, “టీ తాగుతారా?” అని అడిగేడు ఆక్సినోవ్ మర్యాదకి.
ఈ మర్యాదా అదీ పట్టించుకోకుండా, “నిన్న రాత్రి ఎక్కడున్నావు? ఏం చేశావ్ రాత్రంతా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించేడు వచ్చినాయన. అన్నింటికీ సమాధానం చెప్పి అడిగాడు ఆక్సినోవ్.
“ఏంటండీ ఇలా అడుగుతున్నారు? నేను సంతకి వెళ్తూ గుర్రాలకి దాణా పెట్టడానికి ఆగాను అని చెప్తున్నాను కదా? మీరు చూస్తున్నదే.”
“నేను ఈ జిల్లా పోలీస్ అధికారిని. నిన్న రాత్రి నువ్వు ఉన్న పూటకూళ్ళ ఇంట్లో నీతో కబుర్లు చెప్పిన వేరే వర్తకుణ్ణి ఎవరో హత్య చేసారు. నీ సామాన్లు వెతికి చూడాలి ఏమైనా ఆధారాలు కనిపిస్తాయేమో.”
ఆక్సినోవ్ నోరు తెరిచేలోపుల బిల బిల మంటూ ముగ్గురు పక్కనుంచి వచ్చి ఆక్సినోవ్ బండిలో సామాను అంతా బయటకి తీసి ఒక్కొక్కటీ చూడ్డం మొదలెట్టారు. కాసేపటికి ఆక్సినోవ్ పెట్టెలో ఒక రక్తసిక్తమైన బట్టలగుడ్డా, ఓ కత్తీ కనిపించాయి.
ఇవి చూసి ఆక్సినోవ్ హతాశుడైయేడు. అవి తన పెట్టెలోకి ఎలా వచ్చాయో అర్ధం కాలేదు.
పోలీసు అడగడం మొదలుపెట్టాడు మళ్ళీ. “ఇది ఎవరిది? నీ పెట్టెలోకి ఎలా వచ్చింది? నువ్వెంత డబ్బు కొట్టేసావ్ అతని దగ్గిర్నుంచి? ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది?” అంటూ.
ఈ కత్తీ రక్తం చూసే సరికి ఆక్సినోవ్ మొహం పాలిపోయింది. “ఏమో, నాకు తెలియదు. రాత్రి పడుకున్నాక మళ్ళీ నేను అతన్ని చూడనే లేదు. నాదగ్గిరున్న ఎనిమిదివేల రూబుళ్ళు తప్ప ఒక్క చిల్లిగవ్వ కూడా లేదు నా దగ్గిర.”
చెప్పిన సమాధానాలు పోలీసుని నమ్మించలేకపోయాయి.
“నువ్వు హత్య చేయకపోతే నీ మొహం ఎందుకలా పాలిపోయింది? నోరు విప్పి సరిగ్గా సమాధానం చెప్పలేక పోతున్నావేం?” వేధించాడు పోలీసు.
“దేవుడి ప్రమాణంగా నాకేమీ తెలియదు, నేను కాదు హత్య చేసింది,” అని చెప్పేడు ఆక్సినోవ్ కానీ గొంతుకలోంచి మాట రావడం కష్టమౌతోంది, ఎప్పుడూ చూడని కష్టం ఎదురయ్యేసరికి. పోలీసులకు నమ్మబుద్ధి వేయలేదు ఈ సమాధానాలన్నీ. పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్ళి దగ్గిర్లో ఉన్న జైల్లో పెట్టేరు.
ఆక్సినోవ్ ఉండే ఊర్లో ఆరా తీయబడింది అతని గురించి. పెళ్ళవక ముందు తాగేవాడనీ కానీ పెళ్ళయ్యాక అన్నీ మానేసి బుద్ధిగానే ఉంటున్నాడనీ చెప్పేరు తెల్సున్న వాళ్ళు. మొత్తానికి తోటి ప్రయాణీకుణ్ణి హత్య చేసినందుకూ, అతని దగ్గిర్నుంచి ఇరవైవేల రూబుళ్ళు కొట్టేసినందుకూ పోలీసులు ఆక్సినోవ్ మీద కేసు తెచ్చారు.
జరిగిన దారుణం అంతా వినేసరికి ఆక్సినోవ్ వాళ్ళావిడకి కాలూ చెయ్యీ ఆడలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు. తెలిసున్నవాళ్ళ కాళ్ళు పట్టుకుని పిల్లల్ని చంకనెత్తుకుని జైల్లో ఉన్న ఆక్సినోవ్‌ని చూడబోయింది. ఆవిడ్ని చూస్తూనే ఆక్సినోవ్ నోటమాట రాలేదు. కాసేపటికి తేరుకుని చెప్పేడు.
“పై అధికార్లకి ఓ ఉత్తరం రాయాలి వెంఠనే. నేను ఏం చెప్పినా వీళ్ళు వినిపించుకోవటం లేదు ఇక్కడ.”
“నేను అవన్నీ రాశాను, కాని అవి పనికిరావనీ, నీ మీద అభియోగం బలంగా ఉందనీ నువ్వు హత్య చేయలేదనడానికి సాక్ష్యం ఏమీ లేదు అన్నారు. ఎలా, ఎందుకు ఈ హత్య జరిగిందో నాకు తెలియదు కానీ. మనకి కావాల్సినవి అన్నీ ఉండీ నువ్వెందుకు ఇలా చేశావో…” ఆక్సినోవ్ వాళ్ళావిడ ఏడుస్తూ చెప్పింది.
“ఆఖరికి నువ్వు కూడా నేనే హత్య చేసానని నమ్ముతున్నావా?” ఆక్సినోవ్ వాళ్ళావిడ చెప్పిన మాటలకీ, ఆవిడ చూసిన చూపుకీ స్థాణువై కదిలిపోయి అన్నాడు.
“నేను నిన్ను అసలు సంతకే వెళ్ళొద్దని ఎందుకన్నానో? ఎందుకు వినిపించుకోలేదు నువ్వు? నేను చెప్పిన పని ఎప్పుడూ ఎందుకు చేయవు?”
ఆక్సినోవ్ ఏదో అనబోయేడు కానీ ఈ లోపునో పోలీస్ వచ్చి మాట్లాడ్డానికి ఇచ్చిన సమయం అయిపోయిందని చెప్పి ఆవిడనీ, పిల్లల్నీ బయటకి తీసుకెళ్ళేడు.
ఎప్పుడైతే కట్టుకున్న భార్యే ఇలా తాను హత్య చేసినట్టు అనుమానిస్తోంది అనిపించిందో అప్పుడే అనుకున్నాడు ఆక్సినోవ్, “ఇంక ఇందులో భగవంతుడికొకడికే తెలుసు నిజం. చేస్తే ఆయనే ఏదైనా చేయాలి గానీ ఇంకెంవరూ చేసేది ఏమీలేదు.” తర్వాత జరగవల్సినవి అతి మామూలుగా జరిగిపోయేయి.
ఆక్సినోవ్‌కి హత్య చేసి డబ్బులు దొంగతనం చేసినందుగ్గాను కొరడా దెబ్బలూ జైలు శిక్షా పడ్డాయి. క్రూరంగా అమానుషంగా ఒళ్ళు చీరేటట్టు కొరడా దెబ్బలు కొట్టేరు. ఆ దెబ్బలు తగ్గేదాకా ఉంచి ఆ తర్వాత సైబీరియా పంపించేరు జీవిత ఖైదు కొసం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ తన కుటుంబాన్ని చూడ్డానికి నోచుకోలేదు ఆక్సినోవ్.
ఇరవై ఆరేళ్ళు గడిచేసరికి ఆక్సినోవ్ జుట్టు – వాళ్ళావిడకి కలలో కనిపించినట్టూ – పూర్తిగా తెల్లబడింది.
గెడ్డం బాగా పెరిగి నడుము వంగింది. ఇప్పుడున్న ఆక్సినోవ్ ఎవరితోటీ పెద్దగా మాట్లాడడు. నవ్వడానికీ, మామూలు కబుర్లు చెప్పే తీరికా కోరికా ఎప్పుడో చచ్చిపోయేయి. జైల్లో బూట్లు కుట్టడం నేర్చుకుని అవి చేసినందుకిచ్చిన డబ్బుల్తో కొన్ని పుస్తకాలు కొన్నాడు ఆక్సినోవ్. చదివినవే చదువుతూంటే కాలం గడుస్తోంది. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఆక్సినోవ్‌కి తన కుటుంబం గురించి — అసలు తన భార్య కానీ పిల్లలు కానీ ఈ హత్య ఉదంతం అయ్యాక — ఎలా బతికి బట్టకట్టారో అనేదే తెలియలేదు. కొత్తలో కొంతకాలం ఆక్సినోవ్ ఆరాటపడ్డాడు వాళ్ళ గురించి. తర్వాత్తర్వాత కాలమే మానిపించింది ఆ గాయాలన్నీ.
కొత్త నేరస్తులు వస్తున్నారు, శిక్ష అయిపోయిన పాతవాళ్ళు వెళ్తున్నారు కానీ ఆక్సినోవ్ జీవితంలో ఏమీ మార్పు లేదు. చేత్తో బైబిల్ పట్టుకుని నడిచే ఆక్సినోవ్‌ని తాతగారూ అని పిలుస్తూ జైల్లో ఉన్నవాళ్ళందరూ వయసుకో, బైబిల్‌కో గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులు ఆంక్షలన్నీ తీసేశారు ఆక్సినోవ్ మీద – ఇరవై ఆరేళ్ళ తర్వాత ఈ ముసలాయన ఎలాగా పారిపోడనే నమ్మకం కాబోలు.
ఓ రోజు కొత్తగా వచ్చిన నేరస్థులతో మాట్లాడుతూ ఉంటే తెలిసింది. అందులో ఒకడిది ఆక్సినోవ్ ఉండే ఊరే. అతనితో మాట్లాడుతూ “నీకు ఆక్సినోవ్ వాళ్ళావిడ తెలుసా? వాళ్ళెలా ఉన్నారో చెప్పగలవా?” అడిగేడు ఆక్సినోవ్.
“బాగా తెలుసు, వాళ్ళకేం? ధనవంతులు. హాయిగా ఉన్నారు. ఆ ఇంటాయన ఏదో హత్య చేసి సైబీరియాలో ఉంటున్నాడని చెప్తారు ఊళ్ళో. వాళ్ళ సంగతి సరే గానీ, మీరెందుకొచ్చారు తాతగారూ?” అడిగేడు కొత్తగా వచ్చిన నేరస్తుడు మకర్.
ఆక్సినోవ్ మాట దాటవేసి మౌనంగా కూర్చున్నాడు తన గురించి అడిగేసరికి. పక్కనే ఉన్నవాళ్ళు చెప్పేరు ఆక్సినోవ్ ఎలా ఈ హత్యలో ఇరుక్కున్నాడో తప్పులేకపోయినా. ఇదంతా వింటూంటే మకర్ మొహంలో రంగులు మారడం గమమించేడు ఆక్సినోవ్. అంతా అయ్యేక మకర్ ఆశ్చర్యంగా మొహం పెట్టి అన్నాడు.
“ఓ, భలే. మనందరం ఇలా కల్సుకున్నామన్న మాట.”
ఇది విన్నాక ఆక్సినోవ్‌కి ఎందుకో మకర్‌కి ఈ హత్య చేసినవాడెవడో తెలుసేమో అనిపించింది. అదే అడిగేడు వెంఠనే. “ఈ హత్య అవీ విన్నావు కదా, నేనే చేశానని జైల్లో పెట్టారు నన్ను. నా జీవితం అంతా నేను చేయని నేరానికి నాశనం అయింది. నీగ్గానీ తెలుసా ఆ హత్య ఎవరు చేశారో?”
“ప్రపంచంలో ఎన్నో పుకార్లు పుడుతూ ఉంటాయ్ తాతగారూ? అవన్నీ నిజమని ఎలా నమ్మడం?” మకర్ చెప్పేడు.
“అయినా ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడెందుకవన్నీ? అయినా కత్తి మీ పెట్టెలో ఉందని పోలీసులు చూశారు కదా? అలా అయితే హత్య మీరే చేశారేమో? మీరు చేయకపోతే ఎవరో చేసి, ఆ కత్తి మీ తలకింద బట్టల్లోనో, పెట్టెలోనో పెట్టేటప్పుడు మీకు మెలుకువ రాలేదా? అలా అయితే అసలు హత్య చేసినవాడ్ని పట్టుకోనంతవరకూ వాడు నేరస్తుడు కాదన్న మాటే! ఇంతకు ముందు ఎన్నో నేరాలు చేశాను నేను. కాని ఇప్పటిదాకా దొరకలేదు. ఇప్పుడు పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారు; అదీ గుర్రాన్ని దొంగిలించాననే నేరం మీద. అరే, ఆ గుర్రం నా స్నేహితుడిదీ ఇంటికెళ్ళాక ఇచ్చేస్తానని పోలీసుల్తో చెప్పినా వినిపించుకోలేదు. అల్లా ఉంది మన పోలీసుల ఘనత. ఇరవై ముఫ్ఫై ఏళ్ళు ఏం చేసినా పట్టుకోలేకపోయేరు కానీ ఇప్పుడు పట్టుకున్నారు చిన్న నేరానికి.”
ఈ మాట వినగానే ఆక్సినోవ్‌కి ఈ హత్య చేసినవాడు మకర్ అయ్యి ఉండొచ్చని బలంగా అనిపించింది. రాత్రి తోటి ప్రయాణీకుణ్ణి చంపేసి తన బట్టల్లో కత్తి పెట్టినవాడు వీడేనన్న మాట. ఆ రోజు రాత్రి ఎంత పడుకుందామన్నా ఆక్సినోవ్‌కి నిద్రపట్టలేదు. ఏన్నో కలగా పులగమైన ఆలోచనలు – తన భార్య వెళ్ళొద్దనడం, తన పిల్లలు పాకుతూ తన దగ్గిరకి వస్తే ఎత్తుకుని వాళ్ళనాడించడం, తాను చేయని నేరానికి కొరడా దెబ్బలు తినడం, తర్వాత ఇరవై ఆరేళ్ళు ఇంటి దగ్గిర్నుంచి వేల మైళ్ళ దూరంలో నీచాతి నీచమైన, దుర్భరమైన బతుకు, అదీ తాను చేయని నేరానికి.
ఆ రాత్రి ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎంత ఆపుకుందామన్నా తగని కన్నీళ్ళు; కోపం దుఃఖం అన్నీ పోయాయన్న ఏడుపూ ఇటువంటి కలగాపులగమైన ఆలోచనలతో ఆక్సినోవ్‌కి నిద్ర కరువైంది. ఆ తర్వాత పదిహేను రోజులు ఇలాగే గడిచాయి. ఎన్నోసార్లు రాత్రి లేవడం, వెళ్ళి జైలు అధికార్లతో చెప్పడం చేద్దామనుకున్నాడు ఆక్సినోవ్ కానీ ఇంతకాలం పోయాక ఇప్పుడు చేసేదేముంది? ఇప్పుడు తనని విడిస్తే ఎక్కడకెళ్ళాలి? ఏం చేయాలి? ఎవరున్నారు తనకి?
ఓ రోజు రాత్రి జైల్లో ఆక్సినోవ్‌కి ఏదో చప్పుడు వినిపిస్తే చూసాడు. ఎవరో మట్టి తవ్వుతున్న చప్పుడు. పరీక్షగా చూస్తే ఆ సొరంగం తవ్వేది మకర్! అతన్ని చూడగానే ఆక్సినోవ్ పట్టించుకోకుండా ముందుకి కదిలిపోదాం అనుకున్నాడు గానీ వాడే వచ్చి ఆక్సినోవ్ చేయి పట్టుకుని చెప్పేడు స్థిరంగా.
“ఈ దారి తవ్వడం పూర్తయ్యాక మనందరం తప్పించుకోవచ్చు. ఈ విషయంలో నోరుమూసుకో ముసలాడా! నోరు గానీ విప్పావా నీ ప్రాణం తీస్తాను ముందు.”
ఆక్సినోవ్ ఒళ్ళు గగుర్పొడిచి కంపరం ఎత్తింది. చేయి విడిపించుకుని “నాకు ఇక్కడ్నుంచి తప్పించుకోవాలనే కోరిక ఏనాడో చచ్చిపోయింది. నన్ను చంపుదామనుకుంటున్నావా ఇప్పుడు? నువ్వు నన్ను ఇరవై ఆరేళ్ళ క్రితమే చంపేశావు కదా? ఇంక ఈ తవ్వడం గురించి ఎవరైనా అడిగితే భగవంతుడు ఎలా చెప్పమంటే అలా చెప్తాను.” అంటూ ముందుకి కదిలిపోయేడు.
మర్నాడు నేరస్తులందరూ బయటకి నడుస్తూంటే జేబుల్లోంచి పడే మట్టి చూసి అందర్నీ వెతికితే వాళ్ళు తప్పించుకోడానికి తవ్వుతున్న దారీ అన్నీ బయట పడ్డాయ్. ఒక్కొక్కణ్ణీ విచారిస్తూ వాళ్ళాడే అబద్ధాలు వింటూ ఆఖరికి ఆక్సినోవ్‌ని అడిగేడు జైల్ అధికారి.
“తాతా, ఈ జైల్లో ఉన్నవాళ్ళందర్లోనూ నువ్వొక్కడివే నమ్మకస్థుడవనీ, అబద్ధాలు చెప్పవనీ అంటున్నారు. ఈ పని ఎవరు చేశారో చెప్పు”.
ఎంత ప్రయత్నించినా ఆక్సినోవ్ నోట్లోంచి మాట బయటకి రాలేదు. ఆక్సినోవ్ ఎంతటి అంతర్మధనం చెందుతున్నాడో దేముడికెరుక. “వీడు నా జీవితం నాశనం చేశాడు, వీణ్ణి ఏం చేసినా పాపం లేదు,” అని ఒక వేపు మనసులో అనిపిస్తూంటే, రెండో వేపు, “నా ఖర్మ. ఇతను అలా చేస్తే ఇన్నేళ్ళ తర్వాత అన్నీ పోగొట్టుకుని ఇప్పుడు నేను కూడా అలా చేసి బావుకునేదేముంది,” అని లాగుతోంది. ప్రతీకారం తీర్చుకోమని మనసు పోరుతోంది. కానీ తాను చదివిన బైబిల్లో వాక్యాలు లక్ష్మణ రేఖలా నుంచుని ఉన్నాయి కళ్ళ ముందు. ఏది మంచో, ఏది చెడో ఎలా తెలుసుకోవడం? ఆఖరికి –
“నేనేమీ చెప్పలేను. నన్నేం చేస్తారో మీ ఇష్ఠం. మీ జైల్లో ఉండే నేరస్థుణ్ణి నేను. నన్ను చంఫినా సరే నేనేం చెప్పలేను.” పాము చావకుండా కర్ర విరక్కుండా సమాధానం చెప్పేడు ఆక్సినోవ్. ఇంకాసేపు అడిగి జైల్ అధికారి వెళ్ళిపోయేడు ఎటూ తేల్చుకోలేక.
ఆ రాత్రి ఆక్సినోవ్ పడుకున్నాడన్న మాటే గాని ఎప్పట్లాగా నిద్ర లేదు. మనసు ఎంత అదుపులో ఉంచుకుందామన్నా చాలా అసహనంగా ఉంది. ఇంతలో దగ్గిర్లో ఏదో చప్పుడైతే చూశాడు. మకర్ తన మంచం దగ్గిరే నించుని తనకేసే చూస్తున్నాడు. కాసేపు చూసి ఆక్సినోవ్ పడుకోలేదని తెలిసాక చేతులు పట్టుకుని దాదాపు ఏడుస్తున్నట్టూ అన్నాడు మకర్ – “నన్ను క్షమించు ఆక్సినోవ్!”
ఆక్సినోవ్ ఏమీ మాట్లాడలేదు. ఏవుంది మాట్లాడ్డానికి?
“ఆ రోజు రాత్రి మీ తోటి ప్రయాణీకుణ్ణి చంపింది నేనే. మిమ్మల్ని కూడా చంపేసి డబ్బులు కాజేద్దామనుకున్నాను కానీ ఏదో చప్పుడైంది. అందువల్ల కత్తి మీ పెట్టెలో దాచేసి కిటికీ లోంచి దూకి పారిపోవాల్సి వచ్చింది. నేనింత చేసినా మీరు నిన్న నా తప్పుని కప్పి నన్ను అధికార్లకి అప్పగించలేదు. నన్ను క్షమించండి. నీచుణ్ణి.”
“క్షమించు అనడం ఎంత సులభం! నా జీవితం నాశనం అయింది నీ మూలంగా. ఇరవై ఆరేళ్ళు అనుభవించాను నేను చేయని తప్పుకి. ఇప్పుడు నేను చేసేది ఏమిటి? నాకెవరున్నారు? నేనిక్కడకి వచ్చినప్పుడు పిల్లలకి రెండు మూడేళ్ళుంటాయేమో. ఇప్పుడు వాళ్ళకి నేనెవర్నో కూడా తెలీదు కదా? మా ఆవిడ ఉందో, పోయిందో? నేను లేక పిల్లలూ మా ఆవిడా ఎన్ని కష్టాలనుభవించారో? ఇప్పుడొచ్చి క్షమించు అంటున్నావా? ఇప్పుడు నాకు జైలు తప్ప ఏమీ లేదు. వీళ్ళు నన్ను విడిస్తే ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళినా నేరస్తుడిలా ఎలా బతకాలి? బయట ప్రపంచంలో ఒకప్పుడు అన్నీ ఉన్నవాణ్ణి. కానీ ఇప్పుడో? ఒక్క కోపెక్కి కొరగాను. ఇ-ర-వై ఆ-రే-ళ్ళు! నీ మూలాన నా జీవితం…” ఆ తర్వాత గొంతు పూడుకుపోయి మాటరాలేదు ఆక్సినోవ్‌కి.
మకర్‌కి ఒక్కసారి తెలివొచ్చినట్టైంది. కాళ్ళు వణుకుతూంటే నేల మీద కూలబడి ఏడుస్తూ “నన్ను క్షమించు, నన్ను క్షమించు ఆక్సినోవ్” అనే తప్ప ఇంకేమీ అనలేకపోయేడు. ఈ ఏడుపుకి ఆక్సినోవ్ ఏడుపుకూడా తోడైంది. కాసేపటికి తేరుకున్నాక ఆక్సినోవ్ చెప్పేడు.
“నేను ఏదో ఖర్మ వల్ల ఇలా హింసించబడ్డాను. నేను నీకంటే అధముణ్ణి కాబోలు, లేకపోతే భగవంతుడు ఇంతటి శిక్ష వేస్తాడా? నా ఖర్మకి ఆయనో సాక్షి అంతే. ఇప్పుడు ఇందులో ఎవర్నీ ఏమీ అనడానికి లేదు. నిన్ను క్షమించడానికి నేనేపాటివాణ్ణి?” ఇంతటి భయంకరమైన నిజం వినీ తానింకా బతికున్నందుకూ, గుండె బద్దలై ఆ క్షణంలోనే చావు రానందుకూ ఆక్సినోవ్ ఏడుస్తూనే ఉన్నాడు.
కాసేపు మౌనంగా కూర్చుని, కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూన్న ఆక్సినోవ్‌ని అలా వదిలేసి, ఏదో నిశ్చయించుకున్నవాడిలా బయటకెళ్ళిపోయేడు మకర్. మర్నాడు పొద్దున్నే జైలు అధికారి దగ్గిర తను చేసిన హత్య, ఆక్సినోవ్ చేయని తప్పుకి అనుభవించిన శిక్ష, జైల్లో తవ్విన సొరంగం, జీవితంలో చేసిన మిగతా నేరాలు అన్నీ బయటపెట్టేశాడు మకర్ తనంతట తానే.
మొత్తం కధంతా విన్నాక చేయని తప్పుకు జైల్లోంచి విడిచి పెట్టడానికి కాయితాలు తయారు చేసి వడివడిగా వచ్చేడు జైలు అధికారి ఆక్సినోవ్ పడుకున్న మంచం దగ్గిరకి, ఈ శుభవార్త చెప్పి ఇంటికి పంపించడానికి.
పడుకున్న ఆక్సినోవ్‌ని లేపడానికి మీద చేయి వేసినప్పుడు ఒళ్ళు చల్లగా తగలడంతో తెల్సింది అధికారికి – ఆక్సినోవ్ ప్రాణం పోయి చాలా సేపే అయింది.
(మూలం: God sees the truth, but waits. 1872.)