పన్నెండేళ్ళ రాయ్‌చరణ్‌కి యజమాని ఇంట్లో పని దొరకడానిక్కారణం రాయ్‌చరణ్ వయస్సు ఒకటైతే రెండోది యజమానిదీ రాయ్‌చరణ్‌దీ ఒకటే కులం కావడం. మొదట్లో ఇంట్లో ఏదో ఒక పని చేయడానికి పనికొస్తాడేమో అని పెట్టుకున్న రాయ్‌చరణ్ యజమాని కొడుకుని చూడ్డానికి ఉపయోగపడ్డాడు. అమ్మగారు ఇంట్లో ఏదో పనిలో ఉన్నప్పుడు కుర్రాణ్ణి ఆడించడం, వాడు ఏడుస్తూంటే సముదాయించడం వగైరాలతో పాటు ఇంటా బయటా చిన్న చిన్న పనులు. అలా యజమాని కొడుకు అనుకూల్, రాయ్‌చరణ్ చేతిలోనే పెరిగాడు దాదాపుగా.
కుర్రాడు పెద్దవుతున్నా, రాయ్‌చరణ్ తోటే నేస్తం. అనుకూల్‌కి చదువూ, పెళ్ళీ అయ్యి కోర్టులో ఉద్యోగం వచ్చేదాకా రాయ్‌చరణ్‌కి అతనొక్కడే యజమాని. అనుకూల్ పెళ్ళి అయ్యేక రాయ్‌చరణ్‌కి ఇప్పుడిద్దరు యజమానులు; అనుకూల్, కొత్తగా ఇంట్లోకొచ్చిన అనుకూల్ వాళ్ళావిడాను. అనుకూల్‌కి ఓ ఏడాదిలో పిల్లాడు పుట్టేసరికి మళ్ళీ రాయ్‌చరణ్‌కి పురనపి జననం అన్నట్టూ ఒకప్పుడు అనుకూల్‌ని చూసినట్టే అనుకూల్ కొడుకుని సాకడం మొదలయింది. అనుకూల్‌కి పద్మానది ప్రాంతానికి బదిలీ అయ్యింది. తనని చిన్నప్పట్నుండీ పెంచిన రాయ్‌చరణ్ అంటే ఉన్న అభిమానం వల్ల అనుకూల్, కుటుంబంతో అక్కడికి వెళ్తూ రాయ్‌చరణ్‌ని కూడా వెంట తీసుకెళ్ళాడు.
ఏడాది నిండుతోంటే అనుకూల్ కొడుకు పాకడం, మెల్లిగా అడుగులు వేయడం మొదలుపెడుతున్నాడు. మాటలు వస్తున్నై. అమ్మా, నాన్నా అని పిలుస్తూ రాయ్‌చరణ్‌ని ‘తాతా’ అంటున్నాడు. ఆ మాట అంటున్నందుకే వాడంటే రాయ్‌చరణ్‌కి విపరీతమైన అభిమానం. వాడికి గుమ్మం దాటి ఇంట్లోంచి బయటకెళ్ళాలని సరదా. వాడు బయటకెళ్ళకుండా, కిందపడి దెబ్బలు తగిలించుకోకుండా చూడ్డం రాయ్‌చరణ్ పని. కుర్రాడికెలా తెల్సిందో కానీ వాడు సరదాకి ఇంట్లోంచి బయటకెళ్ళాలని ప్రయత్నించడం, వెళ్ళిపోతూంటే రాయ్‌చరణ్ గమనించి వాణ్ణి పట్టుకోవడం ఒక ఆటలా తయారైంది. రాయ్‌చరణ్ అనుకూల్‌తో అన్నాడు ఓ సారి ఈ కుర్రాడి గురించి, “వీడు మంచి తెలివైన వాడండి, నన్ను ఏడిపించి, నా కళ్ళు కప్పేసి బయటకి పారిపోదామని ప్రయత్నం చేస్తున్నాడు. నేను చూడనప్పుడు దాక్కోవడం, పట్టుకున్నప్పుడు అదో రకమైన నవ్వూ, అబ్బో, వీడు తప్పకుండా కోర్టులో జడ్జ్ అయి తీరుతాడు చూడండి.”
కుర్రాడు పెరిగే కొద్దీ వాడి అవసరాల కోసం కొన్ని ఆట బొమ్మలూ, ఆ బొమ్మలు పెట్టుకుని అటూ ఇటూ లాగడానికో చిన్న బండీ ఒక్కోటీ అమరుతున్నై. కొత్త కొత్త ఆటల కోసం రాయ్‌చరణ్ మోకాళ్ళమీద అటూ ఇటూ కదులుతూ గుర్రం లాగా కుర్రాణ్ణి వీపు మీద మోయడం, ఒక్కోసారి వాడితో కుస్తీ పట్టడం, ఆ కుస్తీలో మళ్ళీ కుర్రాడి ముందు కింద పడిపోయి ఓడిపోయినట్టు ఒప్పుకుని గుంజీలు తీయడం, ఇవన్నీ చూస్తూ అనుకూల్, వాళ్ళావిడా నవ్వుకోవడం జరుగుతూనే ఉన్నై. ఉద్యోగంలో అనుకూల్‌కొచ్చే మంచి జీతం వల్ల కుర్రాడి అవసరాలకి దేనికీ ముందూ వెనకా చూసుకోనవసరం లేదు. అమ్మగారు వాడికి ఎప్పుడూ కొత్త బట్టలూ, కొత్త బంగారం నగలూ వేసి చూసుకుని మురిసిపోతూ వాణ్ణి ఆడించడానికి రాయ్‌చరణ్ చేతిలో పెడుతున్నారు. ఇన్నేళ్ళబట్టీ పనిచేస్తున్న రాయ్‌చరణ్ మీద నమ్మకమే తప్ప ఎవరికీ అనుమానం లేదు; కుర్రాడి నగల గురించి కానీ, వాడిని నగలకోసమో, మరోదానికో రాయ్‌చరణ్ కానీ వాడు చూస్తూండగా ఇంకెవరో కానీ ఎత్తుకుపోతారని.
చూస్తూండగానే వర్షాకాలం వచ్చింది. ఉరుములు మెరుపుల్తో ధాటీగా కురిసే వర్షానికి పద్మానది ఉరకలేస్తూ, పడగెత్తిన పాములా బుసలు కొడుతూ ప్రవహించడం మొదలైంది. ఈ ప్రవాహంలో ములిగిపోయిన పంటలూ, చేలూ అలా ఉంచితే నదీతీరం అంతా బురద. అది చాలనట్టూ ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చే చెట్టూ చేమా వల్ల ఏం జరుగుతుంతో చెప్పడం కష్టం కనక ఎవరూ నది దగ్గిరకి వెళ్ళడానికి లేదు. నదీతీరానికి వెళ్ళి చూడాలంటే వర్షాకాలం అయ్యేదాకా ఆగాల్సిందే. ఈ వర్షాలలో ఓ రోజు తెరిపి ఇచ్చినప్పుడు అనుకూల్ కొడుకుని, వాడికున్న చిన్న బండిలో కూర్చోపెట్టి,రాయ్‌చరణ్ నదీ తీరానికి తీసుకొచ్చేడు. అలా తీసుకురావడానిక్కారణం కూడా కుర్రాడు వెళ్దాం వెళ్దాం అని ఏడుస్తూ పట్టుబట్టడమే. చలీ వేడీ కానీ ఆ రోజున వర్షం లేదు కానీ ఆకాశం మబ్బుగానే ఉంది. నది ఒడ్డున మోకాలి లోతు బురద అయినా నీళ్ళవరకూ వెళ్ళకుండా కొంచెం దూరం నుంచే ఇద్దరూ నీళ్ళ ప్రవాహాన్ని చూస్తున్నప్పుడు కుర్రాడి చూపు అటు పక్కనే ఉన్న కదంబ వృక్షం మీద పడింది. అసలే వర్షాకాలం నీళ్ళు బాగా వంటబట్టి ఉన్నాయి కాబోలు, ఆకులు కూడా కనబడకుండా చెట్టంతా పువ్వులు. అదేదో అద్భుతాన్నిచూస్తున్నట్టూ కుర్రాడు అటువేపే చూస్తుంటే రాయ్‌చరణ్‌కి తెలిసిన విషయం ఏమిటంటే, కుర్రాడికి ఆ పువ్వులు కావాలి. కానీ ఆ చెట్టు దగ్గిరకెళ్ళాలంటే తాను బురదలో దిగి వెళ్ళిరావడానికి ఇరవై నిముషాలకి పైన పట్టవచ్చు. తాను అలా వెళ్తే ఇక్కడ కుర్రాణ్ణి ఎవరు చూస్తారు?
కుర్రాణ్ణి మభ్యపెట్టి వాడి చూపు ఆ పువ్వుల మీదనుంచి తప్పించాలని రాయ్‌చరణ్ ‘ఇదిగో ఆ పిట్ట చూడు, ఆ నీళ్ళు చూడు,’ అంటూ చెప్పాడు కానీ, జడ్జ్ కాబోతున్న కుర్రాడా అలా తప్పించుకునేది? ఈ పువ్వులనే చూపిస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. వాడి ఏడుపు చూసి రాయ్‌చరణ్‌కి కాలూ చేయీ ఆడలేదు.
‘సరే, నువ్విక్కడే కదలకుండా ఉంటానంటే నేను వెళ్ళి తీసుకొస్తా ఆ పువ్వులు’ అడిగేడు.
కుర్రాడి మొహం చూసి ‘సరే, అలాగే ఉంటా,’ అన్నాడనుకుని మరోసారి వాణ్ణి హెచ్చరించి మోకాలిదాకా తడవకుండా బట్ట మీదకి లాక్కుని రాయ్‌చరణ్ బురదలోకి దిగేడు, కదంబ వృక్షం కేసి వెళ్తూ.
రాయ్‌చరణ్ అలా వెళ్ళడం ఆలస్యం, కుర్రాడు ఇటు నదికేసి తన బండి లాక్కుంటూ వెళ్ళిపోయేడు. విపరీతమైన వేగంతో పోయే నీళ్ళ ప్రవాహం చూసేసరికి వాడికి మరింత సరదా పుట్టింది. పక్కనే దొరికిన చిన్న కర్ర పట్టుకుని నీళ్ళలోకి దాన్ని వంచుతూ చేపలు పడుతున్నట్టూ వంగడం, నీళ్ళని ఆ కర్రతో కొట్టడం సాగించేసరికి చిన్న నీటి తుంపర వాడి మీద పడింది. దాంతో నీళ్ళంటే మరింత ఉత్సాహంతో మరింత ముందుకి వెళ్ళాడు బండిని లాక్కుంటూ…
చేతికి అందిన నాలుగు పువ్వులు కోసి, అవి చూశాక కుర్రాడి మొహంలో కనబడే సంతోషం గుర్తు తెచ్చుకుంటూ వెనక్కి వస్తూ బండి కేసి చూశాడు రాయ్‌చరణ్. బండి అయితే ఉంది కానీ కుర్రాడు చుట్టుపక్కల ఎక్కడా లేడు. రాయ్‌చరణ్ రక్తం గడ్డకట్టుకు పోయినట్టయింది. చేతిలో పువ్వులెక్కడివక్కడ పారేసి బండి దగ్గిరకి వచ్చి ‘అబ్బాయ్, నాన్నా ఎక్కడున్నావురా, రా, రా’ అంటూ పిలిచేడు. ఎప్పుడు పిలిచినా నవ్వుతూ ‘తాతా ఇక్కడున్నా’ అంటూ సమాధానం ఇచ్చే కుర్రాడి గొంతుక వినిపించలేదిప్పుడు. ఇప్పుడున్నదంతా పద్మానది ప్రవాహం, దాని తాలూకు గలగలల చప్పుడూను. పిచ్చివాడిలా కనిపించినంత మేర వెతికాడు రాయ్‌చరణ్. మానవమాత్రుడన్నవాడెవడూ లేడు చుట్టుపక్కల. కాలూ చేయి ఆడని పరిస్థితి.
రాయ్‌చరణ్ కళ్ళప్పగించి ఎటువైపు చూసి ఎన్ని అరుపులు అరిచి కుర్రాణ్ణి పేరుతో పిలిచినా, ఎంత ఏడిచి మొత్తుకున్నా అనుకూల్ కొడుకు ఈ నీటిలో కొట్టుకుపోవడం అనేదో పెద్ద విషయం కానట్టూ, ఆ కుర్రాడి చావు విషయం తనకేం పట్టనట్టూ పద్మానది ఉరుకులు పరుగుల్తో అలా ప్రవహిస్తూనే ఉంది.
సాయంకాలం దాకా రాయ్‌చరణ్ తీసుకెళ్ళిన కొడుకు రాకపోయేసరికి అప్పటి దాకా చూసిన అనుకూల్ భార్య మొగుడితో చెప్పి మరో నలుగురు మనుషుల్ని పంపించింది వెతకడానికి. చీకట్లో లాంతర్లు పట్టుకుని వెతుకుతున్న జనాలకి అక్కడే నది ఒడ్డున కేకలు పెడుతూ పిచ్చివాడిలా తిరుగుతున్న రాయ్‌చరణ్ కనిపించేడు కానీ కుర్రాడి జాడలేదు. రాయ్‌చరణ్‌ని వెనక్కి తీసుకొచ్చేసరికి అనుకూల్ కాళ్ళమీద పడి భోరుమన్నాడు. అతన్ని ఎన్ని అడిగినా, ఎంత కదిపినా ఏమీ సమాధానంలేదు, నాకేం తెలియదనే మాట తప్ప. మొత్తానికి పద్మానదిలో కుర్రాడు కొట్టుకుపోయాడనే తీర్మానించినా, ఊరిబయట కొంతమంది దేశదిమ్మర్లు దిగారనీ వాళ్ళే ఎత్తుకుపోయి ఉండొచ్చనీ కొంతమంది అనుకున్నా ఏమీ తేలలేదు.
అనుకూల్ భార్య రాయ్‌చరణ్‌ని తిడుతూ, “నా కుర్రాణ్ణి ఎక్కడకి తీసుకెళ్ళావు, ఎక్కడ దాచావు చెప్పు?” అంటూ ఏడుస్తూ నిందించింది కానీ ఏమీ సమాధానం రాబట్టలేకపోయింది. రాయ్‌చరణ్ ఎవరేం అడిగినా తన తలమీద కొట్టుకోవడం, ఏడవడం తప్ప మరేమాటా చెప్పలేకపోయేడు. అనుకూల్ భార్య ఇదంతా చూశాక రాయ్‌చరణ్‌ని ఇంక వెళ్ళిపొమన్నట్టూ తలుపు వేసేసుకుంది.
అనుకూల్, భార్యతో రాయ్‌చరణ్ గురించి చెప్పడానికి ఏదో ప్రయత్నంతో అన్నాడు, “నన్ను చిన్నప్పటినుంచి పెంచిన రాయ్‌చరణ్ అలాంటివాడు కాదు, వాడు మన కొడుకుని దాచడం కానీ, చంపడం కానీ ఎందుకు చేస్తాడు?”
“ఎందుకా, కుర్రాడి వంటి మీద నగలకోసం. ఇప్పుడర్థం అయిందా?” అనుకూల్ నోరు మూయించింది ఆ మాటతో ఆవిడ.
ఆవిడామాట అన్నాక ఇంక నోరెత్తలేకపోయేడు అనుకూల్.
అనుకూల్ ఇంట్లోంచి గెంటబడిన రాయ్‌చరణ్ తన ఊరికి బయల్దేరాడు. రాయ్‌చరణ్‌కి ఎప్పుడో పెళ్ళయిందనే మాటే తప్ప ఇప్పటివరకూ అతనికి తన కుటుంబం అంటే అనుకూల్, అతని పిల్లాడే. ఇప్పుడు స్వంత ఊరికొచ్చేసరికి తనకో కుటుంబం, భార్యా ఉందని తెలిసివచ్చింది. రాయ్‌చరణ్ ఊరికి తిరిగొచ్చిన ఏడాది చివర్లో అతనికో కొడుకుని అందించి రాయ్‌చరణ్ భార్య ఆఖరి శ్వాస తీసుకుంది.
పుట్టిన కుర్రాణ్ణి చూడగానే రాయ్‌చరణ్‌కి అదోరకమైన అసహ్యం, నీరసం, అనేకానేక ఆలోచనలు. ఇప్పుడు అనుకూల్ కొడుకు తన చేతుల్లోంచి దాటిపోయాక వీణ్ణి సాకాలంటే అదోరకమైన అపరాధభావం. అదీగాక ఇప్పుడు తనకి ‘ఇదెక్కడి దరిద్రం దాపురించిందిరా?’ అనే ఆలోచన. ఈ ఆలోచనల్తో కుర్రాణ్ణి ఎప్పుడూ దగ్గరకు తీయడానికి ప్రయత్నించనేలేదు. రాయ్‌చరణ్ ఇంట్లో అతని విధవ అప్పగారు కానీ లేకపోతే ఆ పుట్టిన కుర్రాడు ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు. అలా రాయ్‌చరణ్‌తో సంబంధం లేకుండా కుర్రాడు పెరుగుతున్నాడు. వాడికి ఫైల్నా అని ఆవిడే పేరు పెట్టింది కూడా.
కుర్రాడు పెరుగుతుంటే రాయ్‌చరణ్ ఆలోచనా క్రమంలో ఏదో మార్పు వస్తూ ఉందిప్పుడు. వాడు పాకుతుంటే అనుకూల్ కొడుకు పాకుతున్నట్టే ఉంది. వీడు కూడా అనుకూల్ కొడుకులాగే తనని గడపదాకా వెళ్ళి ఏడిపించడం అదీ చేస్తున్నాడు. ఏదో జరుగుతోంది తనకి తెలీయకుండా. తనని తాతా అంటూ పిల్చిన కుర్రాడు అలా నీళ్ళలో కొట్టుకుపోయి తనమీద మమకారంతో తనింట్లోనే పుట్టాడు కాబోలు. దీనికి కారణాలు వెతికితే కంటి ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. మొదటిది–తన కొడుకు అనుకూల్ కొడుకు పోయిన సరిగ్గా ఏడాదికి పుట్టాడు. రెండోది–ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టని తనకి ఈ మధ్య వయసులో ఇంక పుట్టరు, అసాధ్యం అనుకున్నప్పుడు ఆ అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ వీడు పుట్టాడు. మూడోది–అనుకూల్ కుర్రాడిలాగే వీడూ జడ్జ్ అయ్యే లక్షణాలు కనిపించడంలే? అదీగాక అనుకూల్ వాళ్ళావిడ అంది కదా, ‘నా కుర్రాణ్ణీ ఎత్తుకుపోయింది నువ్వే!’ అని. తల్లి మనస్సు తనకి తెలియలేదు ఆవిడలా అన్నప్పుడు. ఇప్పుడు–-వీడు తనకి పుట్టాక–అది తెలిసివస్తోంది. పాపం ఆవిడ ఎంత క్షోభ అనుభవిస్తోందో? ఈ ఆలోచనలు రాగానే రాయ్‌చరణ్ తన కొడుకుని వాడు అనుకూల్ కొడుకే అన్నట్టూ పెంచడం మొదలుపెట్టాడు.
కుర్రాణ్ణి ‘ఏమండీ, యజమానిగారు!’ అనడం, మంచి జమీందారులాగా బట్టలు తొడిగి మహారాజులా చూసుకోవడం మొదలుపెట్టాడు. ‘ఎంత లేకలేక కొడుకు పుట్టినా ఇంత గారాబమా!’ అనుకునే లోకుల్ని ఎప్పుడూ లెక్క చేయలేదు రాయ్‌చరణ్. జమీందారుగారి పిల్లలు అలగా జనంతో ఆడుకోరు కాబట్టి రాయ్‌చరణ్ ఎప్పుడూ తన కొడుకుని ఎవరితోనూ ఆడుకోనిచ్చేవాడు కాదు. తన దగ్గిరున్నవీ, భార్యవీ నగలన్నీ కరిగించేసి కుర్రాడికి నగలు చేయించాడు. అనుకూల్ కొడుకు ఒకప్పుడు ఆడుకున్న బండి లాంటిదే ఓ బండి కూడా అమర్చబడింది. కుర్రాణ్ణి చూస్తే ఎవరికీ కూడా రాయ్‌చరణ్ కొడుకనే అనుమానం రాదు, ఎవరో జమీందార్ల బిడ్డ అనే తప్ప.
ఐదేళ్ళు గడిచి ఫైల్నా స్కూల్‌కి వెళ్ళే రోజు వచ్చేసరికి రాయ్‌చరణ్ తనకున్న పొలం అవీ అమ్మేసి మళ్ళీ కలకత్తా చేరి కుర్రాణ్ణి మంచి స్కూల్లో, అక్కడే ఉన్న హాస్టల్లో జేర్పించాడు. కుర్రాడికేమీ తక్కువ రాకుండా చూస్తూ రాయ్‌చరణ్ మాత్రం రోజుకిన్ని మెతుకులు మాత్రం తింటూ చిక్కి శల్యం అవుతున్నాడు. రాత్రి వంటరిగా ఉన్నప్పుడు తనలో తనే కలవరింపులు–‘అబ్బాయ్, నేనంటే నీకెంత ఇష్టం! నువ్వు పోయాక నా మీద ఇష్టంతో మళ్ళీ నా ఇంటికి వచ్చావు. నీకెప్పటికి ఏమీ తక్కువచేయను!’ అంటూ.
పన్నెండేళ్ళు గడిచాయ్ ఇలాగే. పెద్దవుతున్న కుర్రాడికి చదువు బాగానే వంటబడుతూంది. అందరితోబాటు హాస్టల్లో ఉండడం అలవాటైంది. కుర్రాడికి చిన్నప్పటినుండీ రాయ్‌చరణ్ ఎలా అలవాటు చేశాడో అలాగే దర్జాగా బతకడం తెలుసు. తానే కుర్రాడి తండ్రినని రాయ్‌చరణ్ ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఎవరైనా రెట్టించి అడిగితే తాను కుర్రాడికి సేవ చేసే పనివాడినని మాత్రం చెప్పాడు. రాయ్‌చరణ్ కుర్రాడి దగ్గిర పనివాడిలా చూపించే అణకువ చూసి మిగతా పిల్లలు నవ్వినా రాయ్‌చరణ్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. మిగతా పిల్లలమాట అలా ఉంచితే ఫైల్నా కూడా రాయ్‌చరణ్ దగ్గిర లేనప్పుడు తన పనివాడు ఎలా అణుకువగా ఉంటాడో వాళ్ళతో చెప్తూ నవ్వుకునేవాడే. కుర్రాడికి రాయ్‌చరణ్ అంటే ఇష్టమే కానీ అదో రకమైన దిగజారుడు ఇష్టం–పనివాడి పట్ల ఉండే ఇష్టం లాంటిది తప్ప ఎప్పుడూ తన తండ్రి అన్న భావమే లేదు. ఆ దిగజారుడు ఇష్టం కూడా రాయ్‌చరణ్ వాణ్ణలా పెంచడం వల్ల వచ్చిందే తప్ప అది వాడి తప్పూ కాదు, పుట్టుకతో వచ్చినదీ కాదు.
రోజులు గడిచేకొద్దీ కుర్రాడు పెద్దవడం అటుంచితే రాయ్‌చరణ్ ముసలివాడౌతున్నాడు. రాయ్‌చరణ్ సరిగ్గా పనిచేయటం లేదని అతను పనిచేసే చోట యజమాని అరుస్తున్నాడు. పని ఇచ్చిన పెద్దమనిషికి పూర్తి సమయం కేటాయించలేకపోవడం ఒకెత్తు అయితే పనిలో ఉన్నప్పుడు కూడా సరిగ్గా పనిచేయకపోవడం మరొకటి. ముసలితనం వల్ల రాయ్‌చరణ్ శరీరం సహకరించడం లేదు. ఈ వైపు ఎదుగుతున్న కుర్రాడు తనకి రోజురోజుకీ ఎక్కువ డబ్బులు కావాలని పీకుతున్నాడు. చూడబోతే రాయ్‌చరణ్ దగ్గిర డబ్బులు దాదాపుగా అయిపోవస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాయ్‌చరణ్ ఏదో నిశ్చయానికొచ్చాడు. తానింక ఎలాగా ఉద్యోగం చేయలేడు కనక అక్కడ యజమానితో చెప్పి పని మానుకున్నాడు. ఓ రోజు ఫైల్నా దగ్గిరకొచ్చి చెప్పాడు, “నాకు ఊర్లో కొంచెం పని ఉంది, నా దగ్గిర మిగిలిన ఈ డబ్బులు నీదగ్గరుంచు. నేను మరికొన్ని రోజుల్లో మళ్ళీ వెనక్కి వస్తా.”
అనుకూల్ ఇప్పుడెక్కడ పనిచేస్తున్నాడో కనుక్కుని రాయ్‌చరణ్ అతన్ని చూడ్డానికి బయల్దేరాడు. రాయ్‌చరణ్ వచ్చేసరికి అనుకూల్ బయట వరండాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. వాళ్ళావిడ లోపల ఏదో పనిలో ఉంది. కొడుకు నీళ్ళలో పడి కొట్టుకుపోయాక వాళ్ళకి మరింక పిల్లల్లేరు. ఆవిడ పాపం ఇంకా పుత్రశోకం అనుభవిస్తున్నట్టే ఉంది. రాయ్‌చరణ్ రావడం చూసి అనుకూల్ మొహంలో ఏం భావం లేకుండా అడిగాడు, “ఏమిటిలా వచ్చావు?”
రాయ్‌చరణ్ నోటమ్మట మాట లేకుండా అలాగే నించున్నాడు చేతులు కట్టుకుని.
చిన్నపుడు తనని పెంచినందుకో మరెందుకో కానీ కాసేపటికి అనుకూల్ అన్నాడు సున్నితంగానే, “కొన్నేళ్ళ క్రితం ఏదో జరిగిందిలే, దాని సంగతి ఇప్పుడెందుగ్గానీ, పనికోసం చూస్తున్నావా? నీకు మళ్ళీ పనిలోకి రావాలనుంటే చెప్పు, నాక్కూడా ఇంట్లో ఒకరు అవసరం.”
“అందుక్కాదండి వచ్చినది. ఓ సారి అమ్మగార్ని చూసి ఓ మాట చెప్పిపోదామని వచ్చాను,” కాసేపటికి నోరు పెగుల్చుకుని చెప్పాడు రాయ్‌చరణ్.
“సరే, రా అయితే లోపలకి,” అనుకూల్ ముందు నడుస్తుంటే రాయ్ చరణ్ అనుసరించాడు.
అమ్మగారు రాయ్‌చరణ్‌ని చూడగానే మొహం చిట్లించింది, మళ్ళీ ఎక్కడ దాపురించిందిరా ఈ దరిద్రం అనుకుంటూ.
రాయ్‌చరణ్ ఇదేం పట్టించుకోనట్టు చూసి, ఆవిడకి చేతులు జోడించి చెప్పాడు ఏమీ ఉపోద్ఘాతం లేకుండా, “మీ కుర్రాణ్ణి పద్మానది మింగేసిందని అందరూ అనుకున్నారు కానీ, అది నిజం కాదు. వాణ్ణి కావాలని ఎత్తుకుపోయినది నేనే.”
అనుకూల్, వాళ్ళావిడా నోర్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యం, సంభ్రమం, అనుమానం అన్నీ కలగలుపుతూ ఒక్కసారిగా అరిచినట్టే అన్నారు, “ఏమిటీ, నువ్వా! ఎందుకు, ఎలా… ఇంతకీ వాడెక్కడున్నడిప్పుడు?”
“నా దగ్గిరే ఉన్నాడు. నేనే పెంచాను ఇన్నాళ్ళూనూ. వాడికి ఏ లోటూ రాకుండా చూస్తూ స్కూల్లో ఉంచాను. ఎల్లుండి ఆదివారం తీసుకుని వస్తున్నాను. ఇంట్లోనే ఉంటారా?”
ఆదివారం కోర్టుకి శలవు కనక అనుకూల్ ఇంట్లోనే ఉన్నప్పుడు రాయ్‌చరణ్ ఫైల్నాని తీసుకుని వచ్చాడు. కుర్రాణ్ణి చూసి అనుకూల్ భార్య దాదాపు మూర్ఛపోయింది. వాణ్ణి ముట్టుకుని, చేత్తో తడుముతూ, ముద్దులు పెట్టుకుంటూ అదో లోకంలో తేలుతోంది ఆవిడ. అనుకూల్‌కి కూడా ఏదో ఆపేక్ష పుట్టుకొచ్చింది కుర్రాణ్ణి చూడగానే. వీళ్ళిద్దర్నీ చూస్తున్న రాయ్‌చరణ్ కంట్లో నీళ్ళు కనబడకుండా ఉండడానికి కష్టపడుతుంటే అనుకూల్‌లో ఉన్న మెజిస్ట్రేట్ బయటకొచ్చి అడిగేడు, “వీడు మా కొడుకే అనడానికి ఏమిటి ఋజువు? ఎవరైనా సాక్షులు ఉన్నారా దీనికి?”
“ఇటువంటిదానికి సాక్ష్యం ఎక్కడుంటుందండి? నేను వాణ్ణి ఎత్తుకుపోయానని చెప్పాను కదా. వాడు మీకు పుట్టినప్పట్నుంచీ వాడంటే నాకు, నేనంటే వాడికీ ఎంత ఇష్టమో మీకు తెలుసు. సాక్ష్యం కావాలంటే భగవంతుడే సాక్షి.” రాయ్‌చరణ్ చెప్పేడు.
అనుకూల్ ఇటువైపు చూసేసరికి వాళ్ళావిడ కుర్రాణ్ణి ముద్దాడడం, ఎన్నాళ్ళకో కనబడిన కుర్రాణ్ణి చూడడానికి రెండు కళ్ళూ చాలవన్నట్టూ వాడికేసి చూస్తూ ఉండడం కనిపించింది. ఇంక అనుకూల్ సాక్ష్యం గురించి ఏమీ బలవంతం చేయలేకపోయేడు. అయినా తన నమ్మిన బంటు రాయ్‌చరణ్ కుర్రాణ్ణి ఎత్తుకుపోయినట్టూ ఒప్పుకుంటున్నాడుగా! వీడు తమ కొడుకు కాక రాయ్‌చరణ్ కొడుకు అనుకోవడం ఎలా? రాయ్‌చరణ్ అంత ముసలివాడికి ఇంత చిన్న కుర్రాడు పుట్టి ఉండడం అసంభవం కాదూ? ఈ ఆలోచనలు రాగానే అనుకూల్ ఇంక రెట్టించలేకపోయేడు.
కాసేపటికి అనుకూల్ జడ్జ్ లాగా ఏదో తీర్పు ఇస్తున్నట్టు చెప్పేడు రాయ్‌చరణ్‌తో, “నిన్ను నమ్ముతున్నాను కానీ ఇంక నువ్వు ఈ చుట్టుపక్కల ఉండడానికి ఒప్పుకోను. నువ్వు మా కళ్ళ ఎదుట ఉండడం కుదరదు.”
పిడుగు మీద పడ్డట్టు రాయ్‌చరణ్ కంఠం వణుకుతుండగా అడిగేడు, “అలా అంటారేమిటండీ, ఈ ముసలితనంలో నేనెక్కడకి వెళ్తాను? ఎవరున్నారు నాకు?”
అనుకూల్ భార్య కూడా అంది, “పోనీ అతన్ని ఉండనీయరాదుటండి, ఏదో పనిచేసిపెడతాడు ఇంట్లో. ఇన్నాళ్ళూ కుర్రాణ్ణి సాకాడు కనక కుర్రాడికి కూడా ఊసుపోతుంది.”
అనుకూల్ అరిచేడు, “లేదు. వాడిక్కడ ఉండడానికి వీలులేదు. మనం ఎంతో నమ్మి కుర్రాణ్ణి చేతిలో పెడితే ఇలా ఎత్తుకుపోయి ఇన్నేళ్ళూ మనకి పుత్రశోకం కలిగించాడు. ఎప్పుడైతే కుర్రాణ్ణి ఎత్తుకెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడో ఆ రోజే ఇక్కడ ఉండే వీల్లేకుండా తెగతెంపులు చేసుకున్నాడు. వాడెక్కడికెళ్తాడో మనకి అనవసరం.”
రాయ్‌చరణ్ అనుకూల్ కాళ్ళావేళ్ళా పడ్డాడు. కానీ ఫలితం లేకపోయింది, “నేను కాదండి అలా ఎత్తుకెళ్ళినది, ఏదో అలా జరిగిపోయింది…” అంటూ నీళ్ళు నాన్చుతున్న రాయ్‌చరణ్‌ని అనుకూల్ గద్దించాడు, “నువ్వేకదా కుర్రాణ్ణి ఎత్తుకెళ్ళానని చెప్పేవు? మరి నువ్వు కాకపోతే ఎవరు?”
“నేను కాదు, నేను కాదు, ఏదో దేవుడి హస్తం వల్ల అలా అయింది… నేను కాదు, నా ప్రారబ్దం,” రాయ్‌చరణ్ ఏడవడం సాగించాడు చెప్పిన మాటే చెప్తూ.
అనుకూల్ వంటి జడ్జ్ ముందా ఈ ప్రేలాపన? అంతా విన్నాక అనుకూల్ మరింత పట్టుదలగా చెప్పేడు, “నీ దారిన నువ్వు వెళ్ళు. మళ్ళీ ఎప్పుడూ నీ మొహం మాకు చూపించకు.”
ఇదంతా చూసాక ఫైల్నాకి కూడా మండుకొచ్చినట్టయింది. తానొక మెజిస్ట్రేట్ కొడుకు. అయినా ఈ దరిద్రుడు రాయ్‌చరణ్ తనని ఎత్తుకుపోవడం వల్ల, తల్లీ తండ్రీ లేనట్టు పెరిగాడు. ఎంత మోసం! అయినా ఎందుకు చేశాడో ఇదంతా? రాయ్‌చరణ్‌కేసి చూసిన ఫైల్నాకి అతని ముసలితనం, తానేమి అడిగినా వెంటనే కాదనకుండా అమర్చడం అన్నీ గుర్తొచ్చి కాస్త జాలివేసి అనుకూల్‌తో అన్నాడు, “పోనీయండి నాన్నా! ఇన్నాళ్ళకైనా నన్ను తీసుకొచ్చి అప్పగించాడు కదా, అతను ఇక్కడ ఉండడం మీకిష్టం లేకపోతే వాళ్ళ ఊరికి పోనీయండి. అక్కడికే మీరు నెలకింత అంటూ ఏదో డబ్బు పంపించవచ్చు. ఏమంటారు?”
ఈ మాట విన్న రాయ్‌చరణ్ తలెత్తి తన కొడుకుకేసి చూశాడు. అదే రాయ్‌చరణ్ కొడుకుని ఆఖరిసారి చూడడం. అనుకూల్‌కీ వాళ్ళావిడకీ ఓ నమస్కారం పెట్టి ఇంటి గేటు తీసుకుని వెనకకి కూడా చూడకుండా నడుచుకుంటూ రోడ్డు మీద రద్దీలో జనంలో కల్సిపోయేడు.
నెలాఖరుకి అనుకూల్, రాయ్‌చరణ్ ఉండే ఊరికి ఓ మనీ ఆర్డర్ పంపించాడు. అయితే ఆ డబ్బులు వెనక్కి వచ్చేశాయి. డబ్బులు బట్వాడా చేయడానికి రాయ్‌చరణ్ అనే పేరున్నవారెవరూ ఆ ఊర్లో లేరుట!
(మూలం: మై లార్డ్, ది బేబీ)