“హల్లో! అక్కా, నువ్వా. ఏంటి ఇప్పుడు ఫోన్ చేసేవ్? చెప్పు” ఫోన్ ఎత్తిన శ్రీరాం అడిగేడు.
“ఒరే రాముడూ, చిన్న పనుండి చేశాను. బిజీగా ఉన్నావా? తర్వాత చెయ్యమంటావా?”
“అంత బిజీ పని లేదు చెప్పు.”
“నేను నిన్ను చూడ్డానికి వచ్చేవారం వద్దామనుకుంటున్నా. వీకెండ్ కుదుర్తే టికెట్ బుక్ చేసుకుంటా”
“ఏంటి విశేషం?”
“ఏమీ లేదు. నిన్ను చూడాలనిపించింది, అంతే.”
“తప్పకుండా రా. సావిత్రి శుక్రవారం ఏదో కాన్ఫరెన్సుకి వెళ్తోంది. బుధవారం దాకా రాదు.”
“సరే, నేను సావిత్రికి ఫోన్ చేస్తానులే. శుక్రవారం సాయంకాలానికి టికెట్ బుక్ చేసుకుంటాను.”
“సరే. పిల్లలు, బావా బాగున్నారా?”
“ఆ, ఎవ్విరిథింగ్ వాకే”
“నాన్న నేర్పించిన వంకర ఓ.కే ఇంకా మర్చిపోలేదు,” నవ్వుతూ అన్నాడు
అటు వైపు నుంచి చిన్నగా మూలుగు. శ్రీరాం కొంచెం అనుమనంగా చూసి, “అక్కా వంట్లో బావుందా” అనడిగేడు.
అప్పటికే ఫోన్ పెట్టేసింది అన్నపూర్ణ.
శుక్రవారం సాయంత్రం ఎయిర్ పోర్ట్ లో అన్నపూర్ణని చూసాక ‘అక్క బాగా చిక్కిపోయిందే?’ అనుకున్నాడు శ్రీరాం.
బయటకొచ్చి కార్లో కూర్చున్నాక అడిగేడు, “మూణ్ణెల్ల క్రితం బాగానే ఉండేదానివి ఇప్పుడేమైంది?”
“ఏమీ లేదే, బాగానే ఉన్నానుగా? లావు తగ్గడానికి కొంచెం డైటింగ్ మొదలు పెట్టేను అంతే!”
ఇంటికెళ్ళేక అన్నం తింటూ కబుర్లలో పడ్డాక అడిగేడు శ్రీరాం, “చెప్పు ఏమిటి సడన్గా బయల్దేరేవ్? పిల్లల్ని తీసుకురాకుండా?”
“ఏదో నాన్న గుర్తుకొస్తున్నాడు బాగా ఈ మధ్యన. నీతో చెప్పుకుంటే కొంచెం ఉపశమనంగా ఉంటుందనీ…”
“నాన్న పోయి దాదాపు పాతికేళ్ళు ఐనా నీకు మరుపు రాలే? అసలు నాకు ఇప్పుడు నాన్న ఎలా ఉండేవాడో కూడా గుర్తులేదు. పోయేటప్పటికి నాకు మూడేళ్ళా?”
“అవును మూడు నిండి నాలుగు లోకి వచ్చేవ్”
“ఎలా పోయేడు అసలు? అమెరికా ఎప్పుడొచ్చేడు? కాస్త పూర్తిగా చెప్పు మళ్ళీ. తెల్సిన విషయాలే అనుకో మళ్ళీ వినొచ్చని.”
అన్నపూర్ణ చెప్పడం మొదలు పెట్టింది.
“నాన్న చెప్పడం ప్రకారం తను పుట్టింది ఇండియాలో చిన్న పల్లెటూర్లో. దాదాపు ఇరవై ఏళ్ళు అదే ఊర్లో ఉన్నాడు, తెలుగు మాత్రం మాట్లాడుతూ. ఇంగ్లీషొచ్చినా మాట్లాడే అవసరం రాలేదుట ఎప్పుడూ. చాలా బీద కుటుంబం. ఏమీ ఉండేది కాదు. చాలా కారణాల వల్ల ఉన్న డబ్బులన్నీ హారతి ఐపోయేయి. ఆస్తి పోయేటప్పటికి నాన్న డిగ్రీ లాస్టియర్ చదువుతూండేవాడు. నాన్నకున్న అన్నదమ్ములూ అక్కచెళ్ళెళ్ళూ ఎవరికి వాళ్ళు – ఎంతమందో నాకు సరిగ్గా తెలీదు అసలు – వాళ్ళ దార్లు చూసుకున్నారు. అప్పటికే మామ్మ, తాత పోయేరు కనక నాన్నని చూడ్డానికి ఎవరూ లేరు. ఒక్కసారి ఇంట్లోంచి బయటకి వచ్చి నా అనేవాడు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించు. అప్పుడొచ్చింది నాన్నకి ఎమ్మెస్ లో సీటు ఎక్కడో వేరే చోట.”
“ఇండియాలోనేనా?” అడిగేడు శ్రీరాం.
“అవును. నార్త్ ఇండియలో ఏదో పేరు చెప్పేడు ఒకసారి. నాకూ గుర్తులేదు. మూడు ట్రైన్స్ మారి వెళ్ళాలిట. ఒకసారి అక్కడకెళ్ళేక ఇంక వెనక్కి వెళ్ళే అవసరం లేకపోయింది అని చెప్పేది అమ్మ.
“వెనక్కి అంటే?”
“అన్నల్నీ, అక్కల్నీ చూడ్డానికి ఉండే ఊరు. పేరు ‘కావలి’ అని చెప్పినట్టు గుర్తు. ఎమ్మెస్ చదువుతున్నప్పుడు కొంతకాలం ఉత్తరాలు రాసేవాడుట ఇంటికి. వాళ్ళనుంచి ఏమీ రెస్పాన్స్ రాకపోయేసరికి తానూ దూరంగా ఉండడం నేర్చుకున్నాడు. కూడా ఉన్న స్టూడెంట్స్ అందరూ అమెరికా వెళ్ళడానికి టెస్ట్ రాస్తూంటే తాను ఆ దార్లోనే ఇక్కడికి వచ్చాను అని చెప్పేడు నాతో. కానీ షికాగో దిగేటప్పడికి తన దగ్గిర ఇరవై డాలర్లు మాత్రం ఉన్నాయని చాలా సార్లు చెప్పాడు.”
“ఎప్పుడొచ్చాడు ఇక్కడికి?”
“డెభ్భై రెండులో అనుకుంటా. ఉండు మందు వేసుకు వస్తా,” అని అన్నపూర్ణ బెడ్రూం లోకి వెళ్ళి కాస్సేప్పోయేక వచ్చింది.
కళ్ళు ఎర్రగా ఉండడం గమనించేడు శ్రీరాం, “ఏడుస్తున్నావా? ఏమైంది మళ్ళీ?” అడిగేడు. ఈ సారి అన్నపూర్ణకి ఓర్చుకోవడం కుదర్లేదు. శ్రీరాం దగ్గిరకెళ్ళి అనునయంగా అక్క చుట్టూ చెయ్యేసి కూర్చున్నాడు. చిన్నప్పుడు తాను ఏడుస్తూంటే తనని ఊరుకోపెట్టిన అక్కని ఇప్పుడు తాను ఊరుకోపెడుతున్నాడు. ఎంత విచిత్రం! అమ్మపోయినప్పుడు కూడా ధైర్యంగా ఉన్న అక్క ఇప్పుడు ఇలా ఐపోయిందేమిటీ అనుకోకుండా ఉండలేకపోయేడు రాముడు.
చాలాసేపటి వరకు మాటల్లేవు ఇద్దరి మధ్యా. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కు వచ్చి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది అన్నపూర్ణ.
“ఒకసారి అమెరికా రాగానే నాన్నకి మళ్ళీ ఎప్పుడూ వెనక్కి వెళ్ళే అవసరం రాలేదు. ఇక్కడే అమ్మని పెళ్ళి చేసుకుని ఇక్కడే పోయేడు.”
“పోవడం ఏక్సిడెంట్ మూలాన అని చెప్పేవారు నువ్వూ అమ్మానూ. అసలు …”
“ఏక్సిడెంట్ కాదు…” అంటూ అన్నపూర్ణ అడ్డుకుంది.
“ఏమిటీ?” అన్నాడు శ్రీరాం నమ్మలేనన్నట్టుగా. దాదాపు పాతికేళ్ళ తాను అనుకున్నది, తనను నమ్మించింది ఇప్పుడు కాదనిపిస్తూంటే. అన్నపూర్ణ మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది.
“నాన్న చిన్నప్పుడు ఎంత దరిద్రంలోంచి వచ్చాడో తెల్సు కదా? అక్కడ తినడానిక్కూడా ఒక్కొక్కప్పుడు ఏమీ ఉండేది కాదు అని నాతో చెప్పేవాడు. అంచేత రోజూ ఇంటికిరాగానే ఏదైనా ఉందా తినడానికి అని అడిగేవాడు అమ్మని. అమ్మ మాత్రం ఇక్కడే అమెరికాలో పుట్టి పెరిగింది నోట్లో వెండి చెంచాతోటి. ఈ తిండి కాపీనం చూసి చిరాకెక్కేది కాబోలు రోజు నాన్న ఎంత దరిద్రుడో గుర్తు చేస్తూ గేలి చేస్తూ ఉండేది. కొంతకాలం స్పోర్టివ్ గా తీసుకున్నా రాను రాను గొడవలు ముదురుతూ ఉండేవి. తిండి దగ్గిర మొదలైన దెబ్బలాటలు ఇంటి గురించి, డబ్బుల గురించీ, నాన్నకి ఎవరూ లేకపోవడం గురించీ అలా అలా చిలికి చిలికి గాలివానలౌతూ ఉండేది. అప్పుడు నాన్న తాగడం మొదలు పెట్టేడు. మొదట్లో తాగి పడుకునేవాడు. తర్వాత తాగి అమ్మని తిట్టడం కొట్టడం మొదలెట్టాడు. నాకు కూడా దెబ్బలు తగిలాయ్ చాలా సార్లు.”
“మీరెందుకు చెప్పలేదు? నాన్నకైతే ఎవరూ లేరు సరే మరి మనకి ఇక్కడ తాత, అమ్మమ్మ ఉన్నారు కదా?” శ్రీరాం అడిగేడు.
“రెండు మూడు సార్లు వాళ్ళు వచ్చి చెప్పేరు. అప్పుడు కొంతకాలం మామూలుగా ఉన్నారు. మళ్ళీ అమ్మ గేలి చేయడం మొదలుపెట్టేది. నాన్న మళ్ళీ తాగడం మామూలే. ఇలా రెండు సంవత్సరాలయ్యాక ఇంక విడాకులు తీసుకుందాం అని అమ్మ తెగేసి చెప్పింది ఒకరోజు.” ఆగింది అన్నపూర్ణ. కాసేప్పోయేక అంది, “మందు వేసుకున్నాను కదా, ఇప్పుడు నిద్ర వస్తోంది రేపు చెప్తాను మళ్ళీ. గుడ్ నైట్” అని తన గదిలోకి వెళ్ళి పడుకుంది.
శ్రీరాం అక్కడే కూర్చుని ఉండిపోయేడు చాలాసేపు. ఎదురుగా గోడమీద ఉన్న అమ్మా నాన్నల ఫోటోలోంచి అమ్మ నవ్వుతోంది. నాన్న నవ్వు ఎందుకో విషం చిందిస్తున్నట్టు ఉంది. ఎవరి తప్పో ఎవరు చెప్పగలరు? … ఆలోచిస్తున్న శ్రీరాంకి లోపలి గదిలోంచి అన్నపూర్ణ పాడుతున్న పాట సన్నగా వినపడింది. చెవులు రిక్కించాడు.
సర్వమంగళ ప్రియా నమో నమో సర్వలోక రక్షకా నమో నమో!
నిర్వికార నిరంజనా నమో నమో, శర్వాతే మంగళం
ఎన్ని రాత్రులు తనని నిద్రపుచ్చుతూ పాడిందో అక్క. ఇదే పాట. రేపోసారి మళ్ళీ పాడమని అడగాలి అనుకుంటూ తన గదిలోకి దారితీసేడు.
శనివారం తీరిగ్గా లేచేక గుడికి వెళ్దాం పద అంటూ తీసుకెళ్ళింది అన్నపూర్ణ. పూజారి అన్నపూర్ణని గుర్తు పట్టి పలకరింపుగా నవ్వేడు. హారతి సమయంలో పిల్చి అడిగేడు మైక్ చేతికిచ్చి, హారతి పాడండి అంటూ. కొంచెం కీచు గోంతే అయినా అన్నపూర్ణ పాడటం మొదలు పెట్టింది.
సర్వమంగళ ప్రియా నమో నమో సర్వలోక రక్షకా నమో నమో|
నిర్వికార నిరంజనా నమో నమో, శర్వాతే మంగళం ||
స్వర్గాధిపసేవితా నమో నమో సర్గస్థితి లయకరా నమో నమో|
దుర్గాంచితవిగ్రహా నమో నమో భర్గాతే మంగళం ||
కుంభిదనుజమర్దనా నమో నమో కుంభినీభార హరణ నమో నమో|
అంబోరుహలోచనా నమో నమో శంభోతే మంగళం ||
కాలకూటవిషభరణా నమో నమో కాలదర్పాపహరణా నమో నమో|
పాలితాద్వైతబ్రహ్మా నమో నమో శూలీతే మంగళం ||
ప్రసాదం తీసుకుని బయటకొచ్చేక “అక్కా ఈ పాట ఎలా గుర్తుంచుకున్నావు నువ్వు ఇన్నాళ్ళూ?” అనడిగేడు శ్రీరాం.
“చిన్నప్పుడు నాన్న నేర్పించాడు. పోయేటప్పుడు నా దగ్గిర ప్రామిస్ తీసుకున్నాడు రోజు ప్రాక్టీస్ చేస్తానని.”
“సరే నిన్న రాత్రి చెప్పింది కంటిన్యూ చేస్తావా?”
“విను అయితే మరి. ఒకసారి అమ్మ విడాకులు అనేసరికి నాన్నకి బాగా కోపం వచ్చిందనుకుంటా, ఆ రోజు బాగా తాగి నానా తిట్లూ తిట్టడం మొదలు పెట్టేడు. ఇద్దరూ వాదించుకుంటూంటే నేను దగ్గిరకెళ్ళి సర్ది చెప్పపోయాను. నన్ను దూరంగా విసిరేసి అమ్మ జుట్టుపట్టుకుని కొట్టడం మొదలు పెట్టేడు. నాకు కోపం వచ్చింది కిచెన్ లోకి వెళ్ళి కనపడిన చాకు తెచ్చి నాన్నని వెనకనుంచి పొడిచాను అంతే!”
శ్రీరాం ఏమీ ఫీలింగ్స్ లేకుండా వినడం చూసి అడిగింది అన్నపూర్ణ, “నేను చేసింది తప్పేనా? నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావా?”
“లేదు లేదు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? చిన్నప్పట్నుంచీ నువ్వే నాకు నాన్నవి. ఆ పరిస్థితిల్లో నేనూ అదే చేసుండేవాడిని.” అక్క చుట్టూ చెయ్యేసి చెప్పేడు శ్రీరాం. అన్నపూర్ణ కళ్ళలో ఒక కన్నీటి తెర తళుక్కుమనడం శ్రీరాంని దాటిపోలేదు.
“నేను అంతగా రియాక్ట్ అవుతానని నాకు తెలీదు. వెనకనుంచి పొడవడం వల్ల ఎక్కడ తగిలిందో సరిగ్గా తెలీదు కానీ లంగ్స్ లోంచి పోయి బాగా లోపలకి గుర్చుకుందేమో మరి. ఒక్కసారి కిందపడిపోయేడు. నాకేసీ అమ్మకేసి చూసి, నిషా దిగిపోయింది కాబోలు, పోయే ముందు చెప్పాడు ఏమి చెయ్యాలో. అప్పుడే నా దగ్గిర ప్రామిస్ తీసుకున్నాడు. అమ్మతో ఏదో చెప్పబోయేడు ‘నిన్ను నిన్ను’ అంటూండగానే స్పృహ పోయింది. హాస్పిటల్లో ఇంక కళ్ళు తెరవనేలేదు.”
“పోలీస్ గొడవలు రాలేదా?”
“ఎందుకు రావు? తాతయ్య పెద్ద లాయర్ని పెట్టి రెండేళ్ళు పైగా ఏవో తిప్పలు పడ్డాడు. నాన్న లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులతోనే నువ్వూ నేను కాలేజీలో చదువుకోగలిగేం.” ముగించింది అన్నపూర్ణ.
“అయితే ఇప్పుడు నువ్వు నన్ను చూడ్డానికొచ్చింది దీని గురించేనా అనే అనుమానం వస్తోంది నాకు.” శ్రీరాం అన్నాడు.
“అవును. ఇంతకాలం నేను ఇవి నీకు చెప్పకుండా ఉంచాను. కానీ ఇప్పుడు మనసు తొలిచేస్తోంటే నీకు చెప్పాలనిపించింది.”
“ఇప్పుడే ఎందుకలా?”
“నేను వెళ్ళిపోతున్నానురా నాన్నా!” అంది అన్నపూర్ణ మాటలు కూడదీసుకుంటూ.
“ఏంటి మాట్లాడుతున్నావ్?”
“అసలు ఈమాట చెప్పడానికే వచ్చేను నేను. నాకు నెలక్రితం ఒకసారి నెప్పి అనిపిస్తూంటే డాక్టర్ దగ్గిరకి వెళ్ళాను. టెస్టులన్నీ చేసి చెప్పేడు, నాకు వచ్చింది, ఒవేరియన్ కేన్సర్.”
ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసుకుని అక్క చెయ్యి పట్టుకుని ఉద్వేగంగా అన్నాడు శ్రీరాం, “లేదు, లేదు, మనం ఇక్కడ స్పెషలిస్ట్ దగ్గిరకి వెళదాం. బావతో నేను మాట్లాడతాను. నీకు తప్పకుండా తగ్గుతుంది. ఈ రోజుల్లో కేన్సర్ అంటే అంత భయపడక్కర్లేదు. మహ అయితే ఓవరీస్ తీసేస్తారు అనుకుంటా.”
ఒక జీవంలేని నవ్వు నవ్వి చెప్పింది అన్నపూర్ణ. “లేదురా ఇది బాగా ముదిరిపోయింది. లింఫ్ నోడ్స్ లోకి, మిగతా అన్ని ఆర్గాన్స్ లోకి వెళ్ళిపోయింది అని చెప్పాడు డాక్టర్. పరమేశ్వరుడు కూడా ఏమీ చెయ్యలేడు ఇప్పుడు. ఇట్ ఈజ్ జస్ట్ మై టైం అనుకుంటా. అన్నట్టు చెప్పలేదు కదూ, బావకి, పిల్లలకి చెప్పకుండా దాచాను. చెప్తే తట్టుకోలేరని. మహ అయితే ఇంకో నాలుగు నెలలు. చివర్లో ఎలాగా తెలుస్తుందనుకో.”
(ఇందులో రాసిన పాట మా మామ్మగారి నాన్నగారు రాసినది. నా చిన్నప్పుడు మామ్మ పాడుతూంటే విన్నది. మా ముత్తాత గారి పేరు కూడా తెలియదు నాకు. ఆయన రాసిన అద్భుతమైన హారతి పాట సిగ్గులేకుండా ఇందులో వాడుకున్నాను. పాఠకులు క్షమించగలరు. – శర్మ.)