“చూసేరు కదా! మా ఇంట్లో అందరం ఇక్కడే ఉన్నాం. మా ఇంట్లోవాళ్ళకి మంచి అవ్వాలంటే ఏదో చిన్న గుడి కట్టించాలని అంటన్నారు. మీరేవంటారు? ఏ గుడి కడితే మంచిది?” సత్యన్నారాయణ పూజ అయిపోయాక పంతులుగారు, వెంకటరెడ్డి ఇచ్చిన వాయినం, సంభావన పుచ్చుకుని ఇంటికి బయల్దేరబోతూంటే గుమ్మం దగ్గిరే ఆపి అడిగేడు రెడ్డి.
“మీకు తెలీనిదేవుంది? వినాయకుడు అన్ని విఘ్నాలనీ అణిచేస్తాడని తెలుసుకదా? ఆఖరికి మన చాకలిపేటలో కూడా వినాయకుడికి చిన్న గుడి కట్టించారు. రోజూ పొద్దున్నా, సాయంత్రం దీపం పెట్టి రావడానికో బ్రాహ్మణ్ణి కూడా పెట్టుకున్నారు. మనం ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఓ చిన్న గుడి పెట్టించుకోవచ్చు. దానికి దీపం అదీ పెట్టడానికి నేను సిద్ధమే.” పంతులుగారు కొంచెం ఆశ్చర్యంతో చెప్పేడు.
“దీనికెంతౌద్ది?”
“గుడికా, దీపం పెట్టడానికా? దేనికదే కదా?”
“గుడికే. మరీ అంత ఖర్చు ఎక్కువైతే తర్వాత చూడాలి. దేనికదే అంటన్నారు కనక దీపం పెట్టడానికేమాత్రం పుచ్చుకుంటావ్?” మెడికల్ కాలేజీ సీటుకెంతౌద్ది, ఈడి పెళ్ళికెంతౌద్ది, ఆణ్ణి లేపేడానికెంతౌద్ది, ఆడికి సీటిప్పించడానికి ఎంతౌద్ది? దీనికేవన్నా కన్సెషన్ ఉందా అని ముత్యాలముగ్గు సినిమాలో కంట్రాక్టర్ అన్నట్టూ అడిగేడు రెడ్డి.
“అయ్యా మీకు తెలీనిదేవుంది? వెయ్యి రూపాయల నోటు జేబులోంచి బయటకి తీస్తే సాయంకాలానికి పావలాకి దిక్కులేదు. అయినా మీతోనూ, వినాయకుడితోనూ బేరం దేనికీ? మీరెంత ఇస్తే అంతే. మరో మాట లేదు.”
“కొంచెంలో కొంచెం తక్కువ చేసి, చిన్న విగ్రహం, పైనో గంట, బయటో హుండీ చుట్టూ ఓ చిన్న ఇనప కంచే పెట్టేసి ఓ చెట్టుకింద పెట్టేయలేం దేవుడ్ని?”
“ఎండొచ్చినా వానొచ్చినా ఎలాగండి?”
“సరే, అయితే దానికో కప్పు, చుట్టూ గోడ ఉండాలంటావ్?”
“అది లేకపోతే గుడే అవదు కదా, మన శివాలయానికి వెళ్ళే దార్లో శంకరమఠం సత్రం ఉంది చూడండి, అక్కడే రావి చెట్టు కింద పెట్టొచ్చు. ఇప్పుడక్కడ ఖాళీయే కదా?”
“సరే సర్పంచినీ అడుగుతాలే. మరి మీకు నెలకో అయిదొందలిస్తే చాలా దీపం గట్రా ఎలిగించడానికి?”
“మీరు నూనె, దీపం పెట్టడానికి కుందెలు, మిగతా సరంజామా అన్నీ కొనిస్తానంటే నాదేముంది, మీరెంత ఇస్తానంటే అంతే తీసుకుంటాను. మరి దేవుడికి ప్రసాదం రోజూ చిన్న బెల్లం ముక్కైనా పెట్టాలి కదా? నూనే పువ్వులూ అరటిపండో బెల్లం ముక్కో అవి కూడా ఈ అయిదొందల్లో ఎలా కుదుర్తాయి చెప్పండి?”
“సరే వెయ్యి జేస్కోండి అయితే. మరో మాటొద్దు.”
“శుభం. ఎప్పుడు మొదలుపెడతారో కబురు పంపించండి, వెళ్ళిరానా మరి?” బయటనున్న తన మోటార్‌సైకిల్ కేసి నడిచాడు పంతులుగారు.
ఇది జరిగిన నాలుగు నెలలకి వెంకటరెడ్డి సర్పంచికి నచ్చచెప్పి ఒప్పించి రావిచెట్టు కింద చిన్న వినాయకుణ్ణి ప్రతిష్టించేడు. మొత్తం ఖర్చు మూడు లక్షలయింది. అందులో సగం పైన జనాల నుంచి చందాలు, ధర్మదాతల పేర్లు గుడి చుట్టూ గోడ మీద రాయిస్తామనీ చెప్పి – అలా వచ్చింది.
బుల్లి వినాయకుడు పెద్ద పెద్ద చెవుల్తో ముచ్చటగా రావిచెట్టు కింద ఊళ్ళో జరిగేవన్నీ చూస్తూ కూర్చోడానికి పంతులుగారు పెట్టిన ముహూర్తంలో నిశ్చయం అయిపోయింది. ఆయనకి ముందో ఎలక వాహనం, చుట్టూరా ఆరడుగుల ఎత్తు గోడ, చిన్న అరుగు, పంతులుగారు లోపలకెళ్ళి దీపం పెట్టడానికి వీలుగా చిన్న కటకటాల తలుపూ ఆర్భాటంగా అమర్చబడ్డాయి. అన్నింటికన్నా ముఖ్యం, బయట గోడమీద ఫలానా శ్రీశ్రీశ్రీ వెంకటరెడ్డిగారి సహాయంతో అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడింది. బయట చుట్టూ గోడలనిండా అంకమ్మగారు రెండువేలు అనీ, అన్నపూర్ణగారు అయిదువేలు అనీ రకరకాల దాతల పేర్లతో రాయబడిన ఇటుక ముక్కల మధ్యలో బందీగా వినాయకుణ్ణి కూర్చోపెట్టారు. బస్ స్టాండుకెళ్ళే భక్తులో, శివాలయానికెళ్ళేవారో దార్లో ఆగి వినాయకుడికి దణ్ణం పెట్టుకుని ఏ పదో పరకో ఇవ్వాలనిపిస్తే అవి వేయడానికి ఓ హుండీ గుడి బయట ఏర్పాటు చేయబడింది. మరి హుండీలో డబ్బులు ఏ దొంగో ఎత్తుకుపోకుండా ఉండడానికి దానికో గట్టి తాళం ఉండొద్దూ? తళ తళ మెరిసే గోద్రేజ్ నవతాళ్ కూడా శ్రీ వెంకటరెడ్డిగారి చలవే.
ఆ రకంగా ఏకైక ధర్మకర్త శ్రీ రెడ్డిగారి చలువతో పాద ద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుం బరిమార్చి, బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనగతిన్ గ్రీడించు యోగీంద్రు మర్యాదన్, అన్నట్టు వినాయకుడు వీటి మధ్యనే కూర్చుని భాద్రపద శుద్ధ చవితినాడు రావిచెట్టు కింద నుంచి ఊరికేసి చూడ్డం మొదలైంది.
సర్పంచి ఓ చిన్న ధర్మ సందేహం లేవనెత్తాడు – మరి ఈ హుండీ నిండిపోతే ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టాలి? అసలే చవితినాడు మన జనాలకి వీరభక్తి పొంగి పొరల్తుంది కదా? దీనికి వెంకటరెడ్డి దగ్గర సమాధానం సిద్ధంగా ఉంది. ఆయన సలహా ప్రకారం మూణ్ణెల్లకోసారి హుండీ అందరి ముందూ తెరుస్తారు. ఆ వచ్చిన డబ్బులు లెక్కపెట్టి వినాయకుడి పేరు మీద బేంకులో తెరవబోయే ఎకౌంట్లో వేసేయడమే. గుడి గోడకో హుండీకో గంటకో తలుపుకో మరమ్మత్తులు చేయాల్సొస్తే ఈ డబ్బులు పనికొస్తాయ్. మరి చవితినాడో మరో పౌర్ణమినాడో, ఈమధ్యనే మహరాష్ట్ర నుంచి ఎత్తుకొచ్చిన సంకటహరి చతుర్ధి పండగ నాడో మన జనాలకి కొంచెం భక్తిరసం ఎక్కువై హుండీ నిండిపోతే పంతులుగారు అందరికీ చెప్తారు. అప్పుడు ఓ సారి స్పెషల్‌గా హుండీ తెరిచి మళ్ళీ ఆ డబ్బులు బేంకులో వేసేయడమే. వెంకటరెడ్డిగారు ఏకైక ధర్మకర్త కనక సంతకం పెట్టి దేవుడి కోసం బేంకు లోంచి డబ్బులు తీసి వాడతారు.
పంతులుగారు రోజూ పొద్దున్నే వచ్చి దీపం పెట్టాలి తీసుకునే జీతానికి. ఉన్నంతలో అరటిపండో మరోటో ప్రసాదం. ఏదీ లేకపోతే గుడం నివేదయామి అనేది ఎలాగా ఉండేదే.
అన్నీ సవ్యంగా జరిగిపోయేయి. చవితి పూజ అయిపోయాక గణపతి నవరాత్రుల్లో బుల్లి వినాయకుడు కొత్త రంగుల్తో కళకళలాడేడు. ఆయనతో బాటు ఆయన వాహనం కూడా రంగులు వేయించుకుంది. గుళ్ళో గంట గణగణలాడుతూంటే నవరాత్రులు ఇట్టే గడిచిపోయాయి. నవరాత్రుల్లో ఓ మూడు వేలు సంపాదించుకున్న వినాయకుడిప్పుడు మరీ అంత లక్ష్మీ పుత్రుడు కాదు కానీ కొంచెం డబ్బున్నవాడే.
రోజులు గడుస్తున్నాయి. పంతులుగారికి జీతం రెడ్డి దగ్గిర్నుంచి బాగానే అందుతోంది. ఆయన పొద్దుటే ఆరింటికల్లా వచ్చేసి విగ్రహం మీద నిర్మాల్యం తీసి, తెచ్చిన నీళ్ళు ఓ చెంచాతో చిలకరించి, ఓం గణానాంత్వా… అంటూ మొదలు పెట్టి రెండు పువ్వులు వినాయకుడి తల మీద, ప్రసాదంగా పండో మరోటో పెట్టి అరగంటలో ముగించి వెళ్ళిపోతాడు. పిండి కొద్దీ రొట్టె కదా? రెడ్డిగారిచ్చే వెయ్యి రూపాయలకి రోజంతా ఇక్కడే కూచుంటే మిగతా పూజలూ, తన బ్రాహ్మణీకం చూసుకోవద్దూ?
పంతులుగారికి త్వరలోనే తెలిసొచ్చినదేమిటంటే రెడ్డి అసలు ఈ గుడి కట్టించడానిక్కారణం – తన బిజినెస్సు పెంచుకోవడం. ఊళ్ళో ఉన్న పటికబెల్లం ఫేక్టరీ, చేపల చెరువులు, బట్టలకొట్టు, మెడికల్ షాపు, వ్యవసాయం – ఇవి చాలక బియ్యం మిల్లూ, సగ్గుబియ్యం చేయడానికో సాగో ఫేక్టరీ మొదలెట్టాలనుకున్నారు కానీ లైసెన్సులు రావట్లేదు.
ఇదిగో ఇలా వినాయకుణ్ణి ప్రతిష్ఠించడం ఏవిటీ అలా లైసెన్సులు రావడమేమిటీ అన్నీ ఒక్కసారి జరిగిపోయాయి. రెడ్డిగారి వ్యాపారం – ఇద్దరు అల్లుళ్ళూ, ముగ్గులు కొడుకుల సహాయంతో – అంతకంతకూ పుంజుకుంది. బిజినెస్సు పైకొచ్చేకొద్దీ పంతులు గారికీ జీతం పదో పాతికో పెరుగుతోంది. వినాయకుడికీ కొత్త ప్రసాదాలు అందుతున్నాయి, పండగలకీ పబ్బాలకీ రెడ్డిగారి కుటుంబంలో పుట్టిన రోజులకీ శుభకార్యాలకీను. మిగతా రోజుల్లో పాపం ఆయన బొజ్జ ఖాళీగా ఉండకుండా చిన్న బెల్లమ్ముక్క ఉండనే ఉంది.
రోజులన్నీ ఒకేలా ఉండవు కదా, బిజినెస్సులో వచ్చే డబ్బులన్నీ బేంకుల్లో పెడితే ప్రభుత్వంవారు చూసి పన్ను కట్టమంటే? అదే బంగారం రూపంలో ఉంచుకుంటే సులువు. నగో నట్రో చేయించుకుంటే అడిగే నాథుడు లేడు. బంగారం దగ్గిర మరో వెసులుబాటుంది. అది కరిగించేస్తే అది ఎవరిదో ఎక్కడిదో వినాయకుడు కాదు కదా త్రిమూర్తులకైనా తెలియదు. నగలూ బిస్కట్లూ చేయించచ్చు. కానీ, ఏపనికీ అవి పనికిరావు. ఎలాగైనా చేతిలో నోట్లు ఆడుతూండక పోతే కష్టం కాదూ? అందుకే పది కోట్లదాకా వెంకటరెడ్డి ఇంట్లోనూ మరోచోటా మరోచోటా దాచేడు. అంతా బాగా జరిగిపోతోందనుకుంటున్న రోజుల్లో ప్రభుత్వం పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది.
నల్లధనం మురిగిపోయేలా చేయడానికి అయిదొందల నోట్లూ వెయ్యి రూపాయల నోట్లూ రద్దు చేయబడ్డయ్. మీ దగ్గిర కానీ ఈ నోట్లు ఉంటే వెంఠనే బేంకుకి వచ్చి మార్చుకోవాలి అని ప్రకటించేరు. వెంకటరెడ్డికి దడ మొదలైంది. ఏ అయిదారు లక్షలో అయితే మార్చుకోవచ్చు మరి ఇప్పుడు తన దగ్గిర దాచింది కోట్లకి పైమాటే. ఊరంతా తనని తెలియవారు లేరు. బేంకుకి తనవాళ్ళని ఒక ఇరవై మందిని పంపినా మేనేజరుకి అందరూ తెలిసినవాళ్ళే. కొద్దిపాటి కమీషను ఇస్తే మేనేజరు చూసీ చూడనట్టు పోవచ్చు. కానీ ఇంత మొత్తం కష్టం, దానికి మేనేజరులాంటి చిన్నచేప సరిపోదు.
బేంకుకొచ్చి మొహమాటం లేకుండా వెంకటరెడ్డి మేనేజర్‌తో చర్చించాడు, కేషుంది కొద్దిగా చేతిలో, ఏం చేయనూ? అని. తెలిసిన విషయం ఏమిటంటే మహా అయితే తాను అరకోటి నల్ల ధనాన్ని తెల్లగా చేసుకోవచ్చు. మిగతా వాటికి నీళ్ళధారే. ఇంటికొచ్చిన వెంకటరెడ్డి కొడుకులనీ, అల్లుళ్ళనీ కూర్చోబెట్టి చెప్పాడు సంగతి. అందరూ అన్నీ విన్నాక ఏం చేయాలో తోచని స్థితిలో చిన్న అల్లుడు ఇచ్చాడు మంచి సలహా.
ఆ సలహా ప్రకారం తమ నల్లడబ్బులో బేంకు ఇవ్వగలిగినంత వరకూ తెల్లగా చేసుకున్నాక మిగిలిన నగదు బుల్లి వినాయకుడి హుండీలో వేసేయడమే రాత్రికి రాత్రి ఎవరూ చూడకుండా. హుండీ అందరి ముందూ ఖాళీ చేస్తారు కనక ధర్మకర్త సమక్షంలో బేంకు మేనేజరు, వాళ్ళ కుర్రాళ్ళూ సాక్షిగా ఈ హుండీ తెరిచి బేంకుకి తీసుకెళ్తారు. డబ్బులు వినాయకుడివి కనక బేంకు మేనేజరు, ప్రభుత్వం వారూ రెండుచేతుల్తో నోరు మూసుకుని డిపాజిట్ చేసుకోవాలి. వినాయకుడు కూర్చున్న చోటినుండి అంగుళం కదలకుండా ఈ డబ్బులన్నీ తెల్లగా చేసుకోగలడు. లేని పక్షంలో వినాయకుడు ఊరుకుంటాడా? దేవుడి డబ్బులు ముట్టుకుంటే రౌరవాది నరకాల్లో పడిపోరూ?
అల్లుడి తెలివితేటలకి వెంకటరెడ్డి ఆనందపడిపోయి అడిగేడు, “మరి అది దేవుడి ఖాతాలోకి పోతే మనకి ఎనక్కి ఎలా వచ్చుద్ది?”
గీత చెప్పబోతున్న కృష్ణుడిలా ఓరగా నవ్వుతూ అల్లుడు చెప్పేడు, “తర్వాత వినాయకుడి ఖాతాలోంచి మనం తీరిగ్గా తీసుకుందాం. ఇప్పుడు దానికి తొందరేవుంది? మనవే కదా ధర్మకర్తలం?”
ఈ ప్లాను ప్రకారం ప్రభుత్వం వారిచ్చిన గడువులోపుల తమ దగ్గిరున్న నల్లడబ్బు తెలుపు చేసుకున్నాక, మిగిలిన నల్లడబ్బు రాత్రికి రాత్రి వినాయకుడి హుండీలో మూడో కంటికి తెలియకుండా చేరిపోయింది. ఆ రాత్రి రావిచెట్టు కింద ప్రసాదం ఎక్కువైపోయిన బుల్లి వినాయకుడిని చూసి – చవితి నాడు నవ్వినట్టూ – చంద్రుడు మళ్ళీ నవ్వేడు. అయితే ఈ సారి కొడుకు అవస్థ చూసి అలా నవ్వినందుకు చంద్రుడి మీద అమ్మవారికి కోపం రాలేదు సరి కదా తాను కూడా నవ్వు కలిపింది. వీళ్ళిద్దర్నీ చూసి వినాయకుడు కూడా నీరసంగా నవ్వేసరికి ఎలక వాహనం కూడా మొహమాటంగా నవ్వింది.
మర్నాడు పొద్దున్నే మామూలుగా దీపం పెట్టడానికొచ్చిన పంతులుగారికి ముందుగా కనబడింది నిండిపోయిన హుండీ, అందులోంచి పట్టక బయటకి తన్నుకొచ్చే అయిదు వందల, వెయ్యి రూపాయల నోట్లూను. దాని సంగతలా ఉంచి తలుపు తీయబోతే వినాయకుడి గుడిలో, వాహనం మీదా ఎక్కడపడితే అక్కడ కుప్పలు తెప్పలుగా నోట్లు. పంతులు గారికి పది నిముషాలు ఏవి చేయడానికీ పాలుపోలేదు. తలుపు తీయకుండా అలాగే వదిలి తన మోటార్ సైకిల్ దగ్గిరకొచ్చి సెల్ ఫోన్ బయటకి తీసి వెంకటరెడ్డికి ఫోన్ చేశాడు.
ఈ ఫోన్ రావడం కోసమే చూస్తున్నాడా అన్నట్టూ వెంకటరెడ్డి అందుకుని అడిగేడు, “ఏంటి పంతులుగారూ! పొద్దున్నే ఫోన్ చేసేరు?”
“మీరోసారి అర్జంటుగా వినాయకుడి గుడి దగ్గిరకి రావాలండి. మీ అబ్బాయినో, అల్లుణ్ణో తీసుకొస్తే మంచిది.”
“ఏటండి సంగతి, అంతా సరిగ్గుందా?”
“అవునండి. ఇది గుడికి సంబంధించిన విషయం, అలా ఫోను మీద చెప్పేది కాదు. ఒక్క పది నిముషాల్లో రాగలరా?”
“సరే అయితే అల్లుడితో వస్తున్నాను,” ఫోను పెట్టేసి అక్కడే ఉన్న అల్లుడితో చెప్పేడు రెడ్డి, “డబ్బులు చూసి పంతులు డంగైపోయినట్టున్నాడోయ్, మన డబ్బులకేం ఫర్లేదా?”
“పంతులుకి భయం. నోటు ముట్టుకోడు. మహా నొక్కితే కూడా ఒక కట్ట నొక్కుతాడు, అంతేగా. నాదీ భరోసా, ఏమీ కంగార్లేదు.”
రెడ్డీ, అల్లుడూ అరగంటలో కారు దిగేసరికి గుడి చుట్టూ జనం పోగై ఉన్నారు వింత చూస్తూ. డబ్బులు ముట్టుకోవడానికి ఎవరికీ ధైర్యం లేదు. వినాయకుడి డబ్బా, మజాకా? సాక్షుల్లేకుండా ముట్టుకుంటే జైలూ, దేవుడి డబ్బులు ముట్టుకుంటే నరకమూను. అదీకాక ఈ హుండీ తెరవాలంటే బేంకువారు రావాలి; దేవుడిది ధర్మఖాతా కదా? కానీ బేంకువారు గంట పది దాటకుండా, ఆఫీసులు తీయకుండా అలా వచ్చేస్తారా? కొన్నిసార్లు వచ్చేస్తారు మరి.
బేంకులో ఓ లక్ష దాచుకుని, అప్పుడో పది వేయడం, ఇప్పుడో పది తీసుకోవడం – చేసేవాళ్ళంతా బేంకుకి ఊడబొడిచిందేమీ లేదు. మరి రెడ్డి లాంటివాళ్ళో? అబ్బో, వాళ్ళు పెద్ద అప్పులు తీస్తారు, వడ్డీలు కడతారు, అంతా లకారాలలోనే. బేంకులను రక్షించేదీ భక్షించేదీ వాళ్ళే మరి. అందుకని రెడ్డిగారు తాను స్వయంగా వచ్చినా, అల్లుణ్ణి పంపించినా మేనేజర్ గుమ్మం దగ్గిర సిద్ధంగా ఉంటాడు. కొండొకచో ఫోనుమీదే వ్యవహారం జరిగిపోతుంది. అటువంటప్పుడు బేంకు ఇంకా తెరిచారా లేదా అనే విషయాలు పట్టించుకోకుండా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రావడానికీ, పోవడానికీ మేనేజరు సిద్ధం.
బేంకులు ఎలా పనిచేస్తాయో రెడ్డికి క్షుణ్ణంగా తెలుసు కనక అల్లుడి చేతికి ఫోనిచ్చి చెప్పేడు, “అల్లుడూ మేనేజర్ని ఓ సారిలా రమ్మను మరో క్లర్కుతో.”
మరో పదిహేను నిముషాల్లో మేనేజర్ ఇంకో ఇద్దరు ఆఫీసర్లతో గుడి ముందు వాలిపోయేడు. ఎవరూ ఎవరికీ ఏమీ చెప్పక్కర్లేకుండానే విషయం అర్థమైపోయింది. పది నిముషాలు ఆలోచించి మేనేజర్ చెప్పేడు.
“ఈ డబ్బులు ఎవరు వేశారో కానీ మా హైద్రాబాదు రీజినల్ మేనేజర్‌తో మాట్లాడాలండి. అయితే ఇవన్నీ డబ్బాల్లోకి ఎత్తేసి బేంకు లాకర్లో ఉంచుదాం. లెక్క కట్టి చూసి ఇలా ఇంత వేశారు అని నేనూ మా కుర్రాళ్ళూ సాక్ష్యం. మీరూ పంతులుగారూ ఎలాగా చూసిందే. ఫోటోలు తీసి ఉంచుదాం ఎందుకైనా మంచిది.”
స్పెషల్‌గా పిలవబడ్డ ఊరి ఫోటోగ్రాఫర్ తీసినవి కాక, అల్లుడు టక టకా వేరేగా తన సెల్ ఫోనులో ఫోటోలు తీశాడు. మరి తర్వాత తేడా వస్తే లెక్క చూసుకోవద్దూ? చూసిన ఎవరికీ ఏ అనుమానం రాకుండా, డబ్బులన్నీ డబ్బాల్లోకి ఎత్తేసి రెడ్డిగారి దగ్గిరా పంతులుగారి దగ్గిరా ఇలా అని సాక్ష్యానికి సంతకాలు తీసుకుని బేంకుకేసి వెళ్ళిపోయింది మేనేజరు కారు.
వినాయకుడు తన భుక్తాయాసం అలా తీరిపోగానే మళ్ళీ మామూలుగా ఉల్లాసంగా ఊరికేసి చూడ్డం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని వారాలకు కిందా మీదా పడి ఎలాగైతేనేం హైద్రాబాదు రీజినల్ మేనేజర్‌గారి ఆశీర్వాదంతో డబ్బంతా వినాయకుడి ఎకౌంట్లోకి జేరిపోయి తెల్లగా అయిపోయింది. శుక్లాంబరధరం విష్ణుం… అనేది విష్ణువు గురించిన శ్లోకం అని శివానందులంతటి వారు చెప్పినా మనం అది గణపతిని ఉద్దేశించి చదువుతున్నాం కనక వళ్ళు దగ్గిర పెట్టుకుని అంతటి నలుపునీ శశివర్ణంలోకి మార్చేశారు బేంకువారు. ఎలక తోలు తెచ్చి ఎంత ఉతికినా తెలుపు గాదని వేమన అన్నాడంటే ఆ రోజులు వేరు. ఇప్పుడు మైకల్ జాక్సన్ చేయించుకున్నట్టూ ఏ రంగు తోలునైనా సరే అంగుళం కదలకుండా తెల్లగా చేసుకోవచ్చు. బుర్ర ఉంటే చాలు, పది నిముషాల్లో పని.
డబ్బులు వినాయకుడి ఎకౌంట్లోకి వెళ్ళాక నెలలు గడిచే కొద్దీ ఈ నోట్ల రద్దు కార్యక్రమం మెల్లిగా మరుగున పడిపోయింది. భారద్దేశ ప్రజలు ఎంత బుర్రలేని వాళ్ళో, వాళ్ళని ఎలా ఆడించినా నోరు మూసుకుని పడి ఉంటారో, ఎంత ఓపిక ఉన్నవాళ్ళో మరోసారి ప్రపంచానికి ఋజువు చేయబడింది. పెద్ద ప్రాజక్టు కడుతూంటే కొంత మంది అమాయకులు బలి అవుతారు. అది అత్యంత సహజం. అలా అవకపోతే పనులెలా అవుతై? జనాల్దేవుంది? ఇప్పటికే ఓ బిలియన్‌కి పైబడి ఉన్నాం. రోజుకి పది మంది పోతే మరో ముఫ్ఫై మంది పుట్టుకొస్తున్నారు కదా, అబ్బాయే కావాలంటూ అబార్షన్లు చేయించినా, కడుపుతో ఉన్న ఆడంగుల్ని చంపేసినా? దేశభక్తి గంజాయి ఎలానూ సమృద్ధిగా ఉంది అందరూ పీల్చడానికి.
ఈసరికి వెంకటరెడ్డి అల్లుడి ఆలోచనలు క్రమంగా రూపుదిద్దుకోవడం మొదలైంది. మొదటి విడతలో ఆ ఏడు వినాయక చవితికి గుడి ముందు పెద్ద పందిరి, మైకు సెట్టు పెట్టించారు. బుల్లి వినాయకుడికీ, ఆయన వాహనానికీ రంగులు, వెండి ఆభరణాలు, గోడకి సున్నం, గేటుకి, హుండీకి రంగులూ అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. ఖర్చులకి జోబులు తడుముకోవాల్సిన అవసరం లేకపోయింది; బుల్లి వినాయకుడు ఇప్పుడు కోటీశ్వరుడు కాదు మరీ?
గణపతి నవరాత్రులైన మూడో రోజుకి రెడ్డిగారికి గుండెల్లో నెప్పి వచ్చింది. వెంఠనే ఆఘమేఘాల మీద హాస్పిటల్లో జేర్పించారు. ఊళ్ళోనే ఉన్న కార్డియాలజిస్టు వచ్చి చూడ్డం అయింది. ఒక నైట్రోగ్లిసరిన్ టాబ్లెట్ ఇచ్చి తర్వాత అన్ని టెస్టులూ చేయించి రెడ్డితో చెప్పేడు, “గుండెలో ఓ నాళం మూసుకుపోయింది. వెంఠనే ఓ స్టెంటు వేయించాలి.”
మరో పది రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటి కొచ్చాడు వెంకటరెడ్డి. ఇంతకు ముందు తిన్న ఆహారం ఇప్పుడు పనికిరాదు. పొద్దున్నే రెండు ఇడ్డెన్లు, మధ్యాహ్నం నూనె లేకుండా రెండు చపాతీలు, సాయంత్రం మళ్ళీ అలాంటిదే భోజనం అనబడే ఎండు గడ్డీను. కొబ్బరి పనికిరాదు, మసాలాలు తింటే ఇంక అంతే సంగతులు.
రెడ్డిగారికి ఒంట్లో బాగుపడితే గుడికి రంగులేయించి మహాభిషేకం చేయిస్తానని వాళ్ళావిడ వినాయకుడికి మొక్కుకుంది. రంగులు వేయించి ఆర్నెల్లు కాకుండా మళ్ళీ రంగులేస్తుంటే గుడి దగ్గిరే ఉన్న పంతులుగారు ఆశ్చర్యపోయేడు. అక్కడే రంగులేస్తున్న కుర్రాడితో మాటా మాటా కలిపితే తెల్సింది అసలు విషయం, రెడ్డిగారి మొక్కు గురించి. అసలు మొదట్లో గుడి కట్టించేటప్పుడు పదికీ, పరకకీ డబ్బులైపోతాయేమోనని చూసుకునే రెడ్డిగారు దీని మీద ఎంత ఖర్చుపెడుతున్నాడో చూసి పంతులుగారు ఆశ్చర్యపోయేడు. కూపీ లాగడానికి ప్రయత్నం చేస్తూ రంగేస్తున్న కుర్రాణ్ణి అడిగేడు,
“ఈ రంగులకెంతవుతుంది బాబూ?”
“తెలీదండి. మా మేస్త్రీ చూసుకుంటాడు అవన్నీ”
“అవున్లే. అంటే మామూలుగా. ఈమాత్రం గోడకు ఉరామరిగ్గా ఎంతో అని.”
“ఈ చిన్న విగ్రహానికి మహా అయితే అయిదారువేలు చాలండి. గుడి గోడలకి వెల్ల, అవీ మొత్తం పదిహేను, ఇరవై వేలల్లో చేసేయొచ్చు.”
రంగుల పనీ అదీ ఐపోయాక గుడి తలుపుకి వేసిన తాళం సరిచూసుకుని పంతులుగారు తన బ్రాహ్మణీకం చూసుకోవడానికి బండి స్టార్ట్ చేశాడు.
గుండె నెప్పి వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు కార్డియాలజిస్టు దగ్గిరకెళ్ళడం ఆయనిచ్చే సలహా ప్రకారం ఓ నైట్రో గ్లిసరిన్ నాలిక్కింద పెట్టుకోవడం అలవాటైంది వెంకటరెడ్డికి. అలా వెళ్ళిన ఓ రోజున అడిగేడు కార్డియాలజిస్టుని.
“అప్పుడప్పుడు చిన్న చిన్న నెప్పులొస్తున్నాయి. దీనితోనే నేను పోతానంటారా?”
“అలా ఎందుకనుకుంటున్నారు? గుండెలో స్టెంటు వేశాం కదా? దానివల్ల బాగానే ఉంది. మరి మనసుకి ఏ కష్టం రాకుండా చూసుకోండి. మరీ నెప్పి వస్తే ఈ మందు నాలిక కింద ఉంచుకుని నాకు ఫోన్ చేయండి.”
“అసలు చావొచ్చేటప్పుడు ఎలా తెలుస్తుంది?”
“తట్టుకోలేని గుండె నెప్పి వస్తే ఛాతీ మీద ఏనుగు కూర్చున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత స్పృహ పోవచ్చు. అయినా అంతదాకా రాదనే ఆశిద్దాం.”
ఏనుగు మాట వినేసరికి ఒక్కసారి రెడ్డికి బుల్లి వినాయకుడు గుర్తొచ్చాడు ఎందుకో. కాసేపు డాక్టర్‌తో మాట్లాడి బయటకొచ్చేడు.
ఆ ఏడాది నవరాత్రుల తర్వాతి నుంచి వినాయకుడికి పూజలూ పునస్కారాలు ఎక్కువయ్యేయి. ఎప్పటిలాగానే కొత్త రంగులు, తాటాకు పందిళ్ళు, కొత్త కొత్త నైవేద్యాలు, స్పెషల్ మిఠాయిలు, మరింత తరచుగా వస్తున్నాయి. కొత్తగా మొదలైనది ఏవిటంటే వినాయకుడి పేరు మీద ఊర్లో స్కూల్లో వారానికోసారి కుర్రాళ్ళకి ఉచిత భోజనం.
ఓ రోజు పని మీద పంతులుగారు బేంకుకెళ్ళేడు. కౌంటర్ల వెనుకగా ఉన్న అసిస్టంటు మేనేజరు, తెలిసినవాడే, నవ్వి పలకరించేడు. పిలిచి ఎదురుగా కూర్చోమని చెప్పి, పంతులుగారి డీడీ మేనేజరు రూములోకి పంపించేడు. ఆమాటా ఈమాటా చెప్తూ నవ్వుతూ అన్నాడు.
“ఏం శాస్త్రిగారూ, వినాయకులవారు దర్జాగా ఉన్నారా?”
“అదేం అలా అడుగుతున్నారు?”
“లక్షల్లో ఖర్చు పెడుతున్నారుగా ఆయనకోసం, తక్కువేమీ కాలేదు కదా అని.”
“లక్షల్లోనా?”
ఆశ్చర్యపోవడం అసిస్టెంటు మేనేజరు వంతయింది. గొంతు తగ్గించి చెప్పేడు. “అదేంటీ? మీకు తెలీకుండానేనా?”
“ఏమోనండి, నాకెలా తెలుస్తాయి ఇవన్నీను. నేను పూజ చేసి వెళ్ళిపోతాను అంతే.”
ఆయన లెడ్జరు తీసి చూపించేడు. లక్షల్లో విత్‌డ్రాయల్స్.
“సరే ఎవరి దగ్గిరా అనకండి, మళ్ళీ రెడ్డిగారికి తెలిస్తే బాగుండదు కదా?”
“నేనా నోరు విప్పేది? నాకెందుకండీ ఇదంతాను?”
బేంకులోంచి బయటకొచ్చాడన్నమాటే గానీ పంతులుగారికి ఒళ్ళు మండుతూనే ఉంది. ఈ డబ్బులన్నీ హుండీలో ఈయన వేసినవేనన్న మాట. అందుకే అలా ఇష్టం వచ్చినట్టూ తీసుకుంటున్నాడు అనే ఆలోచన వచ్చింది. మర్నాడు పూజకి వచ్చాడన్నమాటే కానీ ఇదే మనసులో మెదుల్తోంది. పత్రికలవాళ్ళకో ఇంకెవరికో చెప్దామా అనుకున్నాడు కానీ అలా చేస్తే తను వీధిలో పడతాడు. ఎందుకొచ్చిన తల్నొప్పి. ఎదురుగా కూర్చుని పూజ మొదలుపెట్టాడు. విగ్రహం కేసి చూస్తూంటే వినాయకుడు ఎవర్నో చూసి భయపడుతున్నట్టుంది. పంతులుగారైతే తన చేతకానితనానికి సర్దిచెప్పుకోగలిగేడు కానీ వినాయకుడికి అది చేతకాక దిగులుగా ఉన్నట్టున్నాడు. పూజ ముగించి ప్రసాదం పెట్టి బయటకొస్తుంటే ఫోను మోగింది – రెడ్డిగారి దగ్గిర్నుంచే. వెంఠనే ఓ సారి ఇంటికి రమ్మని పిలుస్తున్నారు.
వచ్చిన పంతులుగార్ని లోపలకి తీసుకెళ్ళి ఆయనిచ్చిన ప్రసాదం తీసుకున్నాక అడిగేడు రెడ్డి.
“ఏటండి సంగతులు, గుళ్ళో అన్నీ బాగా జరగతన్నాయా?”
“అంతా మీ దయ. ఏవిటిలా పిల్చేరు? ఆరోగ్యం ఎలావుంది తమరిది.”
“బానే ఉంది. దేవుడి మీద బరువేసి బతుకుతుండా. యాపారం చూసుకునేందికి కొడుకులూ అల్లుళ్ళూ ఉండారు. రామా కిష్ణా అనుకుంటూ వుండా.”
“మంచిదే. తమరికీ విశ్రాంతి అవసరం.”
“సరే గానీ, దేవుడి పేరు మీద ఇంకేంజేయచ్చా అని.”
“ఉచిత భోజనాలు మరిన్ని రోజులు పెట్టచ్చు. విద్యార్థులందరికీ పెన్నులూ పెన్సిళ్ళూ పుస్తకాలు కొనివ్వొచ్చు. పేద విద్యార్ధులకు పండగలప్పుడు బట్టలిచ్చినా బాగుంటుంది.”
“భలే చెప్పావ్ పంతులూ. బట్టల్దేవుంది. మన కొట్.. మనకు తెలిసినోళ్ళుండారు. సవగ్గా ఇస్తారు.”
“ఖర్చు ఎక్కువవుతుందేమో మరి?” పంతులు కూపీ లాగుతున్నట్టు అడిగేడు.
“అది మనోళ్ళు చూసుకుంటార్లే. అయినా ఎంతవుద్ది. రంగులకి రెండు లక్షల కంటే కాకపాయె…”
“మన చిన్న వినాయకుడికి రంగులేయడానికి అంత ఖర్చా?” నోరు వెళ్ళబెట్టేడు పంతులు.
“ఆ ఖర్చు గురించి తర్వాత మాట్లాడదాం గానీ… పంతులుగారూ మీకిస్తున్న జీతం సరిపోతోందా?” వెంకటరెడ్డి నోరు జారినట్టు తెలియగానే పరిస్థితి చక్కదిద్దడానికి అక్కడే ఉన్న అల్లుడు రంగంలోకి దిగేడు.
“హుండీలో డబ్బులు లేవు ఇంతకాలం అని నేను అడగట్లేదు కానీ వెయ్యి రూపాయలు ఏమూలకండి? మిమ్మల్నే అడుగుదామనుకుంటున్నాను. మీరే అడిగారు ఈలోపున.”
“పంతులుగారూ, అన్నింటికీ ఖర్చులు పెరిగాయి కదా. మీ జీతం వచ్చే నెల నుంచి ఐదువేలు చేస్తే సరిపోతుందా?” వెంకటరెడ్డి ఏమీ మాట్లాడకపోవడం చూసి అల్లుడే చెప్పేడు,
తన జీతం పెరుగుతోందనే విషయం వినగానే పంతులుగారు గంట క్రితం తాను గుళ్ళో వినాయకుడి దగ్గిర గొణిగిన గొణుగుడూ అన్నీ మర్చిపోయి సంతోషంగా చెప్పేడు, “మహా భాగ్యం. వేణ్ణీళ్ళకి చణ్ణీళ్ళు. అంతకన్నానా?”
కాసేపు అదీ ఇదీ మాట్లాడేక పంతులుగారు లేచాడు ఇంటికెళ్ళడానికి. పంతులుగారిని వెళ్ళనిచ్చి వెంకటరెడ్డి అల్లుడితో అన్నాడు.
“ఈ పంతులుగార్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. మొన్నోమాటు బేంకులో అసిస్టెంటు మేనేజరుతో ఏదో తెగ మాటాడతన్నాడంట.”
“జీతం పెంచాం కనక అంత సీను లేదు ప్రస్తుతానికి, కానీ జాగ్రత్తలో ఉండడం మంచిదే. అయినా ఏం చెప్తాడు మన గురించి? ఎవరితో చెప్తాడు? అయినా మనకి దేనికీ భయం? వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఊరు మనది, బిజినెస్సు మనదీను.”
రెడ్డి ఇంట్లోంచి బయటకొచ్చిన పంతులుగారికి ఇంకేమీ చెప్పక్కర్లేకుండానే మిగతా కథ అర్థమైపోయింది. ఈ హుండీలో మొదట్లో డబ్బులెవరు కుక్కి కుక్కి వేశారో ఎవర్నీ అడగక్కర్లేదు. ఈయన చేసిన నిర్వాకం తెలుస్తూనే ఉంది. ఓ పదో ఇరవయ్యో లక్షలు అసలు ఖర్చులకి పోయినా మొత్తమ్మీద ధర్మకర్త నల్లధనం దాదాపు అంతా తెల్లగా అయిపోయింది. అయిదువేల రంగులకి రెండు లక్షలనీ వెయ్యి రూపాయల ప్రసాదాలకి డెబ్భైవేలని ఇలా తిరిగి లాక్కుంటున్నారన్నమాట. అలాగే పందిరి వేయడానికి, రేప్పొద్దున్న కుర్రాళ్ళకిచ్చే బట్టలకీ ఇలానే అవుతుంది. ఎంత అద్భుతం! పూజ చేస్తూ వినాయకుడి ముందు గొణుక్కున్నాడు, స్వామీ! నువ్వయినా ఏదో ఒకటి చేయచ్చు కదా, అని. కానీ ఇటువంటి తెలివితేటల ముందు బుల్లి వినాయకుడి తెలివితేటలు ఏ మూలకి? అందుకేనేమో పూజ చేస్తూంటే వినాయకుడు భయపడ్డట్టు కనిపించినది? ఆమాటకొస్తే తన తెలివితేటలేపాటివి? ఇంకా ఏం జరగనున్నాయో. ఏమైతేనేం, జీతం పెరిగింది. అందరూ బాగుంటే అదే పదివేలు. నలుగురితో నారాయణ.
రెండు వారాలు పోయాయో లేదో రెడ్డిగారికి గుండెనొప్పి వచ్చింది. ఛాతీ పట్టుకుని ‘ఏనుగు, ఏనుగు’ అని పలవరిస్తూ పడిపోయేడు. అప్పటికప్పుడు ఆపరేషన్ చేసి కార్డియాలజిస్టు ప్రాణంపోశాడు. రెండు మూడు వారాలు హాస్పిటల్లో గడిపి బరువు తగ్గిపోయి ఉల్లాసంగా వెనక్కొచ్చాడు రెడ్డి ఇంటికి. పెళ్ళాం పిల్లలూ సపర్యలు చేశారు. కొడుకులూ, అల్లుళ్ళూ అద్భుతంగా చూసుకుంటున్నారు బిజినెస్సు. ఏమీ కంగార్లేదు.
రెడ్డిగారి తరపున మరోసారి బుల్లి వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. పూజలో పంతులుగారికి మంచి సంభావన, కార్డియాలజిస్టుకి మరో బహుమతీ ఇచ్చారు. బుల్లి వినాయకుడి అనుగ్రహం వల్లే ఇదంతా అని రెడ్డిగారి కుటుంబం అంతా అందరికీ చెప్పుకున్నారు. గుడిని ఇలానే ప్రాణంగా చూసుకుంటామని కొడుకులూ అల్లుళ్ళూ ప్రమాణాలు కూడా చేసేరు. రెడ్డిగారికి విశ్రాంతి కావాలి కనుక తామంతా కూడా ధర్మకర్తలయ్యేరు.
త్వరలోనే ఊళ్ళో ఒక నమ్మకం మొదలైంది. గుడి కట్టాక రెడ్డిగారి బిజినెస్సులు బాగా పెరిగాయి కనక, బైపాస్ తర్వాత ఆరోగ్యం బాగుపడింది కనక, ఇదంతా వినాయకుడి మహిమే అని ఆ నోటా ఈనోటా తెలిసిపోయింది. ఆనోటా ఈనోటా తెలిసిందేమిటంటే రెడ్డిగారు గుడి మొదలు పెట్టింది, బైపాస్ చేయించుకున్నదీ రెండూ బుధవారమే అని. అప్పట్నుంచి ప్రతీ బుధవారం బుల్లి వినాయకుడి విశేష దినం. ఆ రోజు పూజలు చేస్తే తిరుగు లేదు. పంతులుగారు ఆ రోజున తన బ్రాహ్మణీకం మానుకుని రోజంతా వినాయకుడికి స్పెషల్ పూజలూ అవీ చేస్తాడు. ఊర్లో మిగతా వ్యాపారస్తులు, ఉద్యోగులు, లేబరు వాళ్ళు, ప్రతీ ఒక్కరూ వచ్చి పెద్ద ఎత్తున దక్షిణ సమర్పించడం కూడా బుధవారమే. అలా వచ్చిన హుండీ డబ్బులు శుక్రవారం పొద్దున్నే బేంకులో వేసేస్తారు.
ప్రజలకి తెలియని విషయాలు కొన్ని బయటకి ఎవరూ అడగరాదు, చెప్పరాదు. కానీ అసిస్టెంటు మేనేజర్ చెప్పడం ప్రకారం ఊరి బేంకులో శుక్రవారం పెద్ద పని ఉండదు. రెడ్డిగారు ఎవరికీ అనుమానం రాకుండా బేంకులో ఏదైనా పని తీరిగ్గా చేసుకోవడానికి సులభం శుక్రవారమే. ధర్మకర్తలకి గురువారం మాత్రమే వినాయకుడి హుండీ డబ్బులు లెక్కపెట్టడం కుదురుతుంది. అందువల్ల వినాయకుడికి విశేష దినం బుధవారం. పంతులుగారికి ఆ రోజున ప్రత్యేకంగా ఐదొందలు చెల్లిస్తారు. దక్షిణ పళ్ళెంలో డబ్బులు మొత్తం పంతులుగారివే ఆ రోజు. (నిజానికి గుడి కట్టించినది శుక్రవారం, రెడ్డిగారికి బైపాస్ అయినది ఆదివారం.) మేనేజరుగారే కాదు, అప్పుడప్పుడూ రీజినల్ మేనేజరుగారూ సకుటుంబంగా వచ్చి, వినాయకుడి దర్శనం చేసుకుని, రెడ్డిగారు ఇచ్చే ప్రత్యేక తీర్థప్రసాదాలు స్వీకరించి వెళుతుంటారు. వినాయకుడు తలచుకుంటే జరగనిది ఏమీ లేదు. ఆయన అనుగ్రహం చాలా అవసరం.
అలా వినాయకుడు మరింత శ్రీమంతుడయేడు. ఇంకా అవుతూనే ఉన్నాడు. ఎవరైనా బుల్లి వినాయకుడికి నగో నట్రో చేయిస్తామంటే వినాయకుడికి నగలు పెట్టకూడదనీ నగదే మంచిదనీ ఆగమ పండితుడైన పంతులుగారి ఉవాచ. డబ్బును వారు గుడి పేరున ధర్మకర్తలకు ఇస్తారు. వారు దేవుడికి కావలసినవన్నీ చేయిస్తారు. వెండి ఆభరణాలు, తొడుగులూ పోయి ఇప్పుడు వినాయకుడికి బంగారు నగలు వచ్చేయి. మూషికవాహనమూ బంగారు తాపడంతో పచ్చగా మెరిసిపోతోంది. గర్భగుళ్ళో అన్నీ – ఉద్ధరిణి, వెండి పళ్ళెం, చిరుగంట, భక్తుల నెత్తిమీద పెట్టడానికి శఠగోపం – ఇప్పుడు వెండి, బంగారంతో చేసినవే. పంతులుగారు కూడా బేంకుకు ఇప్పుడు వారానికి రెండు మూడుసార్లు వెళుతున్నాడు. అసిస్టెంటు మేనేజరు పుణ్యమా అని పని తొందరగానే అయిపోతుంది లైనులో నిలబడకుండా.
ఒకరోజు అలానే బేంకుకెళితే, అసిస్టెంటు మేనేజరు కాగితాలు సర్దుకుంటున్నాడు. అడిగితే చెప్పేడు, తనకు ట్రాన్స్‌ఫరయిందని. ఆంధ్రా ఒరిస్సా బార్డరులో డొంకరాయి అనే ఊళ్ళో బేంకుకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయిట. అది చూసి నెత్తి నోరూ కొట్టుకుని పైకెళ్ళి చెప్పుకుంటే రీజినల్ మేనేజర్ గారు, ‘డొంకరాయిలో పని చేస్తే ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని’ చెప్పేరట. అయినా డొంకరాయికేం? ఊర్లో ఓ శివాలయం, రామాలయం, పోస్టాఫీసు ఉన్నాయి. పక్కనే ఆహ్లాదంగా సీలేరు, అప్పుడప్పుడూ కనిపించే జింకలు, ఎలుగు గొడ్లూను. హృదయం ఉండాలే గానీ చూసి ఆనందించడానికి చుట్టూరా పచ్చని చెట్లతో అద్భుతమే.
“అయ్యో, అదేమిటండీ. మీరు కష్టపడి పనిచేస్తారు కదా. మీలాంటి వాళ్ళ ఉపయోగం ఇలాంటి పెద్ద బేంకుల్లోనే కదా?” పంతులుగారు నొచ్చుకున్నాడు.
“ఆ ‘కష్టపడడమే’ నచ్చినట్టు లేదు మావాళ్ళకి.”
కొంచెం బలవంతం చేస్తే, అసలు సంగతి చెప్పేడు ఆయన. ఈ గుడి అకౌంటు లావాదేవీలు చూడమని బేంకు ఆడిటర్లకి ఈయన ఉప్పందించబోయేట్ట. అక్కడిదాకా పోకుండానే రీజినల్ మేనేజరుగారు విని పిలిచి మందలించేట్ట. ఆయనసలే భక్తుడాయె. దేవుడిపని చేస్తున్న వాళ్ళని ఇలా అనుమానించద్దనీ ఇది బేంకుకూ పరువు పోయే విషయమనీ చెప్పేట్ట.
“ముందేం జరిగిందో నాకూ తెలుసునండీ. కానీ ఇప్పుడదంతా తెల్లదే కదా?” అన్నాడు పంతులుగారు.
“ఎలా అయింది? దొంగ రశీదులతో మిగిలిపోయిన డబ్బంతా మళ్ళీ నలుపే అవుతోంది కదా, ఏం?” ఏదో పొడుపుకథ అడిగినట్టు అడిగేడు అసిస్టెంట్ మేనేజరు.
“అవున్నిజమే కదా!” తల గీక్కున్నాడు పంతులుగారు.
“నేను చెప్తా వినండి. అలా మిగిలిపోయిన డబ్బంతా అలానే ఉండదు. అందులో కొంత వేరే బిజినెస్సుల్లోకీ, వ్యాపారాల్లోకీ పోతుంటుంది. అలా వ్యాపారాలు పెరిగేకొద్దీ వాటిల్లోంచి మిగుల్తున్న డబ్బూ మరింతగా నలుపవుతుంటుంది. మీరెప్పుడైనా గమనించారో లేదో. బుధవారం వినాయకుడి హుండీలో పడే డబ్బు లక్షల్లో ఉంటోంది. పెద్దమొత్తాల్లో ఏ ఇద్దరో ముగ్గురో నుంచి వచ్చిన దక్షిణలు అవి. ఎవరో నేను చెప్పక్కర్లేదు. అలా ఆ డబ్బు వినాయకుడి ఎకౌంట్లోకి పడుతుంది. మీ వినాయకుడు దాన్ని తెల్లగా పవిత్రం చేస్తాడు. ఆ డబ్బు మళ్ళీ ధర్మకార్యాలకు, అన్నదానాలకూ బైటకు తీస్తారు. మళ్ళీ రసీదులు, మళ్ళీ మిగుల్పు, మళ్ళీ పెట్టుబడులు, వాటిల్లోంచి మళ్ళీ నొక్కిపెట్టిన సొమ్మంతా హుండీ నుంచి వినాయకుడి ఎకౌంట్ లోకి. ఇలా ప్రతీ విడతలోనూ కొంత తెల్లగా అవుతుంటుంది. మరికొంత కొత్తగా నలుపవుతుంది. వ్యాపారాలు ఎంతకని పెంచుతారు, ఎంతకని చేస్తారు? వాటితో ఉన్న ఇబ్బందులు దేవుడితో ఉండవు. దేవుడితో ఇలా అనంతంగా ఎంతకాలమైనా సాగిపోతుంటుంది. ధర్మకర్తల దానధర్మాలూ పెరిగిపోతాయి. కీర్తి ప్రతిష్ఠలూ వస్తాయి. వినాయకుడుగారు ఏ రంగు డబ్బు హుండీలో ఎంత పడ్డా చలించకుండా వాషింగ్ మెషీన్ లాగా ఉతికి తెల్లగా చేస్తుంటాడు.”
“ఆఁ!” నోరు తెరిచాడు పంతులుగారు.
“కంగారు పడకండి. భక్తితో కళ్ళు మూసుకున్నంత కాలం మీ ఆదాయమూ పెరుగుతూనే ఉంటుంది.” చిన్నగా అని పెద్దగా నవ్వేడు అసిస్టెంటు మేనేజరు.
రెడ్డిగారు వ్యాపారాలు, లావాదేవీలు అన్నీ కొడుకులకూ అల్లుళ్ళకూ పంచేసి విశ్రాంతి తీసుకుంటున్నాడిప్పుడు. పాదరసం లాంటి బుర్ర ఉన్న కొడుకులు, అల్లుళ్ళుండగా ఆయనకేం చింత? వీలు కుదిరినప్పుడు సాయంకాలం గుండె బాగుండడం కోసం కార్డియాలజిస్టు చెప్పినట్టూ అలా ఊర్లో నడుస్తుంటాడు. ఆ నడక అయిపోయాక బుల్లివినాయకుడి గుడి దగ్గిరకెళ్ళి భక్తితో దణ్ణం పెట్టుకుని కాసేపు కూర్చుంటాడు విగ్రహం కేసి చూస్తూ. వినాయకుడు చూపు కలపకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఇదీ రోజూ జరిగే తంతు.
వినాయకుడు ఎప్పట్లానే ఊరిని చూస్తున్నాడు. కానీ ఉల్లాసంగా కాదు.
రెడ్డిగారికి ఏనుగు కలలోకొస్తుంటుంది అప్పుడప్పుడూ. కానీ అది ఆయనను ఇప్పుడు భయపెట్టడంలేదు.
(కథకి చూచాయగా ముందస్తు ఆలోచన ఇచ్చిన కష్టేఫలీ బ్లాగు శర్మగారికి కృతజ్ఞతలు.)